అలనాటి అపురూపాలు- 185

0
8

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అలనాటి అందాల తార సులోచన

తొలి తరం ప్రఖ్యాత నటి సులోచన గురించి 1937 ఆగస్టులో వి. ఎస్. నిగమ్ ‘ది మూవీస్’ పత్రికకు ఈ క్రింది విధంగా రాశారు:

***

“భారతదేశంలో సినిమాలు రంగప్రవేశం చేసినప్పటి నుంచి, ఈ దేశంలోని స్త్రీలు నటనను వృత్తిగా చేసుకోవటం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు అతి కొద్ది మంది మాత్రమే కీర్తిప్రతిష్ఠలను సాధించారు. వారిలో సులోచన ముఖ్యులు.

మిస్ సులోచనగా పేరు పొందిన ఈ నటి అసలు పేరు రూబీ మేయర్స్. పుట్టుక రీత్యా ఆమె యూదు జాతీయురాలు. ఆమె 9 అక్టోబర్ 1907న పూనాలో జన్మించారు. కాన్వెంట్ స్కూల్‌లో చదువుకున్నారు. చదువు పూర్తయిన కొద్దికాలానికే ఆమె టెలిఫోన్-ఆపరేటర్‍గా ఉద్యోగంలో చేరారు. సుమారు మూడు సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత, ఆ ఉద్యోగాన్ని విడిచి, నటనను వృత్తిని చేపట్టారు.

ఆమె సినిమాల్లోకి రాకముందు, ఆ వృత్తిపై ఆమెకున్న ఆసక్తి గురించి ఒక విచిత్రమైన కథనం వినబడేది. 1920లో ఓసారి, ఆమె తన తల్లితో కలిసి బొంబాయిలోని ఒక రేస్‌కోర్సుకు వెళ్లగా, అక్కడ భవ్నానీ అనే వ్యక్తిని కలిశారు. ఆయన కోహినూర్ ఫిల్మ్ కంపెనీ డైరెక్టర్. ఆమె యవ్వనం, అందం పట్ల ఆకర్షితులయిన ఆయన, ఆమెను తన కంపెనీలో నటింపజేయాలని వెంటనే అనుకున్నారు. నటనను వృత్తిగా తీసుకోవాలనుకుంటున్నారా లేదా అని ఆమెను అడిగారు. ఓ అపరిచితుడి నుండి వచ్చిన ఈ ఆకస్మిక సూటి ప్రశ్న ఆమెలో ఆలోచనలు రేపింది, అయితే నటన మీద ఇష్టం ఉండడంతో ఆమె సానుకూలంగా సమాధానం ఇచ్చారు. అదే రోజు సాయంత్రం శ్రీ భవ్నానీ ఆమె ఇంటికి వెళ్లి ఆమె తల్లితో మాట్లాడారు. అప్పటికి సులోచన వయస్సు కేవలం పదమూడేళ్లు, ఇంకా పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే, ఒకరోజు భవ్నానీ గారు వారిద్దరినీ (సులోచన, ఆమె తల్లి) అప్పటి స్టార్ ఫిల్మ్ కంపెనీ, బాంబే యజమాని మిస్టర్ ఇరానీకి పరిచయం చేశాడు. తన కుమార్తె నెలకి 500/- రూపాయల జీతంతో సినిమాల్లో నటించేందుకు ఆమె తల్లి అంగీకరించింది. కానీ యజమాని ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దాంతో సహజంగానే సులోచన కొంత కాలం తెరకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

తన ప్రారంభ సంవత్సరాల్లో, సులోచన ఒక భారతీయ-వన-కన్య లాగా సొగసైన దుస్తులు ధరించడానికి ఇష్టపడేవారు. ఈ దుస్తులలో చాలాసార్లు ఫోటో తీయించుకున్నారు. ఒక రోజు, ఆమె తనకిష్టమైన మనోహరమైన ఆకుపచ్చ చీరను ధరించి, మిస్టర్ దేవరే స్టూడియోలో ఓ భంగిమలో ఫోటో తీయించుకోబోతుండగా, భవ్నానీ అక్కడికి వచ్చారు. దేవరే గారు ఆమెను భవ్నానీ గారికి పరిచయం చేశారు, ఈ అమ్మాయికి నటనలో ఆసక్తి ఉందని, నటనని వృత్తిగా చేసుకోవాలని కోరుకుంటోందని అన్నారు. ఈ మాటలు భవ్నానీ గారికి సంతోషం కలిగించాయి, తన సినిమాల కోసం అలాంటి అమ్మాయి కోసమే అన్వేషిస్తున్నారయన. కొద్ది రోజుల్లోనే ఆయన మళ్ళీ సులోచన తల్లిని కలిశారు. ఈసారి ఆమె తల్లి మళ్లీ అంగీకరించి తన కుమార్తెను సినిమాల్లో నటించడానికి అనుమతించారు. దర్శకుడు తన చిత్రం ‘వీర్-బాలా’లో ఆమె కుమార్తె 15 రోజులు పని చేయడానికి గాను ఆమె తల్లికి రూ. 150/- అడ్వాన్స్ ఇచ్చారు.

