అక్షరమాల (వ్యక్తిత్వ సాహిత్య సౌరభాలు)-పుస్తక పరిచయం

0
10

[box type=’note’ fontsize=’16’] ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్రసాహిత్యం ద్వితీయ సంపుటం అక్షరమాల (వ్యక్తిత్వ సాహిత్య సౌరభాలు)కు – ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు రాసిన పీఠిక. [/box]

[dropcap]ఆ[/dropcap]చార్య వెలుదండ నిత్యానందరావు నాకు పరిశోధకవిద్యార్థి దశ నుండి పరిచయం. నిరంతర అధ్యయనశీలి, కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలంతో పాటు తెలుసుకున్న విషయానికి వ్యాసరూపం ఇచ్చి ప్రచురించే అలవాటుగల ప్రాణి. వ్యాస రచన అతనికి మంచినీళ్ల ప్రాయం. విద్యార్థిదశ నుండి పదవీవిరమణ సమీపస్థితిలో కూడా వ్యాసరచనా వ్యాసంగం కొనసాగుతూనే ఉండడం నిత్యానందరావులోని విశేషం. వ్యాసరచన అతని దినచర్యలో ఒకభాగం అనడం అతిశయోక్తి కాదు. ఆతడు వ్యాసరచనాశాఖాధ్యాయి.

వందలకొలది వ్యాసాలు రాయడం ఒక ఎత్తు అయితే రాసిన వ్యాసాలన్నిటినీ భద్రపరిచి ఉంచుకోవడం, వాటిని కాలానుక్రమంగా కూర్చి ముద్రించాలనుకోవడం మరో ఎత్తు. ఇది నిత్యానందరావులోని సుగుణం. గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు – “యోగక్షేమమ్ వహామ్యహమ్” – వాక్యాన్ని అక్షరాలా పాటించి వ్యాసాలను క్షేమంగా సంరక్షించాడు. నలభయ్యేళ్ళ నిత్య (ఆనంద) సాహిత్య వ్యాసంగ ఫలాలివి. 1979 నవంబర్ 19 నాడు ఆంధ్రప్రభ దినపత్రికలో సింహాచలం దేవాలయంలో జరిగిన దొంగతనాన్ని ఖండిస్తూ రాసిన లేఖారచన మొదలుకొని నేటిదాక వేలకు చేరిన రచనలను సంరక్షించుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. ఏ ఒకటో రెండో తప్పిస్తే అన్నీ భద్రంగా దాచుకొన్నాడు. కొత్తగా వ్యాసాలు రాయడం యోగమే కదా!

ఈ గ్రంథం రెండు విభాగాలుగా సాగింది. రెండింటిలోను కావ్యసమీక్షలు, కవుల పరిచయాలు, ప్రసిద్ధ సాహిత్యకారులు, చారిత్రక విమర్శకులు, సాహిత్యవిమర్శకులు, సిద్ధాంతవ్యాస సమీక్షలు, అలభ్యకావ్యాల ఆలోకనం చోటు చేసుకున్నాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసిన వ్యాసాలు – ఉస్మానియా తెలుగుశాఖకు చెందిన విద్యార్ధుల, అధ్యాపకుల, కవులమీద రాసిన వ్యాసాలు. ఈ వ్యాసాల గురించి విశ్లేషించే ముందు వ్యాసకర్త వ్యాసనిర్మాణ చతురుడు కావడంతో వ్యాసాల శీర్షికలు విషయఔన్నత్యాన్ని ప్రస్ఫుటించేలా, వ్యక్తుల వ్యక్తిత్వం పరిమళించేలా, త్వరగా చదువాలనే ఉత్కంఠ రేపేలా పెట్టడంలో తన ప్రతిభను చాటుకున్నాడు. వ్యాసాలకు తగిన ఫోటోలను జతపరచడంలో కూడా ఎంతో శ్రద్ధాసక్తులను కనపరిచాడు.

వ్యాసరచన ఒకకళ. ఎత్తుగడ, వివరణ, ముగింపు అనే త్రిభంగి సమన్వితం వ్యాసం. ఎత్తుగడలో వైవిధ్యం, మధ్యలో విషయవివరణ, ముగింపులో వ్యాసకర్త దృక్పథంతోపాటు ఆశించే ఫలితాలు కూడా ప్రతిఫలిస్తాయి. వ్యాసం ఎత్తుగడలో శిల్పానికి ఒకటి రెండు ఉదాహరణలు

  1. చంద్రముఖీ బోసు

ఎం.ఏ డిగ్రీ పొందిన ప్రప్రథమ భారతీయ మహిళ. సుమారు వందేళ్లక్రితం ఆమె పట్టా అందుకున్నప్పుడు కురిసిన ప్రశంసలూ, అభిశంసనలూ అన్నీ ఇన్నీ కాదు, ఆమె అపూర్వ విజయానికి నారీలోకం అబ్బురపడితే పురుషాహంకారం నిబ్బరాన్ని కోల్పోయింది. చంద్రముఖీబోస్ విజయం వెనుకగల బహుముఖ అవరోధాలు అందుకు కారణం.

  1. ఆయన పేరు ఆండ్రశేషగిరిరావు

తొంబైనాలుగేళ్ళ నవయువకుడు. నేటి తరానికి అంతగా తెలియనివారు.

కనిపిస్తే చాలు ఆంధ్రుల చారిత్రక విశేషాలను, ప్రాంతీయ విశిష్టతలని కథలు కథలుగా చెప్పగలరు.

ఇలా ఉత్కంఠ రేకెత్తిస్తూ పాఠకులను తనవైపు లాక్కోవడంలో కృతకృత్యుడవుతాడు.

