అగ్ని సంస్కారం

1
8

[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న కథ ఇది. రచన వాడపల్లి పూర్ణ కామేశ్వరి. [/box]

[dropcap]“మ[/dropcap]న గీత ఇంక మన మాటలేమీ వినిపించుకోదే, ఊహల్లో తేలిపోతోంది” పకపకా నవ్వేస్తూ గీతను కవ్విస్తూ అలంకరించిన గదిలోంచి వెళ్ళారు అక్కయ్యలు.

బుంగ మూతితో సమాధానమిచ్చింది ముద్దబంతి పువ్వులా ముగ్ధమనోహరం రూపంతో గీత. భర్తతో గడపనున్న ఆ ఘడియలెప్పుడెప్పుడొస్తాయా అని ఆ తొలి రేయిన ఆరాటంగా ఎదురు చూస్తోంది గీత. ఆమె గుండెల్లో కోటి వీణలు మ్రోగుతున్నాయి. ఎదురు చూస్తూ వుండగానే అందగాడు, మనసంతా నిండినవాడు, శరీరంలో సగభాగం ఇవ్వనున్నవాడూ వచ్చాడు. ప్రమోద్‌ని చూడగానే సిగ్గు ముంచుకొచ్చి కనురెప్పలు అప్రయత్నంగానే వాలిపోయాయి.

“ఏయ్ దొంగా, అలా నేలలోకి చూస్తే ఈ కళ్ళల్లో నన్ను నేను ఎలా చూసుకునేది” బుల్లి గడ్డాన్ని సుతారంగా ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.

ఇక ఆ చూపుల తాకిడిని తాళలేక అతని గుండెలపై వాలిపోయింది గీత. ఆలస్యం చేయకుండా ప్రమోద్ తన బిడి కౌగిలిలో ఆమను బంధించేసాడు. ఆపాదమస్తకమూ పులకించి పోయింది గీత. మనసులు విప్పి ఎన్నో ఊసులు చెప్పుకున్నారు కొత్త దంపతులు. ఆనందంమయమైన అనుభూతులతో గడచిపోయింది ఆ రేయి. నడిరేయి దాటాక కునుకు పట్టేసింది గీతకి. కిటికీ తెరల్లోంచి సూర్య కిరణాలు తెల్లవారిందంటూ లేపాయి. కళ్ళు నులుముకుంటూ తడిమి చూడగా ప్రమోద్ కనిపించలేదు.

‘అమ్మో, తెల్లారి పోయిందే. నాదే ఆలస్యం కాబోలు’ శ్రీవారితో గడపిన రేయిని నెమరేసుకుంటూ, చకచకా స్నానం చేసి హాల్లోకి వచ్చింది. అల్లుడుగారు బయటకు వెళ్ళడం చూసి సంశయంలో పడ్డ కుటుంబ సభ్యులు చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా వుచ్చిన గీతను చూసి హమ్మయ్య అనుకున్నారు.

***

బీ.హెచ్.ఈ.ఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో గీత, మెకానికల్ డిపార్ట్మెంట్‌లో ప్రమోద్ పని చేస్తున్నారు. చక్రధర్ గారి ద్వారా వారిద్దరికీ సంబంధం కుదిరింది. చక్రధర్ గారు ఎలక్ట్రికల్ విభాగం ముఖ్య అధికారి. మెకానికల్ విభాగం ముఖ్య అధికారి రామ్మోహన్ గారూ చక్రధర్ గారూ కలసిన మీటింగులో ప్రమోద్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చాడు. రామ్మోహన్ గారిని మెప్పించాడు.

“హీ ఈజ్ ఎన్ అసెట్ టు అవర్ డిపార్ట్మెంట్” అంటూ గర్వంగా ప్రమోద్‌ను చూపించారు చక్రధర్.

చలాకీగా కనిపించిన ప్రమోద్‌ని చూసిన రామ్ మోహన్ దృష్టి గీతపై మళ్ళింది. గీత కుటుంబం వారు ఆమెకు తగిన సంబంధమేదైనా అక్కడే వుంటే తప్పక చెప్పమన్న మాట గుర్తొచ్చి, యోగ్యుడైన పెళ్ళికొడుకుని చూడగానే గీతకి తగిన వరుడవుతాడని అనిపించడం, వారి కుటుంబానికి చెప్పడం, ఇరు పక్షాలకూ అన్నీ నచ్చి పెళ్ళి నిశ్చయమవడం ఇట్టే జరిగిపోయాయి.

