అలనాటి అపురూపాలు- 174

0
6

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

పల్లవి జైకిషన్:

ప్రముఖ స్వరకర్త దివంగత జైకిషన్ భార్య పల్లవి పేరు పొందిన ఫ్యాషన్ డిజైనర్. ఆమె రూపొందించే దుస్తులు, టేబుల్ లినెన్ మొదలగు వాటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

***

అది 31 ఆగస్టు 1963. 19 ఏళ్ళ పల్లవి మారివాలా, పారిపోయి వచ్చి స్వరకర్త జైకిషన్‍ని పెళ్ళి చేసుకున్నారు. ఈ వివాదాస్పద వివాహానికి ఆమె తల్లిదండ్రులు హాజరు కాకపోవడంతో, శంకర్ కన్యాదానం చేశారు. ఈ వివాహం పల్లవి గారి ఉన్నత వ్యాపార కుటుంబంలో సంచలనం సృష్టించింది. “మొదటగా ఆయన నాకంటే చాలా పెద్ద (14 ఏళ్ళు), మా వాళ్ళని ఇంకా చిరాకు పెట్టే విషయం ఏంటంటే ఆయన సినీ పరిశ్రమ వ్యక్తి” అంటూ గుర్తు చేసుకున్నారు పల్లవి.

12 సెప్టెంబర్ 1971న జైకిషన్ మృతి చెందారు. “మా పెళ్ళయిన 8 ఏళ్ళ 12 రోజులకి ఆయన వెళ్ళిపోయారు” నెమ్మదిగా చెప్పారు పల్లవి. “మా ఆఖరి సంతానం భైరవికి అప్పుడు నాలుగున్నర ఏళ్ళు” అన్నారు. అప్పుడు పల్లవి వయసు 27 ఏళ్ళు మాత్రమే.

భర్త హఠాన్మరణం పల్లవిని క్రుంగదీసింది. “పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చే సమయానికి నేను ఏడుస్తూ ఉండడం చూసి బాధపడేవారు. నాకు లోపల ఎంత బాధ ఉన్నా, వాళ్ళ కోసం పైకి ధైర్యం నటించేదాన్ని. వచ్చిపోయే అతిథులతో ఇల్లంతా సందడిగా ఉండడం వాళ్ళకి అలవాటు. ఇలా హఠాత్తుగా, ఇంట్లో ఎవరూ లేకపోవడం, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటం వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళకెలా చెప్పాలో నాకు తెలిసేది కాదు.”

తనకి బాగా నైపుణ్యం ఉన్న ఓ కళ ద్వారా ఆమె సాంత్వన పొందారు. అదే ఎంబ్రాయిడరీ. “నేను సొంతంగా డిజైనింగ్ వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నప్పుడు మా అమ్మా, అత్తగారూ నాకు మద్దతునిచ్చారు. మా అమ్మ ఓ వారం రోజుల్లో నాకు పెద్దర్ రోడ్‍లో ఒక చక్కని షాప్‍ని చూసి పెట్టింది. దానికి మేం ‘పారాఫెర్నాలియా’ అని పేరు పెట్టాం” చెప్పారామె. ప్రస్తుతం ఉన్న ‘పారాఫెర్నాలియా’ మొదట్లో ప్రారంభమైన చోటు నుంచి కొన్ని బ్లాకుల దూరంలో ఉంది.

తనలో ఉన్న కళని వ్యాపార వనరుగా మార్చుకోవడానికి కారణం ఆర్థికావసరాలేనా? “కాదు” అని దృఢంగా చెప్పారామె. “ఆయన నాకన్నీ సమకూర్చే వెళ్ళారు. అది సమస్య కాదు. కానీ నాదీ, మా పిల్లల జీవనశైలి మారకుండా చూసుకోవాలి, అందుకే నేను కూడా సంపాదించాలి అని నిర్ణయించుకున్నాను”. తనకు కలిగిన దుఃఖాన్ని – జటిలమైన ఎంబ్రాయిడరీ తోనూ, వృత్తి నిపుణత తోనూ ఘనీభవింపజేసుకున్నారు. తానెంతో దుఃఖంలో ఉన్నా, ఎందరో పెళ్ళికూతుర్లకు అందంగా డ్రెస్‍లు డిజైన్ చేసి వాటిని గులాబీతో అలంకరించి ఇచ్చేవారు.

