ఆకాశవాణి పరిమళాలు-4

    0
    8

    [box type=’note’ fontsize=’16’] డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

    [dropcap]ప్ర[/dropcap]సార భారతిలో నా 30 ఏళ్ళ సర్వీసులో (1975-2005) కడప ఆకాశవాణిలో మూడు పర్యాయాలు మొత్తం 10 సంవత్సరాలు పనిచేశాను. రాయలసీమకు ప్రసారాలు కొత్త. దిగ్దంతుల వంటి వ్యక్తులు, కవి పండితులు ప్రచార సాధనాలకు దూరంగా ఉండిపోయిన రోజులవి. 1975లో మూడు ప్రసారాలు ప్రారంభం కాగానే ప్రవచన శాఖ ప్రయోక్తగా (Spoken Word Producer) నా బాధ్యత ప్రతి రోజూ ఉదయం 6.40 నిమిషాలకు సూక్తి ముక్తావళి ప్రసారం చేయడం, వారానికొక సాహిత్య ప్రసంగం ఏర్పాటు చేయడం. అందుకుగా మూడు నెలలకొకసారి షెడ్యూలు తయారు చేసేవాణ్ణి.

    రాయలసీమ జిల్లాలు నాలుగింటినుంచి రచయితలను, కవి పండితులను ఆహ్వానించాం. అందులో ప్రధానులు – డా. పుట్టపర్తి నారాయణాచార్యులు, కుంటిమద్ది శేషశర్మ, కల్లూరి అహోబలరావు, అప్పజోడు వెంకట సుబ్బయ్య, సి.వి.సుబ్బన్న శతావధాని, నరాల రామారెడ్డి, యస్. రాజన్నకవి, మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, శంకరంబాడి సుందరాచారి, పులికంటి కృష్టారెడ్డి, గంటి కృష్ణవేణమ్మ, జె. భాస్కర చౌదరి, యల్లంరాజు శ్రీనివాసరావు, సింగరాజు సచ్చిదానందం, సముద్రాల లక్ష్మయ్య, సముద్రాల నాగయ్య, మేడసాని మోహన్, వి. అబ్దుల్ ఖాదర్, పుట్టపర్తి కనకమ్మ, పాలా వెంకట సుబ్బయ్య, బెళ్ళూరి శ్రీనివాసమూర్తి, జానమద్ది హనుమచ్ఛాస్త్రి, మల్లెమాల వేణుగోపాలరెడ్డి. వీరంతా సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానించబడ్డారు.

    శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నేను తెలుగు ఎం.ఏ. 1967లో చేశాను. అక్కడ హేమాహేమీలయిన ఆచార్యులు పనిచేస్తున్నారు. వారిని వీలు వెంబడి పిలిచాను. వారిలో ఆచార్య జి.యన్. రెడ్డి, జీరెడ్డి చిన్నారెడ్డి, మద్దూరి సుబ్బారెడ్డి, జి. నాగయ్య, ఆచార్య కోరాడ మహాదేవ శాస్త్రి, జాస్తి సూర్యనారాయణ తెలుగు శాఖకు చెందినవారు. ఇతర శాఖల నుండి ఆచార్య యం.వి. రామశర్మ, ఎం.జె. కేశవమూర్తి (రిజిస్ట్రారు), బి.ఆర్.కె.రావు, యన్. వెంకటయ్య, వి.యల్.యన్. రెడ్డి, ఫిలోమినా రాయపరెడ్డి తదితరులు ప్రసంగించారు.

    తిరుపతి సంగీత కళాశాల అధ్యాపకులు – నేదునూరి కృష్ణమూర్తి, డి. పశుపతి, ద్వారం భావనారాయణ, నూకల చిన సత్యనారాయణ, పుదుక్కొటై ఆర్. కృష్ణమూర్తి, పుదుక్కొటై రామనాథన్, ద్వారం విజయలక్ష్మి తదితర సంగీత విద్వాంసులు ఆకాశవాణి ప్రసారాలలో విరివిగా పాల్గొన్నారు.

