ఆకాశవాణి పరిమళాలు-7

    0
    3

    [box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

    7-7-1977 చాలా చారిత్రాత్మక దినం. భారత రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డిగారిని అన్ని పార్టీలు కల్సి ఏకగ్రీవంగా ఎంపిక చేసిన రోజు. ఆ తర్వాత ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల నుంచి జనతాపార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి ఆయన.  అదే నంద్యాల నుండి మళ్ళీ 1991లో పి.వి. నరసింహారావు గారు ఎన్నికై ప్రధాని అయ్యారు.

    అదే 7-జూలై-1977 న కడపలోని 16 ఆఫీసు ఉద్యోగుల మందరం సమావేశమై ప్రభుత్వోద్యోగుల క్రీడా సాంస్కృతిక సంస్థ (Government Offices Sports and Cultural Organisation) ‘గోస్కో’ను స్థాపించాము. అందులో ఆకాశవాణి, ఎలెక్ట్రిసిటీ బోర్డు, కమర్షియల్ టాక్సూ, జిల్లా పరిషత్, రహదార్లు భవనాలు, పి.డబ్ల్యూ.డి. – ఇలా అన్ని ఆఫీసుల సిబ్బంది ఒక కల్చరల్ సొసైటీ ప్రారంభించాం. అధ్యక్షులు ఎలక్ట్రిసిటీ బోర్డు సూపరిండెంట్ ఇంజనీరు కె.వి. జోగారావు, కోశాధికారిగా బి.పి.స్వామి (టిఎల్‌సి అకౌంటెంట్) ఎంపికయ్యారు. మా ఆకాశవాణి నుండి ఆర్. విశ్వనాధం కార్యదర్శి అయ్యారు. ఆయన కొద్ది నెలలలో బదిలీ అయ్యారు. అప్పుడు నన్ను కార్యదర్శిని చేశారు.

    తొలి కార్యక్రమం ప్రఖ్యాత సినీ గాయకులు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం మ్యూజికల్ నైట్. బాగా జనాకర్షణ కార్యక్రమం పెట్టాం. కడపలో అదొక గొప్ప సభ. మునిసిపల్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో కార్యక్రమం జరిగింది. టిక్కెట్లు పెట్టాం. నాలుగు డబ్బులు మిగిలితే తర్వాత కార్యక్రమాలకు ఉపయోగించాం. అప్పటి నుండి బాలసుబ్రమణ్యంతో మైత్రి పెరిగింది. ఆయన కూడా మా నెల్లూరు వాడే. ఏటా నేను మా నాన్నగారి స్మారకార్థం అనంత లక్ష్మీకాంత సాహితీ పీఠం తరఫున ఒకరిని సన్మానిస్తున్నాను. 2004లో నెల్లూరు పురమందిరంలో యస్.పి.బాలసుబ్రమణ్యానికి స్వర్ణ కంకణ సత్కారం చేశాను. అదొక మధుర స్మృతి.

    ‘గోస్కో’ సంస్థ పక్షాన తరువాతి సంవత్సరాలలో జరిగిన మరో మంచి కార్యక్రమం – ప్రముఖ సినీ నటులు ‘హరనాథ్’కు సన్మానం. ఆయన మదరాసు నుండి వచ్చారు. గెస్ట్‌హౌస్‌లో దిగారు. వారికి సన్మాన పత్రం నేను వ్రాసి సభలో చదివాను. అందాల రాముడు హరనాథ్ – అన్నాను. మర్నాడు ఉదయం మా యింటికి బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చి సన్మాన పత్రం బాగా వ్రాశానని నన్ను అభినందించారు.

    మరో కార్యక్రమం భువన విజయం. అన్ని ఆఫీసుల అధికారుల అండదండలతో అది బాగా రక్తి కట్టింది. జోగారావు (ఎస్.ఇ., ఎలక్ట్రిసిటీ బోర్డు) నాటి భువన విజయ శ్రీకృష్ణదేవరాయలు. నేను తెనాలి రామకృష్ణుడు వేశాను. జానమద్ది హనుమచ్ఛాస్త్రి తదితరులు అష్టదిగ్గజ కవులుగా నటించారు. వేషాలు వేసుకొని సభను జయప్రదం చేశారు.

