అలనాటి అపురూపాలు- 171

0
15

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మేటి స్వరకర్త గులామ్ మొహమ్మద్:

ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న గులామ్ మొహమ్మద్ హిందీ చలనచిత్ర రంగంలో క్లాసిక్స్ అనదగ్గ ‘మీర్జా గాలీబ్’ (1954), ‘పాకీజా’ (1972) సినిమాలకు సంగీతం అందించిన స్వరకర్తగా అందరికీ గుర్తుండిపోతారు. ఆయన సంగీతంలో రాజస్థానీ మట్టి పరిమళాలు ఉండేవి, హిందీ సినీ సంగీతాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళారాయన.

గులామ్ మొహమ్మద్ రాజస్థాన్ లోని బికనేర్‍లో సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయన తన సంగీత సాధనను చిన్న వయసు నుంచే ప్రారంభించారు. ఆరేళ్ళు నిండేసరికి అయన న్యూ ఆల్‍బర్ట్ థియేట్రికల్ కంపెనీలో చేరారు. కాలం గడిచేకొద్దీ ఆయన నాటకరంగంలో రాణించి, పూర్తి కాలపు డాన్స్ డైరక్టర్ అయ్యారు. 1924లో బొంబాయి వచ్చి సరోజ్ మూవీటోన్ ప్రొడక్షన్స్ వారి ‘రాజా భర్తారి’ సినిమాలో తబలా వాయించే అవకాశం దక్కించుకున్నారు. ఆయన తబలా, ధోలక్ అద్భుతంగా వాయించేవారు. గానంలోనూ, నాట్యంలోనూ చక్కని ప్రావీణ్యం ఉంది. గులామ్ మొహమ్మద్ – బొంబాయిలో తన తొలి రోజుల్లో సుప్రసిద్ధ సంగీత దర్శకులు – నౌషాద్, అనిల్ బిస్వాస్ లకు సహాయంగా ఉండేవారు. నౌషాద్ సంగీతానికి మొహమ్మద్ గారి తబలా, ధోలక్ ప్రత్యేకత అయ్యాయి. మొదట తబలా వాద్యకారుడిగా, తరువాత సహాయకుడిగా దాదాపు 20 సంవత్సరాలు నౌషాద్‌తో ఉన్నారాయన.

బొంబాయికి వచ్చిన 23 ఏళ్ళ తరువాత, ఆయనకి స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేసే అవకాశం ‘డోలీ’ (1947) సినిమాతో వచ్చింది. ‘పారస్’, ‘మేరా ఖ్వాబ్’, ‘టైగర్ క్వీన్’, ‘డోలీ’ వంటి చిత్రాలతో హిందీ సినీ ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం ఏర్పర్చుకున్నారు. ‘పగ్డీ’, ‘పర్దేశ్’, ‘నాజ్‍నీన్’, ‘గౌహర్’, ‘రైల్ కా డిబ్బా’, ‘హూర్-ఎ-అరబ్’, ‘సితార’, ‘దిల్-ఎ-నాదాన్’ మొదలైనవి ఆయన సంగీతం అందించిన మరికొన్ని చిత్రాలు. స్వతంత్ర సంగీత దర్శకుడిగా స్వరాలు అందిస్తూనే, నౌషాద్ వద్ద సహాయకుడిగా కూడా పనిచేశారు.

సోహ్రాబ్ మోడీ దర్శకత్వం వహించిన ‘మీర్జా గాలీబ్’ (1954) సినిమా గులామ్ మొహమ్మద్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది, అంతే కాదు 1955 లో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు తెచ్చిపెట్టింది.

