అలనాటి అపురూపాలు-153

0
12

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అలనాటి తార శ్యామా విశేషాలు:

హిందీ చలనచిత్రరంగంలో ప్రజాదరణ పొందిన నటి శ్యామా. ఆవిడ అసలు పేరు ఖుర్షీద్ అఖ్తర్. తొమ్మిదేళ్ళ వయసులో సినీరంగలో ప్రవేశించారు. 1945లో విడుదలయిన నూర్జహాన్ నటించిన ‘జీనత్’లో కోరస్ సింగర్ లలో ఒకరిగా కనిపిస్తారు శ్యామా.

ఆ సినిమా గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి, తన సహ నటీనటుల గురించి ఒక ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారో ఆమె మాటల్లోనే చదువుదాం.

“నేను నా మిత్రులతో కలిసి దాదర్‌లో జరుగుతున్న నూర్జహాన్ సినిమా షూటింగ్‌కి వెళ్ళాను. నూర్జహాన్ భర్త, ఆ సినిమా దర్శకుడు అయిన షౌకత్ హుస్సేన్ ‘మీలో ఎవరికైనా నటించాలని ఉందా’ అని అడిగారు. నేను వెంటనే చెయ్యెత్తాను, ‘నేను నటిస్తాను’ అన్నాను. తర్వాత ఇంటికి వెళ్ళి ఈ అవకాశం గురించి చెప్తే, నాన్న వద్దన్నారు. ‘తప్పేంటి’ అని అడిగాను. నాకు ఎప్పటి నుంచో సినిమాలలో నటించాలని ఆసక్తి ఉండేది. స్కూలో లంచ్ టైమ్ లో బల్ల ఎక్కి నాట్యం చేసేదాన్ని. తరువాతి కాలంలో పాటలు పాడడం, నృత్యం చేయడం నేర్చుకున్నాను. ప్రతీ సినిమా చూసేదాన్ని” చెప్పారు శ్యామా. తన కాలంలో ఆవిడ అసలే మాత్రం తీరిక లేని నటి. హీరోయిన్‍గా, ద్వితీయ కథానాయికగా, వ్యాంప్‌గా దాదాపు 147 సినిమాలలో నటించారామె.

“నేనెంతో అదృష్టవంతురాలిని. నాకు మంచి పాత్రలు లభించాయి. ‘శారద’ సినిమాకి నాకు ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్’గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. నాకు ‘దో బహెన్’, ‘చోటీ బహెన్’, ‘భాయ్ భాయ్’, ‘దో భాయ్’ వంటి కుటుంబ కథాచిత్రాలంటే ఇష్టం. ‘దో బహెన్’ సినిమాలో మంచి అమ్మాయిగా, చెడ్డ అమ్మాయిగా రెండు పాత్రలు పోషించాను. అప్పట్లో రాజేంద్ర కుమార్ కొత్త హీరో. మొదట్లో ఈ సినిమా బాగా ఆడలేదు. కానీ రెండోసారి విడుదలైనప్పుడు అది పెద్ద హిట్ అయింది” చెప్పారు శ్యామా.

1950లలో ‘బర్సాత్ కీ రాత్’, ‘తరానా’, ‘ఆర్ పార్’ వంటి సినిమాలలో చక్కని పాత్రలు పోషించారామె. “నాది ఫొటోజనిక్ ఫేస్. ఏ దిశ నుంచి నా ముఖం మీద కాంతి పడినా, ఫొటో బాగా వచ్చేది. నేను నా శరీరాకృతిని శ్రద్ధగా కాపాడుకున్నాను. డైట్ బాగా పాటించేదాన్ని. స్లిమ్‍గా ఉండడం కోసం ఎక్కువ గ్లూకోజ్ నీళ్ళు తాగేదాన్ని. అన్ని రకాల దుస్తులని ముఖ్యంగా – ఘరారాలు, సల్వార్లు, చీరలు, ప్యాంటులు ధరించేదాన్ని” చెప్పారీ అందాల నటి.