    నేను ఘనంగా చెప్పుకోదగిన ఒకటి రెండు సన్నివేశాలు మనవి చేస్తాను. 1976లో ఆహుతుల సమక్షంలో జరిపే కవి సమ్మేళనానికి ప్రొద్దుటూరు నుండి గడియారం శేషశాస్త్రి గారికి ఆహ్వానం పంపాము. సమాధానం రాలేదు. తర్వాత రాజన్నకవి వచ్చారు. వారి నడిగాను. ఆరోగ్యం సరిగా లేకవారు రాలేదన్నారు. నేను వారి కుమారుడితో ఫోన్‌లో మాట్లాడాను. మా రికార్డింగ్ బృందంతో స్వయంగా వారింటికి వెళ్ళాను.

    ఆయన ఎంతో సంతోషించారు. ఇంటర్వ్యూ రికార్డు చేశాము. ‘నా జీవితంలో మధుర క్షణాలు’ అనే అంశంపై సంభాషణ కొనసాగింది. శీర్షికను రెండుగా ‘మధు రక్షణాలు’, ‘మధుర క్షణాలు’ అనే కొసమెరుపు మాటలతో ముగించారు. శివభారత రచన, శాసనమండలి సభ్యత్వం ప్రస్తావించారు. ఆయన కంఠస్వరం భద్రపరిచామనే ఆనందం నాకు కలిగింది.

    1977లో శంకరంబాడి సుందరాచారి కడప స్టూడియోకి వచ్చారు. తన కవితలు చదివారు. ‘నా దేశంరా! మహా మంచిదిరా!’ అనే దేశభక్తి ప్రపూరిత గేయం చదివారు. మళ్ళీ మూడు నెలలకు సూక్తి ముక్తావళిలో రామాయణ సూక్తులు రికార్డు చేయడానికి వచ్చారు. అద్భుతంగా మాట్లాడారు. చెక్ చేతికిచ్చాం. ‘డబ్బులు లేకుండా చెక్ ఎందుకు?’ అన్నారు. స్టేట్‌బ్యాంక్‌కి తీసుకెళ్ళి మేనేజర్‌ని కలిసి క్రాస్డ్ చెక్కు మార్పించాను.

    పుట్టపర్తి నారాయణాచార్యులను కలిసి వెళ్దామని శంకరంబాడి అన్నారు. మోచంపేటలో పుట్టపర్తి ఇంటి కెళ్ళాము. పుట్టపర్తి దంపతులు కావ్యగోష్ఠిలో ఉన్నారు. పుట్టపర్తి, శంకరంబాడి – ‘అన్నా!’ అంటూ గాఢంగా కౌగిలించుకొన్నారు. ఓ గంటసేపు మాట్లాడి వారి ఇంట్లోనే భోంచేసి, శంకరంబాడిని తిరుపతి బస్ ఎక్కించి వచ్చాను. ఆ తరువాత నాలుగో రోజు వారు 1977 ఏప్రిల్ 8 న తిరుపతిలో కన్ను మూశారని తెలిసి విచారించాము.

    నా అదృష్టం శంకరంబాడి సుందరాచారి జీవితచరిత్రను మోనోగ్రాఫ్‌గా రచించాను. సి.పి.బ్రౌన్ అకాడెమీ హైదరాబాద్ వారి కోరికపై ఆ గ్రంథం వ్రాశాను. ఆ సంస్థ అధిపతి యశస్వి మరణంతో ప్రచురణ ఆగిపోయింది. మండలి బుద్ధ ప్రసాద్ గారితో ఆ విషయం ఒక సభలో ప్రస్తావించాను. వారు ఎమెస్కో విజయకుమార్‌‌తో మాట్లాడి ఆ గ్రంథం వెలుగు చూసేలా చేశారు. శంకరంబాడిని ఉత్తరదేశానికి, లోకానికి పరిచయం చేయాలని నా సంకల్పం. ఆ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించాను. ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ సత్యనారాయణ ‘ప్రసార రంగ’ పక్షాన ప్రచురించారు. ఆ గ్రంథావిష్కరణ కుప్పం విశ్వవిద్యాలయంలో ఉప సభాపతి బుద్ధప్రసాద్ గారు చేయడం విశేషం.

