అలనాటి అపురూపాలు-129

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సూపర్ స్టార్‍లను తట్టుకున్న ధర్మేంద్ర:

బాలీవుడ్‍లో ఎందరో సూపర్ స్టార్‌లున్నా, వాళ్ళందరిని తట్టుకుని తనదైన ముద్రవేసిన నటుడు ధర్మేంద్ర.

ఆయన 1958లో బొంబాయిలో అడుగుపెట్టారు.

ఒక బస్ నిండా – వేళ్ళు ముడుచుకుని, గోళ్ళు కొరుకుతూ ఉద్విగ్నతతో నిండి ఉన్న యువకుల మధ్య ఆయనా ఉన్నారు. వాళ్ళంతా తొలి ఫిల్మ్‌ఫేర్ టాలెంట్ హంట్‌కి హాజరవుతున్నవారు. పదును చూపుల ధర్మేంద్ర నిర్మాత అర్జున్ హింగోరాణి దృష్టిలో పడ్డారు. అంతే, మిగలినదంతా ధర్మేంద్ర కెరీర్ అనబడే 55 ఏళ్ళ ప్రస్థానం!

హిందీ సినీరంగంలో విశేషంగా రాణించిన కొందరు అందగాళ్ళలో ధర్మేంద ఒకరు. 1970లలో ధర్మేంద్రని ప్రపంచంలోని మంచి చూపరులలో ఒకరిగా పరిగణించేవారు. ఎంతలా అంటే, ఒక చక్కని సూట్ తొడిగితే, సీన్ కానరీతోనూ, పౌల్ న్యూమాన్ తోనూ పోటీ పడేంతలా.

అయితే ధర్మేంద్ర సాధించిన ఘనత ఆయన అందం కంటే విశిష్టమైనది. హిందీ చిత్రసీమలోని సూపర్ స్టార్‍లను తట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు ధర్మేంద్ర. ఆయన తన కెరీర్‍ని 1960లో ప్రారంభించారు, అదే సమయంలో షమ్మీ కపూర్ విశేషంగా ఎదిగిపోయారు. 60వ దశకంలో ఆయన రాజేంద్ర కుమార్‌తోనూ పోటీ పడాల్సి వచ్చింది. 1969 వచ్చేసరికి ‘రాజేష్ ఖన్నా’ అనే ఉప్పెనని ఎదుర్కోవలసి వచ్చింది. 70ల తొలినాళ్ళలో తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉండగా యాంగ్రీ యంగ్‍మన్ అమితాబ్ బచ్చన్ దూసుకువచ్చారు. మీడియా గాని, విమర్శకులు గాని ఏ రకమైన ప్రత్యేకాభిమానం చూపించకపోయినా, దర్మేంద్ర పరిశ్రమలో ప్రధానమైన హీరోలలో ఒకరిగా నిలిచారు. తన సినిమాల ఆధారంగా ‘ఆధారపడతగ్గ స్టార్’ అనిపించుకున్నారు. సినిమాలు ఎలా ఉన్నా, తన వంతు పారితోషికం దక్కించుకున్నారు. ఒకప్పడు అందగాడు, రొమాంటిక్ స్టార్ అనిపించుకున్న ధర్మేంద్ర – 80, 90 లలోకి వచ్చేసరికి యాక్షన్ ఐకాన్ అనిపించుకున్నారు. హీ-మ్యాన్ అయిపోయారు.

60 ఏళ్ళు వచ్చినా ధర్మేంద్ర విజయవంతమైన హీరోగా కొనసాగడానికి కారణం ఆయన సమ్మోహనశక్తి అనే చెప్పాలి. సమ్మోహక ప్రపంచానికి షారూక్ ఖాన్ రాకముందు చాలా కాలం పాటు ధర్మేంద్ర ఏలారు.  ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో కూడా ఆయన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ‘యమ్లా పగ్లా దీవానా’ ఫ్రాంచైజీ డియోల్ కుటుంబపు సినిమాలు. ధర్మేంద్రకి పాత తరం నటులకన్నా విలువ ఎక్కువ అనేలా చేశాయి. ఆయన కామిక్ టైమింగ్ – ఆయన శరీరంపై ముడుతలని అధిగమిస్తుంది.

