[box type=’note’ fontsize=’16’] అనంతపద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
నా సాహితీ పరిచయాలు:
నేను 1975 ఆగస్టు 16న కడప ఆకాశవాణి గడపలో అడుగు మోపాను. అంతకు ముందు నా సాహితీ పరిచయాలు నెల్లూరు, ఒంగోలు జిల్లాలకే పరిమితం. ఆకాశవాణిలో ప్రసంగాలకు రాయలసీమ నాలుగు చెరుగుల నుండి ఆహ్వానించడం నా డ్యూటీ. అందువల్ల పలువురు సాహితీ ప్రముఖులతో ప్రగాఢ పరిచయం ఏర్పడింది. 30 సంవత్సరాల ప్రసారభారతి సర్వీసులో వేలమంది సాహితీవేత్తలతో కలసి మెలసి తిరిగాను. ఆ పేర్లు అన్నీ ఉదహరిస్తే అదొక సాహిత్య ఓటర్ల లిస్టు కాగల ప్రమాదం వుంది. వారితో నా అనుబంధాన్ని రెండు, మూడు వాక్యాలలో చెప్పకపోతే రక్తిగట్టదు. విస్తృతంగా వ్రాస్తే ఆధునిక సాహిత్య చరిత్ర కాగలదు. అలాంటి దిగ్దంతులతో సమ స్కందంగా స్టేజి మీద కూచునే అవకాశాన్ని ఆకాశవాణి నాకిచ్చింది. అందుకే దాన్ని ‘అవకాశవాణి’ అంటాను. కవులు రేడియోలో ప్రసంగించే అవకాశమిచ్చిన వాణి.
కడప జిల్లా:
జిల్లాల వారీగా నా పరిచయ పరిమళాలు పంచుకొంటాను. మతిమరపున కొందరిని మరిచిపోవచ్చు. క్షంతవ్యుణ్ణి. ముందుగా కడప జిల్లాతోనే ప్రారంభిస్తాను. కడప అనగానే ఒక సాహితీ విరాన్మూర్తి పుట్టపర్తి నారాయణాచార్యులు గుర్తుకు వస్తారు. మొదటి వారంలోనే నేను పుట్టపర్తి వారింటికి మోచంపేట వెళ్లి నన్ను పరిచయం చేసుకున్నాను. వారి ధర్మపత్ని కనకమ్మ కవయిత్రి. పలుమార్లు వారితో సాహితీ గోష్ఠులలో పాల్గొన్నాను. నా హరివంశానికి వారు పీఠిక వ్రాశారు. 1976లో నా అష్టావధాన సభకు వారు అధ్యక్షత వహించి (కడప ఆర్ట్స్ కళాశాలలో) అవధానాలు వదిలి గ్రంథ రచనపై దృష్టి పెడితే శాశ్వత కీర్తి లభిస్తుందని సలహా ఇచ్చారు. తర్వాత రెండు, మూడు అవధానాలు చేసి ఆ అవధాన ప్రదర్శనలకు స్వస్తి పలికాను. పుట్టపర్తి వారి తనయ నాగపద్మిని మంచి రచయిత్రి. పుట్టపర్తి వారిపై నేను ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రికలలో వ్యాసాలు వ్రాశాను.
ప్రొద్దుటూరులో గడియారం శేషశాస్త్రి వార్ధక్యంలో వుండి మా స్టూడియోకి రాలేని స్థితిలో వున్నారు. నేను రికార్డింగ్ యూనిట్‌తో వెళ్ళి “నా జీవితంలో మధుర క్షణాలు” అనే ప్రసంగం రికార్డు చేసి ఆర్కైవ్స్‌లో భద్రపరిచాను. వారి జీవిత విశేషాల ఇంటర్వ్యూని పొత్తూరి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకులుగా వుండగా సాహిత్యప్రభలో ప్రచురించాను. ఆ శీర్షికలో 15 వారాలు 15 మంది కవుల పరిచయాలు వ్రాశాను. ప్రొద్దుటూరు అనగానే సి.వి. సుబ్బన్న శతావధాని, నరాల రామారెడ్డి, రాజన్న కవి, షడ్దర్శనం సోమ సుందర శర్మ, గంటి కృష్ణవేణమ్మ గుర్తుకు వస్తారు. ప్రొద్దుటురు ఓరియంటల్ కాలేజీలో నేను 1976లో అష్టావధానం చేశాను. యల్లంరాజు శ్రీనివాసరావు అధ్యక్షులు. వారు, నేను కందుకూరు కళాశాలలో అధ్యాపకులం.
