అలంపూరు శ్రీ జోగుళాంబా బాలబ్రహ్మేశ్వర దర్శనయాత్ర

0
14

[ఇటీవల అలంపురంలో జోగులాంబ ఆలయం దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]క[/dropcap]ర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మా బావగారి షష్టిపూర్తి మహోత్సవానికి వెళ్లాను, గత నెల చివర్లో. పక్కనే ఆదోనిలో నా ప్రాణస్నేహితుడు యోగానంద్ ఉన్నాడు కదా! వాడి దగ్గరికి కూడా వెళ్లాను. పది రోజుల క్రితమే మధ్యప్రదేశ్ టూర్‌కి వెళ్లివచ్చాము. “కార్తీకమాసం, బ్రాహ్మడివి వచ్చావు. మా యింట్లో రుద్రాభిషేకం చేయించరా శర్మా!” అనడిగాడు వాడు. మన చేతిలో పనే గదా సరే అన్నా. యోగానంద, వాడి శ్రీమతి మంగాదేవి, వాడి కొడుకు, కోడలు, మనుమడు, మనుమరాలు – అందర్నీ కూర్చోబెట్టి ఏకవార రుద్రాభిషేకం చేయించాను.

మర్నాడుదయం హైదరాబాదుకు బయలుదేరాను. “కర్నూలు వరకూ వచ్చి నిన్ను హైదరాబాద్ బస్సు ఎక్కిస్తాను” అంటాడు. కర్నూలేం దగ్గరా దాపూ కాదండోయ్! ఆదోని నుంచి సుమారు 130 కిలోమీటర్లు! మూడు గంటల ప్రయాణం! వాడు ఆర్టీసీలో పనిచేసి రిటైరైనాడు కాబట్టి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ఫ్రీ! కాని అసలు విషయం అది కాదు! నాతో కలిసి మరి కొన్ని గంటలు ఉండవచ్చు గదా అని వాడి తాపత్రయం!

నాకు సడన్‍గా ఒక ఆలోచన వచ్చింది. వాడితో ఇలా అన్నాను

“ఒరీయ్ యోగా! ఎలాగూ కర్నూలు వరకు వస్తానంటున్నావు! కార్తీకమాసం ఇంకో రెండు రోజులే ఉంది. మనిద్దరం అలంపూరు వెళదాం. బాలబ్రహ్మేశ్వరస్వామి వారిని, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుందాం. తర్వాత నేను హైదరాబాదుకు, నీవు ఆదోనికి, ఓ.కే?”

“డబుల్ ఓకే” అన్నాడు వాడు.

ఇద్దరం ఉదయం ఐదున్నరకే ఆదోని బస్టాండ్‌లో, కర్నూలు టు స్టాప్స్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. దాని డ్రయివరు, కండక్టరు, మావాడికి నమస్కారాలు చేశారు. ఆయా డిపోల్లో పనిచేసిన సీనియర్ కండక్టరు మావాడు మరి! బస్సు ఎమ్మిగనూరులో అగింది. తర్వాత కోడుమూరు ఆర్‌టిసి బస్‍స్టాండ్‌లో టిఫిన్ కోసం ఆపాడు.

నా ఫేవరేట్ టిఫిన్ ఉగ్గాని బజ్జీ తిన్నాం. షుగర్ లెస్ టీ తాగాం. వాడి కోడలు నేత్ర మాకు ఉదయం ఐదుకే కాఫీ ఇచ్చింది లెండి! కాబట్టి ఇప్పుడు టీ తాగాము. నేను కౌంటరు దగ్గర బిల్లు చెల్లించబోతుంటే, అక్కడ కూర్చున్న అతను మా యోగాగాడికి నమస్కరించాడు

“నమస్కారం సార్! అంతా బాగానే ఉన్నారా?” అని పలకరించాడు. “ఈ సారెవరు?” అని నన్ను గురించి అడిగాడు

“ఈయన దత్తశర్మ. నా ఫ్రెండ్. కాలేజ్ ప్రిన్సిపాల్ చేసినాడు. ఫేమస్ రైటర్..” అంటూ మొదలుపెట్టాడు మావాడు.

కాకి ఫ్రెండ్ కాకికి ముద్దు!

అతడు టిఫిన్‌కు డబ్బులు తీసుకోలేదు!

