అలనాటి అపురూపాలు-145

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అందాల తార వీణ:

అలనాటి నటి వీణ అసలు పేరు తజౌర్ సుల్తానా. ఈమె అవిభక్త భారత్‍ లోని బెలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో 04 జూలై 1926 నాడు జన్మించారు. కొన్నాళ్ళ తరువాత వారి కుటుంబం లాహోర్‍కి తరలివెళ్ళి అక్కడ నివసించింది.

వీణ నటుడు, కథానాయకుడు అయిన అల్ ససీర్‌ని 1947లో జునాగఢ్‍లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. అల్ నసీర్ భోపాల్‍కు చెందిన రాజకుటుంబీకులు. ఆయనకు అంతకు ముందే నటి మీనా షోరే తోనూ, మనోరమ తోను వివాహాలు అయ్యాయి. ఈ దంపతులు కలిసి కొన్ని సినిమాలలో నటించినా, అవి బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. అల్ నసీర్ 1957లో అనారోగ్యంతో మరణించారు.

దేశ విభజనకి ముందరి నాటి సినిమాల్లో వీణ హీరోయిన్‍గా నటించారు. ‘గరీబ్’ అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. పదహారేళ్ళ వయసులో ‘గవంధి’ (1942) అనే చిత్రంలో నటించారు. ‘గరీబ్’ ఉర్దూ భాషా చిత్రం కాగా, ‘గవంధి’ పంజాబీ సినిమా. దీనికి మహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించారు. ‘గరీబ్’ సినిమాలో ఆమె పాత్ర పేరు లత. ‘గవంధి’ సినిమాలో హీరోయిన్‍గా హీరీ శ్యామ్ సరసన నటించారు. దేశ విభజనకి ముందరి ఉర్దూ, పంజాబీ సినిమాల్లో ఆమె పేరు ప్రముఖంగా వినబడేది. నటిగా ఆమె తొలినాళ్లలో నజ్మా (1943), ఫూల్ (1945) హుమయున్ (1945) వంటి చిత్రాలలో నటించారు. దేశ విభజనకి ముందు ఆమె చివరి చిత్రం ‘రాజ్‍పుటానీ’ (1946). ఇందులో ఆమె సహాయక పాత్రలో నటించారు.

దేశ విభజన తర్వాత ఆమె భారత్‍కి వచ్చేశారు. ఆవిడ 1940 నుంచి 1980 వరకు నటించారు. ఎన్నో ప్రముఖ నిర్మాణ సంస్థల చిత్రాలలో నటించారావిడ. అఫ్సానా (1951), హలాకు (1956), చల్తీ కా నామ్ గాడీ (1958), కాగజ్ కే ఫూల్ (1959), తాజ్ మహల్ (1963) (ఈ సినిమాకి ఆమె ఫిల్మ్‌ఫే వారి ఉత్తమ సహాయ నటి అవార్డు గెల్చుకున్నారు), దో రాస్తే (1969), పాకీజా (1972) వంటి చిత్రాలలో నటించారు. రజియా సుల్తానా (1983) చిత్రం విడుదలయ్యాకా, ఆమె నటన నుంచి విరమించుకున్నారు.

రిటైరయైన 21 ఏళ్ళకి 2004లో ఆమె ముంబయిలో సుదీర్ఘ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. 41 ఏళ్ళ కెరీర్‍లో (1942 నుండి 1983 వరకు) ఆమె 70 సినిమాల్లో నటించారు.


లతా మంగేష్కర్ – రాజ్ సింగ్ దుంగార్పూర్‍ల సాన్నిహిత్యం:

గాయనిగా లతా మంగేష్కర్ ఘనమైన కెరీర్, ఆమె ప్రొఫెషనలిజం, గానం పట్ల ఆమె నిబద్ధత మనందరికీ తెలుసు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి మనకు అంతగా తెలియదు, ఆమె ఎందుకు అవివాహితగా ఉండిపోయారో కారణం తెలియదు.

ఆమె జీవితంలోని ఈ అంశాన్ని స్పృశించే ముందు మరొక విషయం తెలుసుకోవాలి. లత క్రికెట్‍కు వీరాభిమాని. ఆ అభిమానంలో భాగంగా, రాజస్థాన్‌కి చెందిన ఆనాటి ఫాస్ట్-మీడియం బౌలర్, తదుపరి కాలంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‍గా ఎదిగిన రాజ్ సింగ్ దుంగార్పూర్‍తో పరిచయం కలిగి, అది కాలక్రమంలో సాన్నిహిత్యంగా మారింది.

రాజ్ సింగ్ దుంగార్పూర్ – దుంగార్పూర్ పాలకుడు – మహారావల్ లక్ష్మణ్ సింగ్‍జీ గారి చిన్న కుమారుడు. లతా మంగేష్కర్‌కి క్రికెట్ అంటే ఆసక్తి. రాజ్ సింగ్ దుంగార్పూర్‌కి సంగీతం అంటే అభిరుచి. ఈ అంశాలే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కలిగేందుకు దోహదం చేశాయి. 1929లో జన్మించిన లత మరాఠీ సంగీత విద్వాంసులు, రంగస్థల నటులు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ గారి పెద్ద కుమార్తె.

రాజ్ సింగ్, లతల పరిచయం, మైత్రి గురించి రాజ్ సింగ్ మేనకోడలు, బికనేర్ యువరాణి రాజశ్రీ తన ఆత్మకథ ‘Palace of Clouds-A Memoir’ లో ప్రస్తావించారు. వీరిద్దరూ తొలిసారిగా లత తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ ద్వారా కలిసారని అంటారు.

దుంగార్పూర్ రాజకుమారుడైన రాజ్ సింగ్‍ను 1959లా న్యాయవిద్య అభ్యసించేందుకుగాను బొంబాయి పంపారు. ఆయన క్రికెట్ బాగా ఆడేవారు. లత సోదరుడు హృదయనాథ్ కూడా క్రికెట్ ఆడేవారు. కాలక్రమంలో వీరిద్దరూ స్నేహితులయ్యారు.

రాజ్ సింగ్ తరచూ హృదయనాథ్ ఇంటికి వచ్చేవారు. ఆయన లతా మంగేష్కర్ పేరు మొదటిసారిగా విన్నది కూడా వీరి ఇంట్లోనే. పరిచయమైన కొద్ది కాలానికి లత, రాజ్‍సింగ్‍ల స్నేహం గట్టిపడింది. అది ప్రేమగా మారిందని కూడా ఈ పుస్తకంలో రాశారు.

తన చదువు పూర్తి చేసి ఇంటికి తిరిగి వెళ్ళాకా, రాజ్ సింగ్ – లతని వివాహం చేసుకుంటానని పెద్దలతో చెప్పారట. అయితే రాజకుటుంబీకులు కానివారితో వివాహాన్ని వారి పెద్దలు అంగీకరించలేదట. కుటుంబీకుల ఒత్తిడికి లొంగక తప్పలేదట రాజ్ సింగ్‍కి. అందుకని తాను అనుకున్న వివాహం చేసుకోలేకపోయారట.

అయితే వాళ్ళిద్దరూ జీవితాంతం అవివాహితులుగానే మిగలడం విశేషం. రాజశ్రీ తన ఆత్మకథలో రాజ్ సింగ్ – లతని అభిమానంగా ‘మిథూ’ అని పిలిచేవారని పేర్కొన్నారు. 2009లో రాజ్ సింగ్ మృతి చెందినప్పుడు లత రహస్యంగా దుంగార్పూర్ వచ్చి చివరిసారి ఆయన్ని చూసి నివాళి అర్పించారని అంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here