ఆచార్య నిత్యానందరావుగారి వ్యాసాలలో ఎంతో విషయం ఉంటుంది. పరిశోధనాత్మకమైన వివరణ ఉంటుంది. నిశితమైన విశ్లేషణ ఉంటుంది. పాఠకులు తెలుసుకొని అనందపడే కొత్త అంశం ఉంటుంది. చెప్పే ప్రతి విషయం ప్రామాణికతను సంతరించుకుని సత్యసమ్మతంగా ఉంటుంది. వ్యాసంలో ఉట్టంకించిన విషయాల మూలాలను, ఆకరాలను తప్పకుండా అందించే దృష్టి ఉంది. తనకు తోడ్పడిన గ్రంథాల, వ్యక్తుల పేర్లను ఏమాత్రం సంకోచించకుండా పేర్కొని కృతజ్ఞతలు చెప్పగలిగే Academic Honesty ఉంది. ఈ కృతజ్ఞతాసంస్కారం నవ యువపరిశోధకులు అలవరుచుకోవలసిన ఆదర్శం. సాహిత్యంమీద, రచనా విధానాలమీద మధ్య మధ్య చురకలుంటాయి.

కొన్ని ఉదాహరణలు:-

దేశికాచార్యుల ‘అశ్రుమాల’ కావ్యాన్ని సమీక్షిస్తూ వ్యాసం ముగింపులో “పదానికో లైనుతో, ఆకుకు అందని, పోకకు పొందని ఇజాల నినాదాల కవితలు వెలువడుతున్న ఈ కాలంలో సాహిత్యమునకు ఏమాత్రం సంబంధంలేని ఒక ఖగోళశాస్త్రాచార్యుడు ఇంత చక్కని కావ్యాన్ని సృజించడం శ్లాఘనీయం.” అంటాడు. ఈ వ్యాసం 1982 జూలై నెల మూసీలో ముద్రితమైంది. ఈ వ్యాఖ్య పట్ల ఏకీభవించడం ఏకీభవించకపోవడం ప్రధానం కాదు. 1982నాటికి నిత్యానందుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ లోకి అడుగిడుతున్న విద్యార్థి అంటే ఆశ్చర్యపోతాం.

గరిమెళ్ళ సత్యనారాయణగారి మీద రాసిన వ్యాసం ముగింపులో “ఏ ఒక్క స్వాతంత్ర్యయోధుడు దీనస్థితిలో ఉన్నా వారి త్యాగాలను అనుభవిస్తున్న మనకు అవమానం, కృతఘ్నతాదోషం” అంటాడు ఆవేదనా పూర్ణుడై.

నాళం కృష్ణరావుగారి మీది వ్యాసంలో – ఆధునికాంధ్రసాహిత్య చరిత్ర పుటలన్నింటిని భిన్నభిన్న సాహిత్య రాజకీయ ప్రేరిత సాహిత్య ఉద్యమాలు డామినేట్ చేసి ఆక్రమించుకున్నాయి (పేజి.318) అని వ్యాఖ్యానిస్తాడు.

వస్తువు కనుగుణమైన శైలిలో వ్యాసం రాయగలిగిన నేర్పరితనం నిత్యానందరావు కలవడింది. చిత్రకారుడు కొండపల్లిశేషగిరిరావు గురించి రాసిన వ్యాసం, బోయిభీమన్న రాగవైశాఖి మీది వ్యాసం కళాత్మకంగా, కవితాత్మకంగా సాగడాన్ని చెప్పుకోవచ్చు. అట్లాగే మూలరచయితల వాక్యాలను సముచితమైనస్థానంలో పొదిగి వ్యాసాన్ని జిగేల్మనిపించేకళ ఈ రచయితకు వశమైంది.

ఈ వ్యాస సంకలనంలో కళాప్రపూర్ణ బోయిభీమన్నగారి రచనల మీద – “రాగవైశాఖీ- అనురాగరోచి”, “బోయిభీమన్న నాటకాలు పౌరాణిక దృక్పథం” అనేవి చూడవచ్చు. నిజానికి ఈ రెండు వ్యాసాలు వ్యాసకర్త నిశిత విశ్లేషణాత్మకమైన ఉత్తమవ్యాసాలు. ఈ రెండు వ్యాసాలు సాహిత్యవిద్యార్ధులకు జ్ఞానసంతర్పణ చేసేవే, రెండింటీ ముగింపులూ ఉదాత్త రమణీయమైనవే. రెండూ కవితాతత్త్వ వివేచనలే.

రాగవైశాఖి వ్యాసం ముగింపులో

“ఈ పుస్తకం చదివినవారి హృదయం లలిత మధుర పూర్ణ రసాభాండమవుతుంది. అప్రయోజనకరమైన ఆవేశాలు సుప్తమై; కళాత్మకత భావుకత మేల్కొంటాయి. ఇలాంటి పుస్తకాలు చదివితే’ మాసిన మనస్సు, మొద్దుబారిన భావాలు, తుప్పుపట్టిన ప్రజ్ఞ కొంతైనా క్షాళితమై చైతన్యతరంగితమై పోతాయి.” (పేజి 396)

పాఠకులకు ఇంతకన్న కావాలసినది ఏముంటుంది.?

నాటకాలు వ్యాసం ముగింపులో:-

కృతయుగంలో ధర్మవ్యాధుడు బోయ.

త్రేతాయుగంలో వాల్మీకి బోయ

ద్యాపరయుగంలో వ్యాసుడు బోయ.

కలియుగంలో భీమన్న బోయ

ఇట్టి బోయలే సదాజాతి సంరక్షకులు.

అని ముగింపు పలకడం వ్యాసానికి గొప్ప ప్రకాశాన్ని ఇస్తున్నట్లయింది.

“చరితార్థుడు జాషువా, జాషువాకవిత్వం విశ్వనరత్వ సాధన” అని జాషువ మీద కూడా రెండు వ్యాసాలున్నాయి.

