అలనాటి అపురూపాలు- 167

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటి శుభా ఖోటే అంతరంగం:

పలు హిందీ, మరాఠీ చిత్రాలలోనూ, టివీ సీరియల్స్ లోనూ, నాటకాలలోనూ నటించిన శుభా ఖోటే ఒకప్పుడు సైక్లింగ్, స్విమ్మింగ్ ఛాంపియన్. ఆమె తన బాల్యం గురించి, తాను పాల్గొన్న సైక్లింగ్, స్విమ్మింగ్ పోటీల గురించి, తన సినీ రంగ ప్రవేశం గురించి, తోటి నటీనటుల గురించి, వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే..

***

“నేను బొంబాయిలో పుట్టి పెరిగాను. మా నాన్నగారు మూకీ సినిమాలలో నటించారు. అందుకని సినీ పరిశ్రమ నాకు కొత్త కాదు. నేను నాలుగేళ్ళ వయసులోనే మా నాన్నగారు దర్శకత్వం వహించిన నాటకలలో నటించాను. తరువాత బడి సెలవులలో ఒక మరాఠీ సినిమాలో చిన్న పాత్రలో నటించాను. అయితే అప్పట్లో నటనని కెరీర్‍గా తీసుకోవాలన్న ఆలోచన లేదు.

ఒకరోజు నేను టాలెంట్ స్కౌట్ పోటీలో పాల్గొన్నాను. నేనేదో సరదా కోసం పాల్గొంటే, ఫైనల్స్‌కి వచ్చేసాను. అప్పడు అనిపించింది – ఇంత ప్రతిష్ఠాత్మక పోటీలలో నేను ఫైనల్స్ దాకా వచ్చానంటే, నాలో ప్రతిభ ఉందని! అప్పుడు నేను నా కెరీర్‍ని సీరియస్‍గా తీసుకున్నాను.

క్రీడారంగంలో పేరు పొందాలని నాకెప్పటి నుంచో కోరిక. ఆ విధంగానే రాణించాను. సైక్లింగ్‍లో ఆల్ ఇండియా ఛాంపియన్ అయ్యాను. ఈతలో ఇంటర్-కాలేజ్ ఛాంపియన్‍ని అయ్యాను. నేను సైక్లింగ్‍లో ఆసియా క్రీడలలో కూడా పాల్గొనేదాన్నే, ఎందుకంటే నేను అప్పటికే నేషనల్ ఛాంపియన్‍ని; కానీ ఆసియా క్రీడలలో ఈ పోటీలు మగవారికి మాత్రమే పరిమితం కావడంతో, నాకు అవకాశం దక్కలేదు. చాలా కాలం తరువాతే సైక్లింగ్ పోటీలలో మహిళలను కూడా అనుమతించారు. దేశానికి ప్రాతినిధ్యం వహించలేకపోవటం నాకు బాధ కలిగించింది.

నేను క్రీడాకారిణి కావటం వల్ల, నేను సినిమాల్లోకి రాకముందే, నాకు అభిమానులుండేవారు, వాళ్ళ నుంచి ఉత్తరాలు వచ్చేవి. ఈతలో ఇంటర్-కాలేజ్ ఛాంపియన్‍ అయినప్పుడు నా ఫోటో పేపర్లో వేశారు, అయితే నా పేరుని సుమన్ ఖోటే అని రాశారు. ఆ విధంగా అభిమానుల నుంచి నాకు వచ్చిన మొదటి ఉత్తరం తప్పుడు పేరుతో వచ్చింది. తర్వాత ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. కొంతమంది నన్ను పెళ్ళి చేసుకుంటామనేవాళ్లు, కొంతమంది నా రాఖీ సోదరులు అవ్వాలని అనుకునేవారు. కొన్ని బెదిరింపులు కూడా ఉండేవి. ఒకడు నా మొహం మీద ఆసిడ్ పోస్తానని రాశాడు! అయితే ఇవన్నీ ఆటలో భాగమని నేను పట్టించుకోలేదు.

