శ్రీమదహోబల నరసింహ దర్శనం

0
15

[ఇటీవల అహోబల క్షేత్రం దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]నం[/dropcap]ద్యాలలో, ‘రాయలసీమ సాగునీటి సాధన సమితి’ వారి అహ్వనం మేరకు జూన్ 1న నేను వెళ్లాను. వారి ఉద్యమం కోసం నేను పది పాటలు వ్రాశాను. వారి కళాకారులతో, కార్యకర్తలతో, సంస్థ అధ్యక్షలు శ్రీ బొజ్జా దశరథ రామిరెడ్డి గారి అధ్యక్షతన, నంద్యాలలో ఒక సమావేశం జరిగింది. నేను వ్రాసిన పాటలను – నేను, ఉద్యమకారులు ప్రాథమికంగా స్వరపరచి, ప్రాక్టీసు చేశాము.

నంద్యాలకు అహాబిల క్షేత్రం దగ్గరే. 70 – 75 కిలోమీటర్లు ఉంటుంది. బొజ్జా దశరథ రామిరెడ్డి గారు వారి కారును డ్రైవరును ఇచ్చి అహోబల క్షేత్రాన్ని దర్శించి రమ్మని పంపారు. నాకు కూడా స్వామిని దర్శించుకోవాలని మనసులో ఉండింది. నేను వ్రాస్తున్న ‘శ్రీ లక్ష్మీ నృసింహ మాహత్మ్యము’ అన్న ప్రబంధపు వ్రాత ప్రతిని నరసింహుని దివ్యపాదముల చెంత నుంచి, ఆయన కరుణను పొందాలని సంకల్పించి ఉన్నాను.

డ్రైవరుపేరు రామసుబ్బయ్య. దశరథ రామిరెడ్డి గారికి నమ్మినబంటు. నాకు నంద్యాలలో శ్రీనివాసనగర్‍లో, సంజీవని రెసిడెన్సీలో రెడ్డి గారు రూము బుక్ చేసి ఉన్నారు. రెండవ తేదీ సమావేశం ముగిశాక, మూడు గంటలకు, టీ తాగి బయలుదేరాము. అంతవరకు 45-48 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనాలను తపింప జేసిన భానుడు మేఘాల చాటుకు వెళ్లిపోయాడు. ఒక్కసారిగా వాతావరణం మారింది. మేం శిరువెళ్ల దాటగానీ వర్షం! మా మనస్సులో హర్షం! ఆ వర్షం నరసాపురం మెట్టు వరకు జోరుగా కురిసి ఆగింది.

అహోబలం ఘాట్‍ రోడ్‌లో

నరసాపురం మెట్ట నుండి కుడి వైపుకు ఎనిమిది కిలోమీటర్లు వెళ్లితే ‘రామతీర్థం’ అనే నృసింహక్షేత్రం ఉంటుంది. స్వామి వారు యథాప్రకారం ఒక కొండమీద వెలసి ఉన్నారు. కొండ దిగువన ‘పుట్టాలమ్మ’ మందిరం. నాగేశ్వరస్వామి ఒక పెద్ద పాము పుట్టగా ఏర్పడి ఉన్నాడు

విజయవాడలో నా అభిమాని, సోదరుడు శ్రీ మురళీమోహన్ గారు అహోబలం దేవస్థానం ప్రొటోకాల్ అధికారికి నేను వస్తున్నానని తెలిపి, నాకు దర్శనం చేయించమన్నారు. నా శిష్యుడు, కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (ఎండోమెంట్స్) చి. శంకర్ బాలాజీకి కూడా చెప్పి ఉన్నాను. అతడు అహోబలం ఇఓ శ్రీ నరసయ్యగారికి ఫోన్ చేసి, నాకు సహకరించమని చెప్పాడు. ఆయనే నాకో ఫోన్ చేసి, వారి సిబ్బందితో శివ అని కుర్రవాడిని నాతో పంపారు.

ఇదంతా ఎందుకంటే వీకెండ్స్‌లో అహోబలంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ‘స్వాతి’ నక్షత్రం రోజునైతే, కారు పార్కింగ్ కూడా దొరకదు. ప్రయివేటు వాహనాలను ఎగువ అహోబలనికి రెండు కిలోమీటర్లు దిగువనే ఆపేస్తారు. పైకి అనుమతించారు మేం వెళ్లిన రోజు ఆదివారం.