ఈ సంఫుటిలో రెండోవ్యాసం ముగింపులో –

“విశ్వమెన్ని వెర్రివేషాలు వేసిన మహాత్ముల ప్రేమశంఖధ్వనికి మృతిలేదు, క్షతిలేదు, మరణంలేని మానవత్వాన్ని కవితావీణపై నేను మ్రోయించిన వ్యధాతంత్రులే ఖండకావ్యాలు” అనీ (ఇవి జాషువా మాటలే)… “అతని రచనల్లో ద్వేషంలేని ఆవేశం, అవధిలేని ఆర్ద్రత, స్వార్ధపరత్వం లేని సమచిత్తత, కుత్సితాలు లేని ఉదాత్తత గోచరించి మనలను ఉత్తేజ పరచడానికి కారణం జాషువా సాధించికొన్న విశ్వనరత్వమే. అట్టి విశ్వనరత్వాన్ని మనము సాధించుకోవడానికి కృషి చేయుదముగాక!” (పేజి. 452) వ్యాసకర్త వాంఛ అభినందనీయం.

“పరమార్థాభిముఖ ప్రస్థానమే వేటూరి విమర్శ”- వ్యాసం ముగింపు వాక్యాలు ప్రతి రచయిత తప్పక పాటించవలసిన సూత్రాలు.

“విద్వేషములు, మారణములు, చాణక్య తంత్రములు జాతి, మత, దేశ కృత విభేదములు పాటించి పొరవులు పుట్టించే రచనలకు స్వస్తి చెప్పడం మంచిది. ఆత్మగుణములను భూత దయాక్షాంత్యనసూయాదులను పెంపొందించే రచనలే వెలయవలెను”. ఇది – వేటూరి ప్రభాకర శాస్త్రిగారి విమర్శ దృక్పథం. ఇదే వారి ఆదర్శ జీవనసారం, శ్రీ శాస్త్రిగారు చెప్పిన శిరోధార్యములైన ఈ సూత్రాలు సార్వకాలికము, సార్వజనీనము ఐనట్టివి.

ఈ వ్యాసకర్త గుండె నిండుగ మెచ్చిన రచయిత, స్ఫూర్తి విధాత బంకిచంద్రచటర్జీ. వీరిమీదే ఒక ప్రత్యేక గ్రంథం కూడా రాశాడు వ్యాసకర్త. ఈ సంపుటిలో రెండు వ్యాసాలు – ‘వందేమాతరం’, ‘ఆనందమఠం ప్రభావం’- ఆంధ్రులమీద ఎంత ప్రగాఢంగా ఉందో ఈ వ్యాసాల్లో వివరించారు రచయిత.

ఆంధ్రులమీద శరత్ ప్రభావం కూడా అధికమే. ఆ వ్యాసం కూడా ఈ సంపుటిలో ఉంది. వ్యాసకర్త బహుముఖీనమైన పరిశోధనకు ఈ వ్యాసాలు అద్దం పడుతున్నాయి.

ఈ వ్యాస సంపుటిలో నాకు ఒక ప్రత్యేకత కనిపించింది. అది ఆచార్య నిత్యానందరావుగారి మాతృసంస్థకు సంబంధించిన వ్యాసాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్ధులు వారి విశేషాలు విశేషమైన కృషి చేసి సంపాదించి రాసినవి. వీరిలో కవులు, కావ్యకర్తలు, విమర్శకులు, విమర్శనా గ్రంథచయితలు- ఇంకా ఉస్మానియా తొలి తెలుగు ఎం.ఏ విద్యార్థిని, తొలి దివ్యాంగ పట్టభద్రుడు ఉస్మానియా తెలుగుశాఖ రెండవ అమృతఫలం ఇలాంటివి ఓ ఇరువైదాకా ఉన్నాయి.

“పాండిత్యం, ప్రగతిశీల దృక్పథాల మేలిమి కలబోత డా. పల్లా దుర్గయ్య” అంటూ వారి సాహిత్యం, ఆనాటి తెలంగాణ సామాజిక స్థితిగతులు, ఉద్యమస్ఫూర్తులు మొదలైన విశేషాలను సమగ్రంగా వివరించాడు. డా. పల్లా దుర్గయ్యగారు తెలుగుశాఖ ప్రథమ ఎం.ఎ విద్యార్థి. తెలంగాణ రచయితల సంఘం పురుడు పోసుకుంది దుర్గయ్య ఇంట్లోనే. పల్లా దుర్గయ్యగారి సృజనాత్మక ప్రతిభకు, కమ్మని భావుకతకు కలకాలం నిలిచిపోగలిగిన రచన వారి ‘గంగిరెద్దు’ కావ్యం. ఈ కావ్యాన్ని సమీక్షిస్తూ కవిసమ్రాట్ విశ్వనాథవారు శ్రీ దుర్గయ్యగారి కవిత్వాన్ని కొండకెత్తిన విధానాన్ని కూడా వ్యాసకర్త క్రోడీకరించారు. దుర్గయ్యగారి పరిశోధన దక్షతను ప్రత్యేకంగా వివరించారు. చివరగా తెలంగాణ పండిత పరంపరలో ప్రముఖస్థానం పొందికూడా నిశ్శబ్దసాహిత్య వ్యవసాయానికే అంకితమైన నిర్మమచిత్తులు, పరమసాధు జీవనులు, మా తెలుగుశాఖకు కాసిన మొట్టమొదటి అమృతఫలం అంటూ డా. పల్లా దుర్గయ్యగారికి అంజలి ఘటిస్తూ ముగించారు రచయిత. డా. పల్లా దుర్గయ్యగారి శతజయంతి సభలో చేసిన ప్రసంగ వ్యాసమిది. అమృతఫలంగా పేర్కొనడమే ఔచితీమంతం.

