నాటకకర్తగా ‘ఆకెళ్ళ’

0
7

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ కథా నాటక రచయిత ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ గారి ‘ఆకెళ్ళ నాటకాలు’ రెండవ సంపుటానికి కె.పి. అశోక్‌కుమార్ గారు వ్రాసిన ముందుమాట ఇది. [/box]

[dropcap]ఆ[/dropcap]కెళ్ళ సినీ రచయితగా సుప్రసిద్ధులు. మొదటి చిత్రం ‘మగమహారాజు’ నుంచి దాదాపు ఎనబై చిత్రాలకు సినీ రచయితగా పనిచేశారు. ఆకెళ్ళగా చెప్పబడే ఆకెళ్ళ వెంకటసూర్యనారాయణ ముందుగా కథా రచయితగానే వెలుగులోకి వచ్చారు. వివిధ వార, మాసపత్రికల్లో రెండు వందలకు పైగా కథలను రాశారు. నవలా రచయితగా అనేక అవార్డులను అందుకున్నారు. మరికొన్ని కథలు, నవలలు హిందీ, కన్నడ, తమిళ భాషలలోకి అనువదింపబడ్డాయి. నవలా రచయితగా సినిమా రంగంలోకి ప్రవేశించారు. తర్వాత రంగస్థల రచయితగా, టి.వి. సీరియల్ రచయితగా పురోగమించారు. టి.వి. సీరియల్ రచయితగా వేలాది ఎపిసోడ్స్ రాయడం జరిగింది. ఎన్నో టి.వి. ఎపిసోడ్స్‌కి దర్శకత్వం వహించడంతో పాటు “అయ్యయ్యో బ్రహ్మయ్య అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. 16 సార్లు నంది బహుమతుల నందుకున్నారు.

బాల నటుడిగా జీవితం ఆరంభించిన ఆకెళ్ళ నటుడిగా ఎన్నో బహుమతులను పొందారు. సినీ రచయితగా విజయం సాధించిన తర్వాత నాటకాల వైపుకు తమ దృష్టిని మళ్ళించారు. నాటిక, నాటకం, పిల్లల నాటిక, పద్య నాటకం, రేడియో నాటకాలు – ఇలా అన్ని విభాగాల్లో రచనలు చేశారు. వారి నాటికల్లో “అమ్మ, రేపటి శత్రువు, ఇండియన్ గ్యాస్, మూడోపాదం, తలుపు, ఆంబోతు, కొత్త సైన్యం, అరవై దాటాయి ఎందుకూ?” మొదలైనవి సుప్రసిద్ధాలు. “కాకి ఎంగిలి, క్రాస్ రోడ్స్, ఎయిర్ ఇండియా, ఓం” మొదలైన సాంఘిక నాటకాలు విశేషంగా పేరు పొందాయి. పద్య నాటకాల్లో ‘శ్రీనాథుడు’ ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. “అల్లసాని పెద్దన, రాణా ప్రతాప్, రాణి రుద్రమ, ఇదొక విషాదం, మీ ఇల్లెక్కడ?” నాటకాలు విశేషంగా ప్రేక్షకుల మన్ననలను పొందేయి. ఇవి కాకుండా రంగస్థలం మీద అమిత ప్రజాదరణ పొందిన తొమ్మిది నాటకాలు ఇప్పుడు పుస్తక రూపంలో మనముందుకొచ్చాయి.

ఆకెళ్ళ నాటకాలు కుటుంబ సంబంధాలు – మానవ సంబంధాలలో వస్తున్న మార్పును సూచిస్తాయి. అన్ని సంబంధాలు డబ్బు సంబంధాలుగా మారుతున్న క్రమంలో, మానవత్వపు విలువలు అడుగంటుతున్న దశలో – మనుషుల మధ్య ఆత్మీయతలు, అనుబంధాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తాయి. లంచగొండితనం, అక్రమ సంపాదనలు ఆ వ్యక్తులనే కాదు, వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేస్తాయని కొన్ని నాటకాలు హెచ్చరిస్తాయి. మితిమీరిన డబ్బు, అధికారం మనుషులను ఎలా విశృంఖలంగా తయారు చేస్తాయో చెబుతాయి. పిల్లల్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తాయి.

