అలనాటి అపురూపాలు-147

0
10

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సుస్వరాల ఎస్. డి. బర్మన్:

త్రిపుర రాజకుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు – బర్మన్‍లు – సచిన్ దేవ్, రాహుల్ దేవ్‍లు – దాదాపు యాభై ఏళ్ళపాటు హిందీ సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సచిన్ దేవ్ బర్మన్/ఎస్.డి.బి – తొలుత త్రిపుర లోని అగర్తలను, ఆ తర్వాత అవిభాజిత బెంగాల్ ప్రాంతాన్ని తన సినీ సంగీతంలో ఓలలాడించారు. ఆయన సంగీతం ఆ ప్రాంతాలనుంచే ఆవిర్భవించింది.

తన ప్రతి పాట యొక్క హృదయంలో శ్రావ్యమైన ‘రుద్రిన్’ (ప్రవహించే నీటి ధ్వనిని సూచించే సంస్కృత-బంగ్లా పదం; ‘కల్‍కల్’ కన్నా నెమ్మదైన పదం) ఉంటుందని ఎస్.డి. బర్మన్ ఒకసారి ప్రథమేష్ బారువాతో చెప్పారు. ఆయన 100కి పైగా సినిమాలకి సంగీతం సమకూర్చారు. బాల్యం నుంచి సంగీతం పట్ల ఆసక్తి కల సచిన్ దేవ్ – త్రిపుర లోని గడ్డి మైదానాలకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి అక్కడి – పశువుల కాపరుల, జాలర్ల భతియాలి, జానపద పాటలు విని ఆస్వాదించేవారు.

ప్రకృతిలో సహజమైన, కల్తీ లేని సంగీతం ఉంటుందని, ప్రతి ఒక్కరూ దానికి చెవి ఒగ్గాలని సచిన్ దేవ్ అభిప్రాయపడతారు. ఆయన కలకత్తాలో ఉన్న రోజుల్లో జి. ఎఫ్. ఫాన్, సెబాస్టియన్ బాచ్ ల మీడోస్ మ్యూజిక్ నేర్చుకున్నారు. సంగీతం యొక్క భాష విశ్వవ్యాప్తమని, సంగీత ప్రజ్ఞకీ, సృజనాత్మకతకీ – జానపద సంగీతం అపారమైన వనరు అని గ్రహించారు. ఆ సమయంలో కలకత్తా ఆకాశవాణి కేంద్రంలో ఇంగ్లీష్ స్టేషన్ డైరక్టర్ ఉండేవారు. ఆయన సచిన్ దేవ్‍ని పియానో వాయించటం నేర్చుకోమన్నారట. తద్వారా అన్ని రకాల విదేశీ, భారతీయ సంప్రదాయ సంగీతాలను కూడా అధ్యయనం చేయవచ్చని అన్నారట.

సచిన్ దేవ్ పియానో నోట్స్ నేర్చుకున్నారు, పియానో వాయించటం నేర్చుకున్నారు. పార్క్ స్ట్రీట్‍లో ఉండే ఒక ఆంగ్లో-ఇండియన్ (ఎల్విన్ సేన్) ఆయన గురువు. ఆయన దగ్గర పియానో నేర్చుకోవడానికి ఒక పొడవాటి యువకుడు కూడా వచ్చేవాడట. ఆయన పెదాల మధ్య సిగరెట్ ఉంచుకుని పియానో వాయించడం అందరికీ అబ్బురంగా ఉండేదట. ఆ యువకుడే తరువాతి కాలంలో ప్రపంచంలోని దిగ్గజ దర్శకులలో ఒకరయ్యారు. ఆయనే సత్యజిత్ రే. యువ రే స్వరం బాగా నచ్చిన సచిన్ దేవ్ – ఆయనతో కొన్ని బెంగాలీ పాటలు పాడించాలనుకున్నారట. అయితే ధన్యవాదాలు చెప్పి, తనది ఆ రంగం కాదని రే వద్దన్నారట.

