అలనాటి అపురూపాలు-127

0
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నసీరుద్దీన్ షాని రక్షించిన ఓంపురి:

తన జీవితంలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనని వివరించారు ప్రముఖ నటులు నసీరుద్దీన్ షా.

తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‍లో ఉత్థానపతనాలు ఎన్నో చూశారు నసీరుద్దీన్ షా. తన జీవితం గురించి, తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను – తన జ్ఞాపకాలు రాసుకున్న ‘అండ్ దెన్ వన్ డే’ అనే పుస్తకంలో వెల్లడించారు. తన జీవితంలో జరిగిన ఓ దుర్ఘటన గురించి నసీరుద్దీన్ షా వివరించిన  వెల్లడించిన వివరం ఆయన అభిమానులను కలవర పరుస్తుంది. జస్‍పాల్ అనే తోటి నటుడు ఒక రెస్టారెంట్‌లో తనని కత్తితో పొడిచాడనీ, అప్పుడు మరో నటుడు ఓం పురి తనను రక్షించారని తెలిపారు.

1977లో ‘భూమిక’ అనే సినిమా షూటింగ్ జరిగే రోజుల్లో – ఒకరోజు షా, ఓం పురి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా, అప్పుడే మరో నటుడు జస్‌పాల్ లోపలికి ప్రవేశించారు. తనకీ, జస్‌పాల్‌కీ విభేదాలు ఉన్నాయనీ, తాము ఒకరికొకరం దూరంగా ఉంటున్నామని చెప్పారు షా. తర్వాత ఏం జరిగిందో షా ఆ పుస్తకంలో వివరించారు. “మేం ఒకరినొకరం పట్టించుకోలేదు. కాని అతని దృష్టి నా మీదే ఉందనిపించింది. నా వెనుక కుర్చీలో కూర్చోవడానికి నన్ను దాటి వెళ్ళాడు అని అనుకున్నా.”

“కాసేపయ్యాకా, అతని ఉనికి నాకు తెలిసింది. ఏదో పదునైన వస్తువుతో నా నడుం భాగంలో గుచ్చినట్టుగా అనిపించింది. నేను లేవబోయాను, మరో గొడవ మొదలవబోతోంది అనుకున్నాను. కానీ నేను లేవబోతున్నప్పుడు నన్ను చూసిన ఓం గట్టిగా కేకపెట్టాడు. నా వీపుకి కత్తిపోటు ఉందని అరిచాడు. వెనక్కి తిరిగి చూశాను, జస్‌పాల్ చేతిలో చిన్న కత్తి ఉంది. దాని మొన నుంచి రక్తం కారుతోంది. అతను నా మీద మరోసారి దాడి చేయబోయాడు. ఓం, మరో ఇద్దరు అతన్ని అడ్డుకున్నారు.”

హోటల్ వాళ్ళు పోలీసులని పిలిచారు. నసీర్‍కి తక్షణ వైద్య సహాయం అవసరమైంది. “జస్‍పాల్‌ని కిచెన్‍లో బంధించారనీ, అతనికి అక్కడ తగిన చికిత్స జరుగుతోందని ఓం చెప్పాడు. ఓం నన్ను డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్ళానుకున్నాడు. కానీ పోలీసులు వచ్చేవరకు మమ్మల్ని కదలనివ్వలేదు హోటల్ వాళ్ళు” అంటూ రాశారు షా. అంబులెన్స్ రాగానే, ఓం పురి ఎక్కి, షాతో మర్యాదపూర్వకంగా మెలగాల్సిందిగా పోలీసులని కోరారట. “ముందే అంబులెన్స్ ఎక్కి ఓం పొరపాటు చేశాడు, పైగా పోలీసులని నాతో మర్యాదపూర్వకంగా మసలమన్నాడు. పోలీసులు ముందు ఓం ని బండి దిగమన్నారు. ఎంతో బతిమాలుకున్న తర్వాతే, అతన్ని ఉండనిచ్చారు. మమల్ని ఎక్కడికి తీసుకువెడుతున్నారో మా ఇద్దరికీ తెలియదు, పోలీస్ స్టేషన్‍కి మాత్రం కాకూడని నేను ప్రార్థించాను.” రాశారు షా.