సూనాబేడాలో రెండు తరాలగా స్థిరపడిపోయిన తెలుగు కుటుంబం రామచంద్రయ్యది. ఆయనకి ముగ్గురు కూతుళ్ళు. ఉన్నదాంట్లో ఒబ్బిడిగా సంసారాన్ని ఈదుతూనే పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాడు రామచంద్రయ్య. కట్నాలూ కానుకలంటూ, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలంటూ తొందర పడకుండా, విద్యను ఇస్తే అదే వాళ్ళను భావి జీవితంలో కాపాడుతుందని నమ్మిన ఆ దంపతులు పిల్లలని మంచి చదువులు చదివించారు. వాళ్ళు సంపాదిస్తూ, కట్టుపెట్టేవాడూ సంపాదించుకుంటే ఒక్కో మెట్టూ ఎక్కి జీవితంలో ఎదగడం ఎంతలో పని అనుకునేవాడు రామచంద్రయ్య. గీత అక్కలు రాధ, లత ఇద్దరూ కూడా మంచి ఉద్యోగాలు సంపాదించి తగిన వరుడితో పళ్ళి జరిగి చక్కగా స్ధిరపడిపోయారు. వరంగల్లులో కాలేజీ లెక్చరరుగా లత, విశాఖలో స్టీలు ప్లాంటు ఎడ్మిన్ విభాగంలో రాధ పనిచేస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా హైద్రాబాదులోని బీహెచ్ఈఎల్ సంస్థలో పోస్టింగ్ వచ్చింది గీతకి. ముగ్గురు పిల్లలూ చక్కగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డందుకు ఎంతో సంబరపడపోయారు రామచంద్రయ్య దంపతులు. గీత పెళ్ళితో తమ బాధ్యత తీరుతుందని ఆ ఘడియ కోసం ఎదురు చూసారు.

వరంగల్లులో కాపురం వుంటున్న చిన్నక్కా బావలు గీతతో హైదరాబాదు వచ్చి, వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో చేర్పించి కావలసివన్నీ అమర్చి వెళ్ళారు. కలుపుగోలుగా వుండే గీతకు ఆఫీసులో అందరితోనూ కలిసిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. గీత అక్కా బావల్ని కూడా తరచూ చూసేవారేమో, ఆఫీసులో అందరికీ వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది. తండ్రి సమానుడైన రామ్మోహను గారు కూడా అధికారిగా కాక అమ్మాయి అమ్మాయి అంటూ ఆమెతో ఆప్యాయంగా వుండేవారు.

ఆఫీసంతా ఆనందంగా ఆశీర్వదించి చేసిన పెళ్ళి ప్రమోద్ గీతలది. పెళ్ళికి పెట్టిన సెలవు ముగిసి జాయినైయ్యింది గీత. వర్కింగ్ వుమెన్స్ హాస్టల్ నుండి కాక మొదటిసారిగా కాపురం పెట్టిన కొత్త ఇంటి నుంచి వచ్చిన గీతను చూసి సంబర పడ్డారు. కొత్త పెళ్ళికూతురి కళ, మెడలో నిండుగా నల్ల పూసలు, సంతోషం చిందిస్తూ చిరునవ్వు. కవ్వించి కొత్త కాపురం కబుర్లు అడుగుతూ కొల్లీగ్సంతా మాటల్లో ముంచేసారు. అంతలో ఓ మధ్య వయస్కురాలు పన్నెండేళ్ళ అమ్మాయితో కలిసి గీతను వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది.

“గీతా, నేను ప్రమోద్ భార్యను. నా పేరు శాంతి,ఈ అమ్మాయి నా కూతురు రమ్య. నేను విశాఖపట్నం నుంచి నిన్ననే వచ్చాను. మా పెదనాన్నగారికి సుస్తీగా వుంటే ఒక వారం రోజులు వెళ్ళి వచ్చాను. మీ పెళ్ళి సంగతి నాకు ఈ రోజే తెలిసింది. ఇది రిజిస్ట్రారు ఆఫీసులో రిజిష్టరు చేసుకున్న మా వివాహ ప్రమాణపత్రం. నీకు మా విషయం తెలిపి పోదామని వచ్చాను” కుండ బద్దలుకొట్టినట్టు చెప్పి సమాధానం కోసం కూడా చూడకుండా విసవిసా వెళ్ళిపోయింది. ఆమె మాటలకు మ్రాన్పడి చూసింది గీత. గుండె వేగం హెచ్చింది. మరో మాట అడగడానికి ఆమె లేదు. నిశ్చేష్టురాలైపోయింది.

