అక్క, చెల్లి – అంతరాలు

4
13

[dropcap]వి[/dropcap]హారి, వంశీ, వనజ – స్టడీ రూంలో కంప్యూటర్ల ముందు కూర్చుని చాలా సీరియస్‌గా ప్లే స్టేషన్ ఆడుతున్నారు. ఒక్కసారిగా ముగ్గురూ లేచి పెద్ద కేకలు – “నో – నువ్వు తొండి, నువ్వే మోసం, నీకు అసలు ఆటే చేత కాదు” అంటూ అరుచుకుంటున్నారు. ముగ్గురూ మంచి పొడవుగా వున్నారు. షార్టులు కట్టుకున్నారు. తేలికపాటి టీ షర్ట్ లతో వున్నారు. కలబడి పోతున్నారు. ఈ లోగా ముగ్గురి మొబైళ్లూ మోత! “అరే, మధ్యలో ఆపేసేరేంటి? కంటిన్యూ చెయ్యండి. మేనర్స్ లేవా?” అంటూ అవతల నుంచి వాళ్ల ఫ్రెండ్స్ కేకలు.

గోపాలరావు హాల్లో కూర్చుని వార్తా పత్రిక చదువుకుంటున్నారు. ఈ కల్లోలం విని పరుగు లాంటి నడకతో పిల్లల గది చేరి, “ఏమిటిది? ఏమైనా బాగుందా? మీరంతా పెద్దవాళ్లయ్యారు. పొద్దుటే 8 గంటలకి ఇదా గోల! చదువులు అటక ఎక్కించేరా?” అన్నాడు.

“నువ్వుండు డాడీ – ఎప్పుడూ అదే మాట – అరిగి పోయిన గ్రామఫోన్ రికార్డులాగ, వినీవినీ – బోరు కొట్టేస్తోంది” అని విసుక్కున్నారు వాళ్లు.

ఈ గొడవకు సుమలత అక్కడకొచ్చింది. “ఏంటర్రా టెన్షన్ ఎందుకూ!!.. కూల్ అవండి”, అంది. ఆమె పిల్లలతో. ఎల్లప్పుడూ ఆమె సపోర్టు వాళ్లకే – పెద్ద బాసట.

“పిల్లలన్న తర్వాత హడావిడి ఇలాగే ఉంటుంది. లేటెస్టుగా ఇలాంటి హడావిడే వుంటుంది. సండే నాడు సరదాగా ప్లే స్టేషన్ ఆడతారు. ఇదే ఇప్పటి ట్రెండ్. చదువుకుంటారు లే. ఇంకా పెద్దాడికి ఇరవై రెండేగా – కంగారు పడి తొయ్యక్కర్లేదు.” అని భర్తవైపు ఓ చూపు చూసింది. గోపాలరావుకు మతి పోయింది. అక్కడ నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదనుకొని వెళ్లి పోయేడు హాల్లోకి.

విహారి వాళ్ల పెద్ద కొడుకు. బి.కామ్ చేసేడు. సి.ఏ (ఛార్టెర్డు ఎక్కౌంటెంట్) చేస్తానని ఆర్టికల్స్‌కి ఎన్రోల్మెంట్ అయ్యేడు. రెండు, మూడేళ్లయింది. నాలుగైదుసార్లు ఇంటర్ పరీక్ష వ్రాసేడు. ఎక్కడా పాస్ మార్కుల దరిదాపుల్లో లేడు.

వంశీ కూడా అన్న బాటే. “ఇంకా ఇంజనీరింగ్, మెడిసన్.. ఇదే పాత చింత కాయ పచ్చడి, వందేళ్లైనా మారమా మనం? ఆ కోర్సుల్లో పడితే ఎప్పటికీ తేలము. ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి”, అంటాడు. B.A. ఎకనమిక్స్ చేస్తున్నాడు. ఎన్ని రోజులు కాలేజీకి వెళ్తాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో – ఎవరికి ఎరుక – ఇష్టారాజ్యం!

వనజ అందరిలో చిన్నది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో వుంది. లెక్కల గ్రూపు. బి యస్సీ కంప్యూటర్స్ చేసి సాఫ్ట్‌వేర్ రంగంలోకి వెళ్లాలని ఆమె ఆశ.