‘సజా’ (1951) సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు, గొప్ప సినిమాటోగ్రాఫర్ అయిన ఫాలి మిస్త్రీ తో 16 ఏళ్ళ వయసులో ప్రేమలో పడ్దారామె. “మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం. కానీ నాకు బాగా సిగ్గు. నేను చెప్పలేకపోయాను” అన్నారామె. “మొదట్లో – పెళ్ళయ్యాకా, సినిమాలు మానేయాలని ఆయన అన్నారు. కానీ ‘నేనీ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను, అందుకని మానను’ అని చెప్పాను” అన్నారు. వారి వివాహం 1953లో జరిగింది. ఈ దంపతులకు ఫరూక్, రోహిన్ అనే ఇద్దరు అబ్బాయిలు, శిరిన్ అనే కూతురు పుట్టారు. “నా వైవాహిక జీవితంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మా పెద్దబ్బాయి పుట్టాకా కూడా నేను నటన మానుకోలేదు. ఆయనకి నా మీద విశ్వాసం ఉంది. నాకెప్పుడయినా పనిలో ఆలస్యం అవుతుందని తెలిస్తే ‘నాకీ రోజు ఆలస్యం అవుతుంది. కానీ కలిసి భోంచేద్దాం’ అనేదాన్ని. తమది ముస్లిం-పార్శీల వివాహం అయినా, తామెంతో అవగాహనతో ఉండేవారమని చెప్పారు. “ఫాలితో పెళ్ళి నిశ్చయం కాక ముందు నా సహనటుల నుంచి చాలా పెళ్ళి ప్రస్తావనలు వచ్చాయి. వాళ్ళ పేర్లు చెప్పను. వాళ్ళలో కొందరు ఇప్పుడు లేరు, మిగతా వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. ఒక్కోసారి మేం పలకరించుకుని ‘ఎలా ఉన్నారు’ అని కుశలం అడుగుతాం” అంటూ నవ్వారామె.

1979లో హాఠాత్తుగా ఫాలి చనిపోయాకా కూడా శ్యామా నటన కొనసాగించి, సహయక పాత్రలలో నటించారు. సంజయ్ దత్ నటించిన ‘హత్యార్’ ఆమె చివరి సినిమా. నటన విరమించుకున్నాకా, విశ్రాంత జీవితం గడిపారు. “విశ్రాంతి తీసుకుంటాను, నిద్ర పోతాను, నా పాత సినిమాలు చూస్తాను. భాయ్ బహెన్, బర్సాత్ కీ రాత్, ఆర్ పార్ సినిమాలు ఆస్వాదిస్తాను. నా సినిమాల డివిడిలు మా అబ్బాయిలకి పంపాను” చెప్పారు. ఒక తల్లిగా పిల్లల భవిష్యత్తుని నిర్మించారు. సినీరంగంలో వహీదా రెహమాన్, నందా, శశికళ, నిరుపా రాయ్, నాదిరా ఆమెకు ఆప్తులు. “నేను నిరుపా బాగా సన్నిహితులం. ఆమె హఠాత్తుగా చనిపోవడం నాకో పెద్ద షాక్” అన్నారు శ్యామా. “అప్పట్లో మేము ఒకరి రహస్యాలను ఒకరం దాచేవారం. ఇప్పుడే రహస్యమూ దాగదు” అన్నారు. విదేశాలలో స్థిరపడిన కుమారులను తలచుకుంటూ, వారిని మిస్సవుతున్నాను అని తెలిపారు. “మా అమ్మానాన్నలకి తొమ్మిది మంది పిల్లలం. నేను తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. జనాలు వస్తారు, వెళ్తారు. జ్ఞాపకాలు మిగిలిపోతాయి. నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు, అందరితోనూ స్నేహామే” అన్నారు. పలు సినిమాలలో తన నటనను ఎన్నో పురస్కారాలు పొందారు శ్యామా.

