ఐదు రూపాయలు

0
6

[dropcap]అ[/dropcap]నగనగా ఒక రాజుగారు వున్నారు. రాజుగారు తనకు తాను ఎక్కువ తెలివితేటలున్న వాడిగా భావించుకునేవాడు. తనకు ఎంత తోస్తే అంత. మంచి పని కాని, చెడ్డ పని కాని వెంటనే చేసేవాడు. వెనుకా ముందు ఆలోచించుకోకుండా మాట్లాడేవాడు. పెద్ద పెద్ద పండితులు బాగా తెలివితేటలున్న వారు కూడా ఆయన ఎదుట ఎండుటాకుల్లా వణికిపోతూ వుండేవారు. రాజుగారి దర్బారులో చాలా గొప్ప పండితులున్నారు. ఇతర విద్యలోలనూ ఆరితేరిన వారున్నారు.

రాజుగారు చాలా గొప్ప పరాక్రమవంతుడు కూడా. మంచి బలవంతుడని దేశవిదేశాల్లో కూడా పేరు తెచ్చుకున్నాడు. బాగా ఆరోగ్యంగా అందంగా వుండేవాడు. బంగారు జరీతో నేయబడిన బట్టలు ధరించేవాడు. గొప్ప రాజని ప్రజలు మెచ్చుకునేవారు. కత్తి చేత్తో పట్టుకుని మెరిసే బట్టలు వేసుకుని రథం మీద ఊరేగే రాజుగారిని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో కళ్లార్పకుండా చూసేవారు.

ఒక రోజు ఉదయాన్నే రాజుగారు తన భవంతిలో కూర్చుని వున్నాడు. ఒక ఉత్సవంలో పాల్గొనటానికి వెళ్లాలి. రోజూ వచ్చి రాజుగారి గడ్డం చేసే మంగలి కోసం ఎదురు చూస్తూన్నాడు. మంగలి రోజు వచ్చి గడ్డం చేస్తూనే ఊళ్లో జరిగే విషయాలన్నింటినీ రాజుగారికి తెలియజేస్తూ వుండేవాడు. బాగా ధైర్యంగా రాజుగారి ఎదుట మాటాలాడేది అతనొక్కడే.

మంగలి వచ్చాడు. మాటల మధ్యలో “నువ్వు రోజూ ఎంత సంపాదిస్తావు?” అని రాజుగారు అడిగారు.

“ఎంతో లేదు మహా రాజా. కేవలం ఐదు రూపాయిలు మాత్రమే సంపాదిస్తాను” అని మంగలి చెప్పాడు.

“ఐదు రూపాయలు ఒక కుటుంబానికి బాగా సరిపోతాయి. వాటిని నువ్వెలా ఖర్చు చేస్తావు?” అని రాజుగారు మరలా అడిగారు.

“మహాప్రభూ ఒక రూపాయి ఖర్చు పెడతాను. మరొక రూపాయితో అప్పు తీరుస్తాను. ఇంకొక రూపాయిని దాస్తాను. నాల్గవ రూపాయిని పారవేస్తాను. ఐదవ రూపాయిని శత్రువుకిస్తాను” అని  చమత్కారంగా జవాబు చెప్పాడు.

రాజుగారు మీసాలు సవరించుకుంటూ మంగలి చెప్పిన సమాధానాల గురించి ఆలోచించసాగాడు. ‘ఇతనేదో నా కర్థం కాకుండా మాట్లాడాడు. మంగలి చెప్పిన పదాలు తెలిసీ తెలియనట్లుగా వున్నాయి. తెలియలేదంటే అతడి దగ్గర నా పరువు పోతుంది’ అనుకుని అంతా తెలిసినట్లుగా తల వూపాడు.

“అంతా బాగానే వుందిగాని శత్రువని నువ్వెవెవరిని అంటున్నావు?” అని రాజుగారు మంగలిని అడిగారు.

“మరెవరో కాదు ప్రభూ, నా భార్యే నా శత్రువు. ఆ శత్రువుకే నేను ఐదవ రూపాయి ఇస్తున్నాను” అన్నాడు.

“భార్య ఎక్కడన్నా శత్రువవుతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?” అన్నాడు రాజు.