    1978-80ల మధ్య నేను విజయవాడ ఆకాశవాణికి బదిలీ అయి వెళ్ళాను. విజయవాడలో ప్రొడ్యూసర్ ఉషశ్రీని కడపకి వేశారు. నన్ను విజయవాడకి మార్చారు. ఆయనకు విజయవాడ అనుకూలం. 1980 జూన్‌లో ఆయన కనుకూలంగా నేను కడపకు బదిలీ మీద వచ్చేశాను.

    ఈ రెండు సంవత్సరాల కాలంలో ‘గోస్కో’ కార్యకలాపాలు మందకోడిగా సాగాయి. దానికి కారణం నేను లేకపోవడమేనని గొప్పలు చెప్పను. కోశాధికారి, ఉత్సాసవంతుడైన బి.పి.స్వామి హైదరాబాదుకు బదిలీ అయ్యారు. జోగారావు చీఫ్ ఇంజనీరుగా హైదరాబాదు వెళ్ళారు. అందువల్ల ఇతరులు అంతగా చొరవ చూపక ఆ సంస్థ అలానే ఉండిపోయింది. 1980-82 మధ్య కాలంలో నేను మళ్ళీ కడపలో ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. అప్పుడు ‘గోస్కో’ కార్యక్రమాలను ఇనుమడింపజేశాం.

    విజయవాడ సంబురాలు:

    1978 నవంబరులో విద్యాసంవత్సరం మధ్యలో నేను విజయవాడ బదిలీ మీద వెళ్ళాను. ఉషశ్రీ కడపలో చేరలేదు. సెలవు మీద వెళ్ళారు. నేను విజయవాడలో చేరగానే పి.ఎల్. సంజీవరెడ్డికి (పిఎ టు ప్రెసిడెంట్) ఉత్తరం వ్రాశాను. “మీ సాహిత్య వ్యాసంగానికి విజయవాడ సరిపోతుంది” అని సమాధానం వ్రాశారు. నేను పిల్లలను స్కూళ్ళలో చేర్చి వారం రోజుల్లో స్థిరపడ్డాను.

    వారం తర్వాత ఓ సాయంకాలం నన్ను కడప మారుస్తున్నట్టు ఆర్డర్లు వచ్చాయి. నాకు ఏమీ పాలు పోలేదు. స్టేషన్ డైరక్టర్ శివప్రకాశానికి ఉషశ్రీ అంటే గిట్టదు. నన్ను ఢిల్లీ వెళ్ళి ఆర్డరు మార్పించుకు రమ్మని సలహా ఇచ్చారు. ఆయన గదిలో నుండి నేను రాష్ట్రపతి భవనంలోని సంజీవరెడ్డి గారికి (పి.ఎ) లైటనింగ్ కాల్ బుక్ చేశాను. రెండో నిమిషంలో పి.ఎల్. సంజీవరెడ్డి ఫోన్‌లో కలిశారు. విషయం వివరించాను. “మీరు గాబరా పడవద్దు” అన్నారు.

    మూడో రోజున నన్ను కడపకు మారుస్తున్న ఆర్డరు క్యాన్సిల్ అయింది. నేను విజయవాడలో 1980 జూన్‌ దాకా వున్నాను. విజయవాడ పెద్ద స్టేషన్. అక్కడ స్క్రిప్ట్ రైటర్‌గా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ప్రొడక్షన్ అసిస్టెంట్ వీరభద్రరావు (తర్వాత సుత్తి వీరభద్రరావుగా సినిమాలలో పేరు తెచ్చుకొన్నాడు) వీరిద్దరూ నాకు బాగా సహకరించారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు కార్యక్రమం వచ్చేది.

    30 నిముషాల కార్యక్రమం లైవ్. అందులో 10 -15 నిముషాలు శ్రోతల ధర్మసందేహాలకు సమాధానం చెప్పాలి. మిగతా సమయంలో ఉషశ్రీ కొనసాగిస్తున్న మహాభారత ప్రవచనం కొనసాగాలి. వెంటనే సి. రామమోహనరావు గురువుగా, ఏ.బి. ఆనంద్ శిష్యుడిగా కార్యక్రమం కొనసాగించాం. నేను వ్రాసిచ్చిన సమాధానాలు, భారత కథను రామమోహనరావు చెప్పేవారు.

