వ్యవస్థలో మార్పుని కోరిన ‘అక్షర’

0
8

[dropcap]‘సి[/dropcap]నిమా హాల్ ఎంటర్టైన్‌మెంట్’ వారి సినిమా ‘అక్షర’.

‘తక్కువ మార్కులు వచ్చినందుకే ఆత్మహత్య’, ‘ప్రాణం తీసిన ఒత్తిడి’, ‘క్యాంపస్ గదిలో ఉరేసుకున్న విద్యార్థి’, ‘రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య’, ‘టెంత్ లో ఫెయిల్ అవుతానేమో అని విద్యార్థి ఆత్మహత్య’….. మొత్తానికి అన్నీ విద్యార్ధులు ఒత్తిడి తట్టుకోలేక తమ జీవితాలని అంతం చేసుకున్న వార్తలే!

‘సురేష్ వర్మ అల్లూరి’, ‘అహితేజ బెల్లంకొండ’ నిర్మించిన ఈ చిత్రం 2021లో విడుదల అయి.. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

రచన మరియు దర్శకత్వ బాధ్యతలు వహించిన వారు బి. చిన్ని కృష్ణ. ముఖ్య తారాగణం…. నందిత శ్వేత, సంజయ్, అజయ్ ఘోష్, సత్య, మధునందన్.

ఇక చిత్ర విశేషాల్లోకి వెళదాం!

విశాఖపట్నంలో ‘విద్యా విధాన్’ అనే సంస్థ నిర్వహించే సంజయ్ భార్గవ్ అనే వ్యక్తికి ‘BEST EDUCATIONIST AWARD OF THE YEAR’ ప్రదానోత్సవంతో సినిమా మొదలౌతుంది.

ఆ కార్యక్రమం ఆడిటోరియంలో జరుగుతుండగా.. ఒక విద్యార్థిని అదే కాలేజి భవనం పై అంతస్తుకెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

ఆ సంస్థల అధిపతి సంజయ్ భార్గవ్‍ని కారణం అడిగిన విలేఖరులతో ఆ అమ్మాయి మెరిట్ స్టూడెంట్ అని, ఇంట్లో జరిగిన గొడవల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండచ్చు అని చెబుతూ ఉండగా.. ఆ సమయంలో అదే సంస్థలోని మరొక డైరెక్టర్ శ్రీ తేజ… “దాహం తీర్చుకోవటానికి పైకెగిరిన పక్షులు, నీరు దొరకని నిరాశతో తమలో ఒక పక్షి చనిపోతే, ఆ పక్షిని చూసి తాము వెనుతిరగకుండా, నిరుత్సాహ పడకుండా… ఆ పక్షి లాగానే నీరసించిపోకుండా… ఆ పక్షి నించి స్ఫూర్తిని పొందితేనే అనుకున్న గమ్యాన్ని చేరగలవు. అదే ముఖ్యమని.. మీరు కూడా చనిపోయిన మీ స్నేహితురాలిని చూసి డీలా పడకండి” అని విద్యార్ధులతో ప్రోత్సాహకరంగా మైకులో మాట్లాడతాడు.

అదే కాలేజిలో లెక్చరర్ ఇంటర్వ్యూకి వచ్చిన అక్షర అనే వ్యక్తి failure comes only when you give up అనే మాటలు అక్కడ బోర్డ్ మీద రాసి… పరీక్షలో ఫెయిల్ అయి రోదిస్తున్న ఒక విద్యార్థిని వెన్ను తడుతుంది. ఇంటర్వ్యూ కొరకు చాలా సేపు నిరీక్షించిన ‘అక్షర’తో యాజమాన్యం లోపలికి పిలిచి అడిగితే… పిల్లలకి పాఠాలు చెప్పే వ్యక్తికి ఓర్పు అవసరమని చెబుతుంది.

ఆ కాలేజిలో ఫాకల్టీగా చేరిన ‘అక్షర’ అక్కడ దగ్గరలో ఒక కాలనీలో ఇల్లు తీసుకుని నివసిస్తూ ఉంటుంది. అన్ని చోట్ల ఉన్నట్టే అక్కడ అందరూ తలో రకం!

