అలనాటి అపురూపాలు-115

0
11

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ఫిల్మ్ సెమినార్, 1955:

పరిచయం: ఫిల్మ్ ఫైనాన్స్ కార్పోరేషన్ (ఎఫ్.ఎఫ్.సి) నివేదికని అనుసరించి, అప్పటి ప్రధాని నెహ్రూజీ 1955లో జాతీయ స్థాయి ఫిల్మ్ సెమినార్‍ నిర్వహించవలసిందిగా ఆదేశించారు. బి.ఎన్.సర్కార్ చైర్మన్‍గా, దేవికా రాణి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‍గా, పృథ్వీరాజ్ కపూర్ డైరక్టర్‍గా ఆరు రోజుల పాటు జరిగిన ఈ సెనిమార్ – దేశంలో సినీ నిర్మానానికి అవసరమైన వ్యవస్థాపక మార్పులను సిఫారసు చేయడంతో పాటు, నూతన ప్రతిభని ఆకర్షించేందుకు శిక్షణ, నిధులు సమకూర్చుకోవడం కోసం సూచనలు చేసింది.

సంగీత నాటక అకాడమీ స్పాన్సర్ చేసిన ఈ సెమినార్ 1955లో ఫిబ్రవరి 27 నుండి మార్చి 4 వరకు న్యూ ఢిల్లీలో జరిగింది. అప్పటి ప్రధాని నెహ్రూ ఈ సెమినార్‍ను ప్రారంభించారు. దేశంలోని మూడు సినీ కేంద్రాలు (కలకత్తా, బాంబే, మద్రాస్), ఇంకా ఢిల్లీ నుంచి సుమారు 40కి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సెమినార్‍లో 23 పత్రాలను చదివారు. పాల్గొన్నవారు చేసిన ప్రెజెంటేషన్‌లపై తోటి వారు చర్చించారు. పాల్గొన్నవారి జాబితాలు.

బెంగాల్: ఎం.డి. ఛటర్జీ, దేవకి కుమార్ బోస్, సుప్రభ ముఖర్జీ, అజిత్ బోస్, ప్రబోధ్ కుమార్ సన్యాల్, పంకజ్ మల్లిక్, పశుపతి ఛటోపాధ్యాయ, మోమితా సిన్హా, అహింద్ర చౌధురి, మోధు సిల్, సౌరేన్ సేన్, డా. ఆర్.ఎం. రే.

బాంబే: దుర్గా ఖోటే, నర్గిస్, వి.శాంతారామ్, బిమల్ రాయ్, కిషోర్ సాహు, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, అనిల్ బిస్వాస్, కె.ఎ. అబ్బాస్, దేవన్ షరార్, బి.ఎం.టాటా, ఎం.ఆర్. అచ్రేకర్, కె.ఎం. మోడీ, బాబురావ్ కె పాయ్, ఎం. అక్బర్ ఫజల్‍భోయ్, డేవిడ్ అబ్రహం.

ఢిల్లీ: ఉదయ్ శంకర్, నరేంద్ర శర్మ, ఎం. భావ్నాని, ఆర్. రంజన్, సేఠ్ జగత్ నారాయణ్, జగన్నాథ్ ప్రసాద్ ఝాలని, సివి దేశాయ్, నిర్మలా జోషి.

మద్రాస్: ఎస్.ఎస్. వాసన్, బి.ఎన్.రెడ్డి, ఆర్.ఎం. శేషాద్రి, ఎన్.సి.సేన్ గుప్తా, వి.రామస్వామి, మార్కచ్ బార్ట్లే, వైజి దొరైస్వామి

ఈ సెమినార్‌‌కి హాజరైన ఎన్.సి. సేన్‍గుప్తా మాటల్లోనే జరిగిన చర్చని చదవండి. ఆయన ఒక సాంకేతిక నిపుణుడు. విజయ లాబొరేటరీస్ ఇన్‍ఛార్జ్.