    రెండు నెలల్లో భారతం పూర్తయ్యింది. ఉషశ్రీ భారత, రామాయణ, భాగవతాలు ధారావాహికంగా ఏడెనిమిది సంవత్సరాలు చెబుతూ శ్రోతల్ని ఉర్రూతలూగించారు. ఇప్పుడు నేనేం చేసి శ్రోతల్ని మెప్పించాలి? పెద్ద ధర్మ సందేహం.

    ఎర్రన హరివంశం కథను తీసుకొన్నాను. కొత్త గురువుగా నేను, కొత్త శిష్యుడిగా మల్లాది సూరిబాబు ఒక జట్టుగా తయారయ్యాము. హరివంశంలోని పద్యాలు సూరిబాబు రాగయుక్తంగా పాడేవారు. అలా 1980 జూన్‌ వరకూ నడిపాను. ఆ హరివంశ వచనాన్ని విజయవాడలోని సిద్ధార్థ పబ్లికేషన్స్ వారు 1981లో ప్రచురించారు. మరుసటి సంవత్సరం ఉషశ్రీ తమ్ముడు పురాణపండ రాధాకృష్ణమూర్తి (రాజమండ్రి) నా అనుమతితో హరివంశ పునర్ముద్రణ చేశారు. పది సంవత్సరాల కాలంలో దాదాపు 40 వేల కాపీలు ఆయన ముద్రించారు. మంచి ప్రచారమే వచ్చింది i was reading this.

    కవి సమ్మేళనాలు: విజయవాడలో నేను నిర్వహించిన కవి సమ్మేళనాలలో హనుమంతరాయ గ్రంథాలయంలో జరిపిన కవి సమ్మేళనం హైలైట్. ఆంధ్రదేశంలోని ప్రముఖ కవి పండితులు పాల్గొన్నారు. తుమ్మల సీతారామ మూర్తి చౌదరి, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి,  శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్రశర్మ, జంధ్యాల పాపయ్య శాస్త్రి – ఇలా ఘనాపాఠీలు పాల్గొనన్న కవి సమ్మేళనమది.

    టైం ప్రకారం సభ సాయంత్రం 6 గంటలకు మొదలెట్టాలి. వేదిక మీదకి ఒక్కొక్క కవిని నేనే ఆహ్వానించాను. 16 మంది కవులు. 15 మంది వేదిక నలంకరించారు. అప్పటివరకూ సభలో లేని శ్రీశ్రీ ముఖద్వారం వద్ద కనిపించగానే నాకు ఊరట కలిగింది. ఆ రోజు కవి సమ్మేళనంలో ఆయన కవిత హైలైట్.

    మర్నాడు మా స్టూడియోకి వచ్చి శ్రీశ్రీ ఇంటర్వ్యూ రికార్డు చేశారు. విశాలాంధ్ర వారు శ్రీశ్రీ సంపుటి ప్రచురిస్తూ నన్ను ఒక వ్యాసం వ్రాయమన్నారు. ‘శ్రీశ్రీతో ఓ సాయంకాలం’ అనే శీర్షికతో ఆ రెండు రోజుల ముచ్చట్లు వ్రాశాను. కొసమెరుపుగా – శ్రీశ్రీతో ఓ సాయంకాలం అంటే వేరే అపార్థానికి దారి తీస్తుందని వివరణ కూడా ఇచ్చాను. కడప ఆకాశవాణిలో కవి సమ్మేళనంలోనూ, విజయవాడ కవి సమ్మేళనంలోనూ శ్రీశ్రీ పాల్గొనడం నాకు చిరస్మరణీయం. ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, జె.బాపురెడ్డి, యస్వీజోగారావు, పురిపండా అప్పలస్వామి, పుట్టపర్తి నారాయణాచార్యులు – ఇలా ప్రసిద్ధి చెందిన కవులందిరితో భుజాలు వ్రాసుకొని తిరిగిన జ్ఞాపకాలు నావి. మధునాపంతుల వారిని ఢిల్లీలో జరిగిన జాతీయ కవి సమ్మేళనానికి 1980లో ఎంపిక చేశాం. అదొక మధురానుభూతి. ఆయన సౌమ్య స్వభావి.

