అలనాటి అపురూపాలు-122

0
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

విలక్షణ నటుడు మోతీలాల్:

అలనాటి బాలీవుడ్ ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరు మోతీలాల్. ఎన్నో సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించారాయన.

మోతీలాల్ రాజవంశ్ 4 డిసెంబరు 1910 నాడు సిమ్లాలో జన్మించారు. వారిది ఓ విశిష్టమైన కుటుంబం. ఆయన తండ్రి ప్రసిద్ధి చెందిన విద్యావేత్త. దురదృష్టవశాత్తు, మోతీలాల్‌కి ఏడాది వయసున్నప్పుడే ఆయన చనిపోయారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో సుప్రసిద్ధ సివిల్ సర్జన్ అయిన మావయ్య ఆయనని పెంచి పెద్ద చేశారు. తొలుత మోతీలాల్‌ని సిమ్లాలోని ఓ ఇంగ్లీషు స్కూలికి పంపారు, తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో చదివించారు. మరి కొన్నాళ్ళకి వారు ఢిల్లీకి మకాం మార్చగా, ఆయన తన పాఠశాల, కాలేజి విద్యని అక్కడే పూర్తి చేశారు.

తన సినీ కెరీర్ గురించి తనకే సొంతమైన హాస్య ధోరణిలో “వందసార్లు పెళ్ళి చేసుకున్నాను, దాదాపుగా రెండు సార్లు చనిపోయాను, కానీ ఎప్పుడూ పుట్టలేదు… ఓ పారాచూట్ కిందకి లాగేసినట్టు నేలకి చేరాను” అని అన్నారాయన.

కాలేజీ చదువు పూర్తి చేసి, నౌకాదళంలో చేరేందుకు బొంబాయి వచ్చారు మోతీలాల్. కానీ అక్కడ జబ్బుపడి, పరీక్షకి హాజరు కాలేకపోయారు. ఆయన కోసం వేరే ఎంపికలు చేసి ఉంచింది విధి. ఒకరోజు దర్శకుడు కె.పి. ఘోష్ సాగర్ స్టూడియోలో సినిమా షూటింగ్ చేస్తుండగా చూడడానికి వెళ్ళారు మోతీ. మౌనంగా షూటింగ్ చూస్తున్న మోతీ, అకస్మాత్తుగా దర్శకుడి దృష్టిలో పడ్డారు. 1934లో (24 ఏళ్ళ వయసులో) సాగర్ ఫిల్మ్ కంపెనీ వారి ‘షహర్ కా జాదూ’ చిత్రంలో హీరోగా అవకాశం వచ్చింది. అంతే ఇక ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తరువాత ఆయన సబితాదేవితో కలిసి డా. మాధురిక (1935) కుల్‌వధు (1937) వంటి సాంఘిక చిత్రాలలో నటించారు. సాగర్ మూవీటోన్ బ్యానర్‌లో – మహబూబ్ ఖాన్ కోసం జాగిర్దార్ (1937), హమ్ తుమ్ ఔర్ ఓ (1938) చిత్రాలలో నటించారు. మహబూబ్ ప్రొడక్షన్స్ వారి తక్‌దీర్ (1943) లో నటించారు. కిదర్ శర్మ గారి ఆర్మాన్ (1942), కలియా (1944) లలో నటించారు. జానపద యోధుడిగానైనా (సిల్వర్ కింగ్), లక్షాధికారిగానైనా (300 Days And After) – ఏ పాత్రనైనా అవలీలగా, జనరంజకంగా పోషించేవారు. 1940 తొలినాళ్ళలో మోతీలాల్ సాహసోపేతమైన కథల కోసం అన్వేషించారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రశంసలు పొందిన ‘అఛూత్’ (1940) సినిమాలో ఆయన అంటరానివాని పాత్ర ధరించారు.