“ఫిబ్రవరి 26న ఉదయం నేను, మార్కస్ బార్ట్లే కలిసి మద్రాసు ఎయిరోడ్రోం‍కి వెళ్ళాము. అక్కడ మేం జస్టిస్ పి.వి. రాజమన్నార్‍ గారిని కలిసాం. మేమంతా ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కాం.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నేను, మార్కస్ విడిపోయాం, అతనికి బస కోట భవన్‍లో ఇచ్చారు, నాకేమో, నేషనల్ స్పోర్ట్స్ క్లబ్. బసకి చేరి, తాళాలు తీసుకుని, నా గది వైపు వెడుతుండగా ఎవరో నన్ను ‘TAGGON’ అని పిలిచారు. అది నా బాల్యమిత్రులు నాకు పెట్టిన మారుపేరు కావడంతో ఉలిక్కిపడ్డాను. వెనక్కి తిరిగి చూస్తే – నవ్వుతూ నిలుచున్న అనిల్ బిస్వాస్ కనిపించాడు. గతంలో మేమిద్దరం బాంబే టాకీస్‍లో పని చేశాము. మా సంస్థలో సుప్రభ ముఖర్జీ, దిలీప్ కుమార్, దుర్గా ఖోటే, డేవిడ్, దేవన్ షరార్, మొదలైనవారు పని చేశారు. వీళ్ళంతా స్పోర్ట్స్ క్లబ్ లోనే బస చేస్తున్నందుకు సంతోషం వేసింది. గదిలోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యాను. సాయంత్రం ఆరు గంటలకి మేమంతా రీగల్ బిల్డింగ్స్ సమీపంలోని సంగీత నాటక అకాడమీకి వెళ్లాము. అక్కడ మేము ఈ సెమినార్‍లో పాల్గొనడానికి వచ్చిన అందరినీ కలిసాము. దేవికా రాణి ప్రతి ఒక్కరికీ సెమినార్ ఫైల్ పంచుతూ బిజీగా కనిపించారు. నేను ఆవిడ దగ్గరకి వెళ్ళగానే, ఆవిడ కళ్ళలో మెరుపు! నవ్వుతూ అన్నారు “నువ్వెవరో నాకు తెలియదు” అని. నేను ఆవిడ కోసం బాంబే టాకీస్‍లో పని చేశాను. నన్ను సినిమాలకు ఎంపిక చేసినది ఆవిడే. ఆవిడని దాదాపు 7 లేక 8 ఏళ్ళ తరువాత చూస్తున్నాను. “రా, సేన్‌గుప్తా” అంటూ ఆవిడ నాకు ఫైల్ అందించారు. మర్నాడు అంటే – ఫిబ్రవరి 27 సెమినార్ మొదటి రోజు. ఉదయం మేమంతా నేషనల్ ఫిజిక్స్ లేబొరేటరీ ఆడిటోరియంకు వెళ్ళాము.  ప్రధాని నెహ్రూ సెమినార్‌ని ఆరంభించడానికి వచ్చారు. దేవికా రాణి ఆయనకి పూలమాల వేశారు. ఆ మాల ఎంతో విశిష్టంగా అనిపించింది. దేవికా రాణి భర్త చెప్పారు – ఆ పూలు బెంగుళూరులోని తమ ఎస్టేట్‍ తోటలో పూచినవని. నేను విస్తుపోయాను. నర్గిస్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీకి పుష్పగుచ్ఛం అందజేశారు. శ్రీ పి.వి. రాజమన్నార్ ఉపన్యసించి, ప్రధానిని సెమినార్ ప్రారంభించవలసిందిగా కోరారు. నెహ్రూ సెమినార్‍ని ప్రారంభించి ఉపన్యాసం చేశారు. అనంతరం బి.ఎన్. సర్కార్ మాట్లాడారు. ఈ ప్రసంగాలలో ఉదయపు సెషన్ ముగిసింది. మేము భోజనానికి వచ్చాము. అక్కడ ఓ గొప్ప దృశ్యం కనబడింది. వందలాది మంది ప్రజలు వీధిలో గుమిగూడి తమ అభిమాన తారలు రాజ్ కపూర్, నర్గిస్, దిలీప్ కుమార్ మొదలైన వారిని అబ్బురంగా చూస్తున్నారు.

