అలనాటి అపురూపాలు-110

1
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సుస్వరాల స్వరకర్త ఒ.పి. నయ్యర్:

ఏ రకం శాస్త్రీయ సంగీతంలోనూ శిక్షణ పొందని ఏకైక స్వరకర్తని తానేనని ఒ.పి.నయ్యర్ చాలాసార్లు అంటూండేవారు, తన ప్రతిభ దైవదత్తమని అనేవారు.

ఓం ప్రసాద్ నయ్యర్‍ని ‘మెలొడీ కింగ్’ అని పిలుస్తారు. ఏ మూడ్‍కైనా నప్పే బాణీని కట్టడంలో ఆయన నేర్పు – ఆయన్ని హిందీ సినిమాలలో గొప్ప సంగీత దర్శకులలో ఒకరిగా చేసింది. నయ్యర్ గారి పాటలను జనాలు ఇంకా ఆస్వాదిస్తున్నారంటే – అది ఆ యా పాటల పట్ల జనాల ఆసక్తి, అభిరుచే కారణం. ఆయన పాటల్లో దేన్నయినా తీసుకోండి, వాయిద్యాలతో తనదైన ప్రతిభతో ఒక ప్రత్యేకమైన లయ సృష్టిస్తారాయన. “యే లో మై హారీ పియా” (ఆర్ పార్), “ఆయీయే మెహెర్‌బాన్ బైఠీయే జానే జా” (హౌరా బ్రిడ్జ్), “దిల్ పర్ హువా ఐసా జాదూ” (మిస్టర్ అండ్ మిసెస్ 55), “హుజూర్-ఎ-వాలా” (యే రాత్ ఫిర్ నా ఆయేగీ) లేదా “ఏక్ బార్ ముస్కురాదో” (ఏక్ బార్ ముస్కురాదో) పాటలు ఇందుకు గొప్ప ఉదాహరణలు. ప్రతీ స్వరం (నోట్) లోనూ అద్భుతమైన లయని గమనిస్తాం. “ఆయీయే మెహెర్‌బాన్ బైఠీయే జానే జా” , “హుజూర్-ఎ-వాలా”  పాటలలోని ప్రారంభ స్వరాలు చాలు – నయ్యగ్ గారి విశేషమైన beat patterns శ్రోతలని ఏ విధంగా అలరిస్తాయో చెప్పేందుకు.

సినీ సంగీతంలో లయ ప్రధానంగా ఎన్నో హిందీ పాటలున్నాయి, ఈ రంగంలో విశేషంగా రాణించిన ఎందరో సంగీత దర్శకులున్నారు. కానీ ఒ.పి. నయ్యర్‌లా అసాధారణ లయబద్ధమైన సంగీతం అందించనది అతి తక్కువమందే.  అందుకనే ఆయనని ‘రిథమ్ కింగ్’ అని అంటారు. ఆయన పేరు లోని తొలి పదమే – విశ్వ నాదం నుంచి ఉద్భవించినది కదా – అదే ఓం!

ఆశా భోస్లే గొప్ప ఆస్తి అని ఆయన తరచూ అనేవారు. ఆమె అద్భుతమైన గాయనిగా రాణించడంలో నయ్యర్ పాత్ర తక్కువేమీ కాదు. లతా మంగేష్కర్‌ని కాదని, ఆశాని ప్రోత్సహించడంలో ఆయన మొండి పట్టుదల, దూరదృష్టి ఉంది. ఆశాకి పేరొచ్చినప్పుడు ‘విధి రాసి పెట్టింది’ అన్నారు. లతా మంగేష్కర్‌కి అవకాశాలు ఇవ్వని సంగీత దర్శకుడిగా నయ్యర్ చరిత్రలో గుర్తుండిపోతారు.

‘రిథమ్ కింగ్’ స్థాయి నుంచి చివరి రోజులలో ఒక హోమియోపతి ప్రాక్టీషనర్ స్థాయికి చేరి జీవితాన్ని అనామకంగా గడిపారు నయ్యర్.