ఒకసారి లీలా చిట్నిస్ తమ కుమారులతో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నారు. అందులో ఒక పాత్ర కోసం ఆవిడ నన్ను అడిగారు. నేనెంతో ఉత్సాహం వ్యక్తం చేశాను. అప్పట్లో మేం గమ్‍దేవిలో ఉండేవాళ్ళం, రిహార్సల్స్ కోసం మాహిం వచ్చేదాన్ని. ఇలా ఒక నెల రోజులు గడిచాయి. ముహూర్తానికి ఒక రోజు ముందు షరతులు మాట్లాడుకోవడానికి నన్ను పిలిచారు. అప్పుడు ఆవిడ – నేను ఐదేళ్ళ కాంట్రాక్టుపై సంతకం చేయాలని – చెప్పారు. అంటే, ఐదేళ్ళ పాటు నేను వేరేవాళ్ళ సినిమాల్లో నటించకూడదని అర్థమైంది. అందువల్ల ఆ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. బాధ కలిగింది, కానీ సినిమాల్లో రాణించాలన్న నా పట్టుదల మరింత ఎక్కువైంది.

నేను సైకిల్ తొక్కుతున్న ఫోటో చూసిన దర్శకులు అమియ చక్రవర్తి చూసి, ఆయన తీసే సినిమాలో నన్ను తీసుకోవాలనుకున్నారు. అందుకని సినీ డిస్ట్రిబ్యూటర్ అయిన కామత్ గారిని నాతో మాట్లాడమని మా ఇంటికి పంపారు. నేను మగరాయుడిలా ఉండేదాన్ని. మగపిల్లల్లా దుస్తులు ధరించి, మగపిల్లల్లానే ప్రవర్తించేదాన్ని. కామత్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మా తమ్ముడు దిండ్లతో కొట్టుకుంటున్నాం. కామత్ గారు నాకేసి ఒక చూపు చూసి, వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి మన సినిమాకి నప్పదు అని అమియ చక్రవర్తిగారికి చెప్పారట. కానీ చక్రవర్తి గారు నేనే కావాలని పట్టు పట్టారట. ఆ విధంగా నాకు మొదటిసారిగా గుర్తింపు ఉన్న పాత్ర ‘సీమా’ చిత్రం ద్వారా లభించింది. ఈ సినిమాతో నాకు విపరీతమైన ఆదరణ లభించింది.

‘సీమా’ సినిమాలో నేను ఒక దొంగని సైకిల్ పై వెంటాడే సన్నివేశం ఉంది. అది సినిమాకే హైలైట్. నేనెక్కిన రేస్ సైకిల్‍కి ఫ్రంట్ బ్రేక్స్ మాత్రమే ఉన్నాయి. చాలా వేగంగా వెళ్ళేటప్పుడు ఫ్రంట్ బ్రేక్ వేస్తే ముందుకు తూలి పడతాం. దొంగ పాత్రధారి మామూలు సైకిల్ మీద ఉన్నాడు. నేను చాలా వేగంగా వెళ్ళి, అతని కాలర్ పట్టుకుని ఆపాను. కానీ ఇలా చేయడంలో నేను సైకిల్‍ని కాలితో ఆపడానికి ప్రయత్నించాను. అదుపు తప్పి, ముందుకు దొర్లి ఎదురుగా ఉన్న కెమెరా ఢీకొని కింద్ర ఉన్న రాళ్ళూరప్పలపై పడ్దాను. నా మొహం చిట్లిపోయింది. నేను మళ్ళీ నటించగలనో లేదో అనిపించింది. కానీ ఒకటిన్నర నెల తరువాత కోలుకుని మళ్ళీ నటించాను.

‘సీమా’ సినిమా ప్రీమియర్ షో రోజు ఉదయం నాకు సైక్లింగ్ రేస్ ఉంది. రేసులో పాల్గొని, సైకిల్ మీద ఇంటికి వచ్చి, తొందరగా తయారై ప్రీమియర్ షోకి వెళ్ళాను. షో మొదలవగానే నా నటనకి ప్రశంసలు దక్కాయి. నాకెంతో ఉత్సాహంగా అనిపించింది.

నేనెప్పుడూ షార్ట్స్ ధరించి, ఎక్కడికి వెళ్ళినా, మార్కెట్‍కి అయినా సరే, సైకిల్‍ని తీసుకువెళ్ళేదాన్ని. కానీ ‘సీమా’ విడుదలయ్యాకా, ఈ పద్ధతిని మానుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా విడుదలయిన వారానికి, నేను వాయిదాల పద్ధతిలో కారు కొనాల్సి వచ్చింది.. నిజానికి అప్పట్లో నాకు కారు భరించేంతటి స్తోమత లేదు.”

***

శుభా ఖోటే ‘చంపా కలీ’ (1957) సినిమాలో విషాద పాత్ర, ‘పేయింగ్ గెస్ట్’ (1957) లో వ్యాంప్ పాత్ర, ‘హీరా మోతీ’ (1959).లో కథానాయిక పాత్ర పోషించారు. అయితే కథానాయిక పాత్ర మాత్రమే పోహించాలన్న ఆసక్తి ఆమెకి లేదు.