అద్దె ఇంటి అగచాట్లను వివరిస్తూ ఎన్నో కథలు, నాటికలు వచ్చాయి. ఇవి ఎక్కువగా హాస్యధోరణిలో కొనసాగాయి. అలా కాకుండా అందులోంచి ఒక సీరియస్ అంశాన్ని తీసుకుని ఆకెళ్ళ రాసిన నాటకం “మీ ఇల్లెక్కడ?”. ఇంటి యజమానులు ఎంత వేధించినా, ఎన్ని రకాల షరతులు విధించినా అద్దెకున్న వాళ్ళు సర్దుకొనిపోక తప్పదు. అది వారి అవసరం. బంధువులు గానీ, ఎక్కువ మంది విజిటర్స్ కానీ రాకూడదని ఆంక్షలు పెట్టే యజమానులు – తమ ఇంట్లో అద్దెకుండేవారికి ఆక్సిడెంట్ అయినా, రోగగ్రస్థులు అయినా, ఆసుపత్రి పాలయినా వెంటనే వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ వారు మరణిస్తే ఇంటికి సున్నాలు, రంగులు వేయించాల్సి వస్తుంది, అదొక ఖర్చు. ఇంట్లో ఏడ్పులు, దినసరి కార్యక్రమాలు వాళ్ళకే కాకుండా ఇతర వాటాల వారికి చికాకు కలిగిస్తుంది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే ప్రమాదముంటుంది. ఇంట్లో కీడు జరిగిందనే సెంటిమెంటుతో కొత్తగా అద్దెకొచ్చే వాళ్ళు రారు. ఇంటి యజమానులకు కూడా అదో సెంటిమెంటుగా పట్టి పీడిస్తుంటుంది.

అద్దెకిచ్చిన ఇళ్ళలోనే కాదు – బహుళ అంతస్థుల భవనాలలో కూడా ఇదే ధోరణి వుంటుంది. ఇంటి యజమానులు, అద్దెకున్నవాళ్ళ ప్రేమ ఆప్యాయతలతో ఒకే కుటుంబంలా కలిసి పోయినవారు, రోగగ్రస్తు లయినంత మాత్రాన వారిని వదిలించుకోవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సబబు? అద్దె ఇంట్లో పడిన అగచాట్లతోనే, స్వంత ఇల్లు ఉండాల్సిన అవసరాన్ని చాలామంది గుర్తిస్తారనేది జీవనసత్యం. ఈ నాటకంలో కూడా బతకడానికి ఇల్లు కట్టుకోనక్కరలేదు కానీ చావడానికి ఇల్లు కట్టుకోవాలని జగన్నాథం చివరకు గాని తెలుసుకోలేకపోతాడు. ఈ అంశాన్ని అంతస్సూత్రంగా తీసుకుని అల్లిన ఈ నాటకంలో స్వార్థపరుడు, పిసినారి, డబ్బు యావ గల ఇంటి యజమాని కృష్ణారావు, రిటైర్ అయింతర్వాత ఎక్కడ డబ్బు ఇవ్వాల్సి వస్తుందోనని కూతురు, అల్లుడ్ని దూరం చేసుకుంటాడు. కొడుకు అమెరికా పోయి దూరమైపోతాడు. మంచి, చెడు, దయ, జాలి కలిగిన ప్రేమమూర్తి శారద అతని భార్య. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ తన పనులు చక్కబెట్టుకునే నరసింహం బాబాయి. ఇంటి యజమాని కుటుంబాన్ని అక్కా బావలుగా తలచి ఆత్మీయంగా మసలుకునే జగన్నాథం, లక్ష్మి దంపతులు ఆ ఇంట్లో అద్దెకు ఉంటారు. జగన్నాథంకు కాన్సర్ అని తెలియగానే వున్న పళంగా వారిని ఇల్లు ఖాళీ చేయమని కృష్ణారావు ఆజ్ఞాపిస్తాడు. అంత బాధలో కూడా జగన్నాథం – శారద గుండెపోటుతో విలవిల్లాడుతుండగా, వైద్య సహాయం కోసం ప్రాకులాడుతాడు. శారద మరణిస్తే కన్నకొడుకు, కూతురు పట్టించుకోకపోతే, అన్నీ తానై జగన్నాథం పనులు చక్కబెడతాడు. అప్పుడు కానీ కృష్ణారావుకు జ్ఞానోదయం కలగదు.

ఈనాడు రాజకీయాలన్నీ భ్రష్టుపట్టిపోయాయి. నిస్వార్థపరులు, త్యాగశీలురు ఈ రోజు ఎన్నికలలో నిలబడే పరిస్థితి లేదు. ఒకవేళ వున్నా వాళ్ళు గెలిచే పరిస్థితి అంతకన్నా లేదు. రాను రాను ఎన్నికలు మరీ ఖరీదైన వ్యవహారంలా మారిపోయాయి. అందుకని డబ్బున్న వాళ్ళకే టిక్కెట్లివ్వడానికి అన్ని పార్టీలు పోటీపడుతుంటాయి. వారి నేపథ్యాన్ని గాని, వాడికి అంతడబ్బు ఎలా వచ్చిందని గానీ ఎవరు పట్టించుకోరు. దాంతో దొంగలు, హంతకులు, మోసగాళ్ళు నాయకులుగా రూపాంతరం చెందుతున్నారు.

