ఆకాశవాణి పరిమళాలు-15

1
6

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ప్రాంతీయ శిక్షణా కేంద్రం (1985-87):

[dropcap]నే[/dropcap]ను హైదరాబాదులోని ఆకాశవాణి ప్రాంతీయ శిక్షణా కేంద్రం అధిపతిగా దాదాపు రెండున్నర సంవత్సరాలు పనిచేశాను. ఢిల్లీలో కేంద్ర శిక్షణా సంస్థ పని చేస్తోంది. దానికి అనుబంధంగా హైదరాబాద్, కటక్, అహ్మదాబాదులలో ప్రాంతీయ శిక్షణా కేంద్రాలున్నాయి. దక్షిణ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలలోని 20 కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి.

నా ఉద్యోగ జీవితంలో రెండు గుర్రాల స్వారీ అలవాటైంది. 1985 జనవరి 1న వాణిజ్య ప్రసార విభాగాధిపతిగా హైదరాబాదులో చేరాను. దానికి తోడు శిక్షణా కేంద్ర బాధ్యతలు కూడా అప్పగించారు. శిక్షణాకేంద్రంలో పని చేసిన పి.యు. ఆయూబ్ స్టేషన్ డైరక్టర్‌గా నాగర్ కోయిల్ బదిలీ అయి వెళ్ళారు. ఆయన మూడేళ్ళు హైదరాబాదులో పనిచేశారు. మూడేళ్ళలో ఏడెనిమిది ట్రైనింగులు పెట్టారు.

నేను 1985 మార్చి నుండి 1987 మార్చి – రెండు సంవత్సరాల కాలంలో ప్రతీ నెలా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసి 22 శిక్షణలు నిర్వహించాను. ఏ నెలలో ఏ విషయం మీద ట్రైనింగ్ పెట్టబోతానో షెడ్యూలు – ప్రసంగకర్తల పేర్లు, వారికి కేటాయించిన అంశాలు తెలియజేస్తూ మా డైరక్టర్ జనరల్ ఆమోదానికి పంపాలి. ఫిబ్రవరిలోనే షెడ్యూలు పంపాను. మార్చి నెలలో పబ్లిక్ రిలేషన్స్ మీద ఒక ట్రైనింగ్ ఆమోదించారు. 16మంది వివిధ రాష్ట్రాల ఉద్యోగులు – ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లు లేదా డ్యూటీ ఆఫీసర్లు హాజరయ్యారు.

ఒక నెల హైదరాబాదులోనూ, మరుసటి నెలలో ఇతర రాష్ట్రాలలోనూ ట్రైనింగ్‌లు ఏర్పాటు చేశాను. తమిళనాడులో మదరాసు, తిరుచ్చి, కోయంబత్తూరు, నాగర్‌కోయిల్ లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్టణం లోనూ, కర్నాటకలో గుల్బర్గా, బెంగుళూరు, మంగుళూరులలోనూ, కేరళలో త్రివేండ్రంలోను జయప్రదంగా నిర్వహించాను. ఎంచుకొన్న అంశాలు – హాస్యప్రధాన కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, నాటకాలు, కుటుంబ నియంత్రణ, సైన్సు ప్రోగ్రాములు, విద్యా ప్రసారాలు… ఇలా కొత్త కొత్త రూపకల్పనలు చేసి శిక్షణా కేంద్రానికి జవజీవాలు పోశాను.

ఈ సందర్భంలో గుల్బర్గాలో సైన్స్ విషయాలపై జరిపిన శిక్షణకు 16మంది ప్రోగ్రాం ఆఫీసర్లు హాజరయ్యారు. అందులో సైన్సు ఆఫీసర్లుగా పనిచేసే డా. శ్రీధర్, డా. కె.బి. గోపాలం, హెచ్. ఆర్. కృష్ణమూర్తి హాజరయ్యారు.