గులామ్ మొహమ్మద్ పనిచేసిన మరో క్లాసిక్ ‘పాకీజా’ (1972). కమల్ అమ్రోహీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి గులామ్ మొహమ్మద్ అద్భుతమైన బాణీలను అందించారు. ఈ సినిమాకి ఆయన అందించిన బాణీలను భారతీయ సినిమాలో ఆల్-టైమ్ గ్రేట్ బాణీలుగా పరిగణిస్తారు. అయితే ఈ సినిమా చిత్రీకరణలో అంతరాయం ఏర్పడి, పూర్తి అవడానికి 14 ఏళ్ళకి పైగా సమయం పట్టింది. ఈ సినిమా పూర్తి కాకుండానే, 17 మార్చి 1968 నాడు గులామ్ మొహమ్మద్ కన్ను మూశారు. అసంపూర్తిగా ఉన్న కొన్ని బాణీలను నౌషాద్ పూర్తి చేశారు. ఓ క్లాసిక్‍లా నిలిచిన ఈ సినిమా ఆల్బమ్‍ను ఆయన చూసుకోలేకపోయారు. సజీవంగా ఉండి ఉంటే బహుశా, ఈ విజయాన్ని చూసుకుని ఉండేవారేమో! పాపం!

జీవితమంతా సంగీతానికి సేవ చేశారు, బదులుగా ఆయనకి రావల్సినవి మాత్రం రాలేదు.

విస్మరించలేని అద్భుతమైన పాటల నిధిని వదిలివెళ్ళారు గులామ్ మొహమ్మద్. వాటిల్లోని కొన్ని ఆణిముత్యాలు:

https://www.youtube.com/watch?v=eYcAlJs60BM….

https://www.youtube.com/watch?v=WTnSday2o5M..

https://www.youtube.com/watch?v=3lC_jlmBeVk

https://www.youtube.com/watch?v=vcEEQ-i7Lcs


విలక్షణ నటుడు మోహన్ బాబు:

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబు గారికి అభిమాన గణం ఎక్కువ. ఆయన సంభాషణలు పలికే తీరు, ఉచ్చారణ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి. దాదాపు 500 లకి పైగా సినిమాలలో వివిధ రకాల పాత్రలలో నటించి ప్రేక్షకుల అభిమానం సంపాదించారు మోహన్ బాబు.

మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఆయన 19 మార్చి 1952న మంచు నారాయణస్వామి నాయుడు, మంచు లక్ష్మమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మోదుగులపాళెం గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు – మంచు రంగనాధ్ చౌదరి, మంచు రామచంద్ర చౌదరి, మంచు కృష్ణ – సోదరి విజయ ఉన్నారు. అయన ప్రాథమిక విద్యను ఏర్పేడులో పూర్తి చేసి, తరువాత, తిరుపతిలోని ఎస్.పి.జె.ఎన్.ఎమ్. హైసూల్లో చదువుకున్నారు. 14వ ఏట నుంచే పాఠశాలలో నాటకాలలో ఎంతో ఆసక్తిగా పాల్గొనేవారు. అయితే ఆయన తండ్రి మాత్రం చదువు మీద దృష్టి పెట్టమని చెప్పేవారు.

రిటైరయిన స్కూల్ హెడ్‍మాస్టర్ పెద్ద కొడుకుగా, మోహన్ బాబు తండ్రి మాటను గౌరవించి మద్రాస్ లోని వై.ఎమ్.సి.ఎ. కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్‍లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత కొన్నేళ్ళ పాటు వై.ఎమ్.సి.ఎ. కాలేజ్‍లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేశారు.

అయితే కళలు, సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో, తన స్వప్నాలను సాకరం చేసుకునేందుకు ఆయన మద్రాసులోని పలు స్టూడియోలకు వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించేవారు. 1969లో దర్శకుడు లక్ష్మీ దీపక్ గారి వద్ద అప్రెంటిస్‍గా అవకాశం దొరికి, తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