“కొత్తనాయకుడు” అనే ఈ నాటకంలో మంత్రిగా పని చేస్తున్న ఆదినారాయణ తరతరాలకు సరిపోయేంతగా సంపాదించినా, ఇంకా ఆశలు చావని నాయకుడు. డబ్బుకోసం ఏం చేసినా తప్పులేదని విశ్వసిస్తాడు. వాళ్ళ పెద్దబ్బాయి – పెద్ద కోడలు కార్పొరేట్ విద్యారంగాన్ని చిన్నబ్బాయి – చిన్నకోడలు కార్పొరేట్ వైద్యరంగాన్ని శాసిస్తుంటారు. అన్ని విలువలు మర్చిపోయి వారు ధనార్జనకే పరిమితమై చేయని అన్యాయాలు లేవు. వాళ్ళను రక్షించడానికి తండ్రిగా ఆదినారాయణ తన అధికారాన్ని ఉపయోగిస్తుంటాడు. హఠాత్తుగా కాలు విరిగి మంచం పట్టిన ఆదినారాయణకు తన కుటుంబీకుల నిజస్వరూపం తెలిసివస్తుంది. ఆయనను తన పదవికి రిజైన్ చేసి వచ్చే ఎన్నికలలో తనను అభ్యర్థిగా నిలబెట్టమని కోడలు ఒకవైపు, తమకు టిక్కెట్ ఇప్పించమని ఇద్దరు కొడుకులు వాదులాడుకుంటూ ఆదినారాయణను గృహఖైదు చేసి, తిండి పెట్టకుండా హింసిస్తుంటారు. కథ కొన్ని మలుపులు తిరిగిన తర్వాత ఆదినారాయణ అందర్నీ పోలీసులకి అప్పగించి, తాను లొంగిపోతాడు. ఏ కల్మషం లేని తన మనవడ్ని, తన రాజకీయ వారసుడిగా తయారు చేయమని చిన్న కోడలుకు, బావమరిదికి అప్పగిస్తాడు.

“ఋషి” నాటకంలో, అవసానదశలో వున్న తండ్రికిచ్చిన మాట కోసం రాఘవ బాల్యం నుండే కష్టపడి, వ్యవసాయం చేసి, తన ఇద్దరు సవతి తమ్ముళ్ళను బాగా చదివించి, ప్రయోజకులను చేస్తాడు. వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు చేస్తాడు. అహర్నిశలు ఇంటి బాగుకోసం తాపత్రయపడుతూ, తాను అవివాహితుడుగానే మిగిలిపోతాడు. మేనమామ అయిన పానకాలు, తన బావ చనిపోయిన నాటినుండి ఆ ఇంటిని భ్రష్టుపరిచి, వారి ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తుంటాడు. దానికోసం అన్నదమ్ముళ్ళ మధ్య చీలికలు తెచ్చి, రాఘవ మీదికి ఉసిగొల్పుతాడు. దీనికి తోడికోడళ్ళ మధ్య ఉన్న అసూయ కూడా దోహదం చేస్తుంది. అంతా కలిసి రాఘవను నేరస్తుడిగా నిలబెడతారు. రాఘవకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేక, తల్లి పార్వతి, తమ్ముళ్ళు చేస్తున్న మోసాన్ని, వారి ద్రోహచింతనను తెలియజేస్తుంది. అయినా వినిపించుకోకుండా రాఘవ తన మంచితనంతో, త్యాగబుద్ధితో కుటుంబసభ్యుల కళ్ళు తెరిపిస్తాడు. చివరకు పార్వతి, తన అన్నగారైన పానకాలు నిజస్వరూపాన్ని అందరిముందు బట్టబయలు చేస్తుంది. మీరు ప్రయోజకులయ్యారు. ఇంకా నేను మిమ్మల్ని పట్టుకుని పాకులాడటంలో అర్థం లేదు. నా దారిన నన్ను వెళ్ళనివ్వండంటూ, తల్లిని తీసుకుని రాఘవ బయటకు వెళ్ళిపోవడంతో నాటకం ముగుస్తుంది.

