అలనాటి అపురూపాలు- 161

1
11

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సకల కళావల్లభుడు రంజన్:

రంజన్ తమిళ, హిందీ సినిమాలలో నటించిన అలనాటి నటుడు! విమానం నడపగలిగిన తొలి తమిళ హీరో ఆయన. సుమారు 70 ఏళ్ళ క్రితం వచ్చిన ఎస్.ఎస్. వాసన్ గారి మాగ్నమ్ ఓపస్ చిత్రం ‘చంద్రలేఖ’లో రంజన్ విలన్‍గా నటించారు. నేటి కాలపు హీరోలెవరూ కనీసం చెప్పుకోడానికి కూడా ప్రావీణ్యం లేని ఎన్నో రంగాలలో రంజన్ అద్భుతమైన నైపుణ్యం కనబరిచారు. ఆయనో గొప్ప డాన్సర్, సంగీత విద్వాంసుడు, నాటక రచయిత, పాత్రికేయుడు, విమర్శకుడు, పండితుడు, పైలట్, అథ్లెట్, పెయింటర్, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఓ మెజీషియన్ కూడా!

రంజన్ గురించి మాట్లాడుతూ ప్రముఖ పాత్రికేయులు, ఫిల్మ్ హిస్టారియన్ పరాశక్తి మాలి “రంజన్ కుటుంబం తమిళనాడులోని శ్రీరంగానికి చెందినది. ఆయన బ్రాహ్మణుడు, అయ్యర్. అత్యంత నెమ్మదస్థుడు, విద్యావంతుడు. వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా, చక్కని కాఫీ, స్నాక్స్, బిస్కట్లతో స్వాగతం పలుకుతారు. అయితే తన కుటుంబం గురించి మాట్లాడడానికి మాత్రం ఆయన ఇష్టపడేవారు కాదు” అని తెలిపారు. ఎస్.ఎస్. వాసన్ గారి మాగ్నమ్ ఓపస్ చిత్రం ‘చంద్రలేఖ’లో రంజన్ ఓ భాగం. ఆ సినిమాలో ఆయన విలన్‍గా నటించారు. అది ఓ చారిత్రక, సాహసిక చిత్రం, అప్పట్లో భారతదేశంలో అత్యంత అధికమైన వ్యయంతో నిర్మించిన సినిమా.

‘చంద్రలేఖ’ సినిమా తీయడానికి అప్పట్లో దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. సినిమా పూర్తి అవడానికి ఐదేళ్ళు పట్టింది. ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి దర్శకనిర్మాత వాసన్ తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి, మిత్రుల వద్ద అప్పు చేయాల్సి వచ్చింది. 2010లో కొందరు నిపుణులు – భారతీయ సినీ చరిత్రలో, మొదటి అద్భుతమైన డ్రమ్ డాన్స్ ఉన్న ఈ సినిమా వ్యయాన్ని – నేటి అంచనాలతో పోల్చి చూసి – ఈ సినిమా వ్యయం సుమారు 140 కోట్లుగా తేల్చారు.

‘చంద్రలేఖ’ రంజన్‍కి ఎంతో పేరు తెచ్చింది. హిందీ చిత్రసీమలో ప్రవేశించేందుకు మార్గం సుగమం చేసింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రంజన్ ఇతర చిత్రాలలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. వాస్తవానికి ఆయన నిజమైన హీరో. ఏ కథానాయకుడికి లేనన్ని విశేష నైపుణ్యాలు రంజన్‍కి ఉన్నాయి.

