అలనాటి అపురూపాలు- 184

1
9

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

చరిత్రలో నిలిచిపోయే అంజలీ దేవి:

పురుషాధిక్యత గల సినీ పరిశ్రమలో విజయవంతంగా నెగ్గుకొచ్చిన నటీమణుల్లో అంజలీ దేవి ఒకరు. చిన్న వయసులో నర్తకిగా ప్రారంభించి – నటన, నిర్మాణం కొనసాగించి – నడిగర్ సంఘానికి అధ్యక్షురాలైన వైనం అత్యంత ఆసక్తిదాయకం. అంజలీ దేవి 1927లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని పెద్దాపురంలో జన్మించారు. అప్పటి ఆమె పేరు అంజనమ్మ. ఎనిమిదేళ్ల లేత వయసులో నర్తకిగా నాటకాలతో కెరీర్ ప్రారంభించారామె. 9 ఏళ్ళ వయసులో ‘హరిశ్చంద్ర’ సినిమాతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటి నుండి ఆమె కెరీర్ 50 సంవత్సరాలకు పైగా తెలుగు, తమిళ సినిమాలలో విస్తరించింది. ఈ కాలంలో ఆమె ఎన్నో హిట్ సినిమాల్లో పని చేశారు; రెండు రాష్ట్రాలలో మూలమూలల్లోనూ ఆమె కీర్తి వ్యాపించింది. మద్రాసు నగరానికి ఆమె పరిచయం కళాత్మకంగా, ఒక ఉన్నతమైన ఆశయం కోసం జరిగింది. 16 సంవత్సరాల వయస్సులో, రెండవ ప్రపంచ యుద్ధం ప్రయత్నాలకు నిధులు సేకరించేందుకు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ ఆర్థర్ హోప్ అధ్యక్షతన జరిగిన నృత్య ప్రదర్శనలో ఆమె నర్తించారు. ఆమె నృత్యం తెలుగు దర్శకులు సి పుల్లయ్యతో సహా చాలా మందిని ఆకట్టుకుంది. ఆయన 1947లో ‘గొల్లభామ’ చిత్రం ద్వారా అంజనమ్మను అంజలీదేవిగా పరిచయం చేశారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా డబ్ చేసి విడుదల చేశారు. జీవించినంత కాలం ‘అంజలీ దేవి’ని తన పేరుగానూ, మద్రాసు నగరాన్ని తన ఇంటిగానూ మార్చుకున్నారామె.

అంజలీ దేవి 1947 నుండి తమిళ చిత్ర పరిశ్రమలో నటించసాగారు. ఆమె మొదటి తమిళ చిత్రం ‘మహాత్మా ఉదంగర్’, అది హిట్ కాలేదు. కానీ అదే సంవత్సరం విడుదలైన టి.ఆర్. మహాలింగం సరసన నటించిన ఆమె రెండవ తమిళ చిత్రం, ‘అడితాన్ కణవు’ ఘన విజయాన్ని సాధించింది. తమిళ చిత్ర పరిశ్రమలో ఆమె ఎదుగుదల స్థిరంగా ఉంది, 1950 నుండి 1951 వరకు ‘అంజలీ దేవి సంవత్సరం’ అని కూడా పిలవవచ్చు. స్వప్న సుందరి, మాయకారి, మాయమలై, స్త్రీ సాహసం మరియు నిరపరాధి వంటి వివిధ డబ్బింగ్ చిత్రాలలు విడుదలయ్యాయి. ఆమె సినిమా పోస్టర్లు ఏడాది పొడవునా తమిళనాడు వీధులను అలంకరించాయి. ఆమె కన్మణిగా నటించిన 1954 నాటి తమిళ చిత్రం ‘పెన్’, కులాంతర వివాహాలను ప్రచారం చేసిన పెరియార్ గారి ఆత్మగౌరవ ఉద్యమం యొక్క సిద్ధాంతాలను స్పృశించింది. ఆమె ఆమె కెరీర్ బెస్ట్ ఎవర్ గ్రీన్ చిత్రం – ‘లవకుశ’, ఇది పూర్తయి విడుదలవడానికి ఏడేళ్ళు పట్టింది.