సుమలత, గోపాలరావు సిటీలో వున్నారు. గోపాలరావు వ్యాపార వేత్త. ఐరన్, సిమ్మెంటు డీలర్. పెద్ద ఇల్లు – సౌకర్యాలకేం లోటు లేదు.

***

సరోజ, సుమలత అక్క. ఆమె తన కొడుకు మధును వెంట బెట్టుకొని సుమ ఇంటికి ఆ మధ్యాహ్నం వచ్చింది – ముందుగా చెప్పే వచ్చింది. అక్కడ మధుకు ఇంజనీరింగ్ కాలేజీలో సీటొచ్చింది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో చేరుతున్నాడు. సరోజా వాళ్లు ఓ చిన్న వూళ్లో వుంటున్నారు. అది మరీ పల్లె కాదు. పట్నమూ కాదు. పిల్లవాణ్ణి సిటీలో హాస్టల్లో పెట్టడానికి కొంచెం భయం వేసింది. చెల్లి సుమ వాళ్ల అక్కడ వుంటున్నారు కదా, ఇల్లు పెద్దది – అక్కడుండి ఆమె, మరిది గార్ల రక్షణలో చదువు పూర్తి చేస్తాడు అనుకున్నది.

కొన్నాళ్లయింది. సుమ, పిల్లలు మధును పరిశీలించేరు. ‘పల్లె బొచ్చి’, ‘అమాయక చక్రవర్తి’ అంటూ బిరుదులిచ్చేరు. ఎగతాళి చేసి, జోకులు వేసి నవ్వుకొనేవారు మధుని చూసి. గోపాలరావు మాత్రం మధు పొందిక, చదువుపై శ్రధ్ధ, క్రమశిక్షణ, మితభాషణ చూసి ముచ్చట పడుతున్నాడు.

మధు ప్రతి రోజూ వేళకి కాలేజీకి తయారవడం; పిన్ని ఏం పెడితే అది తిని, బాక్స్ తీసుకొని (లంచ్ కోసము) వెళ్ళేవాడు. క్లాసులు హాజరు అవటమే కాక, కాలేజీ లైబ్రరీలో కాసేపు పుస్తకాలతో గడిపేవాడు. అవసరాన్నిబట్టి తన లాంటి వేవ్‌లెంత్’ (ఆలోచనా ధోరణి) ఉన్న ఒకరిద్దరు క్లాస్‌మేట్స్‌తో చర్చించి, సందేహాలు తీర్చుకొనేవాడు. సాయంత్రం ఆరు గంటలకు సుమారుగా ఇల్లు చేరుకునేవాడు. పిన్ని ఇచ్చిన టిఫిన్ (నాస్తా) తిని, కాఫీ త్రాగి, కాసేపు వాకింగ్‌కి వెళ్లేవాడు. రాత్రి డిన్నర్ లోగా ఓ పక్క పుస్తకాల ముందు కూర్చుని చదవడం, లెక్కలు చేయడం, మరోపక్క లాప్‌టాప్ మీద లాంగ్వేజెస్ సాధన చేసేవాడు. అది మధు రొటీన్.

ఆరు నెలలు గడిచేయి. మొదటి సెమిస్టరు పరీక్షలయ్యేయి. అతని చురుకుదనానికి, పరిశ్రమ తోడై మంచి శాతం మార్కులు సంపాదించి ఉత్తీర్ణత సాధించేడు. మధు తండ్రి రామారావు జిల్లా పరిషత్‌లో ఆఫీసరు. తన పనిలో తను నిమగ్నమై వుంటాడు. గుమాస్తాగా చేరేడు. డిపార్ట్‌మెంట్ పరీక్షలు నెగ్గి, అంచెలంచెలుగా ప్రమోషన్స్ పొందేడు. సెలవులకి మధును తీసుకొని వెళదామని ఒకసారి మరదలు సుమలతను, గోపాలరావు లని మర్యాద పూర్వకంగా కలుద్దామని నగరం వచ్చేడు.