ఇక మరోవ్యాసం – ఉస్మానియా తెలుగుశాఖ రెండవ అమృతఫలం ఈటూరి లక్ష్మణరావు – శ్రీ లక్ష్మణరావుగారి గురించిన వివరాలు సేకరించినడానికి వ్యాసకర్త విశ్వప్రయత్నం చేశాడు. లక్షణరావుగారి మరదలు డెబ్భైఏళ్ళ సుజాతగారిని, మేనల్లుడు ఎనభైమూడేళ్ల డా. సి. లక్ష్మీనరసింహరావుగారిని కలుసుకుని విషయాలు సేకరించాడు. ఒక వ్యాసం రాయడానికి విషయసేకరణలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టం అయినా ఓర్పుతో, నేర్పుతో కార్యసాధన చేయడం నిత్యానందరావుగారిలో గల కళ. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ చరిత్రను తవ్వి తీయాలన్న తపన వ్యాసకర్తలో అణువణువునా ఉంది అనడానికి ఈ వ్యాసం ముగింపు వాక్యమే ప్రబల నిదర్శనం.

“ఆచార్య బిరుదురాజు రామరాజు 1951లో ఎం.ఏ పూర్తి చేశారు. వారు చాలాసార్లు తాను రెగ్యులర్ విద్యార్ధులలో ఏడవ విద్యార్థిననీ, ప్త్రేవేటు విద్యార్ధులను కూడా కల్పుకుంటే పదవవ్యక్తిననీ చెప్పేవారు. మరివారెవరో ఇప్పటికైనా తెలుసుకోవలసిన అవసరం లేదా? తెలంగాణా సాకారమయ్యాకనైనా ఇతిహాసపు చీకటికోణంలో దాగిన ఇలాంటివారిని స్మరిద్దాం”- ఇదీ వ్యాసకర్త అంతరాత్మఘోష. ఇంతటి తపనతో చేసిన పరిశోధన ఫలంగా విషయం సేకరించి రాసిన మరో వ్యాసం – ఉస్మానియా తొలి తెలుగు ఎం.ఏ విద్యార్థిని – ఇల్లిందల సుజాత. ఈ వ్యాసంలో – తెలుగుశాఖ నుండి ఎం.ఏ పట్టాను పొందిన వారి వివరాలు అందించారు.

1942లో పల్లా దుర్గయ్యగారి తరవాత ఐదేళ్ళు ఎవరూ తెలుగు ఎం.ఏ చదవనేలేదు. 1947లో ఈటూరి లక్ష్మణరావుగారు, 1949లో- కోవూరు గోపాలకిషన్ రావుగారు ఎం.ఏ డిగ్రీలు పొందారు. 1950లో బి. రామరాజుగారు, ఇల్లిందల సుజాతగారు ఎం.ఎ డిగ్రీ పొందిన రెగ్యులర్ విద్యార్థులు. కాగా అబ్బూరి రామకృష్ణారావు గారి అల్లుడు సత్తిరాజుకృష్ణారావు 1950లో ప్రైవేటుగా ఎం.ఎ తెలుగు చేసిన తొలి విద్యార్థి. ఇవి నిత్యానందరావు నిర్ధారించిన చారిత్రకాంశాలు.

సుప్రసిద్ధ కథకురాలు ఇల్లిందల సరస్వతీదేవిగారి కూతురే ఈ సుజాతగారు తెలంగాణాలో సురవరం ప్రతాపరెడ్డి పి.యస్. శర్మ స్థాపించిన ‘సుజాత’ పత్రిక పేరు ఈమెకు పెట్టారట. నిత్యానందరావు 2016లో ఆమెను కలిసే నాటికి ఆమెకు ఎనభైఐదేళ్ళు ఎంతో ఆరోగ్యంగా దృఢంగా ఉన్నారు. కదిలిస్తే చాలు, ఆనాటి హైదరాబాదు విశేషాలు, విశ్వవిద్యాలయ విశేషాలు మనతరానికి తెలియనివి ఎన్నో చెప్పారు అంటారు వ్యాసకర్త అమె చెప్పిన విశేషాలతో ఈ వ్యాసం నిండిఉంది.

“ఉస్మానియా తెలుగుశాఖ తొలి దివ్యాంగ పట్టభద్రుడు – పట్టుదలకు చిరునామా డి.వి. కృష్ణారావు వీరు 1959లో- తెలుగు ఎం.ఏలో చేరారు. శ్రీమతి బోయి విజయభారతి, బి.యన్.శాస్త్రి, ఆర్ మాధవరావులు వీరి సహాధ్యాయులు. ఎందరెందరి సహకారంతో జీవయానం సాగించారు. ట్యూటరుగా, ట్రాన్సలేటర్‌గా చేయడంతోపాటు రిటైర్ అయ్యాక ఆంధ్రప్రభలో పనిచేశారు. లా బుక్స్ ప్రచురణ కర్త కోరిక మీద ఆరునెలల అవిశ్రాంత కృషితో శాసనిక నిఘంటువును తయారు చేశారు. వీరి కాలికి నప్పే చెప్పులు కూడా దొరికేవి కావు. శరీరం సహకరించకపోయిన మానసికబలంతో అభివృద్ధి పొందిన అభిమానధనుడు ఈయన.

ఉస్మానియా తెలుగుశాఖ మూడవ విద్యార్థి ఆచార్య కె. గోపాలకృష్ణరావు అన్నది మరో వ్యాసం. ఈ వ్యాసకర్తకు అధ్యాపకులు. వీరు “ఆంధ్ర శతక సాహిత్యం” అనే అంశంపై పరిశోధన చేశారు. వీరు గొప్ప ఉర్దూ, ఫార్శీ విద్వాంసులు. 1968లో వీరి రచన “తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము” గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఉర్దూశాఖలో ఓ తులనాత్మక పరిశోధనకు సహపర్యవేక్షకత్వం వహించిన ఏకైక తెలుగు అధ్యాపకులు. అంతేకాదు మరో విశేషాంశం- 37ఏళ్ల పాటు లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం విశ్వవిద్యాలయానికి సేవలు అందించారు లాంటి అనేకాంశాలు ఈ వ్యాసం తెలియపరుస్తోంది.

ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యంగారు హైదరాబాదు విశ్వవిద్యాలయానికి వెళ్లక ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు. విమర్శ విషయంలో వీరిది ఒక విలక్షణపద్ధతి. “కొత్త సాహిత్యవిలువలను, సిద్ధాంతాలను, మెళుకువలను విమర్శకులకు, పాఠకులకు అందించారు”. అంటారు వ్యాసరచయిత.

విమర్శ విషయకమైన మరొక వ్యాసం “సాత్త్విక విమర్శకుడు ఆచార్య యస్వీ రామారావు. ఆచార్య రామారావుగారి సాహితీ వరివస్యను సమీక్షించిన సమగ్రరచన ఈ వ్యాసం. శ్రీ రామారావుగారి పరిశోధన- విమర్శ అనే అంశంపైననే. “తెలుగు సాహిత్య విమర్శ-అవతరణం వికాసం” – అనేది వీరి సిద్ధాంతగ్రంథం. దాదాపు 600 మంది విమర్శకులను నమోదు చేసిన విశిష్టగ్రంథం ఇది. అంతేకాక మరెన్నో అమూల్య గ్రంథాలను కూడా రచించారు. ఇప్పటికే ఎంతో సాహితీ సంపద కాలగర్భంలో కలిసిపోయింది. అజ్ఞాతంగా, అసూర్యంపశ్యలుగా ఉన్న సాహితీమూర్తుల కృషిఫలాలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైన ఉందంటూ పాలమూరు జిల్లాకు చెందిన 163 కవుల వివరాలను ఆచార్య రామారావుగారు అందించారు. డా. నిత్యానందరావుగారు ఆచార్య రామారావుగారి అంతేవాసి కావడంతో గురువుగారి భావజాలం పూర్తిగా అందుకుని అదేమార్గంలో నిరంతరం కృషి చేస్తున్నారు.

ఇక కేవలం ఆచార్యులుగానే కాక మహాకవిగా, ఉత్తమవక్తగా, విఖ్యాతి గడించిన సినారె మీద వ్యాసం.

కవిత్వం నా మాతృభాష

ఇతివృత్తం మానవత్వం. (ఉదయం నా హృదయం)

అంటూ ఏ ఇజాలకు నిజాలను బలిపెట్టకుండా సమన్వయదృక్పథంతో, సామరస్యశీలంతో, సౌమనస్య పూర్వకమైన అంతరంగ ప్రతిబింబాన్ని ప్రతిఫలిస్తున్న నిత్యకవితా వ్యాసంగశీలి సినారె అంటూ కవిని పరిచయం చేసి – వారి ‘భూగోళమంత మనిషి బొమ్మ’ కవితా సంకలనం యొక్క సమగ్ర సమీక్షవ్యాసమిది. నిత్యానందరావుగారి సమీక్షాశిల్పం ప్రతిఫలించే వ్యాసం ఇది. నిత్యకవిత్వ వసంతమూర్తి మాగురువుగారు ఆచార్య సి. నారాయరెడ్డిగారి 80వ జన్మదిన అభినందన సందర్భంలో రాసే అవకాశం కలిగినందుకు ఆనందిస్తున్నాను అంటూ పరవశిస్తున్న శిష్యునిది.

-2-

ఇక మరొక విభాగం వ్యక్తిత్వ సౌరభం:– సాహిత్య సౌరభ వ్యక్తిత్వ సౌరభాల సంబంధివ్యాసాలు కలిపితే అష్టోత్తరశతం దాటుతుంది. ఈ వ్యాసాలన్నీ అనుభూతిప్రధానమైనవి. విషయాత్మకత సరేసరి. గురువులు, మిత్రులు, గురుమిత్రులు, ఆత్మీయులు, సహవ్రతులు, సమకాలీన విద్యాధికులను గూర్చిన క్లుప్త సుందరమైనవి. జన్మదినాలకు, షష్టిపూర్తులకు, శతజయంతులకు, పురస్కారప్రదానాలకు, పదవీవిరమణలకు, వర్ధంతులకు రాసినవి. ఈ వ్యాసాలు ఆయా ప్రత్యేకసంచికలతో పాటుగా వివిధ దినమాసపత్రికల్లో ప్రచురించబడ్డవి. కొన్ని ఆయా సభలకోసం తయారు చేసుకొన్న వ్యాసోపన్యాసాలు.

ఆత్మీయరాగం పలికించిన వ్యాసాలు:-

  1. స్వయంప్రభతో ఎదిగిన మాగురువుగారు యస్వీ రామారావు

ఇది యస్వీ రామారావు గారి గురించి రాసింది. శీర్షిక సార్థకమనేదొక్కటే కాదు, దీనిలోని విశేషం. యస్వీ రామారావు గారి సహధర్మచారిణిగారి పేరు ‘స్వయంప్రభ’ అని తెలిసినవారికి ఇందలి విశిష్టార్థం బోధపడుతుంది.

  1. నేనూ మాగురువుగారు కపిలవాయి లింగమూర్తి,
  2. పితృతుల్యులు ఆచార్య ఎం. కులశేఖరరావు,
  3. పరమార్ద్రచిత్తురాలు ఆచార్య నాయని కృష్ణకుమారి,
  4. నేనూ మాచేరా
  5. గురుమిత్రుడు రుక్నుద్దీన్

అంటూ ఎంతో ఆత్మీయతతో, గౌరవాదరాలతో వారి వాత్సల్యాన్ని స్మరించుకొంటూ నివాళులర్పిస్తాడు.