రంజన్‍కి లిటరేచర్‍లో మాస్టర్స్ డిగ్రీ ఉంది. కాలేజీలో ఉండగా నాటకాలు వేసేవారు. అలా ఓసారి ఓ నాటకం వేస్తున్నప్పుడు జెమినీ స్టూడియోస్ ఉద్యోగి అయిన వెప్పట్టూర్ కిట్టు దృష్టిలో పడ్డారు. ఆయన రంజన్‍ని రాఘవాచారికి పరిచయం చేశారు. ఆయన రంజన్‍కి ఎంజి రామచంద్రన్ నటించిన ‘అశోక్ కుమార్’ (1941) అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. తరువాతి కాలంలో ఎంజిఆర్ గొప్ప స్టార్ అయ్యారు, తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

కానీ ‘అశోక్ కుమార్’ కన్నా ముందు ఎస్. సౌందరరాజన్ దర్శకత్వం వహించిన ‘ఋష్యశృంగర్’ (1940) అనే సినిమా విడుదలయి రంజన్‌కి జనాదరణ కల్పించింది. ఆడవాళ్ళని చూడకుండా ఓ అడవిలో పెరిగిన ఓ ముని పుత్రుడి కథతో తీసిన ఈ చిత్రం అప్పట్లో గొప్ప హిట్ అయింది.

“రంజన్ గొప్ప డాన్సర్. నిజానికి నేడు మనం చక్కని డాన్సర్ అని చెప్పుకునే కమల్ హాసన్ కన్నా రంజన్ ఉత్తమమైన డాన్సర్. ఓసారి నాతో మాట్లాడుతూ, తన మొదటి ప్రాధాన్యం నాట్యమని, సినిమా రెండో ప్రాధాన్యమని చెప్పారు. ఆయనకి నాట్యమంటే ఎంత ఇష్టమంటే, డాన్స్ కోసం ‘నాట్యాంజలి’ అనే పత్రిక నడిపారు” అన్నారు మాలి.

ఆయనకి నాట్యమంటే ఎంతో ఇష్టం కాబట్టి, బాగా సాధన చేసేవారు కాబట్టి ఆయన రూపంలో ఒక విధమైన ఆకర్షణ ఉండేది, బహుశా దాని వల్లే కొందరు ఆయనను నెమ్మదస్ధుడని భావించేవారు.  ఇంత నెమ్మదస్థుడు – ‘చంద్రలేఖ’ సినిమాలో క్రూరుడైన విలన్‍గా రాణించగలడా అని వాసన్ గారు తొలుత సంకోచించారని అంటారు. అయితే అత్యంత ప్రతిభాశాలి అయిన రంజన్ పాత్రకు తగ్గట్టుగా తనని తాను మలచుకుని క్రౌర్యాన్ని, దుర్నీతిని వ్యక్తం చేసే ఆ పాత్రకి ప్రాణం పోశారు. అందుకే ఆ సినిమా అంత విజయవంతం అయింది.

“రంజన్ ఒక నిజమైన ప్రొఫెషనల్. నటనకి అవసరమైన ఎన్నో నైపుణ్యాలను నేర్చుకున్నారు. ఆయన విమానం నడపడగలరని చాలామందికి తెలియదు. నిజానికి ఆయన విమానం నడపగలిగిన తొలి తమిళ హీరో. మద్రాసులోని ఫ్లయింగ్ క్లబ్ సభ్యులు. ఆయన గొప్ప విలుకాడు కూడా. ఆయన గురి ఎప్పుడూ తప్పేది కాదు. అలాగే ఆయన చక్కని షూటర్ కూడా. తుపాకుల వంటి ఆయుధాల గురించి ఆయనకి బాగా తెలుసు. సినిమాల కోసం నేర్చుకున్నప్పటికీ, ఆయన గుర్రపు స్వారీలోనూ రాణించారు. ఇవన్నీ కాకుండా ఆయన గొప్ప అందగాడు.. కానీ ఒకటే చిక్కు ఉండేది.. ఆయన ఉచ్చారణలో బ్రాహ్మణ స్వరం బాగా తెలిసిపోయేది. దాన్ని ఎంతగా వదిలించుకోవాలన్నా ఆయన వదిలించుకోలేకపోయారు” చెప్పారు మాలి.

