అలనాటి అపురూపాలు-105

0
6

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అద్భుత గాయకుడు మహేంద్ర కపూర్

రేడియోలో గాని, టీవీలో గాని, వీధి పందిళ్ళలోగాని ‘ఉప్‌కార్’ సినిమాలోని ‘మేరే దేశ్ కీ ధర్తీ’ అనే పాట వినిపించకుండా ఏ స్వాతంత్ర దినోత్సవమూ జరగదు. అలాగే, ‘చలో ఏక్ బార్ ఫిర్ సే’ (గుమ్రాహ్), ‘తుమ్ అగర్ సాథ్ దేనేకా వాదా కరో’ (హమ్‌రాజ్) అనే ప్రేమ గీతాలకు ఏ ప్రేమికులు ఉదాసీనంగా ఉండలేరు. మహేంద్ర కపూర్ అద్భుతమైన స్వరం – దేశభక్తి గీతాలనీ, ప్రేమ గీతాలని సమానంగా గొప్పగా పలుకుతుంది.

తన తండ్రి మహేంద్ర కపూర్ గురించి ఆయన కుమారుడు రుహాన్ కపూర్ చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే:

“ధూల్ కా ఫూల్ (1959) చిత్రంలోని ‘తెరే ప్యార్ కా ఆస్రా చాహ్తా హూఁ’ పాట విని స్వర్గీయ బి.ఆర్. చోప్రా గారు నాన్న అభిమాని అయ్యారు. ఆయన తీసిన (1963-67 మధ్య కాలంలో) గుమ్రాహ్, వక్త్, హమ్‌రాజ్ వంటి మ్యూజికల్ రొమాన్స్ సినిమాల్లో నాన్నతో మంచి పాటలు పాడించారు. ఆ పాటలన్నింటిని రవి స్వరపరిచారు. మహేంద్ర కపూర్ – బి.ఆర్. చోప్రా – రవి గార్ల మధ్య గొప్ప సాన్నిహిత్యం ఉండేది.” చెప్పారు రుహాన్.

మహేంద్ర కపూర్ దేశభక్తి గీతాలు పాడడం మొదట మనోజ్ కుమార్ గారి ‘షహీద్’ (1965) చిత్రంలోని ‘మేరా రంగ్ దే బసంతి చోలా’ పాటతో. “నాన్నకి దేశభక్తి గీతాలు పాడడమంటే ఎంతో ఇష్టం. స్వాతంత్ర్యపోరాటాన్ని ఆయన స్వయంగా వీక్షించారు. తన స్టేజి షోలను కూడా నాన్న దేశభక్తి గీతాలతోనే ఆరంభించారు. దేశవిదేశాల్లో ఎందరినీ చైతన్యపరిచారు” చెప్పారు రుహాన్. మహేంద్ర కపూర్, మనోజ్ కుమార్‌ల గొప్ప భాగస్వామ్యానికి ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) లోని ‘భారత్ కా రెహనే వాలా హూఁ’, ‘క్రాంతి’ (1981) సినిమా లోని ‘అబ్ కే బరస్’ పాటలు చక్కని ఉదాహరణలు. అందుకే, మహేంద్ర కపూర్ మరణించినప్పుడు, మనోజ్ కుమార్ “నేను నా స్వరాన్ని కోల్పోయాను” అని అనకుండా ఉండలేకపోయారు. మహమ్మద్ రఫీ గురుస్థానంలో ఉండి మహేంద్ర కపూర్‍ని ప్రోత్సహించారు. మహేంద్ర పలు భాషాలలో దాదాపు 2500 పాటలు పాడారు.