***

“నేను నా రూపురేఖలకి ఎన్నడూ ప్రాధాన్యత నివ్వలేదు. గొప్ప అందగత్తెనని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా రూపురేఖలు హీరోయిన్‍ పాత్రలకి నప్పవని నాకు తెలుసు” అన్నారామె కపటం లేకుండా. 1958 ఆమెకి బాగా కలిసొచ్చిన సంవత్సరం అని భావిస్తారు, ఆ తరువాత ఆమె నటించిన అనారి, ఘరానా, ససురాల్ – గొప్ప హిట్‍లు అయ్యాయి. వీటిల్లో చివరి రెండు సినిమాలకి ఉత్తమ సహాయనటి విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుకి ఆమె నామినేట్ అయ్యారు కూడా. ఆమె అభిమాన గణం పెరిగిపోయారు. ఎన్నో ఉత్తరాలు వచ్చేవి. “అన్ని ఉత్తరాలకి నేనే స్వయంగా జవాబిచ్చేదాన్ని” చెప్పారామె. కొన్ని ఇబ్బందికరమైన ఉత్తరాలు కూడా వచ్చేవి. “ఒకడు నా మొహం మీద ఆసిడ్ పోస్తానని రాశాడు. పోలీసులకి చెప్పాల్సి వచ్చింది” అన్నారామె. ఎల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో ‘ఛోటీ బహెన్’ (1959) సినిమాలో మహమూద్ గారి సరసన నటించటం ఆమె కెరీర్‍ని మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత ఆమె హాస్యనటిగా గుర్తింపు పొందారు. “నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. మామూలుగానే నేను చాలా సరదాగా ఉంటాను. ఒకసారి అమియజీ ‘నీ సెన్స్ ఆఫ్ టైమింగ్ బావుంటుంది, కామెడీకి బాగా నప్పుతావు’ అని అన్నారు. తనకి నటి రమోలా దేవి (ఖజాంచి, 1941) అంటే అభిమానమని ఆమె చెప్పారు.

***

నేనూ – మహమూద్ గారు:

తరువాతి ఆరేళ్ళలో శుభ, మహమూద్, ధుమాల్ నటించిన చిత్రాలు భారీ వసూళ్ళను రాబట్టాయి. భరోసా, జిద్దీ, సాంజ్ అవు సవేరా, లవ్ ఇన్ టోక్యో, గ్రహస్థి, హమ్‌రాహీ, బేటీ బేటే వంటి చిత్రాలు బాగా ఆడాయి. “మహమూద్, ధుమాల్, నేను ఉన్న ట్రాక్ – నాయికానాయకులకు సమాంతరంగా సాగేది. మహమూద్ గారు భలే సరదా మనిషి. ఎప్పుడూ జోక్స్ వేసి నవ్వించేవారు. ఆయనకి ఫెర్‍ప్యూమ్స్, కార్లు ఇష్టం. మేం బాగా దగ్గరయ్యాం. నేను ఆయనతో పాటు రంజాన్ ఉపవాసాలు చేసేదాన్ని, ఆయన నాతో శ్రావణ వ్రతాలు చేసేవారు. ఒక్కోసారి ధుమాల్ కూడా మాతో కలిసేవారు” చెప్పారామె. మహమూద్‍తో తనకి ఉన్న సంబంధం గురించిన పుకార్లని ప్రస్తావిస్తూ “నేనెప్పుడూ ఎఫైర్లు పెట్టుకోలేదు. నేనో క్రీడాకారిణిని కావటం వల్ల మగరాయుడిలా ఉండేదాన్ని. నా సహనటులు కూడా నన్ను మగవాడిలానే పరిగణించేవారు. నేనూ మహమూద్ గారు ఒకరినొకరం ‘భాయ్’ అని పిలుచుకునేవాళ్ళం. మేం మంచి స్నేహితులం” అన్నారామె. “జనాల వాగుడిని మనం ఆపలేం. నేనీ వదంతులని పట్టించుకోలేదు, ఎందుకంటే మనమేమిటో మన మనసుకి తెలుసు” అన్నారు.

