అలనాటి అపురూపాలు-146

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

70 ఏళ్ళ బైజు బావరా – కొన్ని జ్ఞాపకాలు:

ఏ మాత్రం ఆశలు లేని, చిన్న నటీనటులతో, పెద్దగా ప్రసిద్ధులు కాని సంగీత దర్శకుడితో తీసిన ‘బైజు బావరా’ చిత్రం హిందీ సినిమాలో అతి గొప్ప సంగీతం కలిగిన చిత్రాలలో ఒకటిగా ఎలా మారింది?

విజయ్ భట్ తీసిన 1952 నాటి ఈ క్లాసిక్ తొలుత – షూటింగ్ సమయంలో హేళనలకు గురైంది. మహబూబ్ ఖాన్ తీసిన ‘ఆన్’ ఆ ఏడాది గొప్ప హిట్ అయింది. అంధేరీ ఈస్ట్ లోని ప్రకాశ్ పిక్చర్స్ వారి సెట్‍లలో ఎవరూ ఊహించి ఉండలేదు – తాము పని చేస్తున్న ఈ సినిమా ఓ మైలురాయి సినిమా అవుతుందని.

ప్రింట్ కూడా సరిగా లేని, నాటి కథానాయకుడు గుర్తు లేని స్థితిలో 165 నిమిషాల ఈ నలుపు తెలుపుల చిత్రం పట్ల నేటి ఆధునిక ప్రేక్షకులు ఎందుకు ఆకర్షితులవ్వాలి? ఎందుకంటే ‘బైజు బావరా’ నేటి హిందీ సినిమాల్లో ఉండే అన్ని అంశాలను కలిగి ఉంది. ఆ సినిమా సంగీతం గురించి తెలుసుకుంటే – హిందీ సినీ సంగీతపు గతం, వర్తమానం, భవిష్యత్తు అర్థమవుతుంది. పాటలు పాడే కథానాయకుడు, బిడియపడే నాయిక, కొన్ని హాస్య సన్నివేశాలు, తాన్‍సేన్ బైజుల మధ్య అద్భుతమైన జుగల్బందీ, ఇంకా విషాదకర ముగింపు – ప్రేమికులు నదిలో కొట్టుకుపోడం – ఈ సినిమాలో ఉన్నాయి. చక్కని వినోదానికి ఈ సినిమా చూసి తీరాలి. ఈ సినిమా ప్రభావం తదుపరి కాలంలో వచ్చిన ఎన్నో సినిమాలపై ఉంది. ఉదాహరణకి ఇంతియాజ్ అలీ తీసిన ‘రాక్‍స్టార్’. ఇందులోని కళాకారుడు – సంగీతాన్ని సృష్టించాలంటే ఎంత పోరాడాలో, ఎన్ని బాధలు సహించాలో, ఎంత వేదనని అనుభవించాలో గ్రహిస్తాడు.