55 ఏళ్ళ కెరీర్‍లో ధర్మేంద్ర 300కి పైగా సినిమాలలో నటించారు. అంటే సగటున ఏడాదికి ఆరు సినిమాలు చేశారని చెప్పడానికి మనమేం గణిత పండితులం కానక్కరలేదు. యూరోపియన్ నటులకు, నిర్మాతలకు ఈ వాస్తవం అసంగతమని అనిపించవచ్చు. కాని ఇది నిజం. ధర్మేంద్ర ఓ ఫిల్మ్ ఫ్యాక్టరీకి తక్కువేం కాదు.  60వ దశకంలో బందినీ, సత్యకామ్, ఫూల్ ఔర్ పత్థర్, హకీకత్ లాంటి అద్భుతమైన సినిమాలను అందించారు. 70ల నుంచి 80, 90 లలోకి వచ్చేసరికి ఆయన ప్రతి భారీ, మధ్యస్థాయి బడ్జెట్ సినిమాలలో నటించారు. షోలే, చరస్, డ్రీమ్ గర్ల్, సీతా ఔర్ గీతా, ధరమ్ వీర్, ఫ్రొఫెసర్ ప్యారేలాల్, ఇంకా ఎన్నో సినిమాలు ఈ కాలంలో బాక్సాఫీసు వద్ద ఘన విజయాలు సాధించాయి.

అత్యంత స్నేహశీలురలో ధర్మేంద్ర ఒకరు. ఆయన భావోద్వేగాల మనిషి. భావోద్వేగాలను దాచుకోని మనిషి కాబట్టే జీవితంలోని ఎన్నో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించేవారు. ఎన్నెన్నో పార్టీలు ఇచ్చేవారు. ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ‘ఘాయల్’ చిత్రం విజయం సాధించిన సందర్భంగా ధర్మేంద్ర ఇచ్చిన పార్టీలో విస్కీ పొంగి ప్రవహించిదని అంటారు. తోటి నటీనటులతో అతి చక్కని సంబంధాలుండేవి ఆయనకి. ఒకరినొకరు కలిసినప్పుడల్లా మెహమూద్‍ని ముద్దాడే అలవాటుండేది ధర్మేంద్రకు. ధర్మేంద్ర ఆప్తుడైన మిత్రుడని ఆ ప్రసిద్ధ హాస్యనటులు చెప్పేవారు.

ధర్మేంద్ర విజయానికి ఆయన డ్రెస్ సెన్స్ కూడా కొంత దోహదం చేసింది. నేటికీ కూడా అత్యంత స్టయిలిష్ వ్యక్తులలో ఆయన ఒకరు. సూట్‍లో ఎంతో అందంగా ఉంటారాయన. 60వ దశకంలో బొంబాయిలోని ఉత్తమ దుస్తులు ధరించే వ్యక్తులలో ధర్మేంద్ర ఒకరని పేరు పొందారు. టెక్స్చర్డ్ సూట్లు, స్లిమ్ ఫిట్ పాంట్లు, ఫాన్సీ స్వెటర్స్ ఆయని మరింత అందాన్నిచ్చేవి. 70లలో లీజర్ సూట్ల్‌ని ప్రోత్సహించిన వారిలో ఆయన ముందున్నారు. ‘యాదోం కీ బారాత్’ సినిమాలో ఆయన ధరించిన బ్లాక్ డెనిమ్‍ని గుర్తు చేసుకుని నిట్టూర్చేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. 80లలో ఆయన ధరించిన జాకెట్, జీన్స్ మేళవింపు ఆయన్ని ఆ కాలపు కఠినమైన కథానాయకుడిగా మార్చింది. 90 లలో ఆయన ధరించిన మోజాయిక్ షర్ట్స్ – ఫ్యాషన్‌కి చిరునామాగా మారాయి.

