ఆకాశవాణి పరిమళాలు-26

0
6

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ఐ.ఎమ్.పి.సి.సి. మీటింగులు:

[dropcap]ప్ర[/dropcap]తీ రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు సంబంధించిన వివిధ విభాగాలు, బ్యాంకుల ఉన్నతాధికారులతో ఇంటర్ మీడియా పబ్లిసిటీ కో-ఆర్డినేషన్ కమిటీ (ఐ.ఎమ్.పి.సి.సి.) మీటింగు ప్రతి నెలా జరుగుతుంది. దానిని ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరక్టరు ఛైర్మన్. ఆ హోదాలో ప్రతి నెలా సమావేశాలను ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్యాలయంలో నిర్వహించేవాళ్ళం. బ్యాంకులలో జరిపితే వాళ్ళు ‘మధ్యాహ్న భోజన పథకం’ కూడా ఏర్పాటు చేసేవారు. కేంద్రప్రభుత్వాల పథకాలకు ప్రచారం ఎలా జరుగుతోందో సమావేశంలో చర్చించి నివేదికను మంత్రిత్వశాఖకు పంపాలి. ఆకాశవాణి, దూరదర్శన్, పబ్లికేషన్స్ డివిజన్, పి.ఐ.బి. వంటి 15 కార్యాలయాల అధిపతులు హాజరయ్యేవారు. ఉల్లాసభరిత వాతావరణంలో చర్చలు జరిగేవి.

నార్త్ జోన్ ఆకాశవాణి డైరక్టర్ల సమావేశం:

ఉత్తర భారతదేశంలో సిమ్లా, శ్రీనగర్ మొదలు యు.పి. వరకు వుండే దాదాపు 20 కేంద్రాల డైరక్టరులు కనీసం సంవత్సరాని కొకసారైనా కలుసుకోవాలి.  డైరక్టర్ జనరల్ అధ్యక్షత వహిస్తారు. కేంద్రాల సాధకబాధకాలు చర్చిస్తారు. నేను వెళ్ళడానికి ముందు ఐదేళ్ళుగా అలాంటి సమావేశం జరిగినట్లులేదు. అందుకు అనేక కారణాలు చెప్పారు. నేను డి.జి.తో మాట్లాడి 1998లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సమావేశం పెట్టాము.

చాలా రోజుల తర్వాత జరిగిన ఆ సమావేశంలో ఆయా కేంద్రాలవారు తమ గోడును నేరుగా డైరక్టర్ జనరల్‌కు చెప్పుకోగలరు. ఢిల్లీ డైరక్టరుగా నేను ఆ సమావేశానికి మెంబర్-సెక్రటరీని. డైరక్టరేట్ నుండి అన్ని విభాగాల అధిపతులు వచ్చారు. డైరక్టర్లు అంతా కలిపి నలభైమందిమి రెండు రోజులు అజెండా చర్చించగలిగాము.

డైరక్టర్లు పరస్పరం పరిచయమై సన్నిహితమయ్యే అవకాశం లభించింది. ఉదయపూర్ డైరక్టర్ అన్ని వసతులు అందరికీ ఏర్పాటు చేసింది. డి.జి. దృష్టికి కేంద్రాల ఇబ్బందులు నేరుగా వచ్చాయి. వెంటనే కొన్ని ఆర్డర్లు కూడా వేశారు. కెజ్రివాల్ సూటిగా మాట్లాడే మనిషి. ఆయన ప్రోగ్రాం విభాగం నుంచి పదోన్నతి పొందకపోయినా యు.పి,యస్.సి. ద్వారా నేరుగా డైరక్టర్ జనరల్‌గా వచ్చారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసరుగా, రిటైరయిన తర్వాత కేంద్ర సమాచార కమీషనరుగా వ్యవహరించారు. నన్ను బాగా మెచ్చుకునేవారు.

