అలనాటి అపురూపాలు-144

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ప్రతిభామూర్తి గీతా దత్:

ప్రస్తుత బంగ్లాదేశ్‍లోని ఓ సంపన్న కుటుంబంలో 1930లో జన్మించారు గీత. ఆమె జన్మనామం గీతా ఘోష్ రాయ్ చౌదరి. బాల్యం నుంచే ఆమె గానంలో ప్రతిభ కనబరిచారు. తల్లిదండ్రులు ఈ విషయంలో గీతను అమితంగా ప్రోత్సహించారు. 16 ఏళ్ళ వయసులో మొదటిసారిగా హిందీ సినిమాలకి పాటలు పాడారు. సినీరంగంలోకి ప్రవేశించిన ఏడాదిలోపే ‘దో భాయ్’ చిత్రంలో ఎస్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో పాడిన ‘మేరా సుందర్ సప్నా బీత్ గయా’ అనే పాటతో ఎంతో పేరు పొందారు. అయితే గీతకర్త రాజా మెహ్దీ ఆలీ ఖాన్ రచించిన పాటలోని వాక్యాలను జాగ్రత్తగా గమనిస్తే (మేరీ ప్రేమ్ కహానీ ఖతమ్ హుయీ, మేరే జీవన్ కా సంగీత్ గయా), వివాహం విఫలమయి, తన జీవితంలో చివరి సంవత్సరాల అనుభవించిన మానసిక వేదనకు అవి అద్దం పడతాయి.

ఆమెదీ బర్మన్ గారిది చక్కని జోడీ. అలాగే హేమంత్ కుమార్, ఓపి నయ్యర్ గార్లతో కూడా. ఈ సంగీత దిగ్గజాలందరూ ఆమెకు లోతైన భావోద్వేగాలున్న పాటలను, అద్భుతమైన రొమాంటిక్ గీతాలను ఇచ్చారు. తన తీయని స్వరంలో ఆలపించడం ద్వారా వాటికి ప్రాణం పోశారు గీత. తనె కెరీర్‍ లోనే ముఖ్యమైన పాటలను, వాస్తవానికి హిందీ సినీమాల్లోని ముఖ్యమైన పాటలను ఆమె గురుదత్ కోసం పాడారు. ఇప్పుడైనా ఆనాటి తరం వారు స్నేహితులతో కబుర్లకి కూర్చుంటే గీతా దత్ స్వర్ణయుగం నాటి పాటలు – ‘తద్‌బీర్ సే బిగడీ హుయీ’, ‘సున్ సున్ సున్ జాలీమా’, ‘బాబూజీ ధీరే చల్‍నా’, ‘ఉధర్ తుమ్ హసీన్ హో’, ‘వక్త్ నే కియా క్యా క్యా హసీన్ సితమ్’, ‘జానే క్యా తూనే కహీ’ వంటివి  వినకుండా ఉండలేరు. ఆమె జీవితంలో ప్రేమకీ, ఆమె పతనానికి కారకులు గురుదత్ అనే అంటారు. కుటుంబం నుంచి అభ్యంతరం వ్యక్తమైనా, గీతా, గురుదత్‍లు 1953లో పెళ్ళి చేసుకున్నారు. అప్పటికి గురు దత్ వర్ధమాన దర్శకుడు మాత్రమే, ఇంకా విచారగ్రస్తుడు కాలేదు. గురు దత్ మాస్టర్  పీస్‌లుగా చెప్పుకునే ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’ ఇంకా రాలేదు. గురు దత్ దర్శకత్వం వహించనప్పటికి ఆయన క్లాసిక్స్‌గా చెప్పుకునే ‘చౌదవీ కా చాంద్’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ అప్పటికి విడుదల కాలేదు. తరువాతి సంవత్సరాలలో విడుదలయిన ఈ నాలుగు సినిమాల్లో మూడు పేర్లు కామన్‍గా ఉన్నాయి – అబ్రార్ అల్వీ, వి.కె. మూర్తి, వహీదా రెహ్మాన్.