తనని జుహూ లోని కూపర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారని, ఆ సమయంలో తనకి విపరీతమైన బాధ అనిపించిందని షా రాశారు. “రక్తం ఆగలేదు. నొప్పి ఎక్కువయితోంది. పోలీసులు నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. కొన్ని మామూలు ప్రశ్నలయ్యాకా, రేడియోలో మరాఠీలో వినిపించిన కొన్ని ప్రసారాలు విన్నాకా, మమ్మల్ని జుహూ లోని కూపర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు” రాశారు షా.

అప్పుడు శ్యామ్ బెనెగళ్‍ సినిమానే చేస్తున్నందువల్ల, మరునాడు షూటింగ్ ఉన్నందువల్ల నసీర్ పరిస్థితిని దర్శకులు శ్యామ్ బెనెగళ్‍కి వివరించారు. కూపర్ హాస్పటల్‍లో కొంత చికిత్స అయ్యాకా, షాను జస్‌లోక్ హాస్పటల్‌కి తరలించారు.

జస్‌పాల్‌ని పోలీసులు అరెస్టు చేశారనీ, కానీ నిర్మాత సయీద్ అఖ్తర్ మీర్జా బెయిల్ ఇవ్వడంతో విడిచి పెట్టారని షా తెలిపారు. “నేను కోలుకుంటుండగా నాకో విషయం తెలిసింది. రెండు రాత్రుళ్ళు కస్టడీలో ఉన్న జస్‌పాల్‌కి సయీద్ మీర్జా బెయిల్ ఇచ్చారని తెలిసింది. ఆయన సినిమా ‘అరవింద్ దేశాయ్’లో నేను నటించాల్సి ఉంది, కానీ నాకు డేట్లు సర్దుబాటు కాక ఆ పాత్రలో వేరే నటుడిని ఎంచుకున్నారు. మా ఫిల్మ్ ఇన్‍స్టిట్యూట్ రోజుల నుంచీ సయిద్ జస్‍పాల్ పట్ల పక్షపాతంతో ఉండేవారు. ఇప్పుడేమో తన ఇంట్లోనే అతనికి ఆశ్రయం ఇచ్చారు. తానేం చేస్తున్నారో ఆయనకి తెలుసని అనుకుంటున్నాను” రాశారు షా.

అయితే ఈ గొడవ తర్వాత వివాదానికి ముగింపు లభించలేదు. గొడవ జరిగిన కొద్ది రోజుల తర్వాత నసీర్ ఇంట్లో ఒక్కరే ఉండగా, జస్‌పాల్ అక్కడికి వెళ్లారట. “తలుపు తీస్తే, ఎదురుగా జస్‌పాల్ నవ్వుతూ నిలబడి ఉన్నాడు. నిర్ఘాంతపోయాను, ఏం మాట్లాడలేకపోయాను. కదలాలన్నా, మాట్లాడలాన్నా కూడా భయపడిపోయాను. అతను లోపలికి వచ్చాడు. కరచాలనం కోసం చేయి చాచాడు. సిగరెట్ వెలిగించుకున్నాడు. నేను నోరు తెరుచుకుని ఉండిపోయాను. అతను నేనెలా ఉన్నానని అడగలేదు, కనీసం క్షమించమని కోరలేదు. బదులుగా, హిస్టీరికల్‍లా నవ్వుతూ, జరిగిన దాన్ని వివరిస్తూ, ‘వ్యక్తిగతంగా తీసుకోవద్దు’ అన్నాడు (అతను అంతకుముందు గాడ్ ఫాదర్ సినిమాలో ఆల్-పాసినో నటనతో తీవ్రంగా ప్రభావితమై ఉన్నాడు). ‘ఇది క్లాస్ వార్. జరిగినదంతా సయీద్ నీకు వివరిస్తారు’ అన్నాడు” రాశారు షా.

