[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
[dropcap]క[/dropcap]డపలో నా దశాబ్దకాలపు ఉద్యోగ జ్ఞాపకాలు మధుర మంజుల మనోజ్ఞాలు. 1975లో నేను చేరినప్పుడు కడప కలెక్టరుగా పి.ఎల్. సంజీవరెడ్డి పని చేస్తున్నారు. ఆయన నిరంతర అభ్యుదయవాది. ఏదో ఒక కొత్త ఆలోచన చేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని పట్టుదల… ఆయన అనంతపురం వాసి. ఆయన తండ్రి పైడి లక్ష్యయ్య రాజకీయ ధురంధరులు. తొలి పార్లమెంటు సభ్యులు (1952). నీలం సంజీవరెడ్డికి అతి సన్నిహితులు. తన కుమారునికి ‘సంజీవరెడ్డి’ అని పేరు పెట్టారు లక్ష్మయ్య. ఆయన స్వయంగా – హేమారెడ్డి మల్లమ్మ – అనే నాటకం వ్రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్‌గా వ్యవహరించారు. 1978లో శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేశారు.
లక్ష్మయ్య గారు కడప వచ్చినప్పుడు కలెక్టరు బంగ్లాలో సాయంకాలాలు సాహితీగోష్ఠి జరిగేది. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, నేను తదితర సాహితీమిత్రులంతా వెళ్ళేవారం. సంజీవరెడ్డి దాదాపు రెండేళ్ళు కలెక్టరుగా ఉన్నారు. అదే సమయంలో నవంబరులో రాష్ట్రావతరణం దినోత్సవాలు ఘనంగా చేశారు. రాష్ట్ర తాత్కాలిక గవర్నరు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. యస్. ఓబుల్‌రెడ్డి ఆ సభలకు విచ్చేశారు. నందలూరులో వారు చదివిన పాఠశాలను సందర్శించారు.
రాష్ట్ర గ్రంథాలయ శాఖామాత్యులు డా. సి.హెచ్. దేవానందరావు జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి. ఆయన తరచూ కడప జిల్లా పర్యటించేవారు. 1977లో నాకు వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆ సందర్భంగా సాహితీమిత్రులు ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మాట్లాడుతూ కేతు విశ్వనాథ రెడ్డి ఇలా అన్నారు: “పద్మనాభరావు కందుకూరి రుద్రకవిపై చేసిన పరిశోధనా గ్రంథం వెంటనే ముద్రించాలి”. సభలో ఉన్న కలెక్టరు తమ గ్రాంటు నుండి నాలుగువేలు అప్పుగా ప్రకటించారు. గ్రంథ ముద్రణ అయిన తర్వాత 200 ప్రతులు నేను జిల్లా కలెక్టర్ గారికి అందిస్తే వాటిని గ్రంథాలయాలకు పంపుతారు. వెంటనే గ్రంథాన్ని మదరాసులోని క్రాంతి ప్రెస్ – ధనికొండ హనుమంతరావు – దగ్గర నెలలో ముద్రించాను. ఏల్చూరి మురళీధరరావు ప్రూఫులు దిద్ది సర్వాంగ సుందరంగా పుస్తకం వెలువడింది.
కలెక్టరు సంజీవరెడ్డిగారు చొరవ తీసుకుని గ్రంథావిష్కరణ సభ ఏర్పాటు చేశారు. నాకు గ్రాంటు మంజూరు చేసినట్లే కేతు విశ్వనాథ రెడ్డికి, కొలకలూరి ఇనాక్‌కు కలెక్టరు నాలుగేసి వేలు మంజూరు చేశారు. నా థీసిస్ ఆవిష్కరణ కలెక్టరు, రాష్ట్ర గ్రంథాలయ శాఖామాత్యులు డా. సి.హెచ్. దేవానందరావు, రాయలసీమ అభివృద్ధి మండలి అధ్యక్షులు కె.బి.నరసప్పను ఆహ్వానించారు. సభ జయప్రదంగా జరిగింది.
సంజీవరెడ్డి ఆ తర్వాతి సంవత్సరం హైదరాబాదు బదిలీ అయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నా నన్ను ఆదరంగా పలకరించేవారు. ఆయన యన్.టి.రామారావు ప్రత్యేక కార్యదర్శిగానూ, రాష్ట్రపతి సంజీవరెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగాను (1977) పని చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పని చేసి తర్వాత కంపెనీ వ్యవహారాల కార్యదర్శిగా రిటైరయ్యారు. తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టరుగా ఐదేళ్ళు పనిచేసి, హైదరాబాదులో నాలుగేళ్ళ క్రితం గతించారు.