మేం ముందు నేరుగా ఎగువ అహోబలానికీ వెళ్ళాము. చెక్‍పోస్టు దగ్గర సెక్యూరిటీ సిబ్బంది మా కారును ఆపారు. నాకు ఇఓ గారు చెప్పిన విధంగా, ‘సునీల్’ అన్న ఉద్యోగిని గురించి అడిగాను. ఆపిన అతనే సునీల్. నాకు నమస్కరించి, “ఇ.ఓ. గారు మీరొస్తున్నారని చెప్పారు సార్! మీరు వెళ్లండి” అన్నాడు వినయంగా! లేకపోతే, కారు అక్కడ పార్కింగ్‌లో పెట్టి నడిచి వెళ్లాలి! ఈ వయస్సులో నాతో అయ్యే పనేనా?

పైన పార్కింగ్ ఫుల్! మా రామసుబ్బయ్య లాఘవంగా, పుష్కరిణి అనుకొని, ఒక చోట కారు పార్క్ చేయగలిగాడు. మేం అక్కడకి చేరేసరికి సాయంత్రం ఐదు దాటింది. మే నెలలో కొన్ని వానలు పడినందు వల్ల అహోబల పర్వతశ్రేణిలోని చెట్లన్నీ చిగురించి పచ్చగా ఉన్నాయి. తలెత్తి చూస్తే గాని పైభాగం కనబడనంత ఎత్తున్న కొండ. పుష్కరిణిలో నీళ్లు లేవు! వర్షాకాలంలో అయితే నిండుగా కళకళలాడుతూంటుంది. కొండలన్నీ జలపాతాలతో సందడి చేస్తుంటాయి.

పుష్కరిణి దాటి ఎడమవైపు తిరగ్గానే, కొండ అంచున, మెట్లమార్గం. మెట్లు ఎత్తు తక్కువగా ఉన్నాయి. మహా అయితే 100 ఉంటాయి. మాలాంటి సీనియర్ సిటిజన్లకు అనువుగా మెట్ల మధ్యలో రెయిలింగ్‌ను ఏర్పాటు చేశారు. రామసుబ్బయ్య కూడా నాతో దర్శనానికి వచ్చాడు.

మెల్లిగా మెట్లు ఎక్కి పైకి చేరుకున్నాను. ఆయసం రాలేదు. వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది. పైన విశాలమైన ఆవరణ. ఎడమ పక్కన దూరంగా, ఒక అందమైన మంటపం. దాని వెనుక పచ్చని కొండల నేపథ్యం. ఆ మంటపంలోనే యన్.టి.ఆర్ ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి’ సినిమాలో, బ్రహ్మంగారు కాలజ్ఞానం బోధించిన సన్నివేశాన్ని చిత్రీకరించారని గుర్తు.

‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి’ సినిమాలో,  బ్రహ్మంగారు కాలజ్ఞానం బోధించిన సన్నివేశాన్ని చిత్రీకరించిన మంటపం

కుడివైపు స్వామివారి ఆలయం, రాజగోపురం దర్శనమిచ్చింది. దాని ముందు భక్తుల సౌకర్యం కోసం చలువపందిరి విశాలంగా వేశారు. ఒకవైపు పాదప్రక్షాళన కోసం వరుసగా నీటి కుళాయిలున్నాయి. వాటి నీరు ధారాళంగా వస్తూన్నది. కొంచెం నీరు దోసిట పట్టుకొని త్రాగాను. మధురంగా ఉంది. భవనాశనీ తీర్థ జలం కాబోలు! గావల మహర్షి అహోబల క్షేత్రమును దర్శించినపుడు, భవనాశనిలో స్నానమాచరించి, మధురమైన ఆ నీటిని తాగినట్లు బ్రహ్మండపురాణోక్తమయిన నృసింహ చరితములో ఉంది. దానిని ఎర్రాప్రగ్గడ, రమణీయంగా వర్ణించినాడు.

నా ప్రబంధములో కూడ ఎర్రన నృసింహపురాణము లోని కధాక్రమాన్నే అనుసరించినాను. భాగవత సప్తమస్కంధములో పోతన, తన ప్రహ్లాద చరిత్రలో, ఇంత విపులంగా రాయలేదు. నా కావ్యానికి అన్నివిధాలా స్ఫూర్తి ఆ ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు ఎర్రనార్యుడే. నేను కూడా ఒక పద్యములో భవనాశనిని వర్ణించాను.

