ఐశ్వర్య రహస్యం-3

0
9

[ఎర్ల్ నైటింగేల్ గారు 1956లో అమెరికన్ రేడియోలో ఇచ్చిన ప్రసంగం ‘ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వర్ల్డ్’ ఆధారంగా డా. రాయపెద్ది వివేకానంద్ అందిస్తున్న ప్రేరణాత్మక రచన.]

[dropcap]మా[/dropcap]నవుల సమస్యలన్నింటినీ తీర్చగల ఒక అద్భుతమైన తాళం చెవి కోసం గత ఇరవై సంవత్సరాలుగా అన్వేషిస్తున్నాను.

మన భవిష్యత్తుని మనకి స్పష్టంగా చూపిస్తూ మనకు ఖచ్చితమైన హామీ ఇవ్వగలిగేలాంటి అద్భుతమైన మహిమ గల తాళం చెవి ఏదైనా దొరుకుతుందేమో అని అన్వేషిస్తున్నాను.

ఆ తాళం చెవి ఎలా వాడాలో తెలిస్తే చాలు బంగారు భవిష్యత్తు గ్యారంటీ అనే లాంటి తాళం చెవి ఎక్కడ లభిస్తుందబ్బా అని అన్వేషిస్తూనే ఉన్నాను.

ఎట్టకేలకు అలాంటి అద్భుతమైన మహిమలు ఉన్న తాళం చెవిని నేను కనుక్కున్నానోచ్.

అనేక మంది కష్టపడి చెమటలు చిందిస్తూ నిజాయితీగా పని చేస్తూ కూడా తమకంటూ ఏమీ మిగుల్చుకోరు. మీరు ఇలాంటి వారిని చూస్తూ అబ్బురపడి ‘ఏంటబ్బా ఈ సృష్టి వైచిత్రి’ అని కూడా అనుకుని ఉంటారు.

ఇంకా మరికొందరు ఉంటారు, పెద్ద కష్టపడకుండానే అన్నీ సాధించేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర మంత్రాలో మహిమలో ఏమన్నా ఉన్నాయేమో అని మనకు సందేహం వస్తూ ఉంటుంది.

వాడు పట్టిందల్లా బంగారమే” అని కొందరు వ్యక్తుల గూర్చి మనం వినడం కద్దే.

ఒక రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్న వ్యక్తి అనేక రంగాల్లో కూడా అంతే సక్సెస్‌ఫుల్‌గా ఉండటం మీరు చూసే ఉంటారు.

మరి కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళ వైఫల్యాలకి అంతే ఉండదు. వారు ఏ పని చేసినా కూడా విఫలం అవుతూ ఉంటారు.

తేడా ఎక్కడుందో చెప్పనా?

గోల్స్.

అవునండి విజేతలందరీకి స్పష్టమైన లక్ష్యాలు ఉంటాయి.

మిగతా వారికి ఉండవు.

ఇది నిష్ఠుర సత్యం.

అవునండీ! స్పష్టమైన లక్ష్యాలని నిర్దేశించుకుని వెళ్ళే వ్యక్తికి తాను ఎటు వెళుతున్నాడో ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది.

ఓస్ అంతేనా అన్నట్టుగా చాలా సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ ఇదే నిజం.

ఒక ఉదాహరణ చెప్తాను. మీకు చక్కగా అర్థం అవుతుంది.

ఒక పెద్ద షిప్‌ని ఊహించుకోండి.

ఆ షిప్‌ని నడిపే కేప్టన్‌కి, అతని సహాయకులకి తమ గమ్యానికి సంబంధించి పూర్తి అవగాహన ఉంది, మొత్తం రూట్ తాలూకు మాప్, ప్రణాళిక వారి వద్ద సిద్ధంగా ఉంది. తాము ఎన్ని రోజుల తర్వాత తమ గమ్యం చేరబోతున్నామో వారికి క్షుణ్ణంగా తెలుసు, అందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లతో వారు సిద్ధంగా ఉన్నారు.