కడపజిల్లా రచయితల సంఘం బాధ్యతలు తలకెత్తుకున్న వ్యక్తులు ఇద్దరు. ఒకరు – మల్లెమాల వేణుగోపాల రెడ్డి (అధ్యక్షులు), మరొకరు జానమద్ది హనుమచ్ఛాస్త్రి (కార్యదర్శి). వీరు 1976లో కడప జిల్లా రచయితల సంఘ సభలు నిర్వహించారు. ఆంధ్ర దేశం నలుమూలల నుండి కవిపండితులు వచ్చారు. నేను వ్రాసిన ‘ప్రకృతికాంత’ను డా. బెజవాడ గోపాలరెడ్డి ఆవిష్కరించారు.
బ్రౌన్ గ్రంథాలయాన్ని క్షణక్షణాభివృద్ధి చేసిన ఘనుడు ‘బ్రౌన్ శాస్త్రి’గా పేరొందిన హనుమచ్ఛాస్త్రి. భూతపురి సుబ్రహ్మణ్యశర్మ మహాకవి, శతావధాని. కేతు విశ్వనాథ రెడ్డి గ్రామనామాలపై పరిశోధన చేసిన కథకులు. మేమిద్దరం కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులం. ఆంగ్లాధ్యాపకులు వై. హరే రామమూర్తి లలితగీతాల రచయిత. వైశ్య ప్రబోధిని పత్రికను నాలుగు దశాబ్దులు నడిపిన పి. లక్ష్మీకాంత గుప్త చక్కని సంపాదకుడు. వారికి 2003లో మా నాన్నగారి పేర అనంత లక్ష్మీకాంత సాహితీ పురస్కారం ఢిల్లీలో అందించాను. పాలా వెంకట సుబ్బయ్య మంచి కవి. కోడూరు కళాశాల ప్రిన్సిపల్ రంగారెడ్డి, తక్కోలు మాచిరెడ్డి, సంజీవమ్మ దంపతులు – ఇలా ఎందరో కవి పండిత మిత్రులు.
చిత్తూరు జిల్లా:
నా ఎం.ఎ. చదువు 1965-67 మధ్య శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో కొనసాగింది. 1965 జూన్‌లో పింగళి లక్ష్మీకాంతం రిటైరయ్యారు. జి.యన్.రెడ్డి తెలుగు శాఖాధిపతి అయ్యారు. మా గురు స్మరణ చేస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆచార్య జీరెడ్డి చెన్నారెడ్డి, ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి, ఆచార్య జాస్తి సూర్యనారాయణ, డా. తిమ్మవజ్ఘల కోదండరామయ్య, పంగనామల బాలకృష్ణమూర్తి మాకు రెండేళ్ళు పాఠాలు చెప్పి నన్ను ఇంతవాణ్ణి చేశారు.
అప్పుడు తెలుగు శాఖలో అధ్యాపకులుగా డా. మద్దూరి సుబ్బారెడ్డి, జి. నాగయ్య, యస్. అక్కిరెడ్డి పని చేస్తున్నారు. పరిశోధక విద్యార్థులుగా తంగిరాల వెంకట సుబ్బారావు, ప్రసాదరాయ కులపతి, వి. రామచంద్ర చౌదరి, యల్.బి. శంకరరావులు ఉన్నారు. మా బ్యాచ్‌లో బండ్లమూడి సత్యనారాయణ, ఉషారాణి, మనోజ, యు. శ్రీరామమూర్తి, భాస్కర శేషారత్నం, సునందిని అధ్యాపకులుగా కళాశాలల్లో పనిచేశారు.
ఆంగ్లశాఖ ప్రొఫెసర్‌గా యం.వి.రామశర్మ, హిస్టరీ విభాగంలో పదవీ విరమణ చేసిన మారేమండ రామారావు, వి.యం. రెడ్ది ప్రభృతులున్నారు. ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తమ కుమారుడు జయంత్ వద్ద వార్ధక్య జీవనం కొనసాగిస్తున్నారు.
కుప్పం విశ్వవిద్యాలయంలో పి. సుబ్బాచారి జానపద పరిశోధనాచార్యులు. డా. శ్రీదేవి తెలుగు శాఖాధ్యక్షులు. రిజిస్ట్రార్ బి. తిరుపతిరావు ఆంగ్ల పరిశోధకులు.