నరాల్లో సంగీతం:

రుహాన్ కపూర్, ఇంకా అతని సోదరీమణులు బేను, అను, పూర్ణ – సౌత్ ముంబయి లోని పెద్ధార్ రోడ్ లోని తమ నివాసంలో రోజూ శాస్త్రీయ సంగీతం తోనూ, తండ్రి మహేంద్ర సంగీత సాధనతోనూ నిద్రలేచేవారు. 1960ల తొలినాళ్ళలో రుహాన్ జన్మించే నాటికే మహేంద్ర గొప్ప గాయకుడిగా పేరుగాంచారు. అమృత్‌సర్‍లో జన్మించిన మహేంద్రకి తన తల్లి షానో దేవి (శాంతి) నుంచి సంగీతం అబ్బింది. ఆమె తన సొంత ఊరిలో జరిగే పెళ్లిళ్ళలో జానపద గీతాలు ఆలపించేవారు. బాల్యం నుంచే మహేంద్ర ఈ ప్రజ్ఞని అలవర్చుకున్నారు. “చిన్నప్పుడు నాన్న స్కూల్లో (సెయింట్ జేవియర్స్) రోజూ ఆడియో విజువల్ (ఎవి) పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్‍లో బ్రిటీష్ రాజరికపు డాక్యుమెంటరీలు విద్యార్థులకు చూపించేవారు. విద్యార్థులకు అవి విసుగ్గా ఉండేవి. ఒకరోజు ప్రొజెక్టర్ ఎందుకో పని చేయలేదు. ఎవరైనా పాటలు పాడగలరా అని టీచర్ పిల్లలని అడిగితే, కొందరు నాన్న పేరు సూచించారు. అప్పుడు నాన్న నూర్జహాన్ గారి పాటలు పాడారట, పిల్లలంతా చప్పట్లు కొట్టి ఈలలు వేశారట. తర్వాత ఎవి క్లాసుల్లో పిల్లలు ఆ టెక్నీషియన్‌కి లంచాలిచ్చి, ప్రొజెక్టర్ పని చేయకుండా చూసేవారట.” చెప్పారు రుహాన్.

కుటుంబం అంటే ఇష్టం:

ఆ తరువాత మహేంద్ర కపూర్ సెయింట్ జేవియర్ కాలేజీలో చదివారు. అదే కాలేజీలో చదివిన దర్శకనిర్మాత విజయ్ ఆనంద్ గారు దర్శకత్వం వహించిన నాటకాలలో నటించారు. తన భార్య ప్రవీణ్‌తో ఆ సమయంలోనే నిశ్చితార్థం జరిగింది. తన తండ్రివన్నీ నిరాండరమైన రుచులని రుహాన్ అన్నారు. “మహేంద్ర కపూర్ పిల్లలుగా, మమ్మల్ని అందరూ ప్రత్యేకంగా చూసేవారు. కానీ మేం చెడిపోకుండా చూసేవారు నాన్న. ఆయన చక్కని రికార్డింగ్ చేసిన రోజున మా ఇంటికి దగ్గరగా ఉన్న క్వాలిటీ రెస్టారెంట్ నుంచి ఖీమా మటర్, బిర్యానీ, బటర్ చికెన్ ఆర్డర్ చేసేవారు. అమ్మ చాప పరిచేది. అందరం కింద కూర్చుని ఇష్టంగా తినేవాళ్లం. నాన్నకి ఖీర్, ఫిర్నీ అంటే ఇష్టం. ఆయన జీవితంలో ఎన్నడూ పొగ తాగలేదు, మద్యం ముట్టలేదు.”

తన తల్లి తలత్ మహమూద్ అభిమాని అని రుహాన్ తెలిపారు. “అమ్మకి తలత్ గారి స్వరం అంటే ఇష్టం. ఈ విషయంలో నాన్న అమ్మని ఏడిపించేవారు. కానీ నాన్న పాడిన ‘తుమ్ అగర్ సాథ్ దేనేకా వాదా కరో’ (హమ్‌రాజ్, 1967) పాటంటే అమ్మకి బాగా ఇష్టం. నాన్న ఎక్కడికి వెళ్ళినా – అది రాష్ట్రపతితో లేదా ప్రధానితో విందు అయినా – అమ్మని వెంట తీసుకువెళ్ళేవారు. అమ్మకూడా నాన్నకి ఎంతో మద్దతుగా ఉండేది. సంగీతం గొప్ప కళే కానీ అస్థిరమైన వృత్తి. ఒరవడి మారినప్పుడల్లా ఉత్థానపతనాలు ఉంటాయి. మంచి రోజులూ ఉంటాయి, చీకట్లూ ఉంటాయి.”