ఈ షిప్ తన గమ్యం చేరుకోవటానికి 99.99 శాతం అవకాశాలు ఉన్నాయి.

అలా కాకుండా మనం ఇంకొక షిప్‌ని గూర్చి తెలుసుకుందాం.

ఈ షిప్‌కి అన్ని ఆధునిక వసతులు ఉన్నాయి, ఇంధనం ఉంది, కానీ ఇందులో కేప్టన్ లేరు, సహాయకులు లేరు, ఆటోమేటిక్‌గా గమ్యం చేర్చటానికి ఆటో పైలట్ వ్యవస్థ కూడా లేదు.

కేవలం ఈ షిప్‌ని ఇంజిన్ స్టార్ట్ చేసి వదిలేశాం అంతే.

మీక్కూడా తెలుసు. ఈ షిప్ మహా అయితే ఈ ఓడ రేవుని దాటి ముందుకు వెళ్ళటమే గగనం. అథవా అది ముందుకు సాగినా ఏ నిర్మానుష్యమైన బీచ్ ఒడ్డుకో, లేదా దారి తెన్ను లేక ఏ దిక్కుమాలిన దీవికో చేరి ఆగిపోతుంది.

ఖచ్చితంగా అది సరైన ఏ తీరాన్ని చేరదు. ఎందుకంటే దానికి గమ్యం లేదు, మార్గదర్శనం లేదు.

ఈ ఉదాహరణలోని పోలిక మనుషుల జీవితాలకి కూడా వర్తిస్తుంది.

ఉదాహరణకి మనం ఒక సేల్స్‌మన్ జీవితాన్ని పరిశీలిద్దాం.

ప్రపంచంలోకెల్లా అత్యధిక సంపాదనకి అవకాశం ఉన్న ఏకైక వృత్తి సేల్స్ వృత్తి. భవిష్యత్ ఉజ్వలంగా ఉండే రంగాలలో సేల్స్ రంగం ఒకటి. తమ గోల్ పట్ల స్పష్టమైన అవగాహన ఉంటూ ఆ దిశగా పయనిస్తున్న సేల్స్‌మన్‌కి అందని గమ్యం అంటూ ఉండదు.

ప్రతి సంస్థ అత్యుత్తమ సేల్స్‌మెన్ కోసం వెదుకుతూ ఉంటుంది. అలాంటి సేల్స్‌మెన్ కోసం వారు ఎంతైనా జీతం ఆఫర్ చేయటానికి సిద్ధంగా ఉంటారు. నిబద్ధత కలిగిన అలాంటి సేల్స్‌మెన్‌ల సంపాదనకి ఆకాశమే హద్దు.

***

నాగరిక మానవ సమాజంలో ఒక అద్భుతమైన వెసులుబాటు ఉంది, తెలివితేటలు, బలం కలవాడు ఎంత గొప్ప విజయాలైనా అందుకునే అవకాశాలు ఉన్నాయి, అదే సమయంలో బలహీనుడు ఓడిపోయి-బ్రతుకంటేనే విరక్తి చెందకుండా గౌరవప్రదంగా జీవించే వెసులుబాటు కల్పిస్తుంది నాగరిక సమాజం. అతనికి అండగా నిలబడే అనేక వ్యవస్థలు ఉన్నాయి.

యుద్ధ సమయంలో వరుసగా వెళ్ళే యుద్ధ ట్యాంకులు కొన్ని అమిత వేగంగా వెళ్ళగలిగినా, తమ వరుసలో అతి తక్కువ వేగంతో కదిలే ట్యాంకు వేగంతో సమానంగా తమ వేగాన్ని నియంత్రించుకుంటాయి. అందువల్ల అన్ని యుద్ధ నౌకలూ ఒకే ఒక క్రమ పద్దతిలో వెళుతూ కనిపిస్తాయి.