ఆ కాలనీ ప్రెసిడెంట్ తాతాజి తనని ఏడిపించే ‘వాల్తేర్ కింగ్స్’ అనే నలుగురు కుర్రాళ్ళని… ‘అక్షర’వారిని ప్రేమిస్తోందని వాళ్ళకి విడి విడిగా చెప్పి వారి మధ్యలో భేదాభిప్రాయాలు కలిగించి వారి తంటా వదిలించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఈ కుర్రాళ్ళు సినిమా తరువాతి భాగంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

***

‘అక్షర’…. టీచర్ అంటే భయం కాదని… ధైర్యమనీ విద్యార్ధులకి స్ఫూర్తిప్రదాతగా మారి కొత్త పద్ధతిలో పాఠాలు చెబుతూ ఉంటుంది.

“మీరు చదువుకున్న స్కూలుకి వెళ్ళండి. వీలైతే సహాయం చెయ్యండి” అనే ఒక ప్లకార్డ్ చేత్తో పట్టుకుని బాధ్యత గల పౌరురాలిగా సమాజ సేవ చేస్తున్న ‘అక్షర’ని చూసి ఆ కాలేజి డైరెక్టర్ ఆమె పట్ల ఆసక్తి ప్రదర్శిస్తాడు.

***

విద్యా శాఖా మంత్రిని కలిసిన సంజయ్ భార్గవ…. నూతన విద్యా సామ్రాజ్యాన్ని గురించి పథక రచన చేస్తూ…. ఫీజు కట్టిన ప్రతి స్టూడెంట్‍కి సీట్ రావాల్సిందేనని, సీట్ వచ్చిన ప్రతి స్టూడెంట్‌కి ర్యాంక్ రావలసిందే అంటాడు!

తన స్టూడెంట్స్ తలరాతని ర్యాంకులతో తనే రాస్తాను కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో ప్యానెల్‌లో తన వ్యక్తులు పదిమంది ఉండాలని విద్యా శాఖ మంత్రిని డిమాండ్ చేస్తాడు.

ర్యాంకులు రావాలంటే పేపర్ తనే సెట్ చేస్తానని, చివరగా విద్యామంత్రి దాని మీద సంతకం పెడితే చాలంటాడు సంజయ్ భార్గవ. అందులో ఉన్న గూఢార్థాన్ని తెలుసుకున్న విద్యామంత్రి.. ఏ మాత్రం మెరిట్ లేని విద్యార్ధులకి ర్యాంకులు వచ్చేలా మేనేజ్ చెయ్యాలనుకున్న అతని ఆంతర్యాన్ని గ్రహిస్తాడు.

***

పన్నులు సరిగా కట్టట్లేదని, పరిమితికి మించి విద్యార్ధులని చేర్చుకుంటున్నారని… నిబంధనలని సరిగా పాటించట్లేదని… ఆ తరువాత సంజయ్ భార్గవ్ విద్యా సంస్థల మీద రెయిడ్ జరుగుతుంది.

అలా ఆ కాలేజి యాజమాన్యం మీద, వారి విధానాల మీద సమగ్రమైన స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చిన విద్యా శాఖ అధికారి ప్రయాణించే వాహనానికి ప్రమాదం జరిగి అతను చనిపోతాడు. కారణం ఎవరో మనం ఊహించగలం కదా!

***

ఆ కాలేజికి మరొక డైరెక్టర్ అయిన శ్రీ తేజ ‘అక్షర’ పట్ల ఆసక్తి కనపరుస్తాడు. అందులో భాగంగా ఆమె చూపించే సామాజిక స్పృహకి తను ఆకర్షితుడనయ్యానని.. ఆ స్ఫూర్తితో తను చదివిన స్కూల్‌ని అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నానని చెప్పటానికి తన చిన్నప్పటి స్కూల్‌కి తీసుకెళతాడు.