నేను ఆకాశవాణిలో చేరడాన్ని మా ప్రొఫెసర్ జి.యన్. రెడ్డి బహుధా ప్రశంసించి అభినందించారు. నా చేత యూనివెక్స్‌లో 1973లో అష్టావధానం చేయించారు. తెలుగు ఎం.ఎ. చేసినవారు అధ్యాపక వృత్తికి భిన్నంగా వేరే ఉద్యోగాలలో కూడా ప్రవేశించవచ్చుననడానికి నన్ను ఉదాహరణగా చెప్పేవారు. ఆకాశవాణికి మేము తొలిసారిగా పరిచయం చేసిన వ్యక్తి పులికంటి కృష్ణారెడ్డి. ఆయన ఆకాశవాణి కుటుంబానికి సన్నిహితుడు. ఢిల్లీ పెద్దలకు తిరుమలేశుని దర్శనం చేయించడానికి ఆయన మార్గదర్శి. మూడు దశాబ్దులు అయనతో నా ప్రగాఢ పరిచయం. 2007లో నా షష్టిపూర్తి ఉత్సవాలు కృష్ణారెడ్డి ఘనంగా జరిపించాడు. ఆయన కుమార్తె అమృత, అల్లుడు రాఘవరెడ్డి ఆకాశవాణి ఉద్యోగులు.
రాయలసీమ ఆకాశవాణి కొత్తగా పూర్తి స్థాయి ప్రసారాలతో 1975లో వచ్చింది. వెంటనే నేను చేరాను. అందువల్ల ఎందరినో రేడియోకి పరిచయం చేశాను. ప్రాతఃస్మరణీయులు మధురాంతకం రాజారామ్. గొప్ప కథకులు. వారికి 1996లో అప్పాజోశ్యుల విష్ణుభొట్ల పురస్కార సభ విజయవాడలో జరిగిన సభలో నేనూ మాట్లాడాను. చిత్తూరులో కె. సభా, పి. రాజగోపాలనాయుడు, భాస్కర చౌదరి, యం.ఆర్. చ్రంద్ర, కలవకొలను సదానంద ఆ తరం రచయితలు.
మన్నవ భాస్కర నాయుడు, సింగరాజు సచ్చిదానందం, పణతుల రామచంద్రయ్య, వడ్డెర చండీదాస్, మధురాంతకం నరేంద్ర, ప్రజావాహిని పత్రిక సంపాదకులు సిద్ధయ్య నాయుడు, అగరాల ఈశ్వర్ రెడ్డి, మాడబుషి అనంతశయనం అయ్యంగార్లను రేడియోకి పరిచయం చేశాను. సముద్రాల నాగయ్య ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, పి.వి.ఆర్.కె. ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, చెలికాని అన్నారావు బోర్డు అధ్యక్షులు.
ఆచంట జానకీరామ్, శారదాదేవి దంపతులు కె.టి. రోడ్డు తిరుపతిలో వుండేవారు. వారిని నేను ఇంటర్వ్యూ చేశాను. కొంపెల్ల దక్షిణాముర్తి, కె.యస్.ఆర్. దత్త, డి. శ్రీధర్ బాబు, శ్రీమన్నారాయణ, యస్.బి. రఘునాధాచార్య, యం.డి. బాల సుబ్రహ్మణ్యం, సుదర్శన శర్మ, రామకృష్ణమాచార్యులు, రామసూర్యనారాయణ, సముద్రాల లక్ష్మణయ్య, డి. నాగ సిద్ధారెడ్డి, ముదివర్తి కొండమాచార్యులు, శైలకుమార్ తిరుపతిలో మా ప్రసంగకర్తలు.
మదనపల్లెలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ఆర్.యస్. సుదర్శనం – వసుంధరా దేవి దంపతులు, యం.వి. నారాయణ శర్మ, టి.యన్.అనసూయాదేవి ప్రభృతులు ఆకాశవాణికి విచ్చేశారు.
తిరుపతి విశ్వవిద్యాలయ ఉపకులపతిగా వ్యవహరించిన కొత్త సచ్చిదానందమూర్తి గొప్ప వేదాంతవేత్త. గోపాలరెడ్డిగారు తిరుపతి వచ్చినప్పుడు వారి బంగళాలో గోష్ఠిలో నేనూ పాల్గొన్నాను. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్స్‌లర్ వనజా అయ్యంగారు, సరస్వతి, మొన్నమొన్నటి భవాని వరకు మా ఆకాశవాణి మిత్రులే. ఈ తరం వారైన వి.వి. రమణారెడ్డి, పి. సి. వెంకటేశ్వర్లు, మధుజ్యోతి, ద్వారంలక్ష్మి, వైస్ ఛాన్స్‌లర్ శతపథి, భూమన్ దంపతులు ప్రసిద్ధులు.