ప్రజాస్వామిక వ్యవస్థలలో బలమైనవాడు ఎదిగే దానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు సంస్థలు ఇంకా ఇంకా ఎత్తులకి ఎదిగే దానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తమ సమాజంలోనే ఉన్న అత్యంత బలహీనులు, శక్తిహీనులు కూడా గౌరవప్రదంగా బ్రతికేందుకు, ఇంకా ఎదిగేందుకు చక్కటి అవకాశాలు ఇక్కడ లభిస్తాయి. ఇదే ప్రజాస్వామిక వ్యవస్థలలో ఉన్న ఒక చక్కటి అంశం..

అందువల్ల నాగరిక సమాజంలోని అందరికీ సునాయాసంగా బ్రతకటానికి సమాన అవకాశాలు లభిస్తుంటాయి.

అందరికీ జీవనోపాధికి సమానావకాశాలు లభిస్తున్నాయి. ప్రత్యేకంగా తెలివితేటలు, నైపుణ్యాలు ఉన్నవారు ఎక్కువ ఎదిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సామాన్యుడు పొట్టపోసుకోవటానికి, కుటుంబాన్ని పోషించుకోవటానికి పెద్ద ఇబ్బంది లేని విధంగా వ్యవస్థ రూపుదిద్దబడి ఉంది. సమానావకాశాలు ఉన్న వేదిక మీద అందరూ ఉన్నారు. ఇంకా ఇంకా ఎదిగిపోవాలనుకునేవారికి ఆకాశమే హద్దు ఇలాంటి వ్యవస్థలో.

ఇక అసలు విషయానికి వస్తాను. ఈ రోజు నేను చెప్పదలచుకున్న ‘స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వల్డ్’ (సక్సెస్ సీక్రెట్) ఏమిటి అనేది మీకు సవివరంగా చెపుతాను.

మొదట ఈ విషయం గూర్చి ఒకసారి సీరియస్‌గా ఆలోచించండి. గోల్స్ ఉన్న వ్యక్తులు ఎందుకు విజయాలు సాధిస్తారు? గోల్స్ లేని వ్యక్తులు ఎందుకు ఓటమి పాలు అవుతూ ఉంటారు?

సరే ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను. ఇది మీకు అర్థం అయిందంటే ఇక మీకు తిరుగు ఉండదు. శ్రద్ధగా ఈ విషయం విని పూర్తిగా అర్థం చేసుకున్నారంటే ఇక మీ జీవితంలో ఓటమి అన్నది ఉండదు.

అరె అదృష్టదేవత నన్నిలా కరుణించిందే అని మీరు ఆశ్చర్యపోతారు ఇకపై.

మీరు కన్న కలలు అన్నీ నిజం అవుతాయి. కష్టాలు, బాధలు, మీరు అనుభవించిన దుఃఖాలు అన్నీ దూరం అవుతాయి. ఇన్ని మాటలు ఎందుకండీ అనుమానాలు, అవమానాలు, బాధలు, భయాలు ఇవన్నీ మీ జీవితంలో ఇకపై ఉండవు. నాది గ్యారంటీ.

ఇదిగో ఆ రహస్యాన్ని మీకు చెప్పేస్తున్నానిక. ఆ తాళం చెవిని మీకు ఇచ్చేస్తున్నాను మీ విజయానికి, ఓటమికి కూడా ఇదే సూత్రం.

“మనం ఏమి ఆలోచిస్తామో అదే పొందుతాము”

అవునండీ నేను మరొక్కసారి చెబుతున్నాను. “మనం ఏమి ఆలోచిస్తామో అదే పొందుతాము.”

తత్వవేత్తలు, మేధావులు, ప్రవక్తలు, మార్గదర్శకులు చరిత్ర పొడవునా అనేక విషయాల పట్ల ఒకరితో ఒకరు విభేదిస్తూనే ఉన్నారు.