ఇందులోని చివరి పేరు గల వ్యక్తితో గీతకి ఇబ్బందులు వచ్చాయి. సిఐడి, ప్యాసా, కాగజ్ కే పూల్, వంటి సినిమాల్లో నటించిన వహీదాకి తన భర్తకీ సంబంధం ఉందని గీత భావించారు. ‘టెన్ యియర్స్ విల్ గురు దత్’ అనే పుస్తకంలో అబ్రార్ అల్వీ వహీదా, గురు దత్ విషయంలో గీతవి అపోహలే అని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో వహీదా మౌనం వహించారు. గురు దత్‌తో అందరూ ఊహించే తన సంబంధం గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. మీడియా వాళ్ళు తమకి తోచినట్లు రాసుకున్నారు. 1964లో చనిపోయినప్పటి నుంచి (ఆత్మహత్య అని కొందరు, ప్రమాదమని కుటుంబ సభ్యులు అంటారు) దాదాపు 5 దశాబ్దాల పాటు గురు దత్ ఓ ‘కల్పన’గా మిగిలారు. మరో వైపు గీత ఓ ‘మర్మం’గా, ‘ఆసక్తి’గా మిగిలారు.

ప్లాట్‍లో సంగీతాన్ని ఓ భాగంగా మలచుకున్నందుకు గురు దత్ సినిమాలకు ప్రశంసలు దక్కుతాయి. హాస్య నటులకు (జానీ వాకర్) కూడా చక్కని పాటలు ఉన్నాయి. మాయాలోకంలో తీసుకుళ్ళే ఈ పాటలకు సగం ఘనతని అయినా గీతా దత్‍కు ఇవ్వాలి. తెర వెనుక ఉండే ఎస్.డి. బర్మన్, హేమంత్ కుమార్, సాహిర్ లుధియాన్వి, లతా మంగేష్కర్, మజ్రూహ్ సుల్తాన్‌పురి, ఓపి నయ్యర్, మహమ్మద్ రఫీ తదితరలులకు మిగతా సగం ఘనత దక్కుతుంది.

గురు దత్ ఓ విషాదమూర్తి. విచారం ఎంత ఎక్కువగా ఉంటే, ఆయన సృజనాత్మకత అంత ఎక్కువగా ఉండేది. ఆయన తీసిన సరదా సినిమాలలో – ఎక్కువగా ఆయన మిత్రుడు దేవ్ ఆనంద్ నటించినవి – కూడా ఆయన ప్రభావం ఆశ్చర్యకరంగా హృద్యంగా, అత్యంత సహజంగా ఉంటుంది. ‘ఆర్ పార్’ చిత్రంలో ఆయన టాక్సీ డ్రైవర్‍ ‘కాలూ’గా పని చేస్తూ ‘నిక్కీ’ (శ్యామా)తో ప్రేమలో పడతారు. ఆ ఇద్దరూ పారిపోదామనుకుంటారు, కానీ ఆగిపోతారు. తన ప్రేమని నిరూపించుకోవాల్సి వస్తుంది కాలూకి. ఈ సినిమాలో ‘సున్ సున్ సున్ జాలీమా’ అనే పాటు రెండు సార్లు వస్తుంది. మొదటిసారి పాట కొత్త ప్రేమికుల గీతం కాగా, రెండో సారి వచ్చినప్పుడు గుండె పగిలిన నిక్కీ విషాదాన్ని చాటుతుందా పాట! ‘ఆర్ పార్’ చిత్రంలో మరో గొప్ప పాట ఉంది. ‘బాబూజీ ధీరే చల్‍నా’ అనే క్లబ్ సాంగ్. క్యూబాకి చెందిన ‘Quizás, quizás, quizás’ అనే ట్యూన్‍కి ఇది కాపీ అని అంటారు. అయితే ఈ బాణీ గీత స్వరంలో హొయలొలికింది. ‘సున్ సున్ సున్ జాలీమా’ నుంచి ‘బాబూజీ ధీరే చల్‍నా’ వరకు గీతా దత్ అత్యంత సులభంగా పాశ్చాత్య శైలికీ, భారతీయ శైలికి మారగలిగారు. నెమ్మదిగా సాగే పాటలనీ, వేగంగా సాగే పాటలనీ అద్భుతంగా ఆలపించారు. “ఏ సంగీత దర్శకుడికైనా ఆమె ఒక ఆస్తి” అన్నారు ఓపి నయ్యర్ గీతని ఉద్దేశించి.