వారందరు తర్వాతి కాలంలో ఆకాశవాణి, దూరదర్శన్‌లలో అత్యున్నత పదవు లధిష్ఠించారు. గుల్బర్గాలో స్టేషన్ డైరక్టర్‌గా జి.కె.కులకర్ణి ఉన్నారు. అక్కడ ప్రొడ్యూసర్‌గా వున్న సిరహట్టి అందరికీ వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేసింది. సైన్స్ ప్రోగ్రామ్‌ల మీద జరిగిన మొదటి కార్యక్రమమని అధికారులు ప్రశంసించారు.

కర్నాటకలో మంగుళూరు సుదూర ప్రాంతం. అక్కడ ఒక ట్రైనింగ్ నాటక కార్యక్రమాలపై ఏర్పాటు చేశాను. బెంగుళూరు నుండి మంగుళూరు వెళ్ళాలంటే దాదాపు 16 గంటల రైలు ప్రయాణం. అందుకని ఆకాశవాణి వారు ఒక ప్రత్యేక ఆర్డరు విడుదల చేశారు – విమాన ప్రయాణం చేయవచ్చని. నాతో పాటు అందరు ట్రైనీలు విమానంలో వచ్చారు. అందరూ సంతోషంగా భావించారు.

1986లో ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ స్టేషన్ డైరక్టర్‌గా తెలుగువారైన బి.ఆర్.చలపతిరావు పనిచేస్తున్నారు. ఆయన ఆడియన్స్ రిసెర్చ్ ఆఫీసరుగా పనిచేస్తూ యు.పిఎస్.సి ద్వారా నేరుగా స్టేషన్ డైరక్టర్ అయ్యారు. తొలి పోస్టింగ్ మంగుళూరులో ఇచ్చారు. ట్రైనింగ్ మధ్యలో వచ్చిన ఆదివారం రోజు నేను, నా మిత్రుడు ధర్మస్థలకు వెళ్ళి వచ్చాము.

మంత్రుల సందేశాలు:

హైదరాబాదులో జరిపిన ట్రైనింగులకు సంబంధిత శాఖల మంత్రులను ఆహ్వానించాం. అలా వచ్చిన వారిలో కడపజిల్లాకు చెందిన ఆర్. రాజగోపాలరెడ్ది మరియు ఆరోగ్య శాఖా మంత్రి, విద్యాశాఖా మంత్రి ముద్దుకృష్ణమనాయుడు ప్రముఖులు. ఆకాశవాణికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సన్నిహిత సంబంధాలు ఉండాలి. వారు ఆకాశవాణి ప్రజలకు ఎలా చేరువైందో చెప్పేవారు. ఢిల్లీలోని అధికారులు కూడా ఈ ప్రయోగానికి హర్షించారు. ఇదేదో రాజకీయ ప్రవేశమని అభ్యంతర పెట్టలేదు.

నివేదికలు:

ప్రతి నెలా శిక్షణ పూర్తికాగానే వివరాలను నివేదిక రూపంలో ఢిల్లీకి పంపేవాడిని. అది ముందుగా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ యస్. కృష్ణన్ పరిశీలించేవారు. ఆపైన డైరక్టర్ జనరల్ ఆమోదించేవారు. శిక్షణలో ప్రతిపాదించబడిన సూచనలు కూడా పంపేవాడిని.

కటక్, అహ్మదాబాద్ కేంద్రాలవారు నిమ్మకు నీరెత్తినట్లు ఏ కార్యక్రమము చేపట్టేవారు కాదు. ఢిల్లీలో కేంద్ర శిక్షణా సంస్థ కూడా రెండు నెలలకో, మూడు నెలలలో ఒక కార్యక్రమం జరిపి ‘మమ’ అనిపించేవారు. ఢిల్లీ శిక్షణా కేంద్రాన్ని కింగ్స్ వే క్యాంపులోని నూతన భవనాలలోకి మార్చారు. హాస్టల్ సదుపాయం కూడా వుంది. ఊరికి 20 కిలోమీటర్ల దూరం కావడంతో సిబ్బందితో బాటు శిక్షణకు వెళ్ళేవారు కూడా అంత ఉద్యోగం చూపలేదు.

