అలనాటి అపురూపాలు-107

0
5

[dropcap]సిని[/dropcap]మా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

దక్షిణ భారతదేశపు తొలి మూకీ నిర్మాత, స్టూడియో యజమాని:

తమిళ సినిమా పితామహుడిగా భావించబడే నటరాజ మొదలియార్ జనవరి 26, 1885 నాడు మద్రాసు ప్రెసిడెన్సీ లోని వెల్లూరులో ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు (కాంగ్రెస్ స్థాపించిన సంవత్సరంలో ఈయన జన్మించడం విశేషం). ఆయన తండ్రి అత్యంత నిజాయితీపరుడైన వ్యాపారిగా పేరుమోసిన రంగస్వామి మొదలియార్. నటరాజ మొదలియార్ మెట్రిక్యులేషన్ వరకు వెల్లూరులోనే చదువుకున్నారు. తండ్రిలాగా తను కూడా వ్యాపారం చేయాలని, అది కూడా కింది స్థాయి నుంచి ప్రారంభించాలని అనుకుని తనకి వరసకి సోదరుడయ్యే ధర్మలింగ మొదలియార్‌తో కలిసి మద్రాసు బయల్దేరారు. ఆయన తండ్రి వారిని ఆశీర్వదించి పంపారు.

మద్రాసులో వారు ‘వాట్సన్ అండ్ కంపెనీ’ అనే సైకిళ్ళ సంస్థను స్థాపించి ఒక్కో సైకిలును ఇరవై ఐదు రూపాయలకి అమ్మారు. ఈ వ్యాపారం విజయవంతం కావడంతో, వీరిద్దరూ కలిసి 1911లో ‘రొమార్ డాన్ అండ్ కంపనీ’ అనే సంస్థని కొనుగోలు చేసి అమెరికా నుంచి మోటారు కార్లను, సంబంధిత పరికరాలను దిగుమతి చేసుకుని అమ్మకాలు కొనసాగించారు. అంతకు ముందు వరకు మద్రాసులో ‘అడిసన్ అండ్ కంపెనీ’ అనే కంపెనీ మాత్రమే అమెరికన్ కార్లను అమ్మేది. అవే కార్లను మొదలియార్ ఒక్కోటి వెయ్యి రూపాయలకి అమ్మి, అమెరికన్ కార్లను అమ్మిన తొలి భారతీయుడిగా పేరు తెచ్చుకున్నారు. వ్యాపారంలో పేరు వచ్చినా ఆయనకి తృప్తి కలగలేదు. ఏదైనా సృజనాత్మకత కలిగిన వ్యాపారం కాని, వృత్తి కాని చెయ్యాలని ఆయనకి కోరిక కలిగింది.

యువ నటరాజ మొదలియార్

ఆ కాలంలోనే 1913లో మన దేశంలో మొట్టమొదటి మూకీ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ విడుదలయ్యింది. దేశవ్యాప్తంగా కరపత్రాలు పంచి, ఈ సినిమా గురించి ప్రచారం చేశారు. నటరాజు మొదలియార్ మద్రాసులో ఈ పాంప్లెట్లు చూశారు, అద్భుతమనిపించింది. ఆ సినిమా చూశాకా నటరాజ మొదలియార్‌కు అలాంటి చిత్రాలను నిర్మించాలనే కోరిక కలిగింది. అప్పట్లో అప్పటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కర్జన్‍పై ఒక డాక్యుమెంటరీ చిత్రం తీయడానికి బ్రిటన్ నుంచి సినెమాటోగ్రాఫర్లు వచ్చారు. వాళ్ళలో ఒకరైన స్టెవర్ట్ స్మిత్ అనే సినెమాటోగ్రాఫర్‍తో ఢిల్లీలో నటరాజ మొదలియార్‌కి పరిచయం కలిగింది.