ఉ:
స్నానము చేసేముందు; భవనాశని తీర్థము నందు, స్వచ్ఛమై
మేనున బుల్కలన్ వొడుము వెన్నెల కాంతుల బోలు నీరమున్
తానతి భక్తి గ్రోలె; దళితాంబుజ పత్రపు తేనియల్, సదా
పూనిక తోడ త్రాగు మధుపోజ్వల ధ్యానము నిండ నెమ్మదిన్!

అక్కడ టికెట్ కౌంటరులో ‘నరేంద్ర’ అనీ అతడుంటాడని, తాను పోన్ చేసి చెప్పానని, ఇ.ఓ. నరసయ్య గారు ఫోన్ చేసి ఉన్నారు. ఆ నరేంద్ర నా కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను సగౌరవంగా లోపలికి తీసుకువెళ్లి, ఒకాయనకు అప్పగించాడు. ఉచిత, శీఘ్ర దర్శనాల క్యూలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు ‘ఓబల నరసింహ గోవిందా! గోవింద! ప్రహ్లాద వరద గోవిందా! గోవింద! మాతల నరసింహ గోవిందా! గోవింద!’ అని నినదిస్తున్నారు.

నాలో వైబ్రేషన్స్ మొదలయ్యాయి! నృసింహుని దర్శించ బోతున్నాననీ భక్త్యుద్వేగం! కళ్ళు చెమ్మగిల్లసాగాయి. గర్భాలయం బయట కాసేపు వేచి ఉన్నాము. ఇరవై నిమిషాల తర్వాత లోపలికి వెళ్లాము. అది ఒక గుహాంతర్భాగం. నేనంటే పొట్టివాటిని కాబట్టి సరిపోయింది. ఎత్తరులైన భక్తులు అందులో నిటారుగా నిలబడలేరు!

స్వయంభువు అయిన ఆ భువనేశ్వరుని దర్శించుకొన్నాను. నా కళ్ల వెంట పారవశ్యబాష్పాలు, గొంతు పెగలలేదు. తీసుకు వెళ్లిన పూలమాల, పండ్లు, విడిపూలు చిన్న గులాబీలు పూజారికందించాను. ఆయనతో ఇలా చెప్పాను –

“స్వామీ! ‘శ్రీలక్ష్మీనృసింహ మాహాత్యము’ అన్న పద్యకావ్యాన్ని వ్రాస్తున్నాను. ఇది వ్రాతప్రతి. దీనిని దయ ఉంచి నృసింహ పరబ్రహ్మ పాదాల చెంత ఉంచండి” అని వేడుకున్నాను.

పూజారి గారి కళ్లలో ఆశ్చర్యం! భక్తితో ఆ పొత్తపుబొత్తి నందుకుని అహోబలశుని దివ్యచరణాల దగ్గర అరనిమిషం పాటు ఉంచి నాకు ఇచ్చారు. దానిని అందుకున్న నా శరీరం జలదరించింది. నా గోత్ర నామాదులు చెప్పి స్వామివారికి లఘుపూజ చేసి, హారతిచ్చి, శఠగోపస్పర్శ శిరస్సుకు చేయించి, ప్రసాదం ఇచ్చారు. స్వామివారు ధరించిన తులసి మాలనొక దానిని తీసి నా మెడలో వేశారు పూజారిగారు. ‘అహోబల నృసింహ సంపూర్ణ కరుణా కటాక్ష సిద్ధిరస్తు!’ అని దీవించారు. “స్వామివారిపై పద్య కావ్యము వ్రాస్తున్న మీరు ధన్యులు, పుస్తకం ప్రచురణ అయిన తర్వాత పైన, క్రింద, దేవస్థానాలకు రెండు కాపీలు పంపండి” అన్నారు.

“అవశ్యం స్వామి!” అన్నాను. “వ్రాస్తున్నది నేనే కాని, వ్రాయించేది ఆ నరసింహుడే!” అన్నాను స్వామివారిని తదేకంగా చూస్తూ!

“అవును! ‘పలికించెడు వాడు రామభద్రుండట’ అని కదా పోతన్న గారు చెప్పుకున్నారు!” అన్నాడాయన. నిరంతర నృసింహ సేవాతత్పరుడైన ఆయన ఎంత ధన్యుడో!

