అలనాటి అపురూపాలు-160

1
16

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బాలతార, స్క్రీన్ రైటర్, దర్శకురాలు – హనీ ఇరానీ:

నేడు ఆవిడ చాలామందికి ఫర్హాన్ అఖ్తర్, జోయా అఖ్తర్‍ల తల్లిగానే తెలిసి ఉండచ్చు. కానీ 1960లలో, ఒకానొక సమయంలో ఆమె ఆనాటి ప్రసిద్ధ బాలనటి. ఆమే హనీ ఇరానీ. తన సోదరి డైసీ ఇరానీతో కలిసి – తరచుగా అనేక హిందీ సినిమాలలో మగపిల్లల వేషాలలో కనిపించేవారు. ఆ సినిమాలన్నీ బాగా ఆడాయి. అందువల్ల వీలైతే ఆ అక్కచెల్లెళ్ళు ఇద్దరినీ లేదా ఎవరో ఒకరిని సినిమాలో ఉంచేందుకు స్క్రిప్టులను సవరించేవారట. వీళ్ళిద్దరూ సినిమా పోస్టర్లపైనా, ప్రచారాలలోనూ తప్పకుండా ఉండేవారు.

హనీ ఇరానీకి తొలి అవకాశం దర్శకులు దులాల్ గుహా ఇచ్చారు. అప్పడు ఆమెకి రెండున్నర సంవత్సరాల వయసు. అప్పటికే డైసీ బాలతారగా ఉండడంతో, డైసీ కోసం వాళ్ళమ్మగారితో మాట్లాడడానికి వచ్చిన గుహ, అక్కడ హనీని చూసి ఆమెను నటింపజేసేందుకు నిర్ణయించుకుని ఒప్పందం చేసుకున్నారట. ఆ చిన్నారి హనీ ఆయనది బట్టతల అంటూ నవ్వారట. అప్పటి నుంచి హనీ వెనుతిరిగి చూసుకోలేదు. దాదాపుగా ప్రతి సాంఘిక, కుటుంబ చిత్రాలలో కనిపించారు. పెద్ద తారల వలె పలు షిఫ్టులలో పని చేశారు. దేవేంద్ర గోయల్ గారి ‘చిరాగ్ కహాఁ రోషన్ కహాఁ’ (1959) చిత్రంలో ధరించిన ‘రాజు’ అనే అబ్బాయి పాత్ర హనీకి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాకి మీనా కుమారి, రాజేంద్ర కుమార్ నాయికా నాయకులైనా, హనీ ఇరానీ వల్లే ఈ సినిమాకి ప్రాచుర్యం లభించింది. టైటిల్స్‌లో ‘వండర్ చైల్డ్ హనీ ఇరానీ’ అని వేశారంటేనే, ఆ బాలనటి ప్రాధాన్యతని గుర్తించవచ్చు.

1971లో ‘సీతా ఔర్ గీతా’ తర్వాత జావేద్ అఖ్తర్‍ను వివాహం చేసుకుని, హనీ తెర వెనక్కి వెళ్ళిపోయారు. దాదాపు రెండు దశాబ్దాల వరకు – ఆనాటి విజయవంతమైన స్క్రీన్ రైటర్స్ లలో ఒకరిగా వెలుగొందారు. ‘లమ్హే’ ఆ రోజులకి చాలా ‘తెగువ’ చూపిన చిత్రంగా; ఒకే వ్యక్తి ప్రేమ కోసం పోటీపడే అక్కచెల్లెళ్ళ అరుదైన కథగా ‘ఆయీనా’ -హిందీ చిత్రరంగాన్ని ఒక కుదుపు కుదిపాయి.

1993లో వచ్చిన ‘డర్’ – హిందీ సినిమాలలోని హీరో ఇమేజ్‍ని తిరగరాసింది. ‘దిల్‍వాలే దుల్హనియా లేజాయెంగే’ సినిమాకి కూడా ఆమె సహకరించారని కొందరు అంటారు. అయితే సినిమా క్రెడిట్స్‌లో ఆమె పేరు లేకపోయినా, ఈ రెండు సినిమాల ద్వారా బాలీవుడ్‌కి ఓ అతి పెద్ద స్టార్‌ని అందించడంలో ఆమె ప్రమేయం ఉందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. అలాగే బాలీవుడ్‍లో మరో సూపర్ స్టార్.. హృతిక్ రోషన్‌కి ఆయన మొదటి సినిమా ‘కహోనా ప్యాహై హై’కి స్క్రీన్ ప్లే అందించినది హనీ ఇరానీనే. ఆ తరువాత వచ్చిన ‘క్రిష్’ సిరీస్ స్క్రీన్ ప్లే రచన చేసిందీ ఆవిడే.