ఓ బిజీ మ్యూజిక్ డైరక్టర్ భార్యగా, చేతన్, యోగేష్, భైరవి అనే ముగ్గురు పిల్లల తల్లిగా తానెంతో తీరిక లేని జీవితం గడిపారో ఆమెకు తెలుసు. “ఉదయం నుంచి సాయంత్ర వరకూ తీరిక లేకుండా ఉండేది. ఉదయం తొమ్మిది నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగేవి. నిర్మాతలు, గీత రచయితలు వస్తూండేవారు. ఇది అర్ధరాత్రి వరకూ సాగేది. నేను చక్కని అతిథేయిని. అందరికీ అవసరమైనవి – టీ, కాఫీ, జ్యూస్, అవసరమైనతే భోజనం ఏర్పాటు చేసేదాన్ని. తీరిక లేని జీవితమైనా, నేను బాగా ఇష్టపడ్డాను” నవ్వుతూ చెప్పారామె. “నేను అత్యంత దయాళువైన, రొమాంటిక్ వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాను. తనతో పని చేసిన ఎందరికో ఆయన అపార్ట్‌మెంట్లు కొనిచ్చారు. మా ఇల్లు ఎప్పుడూ నిర్మాతలతోనూ, గీత రచయితలతోనూ నిండివుండేది. టీ, టిఫిన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవి” చెప్పారామె. “ఒకరోజు ఆయన నాతో – నిన్న, షమ్మీ కపూర్, నీలా పెళ్ళి చేసుకున్నారు. ఈ సాయంత్రం మనం వాళ్ళకి పార్టీ ఇస్తున్నాం – అని అన్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే అన్ని ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. అంతా అద్భుతంగా జరిగిపోయింది” అన్నారామె.

డిజైనింగ్ ఎప్పుడు ఎలా నేర్చుకున్నారని అడిగితే – పల్లవి ఇలా చెప్పారు: “మా మారివాలా కుటుంబంలో చిన్నప్పటి నుంచే ఆడపిల్లలు ఏదో ఒక కళ నేర్చుకోవాలి. మేం బడి నుంచి రాగానే, మా నానమ్మ మాతో కూర్చుని, ఎంబ్రాయిడరి, క్రోచెట్ లేదా కుట్టుపని నేర్పేది. అంటే, అందమైన డిజైన్లను సృష్టించడం అనే అభిరుచి నాకు చిన్నతనం నుంచే ఏర్పడింది. తర్వాత, నేను మా ఆయనతో పాటు ప్రీమియర్ షోలకీ లేదా పార్టీలకి వెళ్ళినప్పుడు నేనే స్వయంగా డిజైన్ చేసి, ఎంబ్రాయిడరీ చేసిన చీరలు కట్టుకుని వెళ్ళేదాన్ని. ఇతర మహిళలు, హీరోయిన్‍లు నా చీరలు చూసి ప్రశంసించేవారు, నేను స్వయంగా డిజైన్ చేసుకున్నాన్ని తెలిసి ఆశ్చర్యపడేవారు”. భార్య తన అభిరుచినిని వ్యాపారంగా మార్చుకోడానికి జైకిషన్ అంగీకరించలేదు. అయితే, ఆయన చనిపోయిన తర్వాత, 1972లో, ఆమె తన సంస్థ ‘పారాఫెర్నాలియా’ను ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలలో, ఆమె అమెరికా లోని సాక్స్ ఫిఫ్త్ అవెన్యూ, బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మాన్ వంటి కొన్ని అతిపెద్ద, అత్యంత ఆకర్షణీయమైన డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లకు ఎగుమతి చేయసాగారు. తొలుత టిబెటన్ బౌద్ధ సన్యాసినిగా ఉండి తరువాతి కాలంలో ప్రముఖ ఎగుమతిదారుగా మారిన సిస్టర్ మాక్స్ పల్లవి ఇంటికి వచ్చారు. “నేను చాలా మంచి డిజైనర్‍నని విన్నాననీ, నాతో కలిసి పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. ఆమె కోసం నేను అందమైన దుస్తులు రూపొందించాను, కానీ ఆవిడ వాటి ఖరీదు చాలా ఎక్కువని భావించారు. అప్పుడు మేము ఆమె బడ్జెట్‌‍కు అనువుగా పనిచేశాము. మేం డిజైన్ చేసింది కేవలం సీక్విన్డ్ బ్లౌజ్ మాత్రమే, కానీ మేము అమెరికా అంతటా వందలాది బ్లౌజ్ పీసెస్‍ విక్రయించాము” చెప్పారు పల్లవి.