మోతీలాల్ సుమారు 60 సినిమాల్లో నటించగా, కనీసం 30 సినిమాల్లో ప్రధాన పాత్రలలో నటించారు. అయితే చిన్న పాత్రలు కూడా ఆయనకి పేరు తెచ్చిపెట్టాయి. దేవ్‌దాసుని మద్యానికి అలవాటు చేసే పాత్ర చునిబాబు – అత్యంత సులభంగా నెగటివ్ పాత్రగా తోచే ఈ పాత్రను కూడా మోతీలాల్ తన నటనతో ఆకర్షణీయంగా మార్చి, ఉత్తమ సహాయనటుడిగా తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆయన విలనిజం కూడా కొత్తగా, ప్రశాంతంగా ఉంటుంది (ఆనంది, 1959, పైగామ్, 1959). ఆయన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రం – ప్రసిద్ధ రచయిత ఆర్.కె. నారాయణ్ గారి కథ ఆధారంగా తీసిన ‘మిస్టర్ సంపత్’ (1952). ఈ సినిమా టైటిల్ పాత్రలో ఎస్కిమోకి సైతం ఐస్ అమ్మగల ధూర్తుడి పాత్రకు మోతీ ప్రాణం పోశారు. నటి శోభనా సమర్థ్ తన భర్త నుండి విడిపోయాకా, మోతీ ఆమెతో కలిసి ఉన్నారు. ‘హామారీ బేటీ’ సినిమాలో శోభన గారి సొంత కూతురు నూతన్‍కి తండ్రిగా నటించారు. నూతన్‍కి ఇది మొదటి సినిమా. తమ మధ్య ఎంతో ప్రేమ ఉన్నా, అన్నే గొడవలు, వైరుధ్యాలు ఉండేవని శోభన ఒక ఇంటర్వ్యూలో మోతీ గురించి చెప్పారు.

మోతీలాల్ చాలా హుందాగా ఉంటూ, ఉన్నత వర్గాలతో సంచరించేవారు. ఆయన కళ కన్నా ఆయన జీవనశైలి పైనే ఎన్నో కథనాలు ఉన్నాయి. శోభనా సమర్థ్, నాదిరాలతో చేసిన రొమాన్స్, గుర్రపు పందాలు, రేసింగ్, ఫ్లయింగ్, క్రికెట్ వంటివి ఆయన్ని వార్తలలో నిలిపాయి. ఆయన గుర్రపు పందాల అలవాటు గురించి ఒక కథ ప్రచారంలో ఉంది – ఫినిషింగ్ లైన్ పూర్తి చేసేటప్పుడు ఓ గుర్రం ఆయనకేసి చూసి, ఓడిపోయేదట – అందుకని దానికి ‘ట్రైటర్’ అని పేరు పెట్టారట. సరదా మాట్లాడడానికి ప్రసిద్ధి చెందిన మోతీ, ఓ జర్నలిస్టుతో “నేను మూడు గుండె పోటులను తట్టుకున్నాను, ఒక విమాన ప్రమాదం నుంచి బయటపడ్డాను, ఒకసారి నీళ్ళలో మునిగిపోబోయి రక్షించబడ్డాను – అలాగే ఎన్నో చెత్త సినిమాలు చేయకుండా తప్పించుకున్నాను” అని అన్నారని 1965లో ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆయన ఒక భోజ్‌పురి సినిమా ‘సోలాహో శింగార్ కరే దుల్హనియా’ (1965)లో నటించారు. అది చరిత్రలో కలిసిపోయింది. తానే రాసి, దర్శకత్వం వహించి నిర్మించిన ‘ఛోటీ ఛోటీ బాతేం’ సినిమాను ఎట్టకేలకు పూర్తి చేశారు. మోతీలాల్ సృజనాత్మకతని, సినిమాలో ఓ గుమాస్తా పాత్రని మోతీలాల్ అత్యంత సున్నితంగా చిత్రీకరించిన పద్ధతిని ది టైమ్స్ ఆఫ్ ఇండియా తన సమీక్షలో మెచ్చుకుని అభినందించింది.

ఆయన చనిపోయాక విడుదలయిన ఆయన చివరి చిత్రం ‘ఏ జిందగీ కిత్నీ హసీన్ హై’ (1966)లో నటించిన సైరా బానో – ఆయన మర్యాదస్థుడనీ, ఒక సీన్‍ని మెరుగుపర్చడానికి తగిన సూచనలు ఇచ్చేవారని – చెప్పారు. ఒక రోజు షూటింగ్‍లో మోతీకి విపరీతమైన దగ్గుగా ఉందట. “ఆయనకి జోషండా అనే మూలికా మందు ఇచ్చాను. ఆయనకి బాగా నయమైంది. ‘నీలాంటి కూతురు ఉంటే ఎంత బాగుండేది’ అన్నారాయన” చెప్పారు సైరా బానో.