కానీ వీరందరూ ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఒక విషయంలో మాత్రం ముక్త కంఠంతో ఏకాభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. “అదేమిటంటే ఒక వ్యక్తి విజయానికి గానీ, అపజయానికి కానీ ఒకే ఒక రహస్యం ఉంది. అదేమిటంటే – మనం ఏమి ఆలోచిస్తామో అదే పొందుతాము”

ఇందరు మనుష్యులలో ఒకడి వృద్ధాప్యం ఉన్నట్టు ఇంకొకడి వృద్ధాప్యం ఉండదు. ఎందుకలా? ఎవ్వరి జీవితమైనా సరే, వారు ఆలోచించుకున్నట్టు మాత్రమే సాగుతుంది, ముగుస్తుంది. ఇది వినటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.

రోమన్ చక్రవర్తులలో ఒకరైన మార్కస్ అరీలియస్ మాటల్లో చెప్పాలంటే

ఏ వ్యక్తి జీవితం అయినా చివరికొచ్చేసరికి అతని ఆలోచనలకి ఫలితంగానే రూపుదిద్దుకుంటుంది”.

బ్రిటిష్ రాజ నీతిజ్ఞుడు బెంజమీన్ డజ్రెయిలీ ఏమంటాడంటే

“ఓపికతో నిరీక్షించే వాడికి జీవితంలో అన్నీ ఒనగూడుతాయి. దీర్ఘంగా ఆలోచించి ఒక విధమైన ధ్యాన స్థితిలో నేను కనుగొని సూత్రీకరించిన సత్యం ఇది. ఒక స్థిర నిశ్చయంతో ఒకే ధ్యాసగా ధ్యేయం వైపు కృతనిశ్చయంతో సాగిపోయే వ్యక్తిని విజయం సాధించకుండా ఏ శక్తి అడ్డుకొనలేదు.”

అమెరికన్ రచయిత రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ చాలా తక్కువ మాటల్లో ఎంత సూటిగా చెబుతున్నారు చూడండి “ఒక వ్యక్తి నిరంతరం దేని గూర్చి ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు.

అమెరికన్ తత్వవేత్త మరియూ మనో వైజ్ఞానికుడు విలియం జేమ్స్ ఏమంటారంటె “మా తరంలోనే కనుగొనబడ్డ అత్యంత గొప్ప విషయం ఏమిటంటే మానవులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ద్వారా తమ జీవిత గమనాన్నే మార్చుకోగలరు.”

దీనికి కొనసాగింపుగా ఆయనే ఇంకా ఇలా చెప్తారు –

“మన భవిష్యత్తుని కళ్ళారా మన ఎదురుగా సజీవంగా చూస్తున్నట్టే ఉహించుకోగలగాలి. ఫీల్ అవ్వాలి. ఎటువంటి సంకోచం లేకుండా నిబ్బరంగా మనం ఆ ఆనుభూతిని హాయిగా అనుభవించగలగాలి. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదంతా నిజం అవుతుంది అనే నమ్మకం ఆత్మవిశ్వాసం మనకు పూర్తిగా ఉండాలి. మనం ఎంత హాయిగా ఆసక్తిగా ఆ అనుభూతిని పొందగలమో అంత ఖచ్చితంగా మన ఊహలు నిజం అవుతాయి” అంటారు ఆయన. అంతటితో ఆగిపోలేదు ఆయన, ఇంకా ఇలా చెబుతారు.

“ఎంత బలమైన విశ్వాసంతో నీవు భవిష్యత్తుని ఊహించుకుంటావో అంత బలంగా నీ భవిష్యత్తు నిజంగా నీ ముందు నిలుస్తుంది.

ఐశ్వర్యవంతుడివి అవ్వాలని విశ్వసిస్తే ఐశ్వర్యవంతుడివి అవుతావు

జ్ఞానవంతుడివి అవ్వాలని విశ్వసిస్తే , జ్ఞానవంతుడివి అవుతావు.

మంచివాడిగా అవ్వాలని విశ్వసిస్తే మంచివాడిగా మంచి పేరు తెచ్చుకుంటావు.