తన తొలి క్లయింట్‍ను ఎలా సాధించారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. “మేము అప్పట్లో గోవింద్ మహల్‍లో ఉండేవాళ్ళం. మా పక్క భవంతి శ్రీనికేతన్‍లో ఎన్నో మార్వాడీ కుటుంబాలు ఉండేవి. మా ఇంటికి అనేకమంది సెలెబ్రిటీస్ వస్తూ ఉండేవారు. చుట్టుపక్కల వాళ్లంతా – వాళ్ళని చూడ్డానికి – మా ఇంటివైపే చూస్తుండేవారు” చెప్పారామె. కేవలం సెలబ్రిటీలను చూడ్డానికే కాకుండా, ఆమె ఇరుగుపొరుగు వారు – పల్లవి ఎలాంటి దుస్తులు ధరించారో గమనించేవారు. అలాంటివి తమకీ కావాలనుకునేవారు.

‘పారాఫెర్నాలియా’లో మొదట ప్రదర్శించిన కలెక్షన్‍లో కేవలం చీరలే కాకుండా, టేబుల్ లినెన్, హాండ్ లినెన్ కూడా ఉన్నాయి. “నాకు తట్టిన ఆలోచనల ప్రకారం రకరకాల ఐటమ్స్ డిజైన్ చేసేదాన్ని” అన్నారు పల్లవి. క్రమంగా ఆర్డర్స్ పెరగసాగాయి. డిజైనర్ పల్లవి జైకిషన్ వ్యాపారవేత్త అయ్యారు. మొదట్లో, పిల్లలని చూసుకోడానికి, ఇంటి నుంచే పని చేసేవారు పల్లవి. పిల్లలు పెద్దవాళ్ళవడం, వ్యాపారం పెరగడంతో, పరేల్‍లోని వర్క్‌షాప్‍కి మారారు.

1980వ దశకంలో పల్లవి అమెరికా లోని ప్రముఖ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ స్టోర్స్ అయిన సాక్స్ ఫిఫ్త్ అవెన్యూ, లార్డ్ అండ్ టేలర్, బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మాన్ వంటి వాటికి exquisite beaded garments ఎగుమతి చేయడం ప్రారంభించారు. Dusseldorf Fair లో క్రమం తప్పక పాల్గొంటూ, యూరప్ లోని ఎగుమతుల ఆర్డర్లను నిర్వహించడానికి జర్మనీలో ఒక ఏజంటును నియమించుకున్నారు. Pret-line అవసరాన్ని గుర్తించిన మన దేశపు డిజైనర్లలో పల్లవి ఒకరు. ఇంటర్ ప్లాజా అనే స్టోర్‍లో ఆమె ఖాదీ తోనూ, మల్‍మల్ తోనూ డిజైన్ చేసి ప్రె‍ట్-లైన్ విక్రయించసాగారు. తానొక శిక్షణ పొందిన డిజైనర్‍ని కాదని ఒప్పుకోవడంలో పల్లవి సంశయించరు. “చూడండి, నాకు మొదటినుంచీ ఒక దృఢమైన సౌందర్యాభిరుచి ఉంది. అందం పట్ల, అందమైన వాటిని సృజించడం పట్ల నాకు ఆసక్తి ఉంది. ఏదో ఒక కోర్సులో చేరినంత మాత్రన మీరో డిజైనర్ అయిపోరు. మీలో అంతర్లీనంగా బలమైన ఆకాంక్ష ఉండాలి” అన్నారు పల్లవి.