***

విషయం తెలిసిన లత, విజయ్ హూటాహుటిన వచ్చారు. రామ్మోహన్, చక్రధర్‌ల సహాయంతో ప్రమోద్‌ను గురించి మరిన్ని వివరాలను సేకరించేందుకు స్టాఫ్ సహకారం కోరారు. ఒక్కొక్కరూ ఒకొక్క అనుమానం వ్యక్తపరిచారు. అందరూ తలో కథ చెప్పగా పలు విషయాలు వెలుగులోకొచ్చాయి. అన్ని సంఘటనలన్నీ ఒక్కక్కటిగా పూసగుచ్చగా శాంతి విషయం నిజమేనని రుజువైయ్యింది.

“ఎంత పొరపాటు జరిగింది. మీలో ఒక్కరైనా ముందుగా అతని గురించి తెలిపి వుంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన వారైయ్యేవారు. సభ్య సమాజంలోనే మనం వుంటున్నామా? పక్క మనిషి జీవితం పాడైపోతున్నా నాకెందుకులే అని మనం మౌనంగా వుంటే అది సభ్య సమాజమవుతుందా?” సమాధానం రాని ప్రశ్నలని తెలిసినా ఆవేదనను అక్కసుగా వెళ్ళగక్కాడు రామ్మోహన్.

ప్రమోద్‌పై డిపార్ట్మెంటు చర్య తీసుకోవడం వల్ల అతడికి శిక్ష వేయగలమే కానీ గీతకు న్యాయం చేయలేము. ఆమెకు జరిగిన అన్యాయానికి అది సమాధానమవ్వదే. అపరాధ భావంతో చక్రధర్ రామ్మోహన్ ఎంతగానో బాధ పడ్డారు.

ఆఫీసులో ఉన్నతాధికారిగా తండ్రి స్థానాన్ని అలంకరించిన నా చేతులమీదుగానా ఇంత అన్యాయం జరిగింది. పెద్ద పొరపాటు జరిగిందని బాధ పడడంతో సమస్య తీరదు. నేనే ఆ కుర్రాడిని నిలదీసి ఆ అమాయకురాలి జీవితంతో ఎందుకిలా ఆడుకున్నావని నిలదీస్తానని తీర్మానించుకున్నాడు రామ్మోహన్.

జరుగుతున్నదంతా చూస్తున్న లత గుండె అంతటి భారాన్ని మోయలేకపోయింది. చెల్లెలికి జరిగిన అన్యాయానికి రక్త ఉడికి పోయింది. కళ్ళు తిరిగి ముర్చిల్లి పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

“ప్రమోద్, నువ్వు పనిచేస్తున్న సంస్థ ఉన్నతాధికారులు పూనుకుని మాట్లాడిన సంబంధం ఇది. గీత సగటు ఆడపిల్ల. మేక వన్నె పులిలా మా అందరి కళ్ళూ కప్పి ఆమెనెందుకింత మోసం చేసావు. ఒక అధికారిగా కాదు, ఒక ఆడపిల్ల తండ్రి స్థానంలో వుండి అడుగుతున్నాను” ఆవేశాన్నంతా అణచుకుని అనునయంగా అడిగాడు రామ్మోహన్.

“సర్. నేను కలిసినపుడు శాంతి ఒక నలభైయ్యైదేళ్ళ వితంతువు. పదేళ్ళ బిడ్డకు తల్లి. వారింట్లో అద్దెకు దిగాను. అప్పుడప్పుడూ మాట్లాడడంతో చనువు ఏర్పడింది. వారికి అన్నివిధాలా సహాయపడుతూ వుండేవాణ్ణి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో చేరువైయ్యాము. అనిర్వచనీయ సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ళకి చట్టరీత్యా వివాహం చేసుకుందామని వత్తిడి చేసింది శాంతి. అన్నా వదినలు ససేమిరా అన్నారు. అన్యాయం చేయలేక రిజిష్టరు ఆఫీసులో వివాహం చేసుకున్నాము. వారి మాట వినని నాతో తెగతెంపులు చేసుకున్నారు అన్నయ్య వదిన. నేను చేసినది సరి అని సమర్థించుకోవట్లేదు. నిజం మాత్రమే చెప్పాను.

నా స్వ-విషయాలు ఎవ్వరితోనూ ఆఫీసులో మాట్లాడేవాడిని కాదు. అందరితోనూ స్నేహంగానే వుండేవాడిని. ఆ గుణం చూసే మీరూ నన్ను అభిమానించారు. మీ కూతురు లాంటి గీతతో సంబంధం మాట్లాడారు. ఇంత పెద్ద విషయం మీ దగ్గర దాచడం తప్పే. కానీ, ఆ క్షణంలో నాకూ ఆశ కలిగింది. నా వయసుకు తగిన అమ్మాయితో పెద్దలు నిశ్చయించిన పెళ్ళి జరిగే అదృష్టం వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేనెందుకు కాదనాలి అన్న స్వార్థం నాలో మొలకెత్తింది. మౌనంగా వుండిపోయాను.