ఈ సినిమాలో హీరో బైజు ‘వేదనామయ సంగీతాన్ని’ అన్వేషిస్తూంటాడు. అది దొరకదు. విసిగి వేసారిన నాయకుడు “గొప్ప సంగీతం ఎక్కడ దొరుకుతుంది? ఉన్నత పర్వతాలలోనా, ప్రవహించే వాగులలోనా, లేక దహించే ఎడారులలోనా” అని ప్రశ్నించుకుంటాడు. అప్పుడతనికి అద్భుతంగా స్ఫురిస్తుంది – ‘జ్ఞానం గురువు వలననే లభిస్తుంది’ అని. బైజు బావరా కథ ఓ ప్రతీకారేచ్ఛతో మొదలవడం ఆసక్తికరం. కానీ సినిమా ప్లాట్ ఏంటంటే – ఓ కళాకారుడు జ్ఞానం సాధించాలంటే తన అహంకారంతో పోరాడక తప్పదనేది. తాన్‍సేన్ అంగరక్షకులతో జరిగిన ఓ గొడవలో తన తండ్రి ప్రాణాలు కోల్పోవడం చూస్తాడు యువ బైజు. సంగీతంలో తాన్‍సేన్‍ని ఓడిస్తాననీ, ఆయన ప్రాణాలు తీస్తాననీ రెండు ప్రతిజ్ఞలు చేస్తాడు. కానీ చివర్లో తాన్‍సేన్, బైజు ఒకరిపట్ల మరొకరు అపారమైన దయని ప్రదర్శిస్తారు. ప్రతీకారం కోసం తన భవనంలోకి ప్రవేశించిన బైజుని క్షమిస్తాడు తాన్‍సేన్ (బైజుని చుట్టుముట్టిన తన అంగరక్షుకులతో – ‘ఈ భవనంలో రక్తం కారేది సంగీతం ద్వారానే, కత్తుల ద్వారా కాదు’ అని అంటాడు); మరోపక్క తాన్‌సేన్‌ని వదిలేయవలసిందిగా అక్బర్‍ని వేడుకుంటాడు బైజు, ఎందుకంటే తాన్‌సేన్‍కి శిరచ్చేధం చేస్తే, అతనితో పాటు సంగీతమూ నశిస్తుంది. “ఆలంపనా, తాన్‌సేన్‍కి జీవితం ప్రసాదించి, సంగీతాన్ని మృత్యువు నుండి కాపాడండి” అంటాడు బైజు కష్టపడి విజయం సాధించాకా.

బైజు పాత్రకి భరత్‍భూషణ్ సరిగ్గా నప్పారు, ఎందుకంటే ఆయన వదనం ఓ విషాద సంగీతజ్ఞుడి ముఖంలా ఉంటుంది. ఈ ఇమేజ్‌ ఆయనని వెంటాడింది. ఇదే తరహా పాత్రలను మళ్ళీ మళ్ళీ పోషించేలా చేసింది. కలకత్తా కొన్ని రోజులు ప్రయత్నించిన అనంతరం ఆయనకి స్క్రీన్ టెస్ట్ చేసి బైజు పాత్ర ఇచ్చారు. మరోవైపు మీనా కుమారి విజయ్ భట్ గుర్తించిన నటే. ఆమెని 1939లో ‘లెదర్‍ఫేస్’ అనే సినిమాలో బాలనటిగా నటింపజేసింది విజయ్ భట్టే. మహజాబీన్ బానో అనే బాలికకి ‘మీనా’ అనే వెండితెర పేరు పెట్టింది ఆయనే. ‘లెదర్‍ఫేస్’ సినిమా కోసం స్క్రీన్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు ఆమెను ఏడవమన్నారట. ‘ఆ చిన్న పాప గ్లిజరిన్ కూడా లేకుండానే ఎంతగానో ఏడ్చిందని, అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారని’ గుర్తు చేసుకున్నారు పౌరవి భట్ పాథక్, విజయ్ భట్ గారి మనవరాలు. ఆమె వారి వారసత్వాన్ని సజీవంగా ఉంచే ఓ వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

విజయ్ భట్‍కి సంగీత సాహిత్యాలపై చక్కని అభిరుచి ఉండడంతో, ఈ రెంటిని మేళవించి ఓ సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నారు. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలోని తాన్‍సేన్ గురించి ఆయన చదివారు, అయితే బైజు బావరా గురించి విన్నప్పుడు తన సినిమాని బైజు మీద తీయాలనుకున్నారు. దిలీప్ కుమార్, నర్గిస్ లను ప్రధాన పాత్రలుగా అనుకున్నారు. అయితే డేట్ల సమస్యలు, పారితోషికాల డిమాండ్ల వల్ల భరత్ భూషణ్, మీనా కుమారిలను ఎంచుకున్నారు. దశబ్దాలు గడిచాకా, ‘బైజు బావారా’ సినిమా చేయనందుకు దిలీప్ బాధపడ్డారట. పౌరవి మాట్లాడుతూ “ఈ సినిమాని పరిమిత బడ్జెట్‍తో తీయాలనుకున్నారు. భరత్, మీనా ఇద్దరూ కొత్తవారు. వారికి అటువంటి సమస్యలేవీ లేవు” అని చెప్పారు.

