అలనాటి అపురూపాలు-132

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

చక్కని నటి నిమ్మీ:

నవాబ్ బానో అనే ఔత్సాహిక యువతికి ‘నిమ్మీ’ అని పేరు పెట్టి వెండితెరకి పరిచయం చేసింది షో-మాన్ రాజ్ కపుర్. రాజ్ కపూర్ ‘బర్సాత్’, మహబూబ్ ఖాన్ ‘ఆన్’ నిమ్మీకి పేరు తెచ్చాయి.

ఆమెను ‘గోల్డెన్ గర్ల్ ఆఫ్ గోల్డెన్ ఎరా’ అని వ్యవహరిస్తారు. 1950లలో… సంగీతం, కవిత్వం, రొమాన్స్… ఇవన్నీ కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశంలో ఓ రకమైన ఆశని నింపాయి. నర్గిస్, మధుబాల, మీనా కుమారి, వైజయంతిమాల వంటి అందాల తారలు రాజ్యమేలుతున్న రోజులలో నాజూకు ‘నిమ్మీ’ రంగప్రవేశం చేశారు. ‘బర్సాత్’లో ద్వితీయ కథానాయిక పాత్ర పోషించినా, హిట్ పాటలు, ప్రేక్షకుల సానుభూతి లభించాయి. అందువల్ల తరువాత ఆమె రాజ్ కపూర్, దేవ్ ఆనంద్ లతో హీరోయిన్‍గా నటించారు. దిలీప్ కుమార్‌తో – దీదార్, దాగ్, అమర్, ఉడన్ ఖటోలా వంటి చిత్రాలలో ఆయనతో సమానంగా నటించారు. దాంతో ఆమెకు ప్రేక్షకాదరణ, పత్రికల ఆదరణ లభించాయి. షోరాబ్ మోడి గారి ‘కుందన్’ లోనూ, వి. రామన్ గారి ‘భాయ్ భాయ్’లోనూ ఆమె కనబరిచిన అసాధారణ ప్రతిభ అద్భుతం. కె. అసిఫ్ గారి ‘లవ్ అండ్ గాడ్’ చిత్రంలో ఆమె నటన అపూర్వం, నిమ్మీ చెరగని సౌందర్యానికి నిదర్శనం కూడా.

నేడు ఆమె వదనం గతానికి అనునాదంలా ఉంటుంది. ఆమెలోని లక్నోవి ఉర్దూ, కవిత్వం పట్ల ఆసక్తి నిలిచే ఉన్నాయి. తనకి దిలీప్ కుమార్ అన్నా, రాజ్ కపూర్ అన్నా అభిమానమని ఆవిడ చెబుతారు. అయినా గతాన్ని అంటిపెట్టుకునే స్వభావం కాదామెది. ఎవరితోనూ ప్రేమ కథలు లేవామెకి. 2007లో రచయిత అయిన తన భర్త ఎస్. అలీ రజాని కోల్పోవడంతో ఒంటరి జీవితంలోని వాస్తవాలను గ్రహించారు. కృతజ్ఞత ఆమె ఆభరణం. “ఏ కళాకారుడికైనా అత్యంత దుర్భరమైన స్థితి ఏంటంటే ప్రజలు అతన్ని/ఆమెని గుర్తుపట్టని సమయం. దేవుడి దయ… నేను బయటకు వెళ్తే ఇప్పటికీ నన్ను కొందరు గుర్తు పడతారు” అన్నారామె.

1948లో గాంధీజీ హత్య అనంతరం చెలరేగిన అల్లర్లను తప్పించుకోవడానికి 15 ఏళ్ళ నవాబ్ బానో (నిమ్మీ అసలు పేరు) తన అమ్మమ్మతో సహా ఆగ్రా సమీపంలోని ఫతాహ్‍బాద్‌ను విడిచారు. నిమ్మీ తాతగారు నిమ్మీని బొంబాయి తీసుకెళ్ళమని తన భార్యకి సూచించారు. నిమ్మీకి పదేళ్ల వయసులోనే ఆమె తల్లి, నటి/గాయని వహీదాన్ చనిపోయారు. నిమ్మీ, ఆమె అమ్మమ్మ తమ బంధువు – నిర్మాత/సంగీత దర్శకుడు అయిన జి.ఎమ్. దుర్రాని భార్య నటి జ్యోతి గారి ఇంట బస చేశారు. తరువాత వారు నిమ్మీ తల్లి వహీదాన్‌తో పని చేసిన మహబూబ్ ఖాన్ గారి సహాయం కోరారు. ఆయన వారిని ఒక గదిలో ఉంచారు. “అది సౌకర్యంగా ఉండేది కానీ, టాయ్‍లెట్ బయట ఉండేది. నా సహాయకురాలు వరుసలో నిలబడి, నా వంతు వచ్చినప్పుడు నన్ను పిలిచేది” అని గుర్తు చేసుకున్నారు నిమ్మీ.

