అలనాటి అపురూపాలు-131

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సుస్వరాల ఉషా ఖన్నా:

17 ఏళ్ళ వయసులో సంగీత దర్శకురాలిగా ప్రస్థానం ప్రారంభించిన ఉషా ఖన్నా గారి గురించి తెలుసుకుందాం. ఆమె తొలి చిత్రం షమ్మీ కపూర్, ఆశా పరేఖ్ నటించిన ‘దిల్ దేకే దేఖో’.

ఉషా ఖన్నా 7 అక్టోబరు 1941 నాడు గ్వాలియర్‍లో జన్మించారు. ఆమె తండ్రి మనోహర్ ఖన్నా గ్వాలియర్ రాజసంస్థానంలోని వాటర్ వర్క్స్ విభాగంలో పని చేసేవారు. 40వ దశకం మధ్యలో సినిమాల పట్ల ఆసక్తిలో ఆయన బొంబాయికి (నేటి ముంబయి) మకాం మార్చారు. కొన్ని సినిమాలకు ఆయన పాటలు రాసి, స్వరాలు సమకూర్చారు. తన సినిమాకు గజళ్ళు రాయవల్సిందిగా మనోహర్‍ను కోరారు జద్దన్‌బాయి. జావేద్ అన్వర్ అనే కలం పేరుతో ఆయన మూడు గజళ్ళు రాసి ఇచ్చారు. తండ్రి తాను స్వయంగా రచించిన గజళ్ళు పాడుతుండడం గమనించిన చిన్నారి ఉష తాను కూడా గాయని కావాలనుకున్నారు. మెట్రిక్యులేషన్ పూర్తయ్యాకా, ఆమె దేవధర్ సంగీత విద్యాలయలో చేరారు. రాబిన్ బెనర్జీ శిష్యరికంలో లలిత సంగీతం అభ్యసించారు. 1953లో ఆమె తండ్రి – ఎజ్రా మీర్ గారి ‘పాంపోష్’ అనే సినిమాకి పాటలు రాసి, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం తన తండ్రికి స్వరకల్పనలో ఆమె సాయం చేశారని అంటారు.

ఉషా ఖన్నా హిందీ సినిమాలకే కాకుండా మలయాళం సినిమాలకి సంగీతం అందించారు. యేసుదాసు పాడిన ‘నీ మధు పకరు’ ఆమె సృజించినదే. అలాగే ఉష సంగీతం అందించిన మరో పాటని ఎస్. జానకి పాడారు.

తనలో సంగీతం పట్ల ఆసక్తి కలిగేందుకు కారణం తన తండ్రేనని ఉష చెప్తారు. “నాన్నకి శాస్త్రీయ సంగీతం వచ్చు. నా కవల సోదరులు ఎక్కువ సమయం అమ్మతో గడిపితే, నేను నాన్నని అంటిపెట్టుకు ఉండేదాన్ని. నన్ను భుజాన వేసుకుని నిద్రపుచ్చేవారు. నేను ఏడ్చినప్పుడల్లా ఏదో ఒక రాగం ఆలపించేవారు. సినిమాల్లోని నా ప్రవేశం, సినిమా రంగంలో నా ప్రస్థానం కఠినం కాలేదు. ఈ పరిశ్రమలో ప్రవేశించాలనుకునే వారి కష్టాలు నేను విన్నాను, చూశాను. కాని అదృష్టవశాత్తు నాకెలాంటి కష్టాలు ఎదురవలేదు. గాయని అవ్వాలనుకున్నాను, సంగీతదర్శకురాలిని అయ్యాను.” అని చెప్పారు.