తర్వాత నటరాజ మొదలియార్ పూనా వెళ్లి స్మిత్ ద్వారా ఫోటోగ్రఫీ, ప్రింటింగ్, ప్రాసెసింగ్ మొదలైన విద్యలన్నీ నేర్చుకున్నారు. అక్కడ శిక్షణ ముగించుకుని 1915లో మద్రాసు తిరిగి వచ్చారు. ఆయన 1917లో సొంతంగా ‘ఇండియన్ ఫిలిం కంపెనీ’ అనే సంస్థని ఏర్పాటు చేశారు. వ్యాపారస్థులైన కొందరు తన మిత్రులని తన నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టమని కోరి – మద్రాసులోని పురుసైవాక్కంలో మిల్లర్ రోడ్‍లో తన స్టూడియోని స్థాపించారు.

తన పరిచయస్థుల ద్వారా ‘విలియమ్స్’ గురించి, అమ్మకానికి ఉన్న ఒక ప్రింటర్ గురించి తెలుసుకున్నారు [విలియమ్స్ ప్రాసెస్ లేదా విలియమ్స్ డబుల్ మాటింగ్ ప్రాసెస్ అనేది ‘ఫ్రాంక్ డి విలియన్స్’ అనే ఒక అమెరికన్ సినెమాటోగ్రాఫర్ రూపొందించిన ప్రక్రియ. ఇది మునుపటి మాట్ టెక్నిక్‍లకి భిన్నంగా నేపథ్యంలో చిత్రీకరించిన నటీనటుల కదలికలను జోడిస్తుంది]. తిరువయ్యూరులో ముపనార్ అనే వ్యక్తి వీటిని అమ్ముతుండగా, నటరాజ మొదలియార్ వాటిని 1800 రూపాయలు పెట్టి కొన్నారు.

తన మిత్రుడు జగన్నాథాచారిని పూనాలోని స్టెవార్ట్ వద్దకు పంపి ఫోటోగ్రఫీ, డెవలపింగు, ప్రాసెసింగులలో శిక్షణ ఇప్పించి, అతనిని తన సహాయకుడిగా నియమించుకుందాం అనుకున్నారు. ఆచారి తిరిగి రాగానే మిల్లర్ రోడ్డులో ఒక బంగళా తీసుకుని ఆ కాంపౌండులోనే ఒక పెద్ద షెడ్డు వేసి పై కప్పుగా ఒక తెల్ల గుడ్డను కప్పించారు. దాని వల్ల షూటింగుకు అవసరమయ్యే సూర్యకాంతి షెడ్డులోకి వచ్చేది. ఆ రోజులలో షూటింగుకు సూర్యకాంతి తప్ప లైట్లు ఉపయోగించేవారు కాదు. షాట్లు ఉత్తమంగా వచ్చేలా సూర్యకాంతిని తగ్గట్టుగా మార్చుకునేవారు. ఆ విధంగా మద్రాసులో దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి సినీ స్టూడియో ఏర్పడింది.

ఇప్పుడు వారికి సినిమా తీయడానికి కథ, నటీనటులు, సిబ్బంది కావాలి. ముడి ఫిల్మ్‌ను లండన్ నుంచి దిగుమతి చేసుకోవాలి. రంగస్థలంలో అనుభవం ఉన్న రంగ వడివేలు అనే మిత్రుడు మొదలియార్‌కి భాగస్వామి అయ్యారు. ఆయన నటించడమే కాకుండా, నటీనటుల ఎంపికలో సహకరించారు.

1917లో మొదలియార్ ‘కీచక వధ’ ఇతివృత్తంతో సినిమా తీయాలని నిర్ణయించారు. స్క్రిప్టు రచన, కెమెరా, దర్శకత్వం బాధ్యతలు నటరాజ మొదలియారే స్వీకరించారు. ఈ సినిమా నిడివి 6000 అడుగులు. దక్షిణ భారతదేశంలో తొలి మూకీ సినిమాగా గుర్తింపు పొందింది.