ఆరోజుల్లో మహబూబ్ ఖాన్ – రాజ్ కపూర్, నర్గిస్, దిలీప్ కుమార్ లతో – అందాజ్ అనే సినిమా తీస్తున్నారు. ఒకరోజు నిమ్మీ, అమ్మమ్మతో కల్సి ఆ సినిమా షూటింగ్‌కి వెళ్ళారు. అప్పుడే నర్గిస్ తల్లి జద్దన్‌బాయి కూడా వచ్చారట. ఆవిడని చూస్తూనే రాజ్ కపూర్ లేచి వెళ్ళి పాదాలకు నమస్కారం చేశారట. అదే సమయంలో ఆయన నిమ్మీని చూశారట. పేరేమిటి అని అడిగారట. తన పేరు చెప్పడానికి అప్పుడు ఐదు నిమిషాలు పట్టిందని నిమ్మీ చెప్పారు. అప్పట్లో రాజ్ కపూర్ తన చిత్రం ‘బర్సాత్’ కోసం కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఆయనకు నిమ్మీలో ఏదో ఆకర్షణ కనిపించింది. “కొద్ది రోజుల తర్వాత, ఆయన నా కోసం కారు పంపించి, ఆడిషన్‌కి రమ్మన్నారు. నాకెంతో భయం వేసింది, ఆడిషన్ జరుగుతున్నంత సేపూ ఏడుస్తూనే ఉన్నాను. నేను ఎమోషన్స్ బాగా పండించగలని రాజ్ భావించారు” చెప్పారు నిమ్మీ.

రాజ్ కపూర్ ఆమెకి నిమ్మీ అని పేరు పెట్టారు. ఆమెకు ‘బర్సాత్’లో పర్వత ప్రాంత యువతి పాత్ర ఇచ్చారు. “మొదట్లో నాకు రాజ్ గారంటే భయం ఉండేది. నన్ను సౌకర్యంగా ఉంచడానికి, నా భయం పోగొట్టడానికి ఓ రోజు రాఖీ తెచ్చి తన చేతికి కట్టమన్నారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది ఆయనకి రాఖీ కట్టేదాన్ని” చెప్పారు నిమ్మీ. ‘బర్సాత్’లోని టైటిల్ సాంగ్ – ‘బర్సాత్ మే హమ్ సే మిలే’, ఇంకా ‘జియా బేకరార్ హై’, ‘హవా మే ఉడ్‌తా జాయే’, ‘పతలీ కమర్ హై’ వంటి పాటలు నిమ్మీపై చిత్రీకరించారు. తరువాత దేవ్ ఆనంద్‍తో చేసిన సజా, ఆంధియా ఆమె స్థానాన్ని స్థిరం చేశాయి. “దేవ్ ఆనంద్ గారిని సెట్‍లో ఎప్పుడూ ఖాళీగా చూడలేదు. అవసరమైనప్పుడు మాత్రమే, మర్యాదగా మాట్లాడేవారు. షాట్ అయిపోతే, వెంటనే తన మేకప్ రూమ్‍కి వెళ్ళిపోయేవారు” చెప్పారు నిమ్మీ. ‘The Unkissed girl of India’ గా పేరు పొందిన నిమ్మీకి పెద్ద హిట్ – మహబూబ్ ఖాన్ గారి ‘ఆన్’ (1952). దిలీప్ కుమార్, ప్రేమ్ నాథ్, నాదిరా తదితరులు నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో కథలో మొదట్లో నిమ్మీ పాత్ర ‘మంగళ’ తొందరగా చనిపోతుంది. కానీ డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ మేరకు ఓ స్వప్న సన్నివేశాన్ని కల్పించి సినిమాలో ఆ పాత్ర నిడివిని పెంచారట. ఈ సినిమాని లండన్‍లో ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్నప్పుడు, Errol Flynn తో సహా ఇతర పాశ్చాత్య సిని ప్రముఖులు – ఈ బృందానికి స్వాగతం చెప్పేందుకు నిలబడి ఉన్నారట. Errol Flynn నిమ్మీ చేతిని ముద్దాడబోతే, వెనక్కి లాక్కుని – నేను భారతీయురాలినని తెలియదా – అని అన్నారట నిమ్మీ. మర్నాడు వార్తాపత్రికలలో ‘The Unkissed girl of India’ గా ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ‘ఆన్’ ఇంగ్లీష్ వెర్షన్‌కి Savage Princess అని పేరు పెట్టి విడుదల చేశారు. ఈ సినిమా ఫ్రెంచ్ భాషలోకి డబ్ అయినప్పుడు Mangala, Fille des Indes (Mangala, Girl Of India) అని పేరు పెట్టారు. తరువాత తనకి కొన్ని హాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని, తనకి ఆసక్తి కలగలేదని చెప్పారు నిమ్మీ.

మహబూబ్ ఖాన్ గారి ‘అమర్’ (1954)లో హీరో దిలీప్ కుమార్‌చే రేప్‍కి గురయ్యే పాల యువతి పాత్ర పోషించారు నిమ్మీ. తొలుత ఈ సినిమాలో నటించవలసిన మీనా కుమారి గురించి చెప్పారు నిమ్మీ. “ఒకరోజు నేను సెంట్రల్ స్టూడియోకి వెళ్ళాను. అక్కడ ఓ బల్ల మీద కూర్చుని బాధపడుతూ కనిపించారు మీనా కుమారి. ‘అమర్’ చిత్రంలో నిజానికి మధుబాల స్థానంలో మీనా కుమారి నటించాలి. కానీ కమల్ అమ్రోహి సినిమాతో డేట్స్ కలవడం వల్ల నటించలేకపోయారు” చెప్పారు నిమ్మీ. చాలా సంవత్సరాల తర్వాత నిమ్మీ – మీనా కుమారితో ‘చార్ దిల్ చార్ రాహేఁ’ (1959)లో నటించారు.