అంతర్జాతీయ సినిమాలంటే అమితమైన ఇష్టం ఉన్న హనీ ఇరానీ వద్ద దాదాపు 500-600 క్లాసిక్ చిత్రాల వీడియోలు ఉన్నాయి. “నేను పూనే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‍లో ఒక షార్ట్-కోర్స్ చేశాను. గొడార్డ్, రాబర్టో రోసెలిని, అకిరా కురసోవా వంటి దర్శకులు తీసిన అన్ని క్లాసిక్స్ చూశాను” అని చెప్పారు. ప్రస్తుతం తానొక వెబ్ సీరిస్ కోసం స్క్రిప్ట్ వ్రాస్తున్నానని, అది వచ్చే ఏడాది ప్రసారం అవుతుందని అన్నారు. పిల్లల కోసం మొదటిసారిగా ఒక పుస్తకం రాస్తున్నారు – సినీ రంగంలో తన ప్రస్థానాన్ని బొమ్మలతో వివరిస్తూ రాస్తున్న ఆ పుస్తకాన్ని తన మనవలకి అంకితం చేస్తున్నారు.

తన బాల్యం గురించి, స్క్రీన్ రైటర్‍గా, దర్శకురాలిగా తన కెరీర్ గురించి, తన పిల్లల గురించి ఆమె ఏం చెబుతున్నారో ఆమె మాటలలోనే చదువుదాం.

***

సినిమాల్లోకి ప్రవేశం:

మా చిన్నక్క డైసీ అప్పటికే ప్రసిద్ధ బాలనటి అన్న విషయం కూడా తెలీదు. నాకు అప్పుడు రెండున్నర ఏళ్ళు. డైసీకి నాలుగేళ్ళు. ఒక రోజు ప్రసిద్ధ దర్శకనిర్మాత దులాల్ గుహ ఓ సినిమాలో డైసీని నటింపజేయాలని అమ్మని అడగడానికి మా ఇంటికి వచ్చారు. అమ్మ వాళ్ళతో మాట్లాడుతోంది. అలా మాట్లాడుతూ ఉండగా గుహ గారు తన టీపీ తీసి తలకి పట్టిన చెమటని తుడుచుకున్నారు. అది చూసి నాకు నవ్వొచ్చింది. అమ్మకేసి తిరిగి, “అమ్మా ఈయనకి బట్టతల” అని అన్నాను. చెంప మీద ఒక దెబ్బ వేసింది అమ్మ. ఆయనకి క్షమాపణలు చెప్పమంది. “ఈ పాప మాట్లాడగలదా?” అని ఆయన అమ్మని అడిగారు. “ఓ, తెగ వాగుతుంది” అంది అమ్మ. “మిసెస్ ఇరానీ, మీరేం అనుకోకపోతే, నిజానికి నేను డైసీ కన్నా తక్కువ వయసుండి, మాట్లాడగల పిల్లల కోసం చూస్తున్నాను. హనీ ఉచ్చారణ బావుంది. మీకు అభ్యంతరం లేకపోతే, డైసీ బదులుగా హనీని తీసుకుంటాను” అన్నారాయన అమ్మతో. అమ్మ సరేనంది. ఆ సినిమా ‘ఏక్ గాఁవ్ కీ కహానీ’.

ఆ సినిమాకి సంబంధించే నాకేదీ జ్ఞాపకం లేదు. అయితే సెట్‍కి వెళ్ళడం మాత్రం నాకిష్టం లేదన్న సంగతి గుర్తుంది. స్టూడియో గేట్ దగ్గరకు రాగానే గట్టిగా అరిచానని గుర్తుంది. కానీ లోపలికి వెళ్ళాకా, అక్కడి నటీనటులు, దర్శకులు మంచివారిగా అనిపించి, నచ్చారు, వాళ్ళతో ఆడుకున్నాను.