    ఆకాశవాణి కడప పరిధిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్, పద్మావతీ విశ్వవిద్యాలయం చాలాకాలంగా పనిచేస్తున్నాయి. అక్కడి ఆచార్యులు, ఉపకులపతులు మా కేంద్రానికి తరచూ వచ్చి రికార్డింగు చేసేవారు. 1981 నవంబరులో పుట్టపర్తి సాయిబాబా జన్మదినోత్సవం రోజున పుట్టపర్తిలోను, అనంతపురంలోను రెండు విశ్వవిద్యాలయాలు జన్మించాయి. ఆ ప్రారంభోత్సవ సభలు రెంటింటినీ నేను రికార్డు చేసి రేడియో నివేదిక సమర్పించాను. అప్పటి విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం ఛైర్మన్ శ్రీమతి మాధురీ షా చేతుల మీదుగా రెండు విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి.

    కేంద్రంలో కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన యస్. చంద్రశేఖర్ సోదరి డా. యస్. శ్రీదేవి అప్పట్లో అనంతపురం పి.జి. సెంటర్ డైరక్టరుగా ఉన్నారు. ఆమె కడప కేంద్రానికి ఒక రికార్డింగుకు వచ్చారు. మాటల సందర్భంలో “మా యూనివర్సిటీ తెలుగు శాఖలో మీరు అధ్యాపకులుగా చేరితే బాగుంటుంది. ఇప్పుడే ప్రకటన విడదల చేశాం” అన్నారు.

    నేను సవినయంగా వారి సూచనకు సమాధానమిచ్చాను, “అమ్మా! విశ్వవిద్యాలయంలో అందరూ డాక్టరేట్‍లు. ఆకాశవాణిలో నా వంటివారు ఒకరిద్దరే. ఒకే చోట ఏళ్ళతరబడి పనిచేయడం నాకిష్టం లేదు. ప్రతి రెండు సంవత్సరాలకు నేనే కోరి వేరే స్టేషన్ కెళ్తాను” అన్నాను.

    ఆమె నవ్వి సరిపెట్టారు.

    నేను పని చేసిన 30 సంవత్సరాలలో నేను కోరి తెచ్చుకున్న ట్రాన్స్‌ఫర్లు 14. బాగా పనిచేస్తున్నానని సిబ్బంది, పట్టణంలోని వారు అనుకున్న సమయంలోనే మరో ఊరికెళ్ళాలని నా ఆలోచన. కడప విజయవాడ, కడప, హైదరాబాద్, ఢిల్లీ, అనంతపురం, కొత్తగూడెం, కడప, విజయవాడ, ఢిల్లీ – ఇలా శాఖాచంక్రమణం. నా బదిలీల వల్ల మా పిల్లల చదువులు రకరకాల స్కూళ్ళలో, కాలేజీలలో కొనసాగాయి. 1990 అక్టోబరులో నేను ఢిల్లీ నుండి అనంతపురం డైరక్టరుగా వెళ్ళాను. మా అమ్మాయి బి.యస్.సి మొదటి సంవత్సరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదివింది, రెండు, మూడు సంవత్సరాలు అనంతపురంలో చేసింది. ఆమెకు  మొదటి సంవత్సరం ఢిల్లీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ. అది అనంతపురంలో చెల్లదు. దానికిగా ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశం జరిపి రెండేళ్ళ తెలుగు పరీక్షలు వ్రాయవలసిందిగా ఆదేశించారు. అయినా పిల్లలు ముగ్గురు వృద్ధిలోకి వచ్చారు భగవత్ కృపతో. మా అమ్మాయి శైలజకు బి.యస్.సి.లో మేథమేటిక్స్‌లో 300కి 300 వచ్చాయి. అందువల్ల నా పిల్లలు పండితపుత్రులు కారని తెలిసింది.