మహిళాభిమానులు రక్తంతో రాజేష్ ఖన్నాకి ఉత్తరాలు రాస్తున్న రోజుల్లో – భారత జేమ్స్ డీన్‍గా పేరుపొందిన ధర్మేంద్ర అన్నా అంతే ఆకర్షణ కలిగి ఉండేవారు. అందులో సందేహమేముంది? తన మర్యాదఫూర్వకమైన ప్రవర్తనతో మహిళాభిమానుల మనసులను ఆకట్టుకున్నారాయన. ఆయనో ఫర్‍ఫెక్ట్ జెంటిల్‌మన్. అందుకే దేశంలోకెల్ల అందగత్తెలలో ఒకరైన హేమ మాలినిని ప్రేమించి పెళ్ళి చేసుకోగలిగారు. తొలుత ఆయన ఎన్నిసార్లు ప్రతిపాదించినా, అన్నిసార్లు హేమ మాలిని తిరస్కరించారట. కానీ చివరికి ధర్మేంద్ర ఆమెను ఒప్పించగలిగారు. తన కుమారుడు సన్నీతో నటించిన అమృతా సింగ్, డింపుల్ కపాడియా, సోనూ వాలియా, సోనమ్, పూనమ్ ధిల్లాన్, రతి అగ్నిహోత్రి వంటి హీరోయిన్స్ సరసన తానూ నటించారు ధర్మేంద్ర.

1958లో తొలి ఫిల్మ్‌ఫేర్ టాలెంట్ హంట్‌కి బొంబాయిలో అడుగుపెట్టేటప్పటికే ధర్మేంద్రకి వివాహమయి నాలుగేళ్ళు అవుతోంది. విజేత అనే కుమార్తె ఉంది. ఆమె పేరుతో మీదే విజేత బ్యానర్ స్థాపించారు తర్వాతి కాలంలో. సన్నీ అని పిలవబడే అభయ్ సింగ్‌కి అప్పటికి రెండేళ్ళు. తర్వాతి కాలంలో అజేత అనే మరో కూతురు, విజయ్ సింగ్ (బాబీ) డియోల్ అనే కుమారుడు జన్మించారు. సినీ పరిశ్రమలో విజయవంతమవడంతో స్వగ్రామం నుంచి తన మొత్తం కుటుంబాన్ని బొంబాయికి పిలిపించారు ధర్మేంద్ర. తండ్రి కేవల్ కిషన్, తల్లి సత్వంత్ కౌర్, అక్క – అందరూ బొంబాయి వచ్చేసారు. ధర్మేంద్ర కజిన్ – అభయ్ డియోల్ తండ్రి అయిన అజిత్ డియోల్‍ కూడా సినీ పరిశ్రమలో ధర్మేంద్రకి సహాయంగా నిలిచారు. ధర్మేంద్ర 1980లో మొదటి భార్య ప్రకాశ్‌కి విడాకులు ఇవ్వకుండానే హేమ మాలినిని పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు భార్యలను కలిగి ఉండేందుకు గాను ఇస్లాం మతంలోకి మారారని కొందరంటారు. ఈ చర్యని కొందరు సమర్థిస్తే, కొందరు విమర్శించారు. హేమ, ధర్మేంద్ర దంపతులకు జన్మించిన ఈషా, అహనా లతో డియోల్‍ల కుటుంబం మరింత పెద్దదయింది.

ఆయన అందగాడు కావచ్చు, కానీ ఎన్నడూ వ్యర్థుడు కాలేదు. అద్భుతమైన హాస్య చతురత ఉన్న వ్యక్తి ధర్మేంద్ర. ‘చుప్‍కే చుప్‍కే’ సినిమాలోని ‘డా. పరిమళ్ త్రిపాఠీ’ పాత్ర ఆయన నిజ జీవిత స్వభావానికి దగ్గరగా ఉంటుంది.  అత్యంత దారుణమైన కాస్ట్యూమ్స్ ధరించాల్సి వచ్చినా, కెమెరాలకు పోస్‌లు ఇవ్వగల ధైర్యం ఆయనది. ఫిల్మ్‌ఫేర్ ఆర్కైవ్స్‌లో వింతగా, తమాషాగా, కనిపించే దుస్తుల్లో ఉన్న ధర్మేంద్ర ఫోటోలు వేలాదిగా ఉన్నాయి. ఎందుకంటే తన మీద తాను హాస్యమాడటానికి వెనుకాడని వ్యక్తి ఆయన. పుట్టుకతోనే వినోదం పంచే మనిషి. ఎప్పటికీ తాను జనాలని అలరించాలని కోరుకునే మనిషాయన.