బడి, చదువు:

మాకు బడికి వెళ్ళేంత సమయం చిక్కలేదు. మాకు ఇంటికే ఒక ప్రైవేటు మాస్టారు వచ్చేవారు. మేం రాత్రింబవళ్ళు పని చేస్తుండేవాళ్ళం. ఒక్కోసారి రోజుకు మూడు షిఫ్టులు పని చేసేవాళ్ళం. ఒక షూటింగ్‍కి బొంబాయి నుంచి ఖండాలా వెళ్ళటం, మళ్ళీ మధ్యాహ్నానికి మరో షూటింగ్ కోసం బొంబాయి తిరిగి రావటం, మళ్ళీ ఖండాలా వెళ్ళటం నాకింకా గుర్తుంది. ట్యూషన్ మాస్టార్ వద్ద చదువుకోడానికి మాకు సమయమే ఉండేది కాదు. ఓ తమాషా సంఘటన మీకు చెప్పాలి. మా ఇంటి దగ్గరే ఓ స్కూలు ఉంది. మొదట్లో నేను అందులో చేరాను. ఆ స్కూల్లో ప్రతి క్లాసులో దాదాపు 15 మంది పిల్లలు ఉండేవారు. ఓ పరీక్షలో నాకు మూడో ర్యాంకు వచ్చిందని ఎగిరి గంతేశాను. అమ్మానాన్నలు ఎంతో సంతోషించారు. మా పెద్దక్క మేనక “మీ క్లాసులో ఎంతమంది ఉన్నారు?” అని అడిగింది. “ముగ్గురు” అని జవాబిచ్చాను.

అక్కతో పోటీ:

డైసీ అప్పటికే ప్రసిద్ధ బాలతార! నాకు తనతో పోటీ ఏం లేదు. పైగా మేం చాలా సినిమాలు కలిసి నటించాం. వింత ఏంటంటే, మేం చాలాసార్లు అన్నదమ్ములుగా నటించాం. చాలామంది దర్శకులు మాకు అబ్బాయిల పాత్రలే ఇచ్చారు. మాకు పారితోషికం కూడా బాగానే ఇచ్చేవారు. అప్పట్లో 50,000 రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. మాకు సొంత ఇల్లు ఉండేది, కార్లు ఉండేవి. మేం సినిమాల్లో నటించాలన్నది మా అమ్మ కోరిక. నిజానికి మాకన్నా తనే ఎక్కువగా కోరుకుంది. అయితే, నేను నా వృత్తిని ఇష్టపడ్డాను.

స్టార్స్‌తో నటించిన తొలి జ్ఞాపకాలు:

రాజేంద్ర కుమార్ గారు, సునీల్ దత్ గారు, నూతన్ గారు నాపట్ల ఎంతో శ్రద్ధ చూపేవారు. నన్ను ఎంతగానో ప్రేమించేవారు. వాళ్ళతో ఉండడం నాకు బావుండేది. మీనా కుమారి గారు నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు. నన్ను ఓ అమ్మలా చూసుకున్నారు. షూటింగ్ అయిపోయాకా, నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళి, స్నానం చేయించి, అన్నం తినిపించేవారు. నిద్రపుచ్చేవారు. నన్నెంతో సౌకర్యంగా ఉంచేవారు.

‘చిరాగ్ కహాఁ రోషన్ కహాఁ’ సినిమా షూటింగ్ జరుగుతోంది. నేను ఏడ్చే సీన్ ఉంది. నాకెందుకో ఆ రోజు మూడ్ సరిగా లేదు. మీనా కుమారి నన్ను ఎత్తుకుని ఉన్నారు. ఉన్నట్టుండి ఆమె నన్ను గట్టిగా గిల్లారు. నేను అరుస్తూ ఏడ్చాను. ఆవిడ ఎందుకలా చేశారో నాకు అర్థం కాలేదు. నాకో షాక్ అది. తర్వాత, నీళ్ళు నిండిన కళ్ళతో ఆమె – “సారీ పాపా!” అని అన్నారు. “ఎందుకిలా చేశారు?” అని అడిగాను. “నువ్వు షాట్ చేయడం, లేదు, ఈ సీన్‍లో నువ్వు ఏడ్వాలి కదా” అన్నారు. అప్పడర్థమయింది నాకు.