“ఒక మ్యూజిక్ స్టూడియోకి మొదటిసారిగా వెళ్ళినప్పుడు, ఒక సుప్రసిద్ధ స్వరకర్త ‘నువ్వు లతా మంగేష్కర్ కన్నా లేదా ఆశా భోస్లే కన్నా గొప్పగా పాడగలవా’ అని నన్ను అడిగారు. పాడలేనన్నాను. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారాయన. అక్కడే ఉన్న ఇందీవర్ గారు (గీత రచయిత), ‘ఈ అమ్మాయి సంగీతం సమకూరుస్తుంది’ అని అన్నారు. వాళ్ళు నేను నా రెండు పాటలు విన్నారు, ఆ విధంగా నాకు నా మొదటి అవకాశం లభించింది. ఎప్పుడైనా లత లేదా ఆశా తీరిక లేకుండా ఉండి, రికార్డింగుకు రాలేకపోతే, నేను రంగంలోకి దిగేదాన్ని” (జానీ మేరా నామ్ చిత్రంలో హేమ మాలిని, దేవ్ ఆనంద్‍లపై చిత్రీకరించిన ‘పల్ భర్ కే లియే కోయి హమే ప్యార్ కర్లే’ పాట ఉష పాడారు) చెప్పారామె.

‘దిల్ దేకే దేఖో’ చిత్రానికి ఉష పది పాటలు సమకూర్చారు. అవన్నీ హిట్ అయ్యాయి. ఆ ఏడు విడుదలయిన అన్ని సినిమా పాటల కన్నా ఎక్కువ పేరు పొందాయి. ‘దిల్ దేకే దేఖో’ సినిమా 18 సెప్టెంబరు, 1959  నాడు విడుదలయింది. ఆ ఏటి సూపర్ హిట్ మ్యూజికల్‍గా నిలిచింది. కానీ తన సంగీతం ఓ.పి. నయ్యర్ సంగీతంలా ఉందన్న విమర్శని ఉష ఎదుర్కోవలసి వచ్చింది. నయ్యర్ ‘తుమ్‌సా నహీ దేఖా’ (1957) సినిమాకి సంగీతం అందించారు. ‘దిల్ దేకే దేఖో’ సినిమాలో కూడా అలాంటి సంగీతమే ఉండడంతో నయ్యర్ గారితో గొడవయింది. ‘దిల్ దేకే దేఖో’ సినిమాలోని పది పాటలకు – రఫీ, ఆశా పూర్తి న్యాయం చేశారు. రఫీ నాలుగు సోలోలు, ఆశా ఒక సోలో – మిగతావి యుగళ గీతాలు. వీటిని మజ్రూహ్ సుల్తాన్‌పురి రచించారు.

ఈ సినిమా ఘన విజయం తర్వాత ముఖర్జీ గారు ఫిల్మాలయ బ్యానర్ పై తాము తీయబోయే తరువాతి సినిమా ‘హమ్ హిందుస్థానీ’ (1960)కి ఉషను సంగీత దర్శకురాలిగా ఎంచుకున్నారు. సునీల్ దత్, ఆశా పరేఖ్, జాయ్ ముఖర్జీ ప్రధాన తారాగణం. ఈ సినిమాలోని – ఛోడో కల్ కీ బాత్, కల్ కీ బాత్ పురానీ – అధిక ప్రజాదరణ పొందింది. తన తండ్రి రచించిన, లత పాడిన ‘నీలీ నీలీ ఘటా ఓ భీగీ భీగీ హవా’ పాటను ఉష స్వరపరిచారు. లత పాడిన సోలో – ‘చోరీ చోరీ ఆయే హై రాధా’; ‘మాఝీ మేరీ కిస్మత్’ అనే పాటలను రాజేంద్ర క్రిష్ణన్ రాశారు. వరుసగా రెండు పెద్ద హిట్ సినిమాలు ఇచ్చినప్పటికీ, పెద్ద పెద్ద సంస్థల నుంచి ఉషకి అవకాశాలు రాలేదు. అందుకని షేక్ ముక్తార్, దారాసింగ్, మహమూద్, ఫిరోజ్ ఖాన్, సంజీవ కుమార్ వంటి వర్ధమాన నటుల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ‘ఫ్లాట్ నెంబర్ 9’ (1961) సినిమాలో ‘గా దీవానే ఝూమ్ కే రాత్’ అనే ముకేశ్ పాట, లత పాడిన ‘ఆంఖోం సే మైనే పీ’, ‘ధీరే చలో మోరే సైయా’ అనే రెండు పాటల్ హిట్ అయ్యాయి.