తన మీద జస్‌పాల్ మళ్ళీ దాడి చేస్తాడేమోనని షా భయపడ్డారట. తనున్న పరిస్థితుల్లో తనని తాను రక్షించుకోలేనని భయపడ్డారట. “ఒక ఐదు పది నిమిషాలు నేను విపరీతమైన టెన్షన్ అనుభవించాను. నా మీద దాడి చేస్తే ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాను. అతనికి వీలైనంత దూరంగా నిలబడ్డాను. కాసేపయ్యాక, అతని వెళ్ళిపొమ్మని చెప్పాను. మొదట ఆశ్చర్యపోయాడు, కానీ ఎదురు చెప్పలేదు. పైకి లేస్తూ ‘కోపం తెచ్చుకోకు మిత్రమా, నాకు బాలేదు’ అన్నాడు. అతను బయటకు నడవగానే, నేను తలుపు వేసేశాను. కిటీకీ దగ్గర నుండి కాసేపు అరిచాడు. తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయాడు” రాశారు షా.

ఈ ఇద్దరు మళ్ళీ పెట్టీ-క్రైమ్స్ కోర్టులో ఎదురుపడ్డారు. కానీ నసీర్ నేరారోపణకై పట్టుపట్టలేదు. “నేను నేరారోపణకై పట్టుపట్టలేదు. న్యాయమూర్తి కేసు కొట్టేశారు. బోనులో జస్‌పాల్ ఇకిలిస్తూ నిలబడ్డాడు.” రాశారు షా.

నసీరుద్దీన్ షా, జస్‌పాల్ ఫిల్మ్ ఇన్‍స్టిట్యూట్‌లో బ్యాచ్‌మేట్స్. ఈ గొడవ తరువాత జస్‍పాల్ మరే సినిమాలోనూ కనిపించలేదు.


సుస్వరాల స్వరకర్త టి. చలపతిరావు:

ప్రసిద్ధ సంగీత దర్శకులు టి. చలపతిరావు 22 డిసెంబరు 1919 నాడు కృష్ణాజిల్లా ఉయ్యూరు లోని కపిలేశ్వరపురంలో జన్మించారు. ద్రోణవల్లి రత్తయ్య, మాణిక్యమ్మ ఆయన తల్లిదండ్రులు. అయితే చలపతిరావుని తాతినేని కోటేశ్వరరావు, కోటమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. దర్శకులు తాతినేని ప్రకాశరావు చలపతిరావు గారి కజిన్. కోటేశ్వరరావు చక్కగా హార్మోనియం వాయించేవారు. పెంపుడు తండ్రి తన అక్కకి హార్మోనియం నేర్పుతుండగా – తాను చదువుకుంటూనే చలపతి కూడా హార్మోనియంపై మక్కువ పెంచుకున్నారు.

చలపతి తాడంకిలో హైస్కూలు చదువు, బందరులో కాలేజీ చదువు పూర్తి చేసి, బొంబాయిలో బి.ఇ. ఎలెక్ట్రికల్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆయన – పట్టాభి సీతారామయ్య స్థాపించిన హిందుస్థాన్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ సంస్థలో మేనేజరుగా చేరారు.