చెంచులక్ష్మి అమ్మవారు ప్రక్కనే ఒక ఉపాలయంలో కొలువై ఉన్నారు. మూలవిరాట్టు నృసింహుడు కేవలం రెండడుగుల ఎత్తున్న నల్ల రాయి. అది విగ్రహం కాదు. స్వామి స్వయంగా ఉద్భవించాడు. త్రేతాయుగం నుండి ఉన్న క్షేత్రమిది. ఆ శిలపైనే స్వామివారి కళ్లు, వదనగహ్వరం, సింహాకృతిలో సహజంగా ఏర్పడి ఉన్నాయి. వాటికి వెండి తొడుగోలు తొడిగారు. స్వామికి వెండి మీసాలనమర్చారు. తులసీ దళాలతో అల్లిన మాలలతో, దీపారాధనల వెలుగులో, ఆ గుహాంతర్భాగంలో, నరకేసరి ఉజ్జ్వలంగా ప్రశాశిస్తున్నాడు.

‘అహోవీర్య మహోశౌర్యం, అహో బాహుపరాక్రమం
నరసింహం పరం దైవం, అహోబల మహోబలం’

అని దేవతలు దిగ్భ్రాంతులై స్వామిని కీర్తించారు. చెంచులక్ష్మి అమ్మవారు నల్ల రాతి ప్రతిమ. కూర్చున్న భంగిమలో ఉంది. ఆమె కనులు దయను వర్షిస్తున్నాయి. తల్లిని ఇలా కీర్తించాను.

శ్లో:
‘సరసిజనయనే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్’

స్వామి వారి వద్ద స్తోత్ర పఠనానికి అవకాశం లేదు. సమయం చాలా తక్కువ. బయటకు వచ్చి ఒక చోట కూర్చున్నాను. స్వామివారి సన్నిధిలో, నా నృసింహ కావ్యగానం చేయాలనిపించింది. నేను పద్యాలు ఆలపిస్తుండగా డ్రైవరు సుబ్బరామయ్య వీడియో తీశాడు.

నా కావ్యావతారికలో, ‘ఇష్టదేవతాస్తుతి’ లో నృసింహునిపై రాసిన పద్యాన్ని, ‘నాహం కర్తా, హరిఃకర్తా’ అన్న అన్నమయ్య భావాన్ని పొందుపరచిన పద్యాన్ని, గావలమహర్షి నృసింహ దర్శన ఘట్టాన్ని పాడాను. నేను పాడుతూ ఉంటే కొందరు భక్తులు వచ్చి నిలబడి, పద్యాలను శ్రద్ధగా విన్నారు. హరి సంకీర్తనమంటే ఎవరికైనా ఇష్టమేకదా!

నృసింహ స్తుతి:

ఉ:
శ్రీసతి వామభాగమున శేముషి జూపగ, నాదిశేషుడున్
వాసిగ ఛత్ర సేవను సముచిత రీతిని జేయ, శాంతమున్
పోసిన మోము దివ్య సుకృపోజ్వల కాంతిని రువ్వ, యోగులున్
భాసిలు పాదపద్మములు బట్టగ వెల్లు నృసింహ మ్రొక్కెదన్

~

అంకితము:

ఉ:
పంకజనాభుడా నృహరి భాసిత కౌస్తుభధారి, లచ్చివా
మాంకము వెల్గ శేషఫణిమాలిక నీడను, సింహరూపుడై
సంకటనాశుడై దనరు శాశ్వత ముక్తిప్రదాన శీలికిన్
అంకితమిచ్చుచుంటి నిటు, మామక కావ్యము మా నృసింహునకున్

~

షష్ఠ్యంతములు:

కం:
యోగీంద్ర శరణ చరణున
కాగామి భయాది దుఃఖ ఘాతకునకు, స
ర్యాగమనుతునకు శౌరికి
జగముల కాపాడు పతికి జ్వాలాద్యుతికిన్

~

వినయ విన్నపము:

చం:
కృతిపతి నార సింహుడు, నకారణ దివ్యముదంబునిచ్చు జీ
వితగతి, కావ్యమో? యతని విస్తృత దివ్యమహత్తు, నేనికన్
మతి దలపంగ నేల? నిజమాంద్యము? యాతడే వ్రాయజేయునీ
సతతమహా ప్రభావయుతు శాశ్వత భవ్య పవిత్ర గాథలన్

~

గావలమహర్షి అహోబలేశుని దర్శించుట:

మ:
కనియెన్ మౌనివరుండు మాధవు, బృహత్కారుణ్య వారాశు, దాన్
ఘనమౌ భక్తి ప్రపత్తులన్ సకలమౌ కైవల్య సంధాయి, నా
దీననాథోజ్జ్వల తేజు, సింహముఖునిన్, దేదీప్యమాన ప్రభా
వినతాసూన వహున్, స్వయంభువు, మహా వేదాంత సారున్, హరిన్.