సులోచన మొదటిసారిగా స్టూడియోలోకి ప్రవేశించినప్పుడు, ఆమెకి చాలా సిగ్గేసింది, ఉద్విగ్నంగా అనిపించింది, కానీ భవ్నానీ గారు ఆమెను ప్రోత్సహించారు. మొదట, ఆమె కొన్ని అందమైన భంగిమలను చిత్రీకరించారు. అయితే ఆమెను నటించమని చెప్పినప్పుడు స్టూడియోలో ఉన్న వారి ముందు చాలా సిగ్గుపడటం వల్ల ఆమె దాదాపుగా చెమటతో తడిసిపోయారు. అయితే అక్కడున్న వారిని బయటకు పంపాకా, ఎలాగోలా తన వంతు షూటింగ్ పూర్తి చేసుకున్నారు. తరువాత, ఒక నిర్దిష్ట సన్నివేశంలో ఆమెను ఏడవమని అడిగారు, కానీ ఆమె అలా చేయడంలో విఫలమయ్యారు. అప్పుడు, దర్శకుడు ఆమె కళ్లపై నిమ్మకాయ రసాన్ని జల్లారట, ఫలితంగా ఆమె కళ్ళ నుంచి నీళ్ళు కారాయి. ఆ విధంగా ఆమె ‘వీర్-బాలా’లో నటించి, తిరిగి తమ ఉద్యోగానికి వెళ్ళిపోయారు. తర్వాత, భవ్నానీ గారు తన తదుపరి చిత్రం ‘ది సినిమా క్వీన్’లో ఆమెను మళ్లీ తీసుకున్నారు – ఈ చిత్రంలో ఆమె నటన చాలా ఆశాజనకంగా ఉంది. నిజానికి, భవ్నానీ ఈ యూదు యువతి అందంతో ఎంతగానో ఆకర్షితుడయ్యారు, నటనని వృత్తిగా చేపట్టేలా ఆమెను ప్రేరేపించారు. సులోచన కూడా తెర మీద కనబడాలని చాలా గట్టిగా భావింరు, చివరకు టెలిఫోన్ ఎక్సేంజ్‌ని విడిచిపెట్టి, సినిమాల్లోకి ప్రవేశించాలని స్థిరంగా నిర్ణయించుకున్నారు.

తరువాత, ఆమె ‘వాండరింగ్ ఫాంటమ్’, ‘సమ్రాట్ శైలాదిత్య’, ‘రాకావత్’, ‘టైపిస్ట్ గర్ల్’ అనే సినిమా లలో నటించారు. ఈ చిత్రాలన్నింటిలో ఆమె స్వేచ్ఛగా నటించారు, సమీప భవిష్యత్తులో ఆమె ఓ స్టార్‌గా మారుతారని ఆమె నటన సూచించింది. ‘వాండరింగ్ ఫాంటమ్’ సినిమాలో ఆమె సులోచన అనే యువతి పాత్రను పోషించారు. ఈ చిత్రం నుండి ఆమె తన తెర పేరును సులోచనగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఆమె ఓరియంటల్ పిక్చర్ కార్పొరేషన్ నిర్మించిన ఠాగూర్ గారి ‘శాక్రిఫైజ్’ అనే సినిమాలో నటించారు. దీని తరువాత, ఆమె ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ ఆఫ్ బాంబేలో చేరారు. ఇంపీరియల్‌ సంస్థతో ఆమె చివరి చిత్రం “The Wrath”. ఆ తర్వాత ఆమె కొల్హాపూర్‌కి వెళ్లి మహారాష్ట్ర ఫిలిం కంపెనీ నిర్మించిన ‘రూపమతి’ లేదా ‘ఇమ్మోర్టల్-లవ్‌’ అనే సినిమాలో నటించారు. తరువాత, ఆమె రంజిత్ ఫిల్మ్ కంపెనీలో చేరి ‘క్వీన్ ఆఫ్ లవ్’లో నటించారు. దీని తరువాత, కొన్నాళ్ళు నటనకు దూరంగా ఉన్నారు. అయితే టాకీ సినిమాలు మొదలవడంతో మళ్ళీ నటన కొనసాగించదలచి, ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో చేరారు. ‘మాధురి’ అనేది ఆమె మొదటి టాకీ సినిమా.