రంజన్ 2 మార్చ్ 1918 నాడు జన్మించారు. ఆయన అసలు పేరు రామనారాయణ వెంకటరమణ శర్మ. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. రంజన్‍కి ఆ పేరు పెట్టినది న్యూటోన్ స్టూడియోస్‍కి చెందిన జితేన్ బెనర్జీ. రంజన్ సినీరంగ ప్రవేశానికి కారకులు జెమినీ స్టూడియోస్‍కి చెందిన వెప్పట్టూర్ కిట్టు. ‘ఋష్యశృంగర్’ అనే సినిమాలో ఋష్యశృంగుడిగా రంజన్‌ పాత్రకి ప్రేక్షకాదరణ లభించింది. ఆడవాళ్ళని చూడకుండా ఓ అడవిలో పెరిగిన ఓ ముని పుత్రుడి కథ అది. అతను ఎక్కడికి వెడితే అక్కడ విస్తారంగా వానలు కురిసేవట. ఈ సినిమాతో రంజన్ కెరీర్ ఊపందుకుంది. చక్కని శరీర సౌష్టవం, నిష్కపటమైన చిరునవ్వు, సన్నని మీసకట్టు, భాగవతార్‍ల వంటి కేశాలు, మేధస్సుతో వచ్చే స్వల్ప గర్వంతో కూడిన హావభావాలు – ప్రేక్షకులను విశిష్టంగా ఆకట్టుకున్నాయి.

‘మంగమ్మ శపతం’ (1943) సినిమాలో ఆయన వసుంధరాదేవి (ప్రముఖ నటి వైజయంతిమాల తల్లి)తో జోడీగా నటించారు. ఆ సినిమా విజయవంతం అయింది. ఉత్సాహవంతుడైన ఈ నటుడు కొన్ని సినిమాలలో ఆడపిల్లలను టీజ్ చేస్తూ, యాంటీ-హీరోగా కూడా అనిపించేవారు. బహుశా ఇదే ఆడపిల్లలను వెంటపడే నేటికాలపు కథానాయకుల పాత్రల చిత్రీకరణకు దోహదం చేసిందేమో.

ఓ వైపు తమిళ సినిమాలలో నటిస్తూనే, హిందీ సినిమాలలోనూ నటించారు రంజన్. జెమినీ స్టూడియోస్‌కి చెందిన ఎస్.ఎస్. వాసన్ గారి హిందీ ‘చంద్రలేఖ’ (1948) చిత్రం ద్వారా రంజన్ హిందీ చిత్రసీమలోకి ప్రవేశించారు. ఈ సినిమాలో రంజన్ కత్తితో చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. ఆ సినిమా సూపర్ హిట్ అయి, మరెన్నో సినిమాలలో అవకాశాలు దక్కాయి. రంజన్ ‘చంద్రలేఖ’ తర్వాత ‘నిషాన్’ అనే చిత్రంలో నటించారు. హిందీలోనూ ప్రేక్షకుల ఆదరణ పొందారు. రంజన్ హిందీ చిత్రసీమలో ప్రవేశించాకా, వరుసగా హిట్‍లు ఇచ్చారు. ‘మదారి’, ‘బహుత్ దిన్ హుయే’, ‘నిషాన్’, ‘సువర్ణ్ సుందరి’, ‘మాజిక్ కార్పెట్’, ‘చోర్ చోర్’, ‘చోర్ హో తో ఐసా’ అనే సినిమాలు ఆయనకు పేరు తెచ్చాయి. హిందీ రంగం నుంచి తిరిగి రంజన్‍ని తమిళ చిత్ర సీమకు తెచ్చిన ఘనత చిన్నప్ప దేవర్‍కి దక్కుతుంది. ఆయన నిర్మించిన ‘నీలమలై తిరుడన్’ (1957)లో రంజన్ కథానాయకుడిగా నటించారు. ఆ సినిమా గొప్ప హిట్ అయి తమిళంలో రంజన్‍కు స్టార్ హీరో హోదా తెచ్చిపెట్టింది. తమిళంలో ‘కెప్టెన్ రంజన్’ ఆయన చివరి చిత్రం.