బాలనటి దశ ముగింపు:

బాలనటిగా నాకు 10 లేదా 11 ఏళ్ళు వచ్చేవరకు నటించాను. మీనా కుమారి గారితో నటించిన ‘పూర్ణిమ’ బాలనటిగా నా చివరి సినిమా. ఆ తరువాత నేను స్టేజ్ షోలు చేశాను. కథక్ నేర్చుకున్నాను. ఎన్నో సినిమా పాటలకి నాట్యం చేసేదాన్ని. సునీల్ దత్, నర్గిస్, కిశోర్ కుమార్, మహమ్మద్ రఫీ గార్లతో పలు షోల కోసం ప్రయాణాలు చేసేదాన్ని.  వేదికలపై పలు ప్రదర్శనలిచ్చాను.

1960లలో కొన్ని సినిమాలు చేశాను, కానీ నా అదృష్టం, అవి విడుదల కాలేదు.  ‘సీతా ఔర్ గీతా’ సినిమా షూటింగ్ సందర్భంగా జావేద్ అఖ్తర్‍ గారిని కలిశాను. మేం ఒకరినొకరం ఇష్టపడ్డాం. నేను ఎప్పుడూ ఓ పెద్ద హీరోయిన్ అయిపోవాలని కోరుకోలేదు. తెర వెనుకే ఉండటానికి ఇష్టపడ్డాను. కెమెరామాన్ ఎలా పని చేస్తున్నారు, దర్శకుడు ఏం చెబుతున్నారు, సెట్‍లో ఏం జరగుతోంది.. ఇలాంటి విషయాలు ఎక్కువగా గమనించేదాన్ని. అవే నాకు ఆసక్తికరంగా ఉండేవి. జావేద్‍తో వివాహం అయ్యాక, నేను కొన్ని సంవత్సరాల పాటు రమేష్ తల్వార్‍కి సహాయకురాలిగా పని చేశాను.

‘లమ్హే’ (1991), ‘ఆయీనా’ (1993) సినిమాల గురించి:

నేను చిన్న కథలు రాస్తూండేదాన్ని. వాటిని జావేద్ చూశారు. ఇంకా రాయమని ప్రోత్సహించారు. నాకు కామిక్స్ అన్నా, MAD మ్యాగజైన్‍ అన్నా బాగా ఇష్టం. జేమ్ హాడ్లీ ఛేస్ చదివాను. నాకు సీరియస్ పుస్తకాలు నచ్చవు. కొన్ని విషయాలు నాకు అర్థం కావు. ఇప్పటికీ, ఏవైనా కొన్ని పదాలు/వాక్యాలు అర్థం కాకపోతే, వాటిని విడిగా ఒక నోట్ బుక్‍లో రాసుకుని, వాటి అర్థాలను వెతికి తెలుసుకుంటాను. ఈ విధంగా నేను ఎంతో జాగ్రత్తగా నేర్చుకుంటాను. ఒకసారి ఒక కథ రాసి జావేద్‍కి చూపించాను. దాని పేరు ‘ఆయీనా’. “దీన్ని స్క్రీన్‍ ప్లేలా మలిచి చూడు” అని ఆయన అన్నారు. సినిమాల్లో అక్కచెల్లెళ్ళ సంబంధాలు చూపించిన తీరును చూసి చూసి విసుగెత్తి ఉన్నాను. మీరు కనుక నిజంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తే, ఆ వ్యక్తి కోసం పోరాడడానికి సిద్ధంగా ఉంటారన్నది నా ఉద్దేశం. ఆ పోరాటం మీ సోదరితో కావచ్చు లేదా స్నేహితురాలితో కావచ్చు. ఎందుకు ఎప్పుడూ మనమే త్యాగం చేయాలి? అలా ఆ కథ నా మనసులోకి వచ్చింది. మొదట్లో ఈ కథని సీరియల్‍గా తీద్దామన్న ఆలోచనా వచ్చింది. అయితే ఈ కథని యశ్ చోప్రా గారు విని, సినిమా తీద్దామని, అందుకు తగినట్లుగా స్క్రీన్ ప్లే రాయమని నన్ను అడిగారు. ఈ స్క్రీన్ ప్లే మీద పని చేస్తుండగానే, ఆయన ‘లమ్హే’ సబ్జెక్ట్ చెప్పారు. “ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉంటారు. అతనికి ఆమె అంటే బాగా ఇష్టం. కానీ ఆమెని పెళ్ళి చేసుకోలేడు. ఆమె వేరే అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. అతను క్రుంగిపోతాడు. తర్వాత ఆమె భర్త చనిపోతాడు. కొన్నాళ్లకి కూతురిని విడిచి, ఆమె కూడా చనిపోతుంది. ఆ పాప, అతను కలుస్తారు. ఇదీ కథ, అన్నారాయన” (నవ్వులు).