అక్షర పట్ల ఆసక్తి కలిగిన ‘వాల్తేరు కింగ్స్’ కుర్రాళ్ళు ఆమెని అనుసరించి వారి వెనకాలే ఆ స్కూల్ కి వెళ్ళి అక్కడ ‘అక్షర’ శ్రీ తేజని హత్య చెయ్యటం కళ్ళారా చూసి ఆశ్చర్య పోతారు.

కేసు ప్రత్యేక పోలీసుకి అప్పచెప్పబడుతుంది.

***

సినిమా ప్రారంభంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినిని అంతకు ముందు…”ఇంకా ఇంకా బాగా చదవాలని, స్టేట్ ర్యాంకుకి కావలసినన్ని మార్కులు సాధించటం ద్వారా తమ కాలేజి లక్ష్యం సాధించటంలో ఆ అమ్మాయి ఓడిపోతే, ఆటో నడుపుకునే ఆమె తండ్రి…. ఆ అమ్మాయికి కాలేజి యాజమాన్యం ఇచ్చిన స్కాలర్ షిప్ కట్టాల్సి వస్తుందని” శ్రీ తేజ ఒత్తిడి చెయ్యటం అక్షర దృష్టిలో పడుతుంది.

సంస్థ అధిపతి సంజయ్ భార్గవ.. తనకి తొత్తుగా పని చేసే ACP తో శ్రీ తేజ హత్య అతని కోసం జరిగింది కాదని…. తనని లక్ష్యంగా చేసుకున్నదని అంటాడు. ఎలాగైనా పరిశోధించి వాస్తవం ఏమిటో తెలియచెయ్యమంటాడు. తన కాలేజి అక్రమాల గురించి విద్యా శాఖ తయారు చేసిన రిపోర్ట్ ఫైల్ ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని చెబుతాడు.

మార్నింగ్ వాక్‌కి వెళ్ళిన ACP కూడా హత్య చెయ్యబడతాడు. అతని శవం పక్కన ఆ ఫైల్ పడి ఉంటుంది.

ఒక స్పెషల్ ఆఫీసర్‌ని ఈ కేస్ స్టడీ చెయ్యటానికి నియోగిస్తారు.

ఆ ఫైల్ లో విషయాలు బయటపడ కూడదని సంజయ్ భార్గవే ఆ హత్య చేసుండచ్చు అంటాడు.. Special Investigative Officer. రెండు హత్యలు జరిగిన విధానం చూస్తే… డబ్బు కోసం కాకుండా… కడుపు మండిన వారెవరో చేసినట్లనిపిస్తోంది అంటాడు.

‘అక్షర’ స్పెషల్ ఆఫీసర్‌తో హత్యలు తనే చేశానని, అది ప్రెస్ మీట్ లోనే చెబుతానని అంటుంది.

అలా ఆ సమావేశంలో తన గతాన్ని ఆవిష్కరిస్తుంది.

తల్లిదండ్రుల తరువాత ప్రతి వ్యక్తి ఉన్నతికి వెనకాల ఒక మాస్టర్ ఉంటారని చెబుతుంది. ఒత్తిడి లేని చదువు ఎలా ఉండాలో, చదువుని కష్టంగా కాకుండా ఇష్టంగా ఎలా చదవాలో రాఘవ మాస్టారే తమకి నేర్పారని చెబుతుంది. రాఘవ మాస్టారు… పిల్లలు వ్యాపారాత్మకమైన కార్పొరేట్ కాలేజిల్లో కాకుండా ప్రభుత్వ కాలేజిల్లోనే చదువుకుంటే, ఏ ఒత్తిళ్ళు లేని ఆరోగ్యమైన చదువు వస్తుందని ఊళ్ళో అందరికీ చెబుతూ ఉంటారు.

పరీక్షల ముందు రోజు తల్లిదండ్రులతో ప్రశాంతంగా గడిపితే పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోగలరని అందరికీ చెబుతారు.

***

అదే సమయంలో ‘విద్యా విధాన్’ కాలేజి రాష్ట్ర వ్యాప్తంగా అనేక బ్రాంచిలని తెరుస్తున్నదని… స్కూళ్ళల్లో మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ఎన్నుకుని తమ దగ్గర చేర్పించమని, తామే ఫీజులు కడతామని నమ్మించటానికి కొంత మందిని నియోగిస్తాడు సంజయ భార్గవ. ఈ విషయాన్ని వ్యతిరేకించిన రాఘవ మాస్టారు..