నేను ఆయన్ని హైదరాబాద్ సాగర్ హోమియో స్టోర్స్‌లో కలిసాను. చీకట్లో కూడా టోపీ పెట్టుకుని ఉన్నారు. నేను నా పాకెట్ మర్చిపోతే, ఆయన నన్ను పిలిచి దాన్ని అందించారు. నా అభిమాన సంగీత దర్శకుడిని చూసినందుకు నా కళ్ళు మెరిసాయి. ఆయన గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఓంకార్ ప్రసాద్ నయ్యర్ (16 జనవరి 1926 – 28 జనవరి 2007) అప్పటి బ్రిటీష్ ఇండియాలోని (ప్రస్తుతం పాకిస్తాన్ లోని) లాహోర్‍లో జన్మించారు. ఆయనకి సంగీతమంటే ఇష్టం. సంగీతంలో ఎలాంటి శిక్షణా లేకపోయినా, సంగీత దర్శకుడవ్వాలని ఇల్లు వదిలారు. ‘కనీజ్’ (1949) చిత్రానికి నేపథ్య సంగీతం అందించడం ద్వారా మొదటి అవకాశం పొందారు. తాను ప్రేమించిన సరోజ్ అరోరాని 19 మే 1951 నాడు వివాహం చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఆయనకి ఓ టెలిగ్రాం వచ్చింది. “మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాం. వెంటనే రండి” అని ఉంది దానిలో. అది పంపినది దాల్‌సుఖ్ పంచోలీ, సుప్రసిద్ధ నిర్మాత. స్వరకర్తగా ఇది నయ్యర్‍కి తొలి అవకాశం – ఆ సినిమా ‘ఆస్మాన్’. తరువాత బాజ్, ఛమ్ ఛమా ఛమ్ అనే రెండు సినిమాలకి పని చేశారు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. దాంతో సినీ ప్రపంచంలో ఆయన తొలి దశ ముగిసినట్లయింది. ఈ సినిమాల లోని పాటలను విన్నట్లయితే, వాటి పై న్యూ థియేటర్స్ ప్రభావం స్పష్టంగా గమనించవచ్చు.

ఈ మూడు సినిమాల పరాజయం కారణంగా, బొంబాయి విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నారు నయ్యర్. అప్పుడే ప్రసిద్ధ డిస్ట్రిబ్యూటర్ కె.కె. కపూర్ జోక్యం చేసుకున్నారు. ఫలితంగా గురుదత్ గారి ‘ఆర్ పార్’లో అవకాశం దొరికింది. నయ్యర్ గారి హోటల్ గదినంతా – Bing Crosby తో సహా, ఇతర పాశ్చాత్య సంగీత రికార్డులతో నింపేసారట గురుదత్. వాటిని విని వాటి లాంటి సంగీతం సృష్టించమని కోరారుట. ఫలితమే ఆర్ పార్ సినిమా సంగీతం! గురుదత్ దర్శకత్వ ప్రతిభకు సంగీతం తోడై సినిమా ఘన విజయం సాధించింది. నయ్యర్ కూడా కొత్త గుర్తింపు వచ్చింది. సంగీత దర్శకుడిగా ఆయనకి అత్యంత విజయవంతమైన రెండవ దశ ఇది. 1959 లో ‘దో ఉస్తాద్’ సినిమా విడుదలయ్యే వరకూ ఇది కొనసాగింది. ఈ దశలో ఆయన – మిస్టర్ అండ్ మిసెస్ 55, సిఐడి, ఛూమంతర్, హమ్ సబ్ చోర్ హై, నయా దౌర్, తుమ్‌సా నహీ దేఖా, హౌరా బ్రిడ్జ్, ఫాగున్ తదితర విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించారు. ఈ సినిమాలో విజయాలలో నయ్యర్ సంగీతం పాత్ర ఎంతైనా ఉంది. నయ్యర్ ప్రజాదరణకి నిదర్శనం – రేడియో సిలోన్‍లో – అలనాటి బినాకా గీత్‍మాలా కార్యక్రమం. ఒక్కోసారి మొత్తం 16 పాటలు వినిపిస్తే, అందులో 14 పాటలు నయ్యర్ సంగీతం సమకూర్చినవే ఉండేవి. ఈ కాలంలో ఆయన 38 సినిమాలకు సంగీతం సమకూర్చారు. వాటిలో 307 పాటలున్నాయి. క్లారినెట్, ఫ్లూట్, వయోలిన్, మేండలిన్, ఎలెక్ట్రిక్ గిటార్, డబుల్ బేస్, సెల్లొ, హార్మోనియం, సారంగి, ఇంలా లయబద్ధమైన డోలక్, కాస్టనెట్, బోంగో, చైనీస్ బాక్స్ వంటి వాటి మేళవింపుగా ఉండేది ఆయన ఆర్కెస్ట్రేషన్. ఒపి పాట ముందుగా అద్భుతమైన వాయిద్యాలతో ప్రారంభమయి, ఆ తరువాత ‘ముఖడా’ పాశ్చాత్య బీట్‌ల నడుమ సాగేది. ఇంటర్‍ల్యూడ్ మ్యూజిక్ ప్రధానంగా క్లారినెట్, ఫ్లూట్, వయోలిన్, మేండలిన్‌ల మేళవింపుతో ఉండేది. ‘అంతర’కి వచ్చేసరికి ఢోలక్ బీట్లు – మళ్ళీ అక్కడి నుంచి ‘ముఖడా’ పాశ్చాత్య బీట్‌లతో సాగేది. మరో విశేషం – మూడు చరణాలను మూడు నిమిషాల రికార్డులో 78 ఆర్‌పిఎం‍లో ఒదిగేలా చూసేవారు. ట్యూన్ కూడా హమ్ చేయడానికి వీలుగా ఉండేది. దీనివల్లా ఆయా పాటలు సాధారణ ప్రజలు సైతం పాడుకోవడానికి హాయిగా ఉండి, వాటికి విశేష ఆదరణ లభించేది. గీతా దత్, శంషాద్ బేగం, ఆశా భోస్లే, రఫీ ఆయన ఎక్కువగా పాడించిన గాయకులు.