ఫస్ట్ హాఫ్‍లో శ్రీదేవి పాత్రని అనిల్ పాత్ర కంటే కాస్త పెద్దదిగా చేశాను, అయితే పాప పుట్టినప్పటికి అనిల్ పాత్ర వయసు మరీ ఎక్కువ ఉండకుండా చూశాను. వాళ్ళ మధ్య వయసు తేడా 17-18 ఏళ్ళు ఉంటాయి. సినిమా పూర్తి చేసి మా మిత్రులకి చూపించాం, సినిమా క్లయిమాక్స్ భారతీయ ప్రేక్షకులకి నచ్చదు అని వాళ్ళన్నారు. క్లయిమాక్స్ మార్చమని అడిగారు. వాళ్ళకి సినిమా నచ్చింది, కానీ క్లయిమాక్స్ సినిమాని దెబ్బతీస్తుందని అన్నారు. కథతో రాజీ పడటానికి యశ్ చోప్రా అంగీకరించలేదు. ఇద్దరు భిన్న వయస్కులు కలవటమే కథకి కీలకం అని అన్నారు. సినిమా విడుదలయింది, పెద్దగా ఆడలేదు. కానీ తరువాత రోజుల్లో ఆదరణ లభించింది. బహుశా ప్రేక్షకులకి తరువాత అర్థమయిందేమో.

‘డర్’ (1993) గురించి:

ఈ కథకి మూలమైన ఆలోచనని నాకూ, యశ్ చోప్రా గారికి ఇచ్చింది ఆదిత్య చోప్రా. తన అసిస్టెంట్ ఒకరు దర్శకత్వం చేయాలని అనుకుంటున్నారని, అందుకని నన్ను స్రిప్ట్ రాయమని అడిగారు. అయితే స్క్రిప్ట్ విన్నాకా, యశ్ మనసు మార్చుకుని దానికి తానే దర్శకత్వం వహిస్తానని, అతనికి మరో స్క్రిప్ట్ చూడమని అన్నారు. జాగ్రత్తగా చూస్తే – ‘డర్’ – ‘ఆయీనా’కి మేల్ వెర్షన్ అని గ్రహించవచ్చు. రిస్క్ చేస్తున్నానని తెలుస్తోంది. ప్రేక్షకులు షారూఖ్ ఖాన్ పాత్రని ఆదర్శంగా తీసుకుంటారేమోనని భయం వేసింది. అప్పటికే హిందీ సినిమాలలో – ప్రేమకీ, వేధింపులకి మధ్య ఉండే సన్నని రేఖ చెరిగిపోతున్న ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి చర్య సరైనదే అని ప్రజలు అనుకునేలా చేయాలన్నది నా ఉద్దేశం కాదు. అయితే ప్రేమ పేరుతో మహిళని వెంటాడి వేధించడం సరికాదు అని నేను స్పష్టం చేశాను.

‘క్యా కహనా’ (2000) సినిమా గురించి:

1980 తొలినాళ్ళలో నేను ఒక వార్త చదివాను. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. ఓ గ్రామంలో ఓ 34 ఏళ్ళ వ్యక్తి 14 ఏళ్ళ బాలికని చెరిచాడు. అతన్ని పట్టుకుని పోలీసులకి అప్పగించారు. కానీ ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం ఆ అమ్మాయికి అతనికి పెళ్ళి జరిపించారు. ఈ వార్త నన్ను విస్మయానికి గురి చేసింది. ‘క్యా కహనా’ చిత్రకథకి ఈ సంఘటనే ఆధారం. అయితే నేను సాంఘిక పరిసరాలని, మౌలిక ఆధారాంశాన్ని మార్చాను. సినిమా కథలో నేను కాలేజ్‌కి వెళ్ళే యువతి ఓ ప్లేబోయ్‍తో ప్రేమలో పడుతుంది. అతడిని శారీరికంగా కలవడంతో, గర్భం దాలుస్తుంది. అతను ఆమెను పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోడు. అది గొడవలకి దారితీస్తుంది. జనాలు మాట్లాడుకోవడానికి ఇష్టపడని అంశాన్ని చర్చించేలా చేయడానికి ఇది నా పద్ధతి. ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చింది.

