అలనాటి అపురూపాలు-158

0
7

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తన సోదరుడు గురుదత్ గురించి, తమ బాల్యం గురించి లలితా లాజ్మీ:

ప్రముఖ నటి, చిత్రకారిణి లలితా లాజ్మీ 13 ఫిబ్రవరి 2023న మృతిచెందారు. గొప్ప కళాకారిణి అయిన లలితా లాజ్మీ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన గురుదత్ చెల్లెలిగా సుప్రసిద్ధులు.

లలిత 1932 అక్టోబర్ 17న కోల్‌కతాలో జన్మించారు. ఆమె తండ్రి కవి, తల్లి బహుభాషా రచయిత్రి. కళలకు నిలయమైన కుటుంబంలో జన్మించిన లలితకి శాస్త్రీయ నృత్యమన్నా, చిత్రలేఖనం అన్నా చాలా ఇష్టం. ఆమె చిత్రలేఖనాన్ని తన వృత్తిగా ఎంచుకున్నారు. దశాబ్దాల పాటు లలిత, పారిస్, లండన్, హాలండ్ వంటి చోట్ల ఎన్నో అంతర్జాతీయ గాలరీలలో తన చిత్రాలను ప్రదర్శించారు. ఆమె పెయింటింగ్స్ నేషనల్ గాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, ది బ్రిటీష్ మ్యూజియం, ఇంకా ముంబయి లోని సి.ఎస్.ఎం.వి.ఎస్. మ్యూజియం లోనూ ఉన్నాయి. 2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్’ అనే బాలీవుడ్ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు.

ఒక ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి, తన అన్న గురుదత్ గురించి, ఆయన కల్లోల జీవితం గురిచి లలిత ఏమన్నారో ఆవిడ మాటల్లోనే చదవండి:

***

“మా చిన్ననాటి కలకత్తా రోజులని తలచుకుంటే ఎన్నో జ్ఞాపకాలు మనసులో మెదలుతాయి. మా అమ్మానాన్నలకి నలుగురు కొడుకులు, నేనొక్కదాన్నే కూతురిని. అప్పట్లో మేం కలకత్తాతో పద్దాపుకూర్ ట్యాంక్ వద్ద ఉండేవాళ్ళం. గురు, ఆత్మా ఇద్దరూ ఆ చెరువులో ఈత కొడుతుంటే, నేను ఒడ్డున గడ్డి మీద కూర్చుని చూస్తూండే దాన్ని. ఇక్కడే ఏడాది కొకసారి ‘పారిష్ మేళా’ జరిగేది. అద్భుతమైన జాత్ర కళారూపాల్ని రాత్రంతా ప్రదర్శించేవారు. ఈ మేళాలో ఎర్రమట్టి బొమ్మలు, అందంగా రంగులు వేసిన కుండలు, చెక్క బొమ్మలు; ఎరుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు వేసిన పక్షుల, జంతువుల బొమ్మలు అమ్మేవారు. మహిళలు పాదాలకు రాసుకునే ఎర్రని ద్రవం ‘ఆల్టా’, తలలో పెట్టుకునే ‘సిందూరం’ చిన్న చిన్న ఎర్రని డబ్బాలలో అమ్మేవారు.