అలాగే సంగీత దర్శకుడు నౌషాద్ అంతకుముందు భట్ గారితో మాలా, దర్శన్, స్టేషన్ మాస్టర్ వంటి సినిమాలకు పని చేశారు. ఆయనతో చక్కని సంబంధాలు ఉన్నాయి. పౌరవి వెబ్‍సైట్‍లో పేర్కొన్న వివరాల ప్రకారం ‘1940లో నౌషాద్‍కి మొదటి బ్రేక్ ఇచ్చినది విజయ్ భట్ గారే. ఆ సమయంలో గీత రచయిత డి.ఎన్. మాధోక్ (మాలా సినిమాకి కథ, సంభాషణలు అందించినదీయనే) – అప్పటి వరకు ‘ప్రేమ్‍నగర్’ అనే ఒకే ఒక సినిమాకి సంగీతం అందించిన ఓ యువ సంగీత దర్శకుడిని సిఫార్సు చేశారు. భట్ సోదరులు ఆయన కట్టిన కొన్ని బాణీలను విని, ఆయనని నెలకి 250 రూపాయల జీతంతో తీసుకున్నారు.’

సాంప్రదాయ హిందూస్తానీ సంగీతంపై ఉన్న పట్టు ఆధారంగా ‘బైజు బావరా’ కోసం నౌషాద్‍ని ఎంచుకున్నారు. ఆ సినిమా స్క్రీన్ ప్లే కోసం నౌషాద్ భట్ గారితో కలిసి దాదాపు ఆరు నెలలు పని చేశారు. నౌషాద్, విజయ్, విజయ్ అన్నయ్య శంకర్ – ప్రతిరోజూ – మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం కలిసేవారు. “సినిమా అంతా శాస్త్రీయ సంగీతంతో నిండి ఉంటుందని శంకర్ భాయ్ విన్నప్పుడు, ఆయన తన నిరసన తెలిపారు. జనాలకి తలనొప్పి వచ్చి పారిపోతారు అని అన్నారు. కానీ నేను పట్టుదలగా ఉన్నాను. ప్రజల అభిరుచిని మార్చాలనుకున్నాను. ప్రతీసారీ వాళ్ళకి నచ్చేదే ఎందుకివ్వాలీ, ఈసారి మన సంస్కృతికి చెందిన సంగీతాన్ని ఇవ్వాలని అన్నాను. అది పని చేసింది” అన్నారు నౌషాద్ ఒక ఇంటర్వ్యూలో.

తాన్‍సేన్‌, బైజు బావరాల మధ్య జరిగే జుగల్బందీ ఈ సినిమాకి అత్యంత కీలకం. క్లైమాక్స్‌కి ముందు సినీ సంగీత చరిత్రలోనే ఓ గొప్ప వృత్తాంతం జరుగుతుంది. ఆనాటి దిగ్గజమైన ఉస్తాద్ అమీర్ ఖాన్ – తాన్‍సేన్ పాత్రకి పాడేందుకు అంగీకరించారు. తాన్‍సేన్ పాత్రకి తగిన గాయకుడు ఆయన. అయితే నౌషాద్, విజయ్ భట్‍ల భయం ఏమిటంటే – కథ ప్రకారం తాన్‍సేన్ యువకుడైన బైజూతో జరిగిన పోటీలో ఓడిపోవాలి. ఉస్తాద్ అమీర్ ఖాన్‍ని ఓడించగలవారెవరు? ఈ వార్తని ఆయనకి చెప్పగలిగేదెవరు? ఆయన వద్దకి వెళ్ళి నెమ్మదిగా విషయం చెప్పారట. అప్పుడాయన బైజు పాత్ర పాటలను డి. వి. పలుస్కార్ గారితో పాడించమన్నారట. ఆయనంటే అమీర్ ఖాన్ గారికి ఎనలేని గౌరవమట. ఆయన ఒప్పుకుంటే – ఆయన చేతిలో ఓడిపోవడానికి తనకి అభ్యంతరం లేదని అన్నారట. ఈ రకంగా ఓ ఆపద తొలగింది. అంతే కాదు, ఓ హిందీ సినిమాలో అద్భుతమైన రాగాలను వినే అవకాశం లభించింది. బైజు గురువు – స్వామి హరిదాస్ శక్తిని తెలిపే ‘మన్ తడ్‍పత్’ భజన దేశపు సెక్యులర్ విధానానికి ఓ గౌరవంగా పరిగణింపబడుతుంది. అది హిందూ పౌరాణిక భజన, కానీ దాని రూపకల్పనలో పాలు పంచుకున్నది ముగ్గురు ముస్లింలు – నౌషాద్, మహమ్మద్ రఫీ, గీత రచయిత షకీల్ బదాయూనీ.