సంగీతం పట్ల ఆసక్తితో, చదువుకునే రోజులల్లోనే కర్నాటక, హిందూస్థానీ సంగీతాలలో శిక్షణ పొందారు. ఆయన కొందరు మిత్రులతో కలసి – వివిధ వేడుకల్లో – మ్యూజికల్ నైట్స్ నిర్వహించేవారు. అదే సమయంలో ఆయన స్వాతంత్ర్య సమరంలోనూ పాలుపంచుకుని, జైలు పాలయ్యారు. దాంతో ఉద్యోగం వదిలిపెట్టాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాకా, ఆయనకి సింగరేణి కోల్ మైన్స్‌లో ఇన్‌ఛార్జ్ ఆఫీసర్‍గా ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయన కాంగ్రెసు పార్టీని వీడి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ప్రజా నాట్య మండలి ప్రదర్శించే నాటకాలకు స్వరకర్తగా పనిచేశారు. ఇక్కడ ఆయన డా. రాజారావు గారు నిర్వహించిన పరివర్తన, అపనింద, ముందడుగు, మా భూమి వంటి నాటకాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. దేశానికి స్వాతంత్రం వచ్చింది. మహాత్మాగాంధీ హత్య తరువాత ప్రజా నాట్య మండలి పై నిఘా పెరిగింది. ఇతరులతో పాటు చలపతిరావును అరెస్టు చేసి మూడేళ్ళు జైలు శిక్ష విధించారు. రాజమండ్రి, కడలూరు జైళ్ళలో ఉంచారు. జైల్లో ఉన్నా ఆయన ఖాళీగా ఉండలేదు. సంగీతం సాధన చేశారు, పుస్తకాలు చదివారు, ఖైదీల హక్కుల కోసం పోరాడారు. జైలు నుంచి విడులయ్యాకా, ఆంధ్రప్రాంతంలో ఆయన ఉండడం మంచిది కాదని, ఆయన శ్రేయోభిలాషులు ఆయనను మద్రాసు పంపించారు. అక్కడాయనకి, సినిమాల పట్ల, సినిమా సంగీతం పట్ల ఆసక్తి కలిగింది. ఎవరి సహాయంతోనే స్వరకర్త ఎస్. రాజేశ్వరరావుని కలిసారు. అప్పట్లో ఆయన ‘వయ్యారి భామ’ అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. చలపతిరావులోని ప్రతిభని గుర్తించి, ఆ సినిమాకి తన అసిస్టెంట్‍గా చేర్చుకున్నారు.

అదే సమయంలో డా. రాజారావు కూడా ‘పుట్టిల్లు’ పేరుతో ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకి మోహన్ దాస్ అనే ఆయనని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. అయినా, చలపతిరావుకి కొన్ని పాటలు స్వరపరిచే అవకాశం ఇచ్చారు. సినిమా క్రెడిట్స్‌లో కూడా ఇద్దరి పేర్లు వేశారు. కానీ ఆ సినిమా పరాజయం పాలయ్యింది. అయితే జమున, అల్లు రామలింగయ్యల తొలి సినిమాగా చరిత్రలో నిలిచింది. ఈ ఇద్దరు స్వరకర్తలూ కలిసి ‘పరివర్తన’ అనే సినిమాకి కూడా సంగీతం అందించారు. ఈ సినిమా హిట్ అయింది, వారి కృషికి గుర్తింపు లభించింది. కానీ ఈ సినిమా తరువాత మరో పది నెలల పాటు మరో సినిమా అవకాశం రాలేదు. విసుగు చెందిన ఆయన మద్రాసు వీడి సొంతూరుకి వెళ్ళిపోదామనుకుంటుండగా తన కజిన్ తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఒక తమిళ డబ్బింగ్ సినిమా ‘అమరదీపం’ కి సంగీతం అందించే అవకాశం వచ్చింది. మొదట చలపతిరావు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ సినిమా తరువాత మరో స్ట్రయిట్ సినిమాకి అవకాశం ఇస్తామని వారు చెప్పడంతో, అయిష్టంగానే ఆ సినిమాకి సంగీతం అందించారు. ఆ తరువాత తమిళ చిత్రాల్లో అవకాశాలు పెరిగాయి. తెలుగులో ‘ఇల్లరికం’ సినిమా పాటలు హిట్ కావడంతో, ఆయనకు అవకాశాలు బాగా వచ్చాయి. అంతే, ఇక ఆయన తన కెరీర్‍లో వెనుతిరిగి చూసుకోలేదు.

‘కలవారి కోడలు’, ‘పునర్జన్మ’, ‘జమీందారు’, ‘లక్షాధికారి’, ‘మంచి మనిషి’, ‘మనుషులు మమతలు’, ‘గూఢచారి 116’, ‘బ్రహ్మచారి’, ‘బంగారు గాజులు’ వంటి సినిమాలు తెలుగు సినీ సంగీత చరిత్రలో ఆయన స్థానాన్ని బలోపేతం చేశాయి. ఆయన సంగీతం సమకూర్చిన చివరి సినిమా 1984లోని ‘జనం మనం’.

వారి తొలి వివాహం అన్నపూర్ణతో జరిగింది. వీరికి సంతానం కలగకపోవడంతో, డా. జమునని పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించారు. చలపతిరావు 22 ఫిబ్రవరి 1994నాడు స్వర్గస్థులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here