“పరుగు” నాటకంలో, ఎన్ని రకాలుగానైనా డబ్బు సంపాదించడమే ముఖ్యం. డబ్బుతో విలాసమయ జీవితాన్ని గడపాలి. ఆడదాన్ని నోరెత్తకుండా అణిగిమణిగి వుంచాలి అని నమ్మే ఆర్.టి.ఒ. అమరేంద్ర విచ్చలవిడిగా డబ్బు సంపాదిస్తాడు. తండ్రి బోధనలు అలవర్చుకున్న కొడుకు శ్రీధర్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తూ, లంచగొండిగా రెండుచేతులా సంపాదిస్తుంటాడు. తండ్రి కొడుకులిద్దరికీ డబ్బుతో వచ్చిన అన్ని దురలవాట్లు ఉంటాయి. శ్రీధర్ కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టి, పుట్టింటికి తరిమేస్తాడు. ఇక కూతురు ప్రియాంక మేనబావ ఆనంద్ ను పెళ్ళి చేసుకున్నా, పుట్టింట్లోంచి కదలదు. తనతో పనిచేసే రాజేష్ అనే సాఫ్ట్‌వేర్ కుర్రాడితో ప్రేమలోపడి, భర్తకు విడాకులివ్వాలి అనుకుంటుంది. ఇదంతా చూస్తున్న తల్లి ప్రభకు, ఈ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాలో అంతుపట్టదు. ఇంతలో బండారం బయటపడి అమరేంద్ర సస్పెండ్ అవుతాడు. అమరేంద్ర ఇన్నాళ్ళుగా సంపాదించిన అక్రమార్జన మిత్రుడు జయకృష్ణ దగ్గర దాచుకుంటాడు. వాడ్ని డబ్బు తెమ్మంటే నాకెప్పుడొచ్చావ్ అని ఎదురు తిరుగుతాడు. పైగా వాళ్ళను బ్లాక్‌మెయిల్ చేయడానికి పూనుకుంటాడు. జయకృష్ణ చేసిన మోసంతో ఆస్తులన్నీ పోగొట్టుకుని, ఉద్యోగం తిరిగి వచ్చే అవకాశం లేని అమరేంద్ర పరిస్థితి చూసి రాజేష్, తాను ప్రియాంకను పెళ్ళి చేసుకోనని చెప్పేస్తాడు. విడాకుల కోసం కోర్టుకెళ్ళిన శ్రీధర్‌కు – తన భార్యను పెట్టిన చిత్రహింసలను ఆమె కోర్టులో వివరించడంతో క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. క్రమశిక్షణ లేని జీవితాలు ఎలా అస్తవ్యస్తమవుతాయో అమరేంద్ర కుటుంబం గుర్తిస్తుంది. దాంతో అందరూ తమ తమ తప్పులు దిద్దుకోవడంతో నాటకం ముగుస్తుంది.

“కలనేత” లో నారాయణ ఇంట్లో మగ్గం నేస్తే, సహాయంగా కూతురు రజిత పనిచేస్తుంటుంది. కొడుకు సైకిలు మీద అమ్ముకుని వస్తుంటాడు. యాదమ్మ వైకుంఠం దంపతులు నేతపని వదిలేసి, రెండు ఎకరాలు పొలం కొంటారు. ఐదెకరాలు కౌలుకు తీసుకుంటారు. బాంక్ లోను మీద పత్తిపంట వేస్తారు. మేనరికం కారణంగా యాదమ్మ కొడుకు రమేశ్, రజిత పట్ల ఆకర్షితుడై ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. యాదమ్మ స్వార్థపరురాలు, డబ్బు మనిషి. డబ్బు లేని మేనరికం ఎందుకని రజిత సంబంధాన్ని యాదమ్మ తిరస్కరిస్తుంది. ఆ ఊళ్ళో వ్యాపారం చేసి, స్థితిమంతుడైన గిరి కూతుర్ని రమేశ్‌కిచ్చి పెళ్ళి చేస్తే, వారి ఆస్తినంతా అనుభవించవచ్చని తలపోస్తుంది. ఆ అమ్మాయి తిరుగుబోతు కాబట్టి పెళ్ళి చేసుకోనని రమేశ్, అతనికి వత్తాసుగా తండ్రి వైకుంఠం నిలుస్తాడు. కానీ యాదమ్మ ఈ పెళ్ళి జరగకపోతే పురుగుమందు తాగుతానని బెదిరిస్తుంది. ఒకవైపు గిరి, ఇంకోవైపు యాదమ్మల బ్లాక్‌మెయిల్‌ను భరించలేక, తన అశక్తతను గుర్తించిన వైకుంఠం ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. అతడ్ని రక్షించిన నారాయణ కుటుంబీకులు, యాదమ్మను కూడా ప్రాణాపాయస్థితి నుండి బయటపడేస్తారు. నారాయణ కుటుంబం చూపే ప్రేమానురాగాలకు యాదమ్మ మనసు కరిగిపోతుంది. రజితను కోడలుగా చేసుకోవడానికి అంగీకరిస్తుంది. అంతలో ప్రభుత్వం వారు నేతన్నలను ఆదుకునేందుకు వరంగల్లో పెద్దఎత్తున టెక్స్‌టైల్ పార్కు సిరిసిల్లలో అపారల్ పార్కు పెట్టడానికి నిశ్చయిస్తుంది. నేత కార్మికులను ఆదుకోవడానికి బతుకమ్మ చీరలు నేయమని ఇచ్చిన అడ్వాన్స్‌తో నారాయణ కొడుకు వస్తాడు. నేతగాళ్ళ జీవితంలో వచ్చిన కొత్తమార్పును చూపిస్తూ నాటకం ముగుస్తుంది.