“నీ పనే బాగుంది కదరోయ్! బస్సు ఛార్సీలు ఫ్రీ! టిఫిను ఫ్రీ” అన్నా.

వాడు నవ్వాడు! “ఏదోరా, వాండ్ల అభిమానం; అంతే! అలా అని అన్ని చోట్లా అలా ఉండదు. ఛార్జీలు మాత్రం నాకూ, మీ సిస్టరుకు ఫ్రీ. కాని ఎ.సి బస్సుల్లో కుదరదు”

తొమ్మిది లోపే బళ్లారి చౌరస్తాలో దిగాం. నేరుగా వెళితే కర్నూలు నగరం, కుడివైపుకు బెంగుళూరు, ఎడమ వైపుకు హైదరాబాదు. అక్కడ ఫ్లైఓవర్ ఉంది.

అక్కడనుంచి అలంపూరు చౌరస్తా పదిహేను కి.మీ. ఉంటుంది. షేర్ ఆటోల వాళ్లు పిలుస్తున్నారు. అలంపూరుకు బస్సులుండవట. ఉన్నా అతి తక్కువట.

ఆటో నిండా జనాన్ని ఎక్కించాడు. “సర్దుకోండి! సర్దుకోండి!” అంటున్నాడు. ముందు అతని కిరువైపులా ఇద్దరు.

భారతీయుల సర్దుకుపోయే గుణం చూసి నాకు ముచ్చటేసింది. మా యిద్దరికీ ఇలా అలవాటే కాబట్టి సమస్య లేదు.

ఆటో తుంగభద్ర బ్రిడ్జ్ మీద వెళుతోంది. నదిలో నీళ్లు బాగానే ఉన్నాయి. తుంగభద్ర వంతెన కటు వైపు తెలంగాణ. ఇటు వైపు ఆంధ్ర ప్రదేశ్. ఒకప్పటి మహబూబ్‌నగర్ జిల్లాను విభజించారు. ప్రస్తుతం జోగుళాంబ-గద్వాల జిల్లా ఇది.

నేను ప్రిన్సిపాల్‌గా రిటైరైంది పాయకరావుపేట అనే ఊర్లో. అది విశాఖపట్నం జిల్లాలో చివరి టౌన్. అక్కడా ఇలాగే, మధ్యన తాండవ నది బ్రిడ్జ్ ఉంటుంది. రైలు, రోడ్డు వంతెనలుంటాయి. ఇక్కడ కూడ రైల్వే బ్రిడ్జ్ ఉంది. తాండవ నదికిటు వైపు విశాఖజిల్లా, అటువైపు తూర్పుగోదావరి. అటువైపు తుని పట్టణం.

అలంపూరు చౌరస్తాలో దిగాం. పైన ఫ్లై ఓవర్ వెళుతోంది. దిగి ఒకతన్ని అడిగితే హైవే క్రాస్ చేసి, అటువైపుకు వెళ్ళమన్నాడు. అక్కడ టాటా ఏస్ మ్యాజిక్ వ్యాన్లు ఉన్నాయి, ఆటోలున్నాయి. సీరియల్ ఉంది. ఒకటి నిండిన తర్వాత ఒకదాన్ని వదులుతున్నారు. ‘శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానము, అలంపురం’ అని రాసి ఉన్న కళాత్మకమైన పెద్ద ‘ఆర్చి’ హైవే మీదకే ఉంది. ఆ రోజు ఆదివారం, కార్తీకమాసం చివరిరోజులు. పెద్ద సంఖ్యలో కార్లు, బారులు తీరి అలంపూర్‌కు వెళుతున్నాయి.

మాకో ఒక వ్యాన్‌లో సీట్లు దొరికాయి. పంతొమ్మిది కి.మీ. ప్రయాణించాము.

“మమ్మల్ని మెయిన్ రోడ్డు మీద ఏదైనా లాడ్జ్ దగ్గర దింపురా అబ్బాయి!” అన్నా డ్రయివర్‍తో

“సార్ తెలంగాణ టూరిజమ్ వారి ‘హరిత గెస్ట్ హౌస్’ బాగుంటుంది. వీళ్లంతా గుడి దగ్గర దిగిపోతారు. మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతాను” అన్నాడతను.

