అలా తిరిగొద్దాం..

2
13

[శ్రీమతి అనూరాధ మంగళ్ హిందీలో వ్రాసిన ‘మనోరంజన్ సైర్’ అనే పిల్లల కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెండు దర్శనీయ కట్టడాలు ఒకదానితో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ, షికారు చేసొస్తే ఎలా ఉంటుందో అత్యంత సృజనాత్మకంగా పిల్లలకు ఉత్సుకత కలిగేలా రచించారు అనూరాధ మంగళ్.]

[dropcap]సో[/dropcap]మవారం. సాయంత్రం నాలుగు గంటలవుతోంది. పనిదినం కావడంతో పారిస్ లోని ఐఫిల్ టవర్ ప్రాంగణమంతా ఖాళీగా ఉంది. ఐఫిల్ టవర్, అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని తలచుకుంది. అంతే! అక్కా చెల్లెళ్ళయిన వాటి మధ్య భావ ప్రసారం మొదలయింది.

“చెల్లీ, ఎలా ఉన్నావు?” అడిగింది అక్క.

“నేను బావున్నాను అక్కా. ఏంటి కబుర్లు?” అంది చెల్లి.

“చెల్లాయ్.. నేనేమో జనాలకి పారిస్ చూపిస్తాను, నువ్వేమో న్యూయార్క్ చూపిస్తావు. పైగా మనిద్దరం ఏళ్ళ తరబడి ఇలా నిలబడి పర్యాటకులకు దర్శనమిచ్చి.. అలసిపోయాం. ఇవాళ మనిద్దరం కలిసి అలా తిరిగొద్దామా?” అంది అక్క.

“ఆలోచన బావుందక్కా. కానీ ఎక్కడికి వెళ్దాం?” అడిగింది చెల్లి.

“నేనెప్పుడూ సముద్రం చూడలేదు. పద సముద్రం చూసొద్దాం” అంది అక్క. సరేనంది చెల్లి.

అంతే. ఆ రెండు నిర్మాణాలూ ఒక్కసారిగా తమ తమ స్థానాల నుంచి మాయమయిపోయాయి.

***

ఇక్కడ పారిస్ లోనూ, అక్కడ న్యూ యార్క్ లోనూ గందరగోళం చెలరేగింది. ఈ రెండూ ఏమయిపోయాయంటూ రెండు చోట్లా జనాలు గొడవ చేయసాగారు. వాటి కోసం వెతుకులాట మొదలయింది. అందరి ఫోన్లూ తెగ మోగుతున్నాయి. మొబైల్స్, ఇంటర్‍నెట్, టివీ, ఎక్కడ చూసినా వీటి గురించే హంగామా! ఇదొక విడ్డూరమనీ, ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదని జనాలు అనుకోసాగారు. ఈ వింత ఎలా సంభవించింది?

***

అక్కాచెల్లెళ్ళు సముద్రాన్ని చూడడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ గాల్లో ఉన్నారు. క్రింద నీలి సముద్రం, అందులో తెల్లటి నురుగుతో ఎగిసిపడుతున్న అలలు. పైన నీలాకాశం. అందులో తెల్లటి మేఘాలు. అక్కాచెల్లెళ్ళు సముద్రం మీదుగా గాలిలో తిరుగుతూ చాలా దూరం వెళ్ళిపోయారు. ఒక చోట సముద్రంలో తుఫాను రేగడం చూశారు. అలలు బాగా ఎత్తుకి లేస్తున్నాయి. తీవ్రమైన గాలుల వల్ల సముద్రపు నీరు కూడా పొగలా కనిపిస్తోంది. పొగమంచులా ఏర్పడి చుట్టూ ఏమీ కనిపించడం లేదు. సముద్రంలోని చేపలు కొన్ని ఒకదాని వెనుక ఒకటిగా రైలు ఆకారంలో కదుల్తున్నాయి. అవి గాల్లో నీరు చల్లుతూ ఆకాశాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఇంతలో ఓ పెద్ద సొరచేప నీటి లోంచి బయటకి వచ్చి పైకి చూసింది. కొత్తగా అక్కచెల్లెళ్ళు కనబడసరికి దానికి ఆశ్చర్యం వేసింది. ‘ఎవరబ్బా వీళ్ళు’ అనుకుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని పలకరించి, “అక్కా, మీరెవరు? మీరే ప్రపంచం నుంచి వచ్చారు?” అని అడిగింది.

