అలనాటి అపురూపాలు-100

0
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటనా వైదుష్యం – ప్రదీప్ కుమార్

ప్రసిద్ధ హిందీ, బెంగాలీ నటుడు ప్రదీప్ కుమార్ అసలు పేరు శీతల్ బటాబ్యాల్. పశ్చిమ బెంగాల్ లోని ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రదీప్ కుమార్ – తనకు 17 ఏళ్ళ వయస్సొచ్చేవరకు – నటుడవ్వాలనే కోరికను తన లోనే దాచుకున్నారు. నటనలో ఆసక్తి ఉందని చెప్పినా, తండ్రి వ్యతిరేకించారు. తండ్రికి ఇష్టం లేకపోయినా ప్రదీప్ రంగస్థలంపై నటించసాగారు. ఒక ప్రదర్శనలో ఆయనను సుప్రసిద్ధ నిర్మాత దేబకీ బోస్ చూసి ‘అలకనంద’ (1947) అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ప్రదీప్ కుమార్ అనే పేరు ఆయనే పెట్టారు.

ఈ ప్రోత్సాహంతో ప్రదీప్ ముంబయి చేరి, ఫిల్మిస్థాన్ స్టూడియోలో ఉద్యోగం సంపాదించారు. తన హిందీ, ఉర్దూ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకున్నారు. ఆయన తొలి హిందీ చిత్రం ‘ఆనంద్ మఠ్’ (1952). ఈ సినిమా 18వ శతాబ్దపు నేపథ్యంలో, జాతీయ భావాలతో అల్లిన సినిమా. పృథ్వీరాజ్ కపూర్, గీతా బాలి ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలోని ‘వందేమాతరం’ పాట అప్పట్లో గొప్ప హిట్ అయింది.

తర్వాతి రెండేళ్ళలో ప్రదీప్ కెరీర్ ఉన్నత స్థాయికి చేరింది. బీనారాయ్‍తో నటించిన ‘అనార్కలి’ (1953), వైజయంతిమాలతో నటించిన ‘నాగిన్’ (1954) – రెండూ గొప్ప మ్యూజికల్ హిట్ అయ్యాయి. అనార్కలి కథ – మొఘుల్ రాకుమారుడు సలీం, అనార్కలిలీ ప్రేమ కథ కాగా, నాగిన్ కథ – పాములను పట్టుకునే రెండు వైరి తెగల యువతీయువకుల కథ. ఈ రెండు సినిమాల పాటలు (నాగిన్‍లో ఏకంగా 12) ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ‘అనార్కలి’ కోసం కత్తి యుద్ధం నేర్చుకోవడం, ‘నాగిన్’ కోసం తన చేతి మీద కొండ చిలువని ఉంచుకోడం వంటివి ప్రదీప్‍కి కలిసొచ్చాయి.

రాచఠీవి గల ప్రదీవ్ నడవడి ఆయనకి ఎందరో అభిమానులను సాధించింది. విజయపరంపర కొనసాగింది (1956లో ఆయన 10 సినిమాల్లో నటించారు). వి. శాంతారామ్ (సుబహ్ కా తారా), రాజ్ కపూర్‍ (జాగ్తే రహో) లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

1950 దశకం నాటి టాప్ హీరోయిన్స్ అందరూ – నిమ్మి (జయశ్రీ), నర్గిస్ (అదాలత్), నూతన్ (హీర్), మీనా కుమారి (బంధన్) – ఆయనతో నటించారు.

‘రాజ్‌హఠ్’ (1956) తర్వాత అందాల మధుబాలతో జోడీగా నటించాలని ప్రదీప్ ఎంతో ప్రయత్నించారు. వాళ్ళిద్దరూ కలిసి ‘యాహుదీ కీ లడకీ’ (1957), గేట్ వే ఆఫ్ ఇండియా (1957), పోలీస్ (1958), మహ్లోం కే క్వాబ్ (1960), పాస్‍పోర్ట్ (1961) వంటి సినిమాల్లో నటించినా, పెద్దగా విజయాలు దక్కలేదు.

తనకి అదృష్టంగా భావించిన వైజయంతి మాలతో నటించినా (సొంత చిత్రం – ఏక్ ఝలక్) – నాగిన్‍ సినిమాలో ఒక వంతు విజయం కూడా సాధించలేదు. కానీ బీనా రాయ్‍తో జోడీ కట్టడం ఆయనకి కాస్త ఊరటనిచ్చింది. ప్రదీప్ కుమార్ ఎదుర్కుంటున్న పరాజాయల వెల్లువని ఈ జోడీ కాస్త నిరోధించగలిగింది. మొదట ‘గూంఘట్’ (1960), తర్వాత ‘తాజ్‍మహల్’ (1963) వంటివి హిట్ అయ్యాయి. ‘అనార్కలి’ విడుదలయిన దశాబ్దం తరువాత కూడా ప్రేక్షకులు ఆయన రాచఠీవిని, మొఘల్ వంశస్థుల ప్రేమ గాథని మరువలేకపోయారు. ‘తాజ్ మహల్’ సినిమాలో రోషన్ సంగీతంలో వచ్చిన ‘పావ్ ఛూ లేనే దో తో’, ‘జో వాదా కియా’ వంటి పాటలు గొప్ప హిట్ అయి, నేటికీ రేడియో శ్రోతలని అలరిస్తున్నాయి.