రే ఎంతో మర్యాదగా, ఎస్.డి.బి ఇచ్చిన ఆఫర్‍ని వద్దన్నారు. తన పాటలకు మూలాలని, ప్రేరణని బహిరంగంగా వెల్లడించగలిగే నిజాయితీ సచిన్ దేవ్‍కి ఉండేది. వాటిని తన పాటలలో ఎలా ఉపయోగించుకున్నది ఆయన వెల్లడించేవారు. ఒకసారి, 19 ఏళ్ళ వయసులో చిట్టగాంగ్ (నేటి బంగ్లాదేశ్) లోని గ్రామీణ మహిళలు పాడిన ఓ అరుదైన బాణీని విని గుర్తుంచుకుని, దాన్ని సాహిర్ లుధియాన్వీ రాసిన ‘ఠండీ హవాయేం లహ్రా కే ఆయేన్’ (నౌజవాన్, 1951) అనే పాటకి ఉపయోగించారు. అయితే కొందరు పాశ్చాత్య సంగీత రసజ్ఞులు ఈ పాటకి మూలం C’est la vie [Algiers (1938)] అని పేర్కొన్నారు. బర్మన్ సవినయంగా రెండు ఆధారాలను అంగీకరించారు. ఒక బాణీని మెరుగుపెట్టేంత వరకూ, తనకి పూర్తి సంతృప్తి చెందేవరకు చెక్కుతూనే ఉండేవారు బర్మన్. ”I compose, decompose and recompose.” అన్న బీథోవెన్ మాటలు ఆయనకు ఆదర్శం. ఒకసారి బెంగాల్‍లో బర్మన్ రవీంద్రనాథ్ టాగోర్‍ గారిని కలిసారట. అప్పుడు ఆయనకి ఒక బాణీ వినిపించారట. అది బాగా నచ్చిన టాగోర్, దాన్ని ఓ మంచి గీతం కోసం దాచి ఉంచమని చెప్పారట.

ఆ చక్కని బాణీకి చక్కని అజరామర గీతం దొరికింది. అదే సాహిర్ లుధియాన్వీ రాసిన ‘తుమ్ న జానె కిస్ జహాన్ మే ఖో గయె’ (సజా, 1951). సాహిర్ మళ్ళీ బర్మన్ కి రాసిన మరో పాట ‘దిల్ సే మిలా కే దిల్ ప్యార్ కీజియే’ (టాక్సీ డ్రైవర్, 1954). ఈ ఇద్దరు దిగ్గజాలు ‘ప్యాసా’ (1957) చిత్రం వరకు కలిసి పని చేశారు. తర్వాత విడిపోయారు. మళ్ళీ ఎన్నడూ కల్సి పనిచేయలేదు. ఇందుకు కారణం, ‘ఓ సినిమా పాట జనరంజకం అవ్వాలంటే, ముఖ్య పాత్ర గీత రచయితదే’ అని సాహిర్ బహిరంగంగా వ్యాఖ్యానించటమే అని అంటారు. అలా అని ఇతర గీత రచయితలు ఎస్.డి. బర్మన్ కోసం మంచి గీతాలు రాయలేదని కాదు. మజ్రూహ్ సుల్తాన్‍పురి రాసిన ‘చాంద్ ఫిర్ నికలా, మగర్ తుమ్ న ఆయే’ పాటని ఎవరు మర్చిపోగలరు? లతా మంగేష్కర్ గొప్పగా ఆలపించి, ఆ పాటని అజరామరం చేశారు. అలాగే, గీతా దత్ ప్రాణం పెట్టి పాడిన ‘వక్త్ నే క్యా క్యా హసీన్ సితమ్’ (కాగజ్ కే ఫూల్, 1957) పాట విన్నప్పుడు దాన్ని రాసిన కైఫీ ఆజ్మీ, సంగీతం కూర్చిన ఎస్.డి.బర్మన్, అభినయించిన వహీదా రెహమాన్ గుర్తు రాక మానరు.

ఎస్. డి. బర్మన్ ఓ పర్‍ఫెక్షనిస్ట్. ఆ పాటని గీతా దత్ చేత ఎన్నో సార్లు పాడించారట. చివరికి 11 రికార్డింగులలోంచి తాను ఉత్తమమని భావించిన ఒకదానిని ఎంపిక చేశారు. ఎస్.డి. బర్మన్‍కి హిందీ రాదు, ఉర్దూ అసలు తెలియదు. అయితే తాను స్వరపరిచే ప్రతీ పాట భావాన్ని ఆయన తెలుసుకోవాలనుకునేవారు. 1964లో ఓ సినిమా గొప్ప హిట్ అయింది. దాని పేరు ‘బేనజీర్’. ఆ సినిమా కోసం ప్రసిద్ధ కవి షకీల్ బదాయూనీ ఒక ఘజల్ రాశారు. ‘దిల్ మే ఏక్ జానే-ఎ-తమ్మన్నా నే జగా పాయీ హై’ అంటూ సాగే ఆ ఘజల్‍లో కొన్ని కఠినమైన పదాలున్నాయి. వాటిని తనకి ఇంగ్లీషులో కాని, సరళమైన హిందీలో కాని వివరించమని బర్మన్ అడిగారట. షకీల్ గారికి కాస్త ఓపిక తక్కువ. ఆయన రెండు సార్లు వివరించారట. కానీ ఆయన వివరించినది బర్మన్ గారికి అర్థం కాలేదు. విసిగిపోయిన షకీల్ గారు, “మీకు రఫీ చెబుతాడు లెండి” అన్నారుట. శశికపూర్, తనూజల మీద చిత్రీకరించాల్సిన ఆ పాట పాడవల్సింది రఫీ గారు. ఆయన ఓపికగా ఆ పాట అర్థాన్ని బర్మన్ గారికి వివరించారట. అది గొప్ప హిట్ అయింది.

