అక్షర మయూరం

1
10

[dropcap]పు[/dropcap]రివిప్పిన అక్షరం
నోరిప్పని జనం ముందు
వెలవెల పోతోంది
విలవిలలాడుతోంది.

పురివిప్పిన అక్షరం
మయూరమై, వయారమై
వగలొలికిస్తుంటే
కదం తొక్కి పదం పట్టి పాడుకుంటే
పరమాత్ముడి సాక్షాత్కారం

రాయల కాలంలో వినుతికెక్కిన ప్రాభవం
నేడెక్కడా కనరాదే ఆ వైభవం?
కవిత్రయం, పోతయ్య, శ్రీనాధుడు
రాయప్రోలు , గిడుగు, గురజాడలు
యధాశక్తి చేసెనంట అక్షరసేవ

నేడేమో ఆంగ్లమంటే మక్కువాయె
పరభాషే ఎక్కువాయె
ఈ ధోరణిలో పడి
ఆంధ్రభాష చిక్కిపోయె.

పెద్దవారికే లేదు భాషపై కోరిక
చిన్నవారికి లేదు నేర్చుకోను తీరిక
పెద్దలెవ్వరు చేయరు ప్రోత్సాహం
పిన్నలకేరీతి కలుగు ఉత్సాహం?

తరతరాల వెలుగు మన తెలుగు
ఈ భాష మనందరిదీ
అనే భావన కలిగిస్తే
ఈ అక్షరమయూర విన్యాసాన్ని తిలకిస్తే
ఈ అమృతభాషను అందరి నోటా పలికిస్తే

ఈ పురి విప్పిన అక్షరం
గురిపెట్టిన అస్త్రంగా
తెలుగు జాతికి దొరికిన శస్త్రంగా
జనులందరినీ అలరించే శాస్త్రంగా
కవిలా, రవిలా, శశిలా అగ్రపధాన
నిలిచిపోవు జనులందరిలో శాశ్వతంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here