***

కొంతమంది హీరోయిన్లు శుభా ఖోటే సమక్షంలో ఇబ్బంది పడేవారు. “నాకు కేటాయించిన కాస్ట్యూమ్స్‌ తమకి కావాలని కొందరు హీరోయిన్స్ అడిగేవారు. నేను క్రీడాకారిణిని కావడం వల్ల నా శరీరాకృతి బావుండేది, అందువల్ల అన్ని రకాల దుస్తులు నాకు బాగా నప్పేవి” అన్నారు.

***

తోటి నటీమణులు:

శుభా – గోయల్ ప్రొడక్షన్స్ వారి ‘నయీ రాహేఁ’ (1959)లో గీతాబాలితో కలిసి నటించారు. “కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉండే నటీమణుల్లో గీతా ఒకరు” అన్నారు శుభా. “తర్వాతి కాలంలో శ్రీదేవి వచ్చింది. తనదీ గొప్ప టైమింగ్. హావభావాలు గొప్పగా ప్రదర్శిస్తుంది. కెమెరా ముందు అద్భుతాలు చేస్తుంది” అన్నారు.

***

నూతన్ గారితో స్నేహం:

స్వర్గీయ నూతన్‍ గారిని తనకి ఆత్మీయ స్నేహితురాలిగా పరిగణిస్తారు శుభా ఖోటే. “మా స్నేహం ‘సీమా’ షూటింగ్ నుంచే మొదలయింది. ఆమె నా నేస్తం, మార్గదర్శి. నా దుస్తులు, మేకప్ విషయంలో ఎన్నో సూచనలు చేసేవారు. నూతన్ గారిది సహజ సౌందర్యం. కెమెరాతో ఏ కోణం నుంచి చిత్రీకరించినా, ఆమె చాలా అందంగా కనిపించేవారు.” అన్నారామె. అయితే నూతన్‍కి వివాహం అయ్యాకా, వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేసానని తెలిపారు శుభ. “ఒకసారి నూతన్ పుట్టినరోజు నాడు ఆమెకి ఫోన్ చేశాను. ఆమె భర్త (స్వర్గీయ రజనీష్ బహ్ల్) మాట్లాడారు – ‘నూతన్ నిద్రపోతోంది. కనీసం పుట్టినరోజు నాడయినా నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వండి అని అంది. ఏమైనా చెప్పాలా?’ అని అన్నారు. ఆ తరువాత ఆమెకి ఫోన్ చేయడం మానేసాను. ఎందుకంటే, నా వల్ల తను ఇబ్బందులు ఎదుర్కోవడం నాకిష్టం లేదు. షూటింగ్ సందర్భంగా సెట్స్ లో కలిసేవాళ్ళం” చెప్పారు శుభ. నూతన్ కాన్సర్ వల్ల 1991లో చనిపోయారు. “ఆమె చివరి రోజుల్లో ఆమెతో ఫోన్‍లో మాట్లాడేదాన్ని. ఆమె అంత సంతోషంగా లేరని అర్థమైంది” చెప్పారు శుభ.

 

“ఒకరోజు తనని ఫిల్మ్ సిటీలో కలిసాను. మేకప్ రూమ్‍లో తన షాట్ కోసం ఎదురుచూస్తున్నారు. షాట్ పూర్తి చేసి ఇంటికి వెళ్ళచ్చుగా అని అడిగాను. ఇంట్లో కంటే నాకు ఇక్కడే సౌకర్యంగా ఉంది అని అన్నారు.”

***

దిలీప్ కుమార్‌తో:

దిలీప్ కుమార్ గారంటే ఎంతో అభిమానం ఉన్న శుభా ఖోటే ఆయనతో పని చేయలేకపోయినందుకు బాధపడతారు. “అయినా నేను ఆయనతో నటించలేకపోయేదాన్నేమో – అంత గొప్ప నటుడాయన! నాకు దేవుడి లాంటి వారు. ఆయన వీపు కెమెరా వైపు ఉన్నా కూడా, ఆయన భావోద్వేగాలను మనం గ్రహించవచ్చు” అన్నారామె. ఒక సంఘటనని గుర్తు చేసుకుంటూ “ఒకసారి నేను దిలీప్ గారిని రాజ్ కపూర్ ఇచ్చిన పార్టీలో కలిసాను. దిలీప్ గారు నన్ను ఆప్యాయంగా ‘పోరీ’ అని పలకరించారు (పోరీ అనేది మరాఠీలో బాలికలని అభిమానంగా పిలిచే పదం). నా తలపై చెయ్యి ఉంచి దీవించారు. తర్వాత నేను చాలా రోజుల పాటు తల స్నానం చేయలేదు. మా అమ్మ తిట్టింది – తల స్నానం చేయకపోతే, పేలు వస్తాయని.” అని చెబుతూ నవ్వారు. “నేను ఆయనని ఆరాధించేదాన్ని. నాకు గురువు లాంటి వారు. వారి మొదటి చిత్రం ‘జ్వార్‍ భాటా’ అమియ చక్రవర్తి గారితోనే. నా మొదటి సినిమా కూడా అమియ చక్రవర్తి గారితోనే కావడం విశేషం” అన్నారు శుభ.