“మేము మానవుల ప్రపంచంలోని వాళ్ళం. మీ ప్రపంచం చూద్దామని ఇలా సముద్రం మీదకి వచ్చాం.”

ఆ మాటలకి సంతోషించిన సొరచేప.. “అయితే మీ ప్రపంచపు విశేషాలను చెప్పండి” అంది. ముందుగా ఐఫిల్ టవర్ మాట్లాడుతూ, “నన్ను ఇనుముతో తయారు చేశారు. నా లోపల లిఫ్ట్ కూడా ఉంది. జనాలు అందులో కూర్చుని జనాలు పైకి వస్తారు, పారిస్‍ నగరాన్ని చూస్తారు. అక్కడ్నించి చూస్తే, నగరం ఎంతో అందంగా కనిపిస్తుంది” అని చెప్పి, “చెల్లీ, నువ్వెంతో అందమైనదానివి, ఇక నువ్వు చెప్పు” అంది.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మాట్లాడుతూ, “నా రూపకర్తలు ఎంతో శ్రమించి నన్ను తయారు చేశారు. సముద్రపు గాలలు వల్ల నా రంగు ఆకుపచ్చగా మారిపోయింది. నాలోపల మెట్లు ఉన్నాయి. జనాలు ఆ మెట్ల మీదుగా, నా నుదుటి దాకా వస్తారు. అక్కడ కిటికీలు ఉన్నాయి. వాటిల్లోంచి న్యూ యార్క్ నగరాన్ని దర్శిస్తారు” అని చెప్పింది.

“నువ్వింత అందంగా ఉన్నావు కదా, నీకే ప్రాణం వస్తే, మొదటగా ఏం చేస్తావు?” అని అడిగింది సొరచేప.

“ఓ తుపాకీ తీసుకుని – నా మీద వాలి, గూళ్ళు కట్టుకుని, నా భుజాలు, తల, ఇంకా ఇతర భాగాలపై రెట్టలు వేస్తున్న పావురాళ్లని కాల్చి చంపేస్తాను” అంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాస్త కోపంగా.

“చెల్లీ, నీ మీద పక్షులు కొంతసేపే ఉంటాయి. మరి నా పరిస్థితి ఏంటో తెలుసా? పక్షులు తమ కుటుంబాలతో సహా నా మీద నివసిస్తున్నాయి. ఏళ్ళ తరబడి నా మీద తింటున్నాయి. తమ జీవితాన్నే గడిపేస్తున్నాయి. అవును, నన్ను కూడా మురికిగా చేస్తాయనుకో. ఎప్పుడూ గూ.. గూ.. అంటూ వాటి ధ్వనుల నాలో ప్రతిధ్వనిస్తుంటాయి. నన్ను ఆక్రమించుకుంటాయి. నాకు చిరాకేసినా, భరిస్తాను.” అంది ఐపిల్ టవర్.

“మా సంగతులు విన్నావుగా, ఇక నీ విషయాలు చెప్పు” అని సొరచేపని అడిగింది అక్క.

సొరచేప నవ్వింది. నాట్యం చేస్తున్నట్టు గిర్రున తిరిగింది. “నేను నీళ్ళల్లో హాయిగా ఉన్నాను. నేనీ  జలానికి రాణిని. నేను సముద్రాన్ని పాలిస్తాను. నేనెంతో శక్తిమంతురాలిని. అన్ని జలచరాలకూ నా ఆజ్ఞ పాటించక తప్పదు. నా శరీరం కూడా పెద్దదే. అందరూ నన్ను చూసి భయపడతారు. నా ముందు గొంతెత్తి గట్టిగా మాట్లాడానికి కూడా జంకుతారు. అయితే అప్పుడప్పుడు తుఫానులొస్తాయి, అప్పుడు సముద్రంలో కల్లోలం రేగుతుంది. అన్ని జలచారాలు చెల్లాచెదురవుతాయి. అప్పుడు నేను వాళ్ళని సంబాళిస్తాను. నాకు ఓ జట్టు ఉంది. గాయాలైతే కట్టు కట్టేందుకు ఉద్యోగుల బృందం ఉంది. చలి కాలం రాగానే మేం నీటి అడుగుకి బాగా లోతుకి వెళ్ళి వెచ్చగా ఉంటాం. అక్కడి వెచ్చదనం మాకు హాయినిస్తుంది. ఒక్కోసారి నీటి పైకి వచ్చి ఎండని ఆస్వాదిస్తాము” అంది సొరచేప.