అనంతపురం జిల్లా:
సుప్రసిద్ధ కవిశేఖరుల పుట్టినిల్లు ఈ జిల్లా. రెండు విశ్వవిద్యాలయాలున్న జిల్లా. సత్యసాయి విశ్వవిద్యాలయం (పుట్టపర్తి); శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. పుట్టపర్తిలో వైస్ ఛాన్స్‌లర్‍గా ఆర్. సంపత్ నాకు బాగా పరిచితులు. సత్యసాయి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా. వై. హేమలత విద్వన్మణి. రెండు విశ్వవిద్యాలయాలు 1981లో ఒకే రోజు ప్రారంభమయ్యాయి. రెండు సభలూ నేను రికార్డు చేశాను.
ప్రముఖ కవి పండితులందరు నాకు సన్నిహితులు. పైడి లక్ష్మయ్య, బెళ్ళూరి శ్రీనివాసమూర్తి, ఆశావాది ప్రకాశరావు (పెనుగొండ). కుంటిమద్ది శేషశర్మ, పప్పూరి రామాచార్యుల తనయులు, మాడుగుల నాగఫణిశర్మ, బత్తుల వెంకట్రామిరెడ్డి, ఏలూరి యంగన్న, పమిడికాల్వ చెంచు సుబ్బయ్య, నారాయణశర్మ, హిందూపురంలో కల్లూరి అహోబలరావు, రాఘవేంద్రరావు, కాశీపతి, లేపాక్షి, అధ్యాపకులు గోపీనాథ్, రామశేషయ్య, నరసింహమూర్తి, రచయితల సంఘం సభ్యులు. మరెందరో కథకులు – శాంతినారాయణ, సింగమనేని.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్లు నాకు బాగా పరిచితులు. తొలి డైరక్టరు యస్. శ్రీదేవి, యం. ఏబెల్, కె. వెంకటరెడ్డి, యం.జె. కేశవమూర్తి మిత్రులు. తెలుగు శాఖను పరిపుష్ఠం చేసిన తుమ్మపూడి కోటేశ్వరరావు, కోరాడ మహాదేవశాస్త్రి, శలాక రఘునాథశర్మ, హెచ్.యస్.బ్రహ్మానంద, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, పి.యల్. శ్రీనివాసరెడ్డి, దేవకి, బుడ్డన్న, శేషశాస్త్రి (కన్నడం) మా ప్రసంగాలకు వచ్చారు. నేను పి.హెచ్.డి. పరీక్షాధికారిగా ఉన్నాను. మూడేళ్ళు (1990-93) అనంతపురం ఆకాశవాణిలో పనిచేశాను.
కర్నూలు జిల్లా:
కర్నూలు సిల్వర్ జుబ్లీ కళాశాల ప్రసిద్ధం. అక్కడ అధ్యాపకులు మా ఆకాశవాణి ప్రసంగాలకు విచ్చేశారు. అప్పజోడు వెంకట సుబ్బయ్య, యం.డి. వెంకట సుబ్బయ్య, వి. వి. శర్మ, రాపాక ఏకాంబరాచార్యులు, వసంతా ప్రకాశ్, లైబ్రేరియన్ రోశయ్య ప్రభృతులు. కర్నూలు రచయితల సంఘం చక్కగా కార్యక్రమాలు జరిపేది.
సాహితీ సదస్సు పేరుతో వెంకట సుబ్బయ్య సభలు జరిపారు. నేను రుద్రకవిని గూర్చి ప్రసంగించాను. నంద్యాలలో గొట్టుముక్కల సుబ్రమణ్యశాస్త్రి సూరన సాహిత్య పీఠం నెలకొల్పి సభలు జరిపారు. నేను సూరన గూర్చి మాట్లాడాను. కలుగోట్ల విజయాత్రేయ చక్కని పద్యకవి. ప్రస్తుతం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య బోదాటి వెంకటేశ్వర్లు మంచి పరిశోధకులు.
రాయలసీమ కవిపండిత నిలయం. నా సర్వీసులో 12 ఏళ్ళు కడప, అనంతపురాలలో పనిచేశాను. ఎందరో కవి పండితులయ్యారు. కొందరు అసూయాగ్రస్తులు నాపై ద్వేషం పెంచుకున్నారు. తర్వాత వారే పశ్చాత్తాపపడి మైత్రిని కొనసాగించారు. ఇప్పటికీ నేను రాయలసీమలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సహృదయ మిత్రులు నన్ను ఆదరంగా చూస్తారు, ఆతిథ్యమిస్తారు. ఆనందంగా గడుపుతాం.
(సశేషం)