మూకీలలో ఆమె ప్రసిద్ధ చిత్రాలు ‘వైల్డ్ క్యాట్ ఆఫ్ బాంబే’, ‘హీర్ రంఝా’, ‘డ్యాన్సింగ్ గర్ల్’, ‘పంజాబ్ మెయిల్’, ‘గర్ల్ మ్యాడ్’, ‘స్వోర్డ్ టు స్వోర్డ్’. టాకీలలో, ఆమె ప్రసిద్ధ చిత్రాలు ‘మాధురి’, ‘అనార్కలి’, ‘టెంపుల్- బెల్స్’, ‘సౌభాగ్య సుందరి’, ‘ఇందిర’, ‘ది జంగిల్ క్వీన్’.

ఆమె – రాజా శాండో, మిస్టర్. వకిల్, డి. బిల్లిమోరియా, జల్‌మర్చంట్‌ల సరసన నాయికగా నటించారు. భవ్నానీ, మిశ్రా, చౌదరి, నావల్ గాంధీ, పెండార్కర్ లు ఆమె దర్శకులు.

ప్రస్తుతం సులోచన వయసు 30 సంవత్సరాలు, సుమారు 5 అడుగుల 2 అంగుళాల పొడవుతో ఉంటారు. ఆమె శరీరం పరిపూర్ణమైన కొలత ప్రకారం సన్నగా, మనోహరంగా ఉంది. ఆమె నిండు పున్నమి చంద్రుడిలా చాలా తెల్లగా అందంగా ఉంటారు. ఆమె పెదవులు గులాబీ రంగులో ఉంటాయి. ఆమె జుట్టు మృదువుగా, నల్లగా ఉంది. ఆమె కళ్ళు మనోహరంగా, అయస్కాంతం లాగా ఉంటాయి. ఆమె నడక సొగసుగా, హుందాగా ఉంటుంది. ఆమె చలాకీగా ఉంటారు, తెలివితేటలని కనబరుస్తారు. కోకిల లాగా శ్రావ్యమైన స్వరాన్ని కలిగి ఉన్నారు. ఆమె పాడటం విన్నా లేదా ఫోన్‌లో ఆమె మాటలు విన్నా ఎవరైనా ఆనందిస్తారు. ఆమెది నిజంగా అందమైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. సంక్షిప్తంగా చెప్పాలంటే, ప్రకృతి ఆమెకు పరిపూర్ణ స్త్రీ సౌందర్యాన్ని ఇచ్చింది; (ఆమె వయసును పట్టించుకోవద్దు, కానీ ఆమె అందాన్ని చూడండి) భారతీయ తెరపై సులోచనలా ఇంత అందంగా ఉండే మరో నటి  లేదనడం అతిశయోక్తి కాదు.

ఇప్పుడు ఆమె డి. బిల్లిమోరియా దర్శకత్వంలో ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ నిర్మాణంలో తన మొదటి టెక్నికలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాకి ‘కశ్మీర్‌-కీ-కలి’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటి. ఆమెకు నెలకు రూ.4500/- జీతం లభిస్తోంది – మరే ఇతర భారతీయ నటీమణికి ఇంత పారితోషికం లభించడంలేదు.