‘ఎన్‍సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా’ రచించిన ఆశిష్ రాజాధ్యక్ష, పౌల్ విల్లేమన్‌లు మోతీలాల్ గురించి చక్కగా వ్రాశారు. “మోతీలాల్‌ నటన వాస్తవిక శైలి, డైలాగ్ డెలీవరి సామాన్యంగా ఉంటుంది. భారతదేశంలో నేచురలిస్టిక్ ఫిల్మ్ యాక్టింగ్‍లో ఆయన మొట్టమొదటి ఉదాహరణ” అని అన్నారు.

జీవితం చివరిదశలో ఆయన ఆర్థికంగా చితికిపోయారు. 17 జూన్ 1965నాడు మోతీలాల్ చేతిలో పైసా లేకుండా కన్ను మూశారు.

2013లో భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఆయనపై ఓ పోస్టల్ స్టాంపుని విడుదల చేసింది.

ఈ క్రింది పాటలో ఆయనని చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=4KvBL3eoFM4


ఓ గొప్ప కళాఖండం ఝనక్ ఝనక్ పాయల్ బాజే:

తొలినాళ్ళ నుంచే హిందీ సినిమాలలో నృత్యాలు, పాటలు విడదీయరాని భాగమయిపోయాయి. అయితే 1950వ దశకం, 1960ల తొలి రోజుల్లో పాటలు నృత్యాలు సినిమా ప్రదర్శనకి కేవలం సహాయకాలుగా మాత్రమే కాదని గ్రహించారు. వాస్తవానికి అవి సినిమాకి ఓ గుర్తింపు నిచ్చి, దాని విజయానికి దోహదం చేశాయి. వాణిజ్యపరమైన నృత్యాలు, పాటలంటే ఆసక్తి కలిగినా, 1950ల నాటి ప్రేక్షకులు మాత్రం శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యారూపాలనే అభిమానించారు. 1952నాటి ‘బైజు బావరా’ శాస్త్రీయ సంగీతానికి ఎంత మేలు చేసిందో, 1955 నాటి ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ కథక్ నృత్యానికి అంత మేలు చేసింది. వి.శాంతారాం గారి ఆ క్లాసిక్‌ని పునర్వీక్షించడం ఒక గొప్ప అనుభవం. సంధ్య, గోపీకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ వి.శాంతారాం సినిమా – టెక్నికలర్‍తో తీసిన మొదటి సినిమా. కేవలం నలుపు-తెలుపు దృశ్యాలు మాత్రమే చూడడానికి అలవాటు పడ్డ ఆనాటి ప్రేక్షకులను రంగులతో నిండిన సెట్లు, కాస్ట్యూమ్స్ – విశేషంగా ఆకర్షించాయి. ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ చిత్రం – నీల (సంధ్య), గిరిధర్ (గోపీకృష్ణ) మధ్య ప్రేమ చుట్టూ తిరుగుతుంది, ఈ ఇద్దరు మంగళ్ మహారాజ్ (కేశవ్‌రావ్ దాతే) అనే గురువు వద్ద నృత్యం నేర్చుకుంటుంటారు. వారి జీవితం కళకే అంకితం. కానీ వారు ప్రేమలో పడినప్పుడు, అది కళ పట్ల పాపంగా భావించబడుతుంది. వారి నిబద్ధత విషయంలో రాజీ పడ్డారని భావించబడుతుంది. ఓ గొప్ప నృత్యకళాకారుడైన గిరిధర్‍తో ప్రేమలో పడడంలో తనదే తప్పనే అపరాధ భావనతో నీల ఉండడం, నీల విషయం గిరిధర్ ఎటూ తేల్చుకోలేకపోవడం అనే అంశంపై ఈ సినిమా ప్లాట్ ముడిపడి వుంది.

