ఆకాశవాణి పరిమళాలు-42

0
10

[box type=’note’ fontsize=’16’] అనంతపద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

నేను వేసిన వేషాలు:

సాహిత్య రంగంలో, ఆకాశవాణి ప్రసారాలలోనే గాక నాటకాలలోనూ నేను వివిధ సందర్భాలలో వేషాలు వేశాను. వి.ఆర్.కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు 1963లో కల్చరల్ ఫెస్టివల్ సందర్భంగా దుర్యోధనుడు ఏకపాత్రాభినయం – తొడలు విరిగిన సుయోధనుడు – నటించాను. మరుసటి సంవత్సరం కొడాలి గోపాలరావు వ్రాసిన ‘అల్లుడు చూపిన ఆదర్శం’లో స్త్రీ పాత్ర వేశాను. వైస్ ఛాన్సలర్ గోవిందరాజులు నాయుడు నాకు బహుమతి ప్రధానం చేస్తూ అభినందించారు.

భువన విజయాలు:

1968 నుండి 2018 వరకు 50 ఏళ్లలో కనీసం పది సార్లు భువన విజయాలలో వివిధ పాత్రలు పోషించాను. 1968లో కందుకూరు కళాశాలలో పింగళి సూరనగా పద్యాలు చదివాను. కడపలో తెనాలి రామకృష్ణుడిగా 1977లోనూ, ప్రొద్దుటూరులో రుద్రకవి గానూ, అనంతపురంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కృష్ణదేవరాయల చతుశ్శతాబ్ది ఉత్సవాలలో రామకృష్ణుడిగా నటించాను. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంలో రాయలుగాను, శ్రీకాకుళాంధ్ర దేవాలయంలో రాయలుగాను, కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో తిమ్మరుసుగాను, కడపలో తిమ్మరుసుగాను వేషాలు వేసుకొని నటించాను.

తిరుమల ఆస్థాన మండపంలో ధర్మారెడ్డి రాయలుగా, నేను విదేశీ రాయబారి న్యూనిజ్‌గా పాశ్చాత్య వేషధారణతో నటించాను. అదొక మధుర స్మృతి.

వంటవాడుగా:

1981లో పినిశెట్టి వ్రాసిన ‘ఆడది’ నాటకం స్టేజ్ మీద వేశాము. గొల్లపూడి మారుతీ రావు ఇంటి యజమానిగా, నేను వంటవాడిగా రక్తి కట్టించాము. కాఫీ సరిగా తయారు చేయలేదని యజమాని నన్ను చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఉంది. స్టేజి మీద గొల్లపూడి సహజంగా నటించి నా ‘గూబ’ గుయ్‌మనిపించారు. అప్పటినుండి నాటకాలు ఆడడం మానివేశాను.

సినిమాలో ఎక్స్‌ట్రా వేషం:

1983లో నేను హైదరాబాదులో పనిచేస్తుండగా గొల్లపూడి మారుతీ రావుతో కలిసి ‘కాబోయే అల్లుడు’ సినిమా ఓపెనింగ్ షాట్‌లో ఐదు నిమిషాలు నేను, రావి కొండలరావు, గొల్లపూడి, చంద్రమోహన్ ఉన్న సీను జూబ్లీహిల్స్‌లో ఓ పెద్ద బంగళాలో చిత్రీకరించారు. రేలంగి నరసింహారావు దర్శకులు. పెళ్లి కొడుకు చంద్రమోహన్. చంద్రమోహన్ వెటర్నరీ డాక్టరు. ఆయనకు పిల్లనివ్వడానికి నేను, మరో ముగ్గురు తండ్రి గొల్లపూడితో బేరమాడే హాస్య సన్నివేశం.

ఆ విధంగా స్టేజి మీద, రేడియోలోనే గాక సినిమా ఎక్స్‌ట్రాగా కూడా నటించే అవకాశాలు వచ్చాయి.