సుమలత ఇంటి వాతావరణాన్ని పరిశీలించేడు. సుమలత పిల్లలు పెరిగే తీరు అతణ్ణి తీవ్రంగా కలచి వేసింది. బాధ కూడా కలిగింది. మరదలంటే ముందు నుంచి వున్న చనువుకొద్దీ “అమ్మా! సుమా, మీ పిల్లలు ఎదిగేరు. నేడు వాళ్లు పసివాళ్లు కాదు. యువకులు. విహారి సి.ఏ కోర్స్ సీరియస్‌గా తీసుకోవటం లేదు. అది అఖిల భారత స్థాయి పరీక్ష. చాలా శ్రద్ధ పెట్టాలి. వాళ్ళు ముగ్గురు అనవసరమైన విషయాల పట్ల – ఫోన్, సోషల్ మీడియా వగైరా పట్ల – ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. నువ్వు వాళ్లని మందలించు. లేకపోతే చేయి దాటిపోతారు – ఈ వయస్సులో చదువుపై దృష్టి పెంచినవారికి భవిష్యత్‌లో భరోసా లభిస్తుంది. జాగ్రత్త తల్లీ” అన్నాడు.

సుమలతకు కోపం తారాస్థాయి చేరుకున్నది. “ఏంటి బావా! ఏంటి నువ్వు చెప్పేది, నేను వినేదీను. పల్లెటూరి వాడివి. మోడరన్ లైఫ్ తెలియదు. ఉచిత సలహాలు ఇవ్వకు”, అని కసిరింది.

రామారావు అవాక్కు అయ్యి, నిశ్చేష్టుడయ్యాడు. ఆదివారం సాయంత్రందాకా వుందా మనుకొన్న మనిషి, భోజనం అవగానే “నేను వెళ్ళొస్తా”, అని బయల్దేరేడు.

ఆరోజు నుండి సుమలతకు మధు అంటే ఓ రకం ‘ఏవగింపు’ పెరిగింది. కావాలని ఉదయం, సాయంత్రం తనని పిలిచి ఏదో పని చెప్పేది. పాలు తెమ్మని, కూరగాయలని, ఎలక్ట్రిక్ బిల్లు కట్టమని – ఇలాగ. ఒక్కో రోజు “మధూ నాకివాళ వేరే అర్జంటు పనులున్నాయిరా, లంచ్ బాక్స్ ఇవ్వటం లేదు, ఎక్కడైనా తిను” అనేది.

మధుకు అర్థమయింది. అమ్మ, నాన్నల మీద గౌరవం కొద్దీ అన్నీ మౌనంగా సర్దుకున్నాడు, భరించేడు. మొదటి సంవత్సరం పూర్తయింది. సెలవులకి స్వంత వూరు చేరాడు. అప్పటికే రామారావు భయపడుతున్నాడు. విషయాలు అర్థం అయ్యేయి. బక్కచిక్కి, బెంగతో వున్న మధును చూసి, అమ్మ, నాన్న బాధపడ్డారు. కన్నీరు పెట్టుకొని దగ్గరకు తీసుకొన్నారు. “చాలా సారీ రా మధూ! నిన్ను పిన్నింట్లో వుంచి చదివిస్తే రక్షణ వుంటుంది అనుకున్నాను. ఇలా జరుగుతుందనుకోలేదు. నిన్నింత క్షోభకు గురిచేసినందుకు కుమిలిపోతున్నాను” అంది సరోజ. “అవును మధూ – ఈ నెలలోనే కాలేజీ హాస్టల్‌కు వెళ్లి అన్నీ మాట్లాడి ఫీజు కట్టి వస్తాను” అన్నాడు రామారావు.

రెండో సంవత్సరం నేరుగా హాస్టల్లో మధును దింపేరు – సరోజ, రామరావు. రెండు రోజులు అక్కడ వుండి వాతావరణం, భోజనం వంటి అంశాలన్నీ పరిశీలించేరు. ఆదివారం ఉదయం వాళ్లు ముగ్గురూ సుమలత ఇంటికి వెళ్లేరు. పలకరింపులయ్యాయి. “అదేంటి సామానేది?” అంది సుమ. “మరేం లేదు చెల్లీ! ఈ ఏడాది నుండి వాడికి పని పెరిగిపోతుంది. హాస్టలయితే, దగ్గర కనుక చీకటి పడినా చేరుకుంటాడని వాడిని అలా చేర్చేం” అంది సరోజ.