రంజన్ గొప్ప కళాకారుడు. 15 ఏళ్ళకే వయొలిన్ వాయించడంలో పేరు పొందారు. సంగీతంలో డిప్లొమా పొందారు. ఆయన చక్కని రచయిత కూడా. దేవ్ ఆనంద్, నళిని జయవంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మునిమ్‌జీ’ కి కథ అందించారు (‘మునిమ్‍జీ’ సినిమాని తెలుగులో ఎన్.టి.ఆర్., సావిత్రిలతో ‘ఇంటిగుట్టు’ అనే పేరుతో తీశారు. ఇదే కథ ప్రేరణతో తరువాతి కాలంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమా వచ్చింది). భారతీయ శాస్త్రీయ సంగీతంపై, నాట్యంపై ఎన్నో పుస్తకాలు రాశారు. సంగీతం అంటే ఆయనకు చాలా ఇష్టం. అవకాశం దొరికినప్పుడల్లా దానిపై పరిశోధన చేసేవారు. కొన్నాళ్ళ పాటు ‘నాట్యం’ అనే తమిళ పత్రికని నడిపారు.

రోల్స్ రాయిస్ కారు కొన్న మొదటి హీరో రంజన్. ఆయన శిక్షణ పొందిన పైలట్. విమానం నడపడానికి లైసెన్సు, సొంత విమానం ఉండేవి. చిత్రకళలోనూ, ఇంద్రజాలం లోనూ విశేష ప్రతిభ కనబరిచారు. ఆయన భార్య డాక్టర్. వారికి సంతానం లేదు. ఈ దంపతులు అమెరికా వెళ్ళి, అక్కడ స్థిరపడి పౌరసత్వం పొందారు.

12 సెప్టెంబరు 1983 నాడు రంజన్ న్యూ జెర్సీలో గుండెపోటుతో మరణించారు. అప్పుడాయన వయసు 65 ఏళ్ళు.

భారతీయ సినీరంగానికి విశేష సేవలందించిన రంజన్ అస్తమించినా, ఆయన కీర్తిప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలుస్తాయి.


కుస్తీల నుంచి సినిమాల దాకా – దారా సింగ్:

బుల్లితెరపై హనుమంతుడి పాత్రలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటులు దారా సింగ్ రెజ్లింగ్ లోనూ నిపుణులని అందరికీ తెలిసిందే. దారాసింగ్ నటుడు, దర్శకుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ రాణించారు.

దారాసింగ్ అమృత్‍సర్ సమీపంలోని ధర్మూచక్ అనే గ్రామంలో ఒక జాట్ సిక్కు కుటుంబంలో 19 నవంబర్ 1928 నాడు జన్మించారు. ఆయన అసలు పేరు దీదార్ సింగ్ రణ్‍ధావా. బాల్యం నుంచే దారా సింగ్ శరీరాకృతి బాగుండేది. అది చూసిన చాలామంది గ్రామస్థులు ఆయనను కుస్తీ (రెజ్లింగ్) నేర్చుకోమని ప్రోత్సహించారు. ఆ కాలంలో భారతీయ శైలి రెజ్లింగ్ అయిన ‘పెహల్వానీ’ నేర్చుకోవడం చాలా గర్వకారణంగా భావించబడేది, ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో. చాలా ఏళ్ళ పాటు దారా సింగ్ మన దేశంలో శిక్షణ పొందారు. ఆపై 1946లో, దేశం స్వాతంత్ర్యం పొందడానికి ఏడాది ముందు, సింగపూర్ వెళ్ళారు. అక్కడ హర్నామ్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్నారు. అక్కడ గ్రేట్ వరల్డ్ స్టేడియంలో శిక్షణ పొందుతూ, కొన్నాళ్ళు స్థానిక డ్రమ్ తయారీ మిల్లులో పనిచేశారు.