~

సీ:
కొండయంచున నున్న గుహలోన వెలుగొందు
నోబల నరసింహు నుతుల జేసె
ఏకశిలను వెలసి సకలార్థదాయి యౌ
చిన్మయరూపుని సేవ జేసె
ఘోర కాననమందు చరియించు హర్యక్షు
నర్ఘ్యపాద్యంబుల నాదరించె
తీక్ష్ణ దంష్ట్రా నేత్ర దీప్తుల గ్రాలెడు
పంకజనాభుని ప్రాపుగనియె
తే.గీ.:
ఇదె నహోబల మిదె భవ్యమిదియె పరము
లచ్చిమగనికి నెలవైన లలితనగము
భక్తకోటిని నిజలీల బ్రోచునట్టి
మహిత నరసింహ దేవుని మంత్రయశము

~

నా కావ్యగానం ముగిసింది. అలౌకికమైన అనందం నన్ను ఆవరించింది. ఇక నాదేముంది? అంతా ఆయనే చూసుకుంటాడు!

ఆరున్నరకు ఘాట్ రోడ్ గుండా దిగువ అహోబలం చేరుకొన్నాము. అక్కడా ఇఓ గారు నా కోసం ఒక వ్యక్తిని నియోగించి ఉన్నారు. స్వామివారికి ప్రదోషపూజ జరుగుతూ ఉంది. ఒక అరగంట స్తంభాల మంటపంలో కూర్చున్నాము.

ఆ స్త౦బాల శిల్ప సౌందర్యం అద్భుతం. దాదాపు వంద మీటర్ల పొడవున, ముఫై మీటర్ల వెడల్పున, ముఖమంటపం అలరారుతూ ఉంది. బయట గరుత్మంతుని, హనుమంతుని కంచు విగ్రహాలున్నాయి.

ఇరుపక్కలా దీర్ఘ మంటపాలు. వాటిని విద్యుదీపాలతో అలంకరించారు. మంటపం మధ్యలో 12 అడుగుల వెడల్పున స్వామివారి గర్భాలయానిది దారి. దాని పై కప్పు అంతా విద్యుద్దీప కాంతులతో వెలుగుతూ ఉంది. సాక్షాత్ వైకుంఠంలా ఉందా నృసింహ ధామం.

ప్రశాంతంగా మంటపం అంచున అరుగుపై కూర్చుని, ఆదిశంకరాచార్య విరచిత ‘నృసింహ కరావలంబ స్తోత్రము’లోని ఈ శ్లోకాన్ని కానడ రాగంలో పాడాను.

శ్లో:
ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస
భక్తానురక్త పరిపాలన పారిజాత
లక్ష్మీనృసింహా! మమదేహి! కరావలంబమ్!

దిగువ అహోబల నరసింహుని దివ్య దర్శనమయింది. చాలా పెద్ద నల్ల రాతి విగ్రహం. స్వామి శాంతసుందరుడు. ఆయనను తనివి తీరా చూసి పరమానందభరితుడనైనాను. ఒక వైపు గదిలో ‘పన్నిద్దరాళ్వారులు’ కంచి విగ్రహాల రూపంలో వేంచేసి ఉన్నారు. ముఖద్వారాని కిరువైపుల జయవిజయుల విగ్రహలు సజీవ స్ఫూర్తితో నిలచి ఉన్నాయి. అమృతవల్లి దేవిని దర్శించుకున్నాను. ఒక పూజారి పులిహార ప్రసాదం పెడుతున్నాడు. దాని రుచి అనన్యం.. ప్రసాదాన్ని స్వీకరించి, బయట ఒక వితర్దిక పైన కూర్చున్నాను. డ్రైవరు రామసుబ్బయ్య నా వెన్నంటే ఉన్నాడు.

ఇట్లా అన్నాడు “సార్! ఈరోజు నా బాగ్గెం. నీతోన వచ్చినందుకు ఓళమయ్య దర్శనం అయినాది. ఎన్నోసార్లు వచ్చినా గాని, ఇట్లా జరుగల్యా. ఈ చేత్రాన్ని గురించి నాలుగు మంచి మాటలు చెప్పండి!”

