అలనాటి అపురూపాలు-102

0
5

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

విలక్షణ, విస్మృత నటుడు తరుణ్ బోస్:

తరుణ్ బోస్ 14 సెప్టెంబరు 1928న కలకత్తాలో జన్మించారు. కానీ ఆయన బాల్యం నాగపూర్‍లో గడిచింది. ఆయన అక్కడి సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూలులో చదివారు. టీనేజ్ తొలినాళ్ళలోనే ఆయన స్థానిక నాటకాలలో నటించేవారు. 15 ఏళ్ళ వయసులో నాగపూర్‍లో కొత్తగా స్థాపించిన ఆకాశవాణిలో ఆడిషన్ ఇచ్చారు. ఎంపికై, రేడియో నాటకాలలో నటించారు. చదువు పూర్తి చేసుకుని, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించారు. కుటుంబం నుంచి ఎటువంటి ఒత్తిడీ లేకుండా ప్రవృత్తిగా నటనను కొనసాగించవచ్చనుకున్నారు.

నటులు తరుణ్ బోస్ అనగానే గుర్తుచ్చేవి కాంతివంతమైన ఆయన కళ్ళు. నల్లటి, గుండ్రని ఆ కళ్ళు ఎదుటి వ్యక్తిపై తక్షణ ప్రభావాన్ని చూపేవి, బోస్ మౌనంగా ఉన్నా సరే! ఆయన కళ్ళు రకరకాల భావాలు అలవోకగా పలికించేవి కాబట్టే, దర్శకులు తరుణ్ బోస్‍కి వైవిధ్యమైన పాత్రలు ఇచ్చారు, వాటి ద్వారా ఆయన భారతీయ ప్రేక్షకులకు మంత్రముగ్ధుల్ని చేశారు. నాగపూర్‍లో ఒక నాటకంలో బోస్‍ని మొదటిసారి చూసిన బిమల్ రాయ్ “ఆ కళ్ళు ఆత్మ ప్రాచీనతని చెబుతాయి” అని వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

హిందీ సినీ వినీలాకాశంలో తరుణ్ బోస్ ఉల్కలా దూసుకొచ్చారు. కొద్దిసేపే జ్వలించినా, దిగంతాలపై తనదైన అంగారాన్ని విడిచి వెళ్ళారు. కేవలం సుమారు 41 సినిమాలలో మాత్రమే నటించినా, ఎటువంటి శిక్షణా లేని ఈ నటుడు – నిజ జీవిత వ్యక్తులను పోలివుండే ఎన్నో పాత్రలను పోషించి ప్రశంసలందుకొన్నారు. తన ఆరాధ్య నటుడు, అశోక్ కుమార్ లానే, తరుణ్ బోస్ కూడా తన చేతి వేళ్ళ మధ్య సిగరెట్‍నో, పైప్‌నో ఉంచుకునేవారు. తాను పోషించాల్సిన పాత్రలని హంగూ, ఆర్భాటం లేకుండా సులువుగా పోషించేవారు. ప్రేక్షకులకు ఆయన పేరు గుర్తు లేకపోయినా, ఆయన పోషించిన పాత్రలు గుర్తుండడం – ఆయన పట్ల అగౌరవం కాదు! ఎందుకంటే ఆయా పాత్రలు పోషించేటప్పుడు వాటిలో ఆయన అంత సహజత్వం నింపి, తెర మీద సామాన్యులు కనబడేలా చేసేవారు.