***

వివాహం – పిల్లలు:

తన కెరీర్ లానే ఆమె విహావం కూడా ఒక ప్రణాళిక లేకుండా జరిగిపోయింది. “హఠాత్తుగా మీకు ఒకరి మీద ప్రేమ కలుగుతుంది.. ఈ ప్రేమ అనేదాన్ని.. నియంత్రించలేం” అంటూ నవ్వారు శుభ. ఆమె, అప్పట్లో బర్మా షెల్ కంపెనీలో పని చేస్తున్న దినేష్ ఎమ్. బల్సావర్ ని పెళ్ళి చేసుకున్నారు. తమ పెళ్ళి సందడిని ఆమె నవ్వుతూ వివరించారు. “మా అమ్మకి (లీలా ఖోటే) ఈ పెళ్ళి ఇష్టం లేదు. కారణం ఏమిటో నాకిప్పటికీ అర్థం కాదు. బహుశా, ఆయనకి అప్పటికి పెళ్ళయి, భార్యని కోల్పోయి, ఇద్దరు కొడుకులు ఉన్నారనా లేక నేను అప్పుడు నా కెరీర్‍లో ఉచ్చస్థాయిలో ఉన్నాననా లేక నన్ను మరెవరికైనా ఇచ్చి పెళ్ళి చేయాలనా – అమ్మ ఉద్దేశం నాకు తెలియలేదు. నన్నో గదిలో పెట్టి తాళం వేసింది. అప్పుడు నేను నిద్రమాత్రలు మింగాను. మా నానమ్మ మాత్రం నన్ను గట్టిగా బలపరిచింది. అలాగే మా తమ్ముడు (నటుడు విజు ఖోటే), మా నాన్న, ఇతర కుటుంబ సభ్యులు కూడా.” చెప్పారు శుభ. ఆమె తండ్రి, తమ్ముడు ఆమెను శాంతాక్రజ్ లోని తమ బంగ్లా నుంచి తప్పించి, చౌపట్టీ లోని తమ పాత ఇంటికి మార్చారు. “పెళ్ళి 1960 జనవరి 24న అనుకున్నాం. కానీ అమ్మ ఈ సంగతి పసిగట్టింది, అందుకని జనవరి 21నే పెళ్ళి చేసేసుకున్నాం” అంటూ నవ్వారు శుభ. “అయితే భావన పుట్టాకా, అమ్మ రాజీ పడింది” చెప్పారామె.

“చాలా ఏళ్ళ తరువాత, మా అమ్మ లక్షణాలు గోచరించే కామెడీ విలన్ ఛాయలున్న ఓ తల్లి పాత్రని ‘ఏక్ దూజే కే లియే’ సినిమాలో చేశాను” చెప్పారామె. ఆమె తన సవతి పిల్లలు – పరమానంద్, అశ్విన్‍తో చాలా సన్నిహితంగా మెలిగారు. “అశ్విన్‍కి ఏడేళ్ళు వచ్చే వరకు నేను పిల్లల్ని కనలేదు. ఆ తర్వాతే భావన పుట్టింది” అన్నారామె. ఓ తల్లిగా ఆమె తన బాధ్యతలని చక్కగా నిర్వర్తించారు. “నా పిల్లల కోసం నేనెప్పుడూ ఆయాని పెట్టుకోలేదు. తర్వాత పరమానంద్ గ్వాలియర్ లోని సింధియా స్కూల్‍లో చదివాడు. అశ్విన్‌కి కాస్త బెంగ ఎక్కువ. అక్కడ ఉండలేక తిరిగి వచ్చేసాడు” చెప్పారామె. నేడు అశ్విన్ ఒక సౌండ్ రికార్డిస్ట్. కౌన్ బనేగా కరోడ్‌పతి,  దస్ కా దమ్ వంటి షోలకి పని చేస్తున్నాడు. పరమానంద్ అమెరికాలో ఉన్నాడు.