“అవును రాజు గారూ! నా భార్యే నాకు శత్రువు. మీకు నమ్మకం కలగకపోతే నేను స్వయంగా ఆమె నాకు విరోధేనని ఋజువు చేస్తాను. ఆజ్ఞాపించండి మహారాజా” అన్నాడు మంగలి వినయంగా.

“సరే ఇప్పటికి నువ్వెళ్లు. కాని ఈ విషయాల్ని గురించి ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు. ఏమైనా చెప్పావో నీ తల తీయించి వేస్తాను” అని రాజుగారు మంగలిని బెదిరించాడు. మంగలి తన పని పూర్తి చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు.

రాజుగారు మాత్రం మంగలి చెప్పన సమాధానాలను గురించి ఆలోచిస్తున్నాడు. కాని ఎంత ఆలోచించినా ఏమీ తట్టటం లేదు.

తన స్నానం పలహారం పూర్తి చేసుకుని మంత్రికి కబురు పంపించాడు. మంత్రి వచ్చాడు. “మంత్రిగారు నేనొక విషయం చెప్తాను. జాగ్రత్తగా విని సమాధానాలు ఆలోచించండి. ఒక మనిషి వున్నాడు. అతడు రోజూ ఐదు రూపాయిలు సంపాదిస్తాడు. దాంట్లో ఒకటి ఖర్చు చేస్తాడు. మరొకటి అప్పు చెల్లిస్తాడు, ఇంకొకటి జమ చేస్తాడు, నాల్గవ రూపాయి పారవేస్తాడు, ఐదవ రూపాయిని శత్రువుకిస్తాడు. దీని అర్థమేంటో నాకు చెప్పాలి” అని అడిగారు రాజుగారు.

మంత్రికి కూడా ఏమీ అర్థం కాలేదు. తెల్ల మొఖం వేసుకుని చూస్తూ వుండిపోయాడు. “సరే మంత్రిగారూ ఒక వారం గడువిస్తున్నాను. ఈలోగా నాకు సమాధానాలు చెప్పాలి. చెప్పలేకపోతే మీకు ఉరిశిక్ష పడుతుంది జాగ్రత్త!” అంటూ మంత్రిని హెచ్చరించి పంపాడు రాజుగారు.

మంత్రిగారు  దర్బారులో వున్న తెలివిగలవారినీ, పండితుల్నీ అడిగాడు. ఇంకా కొంతమంది అధికారుల్నీ అడిగాడు. చివరకు జ్యోతిష్కులను కూడా అడిగాడు. ఎవరూ దీనికి సమాధానం మాకు తెలియదన్నారు. మంత్రికి దిక్కు తోచలేదు.

రాజుగారిచ్చిన వారం గడవు అయిపోతోంది. రాజుగారు తాను అనుకున్న పనిని వెంటనే అమలు చేయాలనుకునే మనిషి గదా, మంత్రిని ఫలానా రోజున ఉరి తీయబోతున్నామని ఊళ్లో చాటింపు వేయించాడు.

మంత్రి చాలా మంచి మనిషి. అలాంటి మంచి వాటిని ఉరితీయించమేంటని ప్రజలు గుసగుసలాడుకోసాగారు. ఈ విషయం మంగలి భార్య కూడా విన్నది. ఆమెకేదో అర్థమయింది. మనసులోనో ఎగిరి గంతేసింది. నేననుకున్నది జరిగితే దేముడికి నేతితో దీపాలు వెలిగిస్తానని మొక్కుకున్నది. పరిగెత్తుకుంటూ మంత్రి గారింటికి చేరుకున్నది. మంత్రిగారి కూతురు కనపడ్డది. ‘మీక్కావలసిన జవాబులు నేను చెప్తాను, బదులుగా నేను కోరినంత డబ్బు ఇవ్వాల’ని అడిగింది. అలాగే సమాధానాలు చెప్పి వచ్చింది. మంత్రిగారి కూతురు తన తండ్రికి విషయం మొత్తం చెప్పింది.