‘అయే మేరే వతన్ కే లోగ్’ అనే దేశభక్తి గీతం రాసిన కవి ప్రదీప్, ఈ సినిమాకి గీత రచయితగా పని చేయాలని అనుకున్నారు. నౌషాద్‍కి కలవడానికి వెళ్ళారట. అప్పుడు నౌషాద్ ఆయనని చాలాసేపు వేచి చూసేలా చేశారట. కోపగించుకున్న ప్రదీప్, ఇకపై ఎన్నడూ నౌషాద్‍తో పని చేయనని ప్రతిజ్ఞ చేశారని ఈ సినిమా మీనా కుమారి తండ్రి పాత్ర పోషించిన నటులు బి.ఎమ్. వ్యాస్ తెలిపారు. అయితే మరో ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవలసిన అవసరం నౌషాద్‍కి రాలేదు. ఎందుకంటే ఆయన బావగారు షకీల్ బదయూనీ అందుబాటులో ఉన్నారు. ‘బైజు బావరా’ భరత్ భూషణ్‌, మీనా కుమారిలను రాత్రికి రాత్రి సూపర్ స్టార్ లని చేసి ఉండకపోవచ్చు, కానీ నౌషాద్‍ కెరీర్‍కి మాత్రం బాగా ఉపకరించింది. 5 అక్టోబరు 1952 నాడు ‘బైజు బావరా’ సినిమా ఢిల్లీ లోని రీగల్ సినిమా అనే థియేటర్‍లో విడుదలైనప్పుడు – సినిమాలోని పాటలకి ప్రేక్షకులు విస్తుపోయారట. “ముఖ్యంగా ‘తు గంగా కీ మౌజ్’ అనే పాట వారిని అమితంగా ఆకట్టుకుంది. అప్పుడు మేము ఢిల్లీలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి నన్ను అభినందించసాగారు. అప్పుడే నాకు అర్థమైంది సినిమా సూపర్ హిట్ అని” చెప్పారు వ్యాస్.

