ఆకాశవాణి పరిమళాలు-30

1
6

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

సుడి గుండాల సంవత్సరం 2000:

[dropcap]నే[/dropcap]ను 20వ శతాబ్ది ద్వితీయార్ధంలో పెరిగిన వ్యక్తిని. 1947 జనవరిలో పుట్టాను. 1967లో ఎం.ఏ పూర్తి చేసి కళాశాల అధ్యాపకుడిగా చేరాను. 1977 నాటికి ఆకాశవాణిలో రెండేళ్ళు పూర్తి చేశాను. 1987లో యు.పి.యస్.సి. ద్వారా స్టేషన్ డైరక్టర్‍ని అయ్యాను. 1997న ఢిల్లీ ఆకాశవాణి డైరక్టరుగా విజయకేతనం ఎగురవేశాను. 20 వ శతాబ్ది చివరి సంవత్సరం 2000లో రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి.

2000 మార్చి:

2000 సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరులో రామ్‌మనోహర్ లోహియా హాస్పిటల్‌కి చెకప్‌కి వెళ్ళాను. అక్కడ డా. రామకృష్ణన్ కార్డియాలజీ విభాగాధిపతి. ఆయనకు ఆకాశవాణి అంటే ‘ఎలెర్జీ’ అని తర్వాత తెలిసింది. ఆయన అమ్మగారు రేడియో ఎనౌన్సర్‌గా పనిచేశారు. ఉద్యోగంలో ఆమెకేవో ఇబ్బందులు కలిగాయి. అందుకని ఆకాశవాణి వాళ్ళంటే గిట్టదు. చిటపటలాడేవాడు. ఆ రోజు నాకు యాంజియోగ్రాఫ్. వచ్చేవారం తీసుకోవాలని వ్రాసి యిచ్చాడు. అదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కృష్ణమణి (తెలుగువాడు) పి.బి.శ్రీనివాస్ అల్లుడు. సంగీత ప్రొఫెసర్ ఇందిరా జగదాచారి కుమారుడు. యాంజియోగ్రామ్ సమయంలో ఆయన కూడా వున్నాదు. ఒక ఫిల్మ్ తీసి నాకిచ్చారు. గుండెలో మూడు బ్లాక్‌లు ఉన్నాయి. రెండు 80 శాతం, ఒకటి 70 శాతం కాబట్టి బైపాస్ సర్జరీ చేయించుకోమని డా. రామకృష్ణన్ నాకు సలహా ఇచ్చారు. సలహా ఇవ్వడమే గాదు, వెంటనే అపోలో ఆసుపత్రి (ఢిల్లీ)కి ఫోన్ చేసి హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణులు డా. జె.ఎస్. వృద్ధికి స్వయంగా ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొన్నారు.

ఎప్పుడూ చిటపటలాడే ఆయన ఆరోజు ప్రవర్తన ఆశ్చర్యం వేసింది. తర్వాత తర్వాత తెలిసింది – అపోలో ఆసుపత్రికి రిఫర్ చేసిన డాక్టరుకు అపోలో వాళ్ళు ఘనంగానే మొత్తం జమ చేస్తారని. నేను సిజిహెచ్ఎస్ స్కీము కింద వైద్య సౌకర్యాలకు అర్హత ఉన్నవాదిని.

2000 మార్చి 10వ తేదీన అపోలో ఆసుపత్రికెళ్ళాము. మర్నాడే చేరిపొమ్మని సూచించారు. మా పెద్దబ్బాయి రమేష్ అమెరికా టూర్‌లో ఉన్నాడు, వెంటనే మర్నాడు ఢిల్లీ చేరుకున్నాదు. చిన్నవాడు జనార్ధన్ బెంగుళూరు నుంచి ఢిల్లీకి ఆ సాయంకాలం విమానంలో వచ్చాడు.