పెళ్ళయ్యాకా కూడా తనని నటన కొనసాగించమని ప్రోత్సహించిన తన భర్తని ఎంతగానో మెచ్చుకుంటారు శుభ. పెళ్ళయ్యాకా, ఆమె ‘చిముకలా పహుణా’ (1968) అనే మరాఠీ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆమె భర్త ఓ చిన్న పాత్రలో కనబడతారు. “పర్లేదు, చిన్న వేషమే, వేసేయ్యండి అని నేను ఆయనకి నచ్చజెప్పాను” అన్నారామె. దినేష్ గారికి కంషేత్ లో ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ్నించి ఆయన కూరగాయలు, పళ్ళు తెచ్చేవారు.

***

విరామం – ఆ తరువాత:

1966-1975 మధ్య కాలంలో శుభా ఖోటే  – లవ్ ఇన్ టోక్యో, తుమ్ సే అచ్ఛా కౌన్ హై, మిలి, బదల్తే రిస్తే వంటి సినిమాలలో నటించారు. భర్తకి లండన్‍లో పోస్టింగ్ వచ్చినప్పుడు ఆమె ఆయనతో వెళ్ళడంతో – ఆమె కెరీర్‍లో కొంత విరామం వచ్చింది. ‘ఏక్ దూజే కే లియే’ని తన కమ్-బ్యాక్ సినిమాగా చెప్తారామె. “ఆ సినిమాలో నాది కాస్త ప్రతికూల ఛాయలున్న పాత్ర అయినప్పటికీ, తమాషాగా ఉండేది” అని నవ్వుతూ చెప్పారామె. 1989-90లలో ఆమె కూలీ, సాగర్, దిల్ హై కి మాన్తా నహీ అనే సినిమాలలో కనిపించారు. ఈ మధ్య కాలంలో ఆమె ‘టాయ్‍లెట్ ఏక్ ప్రేమ్ కథ’ లోనూ, మాధురీ దీక్షిత్ నటించిన ‘బకెట్ లిస్ట్’ అనే మరాఠీ చిత్రంలోనూ నటించారు. హేరా ఫేరి, హమ్ దోనోం, లెట్స్ డూ ఇట్ – అనే హాస్య నాటకాలకు దర్శకత్వం వహించారు.  ఆమె సొంత సంస్థ రూపొదించిన ‘బాచెలర్స్ వైఫ్’ అనే నాటకం ముంబాయిలో 40 కంటే ఎక్కువ సార్లు ప్రదర్శితమైంది. ‘నో సెక్స్ ప్లీజ్’ అనే అంగ్ల నాటకాన్ని, ‘హంగామా హో గయా’ పేరుతో హిందీలోకి రూపాంతరం చేశారు. “రంగస్థలం నా ఏకాగ్రతని నిలుపుతుంది” అన్నారామె.

జబాన్ సంభాల్కే, బా బాహు ఔర్ బేబీ, మంగళం దంగళం వంటివి ఆమె నటించిన ప్రసిద్ధి టీవీ ధారావాహికలు. దాదాపు 60 ఏళ్ళకి పైగా సాగిన కెరీర్‍లో ఆమె తన సిద్ధాంతం మీద గట్టిగా నిలబడ్డారు – “నేను ఎవరినీ పని అడగలేదు. ప్రతికూల భావాలకి దూరంగా ఉండేదాన్ని. నాకు నెగటివ్ రోల్స్ ధరించడం ఇష్టం లేదు” అన్నారు.

“అందుకే నేను ‘పేయింగ్ గెస్ట్’ సినిమా చూడలేదు. కానీ చాలా ఏళ్ల తరువాత పిల్లల బలవంతం మీద ఆ సినిమా చూశాను.” అన్నారు సుబోధ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఆ సినిమా గురించి.

తనకి ఆనందం కలిగించేవి చిన్న చిన్న విషయాలేనని అంటారామె. “చెట్ల మీద పక్షులని చూడడం ఇష్టం. నాకు జీవితంలోని విశేషమైన, అసాధారణమైన కోణాలు చూడడం ఇష్టం.” అన్నారామె.

“నేనూ, భావన కలిసి ఏదైనా సినిమాని మొదటి రోజు మొదటి ఆట చూడడానికి ఇష్టపడతాం. దాని కోసమే తను చౌపట్టీ నుంచి ఇక్కడికి వస్తుంది. అదో సరదా మాకు” చెప్పారామె.

ఇదీ అలనాటి ప్రముఖ నటి శుభా ఖోటే అంతరంగం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here