అక్షర మాలికలు

0
14

[dropcap]నే[/dropcap]ను
కవిని కాను
కవిత రాయలేను..
కానీ
పుస్తకాలనారాధించే
ఓ పుస్తక ప్రేమికుడిగా
మీ ముందుకు వస్తున్నాను..
పుస్తక లోకంలో
విహరించిన
నా అనుభూతులను
అక్షరమాలికలను చేసి
మీ దోసిట్లో పోయాలని..
నే స్వప్నించిన
గత రాత్రి జ్ఞాపకతోరణాలను

మీ ముంగిలిలో అల్లాలని..

వెన్నెల కురిసిన ఆ రాత్రిలో
తిలక్ కవితామృతాన్ని
దోసిళ్ళతో పట్టి త్రాగాను..
మరోప్రపంచానికి
మహాప్రస్థానం చేసి
శ్రీశ్రీ ఖడ్గసృష్టిని
కనులారా కాంచాను..
పఠాభి ఫిడేల్ రాగాలు
విని చప్పట్లు కొట్టి ఆనందించా..
ఆకులో ఆకునై
దేవులపల్లి ఊర్వశిని
పలవరించి
పరవశించా..
నండూరి ఎంకి
నయగారాలు పోతుంటే
గుండె గొంతుకులోన
కొట్టాడినట్టుంది..
మొక్కజొన్న తోటలో
ముసిరిన చీకట్లలో
కొనకొళ్ల కోడలు
బంగారి మావ కోసం
ఎదుచూస్తున్నది నిట్టూర్పులతో..
ఒకవైపు
ఆరుద్ర త్వమేవాహం
మరోవైపు
సినారె విశ్వంభర
పోటీపడి పిలిచాయి
తమచెంతకు రమ్మని..
చీకటిలో సైతం
నే దారి చూపుతా నంటూ
జాషువా గబ్బిలం రెడీ అయింది..
దాశరథి కురిపించిన
అగ్నిధారలు
కాల రాత్రిని
కాంతివంతం చేశాయ్..
కందుకూరి శేఖరుడు
చిలకమర్తి గణపతి
మొక్కపాటి పార్వతీశం
వడివడిగా వస్తుంటే
పలకరించి పులకరించా..
వడ్ల గింజలు తీసుకొని
శ్రీపాద వస్తుంటే
గాలివాన తో పాలగుమ్మి
గమ్మత్తుగా జతగూడి
మల్లాది రామకృష్ణను
కథ చెప్పమని అడుగుతుంటే
నేనూ ఉన్నానని
మునిమాణిక్యం హాజరు
కాంతం గారితో కలిసి..
ఇటుపక్క
గురజాడ మధురవాణి
గిరీశంతో కబుర్లాడుతుంటే
ఆ ప్రక్క
రావిశాస్త్రి రత్తాలు
రాంబాబుకై వెతుకుతుంది
చెట్టుకింద నిల్చుని..
చదువు కై
కొడవటిగంటి ఆరాటం
పుణ్యభూమి కళ్ళు తెరు
అంటూ బీనాదేవి పోరాటం
దగాపడిన తమ్ముడి కోసం
బలివాడ బక్కచిక్కిన ఆర్తనాదం
రావూరి మంగమ్మ
పాకుడు రాళ్లపై
జారిపోవడం
సీతాదేవి మట్టిమనిషి
వరూధిని కై మరీచికలాట
నన్నొక్కసారిగా
విచలితుడిని చేశాయి..

ఉన్నవ మాలపల్లి
మీదుగా
అతడు ఆమె
ఉప్పలవారి చేయి
పట్టుకొని రావడం
కనిపించిందక్కడ..
బాపిరాజు నారాయణరావు
శారదకై చూస్తుంటే
వడ్డెర రగిల్చిన
హిమజ్వాల లలో
గీతాదేవి ప్రజ్వలనం..
అంతలోనే
వీణారవంలా
చిరునవ్విచ్చే
స్వప్నరాగలీనను చూసి
మైదానంలో అమీర్‌ను హత్తుకొని
పకపకలాడింది
చలం రాజేశ్వరి..
గోపిచంద్
అసమర్థుని జీవయాత్రను చూసి
చివరకు మిగిలేది
ఏదని బుచ్చిబాబుని ప్రశ్నిస్తే
విశ్వనాథ వేయిపడగలు
నవీన్ అంపశయ్యను చూపాయి..

గోర్కీ అమ్మ
ఉద్యమాల
ఉగ్గుపాలందిస్తే
సుంకర మాభూమి కోసం
పోరాటాల బాట పట్టి
దాస్ కాపిటల్ దారులలో
మార్క్స్ మహనీయుని
అడుగులలో
సుందరయ్య చేయందుకొని
విప్లవపథంలో పయనించి
చేగువేరాతో చెలిమి చేసి
ఈ జన్మకిది చాలని
జయ గీతం
ఆలపించా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here