భోజనం తరువాత మేము ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కౌన్సిల్‍కి వెళ్ళాము. ఈ మధ్యాహ్నపు సెషన్‍లో రాజమన్నార్ గారు, బి.ఎన్. సర్కార్ గారు తమ పేపర్లని చదివి వినిపించారు. వీటిపై చర్చ జరగలేదు. ఆ తరువాత మేం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి భవన్ వెళ్లాము. మేం వెళ్ళిన కొన్ని నిమిషాలకే ఆయన వస్తున్నారని ప్రకటన వచ్చింది. ఆయన తన ఇద్దరు అంగ రక్షకులతో వచ్చి, ఒక కుర్చీలో కూర్చున్నారు. మేమంతా ఆయన వద్దకు వెళ్ళి మమ్మల్ని పరిచయం చేసుకున్నాం. టీ పార్టీలో భాగంగా మాకు సిగరెట్లు అందించారు. ఆ సిగరెట్ పాకెట్లపై ‘ఫ్రం రాజ్ భవన్’ అని రాసుంది. నేను ఒక కిటీకీ వద్ద చేరి మొఘల్ గార్డెన్స్ వైపు పరికించాను. ఎంత అందమైన దృశ్యం! ఇంతలో ఒక చోట నెహ్రూ గారి చుట్టూ జనాలు మూగి ఉండడం కనిపించింది. ఆయన ఎప్పుడు వచ్చారో నేను గమనించలేదు. ఆ రోజు అక్కడ రాష్ట్ర గవర్నర్ల సమావేశం కూడా జరుగుతోంది. వాళ్ళూ కూడా టీ పార్టీకి వచ్చారు. త్రివేది, పట్టాభి వంటి గవర్నర్లను చూశాను.

28 ఉదయం పలహారాలు పూర్తి చేసి ఉదయం సెషన్‍కి హాజరయ్యాం. మొదటి పేపర్ ఎస్.ఎస్. వాసన్ చదివారు. దేశంలోని సినిమా థియేటర్ల సంఖ్య పెరగాలని, సెన్సార్ మార్గదర్శకాలు మరింత సరళమవ్వాలని, సినిమాలకి అవసరమైన ముడి పదార్థాలు, పరికరాలు దేశంలోనే తయారవ్వాలని (ఈ అంశం నా పేపర్‍లో నేనూ పేర్కొన్నాను)  ఆయన సూచించారు. క్లాసిక్ సినిమాలకు ప్రభుత్వ సహాయం లభించాలని, వినోదపు పన్ను తగ్గించాలని కోరారు. వాసన్ ప్రతిపాదించినవాటిని బి.ఎన్.రెడ్డి అంగీకరించడంతో చర్చ మొదలైంది. అప్పుడు భావ్నాని మాట్లాడాడు. అయితే ఆయన మాట్లాడినదాంట్లో ముఖ్యమైనదేదీ లేదని నాకు అనిపించింది. వి.కె. కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం సినీ ప్రముఖులతో సంప్రదించాలని సూచించారు. ఆ తరువాత కృష్ణమోహన్ మరోసారి ఉపన్యసించారు. జనాలు ఆశ్చర్యపోయారు, కానీ నాకు అనిపించింది ఆయన నెహ్రూ తరఫున మాట్లాడుతున్నారని. వారి మధ్య బాగా సాన్నిహిత్యం ఉంది. ఆ మధ్యాహ్నం చైనా నుంచి వచ్చిన సినీ ప్రతినిధుల బృందం సమావేశంలో పాల్గొంది. వారు మద్రాసులో విజయ-వాహిని స్టూడియో సందర్శించి, ఎన్నో విషయాలు గ్రహించి ఇక్కడికి వచ్చారు. ఆ మధ్యాహ్నం సుప్రభ ముఖర్జీ తమ పేపర్ చదివారు. నర్గిస్, దుర్గా ఖోటే ఆ పేపర్ పై చర్చని ప్రారంభించారు. నటన అనేది జన్మతః వస్తుందా, అబ్యాసం వల్లనా అనే అంశం చర్చించారు.