భార్యాభర్తలు:

ఆకాశవాణిలో పలు కేంద్రాలలో వివిధ హోదాలలో భార్యాభర్తలు పని చేస్తున్నారు. ఒక దఫా త్రివేండ్రం నుండి ఆర్.సి.గోపాల్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఒక ట్రైనింగ్‌కు హైదరాబాద్ వచ్చారు. తొలిసారిగా హైదరాబాదు వస్తున్నాడు గాబట్టి ఆయన భార్య కూడా వెంట వచ్చింది. ఆమె తొలిరోజు ఆకాశవాణికి వచ్చి గది బయట కూర్చుంది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో – “మీరు ఎక్కడ పని చేస్తున్నారు?” అని అడిగాను. “త్రివేండ్రం రేడియోలో సార్” అంది వినయంగా. “మధ్యాహ్నం నుంచి మీరు కూడా లోపల కూర్చోండి. దానికి ప్రత్యేక ఆర్డరు అక్కరలేదు. మీకు కూడా విషయాలు తెలుస్తాయి” అన్నాను. దంపతులిద్దరు సంతోషించారు. గోపాల్ 2017లో త్రివేండ్రం స్టేషన్ డైరక్టర్‍గా రిటైరయ్యాడు.

ఈ సందర్భంలో మరో ఉదంతం చెప్పాలి.

1987లో నేను ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర శిక్షణా సంస్థకు బదిలీ అయి వెళ్ళాను. అక్కడ హాస్టల్ వసతి ఉంది. కాని భార్యాభర్తలు వచ్చి ఒకే రూమ్‌లో ఉండకూడదు, దాని అంతరార్థం ఏమిటంటే – ట్రైనింగ్ కోసం వచ్చేడప్పుడు హనీమూన్ కొచ్చినట్టు దంపతులు వస్తే రూమ్‌లు సరిపోవు. అందునా అది ఒకే బెడ్ ఉండే సింగిల్ హాస్టర్ రూమ్. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరూ ప్రోగ్రాం అధికారులు. ఇద్దరికీ ఒకేసారి ట్రైనింగ్ వచ్చింది.

హాస్టల్ వార్డెన్‍కు సందేహం వచ్చి నాకు ఫోన్ చేశాడు. నేను హాస్టల్ పక్కనే ఉన్న ‘డి’ టైప్ క్వార్టర్స్‌లో వుండేవాడిని. రూల్స్ ప్రకారం ఇద్దరూ వేర్వేరు రూముల్లో ఉండాలి. ఆ విషయమే ధ్రువీకరించారు. దంపతులిద్దరూ సంతోషంగా వేర్వేరు రూముల్లో వున్నారు. కనీసం ఆ వారం రోజులైనా ప్రాణానికి హాయిగా వుంటుందనుకొన్నారేమో!

అతి సర్వత్ర వర్జయేత్:

నేను ప్రతి నెలా క్రమం తప్పకుండా ట్రైనింగులుపెట్టడం మా డైరక్టర్ జనరల్ దృష్టి నాకర్షించింది. నివేదికలు సరిగా పంపడం, శిక్షణ పకడ్బందీగా జరపడం ఆయన మెచ్చుకున్నారు. దక్షిణ ప్రాంత స్టేషన్ డైరక్టర్లు కూడా నా పనితనాన్ని హర్షిస్తూ డైరక్టర్ జనరల్‌కు వ్రాశారు.

గవర్నమెంటులో ఎక్కువ పని చేస్తే ఫలితం ఏమిటో నాకు తెలిసి వచ్చింది. నాకు ముందున్న సార్‌లు వీలు వెంబడి శిక్షణ పెడితే, నేను కొంప మునిగి పోతున్నట్టు – నెల తప్పకుండా – కాదు కాదు – నెల తిరగకుండా ట్రైనింగులు పెట్టాను. 1985 – 1990ల మధ్య వివిధ రాష్ట్రాల అధికారులు నా వద్ద శిక్షణ పొందారు. వారిలో చాలామంది డైరక్టర్లు అయ్యారు. గురుశిష్య సంబంధంగా గౌరవించారు.