గురువు రఫీ:

మహమ్మద్ రఫీ గారి ‘యహాఁ బదలా వఫా కా’ (జుగ్ను,1947) పాట విన్నప్పుడు మహేంద్రకి 13 ఏళ్ళు. రఫీ గారంటే విపరీతమైన అభిమానం ఏర్పడిపోయింది. “నాన్న ఎలాగొలా భెండీ బజార్ లోని రఫీ గారి ఇల్లు కనుక్కొని, 1947 దేశ విభజన సందర్భంగా గొడవలు జరుగుతున్నా, వెళ్ళి కలిసారట.” చెప్పారు రుహాన్. 1957లో నౌషాద్, మదన్ మోహన్ వంటి గొప్ప సంగీతకారులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన – మెట్రో మర్ఫీ ఆల్ ఇండియా సింగింగ్ కాంపిటీషన్ గెలవటం ద్వారా మహేంద్ర కపూర్‍కి బాలీవుడ్‍లో ప్రవేశం సులవయింది. “సూక్ష్మభేదాలను సరిచేయడం ద్వారా రఫీ సాబ్ నాన్నకి సాయం చేశారు. ఆ పోటీలో నాన్న రఫీ గారు స్వరపరచిన సినిమా పాట కాని ‘ఇలాహి కోయి తమన్నా నహీ’ అనే పాట పాడారు.” చెప్పారు రుహాన్. వి.శాంతారాం గారి ‘నవ్‌రంగ్’ (1958) చిత్రం కోసం పాడిన ‘ఆధా హై చాంద్రమా’ అనేది మహేంద్ర తొలి నేపథ్య గీతం.

కాలం గడిచే కొద్దీ మహేంద్ర, రఫీల అనుబంధం బలపడింది. వాస్తవానికి, మహేంద్ర కపూర్ తొలిసారిగా విమానం ఎక్కింది – రఫీ గారు కలకత్తాలో ఇచ్చిన ఓ ప్రదర్శనలో కోరస్‍లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు. “వాళ్ళకి ది గ్రాండ్ హోటల్‍లో బస ఏర్పాటు చేశారు. రఫీ గారి ప్రదర్శన తెల్లవారు జామున రెండు గంటల తర్వాత. తన బృందాన్ని అందరిని అప్పటిదాక విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ ఆయనకి కూడా ఏమీ తోచక వరండాలోకి వచ్చి, నాన్నని పిలిచారట. ‘మహేంద్రా, చూటు చందమామ, నక్షత్రాలు ఎంత బావున్నాయో. ఎంత అందమైన రాత్రి కదా! ఇంత అందాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకే గర్వం లేకపోతే, ఏవో కొన్ని పాటలు పాడిన మనకెందుకయ్యా గర్వం? నేను నమాజ్ చేస్తాను, నువ్వు పూజ చేసుకో. భగవంతుని కృపకి ధన్యవాదాలు చెప్పుకుందాం’ అన్నారట రఫీ. వెంటనే ఇద్దరూ ప్రార్థనలో లీనమయ్యారు.”