రాకేశ్ రోషన్‍తో పని చేయడం గురించి:

‘ఆయీనా’, ‘లమ్హే’, ‘డర్’ చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమై, విమర్శకుల మెప్పు పొందాకా, నాకు బాగా సంతృప్తి కలిగింది. అయితే రాబోయే సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నాకు తెలుసు. ఒకానొక కాలంలో సినిమాలు బుద్ధిహీనమైనమయ్యాయి. డైలాగులు, పాటలలో ద్వంద్వార్థాలు ఎక్కువయిపోయాయి. నాట్యాలలో అశ్లీల భంగిమలు ఎక్కువయ్యాయి. పైగా హిందీ సినిమాలలో స్త్రీ పాత్రల చిత్రణ మొదటి నుంచీ సమస్యాత్మకంగానే ఉంది, ఇప్పుడు అది అడుగంటిది. నేను రాసిన ఒకటి రెండు సినిమాలలో నా అనుమతి లేకుండా అలాంటి సంభాషణలు జోడించారు. నాకు తెలిసి బాధపడ్డాను. కొందరు నా దగ్గరకొచ్చి, ఒక పుస్తకం ఇచ్చి, “ఇది చదివి, కథ రాసేయ్యండి” అనేవారు. అలా పని చేయడం నాకిష్టం ఉండదు. అందుకే రెండు మూడేళ్ళు విరామం తీసుకున్నాను.

తర్వాత, నా అదృష్టం కొద్దీ రాకేష్ రోషన్ గారు ‘కహోనా ప్యార్ హై’ కథకి ఆలోచనతో వచ్చారు. ఆ ఆలోచన నాకు నచ్చింది. నేలబారు వ్యవహారాలు లేకుండా, చక్కని కథతో సినిమా అందించగల అవకాశం వచ్చింది. పైగా అది హృతిక్ రోషన్ మొదటి సినిమా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. రాకేశ్ గారితో నా అనుబంధం దృఢమయింది. తర్వాత రాకేష్ గారు ‘కోయి మిల్ గయా’ సినిమాకి ఒక ఆలోచనతో వచ్చారు. మేమిద్దరం కలిసి స్క్రీన్ ప్లే రూపొందించాము. అటువంటి పాత్రను సృష్టించడం గొప్ప సరదాగా ఉండేది. అంతకు ముందు ఎప్పుడూ నేను సైన్స్ ఫిక్షన్ రాయలేదు. కొంతమంది రచయితలం కలిసి బృందంగా ఏర్పడి సహకరించుకుని కథ పూర్తి చేశాము.

‘ఆర్మాన్’ (2003) కి దర్శకత్వం వహించడం గురించి:

చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉండేది. అయితే నాకు పెద్దగా చదువు లేకపోవడం వల్ల ఆ కోరిక తీరలేదు. ఈ కోరికతోనే ‘ఆర్మాన్’ కి దర్శకత్వం వహించాను. చాలా పరిశోధన చేశాను. డాక్టర్లని, న్యూరో సర్జన్లనీ కలిశాను. వాళ్ళ సలహాలు సూచనలతో మా బృందం పని చేసింది.

ఒక రచయితగా ఉన్నప్పుడు సినిమా నిర్మాణానికి అవసరమైన వసతులు/ఏర్పాట్ల గురించి ఆలోచించనక్కరలేదు. కథ/స్క్రీన్ ప్లే రూపొందించి ఇచ్చి, మీ కథకి దర్శకుడు న్యాయం చేయగలుగుతాడని నమ్మితే చాలు. కానీ ఓ దర్శకురాలిగా ఉన్నప్పుడు – మీరు రాసిన దానిపై మీకు నియంత్రణ ఉండాలి. అయితే దర్శకుడి పని అంత సులువుగా అయిపోదు. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఆ సినిమా హిట్ అవుతుందని ఆశించాము. కానీ పెద్దగా విజయవంతం కాలేదు, అలా అనీ ఫ్లాప్ కాదు, మేము ఆశించినట్టు ఆడలేదు. తరువాత విశ్లేషించుకుంటే, దానిలో మరీ ఎక్కువ వివరాలు ఉన్నాయని అనిపించింది. జనాలకి విసుగు తెప్పించింది. సినిమా మరింత బిగువుగా, క్లుప్తంగా ఉండే బాగుండేది. అవకాశం వస్తే మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహిస్తాను.