ఒక పెద్దాయన జోక్యం చేసుకొని, “చిన్నా, అది రెండు కి.మీ. ఉంటదిరా! మల్లా గుడికి రానీకె పోనీకె పరేశాన్ అయితారు. ఇప్పుడు రూములు గూడ్క దొరుకుడు కష్టమే. నామాటిను. ఈడనే ఒక ప్రయివేటు లాడ్జి ఉంది. మంచిగుంటది. టిఫిన్, బోజనం అన్నీ దొరుకుతయి ఆడనే” అన్నాడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను

“కొత్తోల్లు గదా సార్! మంచిగ సమజాయించాలె గద!” అన్నాడాయన. ఎ గుడ్ సమారిటన్!

***

హాటల్ పేరు ‘తుంగభద్రా రెసిడెన్సీ’. వెళ్లి రూము కావాలని అడిగాము. రేపు ఉదయం వెళ్లిపోతామని చెప్పాము.

రోడ్డు మీదికే రెస్టారెంట్ ఉంది. పక్క సందులో లాడ్జి. ఒక పిల్లవాడు తాళాలు తీసుకొని మా వెంట వచ్చాడు. ఎ.సి, నాన్ ఎసి, రెండూ ఉన్నాయి. వాతావరణం చల్లగా ఉంది. చిన్న జల్లు కూడ మొదలయింది. నాన్ ఎ.సి. చాలన్నాం. అద్దె ఐదువందలే! రూమ్ శుభ్రంగా ఉంది. పెద్ద కిటికీ. వెస్ట్రన్ టాయిలెట్. గీజర్. చిన్న టి.వి. చాలా చౌక కదండీ!

మా ఇద్దరి ఆధార్ కార్డులడిగి తీసుకు వెళ్లాడు. బయట వాటర్ ఫిల్టర్ ఉంది. నీరు తాగి చూశాము. తుంగభద్ర నీరేమో మధురంగా ఉంది.

ఆధార్ కార్డులు తిరిగి తెచ్చాడు. “ఇప్పుడు దర్శనం ఉంటుందా?” అనడిగితే “చాలా రష్‌గా ఉంది సార్! కార్ పార్కింగ్ అంతా ఫుల్. సాయంత్రం వెళ్లండి. ఆరామ్‌గా దర్శనం చేసుకోవచ్చు” అన్నాడు.

ఇద్దరం లుంగీలు కట్టుకొని, రిలాక్స్ అయ్యాము. ఒకే డబుల్ కాట్. కబుర్లు చెప్పుకుంటూ పడుకోన్నాం.

పన్నెండున్నరకు లేచి, లుంగీలతోనే భోజనానికి వెళ్లాం. తెలంగాణా పేరుకే, అంతా కర్నూలు జిల్లా ప్రభావం ఉంది. అటు గద్యాల, పెబ్బేరు, అలంపూరు వరకు ఏ పని కైనా ప్రజలు కర్నూలునే ప్రిఫర్ చేస్తారు.

‘బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము, కరివెనవారిది’ అన్న బోర్డు చూశాను. కానీ దానిలో మా యోగానందను అనుమతించరు. వాడికంటే నాకు బ్రాహ్మణ భోజనం ఎక్కువ కాదు.

తుంగభద్ర విలాస్‌లో భోజనం సూపర్. పచ్చని అరిటాకులు పరిచారు. అవి ఎలా ఉన్నాయంటే –

‘మొగి విరిసి కఱకుగూడక,
పగులక వెడలుపును నిడుపుఁ బసిమియుఁ గల లేఁ
జిగురరఁటాకులు పెట్టిరి,
దిగదిగ నద్దేవియాజ్ఞ దివ్యపురంధ్రుల్.’

అని శ్రీనాథుడు వర్ణించినట్లున్నాయి. అన్నపూర్ణాదేవి, వ్యాసుల వారికి, ఆయన శిష్యులకు అన్న సంతర్పణ చేస్తుంది. అప్పుడు ఆమె నియమించిన దివ్యస్త్రీలు ముందుగా అలాంటి అరిటాకులు పెట్టారట.

ఆకుకూర పప్పు, వంకాయ ముద్ద కూర, టమోట కొబ్బరి పచ్చడి. క్యాబేజి పకోడి, మజ్జిగ పులుసు, చారు, పెరుగు. కరివేపాకు రైస్ ఒక గరిట వడ్డించారు. అన్నం, సన్నబియ్యం, పొగలు కక్కుతూ ఉంది. కూరల సెట్ మా దగ్గరే పెట్టాడు. అప్పడం చాలా పెద్దది. ఇంకోటి కావాలంటే ఇచ్చాడు. దానికి ఛార్జి చెయ్యలేదు. అద్భుతమైన భోజనం. ఫుల్ మీల్స్ కేవలం 80 రూపాయలే తీసుకొన్నాడు.