నాకు పై అధికారులు:

30 ఏళ్ల ప్రసార భారతి సర్వీసులో అధ్యాపకుడిగాను, పలువురు పై అధికారుల వద్ద పనిచేశాను. ప్రాతఃస్మరణీయులు కందుకూరు కళాశాలలో టి.కె. కృష్ణస్వామి, ఆర్. కృష్ణమూర్తి, బి.సుబ్రహ్మణ్యంలు. వారు ముగ్గురు ప్రిన్సిపాళ్ళు. తెలుగు శాఖ అధిపతులుగా జంధ్యాల లక్ష్మీనారాయణ శాస్త్రి, యల్లంరాజు శ్రీనివాసరావు, టి.రంగారెడ్డి చక్కటి క్లాసుల్లో పాఠాలు చెప్పే అవకాశమిచ్చారు.

ఆకాశవాణిలో:

1975లో కడపలో చేరగానే టి. ఆర్. రెడ్డి మాకు అసిస్టెంట్ డైరెక్టర్. నా మీద అపార విశ్వాసం ఆయనకు. 1976లో నేను ఢిల్లీ ట్రయినింగ్‌కి వెళ్ళినప్పుడు కడప కేంద్ర ట్రాన్స్‌మీటర్ శక్తిని పెంచే కృషి చేయమన్నారు. నేను 12 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు సేకరించి వారి చేత సమాచార మంత్రికిప్పించాను. 1983లో అది ఫలించింది. కడపలో పనిచేసిన జి.టి.అయ్యంగార్, దేవుళ్ళ బాలకృష్ణ, గొల్లపూడి నాకు ఆత్మీయులు.

విజయవాడలో ప్రొడ్యూసర్‌గా పని చేసినప్పుడు (1978-80) శివప్రకాశం డైరెక్టరు. ఆయన నా చేత ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం చేయించారు. హైదరాబాదులో 1982లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినప్పుడు రాజారాం డైరెక్టరు. 1983 జూన్‌లో కేశవ పాండే వచ్చారు. 1984లో లీలాబవదేకర్ వచ్చారు. ఆమె కఠినంగా ప్రవర్తించారు.

ఢిల్లీ ట్రయినింగ్ సెంటర్‌లో 1987లో యస్. కృష్ణన్, సి.ఆర్.రామస్వామి, మనోజ్ సిన్హా, యస్.కె. శర్మలు డైరెక్టర్లు. ఎవరు వచ్చినా నా చేత రెండేసి పనులు చేయించారు. 1980 నాటికి నేను డైరెక్టర్‌ని. అందువల్ల డైరెక్టరేట్‌లో ఆఫీసర్లు నాకు అధికారులు. యం.డి. గైక్వాడ్, ఏ.ఆర్. షిండే తదితరులు ఎంతో ఆదరంగా చూశారు.

షిండే డైరెక్టర్ జనరల్‌గా మూడేళ్ళు ఉన్న సమయంలో నన్ను అభిమానంగా చూశారు. నేను 2001లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కాగానే అనిల్ బైజాల్ మాకు సీఈవో. కేజ్రివాల్ గారు డి.జి.గా వుండగా నన్ను ఢిల్లీ కేంద్రం డైరెక్టర్‌గా సెలెక్ట్ చేశారు.

కె.ఎస్.శర్మ సీఈవోగా నాకు నాలుగేళ్లు అధికారి. దూరదర్శన్‌లో డైరెక్టర్ జనరల్‌గా ఎస్.వై.ఖురేషీ తరువాత నవీన్ కుమార్ వచ్చారు. నేను పంపిన ఏ ఫైలు నెగిటివ్ రిమార్కుతో రాలేదు. వాళ్ళ అభిమానం చూరగొనడం అదృష్టం.

వీళ్ళు అందరూ ప్రతి సంవత్సరం వ్రాసిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టులో వెరీగుడ్, ఎక్స్‌లెంట్ రిమార్కుల ఆధారంగా నాకు రావలసిన డి.డి.జి ప్రమోషన్ 2001లో సకాలంలో వచ్చింది. అంతా భగవత్ కృప.