‘దో ఉస్తాద్’ సినిమా అయ్యాకా, ఓ ఏడాది పాటు ఆయన ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సంగీతాన్ని స్వరపరిచే తన పాత శైలిని గురించి ఆయన ఆలోచించుకోవాల్సి వచ్చింది. బహుశా ఆ శైలికి కాలదోషం పట్టిందేమో! అందుకే, శశిధర్ ముఖర్జీ గారి ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా’ చిత్రానికి అవకాశం వచ్చినప్పుడు ఆయన కొత్త సంగీత శైలిని సృష్టించుకున్నారు, ఆయన సంగీతం ఇప్పుడు అధికంగా శ్రావ్యమయింది, పైగా ఆయన గీతాల నాణ్యత పైన శ్రద్ధ చూపించారు. సారంగితో సహా సితార్, సరోద్, తార్ షెహనాయి వంటివి ఉపయోగించి తన సంగీతాన్ని పూర్తిగా రూపాంతరం చెందించి, మాధుర్యపు మహిమని పెంచారు. పాశ్చాత్య శైలి ఆధారితమైన లయ కోసం గిటార్ కోర్డ్స్/డ్రమ్ బీట్స్, స్పానిష్ బ్రష్ ఉన్నాయి. ధోలక్ కొనసాగింది, కానీ తబలాని అధికంగా ఉపయోగించారు. ఆశా భోస్లే కూడా ఈ సమయానికి గాయనిగా పరిణతి సాధించారు. దాంతో ఆయన గాయనీగాయకుల ప్రతిభ గురించి భయపడకుండా ప్రయోగాలు చేయడానికి వీలు కలిగింది. ఫలితంగా అత్యుత్తమమైన, అత్యంత రమణీయమైన పాటలను చేయగలిగారు. ఇవి ఆయన పాత పాటల కంటే విభిన్నంగా ఉన్నాయి.

ఎన్నో సినిమాలు వాణిజ్యపరంగా విజయవంతమై, ఆయన కెరీర్‌ని పైకి తెచ్చాయి. ఈ దశ 1972లో ‘ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే’ చిత్రం తరువాత ఆశా భోస్లేతో విడిపోయే వరకు కొనసాగింది. ఈ దశలో ఆయన 25 సినిమాలో 186 పాటలకు సంగీతం అందించారు. ఈ దశలో గాయనిగా అన్ని పాటలు ఆశాకి మాత్రమే దక్కాయి. నయ్యర్ రెండవ, మూడవ దశలలో గాయకుడిగా ప్రధానంగా రఫీనే కొనసాగారు. రఫీతో అభిప్రాయ భేదాలొచ్చినప్పుడు మహేంద్ర కపూర్‍కి కొన్ని పాటలు పాడే అవకాశం దక్కింది. ఆశో భోస్లేతో విడిపోయాక, నయ్యర్ 20 ఏళ్ళలో 12 సినిమాలలో 80 పాటలకు సంగీతం అందించారు, కానీ ఆయన పెద్దగా తన శైలిని మార్చుకోలేదు. మొత్తంగా ఆయన అన్ని సినిమాలకు కల్పి 600 పాటలకు సంగీతం అందించారు, తెలుగు సినిమా ‘నీరాజనం’ లోని 10 పాటలతో సహా. విడుదల అవలేని సినిమాలకు 29 పాటలందించారు.