ఆయన తొలి సినిమా ‘అపరాధి కౌన్’ నుంచి కూడా – సినిమాలపై తనదైన ముద్ర వేశారు. సాధారణంగా కొత్త నటుల్లో ఉండే లోటుపాట్లేవీ ఆయన కనబరచలేదు. నాటకాలలో అనుభవం కారణంగా, కనులతోనూ, ముఖ కవళికలతోనూ – హావభావాలను వ్యక్తం చేసేవారు. సంభాషణలను కూడా అత్యంత అనుకూలంగా పలికేవారు. దాంతో బిమల్ రాయ్, బీరేన్ నాగ్, హృశీకేశ్ ముఖర్జీ, మోనీ భట్టాచార్య తదితర దర్శకుల సినిమాలన్నింటిలోనూ ఆయనకు పాత్రలు లభించాయి. ‘మధుమతి’ చిత్రంలో చిన్న పాత్ర వేసినప్పటికీ ఆ పాత్ర ద్వారా ‘సుజాత’ చిత్రంలో ఓ కుటుంబ పెద్ద పాత్ర లభించింది. ఈ  పాత్ర పోషణ వల్ల ఆయనకి ప్రశంసలు దక్కడమే కాకుండా – తన వయసే ఉన్న హీరోయిన్‍లకు తండ్రి వేషాలు బోలెడొచ్చాయి. నూతన్‍కీ, శశికళకి ఆయా సినిమాల్లో తండ్రిగా ఆయన ఎంతలా ఒదిగిపోయారంటే – కేవలం 30 ఏళ్ళున్న నటుడు అంత పరిపక్వమైన పాత్ర పోషించారని ప్రేక్షకులు ఎన్నడూ ఊహించలేకపోయారు.

పాత్రలో హుందాగా ఇమిడిపోయే ఆయన స్వభావం ఆయనను సామాన్యులకు దగ్గర చేసింది. ఎటువంటి – అధికప్రసంగాలు చేసే మ్యానరిజమ్స్, అనవసరమైన శరీర కదలికలు – లేకుండా; పాత్రకి తగ్గట్టుగా నటించి, తనపై దృష్టి పడాలని కోరుకోకుండా – దర్శకులకు అనుకూలంగా నటించిన నటుడాయన. ఆర్క్ లైట్ల గురించి తెలిసిన వారిని అడిగితే చెప్తారు, కెమెరాలో కనబడలనే వ్యామోహాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో! కానీ తరుణ్ బోస్ స్క్రీన్ స్పేస్‌ని ఎంతో బాధ్యతతో పంచుకున్నారు, కథ పట్ల దర్శకుడి దృక్పథానికి సాయం చేశారు. ‘బందిని’, ‘గుమ్‌నామ్’, ‘దేవర్’, ‘అనౌఖీ రాత్’, ‘అన్నదాత’ వంటి సినిమాల విషయం తీసుకుంటే – ఆ సినిమాల్లో ఆయన సహజ నటనను ప్రదర్శించగలిగే పాత్రలు నిర్మాతలు ఎందుకు ఇవ్వలేకపోయారాని ఆశ్చర్యపోక మానం.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే – ‘సుజాత’ చిత్రంలో తన పాత్రను ఆయన ఎంత గొప్పగా పోషించినప్పటికీ – బిమల్ రాయ్ ఆయనకి అటువంటి మరో వేషం ఇవ్వలేకపోయారు. ఏదేమైనా, ‘అనుపమ’, ‘ఊంఛే లోగ్’, ‘ముఝే జీనే దో’, ‘కోహ్రా’ వంటివి ఆయన కీర్తికిరీటంలో కలికితురాయిల వంటివి. వాటి వల్లనే ఆయన మన జ్ఞాపకాలలో ఇంకా సజీవంగా ఉన్నారు. ఇక్కడ మరో విషయం కూడా అర్థమవుతుంది – కమర్షియల్ సినిమా – ప్రతిభావంతులైన తమవారిని కొందరిని గౌరవించుకోలేకపోయిందని!

‘అనుపమ’ చిత్రంలో, హృశీకేశ్ ముఖర్జీ సున్నితమైన దర్శకత్వంలో – తరుణ్ బోస్ – భార్యని కోల్పోయిన భర్తగా, తట్టుకోలేని బాధని గొప్పగా అభినయించారు. ఆయన కనులు, ముఖ కవళికలు – తనకీ తన కూతురికి మధ్య సంబంధాలు సరిగా లేవని తెలుపుతాయి, అంతే కాదు కూతురి (షర్మిలా టాగోర్) మితభాషిత్వం పట్ల ఆయన భావాలను వ్యక్తం చేస్తాయి. అదే విధంగా, ‘ఊంఛే లోగ్’ చిత్రంలో ఓ తెగించిన హంతకుడి చలచిత్తాన్ని గొప్పగా ప్రదర్శించారు. ‘ముఝే జీనే దో’ చిత్రంలో తన హుందాతనంతో పోలీస్ సూపరింటెండెంట్ పాత్రకి ప్రాణం పోశారు. బందిపోటు జర్నైల్ సింగ్ (సునీల్ దత్)ను ఈ పోలీస్ అధికారి ఎదుర్కున్న తీరును విశిష్టంగా మలచినందుకు దర్శకులు మోనీ భట్టాచార్జీ గారికి అభినందనలు తెలుపుకోవాలి. ఈ గొప్ప నటుడిని బాలీవుడ్ దర్శకులు మరింతగా ఉపయోగించుకోలేకపోవడం బాధాకరం.