పల్లవికి గులాబీలు అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టం ఆమె డిజైన్‍లలో తరచూ వ్యక్తమవుతుంది. “నిజమే, నాకు గులాబీలంటే ఇష్టం. అన్ని పూలూ ఇష్టమే. అయితే గులాబీల పట్ల నాకున్న ఇష్టం నన్నో చిక్కు సమస్యలో పడేసింది. – గులాబీలతో డిజైన్లు రూపొందిస్తే విమర్శకులు విమర్శిస్తారు, గులాబీలతో రూపొందించకపోతే నా క్లయింట్లు ఇష్టపడరు” అని చెబుతూ నవ్వారు పల్లవి. యాంటిక్ టెక్స్‌టైల్స్, మ్యూజియమ్స్, పెయింటింగ్స్, ప్యూర్ ఫాబ్రిక్స్ – ఆమె డిజైన్లకు ప్రేరణనిచ్చాయి. సౌకర్యంగా ఉంచే దుస్తులను, ముఖ్యంగా భారతీయ వాతావారణానికి అనువుగా ఉండే దుస్తులను ఆమె ఎక్కువగా రూపొందించారు. అందుకే ఆమె కలెక్షన్ లో ప్యూర్ సిల్క్, షిఫాన్, జార్జెట్‍లు అధికంగా కనిపిస్తాయి. పల్లవి డిజైన్ మెనూలను తయారు చేస్తారు. పల్లవి వంటలు బాగా చేస్తారు, చక్కని అతిథేయి కూడా. “నాకు వంట చేయడం ఇష్టం. నేను పక్కా శాకాహారినే అయినా, నా భర్త కోసం మాంసాహారం వండడం నేర్చుకున్నాను. ఈరోజు నేను నా మనవలు అడిగిన వంటకం ఏదైనా వండిపెట్టగలను” అంటూ కీమా భిండీ ఎలా చేస్తారో చెప్పారు. ఒకప్పుడు అది తన పిల్లలకి, ఇప్పుడు మనమలకి ఇష్టమైన వంటకం అని చెప్పారు.

ఈమధ్య కాలంలో ఆవిడ సవాలుతో కూడిన ఓ ఎసైన్‍మెంట్ అంగీకరించారు. ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబపు గృహానికి ఎంబ్రాయిడరీతో కూడిన అప్‍హోల్‌స్ట్రీ రూపొందించాలి. “అది భలే సరదగా ఉండేది. ఒక గదిలో ఆర్ట్ డెకో, మరో గది పూర్తిగా ఫ్రెంచ్.. నేను రూపొందించే అప్‍హోల్‌స్ట్రీ ఆ కాలాన్ని, ఆ వాతావరణాన్ని ప్రతిబింబించాలి. గెస్ట్ బాత్‍రూమ్‍ల కోసం స్వచ్ఛమైన ఘరా ఎంబ్రాయిడరీ వాడాను” చెప్పారు పల్లవి.

పల్లవి లాక్మే ఫ్యాషన్ షో లో తొలిసారిగా పాల్గొని తన డిజైన్లను ప్రదర్శించినప్పుడు ఫ్యాషన్ ప్రపంచం విస్తుపోయింది. తన ట్రెడిషనల్ కలెక్షన్ లోని – సజల (గోల్డెన్ లైనింగ్ తో కూడిన మేఘాలు), మందార (పౌరాణిక వృక్షం), ఎలావియా (సౌందర్యంతో కూడిన హుందాతనం), అవియానా (శాశ్వత వికసనం) – లను ప్రదర్శించారు పల్లవి. ఆమె కలెక్షన్‌లో చీరలు, లెహెంగాలు, గోల్డ్, గ్రీన్, రోజ్ పింక్, బ్రైట్ రెడ్, వెర్మిలియన్ రంగులలో లభిస్తాయి. “మా వద్ద సిల్క్, షిపాన్, పెరల్ ఎంబ్రాయిడరీ చేసిన, గోల్డ్ జరీ వర్క్ ఉన్న కోటా చీరలు దొరుకుతాయి. మా దుస్తులపై లేత రంగులు, పూల అలంకారాలు, వెండి అలంకరణలు ఉంటాయి” అన్నారు పల్లవి.

జనాల కోసం మీ సృజనాత్మక భావాలను మార్చుకోవాల్సి వచ్చిందా అని అడిగితే, “అవసరమైతే ఓ క్లయింటునైనా వదులుకుంటాను కానో, నా సౌందర్యాభిరుచి విషయంలో రాజీపడను” అని దృఢంగా చెప్పారామె. “నేనెప్పుడూ ‘క్లాసిక్స్’ చేశాను. అయితే కాలక్రమేణా నా డిజైన్ల పట్ల నా కళాస్పందన కూడా మారుతూ వచ్చింది. నేడు ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. మన దేశంలో వధువుకి నప్పేవి – బాలి లోనో లేదా ఫుకెట్‍ లోనో వధువికి నప్పవు. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి, మన స్వీయ సృజనాత్మక లోని సారాన్ని దూరం చేసుకోకూడదు. ప్రతీ చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి, కానీ ఒక్కోసారి అదొక అవరోధామైపోతుందని అనిపిస్తుంది” అన్నారు పల్లవి.