బావుల్ గాయకులు మా ఇంటి ముందు నిలబడి చక్కని బెంగాలీ భక్తిపాటలు పాడేవారు. నాయనమ్మ నన్ను పిలిచి వాళ్ళకి బియ్యం ఇప్పించేది. మా నాయనమ్మతో కల్సి రైల్లో ధర్మతల స్ట్రీట్‌కి ప్రయాణించడం లీలగా గుర్తుంది. సుదూర ప్రయాణంలో దారి వెంట సినిమా పోస్టర్లు చూసేదాన్ని. మా మావయ్య శ్రీ బెనెగళ్ పేరుపొందిన కళాకారుడు. నగరంలోని పలు సినిమా హాళ్ళకు – సినిమా హోర్డింగ్స్, ప్రచారం చూసే ఓ చిన్న ఆఫీసు ఉండేదాయనికి. అందుకని ఆయనకి సినిమాలకి పాస్‍లు దొరికేవి, ఒక్కోసారి రోజుకి మూడు లేదా నాలుగు సినిమాలకి. ఆ విధంగా మాకు ప్రభాత్ ఫిల్మ్స్, న్యూ థియేటర్ వంటి సంస్థలు తెలిసాయి, ఎన్నో ఇంగ్లీషు సినిమాలు పరిచయమయ్యాయి. మా మావయ్య ఇంట్లో చేత్తో తిప్పే ఓ గ్రామఫోన్ ఉండేది. అత్తయ్యకి బెంగాలీ పాటలన్నా, శాస్త్రీయ సంగీతమన్నా ఇష్టం. మావయ్యకి ఫొటోగ్రాఫీ మీద కూడా ఆసక్తి ఉండేది. ఆయన తన దగ్గర ఉన్న 8 ఎం.ఎం. కెమెరాతో చిన్న చిన్న ‘హోమ్ మూవీస్’ తీసేవారు. బహుశా ఈ బెంగాల్ జ్ఞాపకాలన్నీ గురు మనసులో బాగా నిలిచిపోయాయేమో, అందుకే వాటిని తన సినిమాల్లో ఉపయోగించాడు. ‘ప్యాసా’లో లొ-టెర్రెస్ సీన్లు, బావుల్ గాయకుడు ‘ఆజ్ సాజన్ మోహే అంఘ్ లగా లో’ పాట పాడడం, హుగ్లీ నది, నేపథ్యంలో నిశ్చలంగా నిలిచిన పడవలు, తీరాన అతను నిద్రిస్తున్నప్పటి దృశ్యం – అన్నీ పాత రోజుల జ్ఞాపకాలే.

14 ఏళ్ళ కుర్రవాడిగా గురుకి నాట్యం అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. మా నాయనమ్మ గదిలో – దేవతల విగ్రహాలు ఉన్న చోట, రాత్రిపూట ఆమె దీపాలు వెలిగించి, ‘నీడల క్రీడలు’ (షాడో ప్లే) ప్రదర్శిస్తుంటే దాక్కుని రహస్యంగా  చూసేవాడు. ఈ షాడో ప్లే ని ‘సాహెబ్ బీవీ ఔర్ గులామ్’ సినిమాలో మినూ ముంతాజ్ చేసిన ఒక డాన్స్ సీక్వెన్స్‌లో ఉపయోగించాడు. ఈ సన్నివేశంలో నాట్యగత్తెలతో చేసిన వెలుగు నీడల ప్రయోగం విశిష్టమైనది. ఇలాంటి ప్రయోగాలే ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్ వంటి సినిమాలోని పలు దృశ్యాలలో చేశాడు. ‘ప్యాసా’లో ‘జహా ప్యార్ హోతా హై’ అనే పాట సన్నివేశంలో – జనాలు నాయకుడి గుర్తింపుని అడిగినప్పుడు – బాల్కనీ ఎంట్రన్సులో క్రీస్తు వలె చేతులు చాచి నిలబడడం మరో గొప్ప ప్రయోగం. క్లయిమాక్స్‌లో మాలా సిన్హా నాయకుడిని ఎదుర్కుని – కీర్తి కావాలో విజయం కావాలో ఎంచుకోమంటే, తాను అజ్ఞాతంలో ఉండడాన్ని ఎంచుకుంటాడు. దీనిలో ఎంతో తాత్త్వికత ఉంది, మనుషులపై సమాజం ముసుగులు వేస్తుంది.