రఫీ గారి పట్ల కృతజ్ఞత చాటుకునే అవకాశాలని వదులుకునేవారు కాదు మహేంద్ర. 1979లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‍లో మహేంద్ర కపూర్ నైట్ జరిగిది. ఆ వేడుకకి రఫీ గారి కుమారులు ఖలీద్, సయ్యద్‍లు హాజరయ్యారు. “నాన్నకీ విషయం తెలియగానే, రెండు పూలదండలు తెమ్మని నిర్వాహకులని కోరారు. ఆ సమయంలో ఎక్కడా పూలదండలు దొరకకపోతే, నిర్వాహకులు సమీపంలోని ఒక గుడి నుంచి పూలదండలు తెచ్చారట. రఫీ గారి పుత్రులని నాన్న వేదికపైకి పిలిపించి, ఆ మాలలని వాళ్ళ మెడలలో వేసి సత్కరించారు. వారి పాదాలను తాకారు. ‘మీకు పాదనమస్కారం చేయడం ద్వారా అక్కడ ముంబయిలో ఉన్న మా గురువుగారికి నమస్కరించుకుంటున్నాను’ అన్నారు. ఈ చర్యకి శ్రోతలందరూ కదిలిపోయారు. ప్రతీ గాయకుడు మరో గాయకుడి ప్రభావానికి లోనవుతారు. కానీ బయటకు చెప్పరు. నాన్న చెప్పారు” అన్నారు రుహాన్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే – రఫీ, మహేంద్ర ఇద్దరూ కలిసి ఎన్నడూ పాడలేదు (1968, ఆద్మీ చిత్రానికి తప్ప). “రఫీ గారు అనేవారు, ‘మనిద్దరం కొట్టుకుంటే చూడాలని జనాలు అనుకుంటారు. కానీ మనం సోదరులం. మన మధ్య గొడవలు ఉండవు’ అని”.

రికార్డింగుల జ్ఞాపకాలు:

నాన్నతో పాటు రికార్డింగుల కెళ్ళిన సందర్భాలు రుహాన్‌కి గుర్తున్నాయి. “ఒకసారి మేం మహాబలేశ్వర్‍లో ఉన్నాం. లక్ష్మీ జీ (లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఫేమ్) నుంచి ఫోన్ వచ్చింది, బొంబాయి వచ్చి లతా మంగేష్కర్ గారితో యుగళగీతం పాడాలి అంటూ. మర్నాడు తెల్లవారు జామునే బయల్దేరి, ఫేమస్ స్టూడియోకి చేరాము. ఆ పాట రాగ్ మార్వ, రాగ్ పురియ ధనశ్రీ లోని ‘మేరీ సాఁసోం కో’ అనేది. రెండు టేక్ లలో రికార్డింగ్ పూర్తయ్యింది”.

రుహాన్ మరో తమాషా సంఘటనని గుర్తు చేశారు. కళ్యాణ్‍జీ-ఆనంద్‌జీల సంగీత సారథ్యంలో మహేంద్ర కపూర్ కిషోర్ కుమార్‍తో కలిసి (హేరా ఫేరీ, 1976) ‘వక్త్ కీ హేరా ఫేరీ హై’ అనే యుగళ గీతం పాడాల్సి ఉంది. “కిషోర్‌దా మాకన్నా ముందే ఫిల్మ్ సెంటర్ చేరుకున్నారు, కానీ పాడడానికి నిరాకరిస్తున్నారు. ఆయన కాస్త కోపంగా, ‘ఈ మధ్య నేను ఎర్రకోటని సందర్శించాను. అక్కడి గైడ్ మాకన్నీ – రాజుల పడక గదులు, భోజనశాల – అన్నీ చూపించాడు కానీ రాజుల టాయ్‍లెట్ మాత్రం చూపించలేదు. రాజులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి పొలాల్లోకి వెళ్ళేవారా?’ అన్నారు. ఈ ప్రశ్నకి కళ్యాణ్‍జీ వద్ద కూడా జవాబు లేదు. తదుపరి రికార్డింగ్ నాటికి జవాబు కనుక్కుంటానని కళ్యాణ్‌జీ ఒప్పిస్తే, అప్పుడు పాడారు కిషోర్‍దా” అంటూ నవ్వారు రుహాన్.