కథలో రక్తపాతం, హింస ఎక్కువ అనీ, అలాంటి సినిమాని తొలి చిత్రంగా ఎంచుకోడం సరికాదని చాలామంది మొదలియార్‌ని నిరాశపరిచారు. కానీ మొదలియార్ పట్టు వీడలేదు. చిత్రీకరణ కొనసాగించారు. చిత్రీకరణ ఎక్కువ శాతం అవుట్ డోర్‌లోనే జరిగింది. రాజు మొదలియార్ అనే నటుడిని కీచకునిగా, జీవరత్నం అనే నటిని సైరంధ్రి పాత్రకు తీసుకున్నారు.

ఈ సినిమాకు కళాదర్శకుడు లేకపోవడంతో, నటరాజ మొదలియారే స్వయంగా సెట్స్‌ రూపొందించారు. రాజా రవివర్మ బొమ్మల నమూనాతో చేశారు. ఇందుకు షణ్ముగం అనే చిత్రకారుడూ, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో పనిచేసే మీనన్ అనే వ్యక్తి సహకరించారు.

ఈ సినిమా నిడివి 6000 అడుగులు కావడంతో, ముఖ్యమైన సన్నివేశాలకు హిందీలోను, తమిళంలోను ‘సబ్ టైటిల్స్’ వేశారు. తమిళ టైటిల్స్ వ్రాయడానికి మొదలియార్ గారి మేనమామ గురుస్వామి మొదలియార్ పూనుకున్నారు. హిందీ టైటిల్స్ మహాత్మాగాంధీ కుమారుడు దేవదాస్ గాంధీ వ్రాశారు. ఈ సినిమా నిర్మాణానికి ఐదు నెలల కాలం పట్టింది. 35 వేల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ సినిమాని 1918లో మద్రాసులోని ఎలిఫిన్‌స్టన్ టాకీసులో విడుదల చేశారు. రోజూ రెండు ప్రదర్శనలు శని, ఆదివారాల్లో మ్యాటినీ షోలు ప్రదర్శించారు. సబ్‌ టైటిల్స్ వచ్చినప్పుడు హాలులో కొందరు వ్యాఖ్యాతలు ఆ సన్నివేశాలను ప్రాంతీయ భాషలలో వివరించేవారు.

ఈ సినిమా 1918లో విడుదలైనప్పుడు దాదాపు 50 వేల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం విజయవంతం కావడంతో ఆయనలో ఉత్సాహం పెరిగి రెండవ మూకీగా ‘ద్రౌపదీ వస్త్రాపరహణం’ సినిమాని ప్రకటించారు. కాని ద్రౌపది పాత్రలో నటించేందుకు భారతీయ మహిళలు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ‘వైలెట్ బేరీ’ అనే బ్రిటిష్ వనితను ఆ పాత్రకి తీసుకున్నారు. ఆమెకు తమిళం రాదు. దుశ్శాసన పాత్రధారికి ఇంగ్లీషు రాకపోవడంతో ఇంగ్లీషు వచ్చిన దొరస్వామి పిళ్లైను ఆ పాత్రకు ఎంచుకున్నారు.

నటరాజ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకి మొదటి సినిమా కన్నా తక్కువ ఖర్చే అయ్యింది. ఈ మూకీ సినిమా 1919లో విడుదలై 75,000 రూపాయలు రాబట్టింది. నటరాజ మొదలియార్ తన మూడవ సినిమాగా ‘లవకుశ’ తీశారు. అందులో గోవిందస్వామి నాయుడు రాముడిగా నటించారు. నాల్గవ సినిమాగా ‘రుక్మిణి సత్యభామ’ తీశారు, ఈ సినిమాలో తొలిసారిగా ఒక బ్రాహ్మణ మహిళను చిత్రరంగంలో ప్రవేశపెట్టారు. ఆమే జానకి. రుక్మిణిగా నటించారు. సత్యభామగా జీవరత్నం నటించగా, నటేశ నాయుడు శ్రీకృష్ణుడిగా నటించారు. అయిదవ సినిమాగా ‘మార్కండేయ’ నిర్మించారు. ఈ సినిమాలో యముడిగా నటించిన సుబ్రహ్మణ్య నాయుడి నటనా ప్రతిభ నచ్చి, ఆయన ప్రధాన పాత్రధారిగా, ఆరవ సినిమా ‘మైరావణ’ తీశారు మొదలియార్.

