ఆకాశవాణి పరిమళాలు-20

0
7

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

‘విజయ’కేతనం:

[dropcap]వి[/dropcap]జయవాడ ఆకాశవాణికి నేను రెండో దఫా 1995 మార్చిలో వెళ్ళాను. తొలి దఫా 1978 నవంబరు నుండి 1980 జూన్ వరకు తెలుగు ప్రసంగాల శాఖ ప్రొడ్యూసర్‌గా ఉషశ్రీ స్థానంలో పనిచేశాను. ఆయనను కడపకు బదిలీ చేసి నన్ను విజయవాడ వేశారు. రెండో దఫా స్టేషన్ డైరక్టరుగా వెళ్ళాను.

విజయవాడ ఆకాశవాణిలో ‘రజని’ గారి పాలనా కాలం స్వర్ణయుగం. ఎన్నో నూతన కార్యక్రమాల ద్వారా శ్రోతల నుర్రూతలూగించారు. సంగీతకారుడు, కవి, పండితుడు, పాలనాదక్షుడు బాలాంత్రపు రజనీకాంతరావు. ఇతర ప్రసార మాధ్యమాలు, ఛానళ్ళు ఉధృతంగా లేని రోజులలో 1995-97 మధ్య నేను దాదాపు 30 నెలలు స్టేషన్ డైరక్టరుగా పనిచేశాను.

విజయవాడ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేశాను. బీట్ కానిస్టేబుల్ డ్యూటీలాగా నేను మార్నింగ్ వాక్‌కి వెళ్ళినప్పుడు రోజూ పక్కనే వున్న స్టేట్ గెస్ట్ హౌస్‌కి వెళ్ళేవాడిని. అక్కడ బస చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు అధికారులను కలిసి రికార్డింగ్‍కు ఆహ్వానించేవాడిని. కాదనకుండా వచ్చేవారు. రేడియో శ్రోతలకు కరువులేని రోజులవి.

గాత్ర కచేరీకి చక్కతి వాద్య సహకారం లభిస్తే, రక్తి కడుతుంది. అలానే నాకు చక్కటి సహోద్యోగులు ఆ సమయంలో లభించారు. ప్రయాగ వేదవతి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌లుగా మంజులూరి కృష్ణకుమారి, మంగళగిరి డా. డి. పద్మావతి, వై. హనుమంతరావు, రాజేంద్రప్రసాద్ వంటి సమర్థులు పనిచేశారు. వాళ్ళు ఒక సభలో ఇలా చమత్కరించారు:

“మా డైరక్టరు రోజూ ఒక కొత్త ప్రముఖుణ్ణి స్టూడియోకు తీసుకొస్తారు. ఆయన రికార్డింగు పూర్తి చేసి స్టూడియో నుండి మేం బయటకు వచ్చేసరికి మరో ప్రముఖుడు కారు దిగుతుంటే స్వాగతం పలికేవాళ్ళం.”

1995-97 మధ్యకాలంలో సినీ, కళా, రాజకీయ, ఆధ్యాత్మిక రంగ ప్రముఖులెందరో ఆకాశవాణి స్టూడియోలో రికార్డింగులు చేశారు. అదొక చరిత్ర. ఆధ్యాత్మిక రంగానికి చెందిన కంచి కామకోటి పీఠాధిపతి (ప్రస్తుత పీఠాధిపతికి పూర్వులు), పుష్పగిరి పీఠాధిపతి, స్వామి సుందర చైతన్య, గన్నవరం పీఠాధిపతి, మాతా శివ చైతన్య – ఇలా ఎందరో. రాజకీయ నాయకులలో ఆర్థికశాఖా మంత్రి పి. ఆనందగజపతి రాజు, కె. రోశయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, పి. ఉపేంద్ర, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బోళ్ళ బుల్లి రామయ్య తదితరులు. సినీ ప్రముఖులు శ్రీమతి పి. భానుమతి, పి. సుశీల, యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, యస్. జానకి, దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, జంధ్యాల, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రోజా, నూతన్‌ప్రసాద్, కొంగర జగ్గయ్య. కవి పండిత గాయకులకు కొదవే లేదు.