భావస్థిరాణి జననాంతర సౌహృదాని –కె.వి.రమణాచారి గురించి రాస్తూ “ఎల్లలు లేనివారి సౌజన్యం, పరిధులు దాటని నా వర్తనం కలిసి మా ఇరువురినీ ఒక ఆత్మీయసూత్రంతో రమణీయంగా ఆనందప్రదంగా మూడున్నరదశాబ్దాలుగా పెనవేసిందని చెప్తే అత్యుక్తి ఎంతమాత్రం కాదు. అసత్యోక్తి అసలే కాదు”. (పుట. 169) అంటాడు. తెలియనివారినే ఎంతో బాగా తెలిసినట్లు చెప్పుకొని తిరిగే ఈరోజుల్లో చిన్నప్పటినుంచి తెలిసినా పరిధులు గీసుకొని వ్యవహరించాననడం పుట్టుకతో వచ్చిన సంస్కారమే తప్ప వేరు కాదు.

ఆచార్య నిత్యానందరావుగారు చాలా ఏళ్ళక్రితమే నూనూగు మీసాల నూత్నయౌవనంలో- “విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే గ్రంథం వెలువరించారు. పరిశోధన ప్రాణంగా జీవిస్తున్న ఈయనకు తన విశ్వవిద్యాలయ తెలుగుశాఖ మీద ఎంత అభిమానం ఉందో సాహిత్య సౌరభంలో కొంత తెలుసుకున్నాం. మరిన్ని విశేషాంశాలు ఈ విభాగంలోని వ్యాసాల ద్వారా తెలుసుకొందాం.

  1. తెలుగుశాఖ ఆచార్య సేవాస్మరణం
  2. ప్రగతిపథంలో తెలుగుశాఖ (1983-2018)

ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని తెలుగుశాఖలో పనిచేసిన అధ్యాపకుల వివరాలు – ఎప్పుడు చేరినది లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్ పదవీవిరమణ వివరాలతో తారీఖులతో సహా – ఈ పరిశోధన హరిసత్తముడు అన్వేషించి అన్వేషించి – సత్యసమ్మతమయిన పట్టికను సమకూర్చాడు. ఈ వివరాలు “శతవాసంతిక” ఉస్మానియా వందేళ్లు సంబరాల ప్రత్యేక జ్ఞాపిక (2019) కోసం పడిన శ్రమకు ఫలితం. అంతేకాదు, ఉస్మానియాలో ఎం.ఎ తెలుగు మొదటి విద్యార్థి పల్లాదుర్గయ్య 1942లో ఉత్తీర్ణుడైననాటినుండి 2000దాక ఎం.ఎ పూర్తి చేసిన విద్యార్థుల పేర్లు, రోల్ నెంబర్లు, మొత్తం మార్కులతో పట్టిక తయారు చేశాడు. నిత్యానందరావు శ్రమశీలానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

ఏ విశ్వవిద్యాలయం కూడా ఇలాంటి వివరాలు సేకరించి ప్రకటించినట్లు నాకు తెలియదు. ఆచార్య నిత్యానందరావు వంటి మాతృసంస్థాభిమానిని కన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ధన్యురాలు. శతజయంతి ఉత్సవాలకు సమాయత్తం కాబోతున్న మా విశ్వవిద్యాలయం తరపున కూడా ఇలాంటి వ్యాసాలు, సంచికలు వస్తే చూడాలని ఆశపడుతున్నాను. తగిన ప్రేరణ కలగాలని ఆకాంక్షిస్తున్నాను.

విమర్శ, పరిశోధన – ప్రధాన విషయాలుగా రాసిన వ్యాసాలు:-

మొదలి నాగభూషణశర్మ, పెదపాటి నాగేశ్వరరావు, జి. వెంకటరామారావు, ముదిగంటి సుజాతారెడ్డి, ఎం.వి.ఆర్.శాస్త్రి, కొలకలూరి ఇనాక్, కోవెల సుప్రసన్న, సంపత్కుమార లాంటి పరిశోధకులపైన, విమర్శనారీతుల మీద విశ్లేషణాత్మక వ్యాసాలు డా. నిత్యానందరావుగారు సమకాలీన విమర్శకుల వాడినీ వేడిని పరిశీలించి రాసిన విలువైన వ్యాసాలివి.

ఇక ఈ సంపుటిలో – ఆధునిక కావ్యాల సమీక్షలు –

  1. బాపురెడ్డి సాహితీ వ్యవసాయంలో ప్రభవించిన అభినవ కవితా శిశువు – “రంగురంగుల చీకట్లు”. ఈ సమీక్ష వ్యాసం ముగింపు చూస్తే నిత్యానందరావుగారికి ఆ పుస్తకం రాసిన కవి ఎంతగా అభిమానపాత్రులయ్యారో తెలియవస్తుంది.

ఆశ నీ భాష / ఆలోచన నీశైలి

ఆవేశం నీ శిల్పం/ ఆనందం నీ భావం

కవిత నీ బ్రతుకు/ జయోఽస్తు! బాపురెడ్డి! విజయోఽస్తు.

పరిశోధన తీవ్రంగా చేయగల సామర్థ్యంతోపాటే కావ్యరసాస్వాదన కూడా చేయగల మనసున్నవాడే మా నిత్యానందుడని తెలుస్తుంది. కానీ కవిత్వరచనపట్ల అనాసక్తుడెందుకో!