పైకి తేలకపోయినా సుమలత, విహారి, వంశీ, వనజల ముఖాల్లో ఆనందం గుర్తించడం ఏం కష్టం కాలేదు! పీడ వదిలిందన్న భావం కనపడింది.

కాలం పరుగులు ఆపదు. చూస్తుండగా మధు ఇంజనీరింగ్ పూర్తి చేసేడు. M.Tech చదవడానికి అఖిల భారత స్థాయి ప్రవేశ పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించేడు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ విద్యా సంస్థలో సీటు లభించింది. కోర్సు ముగిసే లోగా కంపెనీల వారు కేంపస్ ఇంటర్వూ లకి వస్తూంటారు కదా! ఓ దిగ్గజ కంప్యూటర్ కంపెనీ వారు నిర్వహించిన పరీక్ష, ఇంటర్వ్యూలో సెలక్షన్ లభించింది మధుకి. నెలకు లక్ష రూపాయల పేకేజీతో నియామక పత్రాలు (ఆర్డర్స్) లభించేయి. సరోజ, రామారావు సంతోషించేరు.

మధుకు ఓ అక్క వున్నది. ఆమె లత. తల్లిదండ్రులు ఉన్న ప్రదేశంలోనే M.Sc చేసింది. మహిళా కళాశాలలో ఆచార్యపదవిలో వుంది. ఇంక ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు.

సరోజ చిన్నతనం నుండి, ఆలోచన,పరిశీలన, మాట పొదుపు – ఇలాంటివి అలవర్చుకుంది వివాహమయే సరికి ఇంటర్మీడియట్ చదివింది. గృహిణిగా ఇంట్లో ఉన్నా మొక్కల పెంపకం, పెరటి తోట, నీటి విలువ తెలుసు. పిల్లలిద్దర్నీ దగ్గరుండి – బాగా చదవమని ప్రోత్సహించేది. నైతిక, సామాజిక విలువలు నేర్పింది వారికి. వారితో ఆర్భాటంలేని జీవిన శైలి. భార్యాభర్తలిద్దరూ ఇరుగు పొరుగువారికి, అవసర సమయాల్లో ‘మేమున్నాం మీకు తోడుగా’ అని వ్యవహరిస్తారు సాయపడతారు.

మధు ఉద్యోగం చేస్తూ తమ ఇంటికి అనేక ఆధునిక సదుపాయాలు కలిగించేడు. పైన రెండో అంతస్తు కట్టించేడు. తల్లిదండ్రులకు ఓ చిన్న కారు కొని పెట్టేడు.

***

అక్కడ నుమలత వాళ్లింట్లో, విహారి – సి.ఏ. విరమించి చేతులెత్తేసేడు. గుమాస్తాగా ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరేడు. వంశీ బి.యే. చదివినా – వానాకాలం చదువు! నైపుణ్యాలు లేక చాలాకాలం నిరుద్యోగిగా వున్నాడు. వనజ BSc పూర్తి చేసి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ  ఉద్యోగం చేస్తోంది.

గోపాలరావు గారు అలా వ్యాపారంలో ఒడిదుడుకులు – కరోనా విలయతాండవము – ఈతిబాధలు – తన సంసారం, సరోజ రామారావుల సంసారం బేరీజు వేసుకుని కొంత మనస్తాపం చెందుతూ వుంటారు. ఎందుకిలా జరిగింది? తను సుమలతకు అనవసరమైన స్వతంత్రం ఇచ్చేడా? పిల్లల్ని అతి గారం చేసేమా? కొత్త తరం అంటే యువత ఇలా పెరగడమా? అని సందేహాలు వేధిస్తుంటాయి.

గతం అంటేనే తిరిగి రానిది. రిపేరు ఏ విషయం లోనైనా కష్టమే.

ఆధునిక యుగం సాంకేతిక రంగంలో దూసుకుపోతోంది. నైపుణ్యాలు పెంచుకున్న యువతకి నిరుద్యోగం ఛాయల్లోకి కూడా రాదు. ఈ దేశంలో దేనికి కొదువ? పైగా ఎందరో యువకులు విదేశాలకు వెళ్లి మంచి పదవులు నిర్వహిస్తూ వున్నారు కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here