 

‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ చిత్రం – కళని స్వచ్ఛంగా ఉంచాలా లేక వాణిజ్య ప్రయోజనాల కోసం సరళం చేయాలో అనే చర్చకి తావిస్తుంది. సినిమా ప్రారంభంలో నీల అంటుంది – తాను రాత్రింబవళ్ళు సాధన చేస్తున్నది కేవలం ‘బజారు నృత్యం’ తప్ప మరొకటి కాదని. ఆమె హృదయం ముక్కలవుతుంది. తన గురువుని ఈ విషయం గురించి ప్రశ్నిస్తే, “నీకు ఆరు నెలల్లో నేర్పమన్నారు, పైగా ఒక బృందాన్ని సిద్ధం చేయమన్నారు. నేనింత కన్నా ఏం చేయగలను?” అని అంటారాయన. ఈ సందర్భంగా – ఈ విశ్వంలో కళని డబ్బుకి అమ్ముకోలేమని; హుందాగా, గౌరవంగా సాధన చేయాలని ఈ సినిమా స్పష్టం చేస్తుంది. అయినా సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ, వాణిజ్య నృత్యాలను నిందించే మంగళ్ మహరాజ్, గిరిధర్‌ని ఓ నృత్య పోటీకి సన్నద్ధం చేయడం గమనిస్తాం, అది సమంజసమేనని ఆయన భావిస్తారు. అయితే ఇలా చేయడం తన కళకి – ప్రేక్షకులుగా ఉన్న తన తోటి కళాకారుల నుంచి ధ్రువీకరణ అని అంటారు.

 

పలు రకాల నృత్యాలు, సంగీతపు ప్రకీర్ణకం (మాంటేజ్) ద్వారా – ఉత్తమ నాట్యకళాకారులయ్యేందుకు నీల, గిరిధర్ పడ్డ కష్టం మనకు తెలుస్తుంది, త్యాగాల వల్లనే ఉత్తమ నర్తకుల గొప్పదనం తెలుస్తుందని మంగళ్ మహరాజ్ అంటారు. అయితే వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు, ఈ ప్రపంచంలో అది నిషిద్ధం. ఒక సన్నివేశంలో – నీల గిరిధర్‍లు ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నారనీ, వాళ్ళిద్దరూ ప్రేమలో పడవచ్చని – ఒక పాత్రతో అనిపిస్తారు. దీనికి స్పందనగా, “మన ఘరానాలో పురుషులు నృత్యంలో ఉత్తమ స్థాయి సాధించేవరకూ పెళ్ళి చేసుకోరు. వారు పెళ్ళి చేసుకునేది కూడా వంశం కొనసాగడానికే తప్ప, ప్రేమ కోసం కాదు” అని మంగళ్ మహరాజ్ అంటారు. ఈ డైలాగ్ – అప్పట్లో సమాజంలో ప్రేమ పట్ల ఉన్న భావనని తెలుపుతుంది. సృజనాత్మక కళలో లీనమయ్యే పాత్ర అయిన మంగళ్ మహారాజ్ – సాధారణ మానవుల కన్నా ఎక్కువగా భావోద్వేగాల సూక్ష్మభేదాలను గ్రహించగలరు, ఆయన దృష్టిలో శృంగారపరమైన ప్రేమ అల్పమైనది, కళ పట్ల వ్యక్తం చేసే ప్రేమ అది పెద్ద దీవెన. ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ చిత్రం పూర్తిగా మనల్ని అబ్బురపరిచే నృత్యాలతో నిండి ఉంటుంది, అన్ని నృత్యాలకు దర్శకత్వం వహించింది గోపీకృష్ణే. గిరిధర్ పాత్రలో ఆయన తెర మీద ఒక మూల నుంచి మరో మూలకి దూకుతుంటే – ఆయన సున్నితమైన నృత్యశైలికి అచ్చెరువొందుతాం. ఆయన కదలికలు, హావభావాలు, సూక్ష్మ పరిశీలన – మనల్ని చూపు మరల్చనీయవు. నీలగా సంధ్య ఆయనని ప్రతి అడుగులోనూ సరిజోడీగా రాణించారు. ఆ రోజుల్లో గోపీకృష్ణ ప్రసిద్ధి చెందిన నృత్య కళాకారులు, ఆ తరువాత బాలీవుడ్‍లో నృత్య దర్శకులయ్యారు. కానీ సంధ్య అప్పట్లో నాట్యానికి కొత్త. వారి నటన కూడా కొన్ని సార్లు రంగస్థల ప్రదర్శనలా అనిపించి – కృత్రిమంగా తోస్తుంది.