నయ్యర్ భార్య సరోజ్ మోహిని . నయ్యర్ ‘ప్రీతమ్ ఆన్ మిలన్’ అనే పాటని రాశారు (ఈ పాటని తొలుత 1945లో సి.హెచ్. ఆత్మ పాడారు, తిరిగి ఆ పాటని ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ సినిమాలో ఉపయోగించుకున్నప్పుడు – గీతా దత్ పాడారు). కుటుంబంలో గొడవలు చెలరేగగా, తన అంత్యక్రియలకి వారెవ్వరూ హాజరు కాకూడని నిషేధించారు నయ్యర్. తన ఇంట్లోంచి బయటకు వచ్చేసి విరార్‍లో స్నేహితుడి ఇంట కొన్నాళ్ళు, ఆపై మరో స్నేహితుడితో థానేలో ఉన్నారు. ఆయన 28 జనవరి 2007 తేదీన మృతి చెందారు. ఆయ్నకి భార్య, ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు అందరినీ అలరిస్తున్నాయి.

***

నయ్యర్‍తో దాదాపు రెండు దశాబ్దాలు కలిసి పని చేసిన మరాఠీ గాయని మాధురి జోగ్లేకర్ ఆయన గురించి, తన గురించి చెప్పుకొచ్చారు. ‘రిథమ్ కింగ్’కీ, తనకీ ఎలా బంధం కలిసిందో చెప్పారు. 1950ల నుంచి 70ల వరకు – గీతా దత్, శంషాద్ బేగం, ఆశా భోస్లే లతో విస్తృతంగా పాడించిన నయ్యర్ ఆ తరువాత కొత్తవారిని ప్రోత్సాహించారు. మాధురి సమక్షం – నేపథ్య సంగీతంగా – స్వతస్సిద్ధంగా, అణకువగా ఉండేది. కొన్ని బంధాలు – సాంప్రదాయాన్ని తోసిపుచ్చుతాయి, నిర్వచనాలకు అందవు, తమ సొంత జీవితాన్ని అల్లుకుంటాయి. ఆమె ఏమంటున్నారో చదవండి:

కర్మ సంబంధం:

నయ్యర్ చనిపోయినా, ‘నిన్ను నా నుంచి ఎవరూ విడదీయలేరు’ అనే ఆయన మాటలే నన్ను వెంటాడుతున్నాయి. ఆయన మృతి చెందిన రోజు (28 జనవరి 2007) గురించి చెబుతూ, “ఆయన చనిపోవడానికి ఒక రోజు ముందు, నాకు హై బిపి వచ్చింది. అందుకని ఆయనకి ఫోన్ చేయలేకపోయాను. ఆ మర్నాడు మా కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమం కోసం థానే వెడుతున్నాను. ఇంటి వద్ద ఒంటరిగా ఉండడం ఇష్టం లేక, నేను కూడా మా వాళ్ళతో వెళ్లాను. ఆయనకి నచ్చే నల్ల చీర, నగలు ధరించి వెళ్ళాను. అయితే అక్కడికి చేరుకున్నాకా నాకు ఫోన్ వచ్చింది, ఆయన చనిపోయారనే కబురుతో. వెంటనే నేను అక్కడ్నించి బయల్దేరి ఆయన చివరి చూపుకి వచ్చాను. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నట్లయితే – నగర శివార్లకు చేరుకోవడానికి నాకు కష్టమయ్యేది. ఆయన ఆత్మే నన్ను పిలిచినట్లనిపించింది. ఆరోజే నాకర్థమైంది మా బంధం ప్రత్యేకమైనదని” అన్నారామె.

తొలి రోజులు:

1970 తొలినాళ్ళలో మాధురినీ, నయ్యర్‌నీ సంగీతం కలిపింది. అప్పట్లో మాధురి ఓ గాయని. సంగీతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆమె నయ్యర్ అసిస్టెంట్ బాపు సింగ్ వద్ద రికార్డింగ్ చేస్తున్నాను. అప్పుడామెను నయ్యర్ గాయక బృందంలో చేరుతారా అని బాపు సింగ్ అడిగారట. “నేను ఒప్పుకున్నాను. బాపూ మరికొంత మంది పాడగలిగే అమ్మాయిలని తీసుకురమ్మన్నారు. నా బృందంలో పాడే అమ్మాయిలను అడిగితే, ఎవరూ ఒప్పుకోలేదు. అప్పట్లో నయ్యర్ గారిపై ఎందుకో నిషేధం ఉండేది (యువతపై చెడు ప్రభావం అనే మిషతో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో నయ్యర్ పాటలను నిషేధించింది). అందుకని నేను వేరే బృందం నుంచి గాయనిలను తీసుకువచ్చాను.” చెప్పారామె. వాళ్లు పాటలు పాడిన ఆ సినిమా రతన్ మోహన్ గారి ‘హీరా మోతీ’. “నయ్యర్ గారు బాగా ఉద్విగ్నంగా ఉన్నారు. ఆయనపై నిషేధం ఎత్తివేశాక వస్తున్న మొదటి సినిమా అది. పైగా మేం ఆయనకు బాగా పరిచయం ఉన్న బృందం కాదు. రికార్డింగ్ అయిపోయాకా, ఆయన బాగా ఏడ్చారు. అంత బాగా జరుగుతుందని ఆయన అనుకోలేదట” గుర్తు చేసుకున్నారు మాధురి. “కోరస్ గాయనీగాయకులను కుదిర్చినందుకు నాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతే, తర్వాతి 20 ఏళ్ళు, నేను ఆయన పక్కనే నిలబడ్డాను” చెప్పారామె. అప్పుడామె వయసు 22, ఆయనకి 48. అయినా ఏ ఇబ్బంది రాలేదు.