ముఖర్జీ గారు తమ సంస్థలో తీసే తదుపరి చిత్రం ‘ఆవో ప్యార్ కరే’ (1964) సినిమాకి అవకాశం ఇచ్చారు. జాయ్ ముఖర్జీ, సైరా బానో ముఖ్య తారాగణం. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించకపోయినా, ఉష స్వరపరిచిన కొన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి. వాటిల్లో – ‘తుమ్ అకేలో తో కభీ’ (లత/రఫీ), ‘దిల్ కే ఆయినే మే తస్వీర్ తేరీ’ (రఫీ) ముఖ్యమైనవి. సారంగి, తబలా, వయోలిన్‍ల ఇంటర్‍లూడ్ లను ఉష అద్భుతంగా ఉపయోగించుకున్నారు. లత పాడిన సోలో – మేరీ దాస్తాన్ ముఝే హి మేరా దిల్ సునా కే రోయే – బాగా ఆదరణ పొందింది. ఫిల్మాలయ సంస్థతో ఉషకి ఇదే చివరి చిత్రం.

ఉషకి బి-గ్రేడ్ సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే మెహమూద్, విజయలక్ష్మి నటించిన ‘షబ్నమ్’ (1964) సినిమాలో పాటలు బాగా వచ్చాయి. ఉష తండ్రి జావేద్ అన్వర్ పేరిట రచించిన రెండు పాటలు – ‘యే తేరీ సాద్‌గీ’, ‘మైనే రఖాహై మొహబ్బత్’ గొప్ప హిట్ అయ్యాయి. ఫిరోజ్ ఖాన్, కుమ్‍కుమ్ నటించిన ‘ఏక్ సపేరా ఏక్ లుటేరా’ (1965) చిత్రంలో ‘హమ్ తుమ్ సే జుదా హోకే’ అనే పాట మాధుర్యంలో ముంచెత్తింది. ఇదే సినిమాలోని ‘ఉఠావో జమ్ చలో దోనో సాథ్ సాథ్’ (సుమన్ కళ్యాణ్‌పూర్) పాట కూడా జనరంజకమైంది. ఈ పాటని వివిధభారతిలో కొద్ది కాలం పాటు నిషేధించారు. నిషేధం తర్వాత ప్రసారమై ఎందరో శ్రోతలని అలరించింది.

అదే ఏడాది ఉష – షేక్ ముఖ్తార్, సంజీవ్ కుమార్, నజీమా నటించిన – ‘నిషాన్’ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలోని రెండు పాటలు – హాయ్ తబస్సుం తేరా (రఫీ), బోలో జో బోలో (సుమన్ కళ్యాణ్‌పూర్, ముకేశ్) – బాగా హిట్ అయ్యాయి. ‘ఆ జానే వఫా’ అనే పాటని ఉష స్వయంగా పాడారు.

ఉష – షేక్ ముఖ్తార్, ఎస్. విజయలక్ష్మి నటించిన – ‘బాదల్’ (1966) చిత్రానికి సంగీతం అందించారు. జావేద్ అన్వర్ రచించగా, మన్నా డే పాడిన ‘అప్నే లియే జియే తో క్యా జియే’ పాటకి జనాదరణ లభించింది. అలాగే ఫిరోజ్ ఖాన్, కుమ్‍కుమ్ నటించిన ‘మై వహీ హూఁ’ చిత్రంలో ఉష స్వరపరిచిన పాటలు హిట్ అయ్యాయి. పృథ్వీరాజ్ కపూర్, షేక్ ముఖ్తార్, సుజిత్ కుమార్, జయంతి నటించిన ‘లాల్ బంగ్లా’ చిత్రంలో ఇందీవర్ రచించగా ముకేశ్ పాడిన ‘చందా కో క్యా మాలూమ్’ ప్రసిద్ధి చెందింది.