నిజానికి, షకీల్ గారు, బర్మన్ గారు కలిసి అరుదుగా పనిచేసేవారు. “షోకీల్ బహుత్ గుస్సా కర్తా హై” (షకీల్‍కి కోపం ఎక్కువ) అని ఒకసారి బర్మన్ దా అన్నారు. బర్మన్ గారు ఎప్పుడూ ఎవరి గురించి చెడ్డగా మాట్లాడేవారు కాదు. ఆయనకి ఉర్దూ – హిందీ అంత బాగా రాకపోయినా, ఉర్దూ ఘజళ్ళకి కావల్సిన – కివాయత్, ఫికాత్ వంటి స్వరాల గురించి ఆయనకి బాగా తెలుసు. అందుకే ‘తీన్ దేవియా’ (1965, మజ్రూహ్ సుల్తాన్‍పురి) చిత్రంలోని రెండు ఘజళ్ళకు సంప్రదాయ ఘజల్ సంగీతపు ముద్ర లభించింది. అవి – ‘కహీఁ బేఖయాల్ హోకర్ యూం హి ఛూలియా’ మరియు ‘ఐసే తో నా దేఖో కే హమ్ కో నషా హో గాయే’. ఈ రెండిటిలో బర్మన్ గారు నేపథ్యంలో నెమ్మదిగా సరోద్ వాయిద్యాన్ని ఉపయోగించారు. ఎస్.డి.బర్మన్ గారికి శైలేంద్ర అభిమాన గీత రచయిత. శైలేంద్ర ‘మేరీ సూరత్ తేరీ ఆంఖేఁ’ (1963) చిత్రానికి రాసిన ‘తేరే బిన్ సూనే నయన్ హమారే’ అనే పాటకి బర్మన్ గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. లత, రఫీ మనసు పెట్టి పాడిన ఈ పాట గొప్ప హిట్ అయింది. అయితే తన ఉత్తమ సృజనాత్మక సంగీతాన్ని ‘గైడ్’ (1965) సినిమాకి అందించినట్లు భావిస్తారు ఎస్.డి. బర్మన్.

బర్మన్ గారితో కలిసి కిషోర్ కుమార్, రఫీ, లతా ఎన్నో గొప్ప పాటలను అందించారు. కిషోర్ బర్మన్ గారి కోసం పాడిన అన్ని పాటలలోనూ ‘దిల్ ఆజ్ షాయర్ హై’ (గాంబ్లర్, 1971, గీత రచన – గోపాల్ దాస్ సక్సేనా ‘నీరజ్’) అనే పాట వారికి బాగా ఇష్టం. బర్మన్ గారిది విభిన్నమైన స్వరం. తన గొంతుని ఆయన ఊష్మమైనదని, కీచుగొంతు అని ఆయన భావించేవారు. అందుకే ఆయన ఎక్కువగా నేపథ్యపు పాటలు పాడేందుకు ఇష్టపడేవారు (మేరే సాజన్ హై ఉస్ పార్, బందిని, 1963, శైలేంద్ర). బర్మన్ గారికి కిళ్ళీలంటే బాగా ఇష్టం. ముఖ్యంగా కలకత్తా పాన్‍ని బాగా ఇష్టపడేవారు. కలకత్తా పాన్ తింటే వెంటనే ఓ కొత్త బాణీ స్ఫురిస్తుందని ఆయన అనేవారు. ఒక గీతాన్ని వెంటనే ఆయన మెచ్చితే, బాణీ కూడా వెనువెంటనే తట్టేది.