రాజ్ కపూర్ వాగ్దానం:

“రాజ్ కపూర్‌ గారికి ఎక్కువగా పాడినది స్వర్గీయ ముకేశ్ గారే అయినా, నాన్న అంటే ఆయనకి అభిమానం ఉంది” చెప్పారు రుహాన్. “రాజ్  కపూర్ అంటే రష్యాలో దైవం. రష్యాలో జరిగిన ఓ ప్రదర్శనలో రాజ్ జీ తన సినిమాల్లో ముకేశ్ గారు పాడిన పాటలని పాడారు. ప్రేక్షకులు వెర్రెక్కిపోయారు. తర్వాత నాన్న వంతు వచ్చింది. నాన్న హమ్‌రాజ్, గుమ్రాహ్ చిత్రాలల లోని పాటలను రష్యన్ భాషలోకి అనువదించి, అర్థం వివరించి వాటిని పాడారు. దాదాపు లక్షమందికి పైగా ఉన్న ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. రాజ్ కపూర్ వేదిక పైకి వచ్చి ‘కపూర్ లకి మాత్రమే దక్కుతుంది ఈ ఘనత’ అని సరదాగా వ్యాఖ్యానించారు. తిరుగు ప్రయాణంలో, తన సినిమాల్లో నాన్నతో పాడిస్తానని అన్నారు రాజ్ కపూర్. నాన్న వెంటనే, ‘మీరు పెద్ద నిర్మాత, మీరు మర్చిపోతారు’ అన్నారు. రాజ్ వెంటనే సిగరెట్‍తో చేతి మీద కాల్చుకున్నారు. ‘ఈ మచ్చని చూసినప్పుడల్లా మీతో పాడించాలన్న సంగతి నాకు గుర్తొస్తుంది’ అన్నారు” చెప్పారు రుహాన్. త్వరలోనే మహేంద్ర – ముకేశ్‌తో కలిసి ‘సంగం’ (1964) చిత్రానికి ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ అనే పాటని పాడారు.

కొత్తనీరు:

70లలో కిషోర్ కుమార్, ఆర్.డి. బర్మన్‍ల ద్వయం విశిష్టంగా రాణించడంతో సినీ సంగీతంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. “అందరి గాయకుల జీవితాలలో అదొక అభద్రతాభావం నిండిన దశ. తలత్ సాబ్, రఫీ సాబ్, ముకేశ్ జీ, నాన్న వంటి గాయకులు ప్రచారం చేసిన – భారతీయ, మౌలిక శైలిలో పాడడం – కిషోర్‍దా, పంచమ్‍దాలు ప్రచారంలోకి తెచ్చిన పాశ్చాత్య శైలికి దారిచ్చింది. వాయిద్యాలు పూర్తిగా మారిపోయాయి. ఆ ధోరణి నేటివరకూ కొనసాగింది. ఆ యుగం నాన్నని ఇబ్బంది పెట్టింది. ఎటు చూసినా కిషోర్ కుమారే ఉండేవారు. పైగా రఫీగారు కూడా కాస్త విరామం ఇచ్చారు. అదృష్టవశాత్తు నాన్న గుజరాతీ, మరాఠీ సినిమాలు నేపథ్య గానం అందించారు (మహేంద్ర కపూర్‍ని దాదా కొండ్కే స్వరంగా పేర్కొంటారు), కానీ హిందీ పాటలలో వెనుకబడ్డారు” చెప్పుకొచ్చారు రుహాన్.