అంజలీ దేవి తన అద్భుతమైన కెరీర్‌లో – 350 చిత్రాలకు పైగా – తమిళంలో ఎంజిఆర్, శివాజీ గణేశన్, ఎస్.ఎస్. రాజేంద్రన్, జెమినీ గణేశన్ లతో; తెలుగులో ఎన్.టి. రామారావు, నాగేశ్వరరావు లతో; కన్నడంలో రాజ్‌కుమార్ వంటి ప్రముఖ నటులందరితో కలిసి నటించారు. కథానాయికగా కొన్నేళ్ళు పరిశ్రమని ఏలిన తరువాత, వయసు రీత్యా, ఆమె సోదరి, తల్లి వంటి పాత్రలకు మళ్ళి నటన కొనసాగించారు.

1953లో, తన భర్త ఆదినారాయణరావుతో కలిసి, ఆమె అంజలి పిక్చర్స్‌ సంస్థని స్థాపించారు, ఈ బ్యానర్‍పై తమ మొదటి సినిమాగా తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘పూంగోతై/పరదేశి’ నిర్మించారు. నటుడు శివాజీ గణేశన్‌కి ఇది మొదటి సినిమా, అయితే ఈ సినిమా, ఆయనకి పేరు తెచ్చిన ‘పరాశక్తి’ సినిమా తరువాత విడుదలైంది. ఈ నిర్మాణ సంస్థ ‘స్లో మోషన్’తో సహా ఆ కాలంలోని సరికొత్త టెక్నిక్‌లను దక్షిణ భారత చిత్రపరిశ్రమకు పరిచయం చేసింది. అంజలి పిక్చర్స్ సంస్థ తమిళం, తెలుగులో 27 చిత్రాలను నిర్మించింది.

అంజలీ దేవి 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ‘లవకుశ’ సినిమాకి ఉత్తమ నటిగా రాష్ట్రపతి స్వర్ణపతకంతో సహా అనేక పురస్కారాలు, ప్రశంసలను పొందారు.

అంజలీ దేవి తన జీవితాన్ని మద్రాసులో ప్రశాంతంగా గడిపారు. 80 సంవత్సరాల వయస్సులో, ఆమె వితంతువు ఆచారాలపై తిరుగుబాటు చేశారు. భార్య వయస్సుతో సంబంధం లేకుండా భర్తకి 80 ఏళ్లు పూర్తయిన తర్వాత మళ్లీ వివాహం చేసుకునే హిందూ వేడుక అయిన శతాభిషేకం సంప్రదాయాన్ని ఆమె ఉల్లంఘించారు. తన భర్త మరణించిన తర్వాత, అంజలీ దేవి తన 80వ పుట్టినరోజును పూర్తి చేసుకున్న సందర్భంగా తన పక్కన భర్త ఫోటోను ఉంచుకుని శతాభిషేకం జరుపుకున్నారు.

ప్రస్తుత కాలంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా మరో మహిళను చూసే అవకాశం లేకపోగా, దశాబ్దాల క్రితమే నిబంధనలను అధిగమించి, ఆ పదవికి ఎంపికై రాణించిన అంజలీదేవిని గుర్తు చేసుకోవడం స్ఫూర్తిదాయకం. ఆమె అసాధారణ జీవిత కథ, గతంలో కలిసిపోయినా, ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఆమె ఒక తరానికి దేవత, అందాల కలల రాణి, మన్మథ వీరుడికి ఓ అనార్కలి. నటనలో అనుభవం సంపాదించి, నటిగా ఎదిగిన తర్వాత ఆమె సీత, సతీ సక్కుబాయి, సుమతి, లీలావతి వంటి పతివ్రతల పాత్రలు పోషించారు! తన వయస్సుకు తగిన పాత్రలను పోషించడంలో ఆమె ప్రవీణురాలు; తల్లి, సోదరి, వదిన వంటి కుటుంబ పాత్రల ద్వారా మానవ సంబంధాలను అద్భుతంగా ప్రచారం చేశారు!