ఆ రోజే మంత్రిగారిని ఉరితీసే రోజు. ఉదయాన్నే రాజుగారి దర్బారు మొదలైంది. మంత్రి లేచి నిల్చుని “రాజా మీరడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తున్నాను” అంటూ మొదలుపెట్టాడు. “మొదటి ప్రశ్నకు జవాబు ఖర్చు చేస్తాడు అనే దానికి ఇంట్లో తిండికీ, ఇతర అవసరాలకూ ఖర్చు బట్టేది. మరొకటి అప్పు చెల్లించేది అన్నదానికి తన తల్లిదండ్రుల పోషణకిచ్చి ఋణం తీర్చుకోవటం. జమచేస్తాడు అనే దానికి అతడు తన కొడుక్కి మూడువ రూపాయిని ఇవ్వటం. ఎందుకంటే తర్వాత తన కొడుకే గదా తమని చూసేది అందుకని కొడుక్కు ఇచ్చేది జమచేయటం. నాల్గవ రూపాయిని పారవేస్తాడని అనుకున్నాం గదా, పారవేయటం అంటే ఆ రూపాయిని కూతురికివ్వటం, ఎందుకంటే కూతురు పరాయి ఇంటికి వెళ్లేది. ఆమెకిచ్చినది అవతల పడవేయటంతో సమానమవుతుంది. ఇక ఐదవ రూపాయిని శత్రువుకివ్వటం అంటే భార్య కివ్వటం” అంటూ చెప్పి మంత్రి కూర్చున్నాడు.

రాజుగారికి వెంటనే అనుమానమొచ్చింది. ఇన్నాళ్ళ నుండీ సమాధానాలు తెలియని మంత్రి ఈ రోజు ఎలా చెప్పగలిగాడు. మంగలే మంత్రికి చెప్పి వుంటాడు. ఇదే నిజం అని గట్టిగా నమ్మాడు. మంగలి మీద పట్టరాని కోపమొచ్చింది. వెంటనే మరొక చాటింపు వేయించాడు. మంత్రిగారికి బదులుగా మంగలి ఉరి తీయబడతాడని చెప్పించాడు.

మంగలి నెత్తీ నోరూ బాదుకుంటూ లబలబలాడుతూ దర్బారుకొచ్చాడు. మంగలి ఏం చెప్పినా రాజుగారు వినటానికి ముందు ఒప్పుకోలేదు. ఎంతో బతిమాలుకున్నాక “సరే ఏం చెస్తావో చెప్పు” అన్నాడు.

“మహారాజా ముందుగా మీరు మంత్రిగారిని అడగండి. ఈ ప్రశ్నలకు ఆయనకు జవాబులు ఎలా తెలిసినవో చెప్పమనండి” అన్నాడు.

వెంటనే మంత్రి లేచి నిలబడి విషయమంతా చెప్పాడు. ఈ మంగలి భార్యే తమ ఇంటికి వచ్చి తన కూతురికి చెప్తే తన కూతురు తనకు చెప్పిందని ఒప్పుకున్నాడు.

రాజుగారికి ఆశ్చర్యం కలిగింది.

మరలా మంగలి మాట్లాడటం ప్రారంభించాడు.

“మహాప్రభూ నేను భార్యను శత్రువు అని ఎందుకన్నానో తమ కర్థం అయిదనుకుంటాను. ఆమెకు తెలుసు నేను ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తమరు ఉరి తీస్తారని. అయనా కూడా ఆమె వెళ్లి మంత్రిగారి కుమార్తెకు చెప్పేసి వచ్చింది. తమరికి జ్ఞాపకముందా ప్రభూ భార్య శత్రువు ఎలా అవుతుందో నేనే స్వయంగా తమకు తెలియజేస్తాన్నాను. అది తమరికి అర్థమయేలా చెప్పటం కోసమే నేను నా భార్యకు చెప్పి అలా చేయించాను. తమరు నన్ను క్షమించాలి” అంటూ వేడుకున్నాడు.

అన్నింటా తొందరపడే స్వభావమున్న రాజుగారికి ఈ తెలివిగల మంగలి చేసిన పనికి నవ్వాలో, కోపం తెచ్చుకోవాలో అర్థం కాలేదు. సభలోని వారందరూ మాత్రం చాలా ఆశ్చర్యపడ్డారు.

హిందీ మూలం: శ్రీ అరిగెపూడి రమేష్ చౌదరి

తెలుగు సేత – దాసరి శివకుమారి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here