అలనాటి అపురూపాలు- 168

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

కవి, రచయిత నీరజ్:

కవి నీరజ్‍గా సుప్రసిద్ధులైన గోపాల్‍దాస్ సక్సేనా 4 జనవరి 1925న ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలోని పురవాలి గ్రామంలో జన్మించారు. ఆరేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయారు. నీరజ్‍నీ, ఆయన అన్నయ్యని వాళ్ళ మేనత్త, ఆమె భర్తా పెంచారు.

బాధ్యతలు తీసుకోవడం గురించి ఓ పాఠాన్ని ఆయన తన బడి రోజుల్లోనే గ్రహిచారు. నీరజ్ పరీక్షలలో ఒక సబ్జెక్టులో ఒక మార్కు తక్కువ రావడంతో ఫెయిల్ అయ్యారు. వెళ్ళి టీచర్‍ని కలిసి ఆ ఒక్క మార్కు వేసి తనని పాస్ చేయవలసిందిగా కోరారు. అందుకు ఆ టీచర్ తిరస్కరించారు. “ఈరోజు నేను ఒక మార్కు వేస్తే, నీకు అందరినీ ఇలాగే అడగడం అలవాటయిపోతుంది. నువ్వో పేదవాడి కొడుకువి. జీవితమంతా నువ్వు ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి” అన్నారాయన.

ఆ ఉపాధ్యాయుడి మాటలు నీరజ్‍ని బాగా ప్రభావితం చేశాయి. కేవలం చదువులోనే కాక, జీవితంలో అన్ని రంగాలలోనూ బాగా కష్టపడ్డారు.

పాఠశాల స్థాయిలోనే నీరజ్ సంగీతం వైపు, కవిత్వం వైపు ఆకర్షితులయ్యారు. పెళ్ళయ్యాకా, మేనత్త భర్త ఆర్థిక సహాయం నిలిపివేశారు. “ఇక నీ బతుకు నీది” అన్నారట. డబ్బు సంపాదించేందుకు ఆ యువకవి ఏ పనైనా చేసేవారు. బీడీలు, సిగరెట్లు అమ్మేవారు, ఓ న్యాయవాదికి టైపింగ్ చేసేవారు. పిల్లలకు పాఠాలు చెప్పేవారు. రిక్షా తొక్కేవారు, గోడలపైన ఆయుర్వేద మందుల ప్రకటనలు రాసేవారు. భక్తులు యమునా నదిలో వేసిన నాణేలను సేకరించేందుకు నదిలోకి దూకేవారు. ఇలా రకరకాల పనులు చేయడం వల్ల – భిన్నమైన జీవితాల పట్ల నీరజ్‍కి అవగాహన కలిగింది. ఇటువంటి అవగాహన కవికి, రచయితకి చాలా అవసరం.

కొంత కాలం తర్వాత ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వం వారి పబ్లిసిటీ డివిజన్‍లో టైపిస్టుగా చేరారు. కొన్నాళ్ళకి – అక్కడ ప్రభుత్వ విధానాలని ప్రచారం చేసే కవి హఫీజ్ జలంధరి వద్ద లిటరరీ అసిస్టెంట్‍గా పదోన్నతి పొందారు.

నీరజ్ తన 14వ ఏటనే ఓ కవి సమ్మేళనంలో పాల్గొన్నప్పటికీ, ఆయనలోని ప్రతిభకి తగ్గ అవకాశాలు దొరికింది మాత్రం ఢిల్లీలోనే. ఓ కవి సమ్మేళనంలో ఆయన ప్రముఖ సాహిత్య దిగ్గజాల సమక్షంలో ‘పర్‍దేశీ, అప్నా ఘర్ జావో రే’ అనే కవితని చదివారు. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఆయనకు 5 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. “ఎన్నో సాహిత్య పురస్కారాలు, ప్రతిష్ఠాత్మకమైన పద్మ భూషణ్ అవార్డులు నాకొచ్చినా, – ఆ ఐదు రూపాయలు గెల్చుకున్న నా అప్పటి సంతోషానికి సాటిరావు” అన్నారు నీరజ్. “అప్పట్లో నేను చాలా కష్టాల్లో ఉండేవాడిని, సమయానికి డబ్బు అందింది” అన్నారు.

తర్వాతి కాలంలో ఆయనకు పలు కవిసమ్మేళనాలకు ఆహ్వానాలు అందాయి. 1943లో నీరజ్ ఓ కవిసమ్మేళనంలో పాల్గొనేందుకు కలకత్తా వెళ్ళారు. అప్పుడు అక్కడ కరువు తాండవిస్తోంది. జనాలు ఒకరితో ఒకరు – మిగిలిపోయిన పదార్థాల కోసం పోట్లాడుకునే కుక్కల్లా పోట్లాడుకుంటున్నారట. ఆ పరిస్థితి చూసి కలత చెందిన నీరజ్ – ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘మై విరోధీ హూఁ’ అనే కవిత చదివారు. అతి అత్యంత ప్రజాదరణ పొందింది.