రాజశ్రీ వారి సాంఘిక చిత్రం ‘ఆర్తి’తో ప్రదీప్ కెరీర్ మరింత ఊపందుకుంది. మీనా కుమారి, ప్రదీప్ ప్రేమికులుగా నటించారు. పేదలకు సేవ చెయ్యాలనే తపన ఇద్దరికీ ఉంటుంది. కానీ వారి ప్రేమకి అడ్డుగా ఓ ధనవంతుడైన, అన్యాయానికి వెరవని ఓ డాక్టర్ (అశోక్ కుమార్) నిలుస్తాడు. ‘ఆర్తి’ సినిమా విజయంతో మీనా కుమారి, ప్రదీప్‍ల జోడీ మరిన్ని సినిమాల్లో నటించింది. “మీనా, నేనూ తెరపై మంచి జంటగా ఉండేవారం. కానీ ఆవిడ భర్తకి మా స్నేహం ఇష్టం లేదు” చెప్పారు ప్రదీప్.

‘ఆర్తి’ సినిమా అనంతరం మీనా కుమారి, ప్రదీప్ నటించినది కిదర్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రలేఖ’ (1964) చిత్రంలో. గుప్తుల కాలం నాటి కథాంశంతో రూపిందిన ఈ సినిమాలో ప్రదీప్ సుఖలాలసుడైన సామంత బీజగుప్తగా నటించారు. సినిమాని నిర్మాణానికి బాగా ఖర్చుపెట్టినా, సహయక పాత్రలో అశోక్ కుమార్ నటించినా, శర్మా – సాహిర్‌ల కలం గొప్ప సాహిత్యం అందించినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. కాళీదాస్ నిర్మాణదర్శకత్వంలో వెలువడిన ముక్కోణ ప్రేమ కథ ‘భీగీ రాత్’ (మరోసారి – అశోక్ కుమార్, మీనా కుమారి, ప్రదీప్ కుమార్‍ల కలయిక) మధ్యస్థంగా ఆడింది. అలాగే అదే ఏడాది విడుదలయిన ముస్లిం సామాజిక ఇతివృత్తంతో తీసిన ‘బహు బేగమ్’ (అశోక్ కుమార్, నూర్జహాన్) గొప్ప హిట్ అయింది.

1960ల నాటి కొత్త తరం విజయవంతమైన హీరోయిన్‍లతో – సాధన, సైరా బాబు, షర్మీలా టాగోర్ వంటి వారితో ప్రదీప్ ఒక్క సినిమా కూడా చేయలేదు. హఠాత్తుగా ఆయనకి మార్గదర్శనం చేసేవారు లేకుండా అయిపోయింది.

1969లో ప్రదీప్‌కి మరల విజయాలు లభించాయి, కాకపోతే ఈసారి సహాయక పాత్రలలో. ‘సంబంధ్’ సినిమా ద్వారా దర్శకుడు అజయ్ బిశ్వాస్ – ప్రదీప్‌కి పేరు ప్రతిష్ఠలు వచ్చేలా చేశారు. అయితే ఇదే దర్శకుడు ప్రదీప్‍కి మనోవేదన కూడా కలిగించారు. బిశ్వాస్ – ప్రదీప్ కుమార్తె, నటి బీనాని వివాహం చేసుకుని, ఇద్దరికీ పొసగక త్వరలోనే విడాకులు తీసుకున్నారు.

ప్రదీప్ రాజసం, ఉర్దూ పై ఉన్న పట్టు కారణంగా ఆయన మరో దశాబ్దం పాటు కొనసాగగలిగారు. కమోల్ అమ్రోహి చిత్రం ‘రజియా సుల్తాన్’ (1983) లో చక్రవర్తి పాత్ర పోషించారు. అప్పటికే దాదాపుగా రిటైరయిన ప్రదీప్‌ని ఆ పాత్ర కోసం బలవంతంగా ఒప్పించారని అంటారు. నిజానికి ఆయన కెరీర్‍లో చాలా వరకు అటువంటి పాత్రలే ధరించారు.

తరువాతి 18 ఏళ్ళు సినిమాలకు దూరంగా జీవించారు. 76 ఏళ్ళ వయసులో 28 అక్టోబరు 2001 నాడు స్వర్గస్థులయ్యారు.

***

ఆయన కుమార్తె బీనా బెనర్జీ ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఈ విధంగా చెప్పారు:

~

“మా ఇంట్లో సినిమాల గురించి గాని నాన్న పని గురించి కాని పెద్ద చర్చ జరిగేది కాదు. 1950ల నాటి సంగతులు కొన్ని గుర్తున్నాయి. నాన్న అప్పటికే రంగస్థల నటులు, సినిమాల్లో చేరక ముందు కొల్‍కతాలో రిసెప్షనిస్టుగా పనిచేశారు. రంగస్థలం మీద ఆయన ప్రదర్శన చూసిన నిర్మాత దర్శకులు సినిమాల్లో అవకాశాలిచ్చారు.