అందరికంటే తనకి నర్గిస్‍తో ఎక్కువ స్నేహమని నిమ్మీ చెప్పినా, ఆమె ఇతరులతోనూ అంతే స్నేహంగా ఉండేవారు. ‘అమర్’ చిత్రం షూటింగ్‍లో ఒకరోజు నిమ్మీ మధుబాల కుర్చీలో కూర్చుని ఉన్నారుట. అప్పుడే ఆమె సెట్ లోకి వచ్చారట. అది చూసిన సహాయకురాలు లేవమని అంటే – పర్వాలేదు కూర్చోమని అన్నారుట మధుబాల. అలా తమ మధ్య స్నేహం పెరిగిందని నిమ్మీ అన్నారు. మధుబాలది అందమైన రూపమని, స్నేహస్వభావమని నిమ్మీ పేర్కొన్నారు.

ఎంతోమంది లానే తాను కూడా దిలీప్ కుమార్ నటనకి అభిమానినని నిమ్మీ పేర్కొన్నారు. “ఆయన ప్రతీ షాట్‍ని ఎంతో సహజంగా చేస్తారు. సినిమా రంగంలోని అన్ని అంశాల మీదా ఆయనకు అవగాహన ఉంది. ఎంతో అందంగా వ్యక్తీకరించగలరు. ఆయనో అద్భుతం” అన్నారు నిమ్మీ. వీరిద్దరూ కలసి 50వ దశకంలో అయిదు సినిమాలు – ఆన్, అమర్, దీదార్, దాగ్, ఉడాన్ ఖటోలా -లలో నటించారు. తెర వెనుక కూడా వీరి రొమాన్స్‌పై పుకార్లు వచ్చాయి. ఆయన వ్యక్తిత్వంలోని ఆకర్షణ గురించి నిమ్మీ వివరించారు. “దేవుడు ఆయనకి అయస్కాంతం లాంటి శక్తినిచ్చాడు. ప్రతి ఒక్కరూ ఆయన వైపు ఆకర్షితులవుతారు. ఒక మహారాణి ఆయన కోసం అన్నీ వదిలి వచ్చేయాలనుకున్నారు. నాకు కూడా ఆయనంటే ఎంతో ఇష్టం, అభిమానం” అన్నారు నిమ్మీ. “పెద్ద పెద్ద నటీమణులే ఆయనంటే ప్రేమలో ఉండేవారు. వాళ్ళతో నేనెలా పోటీ పడగలను? అయినా అందని వాటి కోసం ప్రయత్నించడం, విఫలమయి బాధపడడం నాకిష్టం లేదు” చెప్పారామె. “ఆన్ సినిమా షూటింగ్‍లో నేను గుర్రం పై ఉన్నాను. నా చేతిలో కత్తి ఉంది. కత్తి మొన దిలీప్ గారికి తాకింది. మన్నించమన్నాను. పర్వాలేదు, జీవితంలో అయిన గాయాలలో ఇదీ ఒకటి అని అన్నారాయన. ఈ మాటలు వింటే ఏ ఆడపిల్ల అయినా ఆయనపై అభిమానం పెంచుకుంటుంది. నేనూ అంతే. ఆ రాత్రి ఈ సంఘటన గురించే ఆలోచించాను. నేనేం దేవకన్యని కాను, మామూలు మనిషినే. ‘ఆయన సాధారణమైన అమ్మాయి లాంటి నన్ను ఎందుకు ఇష్టపడతారు’ అని అనుకున్నాను. తరువాత నన్ను నేను సంబాళించుకున్నాను, ఆ విషయం మర్చిపోయాను” చెప్పారామె. సైరా బానుతో తనకున్న సత్సంబంధాలు ఈ కూడా ఈ నిర్ణయానికి కారణమంటారు నిమ్మీ.

నిమ్మీ ‘డంకా’ (1954) అనే సినిమాని నిర్మించారు. ‘కుందన్’ (1955) చిత్రంలో సునీల్ దత్ సరసన – తల్లీ కూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేశారు నిమ్మీ. అయితే 60వ దశకంలో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసికొట్టాయి. బి.ఆర్. చోప్రా గారి ‘సాధన’, రాజ్ ఖోస్లా గారి ‘ఓ కౌన్ థీ’ సినిమాలు వదులుకోడం ఇలాంటి తప్పుడు నిర్ణయాలే. ఆ రెండూ సూపర్ హిట్ అయి వైజయంతిమాలకి, సాధనకి పేరు తెచ్చిపెట్టాయి. అప్పట్లో పెళ్ళి చేసుకోమని తనపై బాగా ఒత్తిడి ఉండేదని, అందుకే కొన్ని సినిమాలు వద్దనుకున్నానని చెప్పారు నిమ్మీ. కాస్ట్యూమ్స్ అన్నీ సిద్ధం అయ్యాకా కూడా సరస్వతి చంద్ర గారి సినిమా వద్దనుకున్నారు నిమ్మీ. అప్పట్లో ఆమె రచయిత ఎస్. అలీ రజా గారితో ప్రేమలో ఉన్నారు. ఆయన నిమ్మీ నటించిన బర్సాత్, ఆన్, అమర్ చిత్రాలకు సంభాషణలు రాశారు. “రజా సాబ్ నిర్మాతగానూ రాణించాలనుకున్నారు. అది కూడా మా పెళ్ళికి ముందే” చెప్పారు నిమ్మీ.

