[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
ఆకాశవాణిలో చేరడానికి కృత్యావ్యవస్థ మొదలైంది. కందుకూరులో 1967 డిసెంబరులో చేరిన నాటి నుండి 1975 ఆగస్టు వరకు ఎన్నో జ్ఞాపకాలు. మిత్రులు, విద్యార్థుల అప్యాయత. అధ్యాపకుల అనురాగం పెనవేసుకొన్న రోజులు.
నేను అవధానిగా గజ్జె కట్టిన కందుకూరు. మా వివాహం జరిగినది 1969 మే 8. మాకు ముగ్గురు పిల్లలు కలిగిన ఊరి అనుబంధం అన్నీ ముప్పిరిగొని వీరందరినీ వదిలి వెళ్తున్నాననే బాధ. కందుకూరు తాలూకా రచయితల సంఘం పేర ఒక సంస్థను స్థాపించి నేను అధ్యక్షుడిగా ఐదేళ్ళు ఎన్నో సాహిత్య కార్యక్రమాలు చేశాం. విద్యార్థులను ప్రోత్సహించడానికి కవితా సంకలనాలు తెచ్చాను.
కందుకూరు రచయితల సహకార సంఘం స్థాపించి పుస్తకాలు వేశాం. పవని నిర్మల ప్రభావతి దంపతులు, విక్రాల శేషాచార్య దంపతులు, కొమాండురి రామానుజాచార్యులు, చి.వి.వి.హెచ్.బి. ప్రసాదరావు, కరణం సుబ్బారావు వంటి కవి మిత్రులతో ఎర్రన జయంతి, రుద్రకవి జయంతి, పిల్లలమర్రి పినవీరభద్ర జయంతులు నిర్వహించాం. గుడి నారాయణబాబు, అలంకారం కోటంరాజు అనే ఇద్దరు శిష్యులు నా వద్ద కవిత్వం నేర్చుకుని పద్యాల శంఖం పూరించారు. వీరంతా కలిసి ఆగస్టు 13 న నా వీడ్కోలు సభ పెద్ద ఎత్తున సంకల్పించారు.
ఇంతలో ఒక రోజు ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది.
“ఒరే! లం…. కొడకా! కడప సంగతి నీకు తెలియదు. నీవు వచ్చావంటే నీ అంతు చూస్తాం – ఇట్లు నీ శ్రేయోభిలాషి.”
నా బాగోగులు కోరిన ఆ మిత్రుడెవరో గాదు, ఆకాశవాణిలో 20 ఏళ్ళుగా పనిచేస్తూ, ఇంటర్వ్యూకు నాతో పాటు వచ్చిన ఒక ఉద్యోగ మిత్రుడని తర్వాత పసిగట్టాను.
ఆగస్టు 14 న కళాశాల అధ్యాపకత్వానికి ‘నమస్కారం’ పెట్టి తెల్లవారేసరికి కడప చేరుకున్నాను. ఆగస్టు 15 న ఆకాశవాణిలో చేరడానికి కోపరేటివ్ కాలనీలోని ఆఫీసుకెళ్ళాను. అకౌంటెంట్ జి.యస్.ఆర్. కృష్ణయ్య ఒక మడత పేచీ పెట్టారు. ఆగస్టు 15 పబ్లిక్ హాలిడే. మీరు కొత్త ఉద్యోగంలో చేరడానికి లేదు – రేపు చేరండి – అన్నాడు. అంటే నేను ఆగస్టు 14 న కాలేజీలో, 15 న air లో (గాలిలో), 16న AIRలో ఉన్నాను. ఆ ఒక్కరోజు break-in-service తర్వాత 10 ఏళ్ళకు ratify చేస్తూ డైరక్టర్ జనరల్ ఆమోద ముద్ర వేశారు. మొదట్లో ఒక పది రోజుల కాంట్రాక్టు ఇచ్చారు. పోలీస్ వెరిఫికేషన్ అయిన తర్వాత మూడు సంవత్సరాల కాంట్రాక్టు ఇచ్చారు. అలా నా రంగ ప్రవేశం జరిగింది.
కడప గడపలో…
1975 ఆగస్టు 16 ఆకాశవాణిలో నా అరంగ్రేటం జరిగిన రోజు. కడప ఆకాశవాణి రిలే కేంద్రాన్ని 1963 జూన్‌లో అప్పటి కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి డా. బెజవాడ గోపాలరెడ్డి ప్రారంభించారు. అదే నెలలో విశాఖపట్టణం కేంద్రం కూడా వారే ఆరంభించారు. సాయంకాలం ప్రసారాలను హైదరాబాదు నుండి కడప కేంద్రము, విజయవాడ నుండి విశాఖపట్టణం కేంద్రము రిలే చేసేవి. 1975 జూన్‌లో అంటే ఓ పుష్కర కాలం తర్వాత రెండు కేంద్రాలు మూడు పూటల ప్రసారాలతో స్వయంప్రతిపత్తి గల కేంద్రాలుగా రూపొందాయి.