***

తన సహ నటీనటుల గురించి ఇలా చెప్పారు శ్యామా.

మీనా కుమారి:

మీనా అక్క చక్కని నటి. సన్నివేశాలలో ఏడ్వాల్సి వచ్చి నప్పుడు అత్యంత సహజంగా నటిస్తుంది. ఆమె సున్నిత మనసుస్కురాలు. మేం ‘శారద’ సినిమాలో కలిసి నటించాం. ఆమెకి చక్కని భోజనం ఇష్టం. ఒకసారి నన్ను బిర్యానీ తెమ్మని అడిగింది. ఇంట్లో వండి తీసుకెళ్ళాను. తను ఓ చేపల వంటకం ఆర్డర్ ఇచ్చింది. ఆ రోజు మేం కలిసి భోం చేశాం. తనకి జర్దా కిళ్ళీ చాలా ఇష్టం. తను ఎప్పుడూ మరీ సన్నగా ఉండేది కాదు. కాస్త బొద్దుగా ఉండేది, తెల్లటి దుస్తులు ధరించడం ఇష్టపడేది. తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె ఎవరికీ ఏమీ తెలియనివ్వలేదు. తన కష్ట సుఖాల గురించి ఎవరితోను చెప్పుకోలేదు. మేమూ అడిగేవారం కాదు. అయినా ఆమె గురించి ఏవేవో కథనాలు ప్రచురితమయ్యేవి. తన పేరు మీద ఏ ఆస్తి ఉండాలని ఆమె అనుకోలేదు. తన ఆరోగ్యం క్షీణించడం నాకు తెలుసు. ఆమె చివరి సినిమా ‘గోమతీ కే కినారే’లో నేనూ నటించాను. ఒక సన్నివేశంలో నటించాల్సి ఉన్నప్పుడు లేచి నిలబడింది. కానీ ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది. సెట్‍లో ఉన్న ఒక నర్స్ వచ్చి తనకి తాగడానికి ఏదో ఇచ్చింది. ఆ రోజే నేను తనని చివరిసారి సజీవంగా చూడడం” అన్నారు శ్యామా.

మధుబాల:

మధుబాల చాలా సౌందర్యవతి. మెదటిసారి ‘తరానా’ షూటింగ్‍లో కలిసాను. తన పని తాను మౌనంగా చేసుకుంటూ వెళ్ళేవారు. దిలీప్ (కుమార్) సాబ్‍తో ఆమె ప్రేమలో పడ్దారు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారేమోనని మేమంతా భావించాం. కానీ అలా జరగలేదు. ఆమె తండ్రి అతావుల్లా ఖాన్ చాలా కఠినంగా ఉండేవారు. స్టూడియో నుంచి నేరుగా ఇంటికే వెళ్ళిపోయేవారామె. సినిమాల ప్రీమియర్లకి కూడా వచ్చేవారు కాదు. తర్వాత ఆమె కిషోర్ కుమార్‍ని ఇష్టపడ్దారు. ‘బర్సాత్ కీ రాత్’ షూటింగ్ సందర్భంగా తనని చూడడానికి ఆయన సెట్స్‌కి రావడం నాకు గుర్తుంది” చెప్పారు శ్యామా.

నర్గిస్:

నేను నర్గిస్‍ని మొదటిసారి ‘ప్యార్’ షూటింగ్‌లో కలిసాను. నేను సెట్‍లో కాలుజారి పడ్డాను. ఆమె పకాలున నవ్వారు. నర్గిస్ చాలా సీదాసాదా మనిషి, ఎంతో వినయంగా ఉండేవారు. ఆవిడతోనూ, రాజ్ కపూర్ గారితోనూ ఎన్నో సినిమాలలో నటించాను. ఆమె చక్కని రూపసి. ఎక్కువగా తెల్ల చీరలు ధరించి, జుట్టుని ‘బన్’లో ముడి వేసి, పూలు తురుముకునేవారు. ఎప్పుడూ లిప్‌స్టిక్ వేసుకునేవారు కాదు. ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. నేను ఆమె సోదరుడు అన్వర్ హుస్సేన్‌తో కల్సి ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు “బేబీ (నర్గిస్ ముద్దు పేరు)కి పెళ్ళయిపోయింది” అన్నారాయన. నేను విస్తుపోయాను. మర్నాడు వార్తాపత్రికలలో నర్గిస్, సునీల్ దత్ గారి ఫొటోలు వచ్చాయి. సునీల్ దత్ గారు నిజంగా బంగారం! ఆమె జీవితంలోకి వచ్చిన గొప్ప మనిషి ఆయన. పెళ్ళి తరువాత ఆమె ఎంతో సర్దుకున్నారు. చక్కని భార్య, మంచి తల్లిగా వ్యవహరించారు. సంజు (సంజయ్ దత్) ని ప్రసవించే ముందు నేను ఆసుపత్రికి వెళ్ళి ఆమెను కలిసాను. అప్పుడు నాతో నిరుపా కూడా ఉంది. మంచం మీద కూర్చుని ఉన్నారు నర్గిస్. “రండి, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను” అన్నారు.

వహీదా రెహమాన్:

వహీదా మాకు పొరుగున ఉండేది. అమ్మతోనూ, సోదరి సయీదా తోనూ కలిసి ఉండేది. తనది కూడా మంచి ఫొటోజెనిక్ ఫేస్. తనకి చీరలు కట్టుకోవడం ఇష్టం. అందరితోనూ బావుండేది. కాని వీలైనంత ఏకాంతంగా ఉందేది. గురు దత్‌కి ఆమె అంటే ఇష్టం. ఆయనో గొప్ప దర్శకుడు, తనో మంచి నటి. వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నాకు తెలియదు, కానీ గీతా దత్ (గాయని, గురు దత్ భార్య) వహిదాకి పాడడం మానేసింది. నేనూ వహీదా కలిసి చాలా సినిమాలలో నటించాం. వాటిల్లో ‘దిల్ దియా దర్ద్ లియా’ ముఖ్యమైనది. యూసఫ్ భాయ్ (దిలీప్ కుమార్) హీరో. సెట్స్‌లో ఉన్నప్పుడు వహీదా ఎక్కువగా పుస్తకాలు చదువుకునేది. “ఎవరిని ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నావు? చీకట్లో ఏం కనిపిస్తుంది?” అంటూ ఆటపట్టించేదాన్ని. తను నవ్వేసేది. ఒక్కోసారి స్వెటర్ అల్లుతూ కనిపించేది. ‘ఎవరి కోసం’ అని చిలిపిగా అడిగేదాన్ని. వాళ్ళిద్దరిది మంచి జోడీ. కానీ ప్రేమ, పెళ్ళి అనేవి విధి చేసే వింత లీలలు అనిపిస్తుంది అన్నారు శ్యామా.

గురు దత్:

గురు దత్ మంచి దర్శకుడు. పర్‍ఫెక్ట్‌గా వస్తే గాని షాట్ ఓకే చేసేవారు కాదు. బాగా సన్నద్ధమై వచ్చేవారు. కెమెరాలను ఎక్కడ పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. తనకి కావలసిన విధంగా రాకపోతే, చాలా అసహనానికి లోనయ్యేవారు. బాగా కఠినంగా ఉండేవారు, విలువలున్న మనిషి. సున్నిత మనస్కుడు. ‘ఆర్ పార్’ చేస్తునప్పుడు నా సన్నివేశాలు అన్నీ ఆయన నటించి చూపారు. నటనలోనూ, నృత్యంలోనూ ఆయన మేటి. ఆయన చనిపోవడానికి వారం ముందు నా బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. బాగా మద్యం సేవించడమే ఆయన మరణానికి కారణం అనుకుంటున్నాను. ఆయనని ఆత్మహత్య కాదని నా అభిప్రాయం. ‘బహురాణి’ సినిమా చేస్తున్నప్పుడు తాను డిప్రెషన్‍లో ఉన్నట్లు ఆయన ఒక్కసారి కూడా చెప్పలేదు. ఆయన కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగలేదు. భార్యా పిల్లల నుంచి విడిపోవడం నరకప్రాయం – చెప్పారు శ్యామా.