ఈయన తీసిన ఆరు మూకీ తమిళ సినిమాల సగటు నిడివి 7000 అడుగులు మాత్రమే, పైగా ఇవన్నీ పౌరాణికాలు కావడం విశేషం. పైగా వీటి బడ్జెట్ 15,000/- లోపే ఉండడం మరో విశేషం.  ఒకే సెట్‌కి కొద్దిపాటి మార్పులతో మళ్ళీ ఉపయోగించేవారు. ఆ విధంగా నిర్మాణ వ్యయం బాగా తగ్గించారు. ఖచ్చితమైన ప్రణాళికతో, సమయపాలనతో ‘రుక్మిణి సత్యభామ’ చిత్రం నెల రోజులలో పూర్తి చేశారు. సిబ్బంది జీతాలు కూడా ఒక్కొక్కరికి నెలకి 50 రూపాయలకు తక్కువగాను, 150 రూపాయలకు మించి ఉండేవి కావు. అందరూ స్టూడియోకి రిక్షాలలో వచ్చేవారు, రిహార్సల్స్ సీరియస్‍గా చేసేవారు. ప్రచారానికి పోస్టర్లు, పాంప్లెట్లు ఉపయోగించారు.

“దక్షిణ భారతదేశంలో తొలి మూకీ చిత్రం నిర్మించిన మీరు, దక్షిణాదిన తొలి టాకీ ఎందుకు నిర్మించలేకపోయారు?” అని అడిగితే, తను నమ్మిన వారు తనని విశ్వసించలేదని చెప్పారు. క్రమశిక్షణ లోపించిందని, స్వార్థం పెరిగిందని అన్నారు. ఆయన భాగస్థులు ఆయన్ని బాగా ఇబ్బందులకు గురి చేశారు. బహుశా దేవుడు కూడా ఆయన ఇంక సినిమాలు తీయకూడడని భావించాడేమో, ఆయన స్టూడియో అగ్ని ప్రమాదంలో కాలి బూడిదయింది. ఆ ప్రమాదంలో ఆయన ఎదిగిన కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. దానితో విరక్తి చెందిన నటరాజ మొదలియార్ సినిమాల నుంచి విరమించుకుని మద్రాసులో స్థిరపడ్డారు.

ఓ సన్మాన సభలో ఆనాటి మంత్రి శ్రీ చవాన్ గారితో

సినిమాల దర్శకనిర్మాతగా ఆయన రఘుపతి ప్రకాశ్‌కు (రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి కుమారుడు), జె.సి.డేనియల్‍కు ప్రేరణగా నిలిచారు. జె.సి.డేనియల్‍ తదుపరి కాలంలో మలయాళ సినీ రంగ పితామహుడిగా పేరుగాంచారు.

నటరాజ మొదలియార్ 2 మే, 1971న మృతి చెందారు.

చనిపోవడానికి కొన్ని రోజుల ముందు 1971లో ఆయన్ని మద్రాసులో సత్కరించారు. ఆ వేడుకలో ఆయనని పరిచయం చేస్తూ – “ఒక భారతీయుడు, ఒక బ్రిటీష్ వనిత…” అని కరుణానిధి అనగానే – ప్రేక్షకులంతా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆ అభినందనలకు కారణం వివరించనక్కరలేదు.

అలాంటి నటరాజ్ మొదలియార్ గారిని తలచుకుంటూ… ఇవి టైప్ చేస్తుంటే బాధ కలుగుతుంది.