కడప కేంద్రానికి మదనపల్లెకి చెందిన టి.ఆర్.రెడ్డిని అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన బెంగుళూరువాసి. సౌజన్యమూర్తి. కార్యక్రమ నిర్వాహకులుగా బి.ఆర్. పంతులు, ఆర్. విశ్వనాథం బదిలీ మీద వచ్చారు. కేంద్ర ప్రసారాల ప్రారంభం జూన్‌లో జరిగింది. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖా మంత్రిణి శ్రీమతి యం. లక్ష్మీదేవి విచ్చేశారు. ఆమె కడప ఆర్ అండ్ బి గెస్టు హవుస్‍లో బస చేశారు.
వారిని ఆహ్వానించడానికి టి. ఆర్. రెడ్డి బంగాళాకు వెళ్ళారు. బయట అటూ ఇటూ పచార్లు చేస్తున్న ఒకరిని – “మంత్రిగారు లోపల ఉన్నారా?” అని ఆయన అడిగారు.
ఆమె చిరునవ్వు చిందిస్తూ – “నేనే. రండి లోపలికి” అని తీసుకువెళ్ళారు. ఈ రోజుల్లో వలె గన్‌మెన్లు, అంగరక్షకులు అవసరం లేని రాజకీయ వాతావరణం వున్న రోజులవి. సభ సజావుగా జరిగి ప్రసారాలు మొదలయ్యాయి. అప్పుడప్పుడే బాలారిష్టాల దశ దాటింది.
కడప కోపరేటివి కాలనీలోని రెండు అద్దె భవనాలలో ఆకాశవాణి ప్రారంభమైంది. ఒక భవనంలో స్టూడియో, స్టేషన్ ఇంజనీరు టి.ఏ.జి. కృష్ణన్ ఆఫీసు; అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఆఫీసు ఉన్నాయి. రోడ్డుకటువైపు మరో భవనంలో మిద్దె మిద అసిస్టెంట్ డైరక్టరు, కింద రెండు గదులలో పంతులు, విశ్వనాథం తమ పరివారంతో కొలువుతీరారు.
నేను చేరిన రోజు మరి ఏ గదీ ఖాళీ లేదు. వంటగదిని కొద్ది మార్పులు చేసి నన్ను కూచొని కార్యక్రమాలు వండమన్నారు. వంటకు నేను కొత్త. మిగిలిన ఇద్దరూ పదేళ్ళ అనుభవజ్ఞులు.
అనౌన్సర్లుగా ఆరవీటి శ్రీనివాసులు, గుర్రం కోటేశ్వరరావు, గోపి, రాజగోపాల్ నలుగురున్నారు. కోటేశ్వరరావు బి.ఎల్. కూడా చదివారు. ఆయన నేను వెళ్ళిన ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూలో క్షతగాత్రుడు.
డ్యూటీ ఆఫీసర్లుగా కె.ఆర్. భూషణరావు, చి. జి.ఎస్. రావు, స్థానికుడైన సుండుపల్లి హనుమంతరావు పనిచేస్తున్నారు. రోజూ ఉదయం నాలుగు గంటలకే వీరంతా డ్యూటీల ప్రకారం 14 కిలోమీటర్ల దూరంలో వున్న కొప్పర్తికి ఆఫీసు కార్లో వెళ్ళేవారు. స్టూడియోలో రికార్డు చేసిన టేపులు అక్కడికి తీసుకెళ్ళి ప్లే చేసేవారు. హైదరాబాదు, ఢిల్లీల నుండి సమయోచితంగా వార్తలు – ఆంగ్లం, హిందీ తెలుగులలోనూ ఢిల్లీల నుండి రిలే చేసేవారు. ప్రాంతీయవార్తలు హైదరాబాదు నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రసారమయ్యేవి. తర్వాత కొంతకాలానికి విజయవాడలో ప్రాంతీయ వార్తా విభాగం ప్రారంభించారు.
ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఆకాశవాణి ట్రాన్స్‌మిటర్లు అన్ని చోట్లా ఊరికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఎందుకుంటాయి? హైదరాబాదుకు సరూర్‍నగర్‌లో, విజయవాడకు మంగళగిరిలో, కడపకు కొప్పర్తిలో, విశాఖకు అగినంపూడిలో ఉన్నాయి. దీనికి కారణం – ట్రాన్స్‌మిటర్లకు 10 కిలోమీటర్ల వరకు ప్రసారాలు వినిపించవు. దానిని షాడో జోన్ – అంటారు. అందుకని ఊరికవతల కట్టారు.
నేను డ్యూటీలో చేరిన మూడో రోజున కడప రామకృష్ణ మందిరం సమావేశపు హాల్‌లో 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక మీద ఒక గోష్ఠి ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రదానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ప్రకటించిన 20 సూత్రాల ప్రణాళిక ప్రచార బాధ్యతను ఆకాశవాణి కేంద్రాల కప్పగించారు. ప్రతీ నెలా ప్రతీ కేంద్రమూ ఒక స్టేట్‌మెంట్ ఢిల్లీకి పంపాలి. అక్కడ 20 సూత్రాల ప్రణాళికా ప్రచార సమీక్ష జరిగేది. మన తెలుగువారైన డా. యన్. భాస్కరరావు దాని పర్యవేక్షకులు.