‘తు గంగా కీ మౌజ్’ పాటని బొంబాయి సమీపంలోని పన్వేల్ లో ఒక నది వద్ద చిత్రీకరించారు. కొరియోగ్రాఫర్ లేకపోవడంతో, తమకి తోచినట్టుగా అభినయించమని విజయ్ భట్ – భరత్, మీనా లకి చెప్పారు. “ఒకసారి తాతయ్య ఓ ఫంక్షన్‍లో రాజ్ కపూర్ గారిని కలిసారట. అప్పుడాయన ‘తు గంగా కీ మౌజ్’ పాటని చిత్రీకరించిన పద్ధతిని మెచ్చుకున్నారట. దాన్ని చూసినప్పటి నుంచీ అదే మనసులో మెదులుతోందని అన్నారట” చెప్పారు పౌరవి. రాజ్ కపూర్ మృతి చెందినప్పుడు తన తాతయ్య చిన్న పిల్లాడిలా ఏడ్చారని ఆమె అన్నారు. రాజ్ కపూర్ గొప్ప దర్శక నిర్మాత అనీ, దూరదృష్టి గలవారని తాతయ్య చెప్పేవారని ఆమె అన్నారు. ‘బైజు బావరా’ లోని ప్రతీ దృశ్యాన్ని ముందు ఆర్ట్ డైరక్టర్, చిత్రకారుడు కాను దేశాయ్ చేత డ్రాయింగులు గీయించారు. “ఆ డ్రాయింగులను ఫ్రేమ్ కట్టించి దాచుకోవాలని పిస్తుంది” అన్నారు పౌరవి.

షూటింగ్ సక్రమంగా, ఏ ఆలస్యాలు లేకుండా సాగడంతో, సినిమాని సంవత్సరంలోపే పూర్తి చేశారు. సినిమా యూనిట్ సభ్యులు, సాంకేతిక నిపుణులలో చాలామంది భట్ గారి ఉమ్మడి కుటుంబానికి చెందినవారే.

సిగ్గరి అయిన మీనా కుమారి తన తండ్రి సమక్షంలో రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి ఇబ్బంది పడేదని వ్యాస్ అన్నారు. “ఆమె తండ్రి ఎప్పుడూ ఆమె చుట్టూ తిరుగుతూండేవారు. ఆయన అనుమతి లేకుండా ఆమె కదిలేది కాదు. రొమాంటిక్ సీన్లు చిత్రీకరించేడప్పుడు ఏదో ఒక మిషతో ఆయన బయటకి వెళ్ళిపోయేవారు” చెప్పారు వ్యాస్. భరత్ భూషణ్ ఓ మౌని, అయినా సెట్ల మీద ఎంతో మర్యాదగా నడుచుకునేవారు. “ఎవరైనా సాయం కోసం ఆయనని సంప్రదిస్తే, ఎలాగైనా సహాయం చేసేవారు” చెప్పారు వ్యాస్. వ్యాస్ గారికి భరత్ భూషణ్‍తో సత్సంబంధాలు ఉండేవి. వీరిద్దరూ సమ్రాట్ చంద్రగుప్త (1958)లో కూడా నటించారు. సాహిత్యంపై అభిరుచి కలిగిన భరత్ వీలు కుదిరినప్పుడల్లా ప్రేమ్ చంద్, తదితర రచయితల గురించి వ్యాస్‍తో చర్చించేవారట. “తనతో పుస్తకాలు తెచ్చుకుని షూటింగ్ విరామంలో చదువుకునేవారు” అన్నారు వ్యాస్. “ఒకరోజు నేను బాంద్రా లోని ఆయన ఇంటికి వెళ్ళాను. గదంతా పుస్తకాలతో నిండి ఉండడం చూసి విస్తుపోయాను” అన్నారు వ్యాస్. మీనా కుమారికి కూడా పఠనం అంటే ఆసక్తి ఉంది. కానీ చదువుకునేందుకు తగినంత సమయ మివ్వడం లేదని తండ్రిపై అలిగేవారట. ‘బైజు బావరా’ ఘన విజయం తరువాత భరత్ – దిలీప్ కుమార్ ఇంటి సమీపంలోని ఓ భవనాన్ని కొనుగోలు చేశారట. కానీ తరువాతి కాలంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆ భవనాన్ని జితేంద్రకి అమ్మేశారట. ఆయన పతనం గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. “ఒకప్పటి సూపర్ స్టార్, కెరీర్ చివరి రోజుల్లో రోజుకు ఐదు వందల రూపాయల పారితోషికానికి పనిచేశారు” చెప్పారు వ్యాస్. “బాంద్రా లోని ఖరీదైన బంగ్లా నుంచి లింకింగ్ రోడ్‍కి, అక్కడి నుండి విల్లేపార్లేకి, తరువాత మలాద్.. ఆయన మకాం మారింది.. ఆపై ఇతర అద్దె ఇళ్ళలో జీవించారు” అన్నారు వ్యాస్. భరత్ భూషణ్ కటిక దారిద్ర్యంలో మృతి చెందారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు. ఒకామెకి అంగవైకల్యం ఉంది. మరో కుమార్తె టివీ సీరియల్స్‌లో పని చేసేవారు.