60లలో అలరించిన నటి ఆజ్రా:

అలనాటి హిందీ సినీ ప్రేక్షకులను అలరించిన నటీమణుల్లో ఆజ్రా ఒకరు. మెహబూబ్ ఖాన్ నిర్మించిన ‘మదర్ ఇండియా’ (1957) చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో సునీల్ దత్ సరసన నటించారు.

బాబర్ (1960), లవ్ ఇన్ సిమ్లా (1960), గంగ జమున (1961), జంగ్లీ (1961, అయ్యా యా సుకు సుకు -పాట), దూజ్ కా చాంద్ (1964), గంగా కీ లెహరే (1964), మహల్ (1969) వంటి హిట్ చిత్రాలలో నటించారు ఆజ్రా.

ఈమె అలనాటి నటి సరోజిని (అసలు పేరు రోషన్ జెహాన్, దివానీ (1934), భారత్ కీ బేటీ, జాదూ బంధన్, సంస్కార్, తాజ్ మహల్, ఫర్మాన్, నయా జమానా, శ్రీ కృష్ణార్జున యుద్ధ్,  సర్కస్ కింగ్ వంటి సినిమాలో నటించారు, నిర్మాత దర్శకుడు నానూభాయ్ వకీల్‌ని రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు) కూతురు. సరోజిని సోదరి ఇందూరాణి కూడా నటీమణే (అసలు పేరు ఇష్రత్, ఇన్సాఫ్, బుల్ డాగ్, మేరీ భూల్, మిస్టర్ ఎక్స్, సునెహరా బాల్, భేడీ కుమార్, చష్మావాలీ, మిడ్‌నైట్ మెయిల్, సాత్విక్, హిత్మ్ తాయి కీ బేటీ, అల్లాద్దీన్ లైలా, బుల్ బుల్ ఎ బాగ్ధాద్, జెవర్ తదితర సినిమాలో నటించారు). ఇష్రత్ మోహన్ స్టూడియో భాగస్వామి అయిన రామ్నిక్ లాల్ షాను వివాహం చేసుకున్నారు.

ఆజ్రా 21 సెప్టెంబరు నాడు బొంబాయిలో జన్మించారు. 1950లో శాంతా క్రజ్ లోని సెయింట్ తెరెసా కాన్వెంట్ హైస్కూల్ నుంచి ఆరవ తరగతి పాసయ్యాకా, ఆజ్రా అమ్మమ్మ, తాతగార్లయిన – మున్నావర్ జెహాన్, షేక్ ఇమానుద్దీన్ ఇంటికి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆజ్రా ఇక్కడ ఐదేళ్ళు పాటు ఉండి, జమా మసీద్ ప్రాంతంలోని పహాడీ భోజ్లా లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1955లో బొంబాయికి తిరిగి వచ్చారు.

ఆజ్రా సినిమాల్లోకి యాదృచ్ఛికంగా వచ్చారు. బొంబాయిలోని జోగేశ్వర్‌లో ఇస్మాయిల్ యూసుఫ్ కాలేజీలో బి.ఎ. చదువుతుండేవారు. ఓ రోజు ఆమె శాంతా క్రజ్ లోని ఆర్య సమాజ్ మందిరంలో ఒక వివాహానికి హాజరయ్యారు. ఆజ్రా అమ్మకి సోదరి అయిన ఇందూరాణి గారి ఆప్త మిత్రుడయిన దర్శక నిర్మాత మెహబూబ్ ఖాన్ భార్య నటి సర్దార్ అఖ్తర్ ఆ పెళ్లిలో ఆజ్రాని చూశారు. తరువాత ‘మీ అమ్మాయి అందగత్తె’ అని ఇందూరాణితో అన్నారట. నాలుగు రోజులు తరువాత ఆజ్రా కాలేజీలో ఉన్న సమయంలో – ఇంటికి వచ్చాకా, తనతో మాట్లాడమనే సందేశాన్ని పంపారట. అదే రోజు సాయంత్రం వాళ్ళ కుటుంబమంతా అజ్మీర్ వెళ్ళవలసి ఉంది. అక్కడ వాళ్ళ నాన్నగారు నటి చిత్ర నటిస్తున్న సినిమా షూటింగ్ జరుపుతున్నారు. అక్కడ్నించి తిరిగి వచ్చాకా ఆజ్రా బాంద్రా వెస్ట్‌లో ఉన్న మెహబూబ్ స్టూడియోకి వెళ్ళారు. అక్కడ ‘మదర్ ఇండియా’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. సునీల్ దత్ సరసన ‘చంద్ర’ పాత్ర పోషించవలసిన లక్నో నటి జబ్బు పడి షూటింగ్‌కి రాలేకపోయింది. వెంటనే ఆ పాత్రకి ఆజ్రాని ఎంచుకున్నారు. 1956లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 1957లో విడుదలైంది. ఆమె తరువాతి చిత్రం ‘టాక్సీ నెంబర్ 555’ (1958). ఇందులో షకీలా, ప్రదీప్ కుమార్‍లు హీరో హీరోయిన్‌లు కాగా, ఆజ్రా ద్వితీయ నాయిక. ప్రధాన నాయికగా తొలి చిత్రం 1959లో వచ్చిన ‘ఘర్ ఘర్ కీ బాత్’. ఈ చిత్రానికి ఆమె సమీప బంధువు రామ్నిక్ లాల్ షా నిర్మాత. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి.