తల్లిదండ్రుల బలహీనతలను సాకుగా చూపించి – తల్లిదండ్రులు ప్రేమ చూపించలేదని, తమకు సమయం కేటాయించలేదని అలిగి పిల్లలు చెడు అలవాట్లకు బానిసలయితే, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులతో పాడుచేసుకున్నట్లు అవుతుందనే విషయాన్ని “పెద్దలు జాగ్రత్త”గా గమనించాలని ఈ నాటకం హెచ్చరిస్తుంది. డబ్బున్న వారి పిల్లల్ని టార్గెట్ చేసుకుని వారికి మత్తుమందులు అలవాటు చేసి, వాళ్ళ ద్వారా డబ్బు గడించాలనుకునే దుర్మార్గులు ఎంతోమంది ఉన్నారు. పిల్లల చేతికి బోలెడంత డబ్బు ఇచ్చి, వారేం చేస్తున్నారో పట్టించుకోని తల్లిదండ్రులు ఉంటే, ఆ పిల్లలు కూడా విశృంఖలంగా తయారవుతారు. బాధలో, టెన్షన్‌లో వున్న పిల్లలను గుర్తించి, వాళ్ళకు రిలాక్సేషన్ పేరిట మత్తు చాక్లెట్లు, బిళ్ళలు అలవాటు చేస్తారు. ఒకసారి దానికి అలవాటు పడినవారు, అది లేకపోతే ఉండలేరు. డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతారు. ఆ మందు కోసం ఏమైనా చేయడానికి తెగిస్తారు. అన్ని విలువలను వదులుకుంటారు. తమ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసినా, తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేరు. చెబితే తమ పిల్లలకి ప్రభుత్వం కౌన్సిలింగ్ ఇప్పిస్తుందని, పదిమందిలో పరువు పోతుందనీ దాచిపెడతారు. ఇది అలుసుగా తీసుకుని డ్రగ్స్ అమ్మేవాళ్ళు విజృంభిస్తుంటారు. సకాలంలో పిల్లలను గమనించడం, ఆ డ్రగ్స్ అమ్మేవాళ్ళను పట్టుకోవడాన్ని ఉత్కంఠభరితంగా ఈ నాటకంలో చిత్రీకరించారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న “వైద్యం నమూనా” వల్ల మొత్తం ప్రజారోగ్యానికి ప్రమాదం వచ్చిపడింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పట్టాలు పుచ్చుకునే వైద్యులలో అత్యధిక శాతం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. వారికిచ్చే శిక్షణ ప్రైవేట్ రంగంలో పనిచేయడానికి ఉద్దేశించిందే. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశానికి అత్యధిక స్థాయిలో మార్కులు సంపాదించడానికి వెంపర్లాడేవాళ్ళు. అవే కళాశాలల్లో సీట్లు సంపాదించలేక, లక్షలు కుమ్మరించి ప్రైవేట్ కళాశాలల్లో చదివేవాళ్ళు ప్రజారోగ్య పరిరక్షణకు అంకితం గాలేరు. దీంతో, వైద్యవృత్తిలోకి ప్రస్తుతం ప్రవేశిస్తున్న వాళ్ళు, తాము చదువుకు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

