అగ్నికన్య చంద్రప్రభా సైకియాని

10
10

[dropcap]మా[/dropcap]ర్చి 16 చంద్రప్రభా సైకియాని గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

నిత్యం హిమాలయ సానువులలో బ్రహ్మపుత్ర వరదలో పుట్టిమునిగే అస్సాంలో పుట్టి, పదమూడేళ్ళ వయసులోనే బాలికల కోసం పాఠాలు బోధించారు. ఒంటరి తల్లిగా కొడుకుని అత్యుత్తమ కార్మిక నాయకుడిగా తీర్చిదిద్దారు. మహిళలను సంస్కరించడం కోసం, మహిళాభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తూ సమాంతరంగా జాతీయ పోరాటంలో గాంధేయురాలిగా పాల్గొన్నారు. కవయిత్రిగా, రచయిత్రిగా పేరు పొందారు. వారే అగ్నిపుత్రి చంద్రప్రభా సైకియాని.

వీరు 1901వ సంవత్సరం మార్చి 16వ తేదీన ఈశాన్యభారతం అస్సాంలోని కామరూప జిల్లాలో దోసింగరిలో జన్మించారు. తల్లిదండ్రులు గంగాప్రియ, రతీరామ్ మజుందార్. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తిచేశారు. మాధ్యమిక విద్యకోసం నడుంలోతు బురదలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలుర పాఠశాలకు వెళ్ళేవారు. అయితే మధ్యలోనే విద్యకు ఆటంకం కలిగింది. 13 ఏళ్ళ వయస్సులోనే లఖ్యా గ్రామంలో బాలికా పాఠశాలను స్థాపించారు. ఒక పాత షెడ్లో సరయిన సౌకర్యాలు లేని చోట ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షంలా ఆ రోజుల్లో అదే గొప్ప. ఈ పాఠశాలలో విద్యార్థినులకు పాఠాలను బోధించేవారు.

వీరి ఆసక్తిని గమనించిన పాఠశాలల పర్యవేక్షకులు శ్రీ నీలకాంత్ బారువా వీరికి సహాయం చేయాలనుకున్నారు. నౌవ్‌గాంగ్ లోని మిషనరీ పాఠశాలలో స్కాలర్‌షిప్‌ను ఇప్పించారు.

తరువాత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా పనిచేశారు. తేజ్‌పూర్ లోని బాలికల మాధ్యమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేశారు.

17 ఏళ్ళ వయసులో 1918వ సంవత్సరంలో ‘అసోమ్ ఛత్రా సన్నిలాన్’ సంస్థ తేజ్‌పూర్‌లో జరిపిన సమావేశంలో ఏకైక మహిళా ప్రతినిధిగా పాల్గొన్నారు. నల్లమందు వల్ల నష్టాలను వివరించారు. అంతేకాదు – నల్లమందు వ్యాపారాన్ని నిషేధించాలని నొక్కి వక్కాణించారు.

జ్యోతి ప్రసాద్ అగర్వాల్, ఒమియో కుమార్ దాస్, చంద్రనాథ్ శర్మ, లఖిదర్ శర్మ వంటి పండితులతో పరిచయం చేసుకున్నారు. వీరందరూ మంచి సంఘసంస్కర్తలు కూడా! వీరందరి సాంగత్యంలో తమ జ్ఞానాన్ని పరిపుష్టి చేసుకుని సంఘసంస్కర్తగా తను చేయవలసిన పనుల కోసం కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. విజ్ఞులు ఏ అవకాశాన్ని వదులుకోరు కదా!

1926వ సంవత్సరంలో ‘అస్సాం ప్రాదేశిక్ మహిళా సమితి’ని ఏర్పాటు చేశారు. ఈ సమితి వార్షిక సమావేశాలను వివిధ ప్రదేశాలలో నిర్వహించారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల కోసం ఈ సమితి పనిచేయడం గమనార్హం. పర్దా పద్ధతి, బాల్యవివాహాల నిషేధం, స్త్రీ విద్యాభివృద్ధి, మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలను రూపొందించారు. చేతిపనులు, చేనేత వస్త్ర పరిశ్రమకు సంబంధించిన కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహమిచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాల వల్ల ఆయా ప్రాంతాల మహిళల జీవనోపాధి, సౌకర్యాలు మెరుగుపడి, వారి జీవన ప్రయాణం కూడా పెరిగింది.

ఆనాటి సమాజంలో స్త్రీల పట్ల వివక్ష, బహు భార్యాత్వము సర్వసాధారణం. వీటి వలన బాధలు పడింది, పడేది మహిళలే అని మనందరికీ తెలిసిందే! వీటిని నిషేధించడానికి శాయశక్తులా ప్రయత్నం చేసి కొంతవరకు విజయం సాధించారు.

బలహీన వర్గాల రైతుల అభివృద్ధి కోసం ‘ALL INDIA ASSAM PEASANTS CONFERENCE’ ను నిర్వహించారు.

మొత్తం మీద బలహీన వర్గాల ప్రజలు, మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తూ సమాంతరంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ధీరవనిత చంద్రప్రభ సైకియాని. గౌహతిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరవడం కోసం ఉపాధ్యాయిని ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాంధీజీ హిత బోధలు, సత్యాహింసలు వీరిని ఆకర్షించాయి. 1921వ సంవత్సరంలో సహాయనిరాకరణోద్యమంలో పాలు పంచుకున్నారు. శాసనోల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1930వ సంవత్సరంలో ఒకసారి, 1943వ సంవత్సరంలో ఒకసారి జైలుశిక్షను అనుభవించారు.