దర్శకులు తాతినేని ప్రకాశ రావు మాటల్లో గ్రేట్ ఎల్.వి. ప్రసాద్:

తెలుగు, తమిళ సినీ రంగాల దిగ్గజం శ్రీ ఎల్. వి. ప్రసాద్ గురించి సుప్రసిద్ధులు దర్శకులు తాతినేని ప్రకాశ రావు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే:

“ఒకానొకప్పుడు సినిమాలంటే వ్యసనం ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు. అతని తండ్రి ఆ కుర్రాడినెప్పుడూ అర్థం చేసుకోలేదు, భవిష్యత్తులో గొప్ప నటుడు, దర్శకనిర్మాత అయ్యేందుకు కావల్సిన సృజనాత్మకత ఆ పిల్లాడిలో ఉందని ఆయన గ్రహించలేదు. ఆ పిచ్చి వదిలించేందుకు దెబ్బలే మార్గమని ఆయన నమ్మారు. కానీ సినిమాలు చూడడం మానలేదు ప్రసాద్. అందరూ నిద్రపోయేదాకా ఆగి, మిడ్‍నైట్ షోకి వెళ్ళేవాడు. తెల్లారగట్ల సూర్యోదయానికన్నా ముందుగా ఇంటికి వచ్చి, బాగా నిద్రపోయినవాడిలా నటించేవాడు. ఓ రాత్రి సినిమా చూసి ఇంటికొస్తుంటే, ఆ కుర్రాడికి తండ్రి ఎదురయ్యారు. అప్పటికి ఆయన ఇంకా కొడుకుని గమనించలేదు. అప్పుడే యువ ఎల్. వి. ప్రసాద్ కుంటివాడిలా నడుస్తూ, తండ్రిని దాటేశాడు. ఎవరో కుంటివాడు పాపం, అనుకున్నారట ఆయన తండ్రి. అది ఎల్.వి.ప్రసాద్ గారి మొదటి నటన. అయితే ఆ జీవితంతో ఆయన విసుగుచెందాడు. ఇంట్లోంచి పారిపోయి బొంబాయి వెళ్ళాడు. [అక్కడ ప్రసాద్ గారు వీనస్ ఫిల్మ్ కంపెనీలో పనికుర్రాడిగా చేరారు. తర్వాత ఇండియా పిక్చర్స్ వారి వద్ద పనికుర్రాడిగా చేరారు. అక్కడ అఖ్తర్ నవాజ్ ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ అనే మూకీ చిత్రంలో ఓ వేషం వేయించారు. 1931లో ప్రసాద్ భారతదేశపు తొలి టాకీ చిత్రం ‘అలం ఆరా’లో నటించారు. ఈ అవకాశం వీనస్ కంపెనీ ద్వారా లభించింది. తర్వాత మరికొన్ని చిన్నవేషాలు లభించాయి. ఈ సినిమాలను ఇంపీరియల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ ద్వారా ప్రసాద్ హెచ్.ఎం.రెడ్డి గారిని కలుసుకున్నారు. తొలి తెలుగు తమిళ ద్విభాషా టాకీ చిత్రమైన ‘కాళిదాసు’లో ప్రసాద్‍కి వేషం ఇచ్చారు హెచ్.ఎం.రెడ్డి. ఆ పిమ్మట మొదటి తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’లో కూడా నటించారు. ఈ సమయంలోనే ప్రసాద తన కుటుంబ సభ్యులను కలుసుకుని ఇంటికి వెళ్లారు. తరువాత భార్యా కూతురితో కలిసి మళ్ళీ బొంబాయి వచ్చేసారు. అక్కడ ఆయనకు ఆనంద్, రమేష్ అనే ఇద్దరు కొడుకులు జన్మించారు.