‘మెరే మహబూబ్’ చిత్రంలో మొదట హీరోయిన్‍గా నిమ్మీనే అనుకున్నారు, కానీ ఆమె, ప్రాధాన్యత ఉందని భావించి ఆ సినిమాలోని సోదరి పాత్రని ఎంచుకున్నారు. అలాగే సాధన, నంద, ఆశా పరేఖ్, సైరా బాను, మాలా సిన్హా లాంటి వారంతా హీరోయిన్ పాత్రలలో దూసుకుపోతుంటే – నిమ్మీ – ‘పూజా కే ఫూల్’ (1964) చిత్రంలో అంధ యువతి లాంటి ఆఫ్ బీట్ పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చారు. అశోక్ కుమార్ మూగ భార్యగా నటించిన ‘ఆకాశ్‌దీప్’ (1964) చిత్రంలోని పాత్ర కూడా ఇలాంటిదే. సాంకేతికంగా ఇది నిమ్మీ చివరి చిత్రం.

ఒక సినిమా మాత్రం, ఇతర కారణాల వల్ల, ఆమె కెరీర్‌లో గుర్తుండిపోతుంది. అది కె. అసిఫ్ గారి ‘లవ్ అండ్ గాడ్’ (1986). ఈ సినిమా పూర్తవడానికి 26 ఏళ్ళు పట్టింది. “లవ్ అండ్ గాడ్ సినిమాని మొదట్లో భరత్ భూషణ్ గారితో బ్లాక్ అండ్ వైట్‍లో తీశారు. ఇంతలో మొఘల్-ఎ-ఆజమ్ ముందుకొచ్చింది. ఆ తరువాత మా సినిమాని గురుదత్ గారితో మళ్ళీ మొదలుపెట్టారు. కానీ ఏడేళ్ళు ఆగిపోయింది. గురుదత్ మరణించారు. అప్పుడు అసిఫ్ గారు సంజీవ్ కుమార్‌ని తీసుకున్నారు. తరువాత అసిఫ్ గారు చనిపోయారు. తరువాత ఆ సినిమాని విపరీతంగా ఎడిట్ చేశారు. ఫైనల్ ప్రింట్ చూస్తే అతుకుల బొంతలా అనిపించింది” అని విచారం వ్యక్తం చేశారు నిమ్మీ.

తన వైవాహిక జీవితం గురించి చెప్తూ “ఏ భర్త తన భార్యకి హారతి నివ్వడు. ఆమె ఎలిజబెత్ రాణి అయినా స్టార్ అయినా. మనం నిభాయించుకోవాలి. సుఖదుఃఖాలు జీవితంలో భాగం. అంటే, జీవితంలో నేనెన్నడూ బాధ పడలేదని కాదు. రజా సాబ్ పగటి పూట పని చేసుకుని సాయంత్రాలు స్నేహితులలో గడిపేవారు. నేనే మూర్ఖంగా నటన మానుకున్నాను. కానీ వర్లి లోని ఇంటిని చూసుకోడంలో సంతోషించేదాన్ని” అన్నారు.

అయితే కలలు కనడం మాత్రం మానలేదావిడ. “నా సొంత నిర్మాణ సంస్థ ఉండాలనేది నా కల. కమల్ సాబ్‍లా రజా సాబ్ కూడా గొప్ప దర్శకుడవ్వాలనుకున్నాను. నాకు చాలా గట్టి కోరిక ఉండేది, రజా సాబ్ అంత ఉత్సాహం చూపించలెదు. కొన్నాళ్ళకీ నేను ఆశలు వదులుకున్నాను. మా సంసారంలో గొడవలు వద్దనుకున్నాను.” చెప్పారు నిమ్మీ. తర్వాత ఈ దంపతులు జుహులోని అపార్ట్‌మెంట్‌కి మారారు. “ఇక్కడ ఆయన గుండె రక్తనాళాలలో బ్లాకులున్నాయని తెలిసింది. ఆయన 2007లో చనిపోయారు” చెప్పారు నిమ్మీ. ఈ దంపతులకు పిల్లలు లేరు. అయితే నిమ్మీ తన సోదరి కుమారుడికి తల్లి అయ్యారు. “నా చెల్లెలు చిన్న వయసులోనే చనిపోయింది. తన కొడుకుని నేను పెంచాలనేది ఆమె చివరి కోరిక. అందుకని పర్వేజ్‍ని నేను పాకిస్థాన్ నుంచి తెచ్చేసుకున్నాను” అన్నారు నిమ్మీ. అది బర్సాత్ విడుదలయ్యే సమయం! “ఇప్పుడు అతను తన కుటుంబంతో యు.కె.లో ఉంటున్నాడు.” చెప్పారు నిమ్మీ.

88 ఏళ్ళ వయసులో 25 మార్చ్ 2020 నాడు స్థానిక ఆసుపత్రిలో మృతి చెందారు నిమ్మీ.


మధురిమల బొరాల్:

“రాయ్‌చంద్ బొరాల్ సినీ సంగీతానికి తండ్రి లాంటి వారయితే, నేను బాబాయిని” అని ఎన్నో కచేరీలలో, గాన సభలలో, వ్యక్తిగత సంభాషణల్లో చెప్పారు అనిల్ బిస్వాస్. ఒక ప్రజ్ఞాశాలికి మరొక ప్రతిభావంతుడు అందించిన గొప్ప ప్రశంస ఇది.