అయితే ప్రభుత్వ పాలసీల ప్రచార విభాగంలో పని చేస్తూ, ప్రభుత్వాన్ని బహిరంగంగ విమర్శించడం ప్రభుత్వంలోని కొందరికి ఆగ్రహం కలిగించింది. తనని అరెస్టు చేస్తారేమోనని భయపడిన నీరజ్ ఢిల్లీ నుంచి పారిపోయి, కాన్పూర్‍కి వచ్చేశారు.  అక్కడ ఆయన దాదాపు రెండేళ్ళ పాటు రహస్య జీవితం గడిపారు.

నీరజ్ మళ్ళీ ప్రైవేట్లు చెప్పడం మొదలుపెట్టారు. జీవిక కోసం స్టెనోగ్రఫీ నేర్చుకుని, స్టెనోగ్రాఫర్‍గా పని చేశారు. ఎలాగొలా డిగ్రీ పూర్తి చేసి (ఫస్ట్ క్లాస్‍లో), 1951లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార శాఖ అధికారిగా ఉద్యోగం సాధించారు. 1956లో ఆయన ఆలీఘర్‍లోని ధరమ్ సమాజ్ కాలేజీలో పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

కవిసమ్మేళనాలలో పాల్గొనడం కొనసాగించారు నీరజ్. ఆయన తొలిసారిగా లక్నో ఆకాశవాణి కేంద్రంలో చదివిన ‘కారవాఁ గుజర్ గయా’ సంచలనం సృష్టించింది. “ఆ రోజు నాన్న – కవిత్వాన్ని సామాన్యులకి చేరువ చేసిన శ్రీ హరివంశ్ రాయ్ బచ్చన్ – పక్కన ఉన్నారు” అని నీరజ్ కుమారుడు, కవి, శశాంక్ ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. “తర్వాత నాన్న బొంబయి వెళ్ళి ఎన్నో సినిమాలకు లోతైన, నాణ్యమైన భావాలున్న పాటలందించారు” అన్నారాయన.

1960లో బొంబాయిలో ఓ కవి సమ్మేళనంలో నీరజ్ కవిత్వం విన్న సినీ నిర్మాత ఆర్. చంద్ర – నీరజ్‍తో సినిమా పాటలు రాయించుకోవాలనుకున్నారు. “నేను రాసిన వందలాది కవితలు ఉన్నాయి, వాటిల్లో మీకు నచ్చినవి మీరు ఎంచుకోవచ్చు” అన్నారు నీరజ్.

1966లో ఆర్. చంద్ర ‘నయీ ఉమ్ర్ కి నయీ ఫసల్’ అనే సినిమాలో నీరజ్ రాసిన ఎనిమిది కవితలను ఉపయోగించుకున్నారు. వాటిల్లో  ‘కారవాఁ గుజర్ గయా’ పాటని ముహమ్మద్ రఫీ, ‘దేఖ్తీ హీ రహో ఆజ్ దర్పణ్ నా తుమ్’ పాటని ముకేష్ పాడారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా,  పాటలు చిరకాలం నిలిచిపోయాయి.

ఓ కవిసమ్మేళనంలో నీరజ్ కవిత్వం విన్న దేవ్ ఆనంద్ – “నాకీ భాష నచ్చింది. ఏదో ఒకరోజు మనం కలిసి పని చేద్దాం” అని నీరజ్‍తో అన్నారట. 60వ దశకం చివర్లో దేవ్ ఆనంద్ ‘ప్రేమ్ పూజారి’ అనే సినిమా తీస్తున్నారని, కొత్త గీత రచయితల కోసం చూస్తున్నారని తెలిసి, నీరజ్ వెళ్ళి ఆయనని కలిశారు. తనకిచ్చిన మాటని గుర్తు చేశారు. దేవ్ ఆనంద్ నీరజ్‍ని బొంబాయి రమ్మని ఆహ్వానించారు. బొంబాయి చేరిన నీరజ్‍ చేతిలో వెయ్యి రూపాయలు ఉంచి, “రేపు మిమ్మల్ని మా సంగీత దర్శకుడు ఎస్. డి. బర్మన్ వద్దకు తీసుకువెళ్తాను” అన్నారు.

బర్మన్ తనకి ‘రంగీలా’ అనే పదంతో మొదలయ్యే పాట కావాలని అడిగారు. ఆ విధంగా పుట్టింది ‘రంగీలా రే తేరే రంగ్ మేఁ’ పాట. ‘దాదా’ గా ప్రసిద్ధులైన ఎస్.డి. బర్మన్ గారికి ఆ పాట బాగా నచ్చింది. “మిమ్మల్ని ఓడించాలని, చాలా కష్టమైన బాణీ ఇచ్చాను, కానీ మీరే నన్ను ఓడించారు” అని తర్వాత తనతో అన్నారని నీరజ్‍ చెప్పారు.