కంచు కంఠం జగ్గయ్య:

1948 డిసెంబరు 1 న విజయవాడ కేంద్రం ప్రారంభించారు. 1995 డిసెంబరులో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వార్షికోత్సవం తలపెట్టాం.  ముఖ్య అతిథిగా జగ్గయ్య గారిని ఫోన్‌లో ఆహ్వానించాను. ఆయన ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివిన వ్యక్తి. వెంటనే అంగీకరించలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఫోన్ చెశాను.

“మా అమ్మాయి, అల్లుడు గుంటూరులో ఉన్నారు. వారిని చూసినట్లూ వుంటుంది. వస్తాను లెండి. ఆకాశవాణి ఆహ్వానం కాదనడం ఇష్టం లేదు” అని సభకు వచ్చారు.

ఆ మధ్యాహ్నం మా యింట్లో ఆతిథ్యం స్వీకరించారు.

మరుసటి సంవత్సరం డిసెంబరు వార్షికోత్సవానికి డా. బాలమురళీ కృష్ణ సంగీత కచేరి ఏర్పాటు చేశాం.  తుమ్మలపల్లి కళాక్షేత్రం దారి నడవలో కూడా ప్రేక్షకులు నిండిపోయారు. ఒక దశలో స్టేజికి ఇరువైపులా కూడా వచ్చి కూర్చున్నారు. అందుకు కారణం – గత కొద్ది సంవత్సరాలుగా బాలమురళిగారు ఆంధ్ర దేశంలో కచేరీ చేయనని భీష్మించుకోవడమే.

కచేరీకి ముందు సభలో మాట్లాడుతూ ఇలా చమత్కరించారు:

“నేను ఆకాశవాణిలో కొంతకాలం సంగీత విభాగం ప్రొడ్యూసర్‍గా పనిచేశాను. స్టేషన్ డైరక్టర్లంటే నాకు భయం. ఇప్పుడు అనంత పద్మనాభరావును చూసినా అదే భయం. అందుకే సంగీత కచేరీకి అంగీకరించాను” అన్నారు.

ఉగాది కవి సమ్మేళనాలు, కథాగోష్ఠులు, భువన విజయం అష్టావధానం – ఇలా ఎన్నో సాహిత్య సభలు ప్రేక్షకుల సమక్షంలో జరిపాం. హనుమంతరాయ గ్రంథాలయంలో జరిపిన కవి సమ్మేళనానికి శ్రీశ్రీ రావడం హైలైట్. చివరి నిముషం వరకూ శ్రీశ్రీ రాలేదు. ఆఖరి క్షణంలో ఆయనను వేదిక మీదకు ఆహ్వానించినపుడు ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన ప్రత్యక్ష్యమయ్యారు. అదో థ్రిల్.

వేరే ఊర్లలో ప్రేక్షక సమక్షంలో సభలు జరపడం ఆకాశవాణి ఆనవాయితీ. 1996లో తణుకులో ఆంధ్రా షుగర్స్ ఆడిటోరియంలో కార్మికుల కార్యక్రమానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించాం. ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి బోళ్ళ బుల్లిరామయ్య ముఖ్య అతిథులు. “ఫ్యాక్టరీ పెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క సమ్మె కూడా జరుగలేదు” అని హరిశ్చంద్రప్రసాద్ సగర్వంగా చెప్పారు.

హరిశ్చంద్రప్రసాద్ గారి ఆహ్వానం మేరకు తణుకులోనే వుంటున్న ప్రముఖ రంగస్థల నటులు షణ్ముఖి ఆంజనేయరాజు కొన్ని రంగస్థల పద్యాలు శ్రావ్యంగా పాడి వినిపించారు.