‘ఇలా వారిని మభ్య పెట్టి, వారిలో అనారోగ్య పోటీ పెట్టి చదువుని వ్యాపారం చెయ్యద్దు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు స్వయంగా, ఆరోగ్యకరంగా పైకి వస్తారని.. ఈ వ్యాపారాత్మక చదువుల వెంట పరిగెత్తద్దని, ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలు కావద్దని, పిల్లలకి విద్య ప్రాథమిక హక్కు అని చెబుతారు. పిల్లల ఫీజులు తామే కడతామని నమ్మబలికి, రోజుకి 16-18 గంటలు చదివించి వారికి ఆటపాటలు లేకుండా చేసి పిల్లల చదువులతో వ్యాపారం చేస్తున్నార’ని ఊళ్ళో వారికి కౌన్సిలింగ్ చేస్తారు.

పిల్లలని ఆకర్షించటానికి పంపిన తన ఏజెంట్స్ ఒట్టి చేతులతో తిరిగిరావటాన్ని జీర్ణించుకోలేని సంజయ్ భార్గవ్, తన వ్యాపారం దెబ్బ తింటుందని… అలా తను ఊరుకోలేనని అంటాడు. రాఘవని ఒంటరి ప్రదేశానికి పిలిపించి… తమ దగ్గర చదివితేనే మంచి మంచి ఇంజనీర్స్ తయారవుతారని… ప్రభుత్వ కాలేజిల్లో చదివే వారికి సౌకర్యాలు ఉండవని, ఎన్నికల డ్యూటీలు చేస్తూ అక్కడి ఉపాధ్యాయులు చదువేం చెప్పగలరని…. తమ దగ్గర చదువుకునే విద్యార్ధులకి ఫాన్స్, ACలు, డైనింగ్ రూంస్, ల్యాబ్స్ వంటి వసతులతో హెచ్చు స్థాయి ప్రమాణాలతో… పిల్లలకి ఎండ తగలకుండా కాపాడి మంచి చదువులు చెబుతామంటాడు. మంచి ‘టాయిలెట్స్’ సమకూరుస్తామని వాదిస్తాడు.

మీరు పిల్లలతో వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తే… చదువుల ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఎదురు మాట్లాడినందుకు రాఘవని హత్య చేస్తాడు.

ఆ హత్యని తదనంతర కాలంలో ‘అక్షర’గా మారిన విమల (టెంత్ క్లాసులో స్కూల్ టాపర్) తల్లి లక్ష్మి మీద వేస్తారు. రాఘవ మేస్టారికి ఆమెకి అక్రమ సంబంధం అంటకట్టి, జెయిల్‌కి పంపిస్తారు.

విమలని ర్యాంక్ తెచ్చుకుంటే తల్లిని చూపిస్తామని మభ్య పెట్టి ర్యాంక్ తెచ్చేవరకు కాలయాపన చేసి… చివరికి తల్లి చనిపోయిందని చెబుతారు. ఇందులో ACP మాణిక్యం పాత్ర కూడా ఉంటుంది.

అప్పుడు ఆ ఊళ్ళో ఉండే మరొక వ్యక్తి.. రాఘవ మాస్టారి అభిమాని… విమలకి ‘అక్షర’ అనే పేరు పెట్టి నువ్వు, నీ చదువు సమాజానికి ఒక సమాధానం చెప్పాలని ప్రోత్సహించి చదివిస్తాడు.

సమావేశంలో ఈ విషయాలని వెల్లడించిన అక్షరతో… తనకి జరిగింది అన్యాయమే అయినా మనుషులని చంపాలనుకోవటం కరెక్టా, ఒక గురువుగా తన విద్యార్ధులకి తను ఎలా ఆదర్శం కాగలననుకుంటున్నదని పత్రికా విలేఖరులు ప్రశ్నిస్తారు.

ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. ‘అక్షర’ తను ఒక ఉపాధ్యాయురాలినని…లక్షలమంది విద్యార్ధుల జీవితాల్లో వెలుగు నింపే ఉద్యోగం తనదని చెబుతూ… “అబ్దుల్ కలాం ఒక మామూలు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. మొదటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక మామూలు స్కూల్లో చదివారు. వారు ఏ కార్పొరేట్ కాలేజిలోను చదవలేద’ని అంటుంది.

‘తల్లిదండ్రుల అత్యుత్సాహాన్ని కార్పొరేట్ కాలేజీలు క్యాష్ చేసుకుంటున్నాయని విలువలు నేర్పని చదువులు, బాల్యాన్ని చిదిమేసి ఆత్మ విశ్వాసాన్ని పెంచని చదువులు… మానెయ్యాలని..ప్రభుత్వ పాఠశాలలకి విలువ కేవలం ఆ స్థలాలకున్న వాణిజ్య విలువే కానీ అందులో చదివించటానికి తల్లిదండ్రులు ముందుకి రావట్లేదని చెబుతూ…తను కార్పొరేట్ వ్యవస్థని వ్యతిరేకిస్తున్నాన’ని చెబుతుంది.

ఆత్మహత్య చేసుకున్న ఒక విద్యార్థి తను ఉన్నది క్లాసు రూంలో కాదని, జెయిల్ గదిలోనని తండ్రికి ఉత్తరం రాయటంలో అర్థం… విద్యార్ధులు ఎదుర్కుంటున్న ఒత్తిడిని తెలియచెయ్యటమేనని ధైర్యంగా నలుగురిలో చెబుతుంది.

అలాంటి వ్యక్తులని హత్య చెయ్యటం తను చేసిన తప్పేనని ఒప్పుకుంటూ… తన ఈ చర్య వల్ల విషయాన్ని వెలుగులోకి తెచ్చి, సమస్య తీవ్రతని కొన్ని లక్షల మందికి తెలియచేయటమే అంటుంది.

తల్లిదండ్రులు లేక స్కాలర్‌షిప్పులతో చదువుకున్న ‘స్పెషల్ ఆఫీసర్’ దృష్టికి తన ఆవేదన, ఆక్రోశం తెలియచెయ్యటం వల్ల ప్రయోజనం ఉంటుందని నమ్మాను అని చెబుతూ అక్షర తను చేసిన హత్యకి శిక్ష అనుభవించటానికి వెళుతుంది.

ప్రజలనించి వచ్చిన వ్యతిరేకతని తట్టుకోలేని ‘విద్యా విధాన్’ కాలేజి యజమాని తనని తాను తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు.

***

వ్యవస్థలో మార్పుని కోరుతూ…. వాస్తవాన్ని నిష్కర్షగా, నిజాయితీగా చూపించిన ఈ సినిమా కొందరినైనా ఆలోచింపచెయ్యగలిగితే….ఈ సినిమా నిర్మాతల, దర్శకుల ఆశయం కొంతైనా నెరవేరినట్లే…

చీకటిని తిడుతూ కూర్చోవటానికి అలవాటుపడిన మనం కళ్ళకి కమ్మిన పొరలని తొలగించి వాస్తవం చూడటం నేర్చుకోగలమంటారా? పిల్లలు చదువుల్లో నలిగిపోతున్నారని ఒప్పుకోగలమా?

గణాంకాలు చూస్తే…. గొప్పవాళ్ళెవరూ ఒత్తిడి తీసుకోలేదు. మూడో క్లాస్ నించే ఐఐటి ఫౌండేషన్ ఎందుకు? టెంత్ పాస్ అవని స్టూడెంట్‌కి ఈ ‘సెట్స్’ హోరు ఎందుకు? అని అక్షర వేసిన ప్రశ్న మనందరికి!

ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఫొటో సంవత్సరానికి ఒక్కసారి మొదటి పేజిలో పడితే… ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లల ఫొటోలు ప్రతి రోజు లోపలి పేజిల్లో ఎన్నో పడుతుంటే మనం పట్టించుకునే స్థితిలో లేము!

అక్షరాన్ని ఆయుధంగా మార్చుకోగలమా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here