2000 జనవరి నెలలో అపోలో ఆసుపత్రుల అధిపతి డా. ప్రతాపరెడ్డి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రానికి ఇంటర్వ్యూకి వచ్చారు. పరిచయమయ్యారు. వారికి నా అడ్మిషన్ గురించి ఫోన్‍లొ చెప్పాను. నేను సిజిహెచ్‌ఎస్ చెల్లింపు పథకంలోకి వస్తాను. మా ఆఫీసువాళ్ళు ఆపరేషన్ (బైపాస్ సర్జరీ) ఖర్చులు రెండు లక్షలకు పైగా శాంక్షన్ చేశారు. మార్చి 12న డా. వృద్ధి ఆపరేషన్ జయప్రదంగా చేశారు. వారం రోజులు హాస్పిటల్‍లో ఉన్నాను. ప్రతాపరెడ్డి గారు స్వయంగా నా రూమ్‌కి వచ్చి నా వార్దు ఎగ్జిక్యూటివ్ రూమ్ హోదాకి అప్‌గ్రేడ్ చేయించారు. ఆయన నా రూమ్‌కి రావడంతో మిగతా సిబ్బంది నన్ను జాగ్రత్తగా చూశారు.

నాతో బాటు సీనియర్ జర్నలిస్ట్ (లక్నో) త్రివిక్రమరావు కూడా పక్కవార్డులో రెండు రోజులు ఉన్నారు. నేను 45 రోజులు సెలవు పెట్టాను. నేను సెలవు పెడితే ఢిల్లీ వాణిజ్య ప్రసార విభాగ డైరక్టర్ అదనపు చార్జీ తీసుకోవడం ఆనవాయితీ. ఆయన సెలవు మీద వెళ్తే ఆ బాధ్యత నాకప్పగించేవారు.

మార్చి నెలాఖరుకల్లా ఆరోగ్యం కుదుటపడింది. పనిలేకుండా ఇంట్లో కూర్చోలేకపోయాను. సెలవు రద్దు చేసుకుని ఏప్రిల్ రెండో వారంలో డ్యూటీకి చేరాను. “విశ్రాంతి తీసుకోలేకపోయారా?” అని మా డి.డి.జి. గైక్వాడ్ రెండు సార్లు సూచించారు. ఆయన ఆసుపత్రికి వచ్చి చూచి వెళ్ళారు. ఆ తర్వాత రెండి మార్లు మా క్వార్టర్‌కి కూడా వచ్చారు.

నేను సెలవు నుంచి రాగానే మరో విభాగానికి – టెన్షన్ లేని చోటకి – మారుస్తారేమోననుకొన్నాను. కాని ఢిల్లీ కేంద్రంలోనే వుంచారు. 2000 జూన్ మధ్యలో ఒకరోజు గైక్వాడ్ (డి.డి.జి.) నన్ను పిలిచారు. “మీరు శ్రమ తట్టుకోలేరు. తేలికగా వుండే నేషనల్ ఛానల్ డైరక్టరుగా వేస్తాను – ఇష్టమేనా? అక్కడ కూడా మీకు ప్రత్యేక కారు వుంటుంది. డైరక్టరేట్‌లో అయితే వుండదు” అన్నారు.

నేను వెంటనే అంగీకరించలేదు. “మరికొద్ది నెలల్లో నాకు డి.డి.జి. ప్రమోషన్ వస్తుంది గదా సార్! అప్పుడు ఎటూ మారక తప్పదు” అన్నాను.

“మన మిత్రుడు పి.పి.సేథియా (సి.బి.యస్. డైరక్టరు) ఈ డిసెంబరు నెలాఖరుకు రిటైరవుతున్నారు. కనీసం ఆరు నెలలైనా ఢిల్లీ కేంద్ర డైరక్టరుగా పనిచేయాలని ఉబలాటపడుతున్నాడు. మీరు అంగీకరిస్తే….” అంటూ నీళ్ళు నమిలాడు.

అప్పుడర్థమైంది. వాళ్ళిద్దరూ ‘థిక్ ఫ్రెండ్స్’. ఈ మిషతో ఆయనకు సహాయం చేయాలనుకొంటున్నాడు గైక్వాడ్. “మీ ఇష్టం సార్” అన్నాను విధి లేక.