1960వ దశకంలో ఉష – లక్ష్మీకాంత్ ప్యారేలాల్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కున్నారు. వారు శంకర్ జైకిషన్ ఆధిపత్యాన్ని సవాలు చేశారు.

‘ఏక్ పహేలీ’ (1971) చిత్రంలో ఉష సుమన్ కళ్యాణ్‌పూర్‍తో కొన్ని మంచి పాటలు పాడించారు. ‘మునిమ్‌జీ’ (1972) చిత్రంలోని రెండు పాటలు – ‘అబ్ తో ఆజా ధాల్నే లగా హై’, ‘పానీ మే జలే మేరా గోరా బదన్’ హిట్ అయ్యాయి. ‘సబక్’ (1973) చిత్రంలో ముకేశ్ పాడిన ‘బర్ఖా రాణీ జరా జమ్ సే బరసో’ అనే పాట హిట్ అయింది.

ఉష నిర్మాత దర్శకుడు, గీత రచయిత అయిన సావన్ కుమార్‍ని వివాహం చేసుకున్నారు. ఆయన సినిమా ‘హవస్’ (1974)కి సంగీతం అందించారు. వారి వివాహం విఫలమయినా, వారిద్దరూ వృత్తిపరంగా కలిసి పని చేశారు. ‘హవస్’ తర్వాత ఉషకి అవకాశాలు తగ్గాయి. వినోద్ మెహ్రా, బిందియా గోస్వామి నటించిన ‘దాదా’ చిత్రంలో ఉష మంచి పాటలు స్వరపరిచారు. రవీంద్ర జైన్ రచించిన ‘గర్దీ జాందీ ఇ ఛలంగ్ మార్డీ’ పాటకి, యేసుదాసు పాడిన ‘దిల్ కే టుక్డే టుక్డే కర్కే’ ఉష సంగీతం అందించారు. ఇవి జనాదారణ పొందాయి.

ఉషా ఖన్నాకి పేరు తెచ్చిన మరో చిత్రం ‘సాజన్ బినా సుహాగన్’ (1978). ఇందులో ‘మధుబన్ ఖుష్బూ దేతా హై’ అనే పాటని మూడు రకాలుగా స్వరపరిచారు. దీన్ని యేసుదాస్ సోలో, యేసుదాస్-అనురాధ పౌడ్వాల్ యుగళం, మరో వెర్షన్ ఉషా స్వయంగా పాడారు. ఉష ‘బిన్ ఫెరే హమ్ తేరే’ సినిమాకి సంగీతం అందించగా టైటిల్ సాంగ్‌ని కిషోర్ కుమార్ పాడారు. ‘మేరీ బీవీ కీ షాదీ’ (1979) సినిమాలో కిషోర్ ఒక హాస్యగీతం ఆలపించారు. 1980లలో ఉషా ఖన్నాకి చెప్పుకోదగ్గ చిత్రం 1983లో వచ్చిన సావన్ కుమార్ గారి ‘సౌతేఁ’. ఇందులో రాజేష్ ఖన్నా, టీనా మునీమ్, పద్మినీ కోల్హాపురీ నటించారు. ఈ చిత్రంలో లత, కిషోర్ పాడిన ‘షాయద్ మేరీ షాదీ కా కయాల్’ అనే పాట, కిషోర్ పాడిన ‘జిందగీ ప్యార్ కా గీత్ హై’ హిట్ అయ్యాయి. ఉషా ఖన్నా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకి నామినేట్ అయ్యారు. ఆమె చివరి సినిమా సావన్ కుమార్ గారి ‘దిల్ పర్‌దేశీ హోగయా’ (2003).