ఆర్.సి. బొరాల్ అని పిలవబడే రాయ్‌చంద్ బొరాల్ 1903లో ఒక సుసంపన్న, సంస్కారవంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లాల్‍చంద్ బొరాల్ గొప్ప గాయకుడు, వాయిద్యకారుడు. బొరాల్ భవంతిలో ఎన్నో గొప్ప గొప్ప కచేరీలు జరిగేవి. ఈ కచేరీల పట్ల చిన్నారి బొరాల్ ఆసక్తి కనబరిచారు. కుమారుడికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి రామ్‌పుర్ నుంచి, గ్వాలియర్ నుంచి విద్వాంసులను రప్పించి పుత్రుడికి సంగీతంలో శిక్షణ ఇప్పించారు. రామ్‍పుర్ ఘరానాకి చెందిన గొప్ప గాయకుడు ఉస్తాద్ ముస్తాక్ హుస్సేన్ ఖాన్, గ్వాలియర్‌కి చెందిన ప్రసిద్ధ సరోద్ వాయిద్యకారుడు ఉస్తాద్ హఫీజ్ అలీ ఖాన్, రామ్‌పుర్‌కి చెందిన తబలా విద్యాంసుడు మసిత్ ఖాన్‌ల వద్ద విద్య నేర్చుకునే అదృష్టం ఆర్.సి.బొరాల్‍కి దక్కింది. ఈ గొప్ప గురువుల నుంచి విద్య నేర్చుకున్న బొరాల్ పియానో, తబాల కూడా అద్భుతంగా వాయించగలిగారు.

1927లో బొరాల్ 20లలో ఉండగా ఇండియన్ బ్రాడ్‍కాస్టింగ్ కంపెనీ – బొంబాయి తరువాత తమ రెండో స్టేషన్‍ని కలకత్తాలో ఆరంభించింది. కలకత్తా స్టేషన్‍లో సంగీత విభాగం అధిపతిగా చేరమని ఆ సంస్థ బొరాల్‍ని అడిగింది. అదే సమయంలో సినిమా ప్రసిద్ధి చెందుతోంది. జె.ఎఫ్. మదన్ అనే పార్శీ రంగస్థల ఔత్సాహికుడు – పార్శీ నాటకాలను – సినిమాలుగా రూపొందించే పనిలో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన సివిల్ ఇంజనీర్ బి.ఎన్. సర్కార్ కూడా సినిమాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఆయన ‘చషేర్ మేయే’, ‘చోర్ కాంతా’ అనే రెండు మూకీ సినిమాలు నిర్మించారు. వీటికి సంగీతం అందించవలసిందిగా ఆయన బొరాల్‍ని సంప్రదించారు. తెరకి ముందుగా తవ్విన ఓ గుంత నుండి లైవ్ ఆర్కెస్ట్రా నిర్వహించారు బొరాల్. ఈ రకంగా ఓ సంగీత జ్ఞాని ఉద్భవించాడు.

10 ఫిబ్రవరి 1931 నాడు బి.ఎన్. సర్కార్ ‘న్యూ థియేటర్స్’ అనే స్వంత నిర్మాణ సంస్థను స్థాపించినప్పుడు ఆ సంస్థ సంగీత విభాగానికి అధిపతి అయ్యారు బొరాల్.  బి.ఎన్. సర్కార్ వద్ద – దేబకీ కుమార్ బోస్, ప్రమతేష్ బారువా, ప్రేమాంకుర్ అతోర్థి, హేమ్ చందర్ వంటి ప్రతిభావంతులైన దర్శకులు; కెమెరామెన్ నితిన్ బోస్, బిమల్ రాయ్; సౌండ్ రికార్డిస్టులు ముకుల్ బోస్, బానీ దత్, లోకేన్ బోస్; కె.ఎల్. సైగల్, పహాడీ సన్యాల్, పృథ్వీరాజ్ కపూర్, నెమో, ఉమా శశి, కానన్ దేవి, జమున, కమలేశ్ కుమారి, చంద్ర ప్రభా దేవి, భారతీదేవి వంటి నటీనటులు; ఆర్. సి. బొరాల్, పంకజ్ మల్లిక్, తిమిర్ బరన్ వంటి సంగీత దర్శకులు – ఉద్యోగులుగా ఉండేవారు.

1931లో అర్దేషిర్ ఇరానీ నిర్మించి దర్శకత్వం వహించిన ‘ఆలం ఆరా’ దేశంలోనే తొలి టాకీ సినిమా అయింది. న్యూ థియేటర్స్ కూడా మూకీ సినిమాలను విడిచి టాకీల వైపు అడుగులేసింది. ‘దేనా పావోనా’, ‘పల్లి సమాజ్’ వంగ భాషలో తొలి టాకీలయ్యాయి. రాయ్‌చంద్‍కి తొలి బ్రేక్ 1932లో లభించింది, కె.ఎల్. సైగల్ న్యూ థియేటర్స్ కోసం చేసిన మూడు సినిమాలకి. రాయ్‌చంద్ పేరుతో సైగల్ ఆయన మొదటి పాటని అందించారు. కానీ ఈ మూడు సినిమాలు పరాజయం పాలయ్యాయి.