పల్లవి సంతానం జీవితంలో స్థిరపడ్డారు. పెద్దబ్బాయి చేతన్‌కి చాక్‍లెట్‍ల వ్యాపారం ఉంది. చిన్నబ్బాయి యోగేష్ లినెన్ ఎగుమతి చేస్తాడు, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం చేస్తారు. కుమార్తె భైరవి ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ డిజైనర్. పల్లవికి జీవితం పట్ల సంతృప్తి ఉంది. కాకపోతే పిల్లల్లో ఒకరికి కూడా తండ్రిలా సంగీతంపై ఆసక్తి లేనందుకు బాధపడతారు.

అయితే జైకిషన్ వారసత్వాన్ని పల్లవి కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆయన పేరిట వచ్చే ఉత్తరాలకు జవాబులిస్తారామె. “ఉత్తరాలతో పాటుగా ఆయన ఆటోగ్రాఫ్ చేసిన ఫోటోలో, లేక ఆయన జీవిత గాథ, లేదా మ్యూజిక్ సిడిలు జత చేస్తాను” చెప్పారామె.

నలభై ఏళ్ళు గడిచాకా, ఆమె సృజించిన దుస్తులే ఆమె విజయాన్ని చాటుతున్నాయి. ఆమె రూపొందించే దుస్తులు నేటికీ నిగూఢంగా, సొగసుగా, అధునాతునంగా ఉంటాయి. వాటి సృష్టికర్తలానే రొమాంటిక్‍గా ఉంటాయి.

సమాజంలోని సంపన్న వర్గాల మహిళల్లో పల్లవికి ఆదరణ పెరిగింది. ఆమె ఫ్యాషన్ షోలలో కోకిల అంబానీ, అర్చన, హర్ష్ మారివాలా (ఆమె హర్ష్ సోదరి), ఇందిరా అశ్వాని, శ్వేతా బచ్చన్, పూనమ్ సిన్హా, రష్మీ థాకరేలు ప్రేక్షకుల్లో ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ముంబయిలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో పల్లవి నిర్వహించిన ఒక ప్రదర్శనకి – నందిని సింగ్ జబువా, ఒరిస్సాలోని పాట్నా బోలంగీర్‌కు చెందిన మేఘనా సింగ్ దేవ్, గైక్వాడ్‌కు చెందిన రాధిక రాజే, సంగూర్‌కు చెందిన అనుష్క రాజే ఘోర్పడే, మే భంజ్‌దేయోకు చెందిన అక్షితా కుమారి భంజ్‌దే , బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లోని సియోహరాకు చెందిన చాందినీ కుమారి – తదితరులు అనేక మంది మాజీ రాజ కుటుంబీకులు హాజరయ్యారు.

పల్లవి కుమార్తె భైరవి జైకిషన్ స్వతహాగా మంచి గుర్తింపు పొందిన డిజైనర్. కోడళ్ళు రూహి మరియు ప్రియా ఇద్దరూ తమ వృత్తిలో విజయవంతమయ్యారు – రూహి ఒక వ్యాపారవేత్త, భారతదేశంలో గూచీని ప్రమోట్ చేశారు, ప్రియా ప్రసిద్ధ ఆక్షన్ హౌస్ ‘పుండోల్’ కోసం పని చేస్తారు. “డిన్నర్ టేబుల్ సంభాషణ ఎలా ఉంటుంది?” అని అడిగితే, “చాలా సరదాగా ఉంటుంది,” అని నవ్వారు పల్లవి. “మేము ఏ విషయం గురించైనా మాట్లాడుకుంటాం. వీలైనంత తరచుగా కలిసి రాత్రి భోజనం చేయాలని నేను కోరుకుంటున్నాను” అన్నారామె.

ఇదీ పల్లవి జైకిషన్ అంతరంగం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here