ఇవి మాత్రమే కాదు, నీ జీవితం గూర్చి మరిన్ని బలమైన కోరికలు స్వప్నాలు నీవు ఎంత బలంగా విశ్వసిస్తూ ఊహించుకుంటావో అవన్నీ కూడా అంత ఖచ్చితంగా నిజం అవుతాయి.

ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం.

అనేక మత గ్రంథాలలో కూడా ఇదే చెప్పబడింది.

మన పెద్దలు చెప్పనే చెప్పారు కద “యద్భావో తద్భవతి” అని.

అమెరికన్ మతగురువు మరియు రచయిత నార్మన్ విన్సెంట్ పీల్ ఎంతో ఉద్వేగానికి గురై ఏమి చెబుతారంటే

“ఈ ప్రకృతి నియమాన్ని అత్యంత ఉత్కృష్టమైనదిగా నేను భావిస్తాను. అరే ఇంత గొప్ప సత్యం నేను చిన్నవాడిగా ఉన్నప్పుడే నాకు తెలిసి ఉంటే ఎంత బాగుండేది కద అని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుండి. నాకు ఈ జ్ఞానోదయం చాలా జీవితం గడిచిపోయినాక తెలిసి వచ్చింది. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన భగవంతుడి శక్తి సామార్థ్యాల తరువాత నేను అబ్బుర పడిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఇదే.

ఏమిటయ్యా నన్ను అంతగా విస్మయ పరచిన ఆ ప్రకృతినియమం అంటే ఇదిగో ఇప్పుడే సూక్ష్మంగా చెబుతాను.

నువ్వు చెడుగా (నెగెటివ్‌గా) ఆలోచిస్తే చెడు ఫలితాలు పొందుతావు,

మంచిగా (పాజిటివ్‌గా) ఆలోచిస్తే మంచి ఫలితాలు పొందుతావు.

ఐశ్వర్యానికి, విజయానికి మూల కారణమైన ఈ నియమం చూడ్డానికి చాలా అల్పమైనదిగానూ చిన్నదిగానూ కనిపిస్తుంది.

దీన్నే ఇంకా తక్కువ మాటల్లో చెప్పాలంటే మూడే మూడు పదాల్లో చెపుతాను అంటారు నార్మన్ విన్సెంట్ పీల్.

నమ్ము మరియు గెలుపొందు

ప్రఖ్యాత నాటక రచయిత విలియం షేక్‌స్పియర్ ఇలా చెబుతారు “మన అనుమానాలు నిజానికి మనకు అనేక మార్లు ద్రోహమే చేస్తుంటాయి. గెలుపొందే అవకాశం ఉన్న దశలో కూడా మన అనుమానం అనే పెనుభూతం వల్ల మన ప్రయత్నాలని విరమించుకుని మనం పరాజితులుగా మిగిలిపోతాము.”

జార్జ్ బెర్నార్డ్ షా గారు ఏమి చెబుతున్నారో విందాం.

“చాలా మంది పరిస్థితులని నిందిస్తూ గడిపేస్తూ ఉంటారు. నిజానికి పరిస్థితులని నిందించటంలో నేను విశ్వసించను. ప్రపంచంలోని విజేతలందరూ కూడా తమకి అనుకూలమైన పరిస్థితుల కొరకు చూస్తారు మొదట. అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు వారు అనుకూలమైన పరిస్థితులని తామే సృష్టించుకుంటారు.”

ఇంతకన్నా సులభంగా వివరించటం సాధ్యం కానంత సులభంగా ఉంది కద.

జీవితం ప్రతి ఒక్కరికి ఒక్కో విధమైన సవాళ్ళని విసుర్తుంది, వాటిని సమర్థవంతగా ఎదుర్కొని తనకి అనుకూలంగా పరిస్థితులని చక్కదిద్దుకొనగలిగే ప్రతి విజేతకి తానే ఈ సవాళ్ళని ఎదుర్కొన్న మొదటి వ్యక్తిని అని అనిపించటంలో తప్పేమి లేదు కద.

మనం ఏమి ఆలోచిస్తామో అదే పొందుతాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here