రాజ్ కపూర్:

రాజ్ మరీ పొడవు కాదు. అందుకే మేం ‘శారద’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను శాండల్స్ వేసుకోవద్దనే వారు. తాను స్వయంగా గొప్ప దర్శకుడయినప్పటికీ, తాను పని చేస్తున్న సినిమాల దర్శకుల పనిలో ఆయన ఎన్నడూ జోక్యం చేసుకునేవారు కాదు. ఆయన ప్రతీ సినిమా ఓ పాఠం లాంటిదే – అది ‘జిస్ దేశ్ మే గంగా బహతీ హై’ కావచ్చు లేదా ‘సత్యం శివం సుందరం’ కావచ్చు. ఆయన చెత్త సినిమాలు తీయలేదు. సరదాగా ఉండేవారు. మంచి ఆహారాన్ని ఇష్టపడేవారు. ఎక్కువగా తెల్లని బోస్కీ చొక్కా, ప్యాంటు ధరించేవారు. ఆయన తరచూ నర్గిస్‍ని గుర్తు చేసుకునేవారు. ఓసారి మేము ఓ సినిమా షూటింగ్‍లో ఉన్నాం. ఉన్నట్టుండి ఆయన కేలండర్ చూసి, ‘ఈ రోజు బేబీ (నర్గిస్) పుట్టినరోజు’ అని అన్నారు. మీకు బాగా తెలిసిన వ్యక్తిని ఎలా మర్చిపోగలరు? ఆయన కూడా మనిషే గదా – అన్నారు శ్యామా.

దిలీప్ కుమార్:

సెట్‍లో ఉన్నప్పుడు తన పనిలో లీనమై, ఎంతో ఏకాగ్రతతో ఉండేవారు దిలీప్. పనిలో ఉన్నప్పుడు తమాషాలు ఆయనకి ఇష్టం ఉండవు. మాకు సలహాలు కూడా ఇచ్చేవారు. ఆయన మాకు సీనియర్, అందుకని ఆయన చెప్పేవి శ్రద్ధగా వినేవాళ్లం. ఆయనకి ఆడవాళ్లంటే ఇష్టం. ఇంతకంటే ఎక్కువ చెప్తే, ఆయన నన్ను కొట్టినా కొడతారు. షబ్నమ్ సినిమాలో ఆయన కామినీ కౌశల్‍తో నటించారు. అప్పట్లో ఆయన కొత్తగా వచ్చారు. కారు ఉండేది కాదు. రోజూ ఆయనా, కామినీ రైల్లో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణించి స్టూడియోకి వచ్చేవారు. నేను థర్డ్ క్లాసులో ఉండేదాన్ని. స్టేషన్ నుంచి మేం టాంగా ఎక్కి ఫిల్మిస్థాన్ స్టూడియోకి వెళ్ళేవాళ్ళం. అదో సరదా. ఆ రోజుల్లో ఆయనకి ఆరోగ్యం అంత బాగుండేది కాదు. సైరా (బాను, దిలీప్ భార్య)కి సన్నిహితురాలైన నా నేస్తం షకీలా (అలనాటి నటి)కి ఫోన్ చేసి యూసఫ్ భాయ్ ఆరోగ్యం గురించి ఆరా తీసేదాన్ని. ‘ఆయనకి మంచి భార్య దొరికింది. ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది’ అని చెప్పింది షకీలా -చెప్పారు శ్యామా.

ఇవీ అలనాటి నటి శ్యామా విశేషాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here