“అబ్బాయీ! జాగృత్తగా వినరా నాయనా!” అని, కొనసాగించానిలా.

“తూర్పుకనుమలలోని పర్వతశ్రేణులలో విలసిల్లే మహాక్షేత్రం ఈ అహోబలం. దీన్ని అహోబిలమని కూడా అంటారు. సామాన్య ప్రజలు, దీనిని ఓలమని, ఓబలమని అంటారు.”

“మా నాయన పేరు సామి పేరే సార్ – ఓబులయ్య.”

“మంచి పేరు. ఈ క్షేత్రంలో నవ నారసింహులున్నారు. ఈ దేవాలయాలను 15, 16 శతాబ్దాలలో విజయనగర చక్రవర్తులు విస్తరింపజేసినారు. 1578లో మొగలుల దండయాత్రలలో ఇవి ధ్వంసమైనా. మళ్లీ పునరుద్ధరించబడినాయి.

1970 వరకు, దుర్గమ పర్వతారణ్యాలతో వెలసిన నవనారసింహ క్షేత్రాలను దర్శించుకోవడం భక్తులకు కష్టంగా ఉండేది.

‘Ahobilam: A Journey into Spirituality’ అన్న గ్రంథంలో శ్రీ ఆర్. సందీప్ కుమార్ గారిలా అన్నారు –

“As per the Brahmanda puranam, there is no deity more supreme than the eight deities of Lord Narasimha.”

ఎగువ అహోబిలం లోని స్వామి సాలిగ్రామ రూపుడు, ఉగ్రుడు. అహోబల, క్రోడ, మాలోల, జ్వాలా, యోగానంద, ఛత్రవత, పావన, భార్గవ, కారంజ నామములతో వెలసిన నవనారసింహులు, పర్వతాలతో అచ్చటచ్చట వెలసి ఉన్నారు. కొండదారుల్లో ప్రయాణించ గల జీపులు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఆ స్వాముల సమీపం వరకు కాకపోయినా, కొంత దూరం వరకు వెళ్లి దర్శించుకోవచ్చు. యువతీయువకులైతే కాలినడకనే వెళ్లవచ్చు. అద్భుతమైన ట్రెక్కింగ్ అనుభూతిని పొందవచ్చు. ఆ ప్రకృతి శోభ, ఆ సెలయేర్లు, అంబర చుంబి శిఖరాలు, చూసి చూడవలసింది కాని, చెప్పనలవి కాదు.

జ్వాలా నరసింహ ధామమే హిరణ్యకశిపుని వధించిన చోటని ఐతిహ్యం. అచ్చటనే ‘ఉగ్రస్తంభం’ ఉంటుంది. భవనాశని యొక్క జలపాతం గుండా వెళ్లి స్వామిని దర్శించుకోవాలి.

క్షేత్రంలో నిత్యాన్నదాన సత్రాలు కులాలవారీగా ఉన్నాయి. స్వామివారు కులాలకు అతీతుడైనా, మానవుడు కాదు కదా! అన్నమయ్య వ్రాసిన కీర్తనలలో ఎన్నో నరసింహ స్వామి వారిపై ఉన్నాయి. టి.టి.డి. వారి వసతిగృహం, ఎ.పి. టూరిజం వారి ‘హరిత’ గెస్ట్ హౌస్, ఇంకా కొన్ని ప్రయివేటు లాడ్జిలు ఉన్నాయి. కాని అభివృద్ధి చెందాల్సినంతగా ఈ క్షేత్రం అభివృద్ధి చెందలేదు.”

ఇద్దరం చేతులెత్తి ఆలయ గోపురానికి నమస్కరించాము. నా ప్రొటోకాల్ ప్రకారం, ఒక పాక హోటల్లో మిరపకాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు తిన్నాము. అక్కడ ‘టీ హబ్’లో ఫిల్టర్ కాఫీ తాగాము. తొమ్మిది గంటలకు నంద్యాల చేరుకున్నాం.

మరునాడు, 3వ తేదీ రాయలసీమ సాగునీటి సాధన సమితి వారి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొని, రాత్రి 11 గంటలకు గుంటూరు – కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి ఉదయానికి హైదరాబాదు చేరుకున్నాను.

‘శ్రీశఠారి యతీంద్రాది యోగిహృద్పద్మ భానవే
సర్వత్ర పరిపూర్ణాయ అహోబిలేశాయ మంగళమ్!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here