సింగపూర్‍లో ఉండగా, ఆయన తార్‍లోక్ సింగ్‍ని ఓడించి ఛాంపియన్ ఆఫ్ మలేషియా (ఇండియన్ స్టైల్ ఆఫ్ రెజ్లింగ్) అయ్యారు. ఆయన జీవితంలో రెండు ముఖ్యమైన ఘటనలు జరిగాయి. ఒకటి కలకత్తాలో 1959లో జరిగిన కామన్‍వెల్త్ ఛాంపియన్‍షిప్ క్రీడలలో జార్జ్ గోర్డింకోని ఓడించటం. అప్పుడాయన కామన్‍వెల్త్ ఛాంపియన్ అయ్యారు. రెండవది 1968లో లౌ ఠేస్‌పై విజయం సాధించటం.

దారా సింగ్ మన దేశంలో మొదటి ప్రముఖ గౌరవం సాధించినది – 1954లో. బొంబాయిలో జరిగిన ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ పోటీలలో పదివేల మంది సమక్షంలో టైగర్ జోగీందర్ సింగ్‍ని ఓడించి ‘రుస్తుం-ఎ-హింద్’ టైటిల్ సాధించారు. టోర్నమెంటు ముగింపు సందర్భంగా ఆయన మహారాజా హరి సింగ్ నుండి వెండి కప్పును అందుకున్నారు. భారత ఛాంపియన్ అయ్యారు.

అంతకంటే ఘనమైన విశేషం మరొకటి ఉంది. అది 12 డిసెంబర్ 1956 నాడు జరిగింది. ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భట్‌గాం గ్రామంలో ఒక పెద్ద బరిని ఏర్పాటు చేశారు. జాతీయ ఛాంపియన్ అయిన దారా సింగ్ ఒక బకెట్ నిండా గేదె పాలు తాగి పోటీకి సిద్ధం అయ్యారు. అదో చారిత్రక పోరాటం. ఆ పోరులో దారా సింగ్ ప్రపంచ ఛాంపియన్ అయిన కింగ్ కాంగ్ (ఎమిలీ జాయా) తో పోటీపడ్డారు. కింగ్ కాంగ్‌ని పైకి ఎత్తి, గిరగిరా తిప్పారు. సాయం కోసం అడుగుతూ, ఆటని ముగించమని రిఫరీని బ్రతిమలాడారట కింగ్ కాంగ్. అప్పుడు ప్రేక్షకులలో సోవియట్ యూనియన్ నాయకుడు నికోలాయ్ బల్గనిన్ కూడా ఉన్నారట. ఆ వార్తని తరువాత చాలామంది రేడియోలో విన్నారు, మర్నాడు దినపత్రికలలో చదివారు. ఈ విధంగా దారాసింగ్ దేశానికి గర్వకారణం అయ్యి, గౌరవాన్ని సాధించిపెట్టారు.

తన ఘనమైన కెరీర్‍లో దారా సింగ్ మరికొన్ని గొప్ప విజయాలు సాధించారు. ప్రసిద్ధ జపనీస్ కుస్తీవీరుడు రికిడాజాన్‌తో పోటీ పడ్డారు. 1968లో అమెరికన్ రెజ్లర్ లౌ ఠేస్‌పై విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్ అయ్యారు. 1996లో ‘ది వరల్డ్ రెజ్లింగ్ అబ్జర్వర్ న్యూస్‍లెటర్ హాల్ ఆఫ్ ఫేమ్’ లో స్థానం సంపాదించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దారా సింగ్ దేశంలో చాలామందికి ఆదర్శం అయ్యారు. మన దేశపు కుస్తీ వీరుడు – విదేశాలలో పేరు పొందిన గొప్ప గొప్ప కుస్తీ యోధులని ఓడించటాన్ని యువత ప్రేరణగా తీసుకున్నారు. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో, 53 అంగుళాల ఛాతీ కొలతతో – దేశపు గౌరవ చిహ్నంగా నిలిచారు. బరిలో ఆయన కనబరిచిన అసాధారణ ప్రతిభకి గుర్తింపు కాస్త ఆలస్యంగా వచ్చిందనడంలో సందేహం లేదు. ఎందరెందరో ఘనులను ఆయన ఓడించి కీర్తి పొందారు. కొందరేమో ఇదంతా దేశంలో వ్యాపారాల కోసం అని వ్యాఖ్యానించేవారు. కానీ ఎట్టకేలకు ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన తన కెరీర్‍లో ఒక్క మ్యాచ్‍లో కూడా ఓడిపోలేదు. దాదాపు 500 కుస్తీలు పూర్తి చేసాకా, 1983 జూన్‌లో ఢిల్లీలో ఆటకి రిటైర్‍మెంట్ ప్రకటించారు.