తరువాత సద్దిచెప్పి శాంతిని ఒప్పించాలనుకున్నాను. అదే తప్పైయ్యింది. ఆమె ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. నేను గీతను మోసం చేయాలని చేయలేదు. అర్హత లేనిదానికోసం ఆశ పడడం తప్పే. పరస్పర అంగీకారంతో గీతకు విడాకులిచ్చి ఈ అబద్దపు బంధం నుంచి ఆమెను విడుదల చేయడం తప్ప ఇప్పుడు నేనేమీ చేయలేను” బాధ్యతా రాహిత్యమైన బదులిచ్చాడు ప్రమోద్.

చక్రధర్ కు విషయాలన్నీ వివరించి క్రమశిక్షణ మరియు అప్పీల్ నియమాల ప్రకారం అతడిపై తగు చర్య తీసుకోమని ఫిర్యాదు చేశాడు రామ్మోహన్. తాత్కాలిక బాధ కలిగించినా గీతకు అదే శాశ్వత పరిష్కారం. త్వరలో కోలుకుంటుంది. అతి స్వల్ప కాలంలో నిజం వెలుగులోకి రావడమే చెడులోనూ జరిగిన మంచి అని తృప్తి పడ్డారు.

పరిస్థితి మెరుగవ్వని కారణం చేత లతకు ఎమ్ఆర్ఐ పరీక్ష చేసారు. గోరు చుట్టుమీద రోకలి పోటు అన్నట్టు, సెరెబ్రల్ హెమర్రేజ్ అని పరీక్షల్లో తేలింది. రక్తపోటు ఎక్కువై రక్త నాళాల్లో రక్తస్రావం జరిగి మందులకు లొంగలేదు. పరిస్థితి విషమించింది. ప్రాణాలకోసం పోరాడి ఓడిపోయింది.

జీవితమంతా ఒక్కసారిగా ముసురు కమ్ముకున్నట్టై కుంగి పోయాడు లత భర్త విజయ్. అక్కయ్య పిల్లల ఆక్రందనలు చలనం లేక నిస్తేజంగా వుండిపోయిన గీతలో చలనాన్ని తెచ్చాయి. పిన్నీ అమ్మ మాట్లాడట్లేదు అంటూ ఏడుస్తున్న చిన్నారులను చూసి గీత గుండె తరుక్కుపోయింది. అక్కున చేర్చుకుంది. ఒకొక్క ఇటుకనూ పేర్చి కట్టుకున్న గూడు కుప్ప కూలిపోతున్నట్టు అనిపించింది రామచంద్రయ్యకు. మృత్యువుతో చేసిన పోరాటంలో ఓడిపోయి కన్నుముసిన లత. మోయలేని గుండెభారంతో మోడుగా వున్న గీత. దిక్కు తోచక విలపించారు రామచంద్రయ్య దంపతులు.

***

“బావా, ఇది ఆవేశంతోనో లేక పరితాపంతోనో వచ్చిన ఆలోచన కాదు. అక్కయ్యకు నీవు జరిపిన అగ్ని సంస్కారం సాక్షిగా ఈ చిన్నారులకు తల్లినై, ఒక మంచి మనిషికి ఇల్లాలినై నా జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను. నా ఈ ప్రతిపాదనతో నీకు అభ్యంతరం లేకపోతే, నా నిర్ణయంపై నీకు నమ్మకముంటే నన్ను నీ భార్యగా స్వీకరించు. కొండ అడ్డం వచ్చిందని ప్రవహించే నది ఆగిపోదు. చిక్కిన దారి చూసుకుని సాగిపోతుంది. మన రెండు జీవితాలూ అంతే. చిక్కటి స్నేహంతో, చక్కటి అవగాహనతో దంపతులమై పిల్లల భవిష్యత్తుని తీర్చి దిద్దుదాం. అగ్ని సాక్షిగా పెళ్ళాడిన బంధానికి విలువనివ్వని ఆ బంధాన్ని అగ్ని సంస్కారంతో ముగిస్తున్నాను” ఆత్మస్థైర్యంతో అన్న గీత మాటలు విన్న తల్లిదండ్రుల అశ్రువులే వారికి ఆశీర్వాదాలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here