గురు అల్మోరా లోని ఉదయ్ శంకర్ డాన్స్ అకాడమీ నుంచి తిరిగి వచ్చాకా, ఎక్సెల్సియర్ థియేటర్‍లో చేసిన ‘స్వాన్ డాన్స్’ ప్రదర్శన చూశాకా అమ్మ వెళ్ళి ఉదయ్ శంకర్ గారిని కలిసింది. గురులో ఎంతో ప్రతిభా, సృజనాత్మకత ఉన్నాయని ఆయన అమ్మతో అన్నారు. నిజానికి గురు కూడా తన వ్యక్తీకరణలో సంపూర్ణతని పొందింది అల్మోరా లోనే. నవకేతన్ వారి కోసం తన తొలి సినిమా ‘బాజీ’ చేసేందుకు సిద్ధమైనప్పుడు మేమం మాతుంగా లో ఓ చిన్న రెండు గదుల ఇంట్లో ఉండేవాళ్ళం. అమ్మానాన్నలు ఎంతో కష్టపడుతూండేవారు.. నాన్న ఓ గుమస్తా.. అమ్మ ఉపాధ్యాయిని..

‘బాజీ’ సినిమాకి మొదటి పాట రికార్డ్ చేస్తున్నప్పుడు మేము – ‘తక్‍దీర్ సే బిగ్డీ హుయీ’ పాడిన గీతని మొదటిసారిగా ప్రసిద్ధ సినీ లాబ్‍లో కలిసాం. గీతా రాయ్ అప్పట్లో ప్రముఖ నేపథ్య గాయని, కెరీర్ పరంగా అత్యుత్తమ స్థానంలో ఉంది. గురు, తను ప్రేమలో పడ్డా రు. గురు తన మిత్రుని దగ్గర నుండి ఓ గ్రామఫోన్ తెచ్చుకుని, గీతా పాడిన బెంగాలీ ప్రేమగీతాన్ని మళ్ళీ మళ్ళీ వినేవాడు. అందులోని ‘తుమి జోడీ బలా భాలో భాషా దితే జమినా’ అనే పదాలు ఆకట్టుకునేవి (గురు చెల్లెలిగా వాళ్ళ మధ్య ప్రేమలేఖలు మోసేదాన్ని నేను). షూటింగ్ లేని రోజున మేమంతా ఎంతో సరదాగా గడిపేవాళ్ళం. దూరంలోని పోవై, పోఖాన్ లేక్ వంటి స్థలాలకు నేను, గురు, గీతా, రాజ్ ఖోస్లా వెళ్ళేవాళ్ళం. ప్రయాణం సాగుతున్నంతే సేపూ, గీతా, రాజ్ పాటలు పాడుతూనే ఉండేవారు.

మా ఇంట్లో అమ్మానాన్నలకి నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉండేది. వారిద్దరూ గొప్ప రచయితలే.. అమ్మ కన్నడంలో రాస్తే, నాన్న ఇంగ్లీషులో రాసేవారు. తన రచనల్లో ఎక్కువగా షేక్‌స్పియర్‌ని ఉటంకించేవారు. ఆ చిన్నప్పటి రోజులని తలచుకుంటే – ఎన్నిసార్లు, నాన్నా, గురు మధ్యాహ్న భోజనం మానేశారో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళుండే చోటు నుంచి భోజనానికి ఇంటికి రావాలంటే డబ్బు బాగానే ఖర్చయ్యేది.

గురు ‘ప్యాసా’కి మొదటిసారిగా స్క్రిప్ట్ రాసినప్పుడు దాని పేరు ‘కష్మాకష్’. మాంద్యం వల్ల సినీపరిశ్రమలో అవకాశాలు లేక దాదాపు ఒక సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నాడు. ఆ సమయంలో గురు బాగా రాశాడు. ఎన్నో స్క్రిప్ట్లు రాశాడు. కొన్ని కథలు రాసి ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీకి పంపితే, అవి తిరిగొచ్చాయి.

నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మొదటిసారి షూటింగ్ చూసినది పూనాలో. అప్పుడు గురు ప్రభాత్ స్టూడియోస్ వారి వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అక్కడే నేను తొలిసారిగా దేవ్ ఆనంద్‌నీ చూశాను.  గీత మాకు సన్నిహితమయ్యాకా, నేను గురు షూటింగ్‍లకి చాలాసార్లు వెళ్ళేదాన్ని. ‘జాల్’ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ రాత్రంతా నేను కూడా అక్కడే ఉన్నట్టు జ్ఞాపకం. హేమంత్ కుమార్ ఆలపించిన ‘పిఘ్లా హై సోనా’ అనే పాట వినపడుతుంటే – గీతా బాలి బాల్కనీలో నిలుచునే ఉండే సన్నివేశం అది. అప్పట్లో గీతా బాలి, దేవ్ ఆనంద్, సప్రు, రామ్ సింగ్, బాల్‌రాజ్ సహాని తదితరులు మాతుంగలోని మా ఇంటికి వస్తుండేవారు. తర్వాత కొన్ని రోజులకి గురు కొలాబాకి మారాడు. ఒకసారి ‘మిస్టర్ అండ్ మిసెస్ 95’ షూటింగ్ సందర్భంగా మధుబాలని లంచ్‌కి ఇంటికి పిలుచుని వచ్చాడు. వహీదా రెహమాన్ కొలాబాలో మాకు దగ్గరనే నివసించేది. ‘చౌదవీ కా చాంద్’ షూటింగ్ సందర్భంగా మేం తరచూ సాయంత్రాలు కలుసుకునేవాళ్ళం. అప్పుడే మొదటిసారిగా.. గురు కథానాయకుడిగా ‘బాజ్’ చిత్రంలో నటిస్తున్నాడని గీత చెప్పినట్టు గుర్తు.

కాలం గడిచేకొద్దీ గురు మరింత గంభీరంగా మారిపోయాడు, ఒంటరిగా ఉండసాగాడు. చాలా సినిమాలకి పనిచేసేవాడు, వాటిల్లో అధిక భాగం 12 రీళ్ళు పూర్తి కాగానే ఆగిపోయాయి. ‘రాజ్’, ‘గౌరి’ వంటివి ఇందుకు ఉదాహరణలు. వీటిని కలకత్తాలో చిత్రీకరించారు. ఇలాగే ఎన్నో ప్రాజెక్టులు రద్దయ్యాయి. వైఫల్యాన్ని భరించలేకపోయాడు గురు. ‘కాగజ్‍ కే ఫూల్’ పరాజయం పాలయ్యాకా, గురులో ఆత్మవిశ్వాసం దెబ్బతింది. తరువాత సినిమాలకి తన పేరు వేసుకోదలచలేదు. విపరీతమైన డిప్రెషన్‌కి గురయ్యేవాడు. వాస్తవానికి గురు గొప్ప చదువరి. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ పుస్తకాలు ఎన్నో చదివాడు. చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రం, మానవపరిణామ శాస్త్రం, ఫొటోగ్రఫి, ఇంకా ఉర్దూ కవిత్వం పైన పుస్తకాలు ఉండేవి. ఈ విషయంలో మాత్రం గురుది నాన్న పోలికే (అమ్మ ఇప్పటికీ హిందీ, మరాఠీ, కన్నడ, బెంగాలీ పుస్తకాలు చదువుతుంది). నేడు గురు జీవించి ఉంటే ఏం జరిగి ఉండేది అని చాలామంది అడుగుతారు. అతనో సున్నితమైన దర్శకుడు. సినిమా గ్రామర్ తెలిసినవాడు. తొమ్మిదేళ్ళ వ్యవధిలో వెండితెరపై కవిత్వాన్ని సృష్టించినవాడు. బతికి ఉంటే ఖచ్చితంగా సినిమాని కొత్త పుంతలు తొక్కించి ఉండేవాడు. ఆ రోజుల్లో గురు సినిమాల గురించి చర్చించే యువ విమర్శకులు లేరు. అల్లియన్స్ ఫ్రాంకాయిస్ ఫ్రెంచ్ డైరక్టర్ – హెన్రీ మిసియోల్లో కి మనం కృతజ్ఞతగా ఉండాలి. ఆయనే గురుదత్ ప్రతిభను గుర్తించి, ఫ్రాన్స్‌లోనూ, అమెరికాలోను గురు సినిమాలకి ప్రచారం కల్పించారు. నేడు గురు ఓ దిగ్గజం, చనిపోయి పాతికేళ్ళు దాటినా, ఆయన కృషిని స్మరించుకుంటున్నారు. ఒక్కోసారి నాకనిపిస్తుంది – విధి ఎలా మారుతుందో గురుకి తెలుసునేమో అని. తన తీక్షణతని అంతా స్వల్ప జీవిత కాలంలో గడిపేశాడు!