జోయా, ఫర్హాన్ అఖ్తర్‍ల గురించి:

దేవుడు మా పట్ల ఎంతో దయతో ఉన్నాడు. గొప్ప విషయం ఏంటంటే – ఏం చేయాలో వాళ్ళిద్దరికీ నేనెప్పుడూ చెప్పలేదు. ఎప్పుడైనా సలహా అడిగితే చెప్పేదాన్ని. వాళ్ళని నేను ఏ విషయంలోనూ బలవంతం చేయలేదు. ఏ మతాచారాలని పాటించమని వాళ్ళని నేను ఒత్తిడి చేయలేదు. మా ఇంట్లో.. పార్శీ నూతన సంవత్సరాది, ఈద్, క్రిస్‍మస్ – ఇలా అన్ని పండుగలు జరుపుకుంటాం.

జోయా రచయిత్రి అవుతుందని నాకు తెలుసు. అందుకు కావల్సిన స్వభావం తనకి మొదటి నుంచి ఉంది. జోయా ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసింది, మీరా నాయర్ వద్ద సహాయకురాలిగా పని చేసింది. నేడు మనకున్న ఉత్తమ రచయితలలో తనూ ఒకరు. రీమా కాగ్తీ తో కూడిన వాళ్ళ బృందం బాగా పనిచేస్తోంది. జోయా సినిమాలకి కథలు ఆలోచించే పద్ధతి, ఎంచుకునే అంశాలలోని వైవిధ్యత నాకు నచ్చుతాయి.

ఇక ఫర్హాన్ విషయానికొస్తే, నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచాడు. చిన్నప్పుడు బడికి వెళ్ళటానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. బలవంతం చేసి పంపితే, కాసేపటికి స్కూలు నుంచి ఫోన్ వచ్చేది – మీ పిల్లాడు సృహ తప్పి పడిపోయాడని. పరుగెత్తుకు వెళ్ళి వాడిని ఇంటికి తీసుకొచ్చేవాళ్లం. కారెక్కగానే, మామూలయిపోయేవాడు. ఎన్ని నాటకాలు వేసేవాడో. కాలేజి చదువు మధ్యలో మానేశాకా, “అసలేం చేద్దమనుకుంటున్నావు జీవితంలో?” అని గట్టిగా అడిగాను. పద్ధతి మార్చుకోకపోతే ఇంట్లోంచి బయటకి పంపించేస్తానని చెప్పాను. ఉన్నట్టుండి ఓ రోజు “అమ్మా, నీకో వార్త!” అంటూ వచ్చాడు. “అమ్మా, ఆమిర్ ఖాన్‌కి ఒక కథ చెప్పాను. ఆయన ఓకే అన్నారు” అన్నాడు. అస్సలు ఊహించలేదు ఇది. నమ్మాలో వద్దో కూడా అర్థం కాలేదు. అదే ‘దిల్ చాహ్తా హై’ సినిమా. నన్నెంతో ఆకట్టుకుంది.

మీ పిల్లలిద్దరూ సలహాల కోసం వస్తారా?

వస్తారు. వాళ్ళిద్దరూ ఏదైనా రాసినప్పుడు, ముందు నన్ను చదవమంటారు. మా ఆలోచనలు ఎంత వరకు సరైనవో మేం ఒకరిని ఒకరం ఒప్పించడానికి ప్రయత్నిస్తాం. ఇది చాలా ఆరోగ్యవంతమైన పద్ధతి. యువతరం ఎలా ఆలోచిస్తారో అనే విషయంలో వాళ్ళిద్దరూ దారి చూపిస్తారు. నా అనుభవం ద్వారా, వాళ్ళకి కావల్సిన ప్రయోజనాన్ని నేను అందివ్వగలని నమ్ముతున్నాను.

***

బాల్యం, కుటుంబం, సినిమాలపై ఇదీ హనీ ఇరానీ గారి మనోగతం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here