70వ దశకంలో ఎస్. డి. బర్మన్ – నీరజ్‍ ద్వయం ఎన్నో హిట్ పాటలని అందించింది. షర్మిలీ, గేంబ్లర్, తేరే మేరే సప్నే సినిమాలు ఇందుకు ఉదాహరణలు. నీరజ్ రోజూ ఉదయం తొమ్మిది గంటలకు బర్మన్ ఇంటికి వెళ్ళేవారు. “ఆయనతో పని చేస్తున్నప్పుడు సమయం అస్సలు తెలిసేది కాదు” అన్నారు. “ఒకరోజు ఆయన ఇంటికి కాస్త ఆలస్యంగా వెళ్ళాను. ఆయన ఓ బాణీని హమ్మింగ్ చేస్తూ – గీతంలోని లయకి అనుగుణంగా చేతులూ ఊపుతూ ఉన్నారు. ఆయన దృష్టి ఎదురుగా ఉన్న గోడ మీద ఉంది. నేను ఆయనకి నమస్కరించాను. ఆయన హమ్మింగ్ చేస్తూనే నన్ను కూర్చోమని సైగ చేశారు. నేనది గమనించలేదు. మళ్ళీ నమస్కరించాను. దాదా పాడుతూనే, ‘బాణీ కుదురుతోంది, వచ్చేస్తోంది, నిశ్శబ్దంగా ఉండండి’ అన్నారు. తర్వాత తెలిసింది దాదా ఓ పరిపూర్ణమైన బాణీ కోసం ప్రయత్నించారని” చెప్పారు నీరజ్.

బర్మన్ నీరజ్‍కు కొన్ని సలహాలిచ్చారు. షమా, పర్వనా, షరాబ్, తమన్నా, జానేమన్, జాన్, ఇష్క్ వంటి పదాలను గీతాలలో ఉపయోగించవద్దని చెప్పారు. “అప్పుడు నేను – బగియా, మధుర్, గీతాంజలి, మాలా, ధాగా వంటి అరుదుగా వాడే పదాలతో గీతాలు రాస్తానని ఆయనకి చెప్పాను” అన్నారు నీరజ్. “పాటలని కొత్తగా సృష్టించడానికి దాదా ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఉదాహరణకి ఆయన ‘ముఖ్‌డా’ (ప్రారంభ వాక్యాలు)ని ‘అంతర’ (ముఖ్‍డా తర్వాత వచ్చే వాక్యాలు) తర్వాత ఉపయోగించేవారు. హిందీ సినీ సంగీతంలోని భిన్నమైన వాయిద్యాలను వాడుకునేవారు. ఆయన లేకపోయుంటే సినీ సంగీతం ఏమయి ఉండేదో?” అన్నారు నీరజ్.

నీరజ్ శంకర్-జైకిషన్ గార్లతో కూడా పనిచేశారు. ‘లిఖే జో ఖత్ తుఝే’, ‘ఆద్మీ హూఁ ఆద్మీ సే ప్యార్ కర్తా హూఁ’ వంటి గొప్ప హిట్ పాటలని ఇచ్చారు. 1970లో వచ్చిన ‘మేరా నామ్  జోకర్’ సినిమా కోసం నీరజ్ వారికి ‘ఏ భాయ్ జరా దేఖ్ కేచ్ చలో’ అనే పాటని ఇచ్చినప్పుడు – ఆ పాటకి ప్రారంభ వాక్యాలు లేనందువల్ల అది పాటలా లేదనీ, దానికి బాణీ కట్టడం కష్టమని అన్నారట. అప్పుడు తానో బాణీ సూచించగా, అది వారికెంతగానే నచ్చేసిందని చెప్పారు నీరజ్.

కవిసమ్మేళనాలలో నీరజ్ తన కవితలను తనదైన విశిష్ట రీతిలో చదువుతూ, కవితలని గానం చేసే పాత పద్ధతులను దూరం పెట్టారు. ఆయనలోని ఈ ప్రతిభ వల్లే తన గీతాలకి బాణీలు కట్టేటప్పుడు శంకర్-జైకిషన్ వంటి దిగ్గజాలకి సైతం ఆయన సూచనలు చేయగలిగారు.

1973లో సినీకవిగా తన ప్రజాదరణ ఉచ్చదశలో ఉండగా, నీరజ్ తిరిగి ఆలీఘర్ వచ్చేసారు. కానీ అప్పటికే ఆయన తన కాలేజీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్నారు. “1971లో జైకిషన్ చనిపోయాకా, అనారోగ్యం కారణంగా ఎస్.డి. బర్మన్ పని చేయడం మానేసాకా, నాకు బొంబాయి అంటే విరక్తి కలిగింది. పైగా నేనో ప్రసిద్ధ కవిని.. ఎవరినైనా  పని అడగడం నాకు నచ్చదు” అన్నారాయన.