నా సహచర మిత్రులు:

1982 నుండి 2005 వరకు నేను అధికారిగా వున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎందరెందరో సహచరుల టీం వర్క్ ఫలితంగానే నేను విజయాలు సాధించాను. ఎక్కడ పని చేసినా ‘మంచి అధికారి’ అనే పేరు వచ్చింది. అది సహోద్యోగుల అభిమానమే.

కడప గడపలో:

1975లో కడపలో ప్రొడ్యూసర్‌గా చేరేనాటికి అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌లుగా బి.ఆర్.పంతులు, ఆర్.విశ్వనాథం వున్నారు. కొన్నాళ్లకు బి.జి.యస్. రావు, కె.ఆర్. భూషణరావులు ప్రమోషన్ పొందారు. ఆరవేటి శ్రీనివాసులు జానపద ప్రొడ్యూసర్ అయ్యాడు. లక్ష్మీనారాయణ, సుబ్బన్న వ్యవసాయ విభాగం. విజయవాడలో ప్రొడ్యూసర్‌గా పనిచేసిన రెండేళ్లలో వోలేటి వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, పి.వి. రమణ, పాండురంగ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సుత్తి వీరభద్రరావు, నండూరి సుబ్బారావు, సి. రామమోహనరావు, ఉషశ్రీ ప్రభృతులు.

రెండవ దఫా కడప వెళ్ళేసరికి (1980-82) కొత్త తరం యువకులు వచ్చారు. తర్వాతి కాలంలో వారు ప్రసిద్ధులయ్యారు. వోలేటి పార్వతీశం, కలగా కృష్ణమోహన్, కపర్ది, పుట్టపర్తి నాగపద్మిని. వీరు హైదరాబాద్‌కి బదిలీ అయి, ఆయా రంగాల్లో ఖ్యాతి గడించారు. ఈ కాలంలో గొల్లపూడి మారుతీరావు మద్రాసు నుంచి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా వచ్చి 1981లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్‌గా అయ్యారు. అదే సంవత్సరం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. మేమిద్దరం ‘బావగారి కబుర్లు’ ఒక సంవత్సరం చేశాం. ఇప్పటికీ మేము ‘బావగారూ!’ అని పరస్పరం పిలుచుకొంటాం.

ఒక వారం ‘బావగారి కబుర్లు’ కార్యక్రమానికి గొల్లపూడి రాలేక, మద్రాసులో వుండిపోయారు. కార్యక్రమం ఆపకూడదు గాబట్టి నేను ఒక్కడినే రికార్డు చేశాను. బావగారికి కోపం వచ్చి ఏమీ మాట్లాడడం లేదని చెప్పి రక్తి కట్టించాను.

ఆంధ్ర రాజధాని నగరంలో:

1982 – 87 మధ్య ఐదు సంవత్సరాలలో హైదరాబాద్ మెయిన్ స్టేషన్లోను, వాణిజ్య ప్రచార విభాగం, ట్రయినింగ్ సెంటర్‌లలో పని చేశాను. స్టేషన్‌లో నాతోపాటు శివశంకరన్ (కేరళ) మరో అసిస్టెంట్ డైరెక్టర్. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లుగా పదిహేను మంది దాకా వుండేవారు. అందరూ 15 సంవత్సరాలుగా ఆకాశవాణిలో పనిచేస్తున్నవారే. నాకు ఐదు సంవత్సరాలకి యు.పి.యస్.సి. ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రమోషన్ వచ్చింది. వయసులోనూ సర్వీసులోనూ వారు నా కంటే పెద్దవారు. వారి పై అధికారిగా నేను కత్తి మీద సాము చేశాను.