అయితే ‘పూరన్ భగత్’ (1933) చిత్రం ద్వారా తన మాయని ప్రదర్శించారు బొరాల్. మిజ్జన్ కుమార్, అన్వరి, అంధ నట గాయకుడు కె.సి. డే నటించిన ఈ చిత్రానికి దేబకి కుమార్ బోస్ దర్శకులు. సైగల్‍తో పాడించిన భజనలు – ‘రాధా రాణి దే దరో’, ‘దిన్ నీకే బీతే జాత్ హై’, ‘అవసర్ బీతో జాయె’, ‘భాజూన్ మే బాహీ సే గిరిధర్’ వంటివి దేశవ్యాప్తంగా హిట్ అయ్యాయి. కె.సి. డే పాడిన – ‘జావో జావో ఓ మేరే సదో రహో గురు కే సంగ్’, ‘క్యా కర్నా హై అబ్’ వంటివి కూడా ప్రజాదరణ పొందాయి. అదే ఏడాది బొరాల్ ‘రాజ్ రాణి మీరా’ కోసం 19 పాటలు స్వరపరిచారు. మీరా భజనలు కాకుండా ‘పియా మిలన్ కీ ఆశ్’, ‘చంద్రలేఖ సే శ్వేత్ రాత్’ అనే రెండు పాటలను ఇందుబాల పాడారు.

వంగ భాషలో దేబకీ కుమార్ బోస్ దర్శకత్వం వహించిన ‘చండీదాస్’ (1932) సూపర్ హిట్ అయిన తరువాత, దాని హిందీ వెర్షన్‍ని న్యూ థియేటర్స్ వారు 1934లో నిర్మించారు. కె.ఎల్. సైగల్, ఉమా శశి, పహాడీ సన్యాల్ ప్రధాన తారాగణం. బెంగాలీ వెర్షన్‍కి ఛాయాగ్రహణం వహించిన నితిన్ బోస్ హిందీ వెర్షన్‍కి దర్శకత్వం వహించారు. బొరాల్ సంగీతం, సైగల్ గానం సంచలనం సృష్టించాయి. ‘తరపత్ బీతే తుమ్ బినా యే రైనా’, ‘దేఖత్ వాకో హీ రూప్ ప్రేమ కా పూజారీ’ (సైగల్); ‘బసంత్ రితు ఆయే’, ‘ఛాయే బసంత్ ఆయే’ (పహాడీ సన్యాల్); ‘ప్రేమ్ నగర్ మే బసుంగీ ఘర్’ (ఉమా శశి – సైగల్ యుగళ గీతం) వంటి పాటలతో బొరాల్ సంగీతంలో తాజాదనం తీసుకువచ్చారు. హిందీ వెర్షన్‍కి ప్రముఖ ఉర్దూ నాటకకర్త ఆఘా హషర్ కశ్మీరీ గీత రచన చేశారు.

నితిన్ బోస్ సినిమా ‘డాకూ మన్సూర్’ 1934లో విడుదలయింది. పృథ్వీరాజ్ కపూర్, హుస్న్ బానో నాయికానాయకులు. బొరాల్ ఈ సినిమాకి 12 పాటలు స్వరపరిచారు.  ముఖ్యంగా పద్య రూపంలో సాగిన మూడు పాటలు అందరి ఆదరణను పొందాయి. ఆ తరువాత అశోక చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా పి. సి. బారువా దర్శకత్వంలో ‘రూప్ లేఖ’ చిత్రం వచ్చింది. అశోకుడిగా సైగల్ నటించి, రాయ్‌చంద్ బొరాల్ అద్భుతంగా స్వరపరిచిన ‘సబ్ దిన్ నా హోతా ఏక్ సమాన్’ అనే పాటకు ప్రాణం పోశారు.

1935లో న్యూ థియేటర్స్ వారు బీహార్‍లో సంభవించిన ప్రకృతి విలయం భూకంపం ఆధారంగా ‘ఇంక్వలాబ్’ అనే సినిమా తీశారు. ఇందులో రాజ్ కపూర్ బాల నటుడిగా తొలిసారి నటించారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ పాట రాయమని బొరాల్ – కిదర్ శర్మని అడిగారట. అదే ‘ఆవోరే ఛమేలీ ఏక్ బాత్ బతాయే’. వంగ భాషలో పిసి బారువా దర్శకత్వం వహించి ప్రధాన పాత్ర పోషించిన ‘దేబదాస్’ 1935లో విడుదలయి ఆదరణ పొందింది. ఈ సినిమాలో బొరాల్ సంగీత దర్శకత్వంలో సైగల్ పాడిన పాటలు అమితమైన ప్రజాదరణ పొందాయి. సైగల్ రతన్ బాయి నాయికా నాయకులుగా ప్రేమాంకుర్ అతోర్థి దర్శకత్వంలో వచ్చిన ‘కార్వాన్-ఎ-హయత్’ (1935) సినిమా కోసం బొరాల్ – మరో సంగీత దర్శకుడు మిహిర్ కిరణ్ భట్టాచార్యతో కలిసి సంగీతం అందించారు. ఈ సినిమాలో సైగల్, పహాడీ సన్యాల్ పాడిన పాటలు, సైగల్ ఘజళ్ళు చాలా రోజుల పాటు జనాల నోట్లో నానాయి.