ఆ తరువాత ఆయన ‘ఖూన్ కా బద్లా’, ‘బిన్ మా కే బచ్చే’, వంటి ఎన్నో సినిమాలకు పని చేశారు. వాటిలో పాటలు పాడడానికి ఆయని గాయని కావాలి (అప్పటికే ఆశా భోస్లేతో ఆయనకు అభిప్రాయ భేదాలొచ్చాయి). అప్పుడు మాధురి ఆయనకి ఉత్తరా కేల్కర్, పుష్పా పగ్ధారే వంటి గాయనీమణులను ఆయనకు పరిచయం చేశారు. కానీ ఆయన మాధురికి ఎందుకు అవకాశం ఇవ్వలేదో తెలియలేదు. “ఓ గాయనిగా, నాకూ అవకాశం వస్తుందని వేచి చూశాను. గ్లామరస్ జీవితం ఎవరికి ఇష్టం ఉందదు? కానీ నేను పాడడం ఆయన కిష్టం లేదు. నాకు అవకాశం ఇవ్వమని నిర్మాతలు సూచించినా, ఆయన అంగీకరించలేదు. ‘ఆమె పాడదు’ అని నిష్కర్షగా చెప్పేవారు. నేనంటే ఆయనకి పొజెస్సివ్‍నెస్ పెరిగింది. ‘నీకు నేనున్నాను కదా, నువ్వు పాడాల్సిన అవసరం ఏముంది’ అనేవారు. నన్ను కోరస్‌లో కూడా పాడించడం ఆపేసారు.” చెప్పారామె. తరువాత మాధురి నయ్యర్ స్వరపరిచిన ‘ది లవ్స్ ఆఫ్ రూనా లైనా’ ఆల్బమ్‍కి గీత రచన చేశారు.

ఆయన పెట్టిన ఆంక్షల గురించి చెప్పారు. “ఆయన తన కుటుంబం నుంచి విడిపోయారు (అప్పట్లో వార్డెన్ రోడ్ లోని మిరామార్ లోని తన రిహార్సల్స్ గదిలో ఉండేవారు). ఆయనకు కావలసినవాళ్ళలో నేను మిగిలాను. అందుకే ఆయనకి నేనంటే పొజెస్సివ్‍నెస్. నాకన్నా బాగా పెద్దవారు కాబట్టి గౌరవంగా ఆయన బాధ్యతలు చూసేదాన్ని. అప్పట్లో నేను చర్చ్ గేట్ లో ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తుండేదాన్ని. ప్రతీ రోజూ ఉదయం ఆఫీసుకి వెళ్ళే ముందు, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఆయనని కలిసేదాన్ని. ఆయనకి హోమియోపతి మందులు తెచ్చివ్వడం లాంటి చిన్న చిన్న పనులు చేసిపెట్టేదాన్ని.” చెప్పారామె. ఆయన చర్చ్ గేట్‌లో తనింటికి మారినా మాధురి రాకపోకలు కొనసాగించారు.

స్వరమేళనంలో:

ఆయన విశేష వ్యక్తిత్వమే తనని ఆయనకి దగ్గర చేసిందని మాధురి చెబుతారు. “ఆయనకి ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ భాషలపై మంచి పట్టు ఉండేది. అందరూ ఆకర్షితులయ్యేలా మాటల్లో అతి చక్కని పదాలు వాడేవారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లపై చక్కని అవగాహన ఉండేది. ఆయన మాట్లాడుతుంటే వింటూనే ఉండాలని అనిపిస్తుంది. ఆయన సంగీతం నేర్చుకోలేదు. ఆయన ప్రతిభ దైవదత్తం. ఆయనని తన పాటలు వినడం ఇష్టం ఉండేది కాదు. పైగా అప్పట్లో ఇంట్లో రేడియో వుండేది కాదు. ఆయన ఎప్పుడూ హార్మోనియం ముందు కూర్చునేవారు కాదు. ఒక సినిమాకి సంగీతం కోసం సంతకాలయ్యాకనే, ఆయన బాణీలు కట్టేవారు. ఆయనే డమ్మీ పాటలు రాసుకుని వాటికి అనుగుణంగా రెండు రోజుల్లో బాణీలు కట్టేవారు. ఆయనకి జ్యోతిష్యంలోనూ మంచి ప్రావీణ్యం ఉంది” చెప్పారు మాధురి.