ఆ తర్వాత కడపకు కలెక్టరుగా డా. పి.సుబ్రహ్మణ్యం వచ్చారు. ఆయన నెల్లూరు జిల్లావారు. కొద్ది రోజులల్లోనే నాకు సన్నిహితులయ్యారు. పై చదువుల కోసం వారు బ్రిటన్ లోని బర్మింగ్‌హాం వెళుతున్న సందర్భంగా వీడ్కోలు సభ జరిపారు. సుబ్రహ్మణ్యం సహృదయులు. నేనిలా అన్నాను: “అయ్యా! మీరు బర్మింగ్‌హాం వెళుతున్నారు. కడపలో ఇటీవల పనిచేసిన కలెక్టర్లు ఒకరిద్దరు burning hands తో వెళ్ళారు.” ఆయన చిరునవ్వు చిందించారు. బర్మింగ్‌హాం నుంచి ఒక ఉత్తరం వ్రాస్తూ యోగక్షేమాలు తెలియజేస్తూ burning hands విషయం ప్రస్తావించారు. బ్రిటన్ నుండి రాగానే మళ్ళీ కడప వచ్చారు. కొద్ది నెలల తర్వాత హైదరాబాద్ వెళ్ళారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్ద కార్యదర్శిగా చేరారు. ఓ ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కూడా మరణించారు. నెల్లూరులో ఆయన మిత్రబృందంతో కలసి పేదలకు స్నేహ హస్తం అందించే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పారు.
కడప కలెక్టరుగా వచ్చిన వారిలో యం.నారాయణ ఒకరు. ఒక దఫా ఆయనను వారి బంగాళాలో కలిసినప్పుడు యాదృచ్ఛికంగా వారి హస్తరేఖలు చూశాను. అప్రయత్నంగా నా నోటి నుండి – “మీరు ఇక్కడ ఆరు నెలలకు మించి పని చేయరు” అని వచ్చింది. “What nonsense you are talking” అన్నారు. నేను మారు మాట్లాడలేదు. అది 1978. నేను విజయవాడ కేంద్రానికి బదిలీ మీద వెళ్ళాను. ఉద్యోగుల ఆందోళన సందర్భంగా జరిగిన గొడవలలో ఆయనను ఆరు నెలలకే మార్చారు. విజయవాడ పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులుగా వెళ్ళారు. జి.ఎస్. రాజు అధ్యక్షులు. విజయవాడలో కలిసినప్పుడు “you are a good astrologer” అన్నారు.
కె.వి.రమణాచారి: కడపకు నేను 1995 ఏప్రిల్‌లో స్టేషన్ డైరక్టరుగా వెళ్ళాను. అక్కడ నేను పనిచెయ్యడం అది మూడోసారి. కడపలో జాయింట్ కలెక్టరుగా పనిచేసిన సి. రమాకాంతరెడ్డి (సంజీవరెడ్డి కలెక్టర్‍గా ఉన్నప్పుడు) నన్ను బాగా అభిమానించారు. తర్వాత ఆయన అనంతపురం కలెక్టరుగా వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా వ్యవహరించారు.
రమణాచారి మంచి పబ్లిక్ రిలేషన్స్ వ్యక్తి. వారిని 1995కు ముందు నేను చూడలేదు. ఆ రోజు రాష్ట్ర రెవెన్యూ కమీషనర్ వి.ఆనందరావు పర్యటనకు వచ్చి రహదారి బంగళాలో బస చేశారు. వారిని మర్యాదపూర్వకంగా కలవడానికి మేడ మెట్లు ఎక్కుతున్నారు రమణాచారి. “నమస్కారం సార్! నేను పద్మనాభరావును” అన్నాను. ఆయన – “డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు గారు. పది నిముషాలలో మా కమీషనర్ గారిని చూచి వస్తాను. ఉండండి” అని మేడ మీదకి వెళ్ళారు.
మేడమీద నుంచి దిగి రాగానే ఆప్యాయంగా పలకరించి తమ కార్లో నన్ను కూచోబెట్టుకుని బంగళాకు తీసుకెళ్ళారు. ఏ శుభ ముహూర్తాన వారిని తొలిసారి కలిశానో గాని, గత 20 సంవత్సరాలుగా మా స్నేహబంధం అధికార బంధానికి అతీతమై కుటుంబ స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. డి. సుబ్రమణ్యం అప్పుడు జిల్లా జడ్జి.
రమణాచారి కలెక్టరుగా ఉన్న కాలంలో ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. జె.వి. సోమయాజులు బృందం వారి కన్యాశుల్కం నాటక ప్రదర్శన జరిపించారు. కడప స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో క్రికెట్ పోటీ నిర్వహించారు. తొలిసారిగా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం 1996లో ఘనంగా నిర్వహించారు. అప్పుడు ఎస్.పి.గా ఆర్.ప్. ఠాకూర్ ఉన్నారు. మేము ముగ్గురం ఆ కళ్యాణమహోత్సవ సభలో ప్రసంగించాము. అదే ఒంటిమిట్టలో ఈనాడు రెండో భద్రాద్రిగా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణాలు జరగటం, ఆ కళ్యాణాలకు నేను భద్రాద్రిలో వలె ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయడం భగవదనుగ్రహం.