భుక్తాయాసంతో రూమ్ చేరి, సాయంత్రం నాలుగు వరకు పడుకున్నాము.

***

ఐదు గంటలకు తయారై. గుడికి వెళ్లాము. లాడ్జికి చాలా దగ్గరే. దూరంగా సమున్నతమైన గుడి గోపురాలు కనబడుతున్నాయి. ముందు విశాలమైన బయలు. అందులో కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారు.

ఈ దేవాలయ సముదాయాన్ని, బాదామి చాళుక్యులు ఏడవ శతాబ్దంలో నిర్మించారు. పవిత్ర స్కందపురాణంలో దీనిని గురించిన ప్రస్తావన ఉంది. వీటిని నవబ్రహ్మాలయాలు అంటారు.

శ్రీశైలమహా క్షేత్రం యొక్క పశ్చిమద్వారంగా అలంపురాన్ని పరిగణిస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో, జోగుళాంబాదేవి ఒకటి. ఈ దేవస్థానం దక్షిణకాశిగా ప్రసిద్ధి చెందింది, కృష్ణ, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశంలో. తుంగభద్రాదేవి ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది.

అష్టాదశ తీర్థాలలోని పాపవినాశినీ తీర్థం ఇక్కడ వెలసింది. కూడలి సంగమేశ్వరస్వామి, శ్రీయోగానంద నరసింహస్వామి, సూర్యనారాయణస్వామి ఇక్కడ ఉపాలయాలలో కొలువు తీరి ఉన్నారు. మూలవిరాట్టు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి వారు.

ప్రధాన ఆలయంలోకి ప్రవేశించాము. శివలింగం ఉన్న గర్భగుడికి ఎదురుగా ప్రవేశద్వారానికి ఎడమ పక్కన, సమున్నతమైన నందీశ్వరుని విగ్రహం ఉంది.

జనం పెద్దగా లేరు. పది నిమిషాలలో శివదర్శనమైంది. స్వామివారు అర అడుగు ఎత్తు గల లింగాకృతిలో ఉన్నారు. అలంకారాలేవీ లేకుండా నిజరూపదర్శనం అయింది మాకు.

నంది విగ్రహం ముందున్న మంటపంలో భజన జరుగుతూ ఉంది. మేమూ వెళ్లి కూర్చున్నాము. హార్మోనియం, తబలా, తక్కి, తాళాలు మోగుతున్నాయి. ఒకాయన మధురంగా ‘దేవ దేవ రజతాచల మందిర గంగాధరా హర! నమో నమో!’ అన్న పాటను పాడుతున్నాడు. భజన సాంప్రదాయాని కనుగుణంగా, పాదాలను విరిచి, అందరూ అనుసరించే విధంగా పాడుతున్నాడు.

అందరితో పాటు నేనూ గొంతుక కలిపాను. భజనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అందరినీ ‘ఇన్వాల్వ్’ చేసి, ఒక విధమైన తన్మయత్వం కలుగజేస్తుంది. సామూహిక భక్తికి నిదర్శనం భజన.

“మీరు..?” అని నన్ను అడిగాడు తబలిస్టు.

“మేము హైదరాబాదు నుంచి స్వామివారిని, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాం” అని చెబితే

“మీ గాత్రం బాగుంది సార్! ఏదైన పాటో పజ్యమో అనండి” అన్నాడు. నేను సంతోషంగా ఒప్పుకొన్నాను. పాడేవారికి అడిగే వారుంటే ఇక కావలసిందేముంది?

ముందుగా ‘అర్ధనారీశ్వర స్తోత్రా’న్ని దర్బార్ కన్నడ రాగంలో ఆలపించాను. శృతి ఐదున్నర అని హార్మోనిస్టుగారితో చెప్పి, రాగం పేరు చెప్పాను.

ఆయన వెంటనే గ్రహించి, శృతి అందించాడు.