ఒకసారి బాగా చిరాకుపడిన రఫీ గారు మహేంద్రని ఇంటికి పిలిచారట. “నాన్న రఫీ గారి ఇంటికి వెళ్ళేసరికి, ఆయన లాన్‍లో ఒక్కరే కూర్చున్నరట. ‘ఒకప్పుడు వంగి వంగి నమస్కారాలు చేసిన నిర్మాతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. బాధగా ఉంది’ అన్నారట రఫీగారు. ‘అది ప్రపంచపు రీతి’ అన్నారట నాన్న. అప్పుడు రఫీగారు తాను తాజాగా రికార్డు చేసిన ‘హస్తే జఖ్మ్’ (1973) చిత్రంలోని – తుమ్ జో మిల్ గయే హో – పాటని వినిపించారట. ఆ పాట విని ఇద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారట. అదీ ఆనాటి మూడ్!”

వివాదం:

తన తండ్రిని జీవితాంతం వెంటాడిన ఓ వివాదానికి రుహాన్ ముగింపు పలకాలనుకున్నారు. “రఫీగారు, నాన్న ఒకే ఒక్కసారి – (ఆద్మీ చిత్రానికి గాను) ‘కైసీ హసీన్ రాత్’ పాటకి తప్ప ఎప్పుడూ కలిసి పాడలేదు. కానీ ఈ పాటని తొలుత తలత్ సాబ్ గారి గాత్రంతోనూ (మనోజ్ కుమార్ గారి కోసం), రఫీ సాబ్ స్వరంతో (దిలీప్ కుమార్ కోసం) రికార్డు చేశారు, కానీ టేప్స్ విన్నప్పుడు – మనోజ్ గారు పోషిస్తున్న పాత్రకి తలత్ గారి స్వరం మరీ మెత్తగా ఉందని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. అప్పట్లో తలత్ గారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన రఫీ గారి స్వరంతో పోటీ పడలేకపోయారు. ఇద్దరు ప్రధాన పాత్రల స్వభావాన్ని వ్యక్తం చేసే కీలకమైన పాట అది. తలత్ గారి ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండగా ఆ పాటని రికార్డు చేయడం పొరపాటేనని నౌషాద్ సాబ్ అంగీకరించారు. తలత్ గారు పాడిన పాటని మళ్ళీ నాన్న చేత పాడిద్దామనుకున్నారు. తనకి తలత్ ఆదర్శం అయినందున తాను పాడలేనని నాన్న అన్నారు.” చెప్పారు రుహాన్. కానీ తరువాత మహేంద్ర వెళ్ళి తలత్‍ని కలిసి తన అభ్యంతరం చెబితే, ఆయనే ధైర్యం చెప్పి, “నువ్వు నా బిడ్డ లాంటి వాడివి, నువ్వు పాడకపోతే మరొకరు పాడతారు. నా ఆరోగ్యం బాగోలేదు, రఫీ గారి స్వరంలోని ధాటిని నేను తట్టుకోలేను” అన్నారు. అంటే తలత్ గారి ఆశీర్వాదంతో నాన్న ఆ పాట పాడారు” చెప్పారు రుహాన్.

అనారోగ్యం, మరణం;