తెలుగు కెరీర్:

పెద్దాపురం నుండి కాకినాడ మీదుగా మద్రాసు వరకు సాగిన ప్రయాణంలో అంజలీ దేవి  జీవితమంతా – నృత్యం, నటన, సంగీతంతో నిండిపోయింది. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌లో ఆదినారాయణరావు ఆధ్వర్యంలో రంగస్థల నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ రాత్రికి రాత్రే హీరోయిన్ పాత్రలు పొందలేకపోయారు. ‘గొల్ల భామ’, ‘కీలుగుర్రం’ వంటి చిత్రాల్లో వ్యాంప్‌గా నటించాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆమె తన నటనతో మంచి పేరు పొందారు. అదృష్టవశాత్తూ, ఆమెపై వ్యాంప్ ముద్ర స్థిరపడలేదు.

‘పల్లెటూరి పిల్ల’, ‘శ్రీ లక్ష్మమ్మ కథ’, ‘స్వప్న సుందరి’, ‘స్త్రీ సాహసం’ చిత్రాలు ఆమెకు విపరీతమైన ఆకర్షణ, మంచి పేరు తెచ్చిపెట్టాయి. అదనంగా, ఆమెకు తన గురువు, జీవిత భాగస్వామి ఆదినారాయణరావు నుండి గొప్ప మద్దతు లభించింది. అశ్విని పిక్చర్స్‌ను స్థాపించడానికి అక్కినేని నాగేశ్వరరావుతో చేతులు కలపడం ద్వారా ఆమె ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టారు; వారిద్దరు ఆ సంస్థలో ‘మాయలమారి’ అనే సినిమాలో నటించారు. సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన తర్వాత ‘అంజలి పిక్చర్స్’ స్థాపించి ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘పరదేశి’ అనే సినిమా తీశారు. ఇదే బ్యానర్‌లో వచ్చిన ‘అనార్కలి’, ‘సువర్ణ సుందరి’ సంచలనం సృష్టించి అంజలీదేవిని అగ్రశ్రేణి నటీమణులలో ఒకరిగా నిలబెట్టాయి.

ఇలవేల్పు, జయసింహ, పాండురంగ మహత్యం, జయభేరి, రేచుక్క, చరణదాసి, చెంచులక్ష్మి వంటి చిత్రాల్లో సీనియర్‌ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ సరసన నటించారామె. ఈ కాలంలో ఆమె తన స్థానం బలపడుతున్న తరుణంలో తన సమకాలీనుల నుండి గట్టి పోటీని ఎదుర్కున్నారు. భానుమతి, సావిత్రి, జమున, జానకి, కృష్ణకుమారి వంటి హీరోయిన్లకు ఈ సమయంలో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఈ విషయం గ్రహించారు అంజలీ దేవి. అక్కినేని సరసన కథానాయికగా నటించిన ‘రుణానుబంధం’ పరాజయం పాలవడంతో, ఆమె నడి వయసు స్త్రీ పాత్రలపై దృష్టి సారించారు. ఆమె పౌరాణిక పాత్రలను పునర్నిర్వచించారు, ఎక్కువగా భక్తి చిత్రాలలో నటించారు. అదే సమయంలో ఆమె సాంఘిక చిత్రాలలో, సానుభూతితో కూడిన కుటుంబ చిత్రాలలో నటించారు, ఆమె పోషించిన పాత్రలకు ప్రశాంతతను, నిండుదనాన్ని తీసుకువచ్చారు.