ప్యాసా (1957) లోని ‘హమ్ ఆప్ కీ ఆంఖోం మే’:

ప్యాసా చిత్రం కోసం గీతా దత్, రఫీ పాడిన ‘హమ్ ఆప్ కీ ఆంఖోం మే’ అనే యుగళ గీతం గురు దత్ సినిమాలన్నింటిలో ఉన్న ఒకే ఒక ‘dream song’ అని ‘Guru Dutt: An Unfinished Story’ అనే పుస్తకం రచించిన యాసర్ ఉస్మాన్ పేర్కొన్నారు. సీరియస్ కథలో కాస్త వినోదాన్ని అందివ్వడానికి ఆ పాటని పెట్టారని చెప్తారు. ‘ప్యాసా’లో అద్భుతమైన పాటలు ఉన్నాయి. వీటిలో గీత నాలుగు పాటలు పాడారు. గీత పాడిన ‘ఆజ్ సాజన్ మోహే అంగ్ లగాలో’, ‘జానే క్యా తూనే కహీ’ అనే పాటలను వహీదా పై చిత్రీకరించారు. అయితే ఇన్ని గొప్ప పాటలున్నా ఆ ఆల్బమ్‌లో మరో పాటని ప్రస్తావించాలి. అదే ‘హమ్ ఆప్ కీ ఆంఖోం మే’. ఎందుకని? సినిమాలో ఈ పాట వచ్చే సందర్భం గొప్పది. ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాడిలా విచారంగా ఉండే కవి విజయ్ – ఆశావాదిగా, సంతోషంగా కనిపించే సన్నివేశంలో వస్తుంది. ‘ప్యాసా’ చూసినవారికి (చాలామంది ఉంటారు) విజయ్ ప్రస్థానం పతనం వైపు సాగడం గుర్తుండే ఉంటుంది. తనకి చెందని సమాజంలో, తను నప్పని సమాజంలో బ్రతుకుతాడతను. అటువంటి సృజనాత్మక వ్యక్తి జీవితంలో ‘హమ్ ఆప్ కీ ఆంఖోం మే’ అనేది తళుక్కున మెరిసిన పగటికల లాంటిది.

కాగజ్ కే ఫూల్ (1959) లోని ‘వక్త్ నే కియా క్యా క్యా హసీన్ సితమ్’:

తనకి వ్యతిరేకంగా ఉండే ప్రపంచం, అస్థిరమైన వైవాహిక జీవితంతో నలిగిపోయిన ఓ కళాకారుడి కథ గురు దత్ నటించిన ‘కాగజ్ కే ఫూల్’. ఈ సినిమా ఆయన జీవితాన్నే చిత్రించిందని చాలామంది భావిస్తారు. ఈ సినిమాలో కైఫీ అజ్మీ – ఎస్.డి. బర్మన్ కలయికలో వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ‘దేఖీ జమానే కీ యారీ’ అనే పాటని సురేష్ సిన్హా అనే దర్శకుడి పాత్ర పోషించిన గురు దత్ పై చిత్రీకరించారు. ‘వక్త్ నే కియా క్యా క్యా హసీన్ సితమ్’ అనే పాట గాయపడిన సురేష్, అతను తీస్తున్న సినిమాలోని నూతన నటి (దేవదాస్‍ లోని పారో పాత్ర) మధ్య సాన్నిహిత్యం ఏర్పడినప్పుడు నేపథ్యంలో వచ్చే పాట. ఈ పాటలో నృత్యాలు ఉండవు, పెదాల కదలికలు ఉండవు. ఆర్క్ లైట్ల వెలుతురులో రెండు ఆత్మల కలయికని బ్లాక్ అండ్ వైట్‍లో వి.కె. మూర్తి గొప్పగా చిత్రీకరించారు. అద్భుతమైన ప్రేమని అవ్యక్తంగా చాటిన దృశ్యం అది. ఒక ఇంటర్వ్యూలో “అన్నీ నా ముఖంలోనే వ్యక్తమవ్వాలి” అని ఆ సన్నివేశం గురించి చెప్పారు వహీదా. కైఫ్ అజ్మీ పదాలకి (గుల్జార్ రాసిన ‘నామ్ గమ్ జాయేగా’ పాట మీద ‘వక్త్ నే కియా క్యా క్యా హసీన్ సితమ్’ ప్రభావం ఉందంటారా?) గీత స్వరం జీవం పోసింది.

(గమనిక: సినీ అభిమానులందరికీ ఈ trivia తెలుసు. అమితాబ్ బచ్చన్ అభిమాన నటీమణుల్లో గీతా దత్ ఒకరు. ఆయనకిష్టమైన సినిమాల్లో ‘కాగజ్ కే ఫూల్’ ఒకటి. ఆ సినిమాలోని ‘వక్త్ నే కియా క్యా క్యా హసీన్ సితమ్’ ఆయనకి నచ్చిన పాటల్లో ఒకటి. అందుకే, బిగ్ బి 2018లో వచ్చిన తన సినిమా ‘102 నాట్ అవుట్’ లో ఈ పాటని తన గొంతులో వినిపించారు).