చాలా ఏళ్ళ క్రితం కొన్ని సంఘటనలు జరిగాయి, బహుశా అవి నా జీవిత గమనాన్ని, నా కెరీర్‌ని కనీసం రెండు సార్లు మార్చి ఉండేవి. మొదటిసారి గురు ఓ బాలె డాన్సర్‌కి నేపథ్యంలో మేకప్ విషయంలో సాయం చేస్తున్నాడు. అది రాజన్ శంకర్, లక్ష్మీ శంకర్, రవి శంకర్ నిర్వహిస్తున్న డిస్కవరీ ఆఫ్ ఇండియా కార్యక్రమం. చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. పెద్ద బాలె డాన్స్ ప్రోగ్రామ్ అది. నాకు కూడా నాట్యం చేయాలనిపించింది. ఒక రోజు గురు నన్ను వాళ్ళకి పరిచయం చేశాడు. అప్పుడు రవిశంకర్ గారు సితార్ పై రియాజ్ వాయిస్తున్నారు, మేం ముగ్ధులమై ఉండిపోయాం. నాకప్పుడు 14 ఏళ్ళు. వాళ్ళ పే-రోల్‌లో నన్ను చేర్చేందుకు ప్రయత్నించాడు గురు. అప్పట్లో గురుకి పని ఉండేది కాదు. తీరా ఇంటికి వచ్చాకా, మనసు మార్చుకుని, ఆ కార్యక్రమంలో పాల్గొనవద్దని అన్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం చిన్న వయసులోనే మరొకరు సంపాదనకి దిగడం అవసరం లేదని అన్నాడు. మరొక ఘటన నాకు 16 ఏళ్ళు ఉండగా జరిగింది. అప్పట్లో గురు దేవ్ ఆనంద్‌తో ‘బాజీ’ తీస్తున్నాడు. దేవ్ ఆనంద్ కొత్త నటిని చూద్దాం అన్నారు. గురు నన్ను కమలా నెహ్రూ పార్క్‌కి తీసుకువెళ్ళి భిన్న కోణాలలో ఫొటోలు తీశాడు. కానీ ఎందుకో ఆ ఆలోచనని విరమించుకున్నాడు. బహుశా నేను నటిని కావడం రాసిపెట్టి లేదేమో లేదా నేను ఓ మంచినటిని కాలేననేమో! నేడు నేనో చిత్రకారిణిని. ఫెర్‍ఫార్మింగ్ ఆర్ట్స్‌కి దూరంగా ఉన్నదాన్ని. అయితే నేను గాయనిగా ఎనిమిదేళ్ళ వయసులో ఓ చిన్న సారస్వత బృందం ఎదుట శాస్త్రీయ సంగీతం ఆలపించాను. ఆ తరువాత మణిపురి నృత్యం కొంత నేర్చుకున్నాను. స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో ‘కమర్షియల్ ఆర్ట్’ అభ్యస్తిసున్న రోజుల్లో నా ప్రదర్శలకి గీత పాటలు పాడేది.

గురు వ్యక్తిగత జీవితం గురించి, వివాదాల గురించి చాలా చర్చ జరిగింది. అతనిది కల్లోల జీవితమే, సందేహం లేదు. లేదంటే జీవితాన్ని ముగించడానికి అన్ని ప్రయత్నాలు చేసేవాడు కాదు. అంతర్గత వైరుధ్యాల వల్ల తనని తాను కాల్చుకున్నట్లు ఉండేది ఆ పద్ధతి. చివరికి అంతా ముగిసిపోయింది. అతని మరణవార్త మా జీవితాలను విషాదంతో ముంచెత్తింది. తన తొలి చూలు సంతానం, ప్రియ పుత్రుడిని పోగొట్టుకున్నప్పుడు అమ్మ వయసు 83 సంవత్సరాలు.”

***

లలితా లాజ్మీ మరణంతో భారతీయ చిత్రలేఖన కళాకారులలో ఒక శకం ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here