1960లో ఆమె ఫిల్మిస్థాన్ వారి ‘బాబర్’ లోనూ, ఫిల్మాలయా వారి ‘లవ్ ఇన్ సిమ్లా’లోనూ నటించారు. నిర్మాత శశిధర్ ముఖర్జీ ఫిల్మిస్థాన్ సంస్థ నుండి విడిపోయి, ఫిల్మాలయా సంస్థను స్థాపించారు. ఆయన అప్పటికే, దిల్ దేకే దేఖో, హమ్ హిందుస్థానీ వంటి హిట్ సినిమాలను అందించారు. ‘లవ్ ఇన్ సిమ్లా’ కూడా గొప్ప హిట్ అయింది. ఆజ్రాకి గుర్తింపు వచ్చింది. తర్వాత మరో 15 ఏళ్ళ పాటు ఆమె కెరీక్ కొనసాగింది. ద్వితీయ కథానాయికగా, సహాయక పాత్రలలోనూ నటించారు. జంగ్లీ, గంగ జమున (దిలీప్ కుమార్ సోదరుడు నజీర్ ఖాన్ సరసన నటించారు), గంగా కీ లెహరే, ఇషారా, బహారోంకే సపనే, బందీష్, రాజాసాహెబ్, మహల్, మై లవ్, ఇల్జామ్ తదితర చిత్రాలలో నటించారు ఆజ్రా. 1971 జనవరిలో వివాహం కావడంతో సినిమాలకు వీడ్కోలు పలికారు. ఆమె తండ్రి నానూ భాయ్ వకీల్ నిర్మించిన – షా ఎ ఖుదా (1971), పాకెట్‌మార్ (1974) ఆమె పెళ్ళి తరువాత విడుదలయ్యాయి. ఆమె భర్త తరపు వాళ్ళది బొంబాయిలో ప్రసిద్ధ వ్యాపార కుటుంబం, వారికి సినీపరిశ్రమతో సంబంధాలు లేవు. తన పెండింగ్ వర్క్ పూర్తి చేసి గృహిణిగా స్థిరపడ్డారు ఆజ్రా. ప్రస్తుతం ఆమె ముంబయిలోని ఒక సంపన్న ప్రాంతంలో  ఆజ్రా పేరుతో కాకుండా ‘ఫర్హానా’  అనే పేరుతో జీవిస్తున్నారు.

ఆమె తల్లి సరోజిని 1993లో మరణించారు. ఇందూరాణి అమెరికాలో స్థిరపడి 2011లో మృతి చెందారు. రామ్నిక్ లాల్ షా జూలై 1993లో మృతి చెందారు. ఆజ్రా తండ్రి నానూభాయ్ వకీల్ 29 డిసెంబర్ 1980నాడు స్వర్గస్థులయ్యారు.

విస్మృతికి గురైన ఈ నటీమణి సినిమాల్లోని కొన్ని పాటలు:

https://www.youtube.com/watch?v=LitQYVCDfUE...

https://www.youtube.com/watch?v=l8CzJMDFQcY..

https://www.youtube.com/watch?v=Wr6Vstcmmm8..

https://www.youtube.com/watch?v=npcB6NooMpk.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here