ఒకసారి పన్వేల్ సమీపంలోని ఓ గ్రామంలో షూటింగ్ జరుగుతుందట. యూనిట్ సభ్యులందరికీ గుడిసెలలో బస ఏర్పాటు చేశారట. “అక్కడ హోటల్స్ లేవు మరి” చెప్పారు వ్యాస్. “ఒక రోజు మా సినిమాటోగ్రాఫర్ – ఆహారం బాలేదని, పెరుగు, సలాడ్, అప్పడం లేవని ఫిర్యాదు చేశారు. అది విన్న విజయ్ భట్ కోపంగా – ‘నా కారు ఇస్తాను, బొంబాయి వెళ్ళి అవన్నీ తిని రండి’ అని అన్నారు” చెప్పారు వ్యాస్. పని విషయంలో ఆయన చాలా నిక్కచ్చి మనిషని అంటారు వ్యాస్.

“తాతయ్యకి కంగారు ఎక్కువ. తన సినిమా విడుదలయ్యే ప్రతీసారీ, ఏదో ఒక హిల్ స్టేషన్‍కి వెళ్ళిపోయేవారు. ఆయన లేని సమయంలో వారి అన్నయ్య శంకర్ గారు అన్నీ సక్రమంగా చూసుకునేవారు. సినిమా బాక్సాఫీస్ స్టేటస్ తమ్ముడికి టెలిగ్రాం ద్వారా తెలియజేసేవారు. ‘త్వరగా వచ్చేయ్, సినిమా సూపర్ హిట్ అయింది’ అని శంకర్ గారు తాతయ్యని పిలిపించేవారు” చెప్పారు పౌరవి.

గుజరాత్ లోని సౌరాష్ట్రకి చెందిన భట్ సోదరులకి రంగస్థలమన్నా, సినిమా అన్నా అమితమైన ఇష్టం. వాళ్ళు మిఠాయిలు వ్యాపారం చేస్తూ, వచ్చిన డబ్బుతో సినిమా టికెట్లు కొనుక్కునేవారు. తన తాతయ్యల గురించి తన వెబ్‌సైట్‌లో “వారికి మార్గదర్శనం చేసింది ‘ఆలమ్ ఆరా’ దర్శకులు అర్దేషిర్ ఇరానీ. ఆ సమయంలో ఆయన రాయల్ స్టూడియోస్ మేనేజర్‍గా ఉండేవారు. తాతయ్యలు రాసిన కథలను పరిశీలించిన ఆయన, వాటిల్లో ఒక కథను ఎంచుకుని, తాతయ్యలను స్టూడియో ప్రొప్రయిటర్ సేఠ్ అబూ హుస్సేన్ గారిని కలవమన్నారట. ‘ఆయనకి కథ చూపించండి, ఆయనకి నచ్చితే, నాకు అభ్యంతరం లేదు’ అని అన్నారట. ఆ కథని ఆమోదించారు. స్వయంగా అర్దేషిర్ ఇరానీ గారే విజయ్ భట్‍గారికి స్క్రీన్ ప్లే ఎలా రాయాలో నేర్పించారు. ప్రతీ రోజు పని అయిపోగానే, రాత్రి భోజనాలు ముగించి తాతయ్యలిద్దరూ 1918లో ఎగ్జిబిటర్ అబ్దుల్ అలీ యూసఫ్ అలీ భాగస్వామ్యంతో అర్దేషిర్ ఇరానీ నిర్మించిన మెజిస్టిక్ సినిమా వద్ద ఆయనని కలుసుకునేనారు. ఇరానీ సహాయంతో విజయ్ భట్ తన మొదటి స్క్రీన్ ప్లే ‘విధి కా విధాన్’ రాసారు. దానికి కె.పి. భావే దర్శకత్వం వహించారు” అని రాశారు పౌరవి.