అప్పటి కార్యక్రమ నిర్వాహకులలో రావూరి భరద్వాజ, వి.వి.శాస్త్రి, యస్.పి. గోవర్ధన్, సునందినీ ఐప్, తురగా జానకీరాణి, ఎ.వి.రావు చౌదరి, వై.ఆర్.సి. పాత్రో, మల్లికార్జున శర్మ, యం.అరుణాచలం, అజర్ అఫ్సర్ ప్రభృతులు పని చేశారు. తరువాతి కాలంలో వీరు ప్రమోషన్లు పొంది చాలామంది డైరెక్టర్లు అయ్యారు. వార్తా విభాగంలో మల్లాది రామారావు, గోవాడ సత్యారావు, సుబ్బారావు అధిపతులు.

తర్వాతి కాలపు యువతరంలో రచయితలు వచ్చారు – సుధామ దంపతులు, సి.యస్. రాంబాబు, మంత్రవాది మహేశ్వర్ దంపతులు, ఉదయ శంకర్ (ప్రస్తుత డైరెక్టర్).  నేను వాణిజ్య ప్రసార విభాగానికి 1985 జనవరి 31న బదిలీ అయ్యాను. అప్పుడు ముగ్గురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లు పని చేశారు. క్రికెట్ కామెంటేటర్ జి.కె. మరార్ (తరువాత దూరదర్శన్ డైరెక్టరు), రామానుజం, చల్లా ప్రసాదరావు.

దేశ రాజధానిలో:

1987-90లో ట్రయినింగ్ సెంటర్లో పని చేసినప్పుడు నా సహోద్యోగులు వి.జి. మాథ్యూ, మహావీర్ సింగులు. రెండవ దఫా 1997-2000 మధ్య ఢిల్లీ కేంద్రంలో పెద్ద పరివారమే వుండేది. 22 మంది ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ (రెండు క్రికెట్ టీమ్‍లని చమత్కరించేవాడిని). నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్యులు, బి.యం.గుప్తా, అల్కా సాదిక్ డిప్యూటీ డైరెక్టర్లు.

నా వద్ద పనిచేసిన పి.ఎ.లు చక్కగా సహకరించారు. అనంతపురంలో సురేంద్ర, కడపలో భవాని శంకర్, విజయవాడలో లక్ష్మి, ఢిల్లీలో సత్నామ్ కౌర్, శ్యామావతి పాఠక్; దూరదర్శన్‌లో గెజిటెడ్ సెక్రటరీ సింగ్‍ని ప్రధానంగా చెప్పుకోవాలి.

వివిధ కేంద్రాలలో:

అనంతపురంలో (90-93) విద్యాలంకార్, కళాకృష్ణ, రమణ మూర్తి, వేణుగోపాల్, రాఘవరెడ్డి అమృత దంపతులు – కొత్త స్టేషన్ ఖ్యాతిని ఇనుమడింప చేశారు. నా చేతి మీదుగా 14 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. కడపలో పనిచేసిన సమయంలో వై.గంగిరెడ్డి, ఆదిత్యప్రసాద్, మల్లేశ్వరరావు, హనుమంతరావు, సుమన్, సుబ్బన్న, ఆరవేటి శ్రీనివాసులు గుర్తుకు వస్తున్నారు (1993-95). విజయవాడలో డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో (1995-97) కార్యక్రమ రూపకల్పన చేసిన మిత్రులందరూ విశిష్టులే. ప్రయాగ వేదవతి, ముంజులూరి కృష్ణకుమారి, డి పద్మావతి, యం.సి.హెచ్ నరసింహాచార్యులు, రాజేంద్ర ప్రసాద్, పన్నాల సుబ్రహ్మణ్య భట్. వార్తా విభాగంలో బి.నారాయణరావు, ఎం.వి.ఎస్.ప్రసాద్, ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు, జ్యోత్స్న పని చేశారు.

ఈ సుదీర్ఘ జాబితాలో మరపుకు వచ్చిన ప్రముఖులు ఎందరో! ఇది కేవలం జ్ఞాపకాల దొంతర. 42 వారాల పయనంలో ఎన్నో పరిమళాలు, అవి కస్తూరీ భరితాలు.

సంచిక పత్రికకు కృతజ్ఞతాంజలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here