ఆ తరువాత అచ్రేకర్ ఆర్ట్ డైరక్షన్ మీద తన పేపర్ చదివారు. ఈ అంశంపై చర్చకి సౌరేన్ సేన్ నేతృత్వం వహించారు. ఆ సాయంత్రం మేం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‍లో మహిళా సంఘాల స్త్రీలు నిర్వహించిన తేనేటీ విందుకు హాజరయ్యాం. అక్కడ జరిగిన చర్చలో ఓ బృందం సినిమాలని నిషేధించాలని అనడం నాకు వింతగా అనిపించింది. మిగతా వాళ్ళు సినిమాలు బాధ్యతగా తీయాలని అన్నారు.

మార్చ్ 1 న జరిగిన సెషన్‍లో కుంజ్రు – పిల్లల సినిమాల గురించి మాట్లాడారు. విదేశీ వస్తువులను, విదేశీ పరికరాలని నిషేధించాలని శాంతారామ్ తన పేపర్‌లో పేర్కొన్నారు. ఆయన విదేశీ దుస్తులు ధరించి ఈ పేపర్ చదివారు. ఆ మధ్యాహ్నం మాకు భోజనం – ఢిల్లీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ వారు ఛేమ్స్‌ఫర్డ్ క్లబ్‌లో ఏర్పాటు చేశారు. తర్వాతి సెషన్‍లో మధుశీల్, కిషోర్ సాహు తమ పేపర్లు చదివారు. తమకోసం తయారు చేసుకున్న డబ్బింగ్ పరికరం బాగా విజయవంతమైందని మధుశీల్ చెప్పారు. ఈ అంశంపై జరిగిన చర్చకి మార్కస్ బార్ట్లే నాయకత్వం వహించారు.

మార్చ్ 2 న పశుపతి ఛటర్జీ పేపర్ చదువుతూ – నటీనటులు – సాంకేతిక నిపుణుల చేతిలో కీలుబొమ్మలు అని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దేవకీ బోస్ కూడా అభ్యంతరం తెలిపారు. తరువాత మార్కస్ బార్ట్లే తన పేపర్ చదివారు. దీని పై చర్చని రామ్‌నాథ్ ప్రారంభించాలి, కానీ ఆయన రాకపోవడంతో భావ్నాని చర్చని ఆరంభించారు. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. సాంకేతిక అంశాలకి సంబంధించిన పేపర్లు చదువుతున్నప్పుడు ప్రతినిధులు నిశ్శబ్దంగా ఉన్నారు. మిగతా పేపర్లు చదువుతున్నప్పుడు మాత్రం మాట్లాడుకుంటూనే ఉన్నారు.

అక్బర్ ఫజల్‍భోయ్ సినీ పరికరాలపై తమ పేపర్ చదివారు. ఈ పేపర్ పై నేను కూడా మాట్లాడాను. సినీ పరికరాలన్నీ దేశంలోనే తయారవ్వాలని మేం సూచించాము. ఆ తర్వాత సినీ సంగీతంపై అనిల్ బిస్వాస్ తన పేపర్ చదివాడు. ఈ పేపర్ పై చర్చని పంకజ్ మల్లిక్ ప్రారంభించారు. ఆర్టిస్ట్ రంజన్ చర్చలో పాల్గొన్నారు. రంజన్‍ని నేను చూడడం అదే మొదటిసారి. ఆయన అంటే ఎంతో ఇష్టం కలిగింది. సినిమాలకి సంబంధించి అన్ని అంశాలపై, సంగీతంపై కూడా విశేష పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన ఎంతో సృజనాత్మకంగా మాకు వినోదం కలిగించారు. ప్రతినిధుల గదుల తలుపులపై ఆయన వ్యాఖ్యలు రాశారు. నా గది తలుపుపై ‘బ్రహ్మచారి, జాగ్రత్త!’ అని రాశారు. భలే తమాషాగా అనిపించింది.

మార్చ్3న పండిట్ నరేంద్ర శర్మ సినీ గీతాల ప్రాముఖ్యతపై, వాటి సామాజిక బాధ్యతపై అద్భుతమైన పేపర్ చదివారు. దుర్గా ఖోటే తన పేపర్‍లో సినీనటులు సమాజానికి చేస్తున్న సేవలను ప్రస్తావించారు. అది కూడా చాలా మంచి పేపర్. దీనిపై చర్చని నర్గిస్, సుప్రభ కొనసాగించారు.