మేం తోబుట్టువులం పెద్ద పిల్లలం అవుతున్నా, నాన్న సినిమా షూటింగులకి తీసుకువెళ్ళేవారు కాదు. సెట్‌కి ఎప్పుడో గాని వెళ్ళేవాళ్ళం కాదు. ఒకసారి సెలవల్లో ఊటీలో షూటింగ్ జరుగుతుంటే మేం అందరం వెళ్ళాం. మాకు సెలవలు కావడం, మా అమ్మ నాన్నని ఒప్పించడంతో అది సాధ్యమైంది. ఆ ఒక్కసారీ తప్ప మరెప్పుడూ నాన్న మమ్మల్ని సెట్‍లోకి అనుమతించలేదు. మేం కాస్త పెద్దయ్యాకానే, మేం షూటింగ్ చూడ్డానికి ఒప్పుకున్నారు. లేకుంటే, సినీ పరిశ్రమకి దూరంగా ఉండేవాళ్ళం.”

~

తన కెరీర్ మొత్తంలో ప్రదీప్ రాజు గాను, నౌకరు గాను నటించారు. కానీ ఆయన నటిస్తుండంగా – చూసే అవకాశం కుటుంబ సభ్యులకు చాలా తక్కువగా లభించింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాకా, చదువులకు బోర్డింగ్ స్కూళ్ళకు వెళ్ళిపోయారు.

~

“మేం పెద్దాయాకా, ‘తాజ్ మహల్’ (1963), ‘భీగీ రాత్’ (1965) సినిమాలు చూసినట్టు గుర్తు. నాన్న నటించిన ఇతర సినిమాల ట్రయల్స్‌కి కానీ, ప్రీమియర్లకి కాని మేం వెళ్ళలేదు. చాలా పెద్ద సినిమా కాబట్టి ‘తాజ్ మహల్’ ప్రీమియర్‍కి తీసుకువెళ్ళారు. అదొక్కటే గుర్తుంది”

~

తండ్రి పేరున్న నటుడయినప్పటికీ, తనని సినీ వాతావరణానికి దూరంగా పెంచినా, అవకాశం రాగానే బీనా అదే రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నారు.

“నేను సినీరంగాన్ని ఎంచుకున్నప్పుడు అమ్మానాన్నలిద్దరూ వ్యతిరేకించారు, వద్దు వద్దు అన్నారు. కానీ నేను వాళ్ళ మాట వినలేదు. సినిమాల్లో చేరాలని పట్టు పట్టాను. అంతే, అలా జరిగిపోయింది. నటన కోసం నేనే కోర్సు లోనూ చేరలేదు, లేదా నటనను మెరుగుపర్చుకోడానికి  ఏ ప్రత్యేక ప్రయత్నాలు చేయలేదు. అలా కుదిరింది, అంతే” చెప్పారామె.

~

బీనా తొలుత మోడల్‍గా కెరీర్ ప్రారంభించారు (1970ల నాటి ప్రసిద్ధ డాల్డా ప్రకటన గుర్తుందా? అందులో నటించినది బీనాయే). ఆమె తన తండ్రి వలె రంగస్థలాన్ని ఎంచుకోలేదు. ఆమె మొదటి సినిమా ‘శిక్షా’ (1978). అది రాజశ్రీ సంస్థ నిర్మించిన చిత్రం. తర్వాత అనిల్ కపూర్ హీరోగా ‘రచన’ (1983) అనే చిత్రంలో నటించారు. ఆమె నటిగా మారిన ఐదారేళ్ళ వరకూ ప్రదీప్ ఆమె సినిమాలేవీ చూడలేదు. ఆమె నటించిన వాణిజ్య ప్రకటనలు మాత్రం చూశారు.

“ఒకసారి నాన్న చెప్పారు – ‘నువ్వేం చేసినా, అత్యుత్తమంగా చేయ్. నీ భాషని మెరుగుపరుచుకో. నువ్వు మాట్లాడే భాష సరిగ్గా ఉండేట్టు చూసుకో’ అని.  నాన్న ముంబయి వచ్చినప్పుడు ఎస్.ముఖర్జీతో చాలా మంది అన్నారట – ‘మీరో బెంగాలీని తెచ్చారు, ఆయనకి ఆ ఉచ్చారణే ఉంటుంది’ అని. కానీ నాన్న చాలా కష్టపడి హిందీ, ఉర్దూపై నిబద్ధతతో పట్టు సాధించారు” చెప్పారు బీనా.

***

‘అనార్కలి’ (1953) చిత్రంలోని ఈ పాటని చూడండి:

https://www.youtube.com/watch?v=Na2VxqcsvQo

‘నాగిన్’ (1954) చిత్రంలో పాట:

https://www.youtube.com/watch?v=mUQTUliOq_g

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here