కొన్నేళ్ళు కెమెరా వెనుక పనిచేశాకా, 1974లో – మోహన్ బాబుకి – ‘కన్నవారి కలలు’, ‘అల్లూరి సీతారామరాజు’లో పాత్రలు లభించాయి. మరుసటి సంవత్సరం – ‘స్వర్గం నరకం’ సినిమా గొప్ప హిట్ అయి, ఆయనకి మరిన్ని అవకాశాలు కల్పించింది. ఆ సినిమాలో ఆయన విలన్ పాత్ర పోషించారు. దీని తరువాత ఎన్నో సినిమాలలో ఆనాటి ప్రసిద్ధ కథానాయకులు ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్. తదితరుల పక్కన కామెడీ విలన్‍గా నటించారు. తరువాత హీరోగా మారి ‘ఖైదీ కాళీదాసు’, ‘కేటుగాడు’, ‘గృహప్రవేశం’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘అల్లరి మొగుడు’ వంటి ఎన్నో చిత్రాలలో నటించారు. శివాజీ గణేశన్ మోహన్ బాబుని తమిళ సినీ రంగానికి పరిచయం చేశారు. మోహన్ బాబు దాదాపు 20కి పైగా తమిళ సినిమాలలో నటించారు. నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, మాస్టర్ ఆఫ్ డైలాగ్స్.. వంటి బిరుదులున్నాయి ఆయనకి.

టాలీవుడ్‍లో మోహన్ బాబు కెరీర్‍ని తీర్చిదిద్దడంలో దాసరి నారాయణరావు ముఖ్య పాత్ర పోషించారు. దాసరి దర్శకత్వం వహించిన ‘స్వర్గం నరకం’ (1975) – మోహన్ బాబుని సరైన మార్గంలో నడిపి, సినీ పరిశ్రమలో రాణించేందుకు పునాది వేసింది. ‘సింహ గర్జన’ (1978), ‘సింహ బలుడు’ (1978), ‘రామకృష్ణులు’ (1978), ‘పదహారేళ్ళ వయసు’ (1978), ‘నాయుడు బావ’ (1978), ‘షోకిల్ల రాయుడు’ (1979) ‘రాముడే రావణుడైతే’ (1979) వంటి చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించారు. ‘పద్మవ్యూహం’ (1973), ‘బిల్లా రంగా’ (1978), ‘ధర్మ పోరాటం’ (1983), ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ (1982), ‘భలే రాముడు’ (1984), ‘సంచలనం’ (1985) తదితర చిత్రాలలో ప్రశంసనీయమైన నటన కనబరిచారు.

1980వ దశకం, 1990వ దశకం తొలి సంవత్సరాలలో మోహన్ బాబు నటించిన – ‘త్రిలోక సుందరి’ (1980), ‘సీతారాములు’ (1980), ‘టాక్సీ డ్రైవర్’ (1981), ‘సవాల్’ (1982), ‘ప్రళయ గర్జన’ (1983), ‘సీతమ్మ పెళ్ళి’ (1984), ‘తిరుగుబోతు’ (1985), ‘విశ్వనాథ నాయకుడు’ (1987), ‘ఆత్మకథ’ (1988), ‘బ్లాక్ టైగర్’ (1989), ‘ప్రాణానికి ప్రాణం’ (1990) వంటి చిత్రాలు యావరేజ్‍గా ఆడాయి.

అయితే ‘అల్లుడు గారు’ (1990), ‘అసెంబ్లీ రౌడీ’ (1991), ‘రౌడీ గారి పెళ్ళాం’ (1991), ‘అల్లరి మొగుడు’ (1992), ‘పెదరాయుడు’ (1995) వంటి సినిమాలు సూపర్ హిట్ అయి ఆయనని పెద్ద స్టార్‍ని చేశాయి. మోహన్ బాబు – ప్రముఖ నటి సావిత్రి – జీవితం ఆధారంగా తీసిన ‘మహానటి’ (2018)లో యస్.వి.రంగారావు పాత్ర పోషించారు. 1982లో ఆయన తన కుమార్తె మంచు లక్ష్మి పేరు మీద శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించారు.

మోహన్ బాబు విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు జన్మించారు. విద్యాదేవి మరణానంతరం, మోహన్ బాబు ఆమె చెల్లెలు నిర్మలాదేవిని పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతులకు మంచు మనోజ్ జన్మించారు.

తనకెంతో ఇచ్చిన సమాజానికి తన వంతు సేవగా మోహన్ బాబు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1993లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించి ఉన్నత విద్యను, సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‍లో పలు పాఠశాలలు, కాలేజీలు స్థాపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here