~

‘చాంపేయ గౌరార్ధ శరీరకాయై, కర్పూర గౌరార్ధ శరీరకాయ।
ధమ్మిల్లకాయయై చ జటాధరాయ, నమఃశివాయై చ నమఃశివాయ॥
ప్రదీప్తరత్నో జ్వల కుండలాయై, స్పురన్మ హా పన్నగ భూషణాయ।
శివాన్వి తాయై చ శివాన్వి తాయ, నమఃశివాయై చ నమఃశివాయ॥’

~

స్తోత్రమంతా పాడలేదు. రెండు చరణాలు మాత్రం పాడాను. హార్మోనిస్టు చక్కగా అనుసరించాడు.

తర్వాత, మార్కండేయ కృతమైన ‘చంద్రశేఖరాష్టకము’ లోని రెండు శ్లోకాలను పాడాను. అవి లయాన్వితమైనవి. తబలిస్టుకు, తాళాలవారికి, డక్కి ఆయనకు చేతినిండా పని.

~

‘చంద్రశేఖర, చంద్రశేఖర, చంద్రశేఖర, పాహిమామ్
చంద్రశేఖర, చంద్ర శేఖర, చంద్రశేఖర రక్షమామ్’
అందరూ రిపీట్ చేశారు.
‘రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం।
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్॥
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం।
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥’

~

యమపాశం నుంచి తప్పించుకోవడానికి, బాల మార్కండేయుడు, శివలింగాన్ని కౌగిలించుకొని చేసిన స్తోత్రమిది. భజన బృందం భక్తితో ఊగిపోయింది!

“ఏదైనా పాట పాడండి సారు!” అని అడిగారు.

‘జయ జయ మహాదేవా! శంభో! సదాశివా!
తాపస మందారా! శృతిశిఖరసంచారా’

అనే సాకీని ఆలపించాను. ‘భూకైలాస్’ చిత్రంలోని ఘంటసాల వారి పాట! దాన్ని వినని వారుండరు. భజన బృందం అని అందరికీ ఆ పాట వచ్చినట్లుంది. ‘నీలకంధరా, దేవ! దీనబాంధవా, రారా, నన్ను గావరా।’ అని నేను అంటూనే అందరూ రిపీట్ చేశారు. నాకు అర్థమైంది. ప్రతి పాదం తర్వాత అందరూ దానిని అనడానికి అవకాశం ఇవ్వాలి.

చరణానికి చరణానికి మధ్య వచ్చే సంగీతాన్ని కూడా హార్మోనిస్టు, తబలిస్టు చక్కగా వాయించారు. నా గాత్రానికి చక్కని గ్యాప్.

చివర్లో,

‘ఫాలలోచన, నాదు మొర విని, జాలిని బూనుమయా!
నాగభూషణ, నన్నుగావగ జాగును సేయకయా’ –

అన్న చరణాలు మోతెక్కిపోయాయి! అంత ‘బీట్’ అంది వాటిలో! పాట ముగిసింది.

“ఈ కార్తీక మాసపుణ్య దినాన, శివనామస్మరణ చేసే అవకాశమిచ్చారు కృతజ్ఞతలు!” అని వారందరికీ నమస్కరించాను. మా యోగానంద మొత్తం వీడియో తీశాడు!

లేచి వస్తూంటే, ఒకాయన మా వెనకాలే వచ్చి, “సార్, రేపు ‘పంచలింగాల’ గ్రామంలో బజన వుండాది. మీరు ఎట్లయినా గాని రావాల” అని అభ్యర్థించాడు. ‘రాలేమ’ని సవినయంగా చెప్పాను. ఆయన ముఖంలో ఆశాభంగం!

తర్వాత గట్టు ఎక్కి తుంగభద్రానదిని చూశాము. వీడియో తీశాము. నది దేవాలయాన్ని ముంచకుండా 30 అడుగుల ఎత్తున్న గోడ కట్టారు.

అక్కడ నుంచి, శక్తిస్వరూపిణియైన జోగుళాంబాదేవిని దర్శించుకున్నాము. అయ్యవారికంటే అమ్మవారికే డిమాండ్ ఎక్కువుంది. పెద్ద క్యూ ఉంది. రెడ్ స్టోన్‌తో కళాత్మకంగా స్తంభాలు, మంటపాలు, గోపురాలు కట్టినారు. అవి పురాతనమైనవి కాదని తెలుస్తుంది.