70వ దశకం చివర్లో వచ్చిన కొత్త నిర్మాతలు, కొత్త సంగీత దర్శకులు తమ పాటల కోసం నీరజ్ గారి గురించి ఆలోచించలేదు. “బొంబాయికి చెందినవారిలో – నన్ను చివరి వరకూ సంప్రదిస్తూ ఉన్నది దేవ్ ఆనంద్, విజయ్ ఆనంద్ మాత్రమే” అన్నారు నీరజ్. “దేవ్ ఆనంద్ చివరి సినిమా ‘చార్జ్‌షీట్’ కి నేను పాటలు రాశాను” చెప్పారు నీరజ్.

కవిసమ్మేళనాలలోనూ, సినీ గీత రచనలోనూ క్షీణిస్తున్న ప్రమాణాల గురించి ఆయన బాధపడ్డారు. “మన సినిమాల్లో గీత రచయిత చచ్చిపోయారు” అని ఆయన ప్రకటించారు. “ఎందుకంటే జనాలు భౌతికమైన వస్తువుల వెంట పరుగులు తీస్తున్నారు, లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన పాటలని వాళ్ళు వినదల్చుకోవడం లేదు. మనం సారహీనమైన ఉత్సాహపు రోజుల్లో బ్రతుకున్నాం. అందుకే మిమిక్రీ, జోక్స్, ముతక హాస్యం వంటివి కవిత్వం పేరుతో చలామణీ అవుతున్నాయి” అని అన్నారు.

తన కవిత్వాన్ని నీరజ్ ఆకర్షణీయంగా చదివే పద్ధతి ఎందరో మహిళలను ఆయన అభిమానులుగా మార్చింది. నీరజ్ దీన్ని ఆపలేకపోయారు. కొన్ని ప్రేమ సంబంధాలు ఆయనకి ఇబ్బందులు కలిగించాయి. రెండోసారి వివాహం చేసుకోవాల్సి వచ్చింది. “నేను స్త్రీల ప్రభావంలో పడకుండా ఉంటే, మరో 50 కవితా సంపుటులు తెచ్చేవాడినేమో” అన్నారు నీరజ్.

ఆయన మొదటి ప్రేమ – ఈటా లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువతి తోటి. “ఆమెను పెళ్ళి చేసుకుందామని అనుకున్నప్పుడు – నన్ను నేను పోషించుకునే స్తోమత నాకు లేదని వాళ్ళ అత్త – ఈ ప్రతిపాదనని వ్యతిరేకించింది” చెప్పారు నీరజ్. “చాలా ఏళ్ల తరువాత ఆమెని కలిసినప్పుడు – అమె తన రోగిష్ఠి భర్తతో దుర్భర దారిద్ర్యంలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ఆమె చేతిలో రెండు వందల రూపాయలు ఉంచి, ఏదైనా అవసరమైతే నాకు ఉత్తరం రాయమని చెప్పను. కానీ ఆమె నుంచీ ఏ ఉత్తరమూ రాలేదు. తర్వాతి కాలంలో చాలామంది స్త్రీలు నా ప్రేమని ఆశించారు. కానీ నా హృదయంలో ఆమె కల్గించిన వెలితిని ఎవరూ తీర్చలేకపోయారు” చెప్పారు నీరజ్.

వయసుతో పాటు వచ్చే సుగర్, హై బిపి వంటి వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు నీరజ్‍కు రాలేదు. పెద వయసులో కూడా హుషారుగా పనిచేయడానికి గల కారణమడిగితే, “నేను మితంగా తింటాను, నా జీర్ణశక్తి బాగుండేలా చూసుకుంటాను” అని ఆయన సమాధానం ఇచ్చారు. “ఇక నా పని విషయానికి వస్తే, నాకు కవితలు రాయడం ఇష్టం. అదే జీవితమంతా నాకు ప్రేరణనిచ్చింది, అవసరమైన మత్తుని కలిగించింది” అన్నారు.

నీరజ్‍కు 1991లో పద్మశ్రీ పురస్కారం, 2007లో పద్మ భూషణ్ పురస్కారం లభించాయి.

ఊపిరితిత్తులకు ఇన్‍ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రిలో చేరిన నీరజ్, 93 ఏళ్ళ వయసులో 19 జూలై 2018 నాడు కన్నుమూశారు.

***

~

‘భౌతికంగా ఆయన లేకపోయినా, తన కవితల ద్వారా, రచనల ద్వారా శ్రోతల/పాఠకుల మనసులలో చిరకాలం నిలుస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here