చేకూరి రామారావు తనకాలేజీ మాగజైన్‌కి రాసిన కవితలు వెతికి పట్టుకుని ఆ కవితలు తనవేనన్న సంగతే గుర్తు లేని చేరాకు బహూకరించి ఆనందపరుస్తాడు. నిజాంకాలేజి బియ్యే విద్యార్థినిగా అబ్బూరి ఛాయాదేవి 1958 ప్రాంతాల్లో రాసిన మొదటికథను నిత్యానందరావు అందించి ఆశ్చర్యపరిచాడు.

నిత్యచిత్తస్థిత పరిశోధకుడయిన ఈ రచయితకు పరిశోధనాంశం కనిపిస్తే పరమానందభరితుడై పలుకుతాడు. “పీఠికాపురాధీశ్వరుడు ఆరుద్ర” వ్యాసం ముగింపు చూడండి. “తెలుగు సాహిత్యంలో శిఖరప్రాయులై నిలిచిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీల పీఠికల మీద పరిశోధన జరిగింది. మహాపరిశోధకుడైన ఆరుద్ర పీఠికలను కాస్త శ్రమ కోర్చి సేకరించి ఏ విద్యార్థి అయినా ఎం.ఫిల్ పరిశోధనకు పూనుకోవచ్చు. తథాస్తు”- తథాస్తు అన్నది కూడా వ్యాసకర్తే.

అమరజీవి మీద ప్రబంధం రాసిన కవి కూడా “అమరజీవి” అని వ్యాసకర్త తీర్పు. ‘ఆంధ్రమహాభ్యుదయం’ రచయిత శ్రీ బండ్ల సుబ్రహ్మణ్యంగారి కావ్యసమీక్ష ముగింపులో “అమరజీవి పొట్టిశ్రీరాములు బలిదానం రోజున అమరజీవి అమరగాథను ఉదాత్తకావ్యంగా మలచిన బండ్ల సుబ్రహ్మణ్యం మహాకవిని సంస్మరించుకోవడం కూడా సముచితమే” అంటారు. కావ్యవస్తువును బట్టి కవిని గౌరవిస్తూ విమర్శ విషయ ప్రధానమైన వ్యాసాలను సమీక్షించడం నిత్యానందరావుగారి ప్రతిభను ప్రకాశవంతం చేసిన వ్యాసాలు.

శ్రీ నోరినరసింహశాస్త్రిగారి వ్యాసంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి విశిష్టసభ్యులై కూడా నిర్భయంగా విమర్శించడాన్నీ, ఎంతో ఉదాత్తస్థాయిలో అచ్చుతప్పులు లేకుండా పుస్తకాలు అందించాలని తపనపడడాన్ని నిత్యానందరావు చక్కగా వివరించి ఒక్కమాటలో చెప్పాలంటే నోరి నరసింహశాస్ర్తి సమీక్షలన్నీ ఉదాత్తతకు, నిగ్రహానికి, శ్రద్ధకు, విచక్షణకు దృష్టాంతప్రాయాలు-అంటారు.

ఆచార్య శివారెడ్డిగారు ఈ వ్యాసకర్తకు గురువు, సహవ్రతులు కూడా. ఎల్లూరి శివారెడ్డిగారు రాసిన “ఆంధ్రమహాభారతంలో రసపోషణం” అనే సిద్ధాంతగ్రంథాన్ని విశ్లేషిస్తూ వ్యాసకర్త విలువ కట్టిన అంశాలు సత్యసుందరమైనవి. నిశిత పరిశోధనదక్షతకు దర్పణం పట్టేవి. ఈ సిద్ధాంతగ్రంథం ముందుగా పాఠకుడిని మనవైపు లాక్కోవడానికీ, ఆ తర్వాత పుస్తకాన్ని ఆసాంతం చదివింపచేయడానికీ అనువుగాను ఆకర్షణీయంగాను అధ్యాయాలపేర్లు పెట్టడంలో శివారెడ్డిగారు ఎంతో నేర్పును ప్రదర్శించారు. వీరదీప్తి, శృంగారజ్యోత్స్న, కరుణమధురిమ, హస్యశంపాలతలు, భయానకహేల, బీభత్సలీల, రౌద్రరక్తిమ, శాంతమంజులత్వము అనేవి తిక్కన మనస్థితిని, వ్యాసుని గమ్యాన్నిబట్టి రసాన్ని నిర్ణయించడం ఒక ప్రధానాంశంగా పరిగణించడం విశేషం. సాధారణ సిద్ధాంతగ్రంథాల్లో కాగడా పెట్టి వెతికినా కనిపించని వాక్యవిన్యాసం ఈ గ్రంథంలో చూడవచ్చు. “పుట్ నోట్”- అధోగతి అని అనువదించడం చమత్కారం. పదప్రయోగ వైచిత్రి. విషయరమ్యత, వాక్యవిన్యాస కళ, విలక్షణశైలీసంపన్నత ఏ ఒక్కసారో భారతం చదివితేనో, ఏఒక్కసారో రాస్తేనో అలవడేది కాదన్నది నిర్వివాదాంశం. బహుపర్యాయ పఠనం, మనస్సులో దాని అనురణనం జరిగితే తప్ప ఈ సిద్ధాంత గ్రంథం ఈ తీరుగా రాదని నిత్యానందరావు విశ్లేషించిన తీరు సహృదయామోదకరం. ఈ వ్యాసం చదివిన ఏ సాహిత్యాభిమానికైన ఆచార్య శివారెడ్డిగారి సిద్ధాంతగ్రంథాన్ని వెంటనే చదవాలన్న కోరిక కలుగుతుంది. శివారెడ్డిగారు భారతబద్ధస్పృహులని తెలియవస్తుంది.

ఆచార్య పి.సుమతీనరేంద్ర వక్త, కవయిత్రి, అధ్యాపకురాలు. నెల్లూరు జిల్లానుండి డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి మహిళ అంటూ పరిచయం ఆమె సాహిత్యప్రస్థానాన్ని తెలియజేసే వ్యాసమిది.