తరువత ఆర్.ఎం.శేషాద్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, పంపిణీ గురించి చక్కని పేపర్ చదివారు. ఆయన చెప్పిన వాటిల్లో చాలా విషయాలు మాకెవ్వరికీ తెలియవు. ఈ ఫిల్మ్ సెమినార్ లో చదివిన అన్ని పేపర్లలోకి ఇదే ఉత్తమమైనదని భావించాను. తెలివిగా ప్రచారం చేస్తే, సినిమా నిర్మాణ వ్యయంలో కనీసం 17% లాభంగా వస్తుందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం సెషన్‍లో డేవిడ్ – సినీహీరోలపై తన పేపర్ చదివారు. దీనిపై చర్చను అహీంద్ర ఛటర్జీ, దిలీప్ కుమార్ ప్రారంభించారు. సాయంత్రం మేమంతా సంగీత నాటక అకాడమీ వారి ఆడిటోరియంకి వెళ్ళాము. అక్కడ ఓ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. రాత్రి మాకు జగత్ రామ్ చక్కని విందు ఏర్పాటు చేశారు.

మార్చ్4 సెమినార్ చివరి రోజు. సినిమాలో నృత్యాల గురించి ఉదయ్ శంకర్ తన పేపర్‍లో చదివారు. నేను ఫిల్మ్ లేబొరేటరీల గురించి చదివాను. సినీ రచయితలపై తమ పేపర్‍ని కె.ఎ. అబ్బాస్ చదివారు. అనంతరం చర్చలు కొనసాగాయి. ఈరోజు మధ్యాహ్న భోజనానికి మమ్మల్ని బయటకు పంపలేదు. అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ సాయంత్రం నెహ్రూ గారు మాకు టీ పార్టీ ఇస్తున్నారు, దానికి మేం ఆలస్యం కాకూడదని నిర్వాహకులు భావించారు!

దుర్గా ఖోటే వందన సమర్పణ చేశారు; దేవికా రాణి నేతృత్వంలోని సెమినార్ నిర్వాహకుల శ్రమను అభినందించారు. ఓ సినీ తారగా మొదలై, స్టూడియో యజమానిగా దేవికా రాణి ఎదిగిన వైనాన్ని గొప్పగా వివరించారు. హృదయాన్ని తాకే ఈ ఉపన్యాసాన్ని విన్న దేవికా రాణి కళ్ళు చెమర్చాయి. దేవికా రాణి వల్లే ఈ సెమినార్ సాధ్యమయింది. ఈ సెమినార్ జరగకుండా చూడాలని చాలామంది ప్రయత్నించారని విన్నాను. ఇందులో ప్రధాని పాల్గొనడం వారికి ఇష్టం లేదు. ఈ సెమినార్‍కి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ దూరంగా ఉంది. ప్రధాని, రాష్ట్రపతి మాకు ఆతిథ్యం ఇచ్చారు. మా అందరితో వారిద్దరూ బాగా కలిసిపోయారు. దేవికా రాణి వల్లే ఇందంతా సంభవించింది. అనంతరం పంకజ్ మల్లిక్ ప్రార్థనా గీతం ఆలపించారు. సెమినార్ ప్రారంభం కూడా ఆయన ప్రార్థనా గీతంతోనే జరిగింది.

మేము మా ప్రెజెంటేషన్‍లతో తీరిక లేకుండా ఉండడంతో, నేను ఎక్కువగా అందరితో కలుపుగోలుగా ఉండలేకపోయాను. మార్చ్ 5 మధ్యాహ్నం నేను దేవికా రాణి తోను, వారి భర్త నికోలస్ రోరిచ్‍ తోనూ మాట్లాడాను. ఆ దంపతులు నన్ను బెంగుళూరులోని వారి గృహానికి ఆహ్వానించారు. నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుని, మిత్రులతో కలిసి మద్రాసు చేరాను.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here