సస్పెన్స్ థ్రిల్లర్ ‘కోహ్రా’ ఆయన కీర్తి కిరీటంలో కలికితురాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. వాచాలతతో కూడిన ఆయన నవ్వు కథకి జీవం పోసింది. చింపిరి రూపం, నిగూఢమైన హావభావాలు ప్రేక్షకులకు చెమటలు పట్టించాయి. ఈ సినిమా 1960 మధ్య కాలం నాటి చీకటి, పొడవాటి సింగిల్ స్క్రీన్ థియేటర్‍లలో విడుదలయింది. మోనో సౌండ్ ట్రాక్స్ ఉన్నప్పటికీ, ఆయన నవ్వు, ఛలోక్తులు అన్నిచోట్లా ప్రేక్షకులను జలదరింపజేసేవి. ధృవీకరించుకోడం కష్టమే అయినప్పటికీ, ఆయన నవ్వు సినీ ప్రేక్షకులను ఎందరికో వెన్నులో చలి పుట్టించేదని చెప్తారు. షూటింగ్ పూర్తయ్యాకా, మొదటిసారిగా ఆ సినిమాని చూసినప్పుడు తరుణ్ బోస్ కూడా ఉలిక్కిపడేవారట!

ఈ ఏడాది 14 సెప్టెంబరుకి ఆయనకి 94 ఏళ్లు నిండి ఉండేవి. ఓ నటుడిగా ఆయన సాధించవలసినవన్నీ సాధించేశారు. నాగపూర్‍లో స్కూలు, కాలేజీ రోజుల్లో రంగస్థల ప్రదర్శనల నుంచీ బొంబాయిలో తనకంటూ ఓ స్థానం సంపాదించేకునే వరకూ సాధించిన ఘనత – పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో శ్రద్ధగా పనిచేసిన వ్యక్తికి విశిష్టమనే చెప్పుకోవాలి! తనకంటూ బోలెడు ఖాళీ సమయం; తల్లిదండ్రులతోనూ, కుటుంబంతో గడపడానికి, రంగస్థలానికి కేటాయించడానికి తగిన సమయం లభిస్తాయనే ఆయన పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. బొంబాయికి రమ్మని బిమల్ రాయ్ పంపిన ఆహ్వానాన్ని – తన కుటుంబం హుందాగా బతకడానికి కావలసిన నెల జీతం ఇస్తేనే తాను సినీ రాజధానికి తరలి వస్తానని బోస్ చెప్పారట! కానీ విధి విలాసం, ఆయన కుటుంబంతో ఎక్కువ కాలం గడపలేకపోయారు. 44 ఏళ్ళ వయసులోనే పరమపదించారు. ఆయన మరణం ఆయన కుటుంబానికే కాకుండా సినీరంగానికి కూడా తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే అంతటి ప్రతిభా, అభిరుచి, సంస్కారం అందరిలోనూ ఉండదు. రాజ్ కుమార్ నుంచి దిలీప్ కుమార్ వరకూ; అశోక్ కుమార్ నుంచి హేమంత్ కుమార్ వరకూ అందరూ తరుణ్ బోస్‍ని మంచి మిత్రుడిగా భావించేవారు.

1957 నుంచి 1972 మధ్యలో ఆయన దాదాపుగా 41 సినిమాల్లో నటించారు. మధ్యతరగతి పాత్రలు ముఖ్యంగా వృత్తిపరమైనవి… డాక్టర్‍గా, అప్పుడప్పుడు జడ్జ్‌గా, లాయరుగా కూడా పాత్రలు పోషించి రాణించారు. 8 మార్చ్ 1972న ఆయన పరమపదించారు.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here