‘ఉస్మానియా తెలుగుశాఖలో పనిచేసిన అధ్యాపకుని గురించి తెలిస్తే చెప్పండి?’ అనే శీర్షికతో వెల్లలూరు వెంకటరాఘవశర్మ అనే ఆధ్యాపకుని గురించి రాశారు. పాఠకులను ఇంతగా అభ్యర్ధిస్తూనే శ్రీరాఘవశర్మగారి గురించి ఎన్నో వివరాలు కుప్ప పోశారు. ఆయన లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూకు రావడం, ఎన్నికవడం చెప్తూ ఆనాటి ఇంటర్వూ విశేషాలు కూడా అందించారు. శ్రీరాఘవశర్మగారు 1950లో తెలుగుశాఖలో లెక్చరర్ గా చేరి 1951లో వాతావరణం సరిపడక రాజీనామా చేసి వెళ్లిపోయారు. బి.రామరాజు, సి.నారాయణరెడ్డి, ఎం.కులశేఖరరావు, పి.యశోదారెడ్డి లాంటివారంతా ఆయన శిష్యులట. తరువాత వారి జీవిత విశేషాలు సేకరించడానికి వ్యాసకర్త చేసిన విశ్వప్రయత్నాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. ఇలా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ విద్యార్థుల, ఆచార్యుల విశేషాలను ఎన్నిసార్లు, ఎన్నితీర్లు వివరించినా డా. నిత్యానందరావుగారికి తనివి తీరదు.

తీగలాగి డొంకంతా కదల్చగల నేర్పరి నిత్యానందరావు. ఈ మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మొదటి ప్రిన్స్‌పల్‌గా పనిచేసిన రాస్ మసూద్ అనే ఒక మహమ్మదీయుని గూర్చి రాశారు. 1957లో ఉస్మానియా వైస్ చాన్సలర్‌గా పని చేసిన ఎం.స్.దొరైస్వామి గురించి ఎంతో లోతుగా పరిశోధించి ఎన్నో విశేషాలను బయటపెట్టారు. ఆయన విశాఖపట్టణం మిసెస్ ఎవిఎన్ కాలేజీలో పనిచేసినట్లు రికార్డులో దొరికిందనీ, మీకేమైన సమాచారం తెలుసా అని ఫోను చేసారు. నాకే కాదు ఆ కాలేజిలో పనిచేసిన పెద్దలకు తెలియక ఏ విధమైన సమాచారం అందించలేకపోయాము. ఒకవారం రోజుల్లో విశేషమైన సమాచారం సంపాదించి చక్కని వ్యాసం రాసి ప్రచురించాడు.

యూనివర్సిటీ రికార్డులను పరిశీలించడం, మహ్మదీయశకమైన “ఫసలీ” సంవత్సరాలను ఆంగ్లకాలమానంలోకి మార్చి కాలనిర్ణయం చేయడం సామాన్యమైన విషయం కాదు. వివిధ విషయ విగతశ్రముడు ఈ వ్యాసకర్త. దొరైస్వామి మీద నిత్యానందరావు రాసిన వ్యాసం పరిశోధకవిద్యార్థులు విధిగా చదువాల్సిన ఒక నమూనా వ్యాసం.

ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖ చరిత్ర నిర్మాణానికి కావాల్సినన్ని వివరాలు సేకరించి క్రోడీకరించి రాసిన ఈ వ్యాసాలు ఆచార్య నిత్యానందరావు మాతృసంస్థాభిమానాన్ని చెప్పక చెప్తున్నవి, కొలవెట్టరాని అతని భక్తిని అభినందించవలసినదే. హనుమంతుడు లంకలో సీతాన్వేషణ సందర్భంలో గాలిలా వెన్నెలలా అన్నిటా ప్రవేశించి వెతికినట్లు వాల్మీకిమాట. విషయాన్వేషణ విద్యలో నిత్యానందరావు హనుమంతుడే. ఈ సంపుటిలోని వ్యాసాలే కాదు ఏ వ్యాసమైనా విషయ నిర్భరమై భావి పరిశోధక విద్యార్థులకు మంచి ఆకరాలుగా సాగుతాయి.

వాగ్దేవి శ్రద్ధా, భక్తీ, రెండూ ప్రసాదించింది, వాటికితోడు నిత్య కృషీవలుడు నిత్యానందరావు ఆధునికాంధ్ర కవులందరికీ వ్యాసపూజ చేసిన సాహితీ సంపన్నులు.

“పరుసపువ్రాత కక్రమపువ్రాత కసత్యపువ్రాత కెందు నా

కరమునకుం బ్రసర్పణము కల్గక యుండుత. సత్యమైనదే

సరసమునైనదే రచన సల్పెదగాక!……..

శ్రీవేటూరిప్రభాకరశాస్త్రి వారి మార్గాన్ని ఆదర్శంగా పెట్టుకుని రచనా వ్యాసంగం చేస్తూ, రాసిన వాటిని శ్రద్ధగా పరిరక్షించుకుంటూ అక్షరాకృతిగా అందిస్తున్న ఆచార్య నిత్యానందరావును మనసారా అభినందిస్తూ తన సాహిత్య వ్యవసాయం నిరంతరం సాగించాలని కోరుతూ శుభాశీస్సులతో…

వ్యాసం కవీనాం నికషం వదంతి!

13, జూన్ 2021.                                                                                                 కోలవెన్ను మలయవాసిని

విశాఖపట్టణం

***

ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్రసాహిత్యం 2వ సంపుటం

అక్షరమాల (వ్యక్తిత్వసాహిత్యసౌరభాలు) పుటలు. 666. వెల.800-00.

ప్రతులు కావలసినవారు రచయిత ఫోన్ నెంబర్ 9441666881కు గూగుల్ పే చేసి తెప్పించుకోవచ్చు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here