1987 జనవరి:

నాలో చురుకుదనం గమనించిన మా డైరక్టర్ జనరల్ అమృతరావ్ షిండే నా సర్వీసులు కేంద్ర శిక్షణా సంస్థకు బాగా ఉపయోగపడతాయని భావించారు. డైరక్టర్ కృష్ణన్ ఆ ప్రతిపాదనను సమర్థించారు. వెంటనే నన్ను ఢిల్లీకి మారుస్తూ 1987 జనవరిలో ఓ శుభ ముహూర్తాన ఆర్డర్లు పంపారు.

నా పరిస్థితి సంకటంలో పడింది.

ఢిల్లీ వెళ్ళాలా? వద్దా? అని ధర్మ సందేహం.

ఢిల్లీ వెళ్ళే అవకాశం వస్తే వదులుకోవద్దని డైరక్టర్ రాజారాం ఇచ్చిన సలహా నా మెదడులో వుంది. వెళదామని నిశ్చయించుకొన్నాను.

మా ముగ్గురు పిల్లలు – శైలజ, రమేష్, జనార్దన్ – స్కూళ్ళలో చదువుతున్నారు. అందువల్ల విద్యా సంవత్సరం పూర్తి అయ్యేవరకు 1987 మార్చి దాకా నేను హైదరాబాదులో ఉంటానని అర్జీ పెట్టాను.

డైరక్టర్ జనరల్ ఆమోదించారు. 1987 మార్చి 31 న నన్ను హైదరాబాద్ కేంద్ర డైరక్టరు జి. సెల్వం రిలీవ్ చేశారు. 1987 ఫిబ్రవరి నెలలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి హైదరాబాదులో రెండు వారాలు – ట్రైనింగ్ స్కిల్స్‌పై శిక్షణలో పాల్గొన్నాను. అక్కడ రకరకాల పద్ధతులు బోధించారు. రెండు వారాలకు ఎనిమిది వేల ఫీజు ఆఫీసు వారు కట్టారు. అదొక నూతన అనుభవం.

1987 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ ఆఫీసు సిబ్బంది నుండి వీడ్కోలు స్వీకరించాను. నేను పని చేస్తున్న రెండు ఆఫీసుల సిబ్బంది, మెయిన్ స్టేషన్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఏతావాతా నాకు విశేషానుభవం లభించింది. మెయిన్ స్టేషన్‌లో 1982 అక్టోబరు నుంచి 1985   జనవరి వరకు పనిచేశాను. ఆపైన రెండేళ్ళు వాణిజ్య ప్రసారాలతో బాటు, శిక్షణా సంస్థ అధిపతిగాను పని చేశాను.

నేనున్న రెండేళ్ళలో వాణిజ్య ప్రసార విభాగం ఆదాయం గణనీయంగా పెరిగింది. హైదరాబాదులోని వివిధ సాంస్కృతిక సంస్థలు – ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ, కిన్నెర, వంశీ, రసమయి – నన్ను అభిమానించాయి. ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థకు కార్యదర్శి టి. సూర్యనారాయణ, అధ్యక్షుడు మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి యం. రామకృష్ణ. ఆ సంస్థ పక్షాన నేను కోఆర్డినేటర్‌గా ఎన్నో మీటింగులు, వర్క్‌షాపులు నిర్వహించాను. పత్రికలు, సామాజిక కార్యకర్తలు, అభిమానుల మన్నన పొందగలిగాను. నా మొత్తం 30 సంవత్సరాలలో ఐదు సంవత్సరాలే హైదరాబాదులో పనిచేశాను. హైదరాబాద్ స్టేషన్ డైరక్టర్‌గా పని చేయలేదే అనే కొరత ఢిల్లీ కేంద్ర డైరక్టర్‌గా వెళ్ళడంతో తీరింది.

(సశేషం).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here