బొరాల్ గారి కోపం గురించి ఒక ఇంటర్వ్యూలో కిదర్ శర్మ వివరించారు. న్యూ థియేటర్స్ సంస్థ కోసం ఓ సినిమాకి సంగీతం అందిస్తున్నారట. తబలా వాయిద్యాకారుడు రాగం తప్పుగా వాయిస్తే,  percussionist గమనించ లేదట. బొరాల్ గారికి కోపం వచ్చి అరిచేసారట. చిన్న కొలను లాంటి దానిలో నిలుచున్న percussionist దుస్తులలోకి చేప పిల్ల దూరి గిలిగింతలు పెడుతుంటే, ఆయన తబలా వాయిద్యకారుడిపై దృష్టి పెట్టలేకపోయారట. అసలు విషయం తెలిసిన బొరాల్ గారు గట్టిగా నవ్వేసారట.

నితిన్ బోస్ దర్శకత్వంలో వచ్చిన భాగ్య చక్ర (ధూప్ ఛావోఁ – బెంగాలీ, 1935) సినిమాలలో తొలిసారిగా నేపథ్య గానాన్ని ప్రవేశపెట్టిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆర్. సి. బొరాల్ కెరీర్‍లో ఇదో ముఖ్యమైన ఘటన. తొలి ప్లేబాక్ పాటని ఆయన రికార్డు చేశారు. పరుల్ ఘోష్, సుప్రోవా సర్కార్, హిరామతి గాత్రంలో – ‘మై ఖుష్ హోనా చాహూఁ ఖుష్ హో నహీ సహా’ అనే పాటని రికార్డు చేశారు. ఈ సినిమాకి గీత రచన పండిత్ సుదర్శన్ చేశారు. సినిమాలలో నేపథ్యగానం ఎలా ప్రవేశించిందో పంకజ్ మల్లిక్ తన ఆత్మకథ ‘అమర్ జీబన్ అమర్ గాన్’లో సమగ్రంగా వివరించారు. నితిన్ బోస్‍కి ఆ ఆలోచన ఎలా కలిగిందో వివరంగా తెలియజేశారు.

1936లో బొరాల్ – పిసి బారువా దర్శకత్వంలో వచ్చిన ‘మాయ’, ‘మంజిల్’ అనే రెండు సినిమాలకు సంగీతం అందించారు. ‘మాయ’ చిత్రంలోని ‘గాయే జా గాయే జా’ అనే పాట, ‘మంజిల్’ లోని ‘సుందర్ నారీ ప్రీతమ్ ప్యారీ’ (పంకజ్ మల్లిక్) గొప్ప హిట్ లయ్యాయి. అదే ఏడాది బొరాల్ ‘క్రోర్‍పతి’ అనే హాస్య చిత్రానికి సంగీతం అందించారు. ‘జో నౌక్రీ దిలా దే’ (సైగల్-పంకజ్ మల్లిక్), ‘జగత్ మే ప్రేమ్ హీ ప్రేమ్’ (సైగల్), ‘ఘిర్ ఘిర్ ఆయే బాదరియా కరి’ (రాజ్ కుమారి) – ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొన్నాయి. 1937లో బొరాల్ ‘అనంత్ ఆశ్రమ్’ సినిమాకు 14 పాటలు అందించారు. పంకజ్ మల్లిక్‍తో కలిసి ‘ముక్తి’ అనే సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాలో తొలిసారిగా ‘రబీంద్ర సంగీత్’ ఉపయోగించారు. రాయ్‍చంద్ స్వరపరిచిన ‘జీవన్ క్యా హై దిల్ కా రాగ్’, ‘కైసే ఉజాదా చమన్’ జనరంజకమయ్యాయి. పంకజ్ మల్లిక్ సంగీతం కూర్చిన ‘దినే షేషే, ఘూమర్ షేషె’ దాదాపుగా మరో జాతీయ గీతంగా మారిపోయింది.

ఆర్.సి.బొరాల్ గారికి దక్కిన గొప్ప విజయం – దేబకీ బోస్ దర్శకత్వంలో వచ్చిన ‘విద్యాపతి’ సినిమా. ‘డోలే హృదయ్ కీ’ (కానన్ దేవి), ‘గోకుల్ సే గయే గిరిధారి’, ‘పన్‌ఘాట్ పె కహానియా ఆతా హై’ శ్రోతలను ఉర్రూతలూగించాయి. నితిన్ బోస్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రెసిడెంట్’ చిత్రం కోసం మళ్ళీ చేతులు కలిపారు బొరాల్ – పంకజ్ మల్లిక్. రాయ్‍చంద్ స్వరపరిచిన ‘ఏక్ రాజే కే బేటా’, ‘ఏక్ బంగ్లా బనే నయారా’ గొప్ప హిట్‍లు. అయితే కొన్ని సినిమాలు ‘విద్యాపతి’ సృష్టించిన అద్భుతాన్ని తిరిగి అందించలేకపోయాయి. అయినా అభాగిన్, జవానీ కీ రీత్, హార్-జీత్ వంటి సినిమాలలో కొన్ని పాటలపై బొరాల్ ముద్ర సుస్పష్టం.

1938లో ఫణి మజుందార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్ట్రీట్ సింగర్’ సినిమాతో మళ్ళీ విజయపథం పట్టారు బొరాల్. సైగల్, కానన్ దేవి, జగ్‌దీష్ శేథీ నటించిన ఈ చిత్రంలో రాయ్‌చంద్-సైగల్‍ మళ్ళీ ఇంద్రజాలం చేశారు. నేపథ్య గానం ఉన్నప్పటికీ, ‘బాబుల్ మోరా’ అనే పాటని చిత్రీకరిస్తుండగానే, వాయిద్యకారుల సమక్షంలో ప్రత్యక్షంగా పాడారు సైగల్. 1941లో వచ్చిన ‘లగాన్’ చిత్రంతో బొరాల్-సైగల్ జోడీ మళ్ళీ అద్భుతం చేశారు. సైగల్, కానన్ దేవి నాయికా నాయకులు. ఈ సినిమాలో సైగల్ పాడిన పాటలు, కానన్ దేవి సోలోలు సినిమా విజయానికి ఎంతగానో దోహదం చేశాయి.