స్టేషన్లు ప్రతీ నెలా కనీసపక్షం 50 కార్యక్రమాలు చేయాలని ఆంక్ష. సంఖ్యాబలం కోసం సినిమా పాటలలో ఎక్కడో ఒక పదం వచ్చిన దానిని స్టేట్‌మెంట్లో చూపేవారు. ‘వెల్‌డన్’ అని ప్రశంసలందుకొనేవాళ్ళం. ఈ నేపథ్యంలో కడపలో జరిగే ఆ కార్యక్రమాన్ని రికార్డింగ్ చేసే బాధ్యత నా మీద పెట్టారు. ఆ రోజు రాత్రి పది గంటలకు రేడియో నివేదిక నేను తయారు చేయాలి. నాకు సహాయకుడిగా ఆరవేటి శ్రీనివాసులు వచ్చాడు. దాదాపు ఆ రాత్రి ఎనిమిది గంటల సమయం వరకూ సభ జరిగింది. అందులో కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలకు చెందినవారు, జిల్లా కలెక్టరు పాల్గొన్నారు. ఆఫీసుకొచ్చి 8.30 నుండి 9.30 వరకూ నివేదిక తయారు చేశాం. మధ్య మధ్యలో వ్యాఖ్యానం నేను తొలిసారిగా చేసే అవకాశం వచ్చిందని సంతోషించాను. కానీ…
ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఓ సంఘటన జరిగింది.
నేను, శ్రీనివాసులు మధ్య మధ్య లింకింగ్ సంభాషణలు వ్రాస్తున్నాము. “కడప రామకృష్ణ మందిరంలో ఈ సాయంకాలం 20 సూత్రాల ఆర్థిక ప్రణాళికపై సభ జరిగింది. అధ్యక్షులుగా జిల్లా కలెక్టరు పి.యల్. సంజీవరెడ్డి వ్యవహరించారు”. ఆయన గొంతు వినిపించాలి. చివరగా మాట్లాడిన కమ్యూనిస్టు పార్టీకి చెందిన యన్. శివరామిరెడ్డి గూర్చి వ్రాయాలి. ఆరవీటి శ్రీనివాసులు నాకో సలహా ఇచ్చాడు.
“సార్! కమ్యూనిస్టు పార్టీ పేరు మనం చెప్పకూడదు, కేవలం యన్. శివరామిరెడ్డి అని చెప్పండి” అన్నాడు.
ఈ పరిభాషలో ఏ, బి, సి, డి. లు కూడా తెలియని నేను ఆయన మాటను వేదవాక్కుగా భావించి అలానే రికార్డు చేశాం.
మర్నాడు నిత్యం జరిగే ప్రోగ్రాం మీటింగ్‌లో టి.ఆర్. రెడ్డి నా గొంతు రేడియోకి సరిపోతుందని మెచ్చుకొన్నారు.
అయితే ఆ కథ అంతటితో ఆగలేదు. వారం రోజుల్లో ఢిల్లీ నుండి ఒక తాఖీదు వచ్చింది. కడప పార్లమెంటు సభ్యులు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, నిజాయితీకి మారుపేరు అయిన ఎద్దుల ఈశ్వరరెడ్డి ఆకాశవాణి డైరక్టర్ జనరల్ కార్యాలయానికి ఓ కంప్లయింట్ చేశారు. కమ్యూనిస్టు పార్టీ పేరును ప్రస్తావించకపోవడం దురుద్దేశపూర్వకమని వ్రాశారు.
దానికి నా సంజాయిషీ మౌఖికంగా అడిగారు. నేను శ్రీనివాసులు అలా అన్నాడని చెప్పక తప్పలేదు. మొతానికి కేంద్రం నుండి తగిన రీతిలో సమాధానం పంపారు. ఆ ఉపాఖ్యానం ముగిసింది.
సెప్టెంబరు 5న తొలి ప్రసంగం ప్రసారం చేద్దామని నిర్ణయించాం. ఆరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాధాకృష్ణన్‌పై కడప ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. దయానిధి చేత ప్రసంగం చేయిద్దామని ఆలోచించాము. ఆయనకు ఫోన్ చేయమని మా డైరక్టర్ చెప్పారు.
కళాశాల ప్రిన్సిపాల్‌తో నేరుగా ఫోన్లో మాట్లాడటమా?
నాకు బెరుకుగా ఉంది. నెంబరు తీసుకుని డయల్ చేశాను.
నేరుగా ఆయనే మాట్లాడారు. ఫోన్లో ప్రిన్సిపాల్‌తో మాట్లాడడం నాకు తొలిసారి. రేడియోలో మాట్లాడటం ఆయనకు తొలిసారి. వెంటనే అంగీకరించారు. 1967 సెప్టెంబరు 5న యూనివర్సిటీలో నా తొలి ప్రసంగం. మళ్ళీ 1975 సెప్టెంబరు 5న కడప రేడియోలో నేను రూపొందించిన తొలి ప్రసంగ ప్రసారం.
(మళ్ళీ కలుద్దాం).