గర్భగుడి ముందు జోగుళాంబాదేవి స్తోత్రం డిజిటల్ అక్షరాలతో స్క్రోల్ అవుతుంది.

శ్లో॥

‘లంబస్తనీం, వికృతాక్షీం, ఘోరరూపాం, మహబలాం
ప్రేతాసన సమారూఢం, జోగుళాంబాం నమామ్యహం’

అమ్మవారి దర్శనం నలభై నిమిషాలు పట్టింది. పరమేశ్వరి రూపం గగుర్పాటు కలిగించే విధంగా ఉంది. తల్లికి నమస్కరించుకొన్నాము.

అమ్మవారిని ఇలా ధ్యానించాను

‘జోగులాంబా మహా దేవీ రౌద్రవీక్షణ లోచనా,
అలంపురీ స్థితామాతా సర్వార్థ ఫలసిద్ధిదా!’

తిరిగి వస్తుంటే స్వామి వారి ఆలయం ఖాళీగా కనబడింది.

“మళ్లీ ఒకసారి దర్శనం చేసుకుందామురా, శర్మా!” అన్నాడు మావాడు. మళ్లీ స్వామిని దర్శించుకొని ధన్యులమయ్యాము .

అక్కడ గోడపై లిఖించి ఉన్న శ్లోకాన్ని చదివాను, రాగయుక్తంగా.

‘బాల బ్రహ్మేశ్వరాయాస్తు, భక్త కల్పదృమాయచ
కోటి లింగ స్వరూపాయ, స్వర్ణ లింగాయ మంగళమ్.’

పక్కనే ‘మ్యూజియం’ ఉంది. ఇరవై రూపాయలు టికెట్. పురావస్తుశాఖ వారిదది. వారి తవ్వకాలలో బయటపడ్డ పురాతన శిల్పాలు ఉన్నాయి.

నందీశ్వరుని మీద, శివపార్వతులున్న ఏకశిలా విగ్రహం, అత్యంత అరుదైనదని క్యూరేటర్ గారు చూపారు. పురాణ గాథలు బొమ్మలుగా చెక్కిన స్తంభాన్ని, పద్మములో ఒదిగి ఉన్న నాగ దేవత ప్రతిమను, యోనిని వెడల్పుగా తెరుచుకొని ప్రదర్శిస్తున్న నగ్నకబంధ పతిమను, నల్లరాతి విగ్రహాన్ని చూశాము.

సంతానం లేని వారు పూజిస్తే, సంతానం అనుగ్రహిస్తుందట ఆ దేవి! సప్తమాతృకలనీ వరుసగా ఒక రాతిపై చెక్కారు. ‘కీర్తిముఖ’ అనే శిల్పం అద్భుతం!

తుంగభద్ర, గట్టున, సరిహద్దు గోడమీద నల్లని శివ పార్వతుల విగ్రహాలను నెలకొల్పారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో అవి నిగనిగా మెరుస్తున్నాయి.

ఆలయాలతో పెరిగిపోతున్న ఈ క్షేత్రాన్ని చూసి ఒక పండితుడు అలం.. పురం.. అన్నాడట. సంస్కృతంలో ‘అలం’ అంటే ‘ఇక చాలు’ అని అర్థం. అప్పటినుంచి ఆ పేరు వచ్చిందట. ఇలా చమత్కారాలను కల్పిస్తుంటారు.

బాదామి చాళుక్య ప్రభువు ‘రెండవ పులకేశి’ ఈ ఆలయాలను నిర్మించాడని, క్రీ.శ. 566- 757 మధ్యకాలంలో నిర్మాణం జరిగిందనీ చరిత్ర. అర్కబ్రహ్మ ఆలయం చూశాము.

మండప స్తంభంపై ఒకటవ విక్రమాదిత్యుని భార్య వేయించిన దానశాసనాన్ని చూశాము. తర్వాత పాలించిన కల్యాణి చాళుక్యుల కాలంలో, యోగనారసింహాలయం, సూర్య నారాయణస్వామి ఆలయం నిర్మించారు (క్రీ.శ. 973-1161) శిధిలమవుతున్నా శిల్పకళ సజీవంగానే ఉంది. విశ్వబ్రహ్మ దేవాలయాన్ని చూశాము. శ్రీకృష్ణ దేవరాయల దాన శాసనాన్ని చూశాము.

ఆలయాన్ని ఆనుకుని, ‘షా ఆలీ పహిల్వాన్ దర్గా’ ఉంది.