“సరే, చెల్లాయ్.. చాలా విషయాలు చెప్పావు. ఇంక మాకు సెలవిప్పించు. మేం బయల్దేరుతాం” అంది ఐఫిల్ టవర్.

Art by Mrs. Anuradha Mangal

***

అక్కాచెల్లెళ్ళు గాల్లో చాలా దూరం ప్రయాణించి, మత్స్యకన్యల దేశం చేరారు. అక్కడి పరిసరాలు సుందరంగా ఉన్నాయి. మత్స్యకన్యలు తళతళ మెరిసే దుస్తులు ధరించారు. రంగు రంగుల ఈకలు ధరించారు. అందంగా ముస్తాబై, వృత్తాకారంలో నృత్యం చేస్తూ, బిగ్గరగా పాడుతూన్నారు. వారిలో ఒకరి పెళ్ళి వేడుక అది. పెళ్ళికూతురుని ప్రత్యేకంగా అలంకరించారు. ఓ మత్స్యకన్య అడిగింది, “ఎవరు మీరు, ఎక్కడ్నించి వచ్చారు?” అని.

అక్కచెల్లెళ్ళిద్దరూ తమని తాము పరిచయం చేసుకున్నారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అడిగింది – “మీరంతా ఎవరు? మీ జీవన విధానమేమిటి?” అని. అప్పటికే ఆటపాటలలో లీనమై ఉన్న మత్స్యకన్యలు – తమ గురించి చెప్పుకొచ్చాయి.

“మేమంతా ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం, దేనికీ లోటు లేదు. చుట్టూ ఆనందం ఉంది. మాలో మేం మజా చేసుకుంటాము. మా ప్రపంచం నుండి బయటకు వెళ్ళం, అసలు ఆ అవసరమే రాదు.”

వారికి అభినందనలు తెలిపి అక్కచెల్లెళ్ళు అక్కడ్నించి కదిలారు.

***

ఆకాశంలో ప్రయాణిస్తూ, సముద్రం చివరికి వచ్చేసారు, అది భూమి కొస కూడా. ముందుకు చూస్తే తేలికైన పొగలా కనిపించింది. అంతా అస్పష్టంగా ఉంది. గాలి కూడా చల్లగా మారింది. లేత నీలం రంగు కాంతి ఆవరించి ఉంది. మబ్బుల మధ్య గులాబీ రంగు మెట్లు కనిపించాయి. ఇప్పుడే ఇద్దరూ ఎక్కడం మొదలుపెట్టారు. అలా ఎన్ని రోజుల పాటు ఎక్కారో తెలియలేదు. ఎట్టకేలకు మెట్లు ముగిసి, ఓ విశాలమైన మైదానంలోకి అడుగుపెట్టారు. ఎదురుగా తెల్లటి రంగులో ఓ పెద్ద వేదిక కనబడుతోంది. ఈ మైదానంలో కూడా తేలికపాటి పొగ అలముకుని ఉంది. వేలాది చిన్న చిన్న పసుపురంగు ఆకులు కాలుతున్నాయి. పొగమంచు కారణంగా ఏదీ స్పష్టంగా కనిపించలేదు. నీలాకాశంలో తెల్లని మేఘాలు పరుగులు తీస్తున్నాయి. ఒక చిన్న తెల్ల రంగు రథం వచ్చింది. దానికి గులాబీ రంగు రెక్కలున్నాయి. ఓ పెద్ద తెల్లని హంస దాన్ని లాగుతోంది. ఆ రథంలో ఓ అందమైన సుకుమారి అయిన దేవకన్య కూర్చుని ఉంది. ఆమె లేత పసుపురంగు నక్షత్రాలు పొదిగిన దుస్తులు ధరించింది.