ఉషా ఖన్నా ఎన్నో టీవీ సీరియల్స్‌కి, కొన్ని మలయాళం సినిమాలకి కూడా సంగీతం అందించారు.

‘మధుబన్ ఖుష్బూ దేతా హై’ అనే పాటని పాడేందుకు బొంబాయి వచ్చిన యేసుదాసుకి ఎదురైన అనుభవాన్ని వివరించారు ఉష. “ఆ రోజు బాగా వాన పడుతోంది. యేసుదాసు కోసం స్టూడియోలో ఎదురు చూస్తున్నాం. ఇప్పట్లా అప్పట్లో మొబైల్ ఫోన్‍లు లేవు. యేసుదాసు ఇంకా రాలేదు. రెండు గంటల తర్వాత బట్టలన్నీ తడిసిపోయిన స్థితిలో యేసుదాసు స్టూడియోకి చేరుకున్నారు. “అక్కా, ఈరోజు నేను రాలేకపోయింటే, ఈ పాటని కిషోర్ దా తో పాడించేదానివి” అన్నారట.

సోను నిగమ్‍ని పరిశ్రమకి పరిచయం చేసిన ఘనత ఉషా ఖన్నాదే. “ఒకప్పుడు ఎందరో నాకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు నేను కొందరికి ఈయగలుగుతున్నాను” అన్నారామె వినయంగా.

ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో అడిగిన ప్రశ్నలకు జవాబుగా రఫీ, కిషోర్ గార్ల గొప్పతనాన్ని చెప్తూ, ఇద్దరివీ ఎంత విభిన్నమైన శైలులో వివరించారు. అలాగే పాటలనీ క్లాస్, మాస్ ల పరంగా విభజించడాన్ని సమర్థించుకున్నారు. తాను చేసిన క్లాస్, మాస్ పాటలను ప్రస్తావించారు. సినిమా రంగంలో వచ్చిన మార్పులను వెల్లడించారు.

45 ఏళ్ళ పాటు సాగిన కెరీర్‍లో ఉషా ఖన్నా 200 సినిమాలకు సంగీతం అందించారు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక మహిళా స్వరకర్త ఈమే. సినీరంగానికి ఆమె చేసిన సేవలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి గాను లతా మంగేష్కర్ అవార్డుతో సత్కరించింది.

***

ఉషా ఖన్నా స్వరపరిచిన కొన్ని గీతాలను యూట్యూబ్‌లో చూడండి

https://www.youtube.com/watch?v=kGh77mgEmKk

https://www.youtube.com/watch?v=ZPT-rm0C0WE

https://www.youtube.com/watch?v=3DRVa58kAks

https://www.youtube.com/watch?v=0weRgdk8_do

https://www.youtube.com/watch?v=zBVrnjx8Ai8


ఓసిడితో బాధపడిన హోవార్డ్ హ్యుస్:

హోవార్డ్ హ్యుస్ (1905-1976) అమెరికన్ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, ఏవియేటర్, సినీ నిర్మాత, దర్శకులు, దాత. ప్రపంచంలోనే ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తులుగా తమ జీవితకాలంలోనే పేరు పొందిన వ్యక్తులలో ఒకరు.