“ఆయన నిజాయితీయే నన్ను ఆయనకు దగ్గర చేసింది. నాతో ఎన్నడూ అబద్ధం చెప్పలేదు, నా దగ్గర ఏదీ దాచలేదు. ఆయన ఎంతగా దాపరికం లేకుండా ఉన్నారో, నేను అంతగా ఆయను మద్దతుగా ఉన్నాను. మా మధ్య కపటం లేదు” అన్నారామె. “ఓ మహిళ పురుషుడికి ప్రేరణ. నేను చిన్నదాన్ని, సంగీతం గురించి తెలుసు. ఒక కళాకారుడు, కళాకారుల నుంచే ప్రేరణ పొందుతాడు. నేను ఆయనకు ప్రేరణని” చెప్పారు మాధురి.

పరిస్థితుల ప్రభావం వల్ల వీరిద్దరూ 1989లో విరార్‌కి మారారు. అప్పుడు నయ్యర్ ‘నిశ్చయ్’ (సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్‍), ప్రాణ్ లాల్ మెహతా గారి ‘జిద్’ సినిమాలకు సంతకాలు చేశారు. “నేను ఆఫీసుకు అప్ అండ్ డౌన్ చేస్తూండేదాన్ని. కానీ ఆయనకి వంట చేసి వెళ్ళేదాన్ని. ఆయనకి బటటావడ, ఆలూ మటర్, చికెన్, చైనీస్ ఫుడ్, గోబో పరోటాలంటే ఇష్ట్ం” నవ్వుతూ చెప్పారామె. సింగిల్ వుమన్ అయినప్పటికీ సమాజానికి వెరవలేదు ఆమె. “మేం అప్పటికే 14 ఏళ్ళుగా కలిసి ఉన్నాం! ఆయనకి నా మద్దతు అవసరం. నేను ఎందుకు ఆయనతో ఉండకూడదు?” అన్నారు. “మా కుటుంబం అభ్యంతరం చెప్పింది, ఈ బంధం నుంచి నన్ను  బయటకు లాగాలని చూసింది. కానీ నేనెవ్వరి మాట వినలేదు” చెప్పారు మాధురి.

పెళ్ళి చేసుకుని ఉంటే సమస్య తీరేదా? అని అడిగితే, “పెళ్ళి చేసుకుందామని ఆయన ఎప్పుడూ అనలేదు. అసలా ప్రస్తావనే మా మధ్య ఎప్పుడూ రాలేదు. ఆయన పట్ల నా ప్రేమ నిజాయితీ, విశ్వాసంతో కూడినది. నాకెప్పుడూ (ఇతర స్త్రీల వలె) ఆయన పట్ల పొజెస్సివ్‍నెస్ కలగలేదు, ఎందుకంటే ఆయన నాతోనే ఉండేవారు కదా. ఎమోషనల్‍గా నేను బావుండేదాన్ని. ఆయన్ని ఎప్పుడూ తప్పుదారి పట్టించననీ ఆయనకూ తెలుసు. చిన్నపిల్లాడిలా అన్ని విషయాలు నాతో పంచుకునేవారు” అన్నారామె. తమ విరార్ ఇంటి రోజుల గురించి చెబుతూ, “నేను ఆయనని నిభాయించేదాన్ని, ఆయన చిరాకులనీ, కోపాన్నీ తట్టుకునేదాన్ని. ఆయన మొండివారైనా, నా మాట వినేవారు. నాకు తెలిసినదల్లా ఆయనను బాగా చూసుకోవాలన్నదే. మాది సాధారణ స్త్రి-పురుష బంధానికన్నా గొప్పది. ఆత్మైక సంబంధం. అది అందరికీ అర్థం కాదు. ఆయన నా ఆత్మీయుడు” అన్నారు.