సాహిబ్ బీబీ ఔర్ గులామ్ (1962) లోని ‘నా జావో సైఁయా ఛుడా కే బైఁయా’:

బెంగాలీ ఫ్యూడల్ దారుణాలను చూపిన ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ చిత్రం – కలకత్తా లోని కులీనుల పాత హవేలీలలో నాలుగు గోడల మధ్య సాగిన అంత్యదశని ప్రదర్శిస్తుంది. ఈ సినిమాలోని విషాదభరితమైన చిన్న కోడలి పాత్రలో తొలుత వహీదా నటించాలనుకున్నారట, కానీ ఆ పాత్ర మీనా కుమారికి దక్కింది. ఆవిడ ఆ పాత్రలో విశేషంగా రాణించి, అజరామరం చేశారు. మీనా కుమారి జీవిత చరిత్ర రాసిన వినోద్ మెహ్తా ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ సినిమా గురించి విశేషంగా ప్రస్తావించారు. మీనా కుమారిని తలచుకోగానే ప్రేక్షకుల మదిలో ఈ సినిమాలోని మరపురాని పాటలే మెదులుతాయని ఆయన అన్నారు. విషాద పాత్రలలో ఇమిడిపోయే మీనా కుమారి తన హావభావాల ద్వారా, స్వరంలోని శ్రావ్యత ద్వారా తన పాత్రలోని సంభ్రమాన్ని గొప్పగా ప్రదర్శించారు. షకీల్ బదాయునీ రాసిన గీతాలను హేమంత్ కుమార్ స్వరపరిచారు. ఈ సినిమా ఇప్పటికీ ప్రేమికుల మదిలో నిలిచి ఉంది. చిన్న కోడలు (మీనా కుమారి) తన తాగుబోతు భర్తని (రహమాన్) నిలువరించే ప్రయత్నంలో ‘నా జావో సైఁయా ఛుడా కే బైఁయా’ పాట వస్తుంది. తన పాత్రలోని వేదనని మీనా తన కళ్ళ ద్వారా ప్రదర్శిస్తే, ప్రేమకి నోచుకోని ఆమె ఆర్తిని గీతా దత్ తన స్వరంలో గొప్పగా పలికించారు. ఆధ్యాత్మిక పతనం, ప్రేమ రహిత వివాహం మధ్య ప్రేమ కోసం తపించిన ఓ యువ శ్రీమతి కథ ఇది.

 

బసు భట్టాచార్య దర్శకత్వంలో పెళ్ళి పై ప్రయోగాత్మకంగా వచ్చిన చక్కని చిత్రం ‘అనుభవ్’. సంజీవ్ కుమార్ (అమర్), తనూజ (మీతా) నటించిన ఈ సినిమాలో పాటల అవసరం లేదు. అయినా స్వరకర్త కానూ రాయ్, గీత రచయిత గుల్జార్ – గీతా దత్ ‍కి ‘ముఝే జాన్ నా కహో మేరీ జాన్’ అనే గొప్ప పాటని ఇచ్చారు. వాయిద్యాలను కనీస స్థాయిలో ఉంచి, గీత స్వరానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, పాట అద్భుతంగా వచ్చేలా చేశారు కానూ రాయ్. గొప్పగా వచ్చిందా పాట. వైవాహిక జీవితంలోని ఆనందాన్ని పోగొట్టుకున్న అమర్, మీతా దంపతులు తమ మధ్య ప్రేమని పునర్వ్యక్తం చేసుకునే సందర్భంలో వస్తుందీ పాట. తరువాత వారి జీవితంలోకి మూడో వ్యక్తి (దినేష్ ఠాకూర్) ప్రవేశిస్తాడు. అయితే ఈ పాటలో తమ యజమానుల ఆనందాన్ని నౌకరు హరి (ఎ.కె. హంగల్) తృప్తిగా గమనిస్తాడు. పాట అనంతరం వర్షంలో తడిసిన అమర్‍కి జ్వరం వస్తుంది.

శ్రోతలకి కూడా జబ్బు చేస్తుంది, కారణం – ‘గీతా దత్ ఫీవర్’ అనడంలో అతిశయం ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here