ది రాకెట్ (1928), హెల్స్ ఏంజిల్స్ (1930) వంటి అధిక బడ్జెట్, వివాదాస్పద చిత్రాల ద్వారా ఆయన హాలీవుడ్‍లో 1920 దశకంలో చివరిలో ప్రాధాన్యత సాధించారు. సెన్సార్ వాళ్ళు హింస అతిగా ఉందన్న కారణంతో అభ్యంతరం చెప్పడంతో ఆయన తీసిన Scarface (1932), అనే చిత్రం విడుదలవడానికి ఆలస్యమైంది. తదుపరి కాలంలో ఆయన RKO ఫిల్మ్ స్టూడియో అధికారం దక్కించుకున్నారు. 1941 నాటికి ‘అవుట్‌లా’ చిత్రం పూర్తి చేశారు (ఇది 1943లో విడుదలైంది). ఇందులో జేన్ రస్సెల్ నటించారు. ఈమె కాస్ట్యూమ్స్ వల్ల కూడా సెన్సార్ వాళ్ళు కొంత అభ్యంతరం చెప్పారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేయిన బ్రాసరీని ధరించేందుకు జేన్ రస్సెల్ అభ్యంతరం చెప్పడం కూడా వివాదానికి దారితీసింది. ఆ స్టూడియోని 1955లో అమ్మేసి, విమానయాన రంగంలోకి తిరిగి ప్రవేశించారు హ్యుస్.

1932లో హ్యూస్ ఎయిర్‍క్రాఫ్ట్ కంపెనీ స్థాపించారు. 30వ దశకంలో మిగిలిన సంవత్సరాలు, 40వ దశకంలో చాలా ఏళ్ళు ఆయన విమానయాన రంగంలో ఎన్నో రికార్డులను సృష్టించారు.  హ్యూస్ – స్ప్రూస్ గూస్ – అనే H4 హెర్క్యూలస్ విమానాన్ని రూపొందించారు. ఆయన ట్రాన్స్‌వరల్డ్ ఎయిర్‍లైన్స్‌ కంపెనీనీ, ఎయిర్ వెస్ట్ సంస్థని కొనుగోలు చేసి వాటికి తన పేరు పెట్టుకున్నారు.

హ్యూస్ వయసులో తన కన్నా ఎంతో చిన్నవాళ్ళయిన ఎంతో మంది సుందరాంగులతో డేటింగ్ చేశారు. బిల్లీ డోవ్, ఫెయిత్ డోమెర్గ్, బెట్టె డేవిస్, అవా గార్డెనర్, ఓలివియా డి హవిల్లాండ్, కాథరిన్ హెప్‍బర్న్, జింజర్ రోజర్స్, జేనెట్ లీగ్, రీటా హేవర్త్, మేమీ వాన్ డోరెన్, జీన్ టియర్నీ మొదలైనవారు ఇందులో ముఖ్యులు. జోన్ ఫోంటైన్‌ను పెళ్ళి చేసుకుంటానని పలుమార్లు ప్రతిపాదించారు.

తరువాతి కాలంలో విపరీత ప్రవర్తనకి ప్రసిద్ధి చెందారాయన. ఒంటరిగా నివసిందేందుకు ఇష్టపడేవారు. ఇందుకు కారణం తీవ్రమైన అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ లేదా ఓసిడి అని తరువాత నిర్ధారించారు.

1966లో హ్యూస్ లాస్ వేగాస్‍లో డెజర్ట్ ఇన్‍ అనే హోటల్‍లో గదిని ఖాళీ చేసి వెళ్ళిపోయాకా, అక్కడున్నంత కాలమూ ఆయన అసలు పెద్ద కర్టెన్‍లను తెరవనే లేదని, అలాగే సహజ వెలుతురు లేకుండా ఉన్నారని హోటల్ సిబ్బంది కనుగొన్నారు. అది మాలిన్యం పట్ల ఉన్న విపరీత భయమే ఇందుకు కారణమని వారు భావించారు. ఈ భయాలని లియోనార్డీ డికాప్రి నటించిన ‘ది ఏవియేటర్’ సినిమాలో స్పష్టంగా చూడవచ్చు.

ఆయన చివరి రోజుల్లో హోటల్ గదికి పరిమితమై, చీకటిలో గడుపుతూ – క్రిమి రహితమని తాను భావించిన ప్రదేశంలో పరుపు వేసుకుని నగ్నంగా పడుకునేవారట. పాదాలకి టిస్యూ బాక్సులు ధరించేవారట. తనకి సమీపంలో ఎవరైనా జబ్బు పడితే, ఆయన తన దుస్తులను తగలబెట్టేసేవారట.