దారా సింగ్ పలు హిందీ సినిమాలలో యాక్షన్ హీరోగా నటించారు. వతన్ సే దూర్, దాదా, రుస్తుం-ఎ-బాగ్దాద్, షేర్ దిల్, సికందర్-ఎ-అజామ్, రాకా వంటివి ఆయనకి పేరు తెచ్చిన కొన్ని సినిమాలు. నటి ముంతాజ్‍కి కథానాయికగా ఎక్కువ అవకాశాలిచ్చింది ఈయనే. వాళ్ళిద్దరు కలిసి డజన్ల సినిమాల్లో నటించారు. 1980 దశకం చివర్లో టీవీ ధారావాహిక ‘రామాయణం’ లో హనుమంతుడి పాత్ర పోషించారు. ఆయన చివరగా కనబడినది ఇంతియాజ్ అలీ తీసిన ‘జబ్ వుయ్ మెట్’ సినిమాలో.

 

దారా సింగ్ – సవా లాఖ్ సే ఏక్ లాదూన్, నానక్ దుఖియా సుబ్ సన్సార్, ధ్యాను భగత్, రబ్ దియన్ రఖన్ వంటి ఏడు పంజాబీ సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే హిందీలో – భక్తి మే శక్తి, రుస్తుం – అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలను ఆయన 1970లో స్థాపించిన ‘దారా ఫిల్మ్’ బ్యానర్‍పై నిర్మించారు. ‘ముతరం కున్ను’ అనే మలయాళ సినిమాలో దారా సింగ్ – ‘దారా సింగ్’ అనే రెజ్లర్ పాత్రలో నటించారు.

రాజ్యసభకు నామినేట్ అయిన తొలి క్రీడాకారుడు ఈయనే. 2003-2009 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. జాట్ మహాసభ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రెజ్లింగ్ క్రీడకు ఆయన అందించిన సేవలు రాబోయే తరాలకు ప్రామాణికంగా నిలుస్తాయి. 83 ఏళ్ళ వయసులో ఈ నటుడుకి గుండెపోటు రావడంతో 7 జూలై 2012 నాడు ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. లైఫ్ సపోర్ట్ పరికరాలపై ఉంచారు. అయితే కోలుకునే అవకాశాలు లేవని తెలిసి, ఆయన కుటుంబ సభ్యులు 11 జూలై 2012 నాడు ఆయనను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువెళ్ళారు. మర్నాడు అంటే 12 జూలై 2012న ఉదయం 7.30 గంటలకి తన ఇంట్లో కన్నుమూశారు.

దారా సింగ్‍కు మొదటి భార్య ద్వారా పార్దుమాన్ సింగ్ రణ్‌ధావా అనే కుమారుడు, రెండవ భార్య ద్వారా – ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగారు. ఈయన కుమారుడు విందూ – తండ్రి అడుగుజాడలలో నడిచి, రెజ్లింగ్ లోనూ, సినీ రంగంలోనూ ప్రవేశించాడు, కానీ అంతగా రాణించలేదు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో వీరాభిమానులు ఆయన మృతి పట్ల బాధపడ్డారు. ఆయన లాంటి వారు మరొకరు లభించరు, ఎందుకంటే అంత మంచివాళ్ళని సృష్టించటం ఆపాశాడా దేవుడు.

దారా సింగ్ నటించిన, దర్శకత్వం వహించిన సినిమాల జాబితా కోసం ఈ లింక్ చూడవచ్చు:

https://en.wikipedia.org/wiki/Dara_Singh#Filmography

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here