కీలుకి చేయించుకున్న సర్జరీ ఈ అద్భుత గాయకుడి మరణానికి కారణం. “ఆపరేషన్ తరువాత ఆయనకి బ్లాడర్‍లో ఇన్‍ఫెక్షన్ సోకింది. అది మూత్రపిండాలకి పాకింది. ఫలితంగా నాన్నకి డయాలిసిస్ చేయించాల్సి వచ్చింది” అన్నారు రుహాన్. చనిపోవడానికి ఒక వారం ముందు ఆయనకి ఓ పూర్వ సంకేతం అందినట్లుంది. “ఓ రోజు ‘అమ్మని జాగ్రత్తగా చూసుకో. మా అమ్మానాన్నలు నాకోసం ఎదురుచూస్తూ కనిపిస్తున్నారు. వాళ్ళని కలుసుకోడానికి నేను తహతహలాడుతున్నాను.’ అన్నారు నాన్న. ఆయన ఢిల్లీలోని ఛత్తర్‍పూర్ లోని దేవీ కాత్యాయని భక్తులు. చనిపోవడానికి ఒకరోజు ముందు ఆ గుడికి ఫోన్ చేసి పూజారితో మాట్లాడుతూ – ‘స్వామీ, మాతకి నా చివరి ప్రణామాలు అందజేయండి. ఇక నేను అక్కడికి రాలేను’ అన్నారు. మరణం కన్నా ఎక్కువగా నాన్నని భయపెట్టింది – మంచానికి పరిమితమైపోతాననే భయం. ఆయన చనిపోయిన రోజున మా నాయనమ్మ తిథి. మధ్యాహ్నం భోజనం అయ్యాకా, ప్రభు మహాకాళేశ్వర్ పై శుభా ముద్గళ్ తాజా భక్తిపాటల సిడి విన్నారు, రాగ్ యమన్‍లో స్వరపరిచిన ఆ పాటలని ఇష్టపడ్డారు. కొన్ని గంటల తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. నేను ఆయన చేయి పట్టుకుని ఉండగా, ప్రశాంతంగా ప్రాణాలు వదిలారు.” చెప్పారు రుహాన్. 74 ఏళ్ళ ఆ గాయకుడికి గుండెపోటు వచ్చింది. “మా అమ్మ మాత్రం ‘ఆయనకు ముక్తి లభించింది’ అనుకుంది. ఆయన ఎక్కడ ఉన్నా ఇక్కడ కన్నా మెరుగైన చోటే ఉంటారు.” అన్నారు రుహాన్.

ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు:

  • చలో ఎక్ బార్ ఫిర్ సే – గుమ్రాహ్ (1963)
  • నీలే గగన్ కే తలే – హమ్‌రాజ్ (1967)
  • ఔర్ నహీఁ బస్ ఔర్ నహీఁ – రోటీ కపడా ఔర్ మకాన్ (1974)

నటనా పటిమ నిగార్ సుల్తానా:

నిగార్ సుల్తానా (21 జూన్ 1932 – 21 ఏప్రిల్ 2000) తక్కువ సినిమాలలో నటించినా, గుర్తుంచుకోదగ్గ ప్రతిభ కనబర్చారు. ఆమె హైదరాబాదులో జన్మించారు. అప్పట్లో ఆమె తండ్రి నిజామ్ రాష్ట్ర సైన్యంలో మేజర్ స్థాయిలో ఉండేవారు. ఆమె బాల్యం ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలతో బాల్యం గడిచింది (నటిగా నిగార్ దాదాపు 25 మంది కుటుంబ సభ్యుల బాధ్యతను చూశారట. వాళ్ళు ఆమె రక్తం తాగేవారని పుకారు. షూటింగులతో ఎంతో అలసిపోయి ఇంటికి వచ్చేవారట నిగార్). కొద్ది కాలం బడికి వెళ్ళిన నిగార్, ఆపై ఇంట్లోనే చదువుకున్నారు. ఒకసారి బడిలో జరిగిన నాటకంలో పాల్గొన్నారామె, అప్పటి నుంచి నటన మీద ఆసక్తి పెంచుకున్నారు.

నిగార్ చూసిన తొలి చిత్రం ‘హమ్ తుమ్ ఔర్ ఓ’ (1938). ఆ సినిమా చూసిన ఆమె ముగ్ధులయ్యారు. తన తండ్రి స్నేహితులు జగదీష్ సేథీ, మోహన్ భవానీ గారితో సినిమా తీస్తూ, ప్రధాన పాత్రలో ఆమెని తీసుకుంటానంటే, ఆమె వెంటనే అంగీకరించారు.

1946లో వచ్చిన సినిమా ‘రంగభూమి’తో ఆమె పరిశ్రమలోకి వచ్చారు. అయితే హిందీ చలనచిత్రాలలో ఆమె మరిన్ని అవకాశాలు కల్పించినది మాత్రం రాజ్ కపూర్ ‘ఆగ్’ (1948).  ఆ సినిమాలో ఆమె ‘నిర్మల’ పాత్ర పోషించారు. విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. దీని తర్వాత ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు.