    పెనుతుఫాను: విజయవాడలో నేనుండగా కోస్తా ప్రాంతంలో పెనుతుఫాను సంభవించి ప్రకృతి అతలాకుతలమైంది. జన జీవనం స్తంభించిపోయింది. ప్రధాని మొరార్జీ దేశాయి కావలికి హెలికాప్టర్‌లో పర్యటనకు వచ్చారు. నేను మా రికార్డింగ్ సిబ్బందితో వెళ్ళి రహదారి బంగళాలో వారిని కలిశాను. వారిని తమ సందేశం ఇవ్వమని కోరాను. వెంటనే అంగీకరించారు. అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టరు సి. అర్జునరావు తుఫాను సహాయక చర్యలు పటిష్ఠంగా చేశారు.

    కార్యక్రమాలలో మార్పు: అంతకుముందు సాహిత్య కార్యక్రమాలు తప్ప ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చిన ప్రసంగాలు ఉండేవి కావు. రెండిటికీ నేను సమ ప్రాధాన్యం ఇచ్చాను. గుంటూరు, విజయవాడ, ఏలూరు ప్రాంత కవి పండితులకు రేడియో అవకాశాలు తరచూ వచ్చేవి.  నేను నెల్లూరు నుండి రాజమండ్రి వరకు గల జిల్లాల నుండి విస్మృత కవులను పిలిచి రికార్డు చేశాను.

    వయోభారంతో రాలేని వారిని నేనే వారి వద్దకు వెళ్ళి రికార్డు చేశాను. అలాంటి వారిలో నెల్లూరులో దీపాల పిచ్చయ్య శాస్త్రి, మరుపూరు కోదండరామిరెడ్డి ప్రముఖ కవులు. ఇతరులలో పసల సూర్యచంద్రరావు (ఏలూరు), ఏ.బి. నాగేశ్వర రావు (ప్రకాశం మంత్రివర్గంలో మంత్రి), క్రొవ్విడి లింగరాజు (ప్రకాశం కార్యదర్శి) – ఇలా ఎందరినో రికార్డు చేశాం.

    బెజవాడ గోపాలరెడ్డి, యం.ఆర్. అప్పారావు, అమ్మణ్ణ రాజా, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కొండా పార్వతీ దేవి, జి.యస్.రాజు స్టూడియో రికార్డింగ్ చేశారు.

    అన్ని జిల్లాలు నేను రికార్డింగు యూనిట్‌తో తిరిగాను. రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్స్, తణుకులో పేపర్ మిల్స్ – ఇలా పారిశ్రామిక ప్రగతిని కూడా ప్రచారం చేశాం. కొర్రపాటి గంగాధరరావు, పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి, కొండముది శ్రీరామచంద్రమూర్తి, బేతవోలు రామబ్రహ్మం, ఏలూరిపాటి అనంతరామయ్య, హితశ్రీ – వీరంతా పాత తరం రచయితలు. వారి గళాలకు ప్రాధాన్యం ఇచ్చాం.

    ఇది నేనేదో గొప్పలు చెప్పడం కాదు. సందర్భానుసారంగా అందరినీ ఆహ్వానించాం. మండలి వెంకట కృష్ణారావు స్వయంగా స్టూడియోకు వచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టరు మోహన కందా, ఏలూరు రేంజ్ పోలీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ డి.వి.యల్.యన్. రామకృష్ణారావు, నాగార్జున విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్, అధ్యాపక బృందం కార్యక్రమాలలో పాల్గొన్నారు. అప్పటి యూనివర్సిటీ రిజిస్ట్రారుగా ఐఎఎస్ ఆఫీసరు డి. మురళీకృష్ణ ఉండేవారు. గుంటూరు డి.ఐ.జి.గా కె. అరవిందరావు పనిచేస్తున్నారు. అనేక సాహిత్య కార్యక్రమాలలో నేను, ప్రసాదరాయ కులపతి పాల్గొన్నాం.

    విజయవాడలో తొలిసారి పనిచేసిన ఆ జ్ఞాపకాలు మధురస్మృతులు.

    (మళ్ళీ కలుద్దాం).

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here