ఆ వెనుకే మరో రథం వచ్చింది, అది లేత ఊదా రంగులో ఉంది. దాని రెక్కలు తెలుపు, నీలం రంగుల్లో ఉన్నాయి. ఓ తెల్ల పావురం దాన్ని లాగుతోంది. అందులో కూడా ఒక అందమైన దేవకన్య కూర్చుని ఉంది. ఆమె లేత నీలం రంగులో మెరుస్తున్న దుస్తులు ధరించింది. దాని వెనుక మరో రథం ఉంది. దానికి లేత బంగారు రంగు రెక్కలు ఉన్నాయి. ఒక కొంగ దానిని లాగుతోంది. రథంలో చిన్న పిల్లలు కూర్చున్నారు. వారు చాలా అల్లరి చేస్తున్నారు. కొందరు పాడుతున్నారు, కొందరు ఈలలు వేస్తున్నారు, కొందరు లేచి నృత్యం చేస్తున్నారు. కొందరు గట్టిగా పాడుతున్నారు. ఈ అక్కచెల్లెళ్ళని చూసి, “మిత్రులారా, రండి, మాతో కలిసి స్వర్గంలో షికారు చేయండి” అని ఆహ్వానించారు. వాళ్ళంతా బంగారు, వెండి రంగులలో మెరుస్తున్న దుస్తులు ధరించారు. ఇలా ఒకదాని వెనుక మరొకటిగా వేర్వేరు రంగులలో చాలా రథాలు వచ్చాయి. చిన్న చిన్న బల్బుల కాంతిలో అవన్నీ మెరుస్తున్నాయి; పచ్చికపై పడిన మంచు బిందువుల్లా. పెద్ద పెద్ద చెట్ల నుంచి చక్కటి మంచు కురుస్తోంది. వాతావరణం చల్లబడింది.

పెద్ద వేదికను చాలా అందంగా అలంకరించారు. రంగురంగుల పువ్వులను, వేలాది చిన్న రంగురంగుల బల్బుల తీగలను అతికించారు, ఇవి గాలికి కదులుతూ స్థలాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. ఈ వేదిక దగ్గర ఒక పెద్ద పొడవాటి వ్యక్తి పియానో ​​వాయిస్తూ ఉన్నాడు. ఈ వేదికపై చాలా గౌరవప్రదమైన వ్యక్తులు కూర్చున్నారు. వారు పొడవాటి మెరిసే దుస్తులు ధరించారు. తలపై పెద్ద పెద్ద కిరీటాలు ధరించారు. మైదానానికి చేరగానే రథాల లోని వారందరూ రథాల నుండి దిగి నాట్యం చేయడం ప్రారంభించారు. పెద్ద గుంపు ఉంది, అందరూ నవ్వుకుంటున్నారు. ఒకరినొకరు హత్తుకుంటూ నృత్యం చేశారు. ఎంత అందమైన వాతావరణమంటే, వదిలి వెళ్ళలేనంత.

***

“చెల్లీ, ఇక్కడ్నించి వెళ్ళాలని లేదు. ఇదే స్వర్గమని, ఇంతకంటే అందమైన ప్రదేశం మరొకటి లేదని మనసు చెబుతోంది” అంది ఐఫిల్ టవర్. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఇదే అనుకుంది. కానీ ఇద్దరూ అక్కడ ఉండలేకపోయారు. అక్కచెల్లెళ్ళకి తమ తమ దేశాలకి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.

స్వర్గం నుండి అందమైన దేశం యొక్క తీపి జ్ఞాపకాలను మదిలో నిలుకుని, ఆ రెండూ యథా స్థానాలలో నిలిచాయి.

అక్కడ జనసమూహం ఉంది. అంతా సందడిగా ఉంది. ఎంత అద్భుతం జరిగింది. ఈ రెండు ఎక్కడికి వెళ్లాయి, తిరిగి ఎలా వచ్చాయి? ఎవరికీ ఏమీ తెలియనట్లే ఉంది. సరే, ఏది జరిగితేనేం, ఆహ్లాదకరంగా ఉంది, అదే ఆనందం కూడా.

~

హిందీ మూలం: అనురాధ మంగళ్.

తెలుగు: కొల్లూరి సోమ శంకర్


నా పేరు అనురాధ మంగళ్. నా వయసు 80 సంవత్సరాలు. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ టీచర్‌గా పిల్లలకి బొమ్మలు గీయడం నేర్పించాను. ఈమధ్య కాలంలో పిల్లల కోసం, పెద్దల కోసం కొన్ని కథలు వ్రాశాను. నా రచనలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here