అలీ షా దర్శకత్వం వహించిన ‘కమర్-అల్-జమన్’ చిత్రానికి అనుకోకుండా సహాయ దర్శకుడిగా అవకాశం లభించింది ప్రసాద్ గారికి. ఆ సమయంలోనే, ఒక క్లర్కు ఆయన పేరు చాలా పెద్దగా ఉందని అనడంతో – ఆయన తన పూర్తి పేరు – అక్కినేని లక్ష్మీ వర ప్రసాద రావును – ఎల్.వి. ప్రసాద్‌గా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఆ పేరుతోనే గుర్తింపు పొందారు. తంత్ర సుబ్రహ్మణ్యం గారు ఆయనకి – ‘కష్ట జీవి’ చిత్రానికి ప్రొడక్షన్ సూపర్‌వైజర్‍గా, ఆ పై సహాయ దర్శకుడిగా బాధ్యతలిచ్చారు, ఈ సినిమా కోసం ఆయన మళ్ళీ బొంబాయి వచ్చారు. మూడు రీళ్ళ చిత్రీకరణ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. ఈసారి ప్రసాద్ అక్కడే ఉండిపోయారు, సొంతూరుకి వెళ్ళలేదు. కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు.  పృథ్వీరాజ్ కపూర్‌తో తనకున్న సంబంధాల కారణంగా పృథ్వీ థియేటర్స్‌లో చేరారు. అక్కడ తన నటనా పిపాసను చల్లార్చుకున్నారు.] అక్కడ శ్రమించి గొప్పవాడయ్యాడు.

***

అప్పట్లో 1947లో నేను ప్రజా నాట్య మండలిలో చురుకుగా ఉన్నాను. ఈ సంస్థ పని మీదే నేను బెజవాడ వెళ్లాను. మా బృందం నుంచి కొత్త ఆర్టిస్టులను ఎంచుకోవడానికి ఎల్.వి. ప్రసాద్ గారు వచ్చారు. ఆయన మా ఆఫీసుకు వచ్చినప్పుడు నేను మొదటిసారిగా ఆయనను కలిసాను. ఆయన ఒక నాటకంలో నటించారు కూడా. ఆయన నటన నాకెంతో నచ్చింది, ఆయన నటన మానేసి దర్శకత్వం వైపు ఎందుకు వెళ్ళారో నాకిప్పటికీ అర్థం కాలేదు. ఆయనకి సహాయకుడిగా ఉండాలనే కోరికను వెలిబుచ్చాను. “బాగా కష్టపడి పనిచెయ్యాలి, అందుకు సిద్ధమయితేనే రా” అన్నారు. నేను, ఎన్.టి.ఆర్ ఇద్దరం ఒకేసారి మద్రాసు వెళ్ళి ఆయనకు కలిసాం.

అప్పట్లో ప్రసాద్ గారు ‘ద్రోహి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన అందులో నటించారు కూడా. ఆ సినిమాకి నేను సహాయ దర్శకుడనయ్యాను. ఈ కొద్ది సమయంలోనే సినిమా నిర్మాణం గురించి ఎంతో నేర్చుకున్నాను.  నేను కొత్తవాణ్ణే అయినా, ఆయన నన్ను బాగా ప్రోత్సహించారు, కొన్ని సీన్‍లు నన్నే తీయమన్నారు. అప్పటి వరకు నాకు ప్రజా నాట్య మండలి పనులే తెలుసు. ఆయన నాకిచ్చిన ప్రోత్సాహం నేనెన్నడూ మరువలేను.

