ఉద్వేగాలు, అనుభూతుల కవితా రూపం ‘అక్షరంతో ప్రయాణం’

2
12

[చెన్నూరు హరి నారాయణ రావ్🌿 గారి ‘అక్షరంతో ప్రయాణం’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]వి[/dropcap]శ్రాంత బ్యాంకు అధికారి చెన్నూరు హరి నారాయణ రావ్🌿 గారు రచించిన కవితా సంపుటి ‘అక్షరంతో ప్రయాణం’. ‘కొన్ని కవితలు – వెతలు’ ఉపశీర్షిక గల ఈ సంపుటి కవి తొలి పుస్తకం. దీనిలో ‘వైకుంఠ ప్రస్థానం’ అనే చరమ గీతాన్ని అనుబంధంగా జోడించారు. ఈ సంపుటిలో 71 కవితలున్నాయి.

అన్ని రచనలు తన గుండెను చీల్చుకుని వచ్చినవేననీ, వాటి వెనుక అంతర్మథనం, ఆత్మపరిశీలన ఉన్నాయని కవి తన ముందుమాటలో పేర్కొన్నారు. మోయలేని ఆలోచనల్ని, విడిచిపో ఇష్టం లేని భావాలని కాలగర్భంలో కలిసిపోనీయకోడదనే ఉద్దేశంతో వాటికి అక్షర రూపమిచ్చినట్టు తెలిపారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలనం, గణేశ స్తుతి అనే కవితలతో ఆరంభించారు. దేవతా స్తుతుల వంటి కవితలను మొదట ఉంచారు. అనంతరం తనను కదిలించిన పలు అంశాలపై కవితలను అందించారు.

“చిన్నప్పుడు చీకటంటే భయం!/ఇప్పుడు పగలు చీకటికి/తేడా తెలియని నిజం!” అంటారు ‘నువ్వు నేను!’ కవితలో. అవినీతికీ, చెడు ప్రపర్తనకీ చీకటిని ప్రతీకగా వాడారని అనిపిస్తుంది పాఠకులకి. బాల్యం నుంచి తాను అనైతికతకీ, దుష్ప్రవర్తనకి దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత సమాజమంతటా అవే గోచరిస్తున్నాయని కవి భావన కావచ్చు.

‘నువ్వు – నేను – ఒక జ్ఞాపకం’ అనే పెద్ద కవితలో కృష్ణుడిని తన మిత్రుడిగా భావించుకోడం పాఠకులను ఆకట్టుకుంటుంది.

తనని అనుగ్రహించనందుకు హరిని ‘ఎందుకిలా చేశావ్?’ అనే కవితలో ప్రశ్నిస్తారు. తను చేసిన నేరమేమిటో తెలిపి, తనని అక్కున జేర్చుకోమని వేడుకొంటారు.

నల్లగా ఉన్న ఓ గోపిక తాను శ్రీకృష్ణుడి అభిమానాన్ని పొందలేనందుకు బాధపడుతూ – కృష్ణుడికి రాధకు మధ్య అరచీకటి తెరనౌతానంటుంది ‘నల్లని నేను – తెల్లని జాబిలి’ కవితలో.

“అన్ని నొప్పుల మాన్జేటి దివ్య సంజీవిని/అన్ని రుగ్మతల కాచేటి కల్పతరువు” అని తెలుగు భాషను కీర్తిస్తూ, ఎందరో ఆంగ్లకవులకు తెలుగు కవులు ఏ మాత్రం తీసిపోరని అంటారు ‘తెనుగు బావుటా!’ అనే కవితలో.

ప్రియుని మోసానికి గురైన ప్రేయసి వేదనని ‘వాడిన మల్లియ!’ కవిత చెబుతుంది. ఈ కవికి పాటలంటే ఉన్న ప్రేమనీ, అనురక్తినీ ‘పాట’, ‘పాటకి దాహం’ అన్న కవితలు చాటుతాయి.

చీకటిప్రియడిని చేరేందుకు రుద్రవర్ణం నేతచీరని ధరించిన సాయం సంధ్యని ఓ ప్రౌఢగా పేర్కొంటారు ఓ కవితలో.

తన జీవితం తనకి నచ్చక, చివరి దశకు చేరిన వ్యక్తి తను చేసిన పొరపాట్లకు, తప్పులకు తనని క్షమించమని వేడుకోవడం ‘14వ అంతస్తు’ అనే పెద్ద కవితలో చూస్తాము.

తమ బాల్యంలో ఇంట్లోని పిచుకల జంటనీ, వాటి సందడిని ఇష్టపడిన పెద్దక్క ఆ పిచుకలలానే తమకీ దూరమైందని వాపోతారు ‘ఆ రోజు నేను ఏడ్చాను!’ కవితలో. దుఃఖం అవ్యక్తంగా వ్యక్తమవుతుందీ ఆర్ద్రమైన కవితలో.

“జీవితం కథ కాకూడదు, కంచికి పోకూడదు/మంచి పాటవ్వాలి, కాలంతో బ్రతికుండాలి” అని అభిలషిస్తారు ‘కథ లేని పుస్తకం’ కవితలో. జీవన సౌరభం ఎలా ఉండాలో ఈ కవిత చెబుతుంది.

‘నాన్న!’ కవితలో తమకు తండ్రిగారు నేర్చినవాటిని తలచుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటారు.  వయసు పెరుగుతున్నా తాను జీవనోత్సాహం కోల్పోలేదని చెబుతారు ‘చావు లేదు నాకు’ కవితలో.

పచ్చదనం కోల్పోతున్న ధరిత్రిని ‘ఆధునిక శ్మశానం’ అని అంటారు. పడుచులు షడ్రుచులు అంటారు ‘ప్రతీ స్త్రీ ఒక ఉగాది’ అనే కవితలో.

నిర్జీవమైన తన జీవితాన్ని ‘తెల్ల కాగితం’లో పోల్చుకుంటారు. ఏమీ రాయలేకపోయానని బాధపడతారు. “జ్ఞాపకాల గతుకుల వీధిలో, గమ్యం లేని ప్రయాణం” అంటూ జీవితాన్ని పునశ్చరణ చేసుకునే ప్రయత్నం చేస్తారు ‘కూడలిలో ఈదులాట!’ కవితలో.

తనదైన పద్ధతిలో జీవితాన్ని గడిపిన తీరుని ‘బొమ్మలతో యుద్ధం!’ కవితలో చెబుతారు.

పేదరికం నేరమైతే నేను నేరస్థుడినే అంటారు ‘గమ్యం లేని రైలుబండి!’ కవితలో. లేమి ఎంత కటువుగా ఉంటుందో, ఎంత దుర్భరమో ఈ కవిత వ్యక్తం చేస్తుంది.

ఆకాశం, ఎండ, వాన, సూర్యుడు, మేఘాలు, చీకటి, జాబిలి, నక్షత్రాలు – చాలా కవితల్లో చోటు చేసుకుని ప్రకృతి పట్ల కవికి ఉన్న అభిమానాన్ని చాటుతాయి.

మలి వయసులో చేసిన తొలి అచ్చును పాఠకులు ఆదరిస్తారని ఆకాంక్షించారు కవి.

***

అక్షరంతో ప్రయాణం (కవిత్వం)
రచన: చెన్నూరు హరి నారాయణ రావ్🌿
పేజీలు: 124
వెల: ₹ 108/-
ప్రతులకు:
చెన్నూరు హరి నారాయణ రావ్🌿
5-75-21, ‘సాయి ఆండ్రూస్’,
3వ లైను పండరీపురం,
గుంటూరు. 522002
ఫోన్: 9000429193

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here