సులోచన నిస్సందేహంగా నేటి అత్యుత్తమ భారతీయ నటీమణులలో ఒకరు, బహుశా బొంబాయి నగరం అందించిన ఉన్నత స్థాయి విలక్షణ నటి కావచ్చు. ఊహించదగిన ప్రతి మానవీయ అనుభూతిని, భావావేశాన్ని అత్యంత వాస్తవిక రీతిలో ప్రదర్శించడంలో ఆమె ప్రావీణ్యం సాధించారు. భక్తి, కోపం, దుఃఖం, వేదన, బాధ మొదలైన వివిధ మానవ భావాలు, ఉద్వేగాలను సరిగ్గా ప్రదర్శించగల తెలివితేటలు ఆమెకు ఉన్నాయి. ముఖ కవళికలను త్వరగా మార్చడం ద్వారా ఈ భావాలను నిజమైన రీతిలో వ్యక్తీకరించగల సామర్థ్యం ఉందామెకు. ఒక నిజమైన నటి, సాధ్యమయ్యే అన్ని మానవ భావాలు, భావోద్వేగాలు – అవి విషాదకరమైనవి అయినా లేదా హాస్యభరితమైనవి అయినా; ఊహించదగిన నిజమైన పద్ధతిలో ఉత్తమంగా అనుభూతి చెందేలా వ్యక్తీకరించగలగాలి; సులోచనలో ఈ లక్షణాలన్ని ఉన్నాయి. ఆమె ఏ పని చేసినా అందులో చిన్నపాటి ఇబ్బంది కూడా ఉండేది కాదు; ఎందుకంటే ఆమె నటన, భావవ్యక్తీకరణలు నిజమైనవి, సహజమైనవి. ప్రేమ వ్యక్తీకరణలను అత్యంత అందమైన రీతిలో వ్యక్తీకరించే నైపుణ్యాన్ని ఆమె ప్రత్యేకంగా సంపాదించుకున్నారు. భారతదేశంలోనే అత్యుత్తమంగా, సమర్థవంతంగా ప్రేమ భావాలను వ్యక్తీకరించగలిగే వారిలో నిస్సందేహంగా ఆమె అగ్రస్థానంలో ఉంటారు. బహుశా ఆమెను ‘లేడీ ఆఫ్ లవ్’ అని పిలవడం అతిశయోక్తి కాదు. వాస్తవానికి, ఆమె విభిన్నమైన కపటత్వం, ప్రేమ, రసికత, పిల్లలలాంటి అమాయకపు హావభావాలను ప్రదర్శించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు, ఖచ్చితంగా భారతదేశంలోని మరే ఇతర నటి ఆమెతో పోటీకి రాలేరు. అంకితభావం గల నర్సుగా, టైపిస్ట్-గర్ల్‌గా, తెల్లటి ముస్లిన్ ‘చీర’ ధరించిన ధనవంతుని కుమార్తెగా, పురుష వేషధారణలో డిటెక్టివ్‌గా (‘మాధురి’లో) – ఇలా ఈ అన్ని రూపాల్లో చాలా అందంగా, హుందాగా కనిపిస్తారు.

ఆమెది అందమైన, మనోహరమైన వదనం, సినిమాలకి బాగా నప్పే ముఖం. ఆమెవి చాలా సహజమైన, తెలివైన కదలికలు. వివిధ భావాలను, భావోద్వేగాలను సరిగ్గా అనుభూతి చెంది వాటిని తగినంతగా వ్యక్తీకరించడానికి ఆమెకు గొప్ప సామర్థ్యం ఉంది. అద్భుతంగా నటించగల సామర్థ్యం, ఇంకా పాడే శ్రావ్యమైన స్వరం – ఇవన్నీ ఆమెకు విజయాలు కట్టబెట్టి, భారతదేశంలోని అత్యుత్తమ నటీమణులలో ఆమె ఒకరని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

