నవ్విస్తూ ఆలోచింపజేసే ‘అలా సింగపురంలో..’

0
12

[రాధిక మంగిపూడి గారు రచించిన ‘అలా సింగపురంలో..’ కథాసంపుటిని విశ్లేషిస్తున్నారు శ్రీమతి షామీర్ జానకీదేవి.]

[dropcap]రా[/dropcap]ధిక మంగిపూడి గారి ‘అలా సింగపురంలో..’ చదివిన తర్వాత నాకు విశ్లేషణ రాయాలి అనిపించింది. చాలా రోజులకు ఒక మంచి పుస్తకం చదవగలిగాను. 126 పేజీల ఈ పుస్తకంలో 16 కథలు ఉన్నాయి.

ఈ మధ్యనే ఒక అభినందన సభలో సాహితీమూర్తులు రాధిక గారి పుస్తకాలపై విశ్లేషణ చేశారు. రాధిక నాకు యాంకర్ గానే పరిచయం. ఆన్లైన్ కార్యక్రమాల్లో అందులో వంశీ రామరాజు నిర్వహించిన ‘ఘంటసాల స్వరరాగ మహాయాగం’లో తరచుగా కనపడేవారు. చక్కగా నవ్వుతూ ప్రతి పాటకు విశ్లేషణ ఇవ్వటం ఆమె ప్రత్యేకత.

తన సాహిత్యం గురించి ఈ మధ్యనే తెలిసింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 178వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ కార్యక్రమంలో ప్రముఖులు ఆమె రచనలపై సమీక్షా ప్రసంగాలు వినిపించారు. తన శ్రీవారితో కలిసి పాల్గొన్న రాధిక ఈ కార్యక్రమంలో ఎంతో చక్కగా మాట్లాడింది.

ఆమె నవ్వులా స్వచ్ఛంగా ఉన్న ఈ పుస్తకం ‘అలా సింగపురంలో..’ చదువుతుంటే మనం నవ్వకుండా ఉండలేము. పుస్తకం మొదలుపెడితే ఆపము. అంత బాగుంది.

‘ప్యాకేజీ పెళ్లి’ అంటూ నేటి పెళ్లిళ్లపై విసిరిన వ్యంగబాణం ఆలోచింపజేస్తుంది. ఏ పెళ్ళిలో చూసినా ముందు మనకు కనిపించేది ఫోటోగ్రాఫర్లు. నేను ఎప్పుడూ అనుకుంటాను.. ఎందుకు హాయిగా వాళ్ల రెండు కుటుంబాలు పెళ్లి జరిపించుకొని తర్వాత రిసెప్షన్ ఇస్తే సరిపోతుంది కదా అని.

‘నమ్మకం విలువ’ కథలో భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధానం బాగుంది. ‘పనిమనిషోపాఖ్యానం’ ఒకటవ భాగంలో తల్లి మనస్సు ఎక్కడ ఉన్న ఒకేలా ఆలోచిస్తుంది, అది ఇండియా అయినా సింగపూర్ అయినా ఒకటే. కష్టపడి నిజాయితీగా బ్రతికే వారి ఆత్మస్థైర్యాన్ని మనకు పరిచయం చేసినట్లుగా ఉంది.

‘పనిమనిషోపాఖ్యానం- 2’ కథలో పనిమనిషి మేకప్ వేసుకొని వచ్చినా, ఆ మేకప్ వెనుక ఉన్న ఆమె కష్టం ఇల్లు కొనాలనే తాపత్రయం బాగుంది. మనకు ఉన్నదాన్ని గుర్తించలేని శంకర్ లాంటి వాళ్లకు ‘సంక్రాంతి’ ఒక మంచి పాఠం నేర్పిస్తుంది.

సింగపూర్ లో పోస్టల్ ఇబ్బందులను ‘సింగ్ పోస్ట్’ కథలో ఆసక్తికరంగా రాశారు. గూగులమ్మతో కష్టాలు బాగున్నాయి. ‘నిజాలెవరికి కావాలి’లో ఫేస్బుక్ పై సంధించిన అస్త్రాలు పదునుగా బాగున్నాయి. ‘శార్వరి’ లో మహేష్ మాయేష్ బావుంది. టిక్ టాక్ లపై విసిరిన విమర్శ బావుంది. ‘గమ్మత్తు – మరమ్మత్తు’ లో ఎలా సంపాదించాలో బాగా చెప్పారు.

ఫేస్ బుక్ ను ఎలా వాడుకుంటున్నారో రచయిత్రి చక్కని కథా రూపంలో ‘సత్తు – చిత్తు’ లో చెప్పారు. కొత్తగా ఎఫ్ బి లో చేరే వారికి మంచి కాషన్ ఇచ్చారు… ‘మై ఫైనాన్షియల్’ చదువుతుంటే నాకు బ్యాంకులో మొదటి రోజు అనుభవం గుర్తుకు వచ్చింది. ఏమీ తెలియకుండా ఉద్యోగంలో చేరటంలో ఉండే భయం కళ్ళముందు కదలాడింది. వంట చేతకానప్పుడు ఏదో ఒకటి చేసి మెప్పించాలనుకునే భర్త తన ఓటమి అంగీకరించక తప్పదు అదే ‘శ్రీమతి కో బహుమతి..’ కథ.

భార్యాభర్తల కలహాలకు వచ్చే ‘పగటి వెన్నెల’ను చక్కగా పరిష్కరించారు. నాకు కెనడాలో పెట్టిన మామిడికాయ ముక్కలకారంలా అనిపించింది. ఏమీ దొరకని చోట ఉన్నదే మహాప్రసాదం. ‘బొమ్మలాట’ ఊహకందని రుణానుబంధం. ‘కల కానిదీ- విలువైనదీ’ చదువుతుంటే ‘అనువు కాని చోట అధికుల మనరాదు’ అనే సామెత గుర్తుకొచ్చింది. ‘దబ దబా’లో సరదాగా గూగలమ్మ పనితనం తెలుసుకోవచ్చు.

‘ఏ దేశమేగినా’ అన్న రాయప్రోలు వారి కవిత గుర్తు చేసినట్లుగా ఉన్న ‘అలా సింగపురంలో..’ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. చక్కటి పఠనాశైలితో హాస్యాన్ని జత కూర్చిన రాధిక గారికి అభినందనలు.

***

అలా సింగపురంలో.. (కథాసంపుటి)
రచన: రాధిక మంగిపూడి
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
పేజీలు: 126
వెల: ₹ 100
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://logilitelugubooks.com/book/ala-singapuramulo-radhika-mangipudi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here