పెద్ద, చిన్న ఆర్టిస్టులకు ఆయన దర్శకత్వంలో నటించడం చాలా సులువుగా ఉందేది, ఎందుకంటే ఆయన స్వయంగా నటించి చూపించేవారు. ‘ఈ ఆర్టిస్టుల కన్నా ఈయన నటన చాలా బావుంది, ఈయన ఎందుకు నటించరు?’ అని నేను ఎన్నో సార్లు తల గోక్కునేవాణ్ణి. ‘ఓ మంచి దర్శకుడికి – నటీనటుల నుంచి సరైన ప్రదర్శన రాబట్టుకునేందుకు సముద్రం అంత ఓపిక ఉండాలి’ అని ఆయన నాకు చెప్పారు. సాధారణంగా ప్రసాద్ గారికి కోపం రాదు. ఒకవేళ ఎవరి మీద అయినా కోపం వస్తే, గట్టిగా ఏమీ అరవరు. ఆ వ్యక్తితో మాట్లాడడం మానేస్తారు అంతే. ఒకరోజు నేను ఆయనకి కోపం తెప్పించాను. అప్పట్లో ఆయన ‘షావుకారు’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నేను సహాయ దర్శకుడిని.  రీ-రికార్డింగ్ కోసం సినిమా ప్రతీ రీలుని తీసుకువచ్చే బాధ్యత నాకు అప్పజెప్పారు. ఒక రీల్ ఆలస్యమైంది, ఎడిటర్ గారు పంపిస్తున్నా, దారిలో ఉంది అని నాకు చెప్పారు. ప్రసాద్ గారికి చెప్పవద్దన్నారు. అందుకని, రీలు వస్తోంది, దారిలో ఉంది అని ప్రసాద్ గారికి చెప్తూనే ఉన్నాను. చివరికి రీలు మధ్యాహ్నానికి వచ్చింది. అప్పుడు వెళ్ళి ఇచ్చాను. ప్రసాద్ గారికి బాగా కోపం వచ్చింది. నాతో మాట్లాడడం మానేశారు. రెండు రోజుల తరువాత ఇంక ఆగలేక జరిగినదంతా ఆయనకు చెప్పేశాను. ‘నువ్వు అలా చేసుకుండకూడదు. ఏం జరిగినా, నాతో ఎప్పుడూ నిజాయితీగా ఉండు’ అన్నారు.

‘షావుకారు’ తర్వాత ‘పల్లెటూరు’ సినిమాకి నాకు అవకాశం వచ్చింది. నా సొంతంగా నాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం అదే మొదటిసారి. ప్రసాద్ గారి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాను. ఆయన ఎంతో సంతోషించి, నన్ను దీవించారు. ఆయన ఇచ్చిన ప్రోత్సహం నాకిప్పటికీ గుర్తొస్తొంది. ఆ రోజుల్లో అలాంటి గొప్పవారు ఉండేవారు.

ఎల్.వి. ప్రసాద్ గారితో తాతినేని ప్రకాశ రావు గారు

ఆయన దీవెనలతో ఒక దాని తర్వాత ఒకటిగా నాకు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ప్రతీ అవకాశం గురించి ఆయనకు చెప్పేవాడిని, కథ గురించి, ఇతర అంశాల గురించి ఆయనతో చర్చించేవాడిని. ఆయన కూడా నాతో మాట్లాడేందుకు అంతే ఉత్సాహంగా ఉండేవారు.

ఒకరోజు ఆయన, తన కుమార్తె‍తో కలిసి ‘చరణదాసి’ సినిమా ప్రీమియర్ షోకి వచ్చారని తెలిసి, పరుగున వెళ్ళి – ఆయనని కూర్చున్న చోటే పలకరించి నమస్కరించాను. వారితో కూర్చుని సినిమా చూశాను. కనుచివరల నుంచి ఆయన స్పందనలు గమనిస్తున్నాను. సినిమా పూర్తయ్యాకా, ఎలా ఉందని ఆయనను అడిగాను. సినిమా చాలా బావుందని వాళ్ళ అమ్మాయి అన్నారు. తనకీ నచ్చిందని ప్రసాద్ అన్నారు. “ఇప్పుడు నీ గురువుగా నేను ఇంత కన్నా మంచి సినిమా తీయాలి” అన్నారు. ఈ ప్రశంసని నేను జీవితాంతం మరిచిపోలేను. అంత విలువైనది ఇది.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here