జాతీయ కవి సమ్మేళనం:

ఆకాశవాణి ప్రతి ఏటా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 14 భాషలలో కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తుంది. ఒక్కో భాషకు ఒక్కో కవిని ఎంపిక చేసి, ఆహుతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షంలో ఆయా కవుల చేత కవితలు వినిపింపజేస్తారు. వెంటనే వాటిని హిందీ అనువాదకులు హిందీలోకి చదువుతారు. సంస్కృతంతో మొదలు అకార క్రమంలో అస్సామీతో మొదలై చివరకు ఉర్దూతో అంతమవుతుంది. హిందీ భాషా ప్రాంతం ఎక్కువ కాబట్టి ఇద్దరు కవులను ఎంపిక చేస్తాము. ఆయా భాషల నుండి ముగ్గురు కవితలను ఆయా భాషా రాష్ట్రాలవారు పంపుతారు. అక్టోబరు నెలాఖర్లో విడివిడిగా ఆయా భాషా కమిటీలు కూర్చుని నా అధ్యక్షతన కవులను ఎంపిక చేస్తాము. డిసెంబరు మొదటి వారంలొ స్టేషన్లకు ఆదేశాలు వెళ్తాయి. వారు కవులను కవి సమ్మేళనాలకు సమాయత్తం చేస్తారు. అధిక భాగం ఈ సమ్మేళనాలు ఢిల్లీలో జరుపుతారు.

నేను ఒక సంవత్సరం భోపాల్‌లో నిర్వహించాను. తెలుగు కవిగా ఆచార్య కొలకలూరి ఇనాక్ కవిత చదివారు. అప్పుడు ఆయన తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్. జనవరి 25 రాత్రి 9.30 నిముషాలకు ఆయా రాష్ట్రాలవారు ఈ 15 మంది కవుల కవితలను వారి వారి భాషలలోకి అనువదింపజేసి దాదాపు 90 నిముషాలు ప్రసారం చేశారు. ఇనాక్ తన తెలుగు కవితకు ఇతర భాషలు పదమూడింటిలో వచ్చిన అనువాదాలను ఆయా లిపులలోనే ప్రచురించి ఒక గ్రంథం వెలువరించారు.

ఆకాశవాణికి గాంధీజీ రాక:

1947 నవంబరు 12న గాంధీజీ ఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రానికి తొలిసారిగా వచ్చారు. అదే చివరిసారి అని ఎవరూ ఊహించలేదు. ఆ రోజు దీపావళి పర్వదినం. తన వెంట రాజ్‌కుమారి అమృత్‌కౌర్ రాగా గాంధీజీ ఆకాశవాణికి విచ్చేశారు. కురుక్షేత్రంలో శిబిరంలో వుంచబడిన కార్మికుల నుద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. అదొక అద్భుత పర్వదినంగా భావించి ఆకాశవాణి డైరక్టరు స్టూడియో వెలుపల ఒక కొయ్య గద్దెను తయారుచేయించారు. ప్రతీ సాయంకాలం గాంధీజీ బిర్లా మందిరంలో జరిపే ప్రార్థనా సమావేశాలలో ఎలాంటి గద్దెను వాడతారో అలాంటిది తయారు చేసి ప్రార్థనా సమావేశ వాతావరణం కల్పించారు. గాంధీజీ దానిపై కూర్చున్నారు.  ఆకాశవాణికి రావడానికి సిద్ధపడకపోయినా, వచ్చిన తరువాత మైక్ ముందు సహజ-కంఠస్వరంలో ప్రసంగించారు. ‘మైక్’ని గురించి ఇలా అన్నారు: ఆకాశవాణి మైక్ అద్భుత శక్తి గలది అంటూ “This has miraculous power. I see the ‘SHAKTI’ the miraculous power of God” అని ప్రారంభించారు.