నేషనల్ ఛానల్ అధిపతిగా (2000 జూన్):

నేను ఆకాశవాణి అన్ని విభాగాలలోనూ పనిచేశాను. ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరక్టర్, డైరక్టర్‌గా మెయిన్ స్టేషన్లలో, వాణిజ్య ప్రసార కేంద్రంలో, శిక్షణా కేంద్రంలొ, జిల్లా కేంద్రం (అనంతపురం)లో, కొత్త స్టేషన్ ప్రారంభంలో (కొత్తగూడెం), రాజధాని కేంద్రంలో (హైదరాబాద్), దేశ రాజధాని కేంద్రంలో, డైరక్టరేట్‌లో పనిచేశాను – మొత్తం 25 సంవత్సరాల సర్వీసులో. ఇప్పుదు నేషనల్ ఛానల్ డైరక్టర్ పదవితో ఆ వెలితి కూడా తీరిపోయింది.

దేశవ్యాప్తంగా ప్రసారాలు అందించాలనే ఏకైక లక్ష్యంతో 1980లో నేషనల్ ఛానల్ ప్రారంభించారు. జి. గురురాజ్ మొదటి డైరక్టరు. దాని ఆఫీసు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో. వెయ్యి కిలోవాట్ల అత్యంత శక్తివంతమైన ట్రాన్స్‌మిటర్ నాగపూర్‌లో పెట్టారు. రాత్రి 12 గంటలు నిర్విరామంగా ప్రసారం చేస్తుంది.

నాకు ముందు ఆ పదవిలో 1976లో నాతో పాటు ప్రొడ్యూసర్‌గా ఢిల్లీలో శిక్షణ పొందిన శ్రీమతి సుర్‍జిందర్ కౌర్ పనిచేస్తున్నారు. ఆమె నుండి నేను జూన్ 30, 2000 నాడు ఛార్జి తీసుకున్నాను.

అదొక కొత్త అనుభూతి. దాని కార్యక్రమ రూపకల్పన అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. పని భారం తక్కువ. ఢిల్లీ స్టేషన్‍లో వుండే హడావిడి ఉండదు.

ఢిల్లీ కేంద్ర సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. నా పనితీరును హృదయపూర్వకంగా అభినందించారు. ఒక రకంగా నాకు ఈ విశ్రాంతి బాగా అవసరమైంది.

ఆగస్టు 1990లో అనంతపురం స్టేషన్ డైరక్టర్‌గా వెళ్ళినది మొదలు 2000 జూన్ వరకు ఒక దశాబ్ది పాటు అహరహం ఆయా స్టేషన్ల కార్యక్రమ రూపకల్పనకు శ్రమించాను. నాతో బాటు కార్యక్రమ నిర్వాహకులను కూడా ఉత్సాహపరిచాను. అనంతపురం, కడప, విజయవాడ, ఢిల్లీ – నాలుగు కేంద్రాలు ఒక దశాబ్ది కాలంలో పనిచేయడం ఒక సదవకాశం. నాకు తోడ్పడిన సిబ్బందికి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను. నాకు పి.ఎ.లుగా పనిచేసిన వ్యక్తులు నా పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు కనబరిచారు. అనంతపురంలో సురేంద్ర, కడపలో భవానీ ప్రసాద్, విజయవాడలో లక్ష్మి, ఢిల్లీలో సత్నామ్ కౌర్ మరియు శ్యామావతీ పాఠక్. ఇలా వారినందరినీ అభినందిస్తున్నాను.