Cleopatra, Samson and Delilah, The Ten Commandments వంటి చిత్రాల నుంచి ప్రేరణ పొందిన విజయ్ భట్ ‘బైజు బావరా’లో అద్భుతమైన దృశ్యాలు ఉండాలని కోరుకున్నారు. ఈ సినిమాలోని నది దృశ్యాలు సెసిల్ బీ డెమిల్లేకి నివాళి. “డెమిల్లే ఉపయోగించిన స్పెషల్ ఎఫెక్ట్స్‌ అంటే తాతయ్యకి ఇష్టం. ఆయనెప్పుడూ ‘ది టెన్ కమాండ్‌మెంట్స్ సినిమాలో ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన దృశ్యం ఓ అద్భుతమ’ని అనేవారు. మనం కూడా అలా చేయగలగాలి అని తన సాంకేతిక నిపుణులకు చెప్పేవారు” అన్నారు పౌరవి. 1947లో అమెరికా పర్యటించినపుడు విజయ్ – డెమిల్లేని కలిసి ఆటోగ్రాఫ్ అడిగారట. అప్పుడాయన ‘Greetings from one director who is still trying to make good pictures, to another director, who will make great ones long after I am gone’ అని రాసి సంతకం చేశారట. తర్వాతి కాలంలో విజయ్ భట్ 1954లో ‘బైజు బావరా’తో, తొలి భారతీయ సినిమా ప్రతినిధుల బృందంలో సభ్యుడిగా సోవియట్ యూనియన్‍లో పర్యటించారు.

ఈ సినిమా ప్రింట్స్‌ని బాగుచేసి, అవకాశం ఉంటే రంగులద్దాలని వ్యాస్ అభిప్రాయపడ్డారు. “బైజు బావరా పాతదే, కానీ ఒకప్పుడు అది కొత్తది. దానిని నేటి తరపు యువ ప్రేక్షకులకి పరిచయం చేయాలి. మొఘల్-ఎ-ఆజమ్ సినిమాకి చేసినట్లు చేయాలి” అన్నారు వ్యాస్.

విజయ్ భట్ తమ్ముదు హర్‍సుఖ్ భట్ ఈ సినిమాకి ఫాన్ అసిస్టెంట్‍గా పని చేశారు. ఆయన ఉద్దేశంలో ఈ సినిమాని ఏ విధంగానూ పాడు చేయకూడదు. దాన్ని అసలు రీమేక్ కూడా చేయకూడదు. ఆయన వద్ద ఈ సినిమా డివిడి ఉంది. దాన్ని చూస్తు ఆయన పాత జ్ఞాపకాలను తలచుకుంటారు. ఎనభై ఏళ్ళు దాటిన హర్‍సుఖ్ ముంబయి శివార్లలోని చెంబూరులో ఉంటారు. రోజూ ‘బైజు బావరా’ చూస్తారు. ఆయన కూతురు ప్రతీ రోజు సాయంత్రం వచ్చి తండ్రిని చూసి వెళ్తారు. ఏళ్ళు గడిచేకొద్దీ ఆయన జ్ఞాపకశక్తి క్షీణించింది. ఆ సినిమా షూటింగ్‍లో ఏం జరిగిందో ఆయన మరిచిపోయారు. అయితే ఆ సినిమా ఎక్కువమందికి చేరితే తాను సంతోషిస్తానని అంటారు. అందుకు కావల్సింది ‘రీరిలీజ్ చేయడమే’ అని అంటారు.

ఇవీ బైజు బావరా సినిమాకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here