అయితే కానీ నేను ఆమెను ప్రశంసించినప్పటికీ, ఆమె లోపాలను ప్రస్తావించకుండా ఉండలేను. ఆమె నటనలోని అతి ముఖ్యమైన లోపం ఏమిటంటే, ఆమె నటనా సరళి అంతటా ఒకే విధంగా ఉంటుంది.  వైవిధ్యం లేదు. ఇంకా చెప్పాలంటే ఆమె నటన, భావోద్వేగాల ప్రదర్శనలో వైవిధ్యం లేదు. ఇది ముఖ్యంగా విషాద పాత్రలలో బాగా తెలుస్తుంది, వీటిలో ఆమె భావవ్యక్తీకరణలు అక్కడక్కడ స్వల్ప మార్పులతో దాదాపు ఒకే శైలిలో ఉంటాయి. కొన్నిసార్లు అవి స్వీయ-చైతన్యాన్ని, శ్రమను మోసం చేస్తాయి. భారతీయ స్త్రీత్వం యొక్క ఆదర్శాలకు ఆమె ప్రాతినిధ్యం వహించాల్సిన ఒక సాధారణ భారతీయ యువతి లేదా మహిళగా కనిపించినప్పుడు, భారతీయ స్త్రీత్వం యొక్క నిజమైన భారతీయత, ఇంకా సరైన ప్రాతినిధ్యం లేదా వ్యక్తిత్వం ఆమెలో గోచరించదు. చివరగా, టాకీ స్టార్ అయినప్పటికీ, ఆమె టాకీ సినిమాల ఆదర్శానికి దూరంగా ఉన్నారు; ఎందుకంటే ఆమె గొప్పగా పాడలేరు, పైగా యాసను మెరుగుపరచలేరు. అందువల్ల ఆమె ఇంకా తన గాన నైపుణ్యం, ఉచ్చారణ విధానం, సాధారణ భారతీయ స్త్రీని ప్రదర్శించడం వంటివి మెరుగుపరుచుకోవాలి. ఆమె స్వర ఉచ్చారణ నిజంగా ఆమె ముఖ కవళికలకు అనుగుణంగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా, ఆమె తన నటన, ఇంకా భావ వ్యక్తీకరణలలో కొంచెం వ్యత్యాసాన్ని, వైవిధ్యాన్ని అంగీకరించాలి.

చిత్రసీమలోకి ప్రవేశించినప్పటి నుండి, ఆమె – సౌందర్యరాశిగా, ప్రేమమయిగా గుర్తింపు పొందారు. నిజంగా ఆమె బొంబాయి స్టూడియోలో అత్యంత అందమైన నటి.”

***

సులోచన ఆ కాలంలో అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరైన డి. బిల్లిమోరియాతో సంబంధం కొనసాగించారు. ఆయనతో కొంతకాలం పాటు ప్రత్యేకంగా పని చేశారామె. అత్యున్నత స్థానం పొంది, తన ఆధిపత్యం కొనసాగించారామె. తన కృషి, పట్టుదల మూలంగా అప్పటికి చాలా మంది మహిళలకు అందుబాటులో లేని విలాసవంతమైన జీవితాన్ని గడిపారు.

అయితే, ఆమె వ్యక్తిగత సంబంధాలు దెబ్బతిన్నాయి, ఆమె కెరీర్ నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. ఆమె ఇంపీరియల్ నుండి బయటకు వచ్చేశారు. అయితే వెంటనే ఆమెకు చాలా సినిమా ఆఫర్లు రాలేదు. అప్పుడే పరిశ్రమ ప్రస్తుత పితృస్వామ్య దృక్పథం సంకేతాలను ప్రదర్శించటం ప్రారంభించింది. పాత మహిళా నటీమణులు ఇకపై సరిపోరు; కొత్త, మరింత ‘ఆకర్షణీయమైన’ మహిళలు అవసరం. అంతే కాకుండా, 1947లో దిలీప్ కుమార్‌తో నటించిన ‘జుగ్ను’ చిత్రం నిషేధించబడింది. ఎందుకంటే ఇది ఒక వృద్ధ ప్రొఫెసర్, మనోహరమైన సులోచన మధ్య ప్రేమను చూపించింది – దీన్ని సమాజపు నైతిక పునాదులపై దాడిగా పరిగణించారు.

వారసత్వం, మరణం:

సులోచన పేరుతో రూబీ మేయర్స్ వినోద పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1930వ దశకంలో, ఆమె తన సొంత స్టూడియో ‘రూబీ పిక్స్‌’ ని స్థాపించారు. చలనచిత్ర రంగానికి చేసిన విశిష్టమైన సేవలకు గాను, ఆమె 1973లో, భారతీయ చలనచిత్ర రంగంలో ఒక వ్యక్తికి లభించే అత్యున్నతమైన పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుదుకున్నారు. ‘షాలోమ్ బాలీవుడ్’ (2017) అనే డాక్యుమెంటరీని ఆమెపై చిత్రీకరించారు, ఇది యూదు భారతీయ సమాజం వినోద పరిశ్రమకు అందించిన అపారమైన సాంస్కృతిక సహకారాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది.

ఆమె 10 అక్టోబర్ 1983న ముంబైలో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here