గ్రామాల వెంట చరఖాను మోసుకుంటూ తిరిగారు. గాంధీజీ ముఖ్య ఆశయం ఖద్దరు తయారీకి ఈ విధంగా బ్రాండ్ అంబాసిడర్‌గా కృషిచేసి చేనేత పరిశ్రమను అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్ళారు. స్వాతంత్ర్యం లభించిన తరువాత సోషలిస్ట్ పార్టీలో చేరారు. అయితే కొంతకాలం తరువాత మరల స్వంత గూటికి అంటే ‘భారత జాతీయ కాంగ్రెస్’ లోకి చేరారు. 1957 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేశారు. ఎన్నికలలో పోటీ చేసిన తొలి ఈశాన్య రాష్ట్రాల మహిళగా చరిత్ర సృష్టించారు.

వీరు బాల్యం నుండి కుల, మత బేధాలను గమనించారు. బాలికలు, మహిళలకు, వృత్తిపని వారికి ఎదురవుతున్న సమస్యలను గురించి అవగాహన చేసుకున్నారు. ఈ సమస్యలకు నివారణోపాయాలను కనుక్కునే ప్రయత్నం చేశారు. ఒంటరిగా ఎదిరించలేమని, సంఘటితంగానే పోరాడి, సమస్యలను అధిగమించి ఎదగాలనుకున్నారు.

అందుకోసమే అస్సాం ప్రాదేశిక మహిళా సమితి తరపున గ్రామ, పట్టణ, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ద్వారా తన లక్ష్యాలను సాధించగలిగారు.

వీరు స్వయంగా రచయిత్రి, సంపాదకురాలు కూడా! ‘అస్సాం ప్రాదేశిక మహిళా సమితి’ పక్షాన ‘మహిళా సమితి జర్నల్’ పత్రికకు 7 సంవత్సరాలు సంపాదకురాలిగా బాధ్యతలను నిర్వహించారు. ముఖ్యంగా స్త్రీల సమస్యలను ఈ జర్నల్ ద్వారా పాఠకులకు అందించారు. పరిష్కార మార్గాలను కూడా సూచించారు.

1925వ సంవత్సరంలో అస్సాం సాహిత్య సభని స్థాపించారు. చాలా వ్యాసాలను, కథలను వ్రాశారు. ‘పితృభిత’ (The Paternal Home), ‘సిపాయి బిద్రోహత్ ‘ (సిపాయిల తిరుగుబాటు), ‘దిల్లీర్ సింహాసన్’ (ఢిల్లీ సింహాసనం) వంటి గ్రంథాలను రచించారు.

స్వయంగా కుల వ్యవస్థలో వివక్షను అనుభవించారు. కాబట్టి కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడారు. దేవాలయాలలోకి ప్రజలందరికి కుల, మత, స్త్రీ, పురుష, బీద, ధనిక బేధాలు లేకుండా ప్రవేశించే అవకాశం ఉండాలని పోరాడారు. ‘హజోహయగ్రీవ మాధవ దేవాలయం’ లోకి ప్రవేశించే హక్కు అందరికీ లభించింది.

వీరి జీవితంలో ముఖ్య సంఘటన ఆమె నాటి సంఘానికి ఎదురీదేటట్లు చేసింది. దండినాథ్ అనే రచయిత ఆమెను ప్రేమించి మోసం చేశారు. అయితే ఆమె గర్భవతి అయింది. అతను పెద్దలు కుదిర్చిన సంబంధం అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ పరిస్థితులలో ఆమె ఒంటరి తల్లిగానే మగపిల్లవాడిని కని పెంచి పెద్దవాడిని చేశారు. కొడుకుని తీసుకుని సేవా కార్యక్రమాల నిమిత్తం సైకిల్ మీద తిరిగేవారు. “హే! కొడుకు, ఆ స్త్రీ చక్రం ఎలా నడుపుతుందో చూడండి” అని గేలి చేసేవారు. అయినా ఆమె లెక్క చేయలేదు. దిశని నిర్దేశించుకున్నపుడు అన్నీ భరించవలసిందే కదా!

ఆ బిడ్డే అతుల్ సైకియా. ఆయన తరువాత కాలంలో అస్సాంలో గొప్ప ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగి సేవలందించాడు. ఒంటరి తల్లిగా ఆమె ఎన్ని బాధలు పడినా నిప్పులా బ్రతికి ‘అగ్ని కన్య’ అనిపించుకున్నారు. తన ఈ పరిస్థితికి కారణమైన దండినాథ్‌ను ఆమె ఎప్పుడూ నిందించలేదు. తన కర్తవ్యాన్ని నేరవేర్చారు.

వీరి మహిళా సాధికారత, నిస్వార్థ సేవ, జాతీయ పోరాట యోధురాలిగా సాధించిన విజయాలు కుల, మతాల కతీతంగా సల్పిన సాంఘిక సేవాది కార్యక్రమాలకి గాను 1972వ సంవత్సరంలో పద్మశ్రీ బిరుదు లభించింది.

1972లో తను జన్మించిన మార్చి 16వ తేదీనే తన జన్మభూమిలోనే క్యాన్సర్ వ్యాధితో మరణించారు. 2002 సెప్టెంబర్ 2వ తేదీన సంఘసంస్కర్తల సిరీస్‌లో వీరి స్టాంపును విడుదల చేసింది భారత తపాలా శాఖ. మన తెలుగు ప్రముఖులు గోరాతో కలిసి ఈ స్టాంపు విడుదలవడం ముదావహం.

వీరి జయంతి మరియు వర్ధంతి మార్చి 16 సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here