ఈ విపరీత భయం – జబ్బుగా మారి, 1976లో చనిపోవడానికి రెండు దశాబ్దలా ముందు హ్యూస్ ఒంటరితనాన్ని ఆశ్రయించేలా చేసిందనే పుకార్లు ఉన్నాయి.

హ్యూస్ మరణం తరువాత ఆయన అటార్నీ – చివరి రోజుల్లో హ్యూస్ మానసిక, భావోద్వేగ స్థితిగతులను అంచనా వేసేందుకు – సైకలాజికల్ అటాప్సీ నిర్వహించవలసిందిగా రేనాల్డ్ డి ఫోలర్ అనే మానసిక శాస్త్రవేత్తని కోరారు. రేనాడ్ల్ అప్పట్లో యూనివర్శిటీ ఆఫ్ అలబామాలో సైకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండేవారు. ఈ అటాప్సీ నిర్వహించడానికి రేనాల్డ్ – హ్యూస్ మాజీ సిబ్బందిని విచారించారు, హ్యూస్ గురింవి వార్తలు ప్రచురించిన పత్రికలను అధ్యయనం చేశారు. న్యాయస్థానాల తీర్పులను, హ్యూస్ తల్లి ఆయనకి రాసిన ఉత్తరాలను పరిశీలించారు. పైలట్‍గా ఉన్నప్పటి హ్యూస్ లాగ్‌లను, ఇతర ట్రాన్‌స్క్రిప్ట్‌లను పరిశోధించారు.

వీటి ఆధారంగా బాల్యంలో మిత్రులెవరూ లేక, హ్యూస్ ఒంటరితనానికి అలవాటు పడ్డారనీ, తన ఆరోగ్యంపై అమితంగా దిగులుపడే వ్యక్తిగా మారారని రేనాల్డ్ తేల్చారు. తాను జబ్బు పడతానేమోననే భయం హ్యూస్‍కి చిన్నప్పటి నుండీ ఉండేదని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. ఆయన బాల్యంలో పోలియో వివరీతంగా ప్రబలేది. తనకి ఆ రోగం సోకుతుందేమోనని ఆయన విపరీతంగా భయపడేవారట. ఆయన తల్లి తన కుమారుడిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించేవారట. యవ్వనంలో ఒకసారి హ్యూస్ పక్షవాతానికి గురై, కొంతకాలం నడవలేకపోయారట. తర్వాత జబ్బు తగ్గి మామూలు మనిషయ్యారట. ఆయనకి క్రిములంటే ఉన్న భయం ఆయనతో పాటు పెరుగుతూ వచ్చింది. క్రిముల పట్ల ఎలా జాగ్రత్త వహించాలో ఒక నోట్ ద్వారా ఆయన తన సిబ్బందికి తెలియజేశారు.

అయితే క్రిములు తన నుంచి రావని, బయటి నుంచే వస్తాయని ఆయన విశ్వసించేవారని రేనాల్డ్ తెలిపారు. బయటి నుంచి మాత్రమే రోగాలు సోకుతాయని ఆయన భావించేవారు.

తన భోజనం వడ్డించే సిబ్బందిని పలు మార్లు చేతులు కడుక్కోమని చెప్పేవారు. ఆ తరువాత చేతులకి పేపర్ టవల్స్ వేసుకుని అప్పుడు వడ్డన చేయమనేవారు. ఇలాంటి భయస్థులు ఉన్న కుటుంబాలలో మిగతావాళ్ళు పడే బాధ అందరికీ తెలిసినదే. కొన్ని వస్తువులను తాకే ముందు హ్యూస్ వింత జాగ్రత్తలు తీసుకునేవారు. ఎవరైనా సిబ్బంది ఆయనకి ఒక చెంచా ఇవ్వాలంటే దాని చివరన టిస్యూ పేపర్ చుట్టి, దానిపై టేప్ వేసి ఇవ్వాలి. ఒక టేప్ మీద రక్షణ కోసం మరో టేప్ వేసేవారట. అలా హాండిల్ కవర్ చేసి ఉన్న చెంచాలనే హ్యూస్ వాడేవారట.