పదాలకీ బాణీకి మధ్య పరిపూర్ణమైన సమన్వయం ఉండాలని ఆయన భావించేవారు. సహజమైన కవిత్వం సహజమైన, పదాలపై ఆడే బాణీని సృజిస్తుందని ఆయన అనేవారు. గీత రచయిత యోగేష్ గౌర్ ‘పియా మైనే క్యా కియా ముఝే ఛోడ్ కే జాయో నా’ (ఉస్ పార్, మన్నా డే, 1974) అనే పాటని రాసినప్పుడు ఆ పాటని బర్మన్ గారితో పాడించాలని అనుకున్నారట. అయితే తనకి వయసు అయిపోయిందని, తాను పాడితే ఆ పాటకి అందం రాదని అని చెప్పి, మన్నా డే పేరు సూచించారట.

ఎంతో అద్భుతమైన స్వరకర్త అయినప్పటికీ, తన ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉంటానని ఆయన అనుకోలేదు. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకునేవారు. ఎన్నో గొప్ప పుస్తకాలు చదివారు. తరచుగా ఆంగ్ల కవి జాన్ కీట్స్ వాక్యాలని ఉదహరించేవారు.  ఆయన చెప్పినట్టే ‘నా పేరు నీటిపై రాయబడుతుంది’ అని అనేవారు. షెల్లీ, కీట్స్, బైరన్ వంటి కవుల పద్యాలను తీసుకుని వాటికి బాణీలు కట్టాలనుకున్నారు, కానీ ఆ ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయారు. ఆయన తరచూ బైరన్‍ వాక్యాలు కూడా ఉల్లేఖించేవారు. తాను చనిపోవడానికి కొద్ది నెలల ముందు ఓ బెంగాలీ విలేఖరితో “ప్రజలు మోజార్ట్‌నీ, బీథోవెన్‍ని ఎన్నడూ మరువరు, నాలాంటి స్వరకర్తని ప్రజలు గుర్తు పెట్టుకోరు” అని అన్నారు.

కానీ బర్మన్ దా, మేము మిమ్మల్ని స్మరించుకుంటారు. ఎప్పటికీ గుర్తుంచుకుంటాము. మీ అభిమానుల గుండెల్లో మీరు చిరకాలం ఉంటారు!


నిత్య సంతోషి కిషోర్ కుమార్:

ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే అద్భుత గాయకుడు కిషోర్ కుమార్ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు:

  • ఆయన శిక్షణ పొందిన గాయకుడు కాదు. ఆయనకు రాగాలు తెలియవు.
  • 1985లో ప్రీతీష్ నందికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘చెట్లతో స్నేహం చేస్తే తప్పేంటి’ అని ప్రశ్నించారు. అప్పట్లో ఇది సంచలనం కలిగించింది.
  • బహుభాషలు తెలిసినందువల్ల, కిషోర్ కుమార్ బెంగాలీ, హిందీ, మరాఠీ, గుజరాతీ, అస్సామీస్, మలయాళం, ఒరియా, కన్నడ భాషలలో పాటలు పాడారు.
  • కిషోర్ కుమార్‍కి పారితోషికం పట్ల పట్టింపు ఎక్కువ. ఒక నిర్మాత – ఓ సినిమాకి సగం పారితోషికం అడ్వాన్స్‌గా ఇచ్చి, మిగతా సగం సినిమా పూర్తయ్యాకా ఇస్తానని అన్నాడట. మర్నాడు కిషోర్ కుమార్ సగం జుట్టు సగం మీసం తీసేసి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారట! పూర్తి మొత్తం ఇచ్చేదాకా, ప్రతీ షాట్ లోనూ ఇదే విధంగా కనబడతానని సెట్‍లో అందరికీ చెప్పారట!
  • ‘హాఫ్‌టికెట్’ అనే సినిమాలోని ‘ఆకే సీధీ లగీ దిల్ పే’ అనే పాటలో ఆడ గొంతుతోనూ, మగ గొంతు తోనూ పాడారు. ఓ యుగళ గీతం విషయంలో ఇది అద్భుతం. ఈ పాటని ఆయనతో పాటు లతా మంగేష్కర్ పాడాల్సి ఉంది.
  • ‘చల్తీ కా నామ్ గాడీ’ సినిమాలోని ‘పాంచ్ రూపయ్య బారాహ్ అణా’ అనే సూపర్ హిట్ పాటకి ఓ నేపథ్యం ఉందని చెబుతారు. కిషోర్ కుమార్ ఇండోర్ లో చదువుకునే రోజుల్లో – కాలేజీ క్యాంటిన్‍కి రూ 5.75 బాకీ పడ్డారట. ఈ పాటలో ఆయన మధుబాలతో రొమాన్స్ చేశారు. తర్వాతి కాలంలో ఆమె ఆయనకి రెండవ భార్య అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here