కార్పొరేట్ ఆసుపత్రులు వైద్యసేవల కంటే ధనార్జనకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం వల్ల, క్రమక్రమంగా డబ్బుకోసం ఏమైనా చేసే స్థితికి దిగజారారు. అవసరం వున్నా, లేకపోయినా తమ దగ్గరే అన్ని టెస్టులు చేయించాలన్న నిబంధనను అమలులోకి తెచ్చారు. ఇష్టారాజ్యంగా మందులు రాయడం, అవి కూడా ఖరీదైనవి రాయడం మామూలైపోయింది. మందుల అమ్మకాలు పెంచుకోవడానికి ఆయా కంపెనీలు డాక్టర్లను, ఆసుపత్రులను ప్రలోభపెడతాయి. రాయితీలు, బహుమానాలను అందజేస్తారు. ఇక ఆపరేషన్లతో ప్రహసనం. బీమా వుందని తెలిసినా, డబ్బు వుందని తెలిసినా చచ్చేవాడికి కూడా ఆపరేషన్లు చేయడానికి వెనుకాడరు. డబ్బు కోసం గర్భిణీ స్త్రీలకు అవసరం లేకపోయినా సిజేరియను ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ విధంగా వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న సంక్షోభం, రకరకాల దోపిడీలను, అమానవీయతను కేంద్రంగా తీసుకుని, నిజంగా జరిగిన సంఘటనలను మేళవించి ఆసక్తికర కథా కథనాలతో ఆకెళ్ళ “మమత హాస్పిటల్స్” అనే నాటకాన్ని రూపొందించారు. ఇందులో ఆదర్శ భావాలు కలిగిన డా. రఘు తన క్లాస్‌మేట్ మమతను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. తన మామ జయరామ్ పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్‌లో పని చేస్తుంటాడు. పేదల పట్ల జాలి, దయ, ప్రేమ కలిగిన డా. రఘు వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా నీతి, నిజాయితీగా పనిచేయడం యం.డి. జయరామ్‌కు నచ్చదు. ప్రతీదీ వ్యాపారమే అని నమ్మిన జయరామ్, డా.రఘు ఎలాంటి ప్రలోభాలకు లొంగడని తెలుసుకుని, తన కూతుర్ని వదిలి వెళ్ళాలని, విడాకులు తీసుకొమ్మని బెదిరిస్తాడు. కర్తవ్యం, సేవాధర్మాలే ముఖ్యమని భావించిన డాక్టర్ రఘు అన్నీ వదులుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు. చివరకు ఊహించని మలుపులతో నాటకం ఒక కొలిక్కి వస్తుంది. అలాగే “కొత్త నాయకుడు” నాటకంలో కూడా రాజకీయ నాయకుడు ఆదినారాయణ చిన్న కొడుకు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడం – అవి వ్యాపార కేంద్రాలుగా మారి ప్రజల్ని ఎలా పీడిస్తున్నాయో వివరించారు.

జనం అడ్డూ అదుపు లేకుండా వాహనాలు నడుపుతున్నారు. వాళ్ళ జీవితాలని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఎందరో అభాగ్యుల జీవితాలను వాళ్ళే అర్ధాంతరంగా చిదిమేస్తున్నారు. దీనికి కారణమయ్యే వారిని హెచ్చరిస్తూ ఆకెళ్ళ రాసిన నాటకమే “అంజలి”. ఇందులో బాగా డబ్బున్నవాళ్ళు, ధనవంతులు తమ పిల్లల మీద ప్రేమతో వాళ్ళకు అతి ఖరీదైన కార్లను బహుమానంగా కొనిస్తుంటారు. మన రోడ్లు, మన పరిస్థితులకు అనువుగా ఉండని ఆ విదేశీ కార్లను, అతివేగంగా నడిపి ఇతరులను చంపడమో, తాము చావడమో మామూలయిపోయింది. ఈ నాటకంలో కూడా ధనవంతుల అబ్బాయి వేణు అతివేగంగా కారు నడిపి, అంజలి అనే అమ్మాయిని చంపివేస్తాడు. అది తెలుసుకున్న అతని తండ్రి జె.కె. వెంటనే కొడుకుని ఢిల్లీకి పంపించివేస్తాడు. తన డ్రైవర్‌ను పిలిచి, ఆ నేరం తనపై వేసుకుని జైలుకు వెళితే అతడి కుటుంబాన్ని సంరక్షిస్తానని షరతు పెడతాడు. ఆ నేరం తనపైన వేసుకొని డ్రైవర్ జైలుకెళతాడు. తర్వాత జె.కె. డ్రైవర్ కుటుంబాన్ని పట్టించుకోడు. తండ్రి, కొడుకులలో పరివర్తన రావడానికి, బాధితులకి న్యాయం జరగడానికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకోవాలంటే ఈ నాటకం చదవాల్సిందే. ఫాంటసీ నాశ్రయించి ఈ నాటకాన్ని తీర్చిదిద్దడం వల్ల, ఈ నాటకం ప్రేక్షకులకు మరింత ఉత్సుకతను రేకెత్తించగలిగింది.