పితృవియోగం – 2000 ఆగస్టు:

మా నాన్నగారు లక్ష్మీకాంతరావు బహుపురాణ శాస్త్రవిదుడు. స్వయంగా పదెకరాల పొలం చెన్నూరులో (బుచ్చిరెడ్డిపాళెం) వ్యవసాయం చేశారు. మా అమ్మ శారదాంబకు నేను ఏకైక సంతానం. గారాబం చేసి నన్ను పాడుచేయలేదు. 1997 అక్టోబరులో నేను ఢిల్లీ వెళ్ళడం వారికి అసౌకర్యంగా తోచింది. కాని, నా అభివృద్ధి దృష్ట్యా సహకరించారు. 1999 చివరిభాగంలో చెన్నూరు కాపురం కట్టిపెట్టి ఇద్దరూ నా దగ్గరకే వచ్చారు.

మా నాన్నగారికి మూత్ర సంబంధ వ్యాధి 20 ఏళ్ళుగా బాధించింది. అప్పుడప్పుడు మూత్ర విసర్జన కష్టమయ్యేది. బుచ్చిరెడ్డిపాళెం ఆర్.ఎం.పి. డా. పి. సీతారామయ్య మూత్రనాళంలో కడ్డీ వేసి మూత్ర విసర్జనకు దోహదం చేసేవారు. ఢిల్లీ వచ్చిన తరువాత ఎయిమ్స్ లోనూ, ఆర్.ఎం.ఎల్. ఆసుపత్రిలోనూ, హైదరాబాదులో గాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. నాగేశ్వరరెడ్ది వద్ద ఎన్నోసార్లు చికిత్సలు, ఆపరేషన్ చేయించుకున్నారు.

2000 ఆగస్టు శ్రావణమాసం మంగళవారం. కొత్త కోడలు పద్మ ఢిల్లీలో వాళ్ళ అమ్మగారింట్లో నోము నోచుకోడానికి వచ్చి ఆ సాయంత్రం పండోరా రోడ్‌లో మమ్మల్ని కలవడానికి వచ్చింది. ఆ రోజు ఉదయమే నేను వాల్మీకి రామాయణం ఏడు కాండలు చదవడం పూర్తి చేసి మంగళహారతి ఇచ్చి మా నాన్నగారికి చూపించాను. సంతోషించారు.

2వ తేదీ సాయంకాలం నాలుగు గంటలకు సడన్‍గా స్పృహ తప్పి పడిపోయారు. మర్నాడు రామ్ ‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. 3, 4 తేదీలలో వెంటిలేటర్‌పై ఉన్నారు. 5వ తేదీ శనివారం వెంటిలేటర్ తీసేశారు. కన్నుమూశారు.

ఆ సాయంకాలం యమునా గంగా సంగమ స్నానం శవానికి చేయించి ఢిల్లీలో దహన సంస్కారాలు జరిపించాము. ఆ రోజు అదృష్టవశాత్తు వచ్చిన పురోహితుడు వెంకట్రామన్ 1984లో ఇందిరాగాంధీ దహన సంస్కారాలు చేయించిన ఘనులు. రెండో రోజు అస్థి సంచయనం. నాలుగో రోజు హరిద్వార్ వెళ్ళి అస్థి నిమజ్జనం చేసి వచ్చాను. మర్నాడే సెలవు మీద మా గ్రామం చెన్నూరు వెళ్ళి 9, 10, 11 రోజుల కర్మక్రతువులు శ్రద్ధాభక్తులతో చేశాను. పత్యక్ష గోదానము, భూదానము చేశాను. బంధువులంతా వచ్చి ఆశీర్వదించారు. చివరి రోజు మా తండ్రిగారికి ఇష్టమైన హరికథ – పి. వామనమూర్తి (బుచ్చి) చేత చెప్పించాను. ఏటా మా నాన్నగారి పేర ఒక పండితుడిని సత్కరించే కార్యక్రమం గత 18 ఏళ్ళుగా కొనసాగిస్తున్నాను. ఈ అవార్డు అందుకొన్నవారిలో యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రావూరి భరద్వాజ, కె.వి.రమణాచారి, ధారా రామనాథ శాస్త్రి, ఇలపావులూరి పాండురంగారావు, పొన్నాల రామసుబ్బారెడ్డి ప్రముఖులు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here