    ఆహుతుల సమక్షంలో ఉగాది, దీపావళి, సంక్రాంతి కార్యక్రమాలను నిర్వహించాను. ఒక సంవత్సరం కథా గోష్ఠి ఏర్పాటు చేశాం. మధురాంతకం రాజారాం, పులికంటి కృష్ణారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, కలువకొలను సదానంద, శ్రీమతి పవని నిర్మల ప్రభావతి వంటి పలువురు కథకులు పాల్గొన్నారు.

    కడపజిల్లా రచయితల సంఘం వారు పెద్ద ఎత్తున 1976లో మహాసభలు జరిపారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పక్షాన అధ్యక్షులు డా. బెజవాడ గోపాలరెడ్డి, కార్యదర్శి దేవులపల్లి రామానుజరావు ప్రభృతులు వచ్చారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు మల్లెమాల వేణుగోపాలరెడ్డి, కార్యదర్శి జానమద్ది హనుమచ్ఛాస్త్రి ప్రభృతులు సభలు దిగ్విజయంగా జరిపారు. ఆ సభలలో నేను వ్రాసి ప్రచురించిన ‘ప్రకృతి కాంత – తెలుగు కావ్యాలలో ప్రకృతి వర్ణన’ అనే పరిశోధనా గ్రంథాన్ని గోపాలరెడ్డి గారు ఆవిష్కరించారు. ఆ గ్రంథాన్ని నేను సాహిత్య అకాడమీ పోటీకి పంపాను. చెన్న కృష్ణయ్యకు బహుమతి లభించింది.

    కర్నూలు జిల్లా రచయితల సంఘం, చిత్తూరు జిల్లా రచయితల సంఘం, అనంతపురం జిల్లా రచయితల సంఘము – పోటాపోటీలుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశావాది ప్రకాశరావు, మేడసాని మోహన్ , యం. నాగఫణిశర్మ, దత్తాత్రేయశర్మాది అవధానుల సభలలో నేనూ వివిధ హోదాలలో పాల్గొన్నాను. 1975-76 మధ్య కాలంలో ప్రొద్దుటూరు, కడప, బెంగుళూరులలో నేనూ అష్టావధానం చేశాను.

    1975లో కడప ప్రభుత్వ కళాశాలలో అష్టావధానం చేశాను. సభకు ముఖ్య ప్రతినిధిగా పుట్టపర్తి నారాయణాచార్యులు వచ్చి మాట్లాడుతూ “పద్మనాభా! ఆశుకవితా ప్రదర్శన తాత్కాలిక ఖ్యాతి తెచ్చిపెడుతుంది, కావ్యరచన మీద దృష్టి మళ్ళించు” అని సూచించారు.

    ఆ తర్వాత 1976 జనవరి 26 న బెంగుళూరులో ఆంధ్ర సారస్వత సమితి వారి ఆధ్వర్యంలో అష్టావధానం చేశాను. అది బెంగుళూరు ఆకాశవాణి కేంద్రంవారు అప్పటి స్టేషన్ డైరక్టరు బాలాంత్రపు రజనీకాంతరావు ఆదేశాల మేరకు  రికార్డు చేసి ఒక గంట ప్రసారం చేశారు. నరాల రామారెడ్డి అధ్యక్షత వహించారు. పుట్టపర్తి వారు సూచించిన విధంగా నేను ఆ సంవత్సరమే అవధాన ప్రదర్శనలు మానివేశాను. ఆ విధంగా నేనూ మాజీ అవధానినయ్యాను. నా అవధాన పద్యాలు ‘అవధాన పద్మ సరోవరం’ పేర ప్రచురించాను.

    (మళ్ళీ కలుద్దాం).

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here