నాటకం మొత్తం ఇతివృత్తాన్ని లేదా అంతసూత్రాన్ని క్లుప్తంగా తెలియజేసి, దాని ఆధారంగా అల్లుకున్న నాటక రచనని ఇందులో అందజేయడం విశేషం. సినీమాలకు చెప్పే సింగిల్ లైన్ స్టోరీ ఇది. దాన్ని డెవలప్ చేసుకుని పకడ్బందీ కథాకథనాలతో అల్లిన స్ర్కిప్టులా ఈ నాటకాలు తయారయ్యాయి. నాటక ఇతివృత్తానికి తగినట్లుగా సన్నివేశాల కల్పన, పాత్ర పోషణ, సంభాషణా చాతుర్యం – వీటన్నింటి మధ్య అంతర్గతంగా వుండే కార్యాకరణ సంబంధంతో ఈ నాటకాలన్నీ పటిష్టంగా తయారయ్యాయి. ఆసక్తికరమైన కథాకథనాలతో అత్యంత ఉత్సుకతను రేకెత్తిస్తాయి. సెంటిమెంటుతో కూడిన నాటకాలు ముఖ్యంగా కుటుంబ సంబంధాలను చిత్రించిన నాటకాలను చివరి వరకు ఆసక్తిగా రూపొందించడం కష్టం. కానీ ఈ నాటకకర్త దీన్ని అవలీలగా అధిగమించేశారు. ఇక సమస్యను ఆధారం చేసుకున్న నాటకాలలో, ప్రధాన సమస్యకు అనుబంధంగా ఉన్న ఇతర సమస్యలను కూడా పేర్కొనడం ఇందులో కనిపిస్తుంది. ఉదాహరణకు “కొత్తనాయకుడు” నాటకంలో అవినీతిపరుడైన రాజకీయనాయకుడి గురించి తెలియజేస్తూనే, అతను సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్న వైనం, అతని కుమారులు విద్యను, వైద్యాన్ని కార్పొరేట్ చేసి దోచుకోవడాన్ని, చివరకు తండ్రిని చంపడానికి ప్రయత్నించడం ఇలా అన్నింటినీ చిత్రీకరించారు. అన్యాయాన్ని ఎదిరించాలని చూసిన వాళ్ళను ఎలా అణిచివేస్తుంటారో చూపిస్తారు. “ఋషి” నాటకంలో అన్నదమ్ములు రాఘవను ఎన్ని రకాలుగా వేధిస్తుంటారో చెబుతూనే, పానకాలు మామయ్య రకరకాల కుట్రలను తెలియజేస్తూ, రాఘవ మంచితనాన్ని ఎస్టాబ్లిష్ చేయడం బాగా వచ్చింది. అవినీతి డబ్బు వల్ల వచ్చే హెూదా, గౌరవాలు, పరపతి – దానివల్ల వారిలో చోటుచేసుకునే అహంకారం, దుర్వ్యసనాలు, వారి పిల్లల జీవితాలను కూడా ఎలా నాశనం చేస్తాయో సోదాహరణంగా తెలియజేశారు. కార్పొరేట్ వైద్యం మనుషులను ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో వివరిస్తూ, అనేక కథలు వచ్చాయి. కొన్ని నవలలు కూడా వచ్చాయి. ఇదే అంశాన్ని తీసుకుని ఆకెళ్ళ “మమత హాస్పిటల్స్” అనే నాటకం రాయడం అభినందనీయం. దృశ్యమాధ్యమంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ఈ నాటకం ఉపయోగపడుతుంది. పిల్లల్లో పెరుగుతున్న మత్తుమందుల వాడకం, ర్యాష్ డ్రైవింగ్, బాధ్యతా రాహిత్యాన్ని ఖండిస్తూ అందరి దృష్టి అటువైపు మళ్ళేలా చేశారు. ఆ విధంగా ప్రేక్షకుడ్ని ఆలోచింపజేయడంలో నాటకకర్త విజయం సాధించారు.

చాలామంది నాటకకర్తలు నాటకంలో పాత్రలను పరిచయం చేస్తూ, వారి స్వభావాలను, గుణగణాలను కూడా తెలియజేస్తారు. పాఠకుడికి అన్నీ ముందే తెలియజేస్తే, నాటకం చదవడంలో ఉత్సాహం కొరవడుతుంది. ఆకెళ్ళ మాత్రం నాటకంలో పాత్రలు – పాత్రధారులను మాత్రమే తెలియజేశారు. నాటకంలోని సంభాషణల ద్వారా పాత్రల స్వభావాన్ని, వారి ఆలోచనా ధోరణిని తెలియజేస్తారు. “మీ ఇల్లెక్కడ?” లో కృష్ణారావు, శారదల సంభాషణలతో భార్యాభర్తల స్వభావాన్ని తెలియజేస్తారు. స్వార్థం, స్వలాభం తప్ప ఏమీ పట్టించుకోని వ్యక్తిగా కృష్ణారావు అవకాశవాది. ఏ ఎండకాగొడుగు పట్టే వ్యక్తిగా, కాకారాయుడిగా కృష్ణారావు బాబాయి మనకు సంభాషణల ద్వారానే పరిచయమవుతారు. “కొత్తనాయకుడు” నాటక ప్రారంభంలో రాజకీయ నాయకుడు ఆదినారాయణ మీద ఏర్పాటు చేసిన టి.వి. కార్యక్రమ చిత్రణ ద్వారా అతనేమిటో తెలుస్తుంది. అతన్నాశ్రయించుకున్న వాళ్ళ స్వభావాలు కూడా వాళ్ళ మాటల ద్వారానే తెలుస్తుంది. “పరుగు” నాటకంలో కూడా వాళ్ళ స్వభావాలను ఆయా పాత్రలే తెలియజేస్తాయి. స్వార్థం, డబ్బుయావ, దురాశతో నిండిన యజమాని పాత్రను అత్యంత సహజంగా చిత్రీకరించడంలో నాటకకర్త చూపించిన ప్రతిభ ప్రశంసనీయం. ఆదర్శ భావాలు కలిగిన వైద్యుడిగా డా. రఘు “మమత హాస్పిటల్స్”లో, కుటుంబక్షేమానికే కట్టుబడిన రాఘవను “ఋషి”గా ప్రతిష్టించడంలో చక్కటి నేర్పు కనబరిచారు. చచ్చి దెయ్యమై వచ్చిన “అంజలి” తన వయసుకు తగిన మాటలనే మాట్లాడుతుంది. ఫాంటసీ అయినప్పటికీ నాటకకర్త ఆ పాత్రకు ఎక్కువ స్వేచ్ఛనియ్యలేదు. చాలా నాటకాలలో కొన్ని పాత్రలు కథా గమనానికి విరుద్ధంగా మిగతా పాత్రలను డామినేట్ చేయబోతాయి. లేదా ఆయా పాత్రలే కొన్నిసార్లు అతిగా ప్రవర్తిస్తుంటాయి. కొంతమంది నాటకకర్తలు కొన్ని పాత్రల పట్ల లేనిపోని అభిమానాలను పెంచుకొని, వాటికి అధిక ప్రాధాన్యాన్నిచ్చి, కథా గమనాన్ని కుంటుపరుస్తున్నాయనే విషయాన్ని గ్రహించరు. కానీ ఆకెళ్ళ నాటకాలలో పాత్రలన్నీ వారి వారి హద్దులలోనే ఉంటాయి. వారి ప్రమేయం, వారి స్వభావాని కనుగుణంగానే ప్రవర్తిస్తాయి. ఎంతో అనుభవజ్ఞుడైన నాటకకర్తకు మాత్రమే ఇది సాధ్యం.