నృత్యాల ద్వారీ వీరిద్దరూ ఒకరి హృదయంలోకి మరొకరు ప్రవేశిస్తారు. ఇక్కడే ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ చిత్రంలోని ఘర్షణ మొదలవుతుంది, స్త్రీ వివక్షాదృక్పథం ఆరంభమవుతుంది. సినిమాలోని ఈ ఘర్షణ అంతా  నీలపై పడుతుంది, ఎందుకంటే సినిమా ఆమెను గిరిధర్ విశ్వామిత్రకు మేనకగా మారుస్తుంది (ఒక నృత్య సన్నివేశంలో నీల మేనకలా నటిస్తుంది). గిరిధర్ ఏకాగ్రతను చెడగొడుతున్నావని మంగళ్ మహారాజ్ నీలని నిందిస్తారు. నీల తనని తాను నిందించుకుని, ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంగా, సినిమా మంగళ్, గిరిధర్‍ల జీవితంలో తుఫానుకి నీలనే కారణం అని ఆరోపిస్తుంది. తన అపరాధ భావనని కప్పిపుచ్చుకోవడానికి – తాను నాట్యంలో తన భాగస్వామిని ఎన్నడూ ప్రేమించలేదని అంటుంది, అది గిరిధర్‍ని బాధిస్తుంది. నీల గిరిధర్‍ని సూటిపోటి మాటలతో అవమానిస్తుంది. ఒక సందర్భంలో ఒక పెద్ద రాతితో నీలని కొట్టడానికి వస్తాడు గిరిధర్, కానీ మంగళ్ అతన్ని ఆపి జైలు పాలు కాకుండా కాపాడుతారు. ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ చిత్రంలో ఇక్కడ మనకి సందేహం వస్తుంది – అసలు గిరిధర్ నీలని నిజంగా ప్రేమించాడా అని.

అయితే అద్భుతమైన దృశ్యాలను కళ్ళకు కట్టడంలో ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ చిత్రం విజయవంతమైంది. అందమైన నృత్యాలతో ప్రేక్షకులను అలరించింది. కానీ క్లైమాక్స్ మాత్రం కాస్త మాచ్-ఫిక్సింగ్‌లా అనిపిస్తుంది, అయితే అప్పుడు దర్శకులు వి.శాంతారం అందించిన గొప్ప నృత్యం కారణంగా దీన్ని క్షమించవచ్చనిపిస్తుంది. ప్రముఖ సినీ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీకి వి. శాంతరాం ప్రేరణగా నిలిచారు. ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ చిత్రం చూసే సంజయ్ లీలా భన్సాలీ చిత్రాల ఆలోచనకు అంకురం ఎక్కడితో అర్థమవుతుంది.

 

శాస్త్రీయ సంగీతం లేకుండా వి. శాంతారాం నృత్యప్రధాన చిత్రం తీయలేరు. సంగీత దర్శకులు వసంత్ దేశాయ్, గీత రచయిత హస్రత్ జైపురి ఈ చిత్ర విజయానికి ఇతోధికంగా తోడ్పడ్డారు. మీరు కనుక కథక్‍లోని ప్రారంభ పాఠాలు నేర్చుకుని ఉంటే మీకు ‘మురళి మనోహర్’, ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ అనే పాటలు ఇంకా సాధనలో ఉన్నాయని తెలుస్తుంది. ‘జో తుమ్ తోడో పియా’, ‘కైసీ ఏ మొహబ్బత్’ వంటివి ఈ సినిమాలోని జనరంజకమైన పాటలలో కొన్ని.

ఒకనాటి భారతీయ సినీ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ని క్లాసిక్‌ గానే పరిగణించాలి. నటన, కథనం పరంగా అంత ఉత్తమం కాకపోయినా, కాలాతీతమైన నృత్యాలతో ఈ సినిమా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here