అన్నీ విజయాలే చెబితే, నాణేనికి మరో పార్శ్వం చూపలేదనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో డ్యూటీ రూమ్‌లో ఒక అనౌన్సరు, మరో డ్యూటీ ఆఫీసర్ని దుర్భాషలాడాడు. ఆవిడ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసింది. ఆ అనౌన్సరును వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగులంతా వారించే ప్రయత్నం చేశారు, కాని అరెస్టు తప్పలేదు. అతణ్ణి రాజమండ్రి సెంట్రల్ జైలుకి మర్నాడు తరలించారు. నేను అప్పటి పోలీసు కమీషనరు డి.టి.నాయక్‌ని కలిసి చర్చించాను. అతనిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టరనీ, చట్టప్రకారం చేస్తామనీ హామీ ఇచ్చారు.

1995-97 మధ్యకాలంలో కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం నాకు బాగా సన్నిహితులు. జిల్లా కలెక్టరుగా యస్.కె. జోషి ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా ఆర్.పి. ఠాకూర్. ఆయన ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. మునిసిపల్ కమీషనర్ రజత్ భార్గవ కేంద్రంలో ఉన్నత పదవిలో ఉన్నారు. వీరంత ఆకాశవాణి కార్యక్రమాలలో ప్రభుత్వ పథకాలను వివరించేవారు.

నాటకరంగానికి విజయవాడ ఆకాశవాణి ప్రసిద్ధం. కర్నాటి లక్ష్మీ నరసయ్య, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి వంటి దిగ్గజాలు మా స్టూడియోకి తరచూ వచ్చేవారు. ఒక సాయంకాలం డి. వి. నరసరాజు గారిని రికార్డు చేశాం. ఆ తర్వాత ఆయన నాతో “మీరొక సహాయం చెయ్యాలి” అన్నారు.

“చెప్పండి సార్” అన్నాను.

“నా చిన్నతనంలో హైస్కూల్‌లో నాకు పాఠాలు చెప్పిన గురువుగారు హనుమంతరావుగారు అనుకుంటాను. ఆయన సూర్యారావుపేట ప్రాంతంలో నివసిస్తున్నారని చెప్పారు. రేపు నేను వారిని కలుద్దామనుకుంటున్నాను. వారి ఆచూకీ కనుక్కోగలరా?” అన్నారు.

మర్నాడు మధ్యాహ్నానికి మా ఆఫీసు సిబ్బంది నరసరాజు గారిని గురు సమక్షానికి తీసుకెళ్ళగలిగారు. ఆయన సజల నయనాలతో గురువందనం చేశారు.

గడుసరి అత్తగారైన భానుమతి స్టూడియోలో ఇంటర్వ్యూ చేసే సమయం ఆసన్నమైంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌లు ఆమెను చూసి సందేహించారు. నేనే ముందుకు వచ్చి ఆమెను ప్రశ్నలడిగాను.

“మీకు గర్వం అంటారు…” అన్నది చివరి ప్రశ్న.

ఆమె పకపకా నవ్వి, “కళాకారులకు గర్వం భూషణం” అని సమర్థించుకున్నారు.

ప్రముఖ రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యులు యన్.జి.రంగా ఒకరోజు రైల్వే స్టేషన్ నుండి ఫోన్ చేశారు. “నేను ఫలానా రైలులో వస్తున్నాను. కారు పంపమన్నాను. పంపలేదు” అన్నారు కొద్ది కోపంతో.

“ఉత్తరం రాలేదు” అంటే ఇంకా కోపం పెరుగుతుందని – “పది నిముషాల్లో నేను అక్కడ ఉంటాను సార్” అన్నాను. స్టూడియోకి వచ్చి – నెహ్రు రాజకీయ చతురత గూర్చి మాట్లాడారు. సంతోషంగా వెళ్ళిపోయారు.

రంగా గారి ఉత్తరం కోసం ఎంక్వైరీ చేయగా ఆయన వ్రాసిన కార్డు ముక్క శ్రోతల ఉత్తరాల కట్టలో భద్రంగా ప్రత్యక్షమైంది.

అలా విజయవాడ సుమధుర జ్ఞాపకాలు ఎన్నో, ఎన్నెన్నో.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here