1997 నవంబరు 12:

ఆకాశవాణికి గాంధీజీ వచ్చిన ఏకైక సందర్భాన్ని పురస్కరించుకుని 1997 నవంబరు 12న స్వర్ణోత్సవం జరపాలని సుహాస్ బోర్కర్ అనే ఢిల్లీ సమాజిక కార్యకర్త ఆలోచించాడు. ముందుగా సమాచార ప్రసారశాఖా మంత్రి యస్. జైపాల్‌ రెడ్దిని కలిసి ఆయనను ఆకాశవాణికి ఆహ్వానించాడు. అక్కడి నుండి సరాసరి మా డైరక్టర్ జనరల్ కెజ్రివాల్ వద్దకు వెళ్ళి దబాయింపుగా సెక్షన్‌లో మాట్లాడాడు. “మరో మూడు గంటలలో అంటే సాయంకాలం 4 గంటలకు సభ ఏర్పాటు చేయండి – అది దేశమంతా ప్రసారం కావాలి” అని ఆర్డరు వేశాడు. డి.జి.కి ఏమీ తోచలేదు. నాకు ఫోన్ చేసి సుహాస్ బోర్కర్‌ని పంపుతున్నానన్నారు.

ఆయన రాగానే ‘జైపాల్’ అంటూ ఏకవచనంలో మాట్లాడుతూ సాయంత్రం ఆకాశవాణి ప్రాంగణంలో సభ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రసారం చేయమని ఆదేశపూర్వకంగా మాట్లాడాడు. ఇది మంత్రిగారి ఆదేశం అన్నాడు. గొప్పలు చెబుతూ అందరు రాజకీయవేత్తలు తనకు పరిచితులన్నట్లు మాట్లాడుతూ వాళ్ళ పేర్లు వాడుతున్నాడు.

నాకు కొంచెం అహంభావం. నేనిలా అన్నాను:

“మీరు నాతో మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మొదలుకొని, మా మంత్రిగారి పేరు, డైరక్టర్ జనరల్ పేరు వాడడం సబబుకాదు. మూడు గంటలలో ప్రత్యక్ష ప్రసారం అసాధ్యం” అని నాకు అలవాటు లేని గంభీర స్వరంతో చెప్పాను.

“I will talk to Jaipal” అని సెల్‌ఫోన్ తీయబోయాడు.

నేను చూసీ చూడనట్లు నా ఫోన్ తీసి నేరుగా జైపాల్‌ రెడ్దితో మాట్లాడాను. ఆయన హుందాగా సాధ్యాసాధ్యాలు మీ ఇష్టం అన్నారు. ఎదురుగా కూర్చున్న సుహాస్ ఖంగు తిన్నాడు. నేను వెంటనే మా సూపరింటెండెంట్ ఇంజనీరుకు ఫోన్ చేసి డైరక్ట్ లైవ్‍కి ఏర్పాట్లు చేయమన్నాను. సాధారణంగా సాయంకాలం 4 నుండి 5 వరకు ప్రసారాలు ఏ కేంద్రమూ చేయదు. అయినా ఇంజనీరింగ్ మిత్రుల సహకారంతో ప్రత్యక్ష ప్రసారం చేశాము. జైపాల్ రెడ్డి వచ్చి తనదైన గంభీరశైలిలో గాంధీజీని స్మరించారు. మూడు గంటల వ్యవధిలో సభ ఏర్పాటు చేయడం, రిలే చేయడం చూసి మా డి.జి. సభలోనే నన్ను అభినందించారు. యుద్ధరంగంలో సైనికులలా పనిచేసే ప్రోగ్రామ్ అధికారులు నాకు అండగా నిలిచారు. ప్రత్యేకించి రాజీవ్ కపూర్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఇలాంటి బయటి కార్యక్రమాలలో సమర్థుడు. పోలీసు అధికారుల పర్మిషన్లు, విజ్ఞాన్ భవన్ పాసులు, రిలే యంత్రాంగము, కామెంటేటర్లు సిద్ధం చేయడంలో సిద్ధహస్తుడు.

నాతో పని చేసిన ఇద్దరు డిప్యూటీ డైరక్టర్లు పనిలో నిపుణులు. బి.యం. గుప్త, అల్కా పాఠక్ నాతో సహకరించారు. గుప్త తర్వాత స్టాఫ్ ట్రయినింగ్ ఇన్‍స్టిట్యూట్‌కు నన్ను అడిగి బదిలీ చేయించుకున్నాడు. అల్కా పాఠక్ నేషనల్ డైరక్టరుగా వెళ్ళింది. అసిస్టెంట్ డైరక్టర్లలో నరసింహాచార్యులు నాకు కుడి భుజం.