ఆమె నటించిన పెద్ద చిత్రం ‘షికాయత్’ (1948) పూనేలో నిర్మించబడింది. రంజిత్ ప్రొడక్షన్స్ వారి ‘బేలా’ (1947)లో నటించారు. దీని తర్వాత ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించారు. యువరాజు సలీమ్‌గా దిలీప్ కుమార్, అనార్కలిగా మధుబాల నటించిన ప్రేమకథా చిత్రం ‘అనార్కలి’లో అసూయ నిండిన ఆస్థాన నృత్యకారిణి ‘బహార్’ పాత్రలో రాణించారు నిగార్. ఆ సినిమాలో ‘తేరీ మెహఫిల్ మే’, ‘జబ్ రాట్ హో ఐసీ మత్వాలీ’ అనే పాటలను నిగార్ మీద చిత్రీకరించారు. దారా (1953), ఖైబర్ – ఆమె ఇతర సినిమాలు.

పతంగా (1949), దిల్ కీ బస్తీ (1949), శీష్ మహల్ (1950), ఖేల్ (1950), దామన్ (1951), ఆనంద్ భవన్ (1953), మీర్జా గాలీబ్ (1954), తన్‌ఖా (1956), దుర్గేశ్ నందిని (1956), ఇంకా యహూది (1958) వంటి సినిమాలు ఆమెకు పేరు తెచ్చాయి. 1950లలో అనేక చిత్రాలలో విస్తృతంగా నటించిన నిగార్, ఆ తరువాత సినిమాలను బాగా తగ్గించుకున్నారు. 1986లో తీసిన ‘జంబిష్: ఎ మూవ్ మెంట్ – ది మూవీ’ ఆమె చివరి హిందీ చిత్రం.

నిగార్, పాకిస్తానీ నటుడు దర్పన్ కుమార్‌తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి. దాంతో ఆమె 1959, జూన్ 13 న ప్రత్యేకంగా ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటుచేసి తాను ఆ పాకిస్తానీ నటుడిని వివాహం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఆమె తొలి వివాహం, ఎస్.ఎమ్. యూసుఫ్‌తో, ఆయన ఆనాటి బ్రిటీష్ ఇండియాలో ఉన్నప్పుడు జరిగింది. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 5 ఏళ్ళకే విడిపోయారు.

ఆ తరువాత ఆమె మొఘల్-ఎ-ఆజం (1960) నిర్మాత-దర్శకుడు అయిన కె. అసిఫ్ గారిని వివాహం చేసుకున్నారు.

నిగార్ సుల్తానా – నటి హీనా కౌసర్‍కి తల్లి. హీనా నిగార్‍కీ, యూసుఫ్‍ గారికి పుట్టిన కూతురు. హీనా కౌసర్ 1970లూ, 80ల మొదట్లో ఎన్నో చిత్రాలలో ద్వితీయ పాత్రలలో నటించారు.

1950ల నాటి ఇద్దరు నటీమణులు చిత్ర (అఫ్సర్-ఉన్-నీసా), పరాస్ (యూసుఫ్-ఉన్-నీసా) నిగార్ మేనకోడళ్ళే.

నిగార్ సుల్తానా బాగా చదువుకున్నారు. ఉర్దూ కవిత్వం అంటే ఆసక్తి. ఆమె కవిత్వం చదవడమే కాకుండా రాసేవారు కూడా. ఆమెకి సితార్ వాయించడం వచ్చు. పాటలు పాడేవారు. తన దుస్తులు తాను డిజైన్ చేసుకునేవారు. వంట కూడా చాలా బాగా చేసేవారు.

నిగార్ సుల్తానా 21 ఏప్రిల్ 2000న ముంబైలో మరణించారు.

ఆమె నటించిన సినిమా జాబితా:

https://en.wikipedia.org/wiki/Nigar_Sultana_(actress)#Filmography

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here