1941లో జరిగిన అగ్నిప్రమాదంలో న్యూ థియేటర్స్ వారి స్టూడియో నాశనం అయిపోయింది. సినీరంగంలో వస్తున్న కొత్త ధోరణులతో ఈ సంస్థ రాజీపడలేకపోయింది. దర్శకుడిగా మారిన కెమెరామాన్ బిమల్ రాయ్ ఈ సంస్థ కోసం – ఉదయేర్ పాథె (హిందీలో హమ్‌రాహీ), అన్‍జాన్ ఘర్, పెహ్లా ఆద్మీ – అనే మూడు సినిమాలు తీశారు. ఈ మూడిటికీ ఆర్.సి. బొరాల్ సంగీతం అందించారు. ‘హమ్‌రాహీ’ (1945)లో రబీంద్రనాథ్ టాగోర్ గీతాన్ని ఉపయోగించడమే కాకుండా, టైటిల్ ట్రాక్‍లో మొత్తం ‘జనగనమణ’ గీతాన్ని వినియోగించారు బొరాల్. ‘అన్‍జాన్ ఘర్’ (1948)సినిమాలో బొరాల్ ‘సంసార్ కే ఆధార్ పర్ దయా హమ్ పె దిఖావో’ అనే అద్భుతమైన మెలొడీని అందించారు. ‘పెహ్లా ఆద్మీ’ (1950) సినిమాలో ‘తారోంకీ రోష్‍నీ మే దునియా’ అనే చక్కటి పాటని అందించారు. ఈ సినిమాల ద్వారా బొరాల్ – బొంబాయిలో తన స్థానం నిలుపుకోవడమే కాకుండా ఎన్నో హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చారు.

‘శ్రీ చైతన్య మహా ప్రభు’ సినిమా ఆయన పాత సంగీతాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ‘క్యా హోగయా ముఝే క్యా హోగయా’ పాట ఓ అద్భుతం. ఇంటర్‍లూడ్‍లో ఆయన హవాయియన్ గిటార్ వాడారు. సాంప్రదాయ రామ్‍లీల శైలిలో కొన్ని పాటలు ఉన్నాయి. 1953లో వచ్చిన నితిన్ బోస్ సినిమా ‘దర్ద్-ఎ-దిల్’ సినిమా కోసం లతా మంగేష్కర్ చేత ‘నా తో దిన్ హి దిన్’ అనే చక్కని ఘజల్ పాడించారు. ‘ప్యార్ హో గయా ముఝే’ పాటని ఆశా పాడారు. ‘స్వామి వివేకానంద’ (1955) చిత్రంలో బొరాల్ బెంగాలీ జాతీయాన్ని హేమంత్ కుమార్‍తోనూ, ‘హే శివ్ శంభూ’ పాటని రఫీ తోనూ పాడించి వారి గానపటిమను పూర్తిగా ఉపయోగించుకున్నారు. తలత్ పాడిన ‘చూర్ కరో అభిమాన్ మేరే’ గొప్పగా హిట్ అయింది. ఈ పాట హెచ్.ఎం.వి.వారి ‘తలత్స్ రేర్ మెలొడీస్’లోనూ చోటు చేసుకుంది. 1960లో వచ్చిన ‘నోతున్ ఫసల్’ ఆయన చివరి చిత్రం. కాగా 1959లో వచ్చిన బంగ్లా సినిమా ‘సాగర్ సంగమే’ ఆయనకి జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.

బొరాల్ ఆర్కెస్ట్రాలో – తరువాతి కాలంలో ఎంతో పేరు పొందిన – పన్నాలాల్ ఘోష్, ఖేమ్‍చంద్ ప్రకాశ్, జైదేవ్, పంకజ్ మల్లిక్ వంటివారు ఉండేవారు. బొరాల్ ఠుమ్రీ, కీర్తన్, ఘజల్, కబీగాన్ వంటివాటిని మేళవించి స్వరాలు కూర్చేవారు. భక్తి సంగీతం, బెంగాలీ సంగీతాన్ని అద్భుతంగా కూర్చేవారు బొరాల్.

ఆర్.సి.బొరాల్ కి 1978లో సంగీత నాటక అకాడెమీ అవార్డు లభించింది. అలాగే, నెలకొల్పిన పదేళ్ళ తరువాత 1979లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. అయితే అప్పటికే భారతీయ సినీ సంగీతపు తండ్రిగా భావించే బొరాల్ గారు విస్మృతికి గురవుతున్నారు.

78 ఏళ్ళ వయసులో 28 నవంబరు 1981 నాడు తన అద్భుతమైన కళని అభిమానులకు విడిచిపెట్టి స్వర్గస్థులయ్యారు బొరాల్.

ఆయన పేరు, ఆయన పాటలు రేడియో సిలోన్ వారి ‘పురానీ ఫిల్మోం కా సంగీత్’ కార్యక్రమంలో చాలాకాలం వినిపించాయి. చక్కని నోస్టాల్జియాని అందిస్తాయా పాటలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here