నాటకానికి సంభాషణలు ప్రాణం. ఈ సంభాషణలు పాత్రల స్వభావాన్ని తెలియజేస్తాయి. కథాగమనానికి తోడ్పడుతాయి. పాఠకులలో, ప్రేక్షకులలో ఉత్సుకతను నిలుపుతాయి. ఆకెళ్ళ నాటకాలలోని సంభాషణలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి. పంచ్ డైలాగులున్నాయి. వ్యంగ్యాన్ని పొదువుకున్నవి వున్నాయి. వెతికితే కొన్ని కోటబుల్ వర్డ్స్ కూడా కనిపిస్తాయి. పాత్రోచిత సంభాషణలు కాబట్టి ఆదినారాయణ ఒక రాజకీయ నాయకుడిలా, నరసింహం బాబాయి ఒక అవకాశవాదిలా – స్కూలు పిల్లలు కాబట్టి చిన్నా, చింటూ అలాగే మాట్లాడతారు. ముఖ్యంగా “కలనేత” గురించి చెప్పుకోవాలి. తెలంగాణ ప్రాంత నేపథ్యంలో ఈ నాటకం రూపొందింది కాబట్టి, దీన్ని తెలంగాణ మాండలికంలో తీర్చిదిద్దడం అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇందులో తెలంగాణ మాండలికాన్ని వాడుకున్న తీరు అద్భుతం. అనవసర వాక్యం కానీ, వృథా సంభాషణలు కానీ దుర్భిణీ వేసి వెతికినా ఆకెళ్ళ నాటకాలలో కనిపించవు. అదే నాటకకర్తగా ఆకెళ్ళ సాధించిన విజయం. ఉదాహరణలుగా కొన్ని సంభాషణలను ఇవ్వాలని ఉన్నా నేను ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ నాటకాల్ని చూసిగానీ, చదివి గానీ పొందే ఆనందం వేరు కాబట్టి.

ఆకెళ్ళ నాటకాలన్నీ ఆశావహ దృక్పథంతో ముగియడం విశేషం. ఇందులో దుర్మార్గులలో పరివర్తన కలిగించడం, మంచికే జయం కలుగుతుందని చిత్రీకరించడం ఈ నాటకాలలో కనిపిస్తుంది. ఇతివృత్తం, సన్నివేశాల కల్పన, పాత్ర చిత్రణలు, చక్కని సంభాషణలతో ఈ నాటకాలను ఆద్యంతం ఆసక్తిగా తీర్చి దిద్దడంలో ఆకెళ్ళ చూపిన నేర్పు అద్వితీయం. బలమైన స్క్రిప్టు వున్న నాటకాలు సరియైన నటీనటులు, దర్శకుడి చేతిలో పడితే అవి మరింత విజయాన్ని సాధించడం ఖాయం. స్వర్ణనందులు, అనేకానేక బహుమతుల నందుకున్న ఈ నాటకాలు ఆ విషయాన్ని ఋజువు చేశాయి కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here