ఎడబాటు:

రెండు దశాబ్దాలు కలిసి ఉన్నాకా, వారి బంధానికి బీటలు పడ్దాయి, కారణం ఆయన అహం అని అంటారు. “ఆయనో తప్పటడుగు వేశారు. అందుకని 1996లో మేం విడిపోవాల్సి వచ్చింది. ఆయనని విడిచిపెట్టాలని అనుకోలేదు కానీ తప్పలేదు. ఆయన అహంకార స్వభావానికి విరుగుడు లేదు. తర్వాత పదేళ్ళపాటు మేము కలుసుకోలేదు. ఆయన్నెంతో మిస్ అయ్యానని అనిపించేది” అంటూ తమ ఎడబాటు గురించి చెప్పుకొచ్చారు మాధురి. “ఒకసారి ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిసింది. ఆయన ఎలా ప్రతిస్పందించినా, ఫోన్ చేయమని నా అంతరాత్మ ప్రబోధించింది. ఫోన్ చేసి ‘మీతో మాట్లాడవచ్చా’ అని అడిగాను. ‘బేవకూఫ్, నీకు నా అనుమతి కావాలా’ అంటూ నన్ను స్వాగతించారాయన.” అన్నారు మాధురి.

“ఆయన కూడా నన్ను మిస్ అవుతున్నారనీ, నేను ఆయనకు అవసరమని నాకు ఆర్థమైంది. వచ్చి కలవమన్నారు (అప్పట్లో ఆయన థానేలో నఖ్వా కుటుంబంతో ఉంటున్నారు)”

“నేను ఆయన్ని కలిసినప్పుడు ఆయన కళ్ళలో నీళ్ళు! అప్పట్నించి అవకాశం కలిగినప్పుడల్లా ఆయనని కలుస్తూనే ఉన్నాను. నేను నవ్‌సారి నుంచి (ఆమె గుజరాత్‌కి మారిపోయారు) వారానికి రెండు సార్లు ఆయన్ని చూడడానికి వచ్చేదాన్ని. ప్రతీ రోజు ఉదయం తొమ్మిది గంటలకి ఆయనకి ఫోన్ చేసేదాన్ని. నయ్యర్ ఆయనకిష్టమైన చికెన్ వంటకాలు అడిగేవారు. ముందురోజే మా చుట్టాలింటికి వచ్చి, అక్కడ ఆ వంట చేసి పట్టుకుని వెళ్ళేదాన్ని. ఇలా ఆయన మరణించేవరకూ జరిగింది” మెల్లగా చెప్పారామె.

***

మాధురి జోగ్లేకర్ చెప్పిన నయ్యర్ విశేషాలు:

  • 17 ఏళ్ళ వయసులో ఆయన రేడియోలో కబీర్ కే దోహే పాడారు
  • ఆయనకి మెహదీ హసన్, కె.ఎల్. సైగల్ అంటే అభిమానం.
  • ఆయన ‘చైన్ సే హమ్ కో కభీ’ (ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే సినిమా లోని) పాట పాడినప్పుడల్లా, శ్రోతలకు కన్నీళ్ళు ఆగేవి కావు.
  • ఆయన శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా, ఆయన బాణీలన్నీ రాగాల ఆధారితమైనవే.
  • ‘తుహీ మేరా ప్రేమ్ దేవతా’ (కల్పన) పాటకి పిలూ రాగం ఆధారం.
  • ‘జాయే ఆప్’ (మేరే సనమ్) పాట పాశ్చాత్య సంగీతంతో ప్రారంభమవుతుంది. ధోలక్, తబలా ముఖ్య వాయిద్యాలు.
  • ‘దేఖ్ కసమ్ సే’ (తుమ్‍సా నహీ దేఖా) పాటలో ఆయన వైబ్రాఫోన్ వాడారు.
  • ‘ఆప్ కే హసీన్ రూఖ్ పర్’ (బహారేఁ ఫిర్ భీ ఆయేంగీ) పాటలో పియానో విస్తృతంగా వాడారు.
  • ‘చైన్ సే హమ్ కో కభీ’ (ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే), ‘బల్‍మా ఖులీ హవాయేఁ’ (కశ్మీర్ కీ కలీ) వంటి – సినిమా లోని పాటలకి ఆయనకి ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి.

నయ్యర్‍కి ఇష్టమైన పాటలు:

  • ‘ఆప్ కే హసీన్ రూఖ్ పర్’ (బహారేఁ ఫిర్ భీ ఆయేంగీ)
  • ‘దీవానా హువా బాదల్’ (కశ్మీర్ కీ కలీ)
  • ‘చైన్ సే హమ్ కో కభీ’ (ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే)
  • ‘హాత్ ఆయా హై జబ్ సే’ (హమ్‍సాయా)
  • ‘యెహీ వో జగహ్ హై’ (యే రాత్ ఫిర్ నా ఆయేగీ)
  • ‘మాంగ్ కే సాథ్ తుమ్హారా’ (నయా దౌర్)

విలక్షణ నటుడు చదలవాడ కుటుంబరావు:

“హరి హర నారాయణో, ఆది నారాయణో, కరుణించవో అయ్య, కమలాలోచనుడా” అంటూ ఓ పశువుల కాపరి – 1945లో మద్రాసులోని వి.పి. హాల్‌లో ప్రదర్శించిన ‘మా భూమి’ నాటకంలో గొల్ల సుద్దులు పాడారు. ప్రేక్షకులలో సుప్రసిద్ధ నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం కూచుని ఉన్నారు. అత్యంత కఠినమైన విమర్శుకుడిగా ఆయనకి పేరుంది. కానీ ఆయన కూడా కుర్చీలోంచి లేచి ఆ నటుడిని చప్పట్లతో అభినందించారు. ఆయనే చదలవాడ కుటుంబరావు.

ఆయన కృష్ణా జిల్లా ఈడుపుగల్లుకి చెందినవారు.  బాల్యం నుంచే ఆయనకు కళలంటే ఆసక్తి మెండు. నాటకాలన్నా, హస్యమన్నా, వినోదమన్నా, రాజకీయాలన్నా కూడా అయన ఇష్టం ఉండేది. తన కృష్ణా జిల్లా యాసతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేవారు. ఆయన ఓ కమ్యూనిస్ట్. నాటకాలు వేయడానికి, బుర్ర కథలు చెప్పడానికి ఎక్కడికైనా వెళ్ళేవారు. చదలవాడ వేసే గొల్లవాని వేషం, కోగంటి కోయ వేషం, హిట్లర్ వేషం ఎంతో ప్రసిద్ధి పొందాయి.

దేశభక్తి ఉధృతంగా ఉన్న రోజులవి. ప్రజానాట్యమండలి తరఫున ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నెన్నో ప్రదర్శనలిచ్చారు. సినిమాల ద్వారా తమ సందేశాన్ని జనబాహుళ్యంలో విస్తృతంగా ప్రచారం చేయవచ్చని భావించిన ఎందరో కమ్యూనిస్టులు ఆ కాలంలో సినిమాల్లో చేరారు. తన తోటివారిలానే చదలవాడ కూడా సినిమాలలో చేరారు. పల్లెటూరు, పుట్టిల్లు, అంతా మనవాళ్ళే, పరివర్తన, నిరుపేదలు, అర్ధాంగి వంటివి ఆయన తొలినాళ్ళలో నటించిన సినిమాలు. ఆయన వందకు పైగా సినిమాల్లో నటించారు.

తన మిత్రుడు శ్రీ రామమూర్తితో కలిసి ‘సృజన’ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించదలచారు. వారిద్దరూ కలిసి గుమ్మడి, ఎస్. వరలక్ష్మిలతో ‘సతీ తులసి’ చిత్రం నిర్మించారు. అది హిట్ అయింది. ఆ సినిమాకి వి. మధుసూదన రావు దర్శకత్వం వహించారు. వాళ్ళు కమ్యూనిస్టులయినా, అలాంటి సినిమా తీసినందకు అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు నాటకాలను కూడ ప్రోత్సహించి, డబ్బు సంపాదించగలిగారు.

ఒక రోజు – ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ చిత్రం షూటింగ్ చేసి ఇంటికి వచ్చారు. అన్నం తిని నిద్రపోయారు. ఆయన మనవడు టాటా చెప్పి బయటకు వెళ్ళాడుట (ఆయన ఎప్పుడు ఎక్కడ పెళ్ళి చేసుకున్నరన్న విషయం ఆ రోజుల్లో అతి కొద్ది మందికే తెలుసు). ఆయన దగ్గర ఎవరూ లేరు. నోట్లోంచి నురగలు వచ్చాయట. సమయానికి వైద్యం అందలేదు. ఎవరు లేని ఒంటరిలా కన్నుమూశారాయన. ఆ తర్వాత బంధువులు వచ్చి అంత్యక్రియలు జరిపించారు. అందరు బరువైన హృదయాలతో ఇళ్ళకు బయల్దేరారట. (ఆయన గురించి నాకింతకంటే ఎక్కువ తెలియదు).

1954 నాటి ‘పెద్ద మనుషులు’ చిత్రంలో ఆయన నటించిన హాస్య సన్నివేశం నాకెంతో ఇష్టం.

యూట్యూబ్‍లో ఈ లింక్‍లో ఆ సినిమా చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=JYL5ezbinlU

‘కన్యాశుల్కం’ సినిమాలో చదలవాడ, సావిత్రి ల మధ్య హాస్య సన్నివేశం:

https://www.youtube.com/watch?v=AEjPHsMgIqM&t=36s

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here