ఆగస్టు 15 ప్రత్యక్ష ప్రసారం:

ఎర్రకోట నుండి ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గంటకు పైగా ప్రసంగిస్తారు.  దానికి మూడు నెలల ముందు నుండి రక్షణశాఖ కార్యదర్శి అధ్యక్షతన వారానికొక మీటింగు రక్షణ మంత్రిత్వశాఖలో జరుగుతుంది. ఆకాశవాణి డైరక్టర్‌గా నేను నా పరివార సహాయకులతో వెళ్ళేవాడిని. ఆగస్టు 12, 13 తేదీల్లో డ్రెస్ రిహార్సల్స్ జరిగేవి. యథాతథంగా మొత్తం కార్యక్రమాల్ని జరిపేవారు.  ప్రధాని ఎర్రకోట ముందు కార్లోంచి దిగి సైనిక దళాల వందనం తీసుకోవడం మొదలు ఎర్రకోటపై ప్రసంగించడం, తిరిగి కార్ల సముదాయం వెళ్ళడం వరకు రిహార్సల్ చేసేవారు.

1998 ఆగస్టులో జరిగిన ఇండిపెండెన్స్ డే నాకు తొలి అనుభవం. రెడ్ ఫోర్ట్ పైన దాదాపు 150 కుర్చీలు వేశారు. అందులో మాజీ ప్రధానులు, ప్రస్తుత కేంద్రమంత్రులు (వారి అర్థాంగులతో సహా), ప్రతిపక్షనేత, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు – ఇలా అత్యంత విశిష్ట ప్రముఖులు ఆసీనులవుతారు. వారి పక్కనే ఆకాశవాణి బూత్ వుంది. అక్కడ నేను, మా దూరదర్శన్ డైరక్టరు కూర్చున్నాము.

రిహార్సల్ ఆగస్టు 12న మొదలైంది. సరిగ్గా ఉదయం 7 గంటలకు ఒక వ్యక్తి (ప్రధాని హోదాలో) జెండా ఆవిష్కరించాడు. రెండు నిముషాలు అలానే నిలబడ్డాడు. వెంటనే నేలమీద వాలిపోయాడు. రెడీగా వున్న స్ట్రెచర్ మిద అతనిని పడుకోబెట్టారు. లిఫ్టులో కిందకి తీసుకెళ్ళారు. రెడీగా కారు వుంది. నేరుగా రామమనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

మర్నాడు 13న రిహార్సల్‌కు వెళ్ళినప్పుడు రక్షణశాఖ అధికారిని “ఆ పడిపోయిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా?” అని అడిగాను. ఆయన చిరునవ్వు నవ్వారు. నాకేమీ పాలుపోలేదు. వెంటనే ఆయన అన్నారు: “రిహార్సల్స్‌లో అదొక భాగం. ఒకవేళ ప్రధానమంత్రి ప్రసంగిస్తూ దురదృష్టవశాత్తు సొమ్మసిల్లి పడిపోతే, రెడ్ ఫోర్ట్ నుండి రామమనోహర్ లోహియా ఆసుపత్రికి అత్యంత వేగంగా వెళితే ఎంత సమయం పడుతుందో లెక్కలు గట్టడానికి అలా డమ్మీని ప్రయోగిస్తారు.” ఆశ్చర్యం వేసింది.

ఆయనే సమాధానం చెప్పారు: 1984 అక్టోబరు 31న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురికాబడినప్పుడు వెంటనే రామమనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందువల్ల ప్రధాని విషయంలో ఏం జరిగినా సిద్ధంగా వుండడానికి అది చేస్తారు” అని.

నేను వరుసగా రెండు సంవత్సరాలు 1998, 1999 సంవత్సరాలలో ఎర్రకోటపై నుండి ప్రత్యక్షంగా తిలకించే భాగ్యం ఆకాశవాణి నాకు కల్పించింది. 1998, 1999, 2000 సంవత్సరాలలో రిపబ్లిక్ దినోత్సవ ప్రత్యక్ష ప్రసారాలు కూడా పర్యవేక్షించాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here