శంకరుడు బ్రహ్మదేవునికి బాలుని రూపంలో దర్శనమిచ్చినందున స్వామిని బాలబ్రహ్మేశ్వరుడంటారని ఐతిహ్యం. ఆలయ మండపంలో రససిద్ధి వినాయకుడు, ఉమామహేశ్వరులు, ద్విసింహవాహిని దుర్గ, షోడశ భుజ ఉగ్రనరసింహుడు మొ॥ అద్భుత విగ్రహాలను చూసి ధన్యులమయ్యాము

నవబ్రహ్మలందరూ శివలింగాలే! బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మ బ్రహ్మ. ఈ పేర్లు ఒక సిద్ధుడు పరుసవేది కొరకు వాటిన మూలికల పేర్లని కొందరంటారు.

అలంపురం చరిత్రను గ్రంథస్థం చేసిన మహానీయులు గడియారం రామకృష్ణశర్మ గారు. వారు మాకు బంధువులు. వారి బావగారి కుమారునికే మా చెల్లెలినిచ్చాము. ఎమ్మిగనూరులో షష్టిపూర్తి జరిగింది, నేను వెళ్లింది వారికే. వారి పేరు ఫణీంద్ర శర్మ. ‘మాధవిద్యారణ్య’ అన్న పుస్తకం గడియారం రామకృష్ణశర్మ గారు రచించిన అన్నింటిలో ప్రామాణికమైనది. 2007లో వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (మరణానంతరం) లభించింది. 1964లో అలంపురంలో నా తొమ్మిదవ ఏట నా ఉపనయనం జరిగినపుడు, ‘గడియారం వారు మనకు అన్ని ఏర్పాట్లు చేసినారని, నన్ను వటువుగా ఆశీర్వదించినార’ని, మా నాన్నగారు, బ్రహ్మశ్రీ, శతావధాని, పౌఠాణిక రత్న, లక్ష్మీనరసింహశాస్త్రి గారు చెప్పేవారు. ధన్యోస్మి!

బాలసాహిత్యం, వీరగాథలు, క్షేత్ర గాథలు ఎన్నో రాసిన మహానీయడు గడియారంవారు. వారి ఆత్మకథ ‘శతపత్రము’ గొప్ప రచన. తెలంగాణా లోని తామ్ర, రాతి శాసనముల నెన్నింటినో వారు వెలికితీసి పరిష్కరించారు. ఆయన రంగస్థలనటుడు కూడా.

వారి స్మృతులు ఆ క్షేత్రంలో నన్ను ఆవరించాయి. వారు మా తండ్రిగారికి ఆత్మీయ స్నేహితులు.

ఎనిమిదిన్నరకు గుడి బయటికి వచ్చాము. కొంచెం దూరంలో ఒక ఇంటి అరుగుమీద ఒక పెద్దామె గుంట పొంగణాలు, దోసెలు వేస్తూ ఉంది. ఆమె భర్త అందరికీ అందిస్తున్నాడు. ఇంటిముందు స్టూల్స్ వేసి ఉన్నాయి. మాకో అందటానికి అరగంట పట్టింది. అంత జనం ఉన్నారు.

టిఫిన్ చాలా బాగుంది. ప్లేటు పొంగణాలైనా, దోసెలైనా 30 రూపాయలు మాత్రమే. 12 పొంగణాలు గాని, 3 దోసెలు గాని, ఒక ప్లేటు. ఉల్లి కారం చట్నీ సూపర్. పక్కనే నిమ్మకాయ సోడా తాగాము.

10 గంటలకు లాడ్జికి చేరి విశ్రమించాము. మర్నాడు ఉదయాన్నే లేచి రూము ఖాళీ చేసి, షేర్ వ్యాన్‌లో అలంపూరు చౌరస్తా చేరాము. మా యోగానంద కర్నూలుకు వెళ్లి, బల్లారి చౌరస్తాలో ఆదోని బస్ ఎక్కుతాడు.

నాకు ఒక ‘ఇన్నోవా’ వాడు దొరికాడు. బస్ ఛార్జీకే ఆరామ్‌ఘర్ వద్ద దింపుతానన్నాడు. కేవలం 3 గంటలలో హైదరాబాదు చేరాను.

హరహర మహాదేవ! శంభో శంకర! ఓం నమశ్శివాయ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here