‘లవకుశ’ నుండి ‘మహాకవి క్షేత్రయ్య’ వరకు అంజలీ దేవి తన ప్రతిభకి తగిన పాత్రలు పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె భావోద్వేగాలను కళ్ళ ద్వారా, ముఖ కవళికల ద్వారా అద్భుతంగా వ్యక్తీకరించేవారు. సినిమా సాంఘికమైనా, పౌరాణికమైనా, జానపదమైనా ఆమె తనదైన ప్రతిభను ప్రదర్శించారు. ఆమె తొలినాటి చిత్రం ‘శ్రీ లక్ష్మమ్మ కథ’తో ఇది స్పష్టంగా కనిపించినప్పటికీ, ‘లవకుశ’ చిత్రంలో ఈ నాణ్యత ఆమెకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. పాత ‘లవకుశ’ సినిమాలో సీనియర్ నటి శ్రీ రంజని వలె అంజలీ దేవి కూడా సీతగా అద్భుతంగా నటించగలరని విమర్శకులు అంగీకరించారు. లంకలో కష్టాలు అనుభవించి తరువాత అయోధ్యలో ఆనందంగా జీవించే సీతగా; రాముడికి దూరమై అడవికి చేరుకునే సీతగా ఆమె నటనలో వ్యత్యాసాన్ని గొప్పగా కనబరిచారు. ‘సతీ సక్కుబాయి’ సినిమాలో ఆమె పట్టుదల గల భార్యగా, ప్రశాంతమైన వ్యక్తిగా నటించారు. ‘పాండురంగడు’ సినిమాలో భర్తని ఆకర్షించాలని ప్రయత్నించే భార్యగా రొమాంటిక్ పాత్రని పోషించారు.

‘రంగులరాట్నం’ నటిగా అంజలీదేవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. రామ్మోహన్, చంద్రమోహన్, విజయనిర్మలకు తల్లిగా దుఃఖాన్ని, సంఘర్షణను ఎదుర్కునే పాత్రకు ఆమె ప్రాణం పోశారు. ఆమె మొదట్లో మొదటి ఇన్నింగ్స్‌లో అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించి, ఆ తర్వాత తన రెండో ఇన్నింగ్స్‌లో ఆయనకి వదినగా (ఆదర్శ కుటుంబం, దసరా బుల్లోడు), తల్లిగా (సుపుత్రుడు), భార్యగా (భక్త తుకారాం) నటించడం ఆసక్తికరం! ఈ పైన పేర్కొన్న అన్ని పాత్రలలో, ఒక పాత్రపై మరొక పాత్ర యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉండదు. అదే సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్ సరసన ‘బడిపంతులు’లో ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భర్తతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె నటన ఆ తరం ప్రేక్షకులకు మరపురానిది!

అంజలీ దేవి స్టార్ హీరోలతో పాటు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు సినిమాల్లో కూడా నటించారు. ఆమె అనేక చిత్రాలలో ఎస్వీఆర్, గుమ్మడి వంటి దిగ్గజ సహాయ నటుల సరసన కూడా నటించారు. రొటీన్ చిత్రాలలో నటించినప్పటికీ, ‘తాతా మనవడు’, ‘లక్ష్మీ నివాసం’, అంజలీ దేవి నటనలోని అద్భుతమైన నైపుణ్యాన్ని గుర్తు చేసి, తెలుగు చిత్రసీమలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి.

నటన పరంగా అంజలీదేవి కెరీర్ సాఫీగా సాగినప్పటికీ నిర్మాతగా మాత్రం కొన్ని కష్టాలు చూడాల్సి వచ్చింది. నటిగా అవకాశాలు తగ్గినప్పుడు ఆమె తన ఇమేజ్‌కి సరిపోయే చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. ఏఎన్‌ఆర్‌తో కలిసి ఆమె నిర్మించిన ‘భక్త తుకారాం’ మంచి విజయం సాధించినప్పటికీ, ‘మహాకవి క్షేత్రయ్య’ పరాజయంతో ఆమె ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే శోభన్ బాబు, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన ‘చండీప్రియ’ చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఆమె మళ్ళీ పుంజుకున్నారు.

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సరసన అత్యధిక చిత్రాలలో నటించిన ప్రత్యేక రికార్డును అంజలీ దేవి సొంతం చేసుకున్నారు. ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు, నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్, ఇంకా ఎ.ఎన్.ఆర్ ఫౌండేషన్ నుండి అవార్డు లభించాయి.

ఎన్నో తరాల నటీనటులతో, గొప్ప నటిగా అంజలీ దేవి చేసిన అద్భుత ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here