తన సిబ్బందికి ఆయన మరిన్ని జాగ్రత్తలు/సూచనలు చేశారు. బాత్ రూమ్ నుంచి తన హియరింగ్ ఎయిడ్ కార్డు తీయడానికి తన సిబ్బంది:

  • బాత్ రూమ్ తలుపు నాబ్‌ని ఆరు నుంచి ఎనిమిది టిస్యూ పేపర్స్ ధరించి తాకాలి.
  • ఆ తరువాత బాత్ రూమ్ క్యాబినెట్ తెరవడానికి మరో ఆరు నుంచి ఎనిమిది కొత్త టిస్యూ లను వాడాలి. అప్పుడే ఉపయోగించని సబ్బుని తీసేయాలి.
  • తరువాత చేతులు కడుక్కోవాలి
  • హియరింగ్ ఎయిడ్ ఉన్న క్యాబినెట్‍ను తెరవడానికి కనీసం 15 కొత్త టిస్యూలను వాడాలి

ఈ రకంగా చాలా వివరంగా ఆయన తన సిబ్బందికి ఆజ్ఞలిచ్చారు. అయితే తరువాతి కాలంలో ఆయనే స్వయంగా తన పరిశుభ్రతని నిర్లక్ష్యం చేశారు. రోజుల పాటు దంతధావనం చేసేవారు కాదు, స్నానం చేసేవారు కాదు. కోడైన్ అనే డ్రగ్‌కి అలవాటు పడడం వల్ల చాలా మితంగా ఆహారం తీసుకునేవారు. దీనివల్ల ఆయన బాగా కృశించిపోయారు. 1976లో చనిపోయినప్పుడు ఆయన శరీరం ఎంతగా వడలిపోయి ఉండంటే – యుద్ధ శిబిరాలలోని నిర్బంధ జపనీస్ ఖైదీ శరీరంలా ఉందట.

ఈ ఓసిడి అనే వ్యాధి ప్రపంచంలో చాలామందికి ఉంటుదని, బయటి వస్తువుల వల్ల రోగాలు సోకే ప్రమాదం ఉందనే విశ్వాసం చాలామందికి ఉంటుందని నిపుణుల అభిప్రాయం. టాయ్‍లెట్ల లోని క్రిముల భయం వల్ల చాలామంది టాయ్‍లెట్‌లో బకెట్ వాడరట.

2016లో ప్రచురితమైన ఒక వ్యాసంలో హ్యూస్ గురించి వెలువడిన జీవితచరిత్రల్లో చాలా వాటిల్లో ఈ ఓసిడి ప్రస్తావన ఉన్నట్టు బిబిసి తెలిపింది. ఓ ప్రముఖ నటి లోదుస్తులను తన విమానానికి అతికించుకున్న హ్యూస్ స్వభావం బహుశా ఆయన విజయానికి కారణమై ఉంటుందని కొందరంటారు. ఎవరేమన్నా అత్యంత ప్రతిభావంతుడైన ఈ వ్యక్తి జీవితాన్ని ఓసిడి తీవ్రంగా ప్రభావితం చేసిందని అందరూ అంగీకరిస్తారు. ఓ వ్యక్తి ఓసిడి లేకుండా పర్‌ఫెక్షనిస్ట్‌గా ఉండవచ్చు, కానీ ఓసిడి లేకపోయుంటే హ్యూస్ మరిన్ని ఘనతలు సాధించేవారేమో అనడంలోనూ అతిశయోక్తి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here