రమణాచారి 2007లో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహకాధికారిగా వచ్చారు. 2005-07 మధ్యకాలంలో ఏ.పి.వి.యన్. శర్మ కార్యనిర్వహణాధికారి. వారి పదవీకాలంలోనే వారి సౌజన్యంతో నేను పదవీ విరమణాంతరం 2005లో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా నియమించబడ్డాను. నాకు రెండేళ్ళ పదవీకాలం పూర్తి అయింది. శర్మగారు హైదరబాదుకు బదిలీ అయి సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వెళ్ళారు. వారు కేంద్రంలో షిప్పింగ్ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం 2014 నుంచి ఉభయరాష్ట్రాల గవర్నరుకు సలహాదారు.
ఏ.యు.శర్మ: 1978లో బీహార్ క్యాడర్ ఐ.ఎ.ఎస్ అధికారి ఏ.యు.శర్మ మా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీగా ఢిల్లీలో నియమితులయ్యారు. ఆయన కడపజిల్లా నందలూరు వాస్తవ్యులు. ఉమాకాంత శర్మ కడప ఆకాశవాణికి పర్యటన కోసం వచ్చారు. వారిని రేణిగుంట విమానాశ్రయంలో ఆహ్వానించి కడపకు తీసుకొచ్చాం. నందలూరు వెళ్ళి తిరుగు ప్రయాణంలో రాయచోటి మిదగా ఆకాశవాణి వ్యాన్‌లో మేమిద్దరం బయల్దేరాం. సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట నుండి హైదరబాదుకు ఆయన విమానం. మధ్యదారిలో రైల్వే గేటు వేశారు. విమానం టైం అవుతోంది. గాబరా పెరిగింది. ఢిల్లీ నుండి పెద్ద ఆఫీసరు వచ్చారనీ, గేటు తీయమని గేట్‌మ్యాన్‌ని కోరాము. ‘ప్రధానమంత్రి వచ్చినా నేను తీయను. రైలు వెళ్ళాలి’ అన్నాడు గేట్‌కీపర్ నిర్మొహమాటంగా.
మధ్యలో వీల్ విరిగి వ్యాన్ చెడిపోయింది. ఉమాకాంత శర్మ కొత్తగా వారం ముందర మా శాఖలో చేరారు. సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రిగారితో సమావేశం. ఇద్దరం తిరుపతి వెళ్ళే బస్సు ఎక్కాం. “సార్! మీకు ఎలానో విమానం దొరుకుతుంది” అని జోస్యం చెప్పాను.
ఆ రోజు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి తిరుమల స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక వాయుసేన విమానంలో ఢిల్లీ తిరిగి వెళ్తున్నారు. అందువల్ల హైదరాబాద్ వెళ్ళే సాధారణ విమానం ఆలస్యంగా బయల్దేరింది. ఢిల్లీ చేరిన శర్మగారు ‘మీ జోస్యం ఫలించింది’ అని నాతో అన్నారు.
పి.వి.ఆర్.కె. ప్రసాద్: ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా 1978-81 మధ్యకాలంలో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. మా సహోద్యోగి రాజభూషణరావు, ప్రసాద్ గారు నాగపూర్‌లో లోగడ వేరు వేరు ఉద్యోగాలలో పనిచేశారు. ఒకరోజు సాయంకాలం ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. “కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయమంత్రి శ్రీమతి రామ్‌ధులారీ సిన్హా తిరుమల వస్తున్నారు. దర్శనాది సమస్త రాజలాంఛనాలు చూసుకోండి” అని ఆదేశం. తిరుపతి వెళ్ళి ప్రసాద్ గారికి విషయం చెప్పాము. ఆయన తన పి.ఎ. నారాయణని పిలిచి – “ఆకాశవాణి కాళ్ళు, చేతులు లేని డిపార్టుమెంట్. కారు, గెస్ట్ హౌస్, దర్శనం ఏర్పాటు చేయండి” అన్నారు. దేవుడు మా మీద దయతలిచాడు.
మంత్రిణి తమ కుమారునితో కలిసి మర్నాడు స్వామి వారి దర్శనం చేసుకొన్నారు. హుండీ కానుకలు సమర్పించారు. పడికావలి వద్ద పేష్కారు కృష్ణస్వామి తెల్లటి పంచ, వల్లెవాటుతో కన్పించారు. ఆయనే ప్రధానార్చకుడనుకుని ఆమె వారికి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమెను విమానం ఎక్కించి, మేం సుఖంగా బయటపడ్డాం.
(మళ్ళీ కలుద్దాం).